గామధ్య మాచెల్లెకు ఆపరేషనయ్యిందంటే చూసొద్దామని నేను మా భార్య, మా పిల్లలు కలిసి వరంగల్లుకు పోయినం. మాచెల్లె అత్తగారూరు ‘‘రేకంపల్లి’’ నర్సంపేట మండలానికి పడమర దిక్కున ఓ ఏడెనిమిది కిలోమీటర్లుంటది. ఉత్తశేతుల్తోటి పోతె మంచిగుండదని పోతాంటె పోతాంటె హన్మకొండల ఓ రొండుమూడు రకాల పండ్లు తీసుకున్నం. ‘‘రేకంపల్లి’’కి పోయేసరికి పొద్దుగూకింది. మా చెల్లోల్ల ఇంటిముందుకు పోంగనే ఇంట్ల నుంచి మా అవ్వ (అమ్మ) బయిటికచ్చింది. మా అవ్వ మా చెల్లెకు ఆపరేషనయినకాన్నుంచి మంచి శెడు అర్సుకునెదానికి మా చెల్లె దగ్గెర్నె వుంటాంది. మమ్ములజూసి కాళ్ళు శేతులు కడుక్కోండ్లన్నది. మేం ‘‘గోలెం’’ కాడికిబోయి కాళ్ళు రెక్కలు కడుక్కున్నం. ఇంట్లకుబోయి మా చెల్లె పండుకున్న మంచంపక్క కుర్సీలల్ల కూసున్నం. మా చెల్లెతోని మంచిశెడు ఇసారిచ్చినం. తీసుకపోయిన పండో, ఫలమో ఇచ్చినం. ఇంతల్లకే మా అవ్వ నాలుగయిదు ‘‘గిద్దెల’’ బియ్యం ఉడుకబెట్టి ఇంత పప్పుశారు జేసింది. నపరింత సల్లబడ్డం. పప్పుశారు మస్తు రుచున్నది, అది కిరాణందుకాండ్ల కొన్న కందిపప్పుకాదు మా చెల్లోల్ల చేన్ల పండింది. పట్టిచ్చి పొట్టుతోనే వండింది. అందుకే అంత రుశున్నది.
రాత్రి పది గంట్లకు పండుకునే ముందు ఎగిలిబారంగనే (ఎర్లిమార్నింగ్) లేశి మేం హైదరాబాదుకు పోతమని మా అవ్వతోని శెప్పినా. హైదరాబాదుకు వద్దు ‘‘నాగూర్లపల్లె’’కు పోదాం అందరం కలిసి ఊళ్ళె ‘‘బద్దిపోచమ్మ’’ను చేసుకుంటానం’’ అని మా అవ్వన్నది. ‘‘నాగూర్లపల్లె’’ మా ఊరు ఇది ‘‘నర్సంపేట’’ మండలానికి ఉత్తరం దిక్కున నాలుగు కిలోమీటర్ల దూరం వుంటది. ‘‘చెల్లెకు ఆపరేషనయి మీ పరేషాన్ల మీరే వుంటిరి. ఇప్పుడు ఈ ‘‘బద్దిపోచమ్మ’’ను ఎందుకు జేత్తాండ్లే’’ అన్న. అప్పుడు మా అవ్వ ‘‘మన అనసూర్యక్కకు నాలుగయిదు నెలల నుంచెల్లి పానం మంచిగుంటలేదు తిరుగని దవాఖాన లేదు, వాడని మందు లేదు. ఎంతకు నయం అయితలేదు, మనిషి మస్తు గుంజింది, రాత్రిపూట నిదురబోతలేదు, ఆయిమనంగ నాలుగు బుక్కల బువ్వ తింటలేదు, అంత భయం భయం అయితాందట, గుండె దడచ్చినట్టయితాందట, మనిషి మనకాలి వుంటలేదు, ఊకె ఏడ్తాంది. అనుమానమచ్చి దేవున్నడిగిత్తె ‘‘బద్ది పోచమ్మ’’ కొంటెతనమన్నరు. అందుకే అందరంగలిసి ఓ యాటను తెచ్చి ‘బద్దిపోచమ్మ’’కు శేత్తానం అని విషయం మొత్తం ఇగురంగ జెప్పింది.
నాకు ఎంటనే మా ‘‘అనసూర్యక్క’’ యాదికచ్చి, నా కండ్ల్ల మెరిసింది. ఆమె మా మేనత్త మా నాయిన చెల్లె. మా తాత పేరు కట్టయ్య. ఆయనకు మొత్తం అయిదుగురు సంతానం. మొదటాయినే మా నాయిన, రొండొ ఆయినే ఇంకో చిన్నాయిన. మూడో ఆమే మా ‘‘అనసూర్యక్క’’, నాలుగో ఆయినె, ఐదో ఆయినే ఇంకో ఇద్దరు చిన్నాయినున్నరు. మా మేనత్త అసలు పేరు ‘‘అనసూయ’’ కాని అందరం అనసూర్యక్క అని పిలుస్తం. మా నాయిన, మా తాత, మా నాయినమ్మ, మా నాయిన ఎనుకాయినె మా బాబాయి ఈ నలుగురే ఆమెను ‘‘అనసూర్య’’ అని పేరుబెట్టి పిలుస్తరు. మా అక్కంటె అందరికి అంత గౌరవం.
మేం పొద్దున్నే చీకటితోటి లేశి మా ఊరికి పోయినం. మా ఇంటికి తూర్పు దిక్కున మా తాత కట్టయ్య ఇల్లుంటది. రొండురూముల బెంగుళూరు పెంకుటిల్లు. దానికి ఆనిచ్చి ఇంటి ముందుకు చిన్నరేకు షెడ్డు ఏషిండ్లు. ఆ రేకు ‘‘సాయబాను’’ కింద కూసునెదానికి పొడుగుగా ఓ అరుగుంటది. నేనెప్పుడు మా ఊరికిపోయిన రోజుల ఎక్కువసేపు ఆ అరుగుమీదనే కూసుంటా. మా కట్టయ్య తాత సచ్చిపోయి మూడు సంవత్సరాలయితాంది.ఆ తరువాత సంవత్సరంనర్థానికి మా నాయినమ్మ కూడ సచ్చిపోయింది. ఇప్పుడు ఆ ఇంట్ల మా ‘‘అనసూర్యక్క’’ ఒక్కతే వుంటాంది. ఎప్పటి లెక్కనే పోయి మా కట్టయ్య తాతోల్ల రేకు షెడ్డు కింద అరుగుమీద కూసున్న. నన్ను సూశి మా అనసూర్యక్క వచ్చి నా పక్కపొంటి కూసున్నది. ఆమెను సూడంగనే నాకు చానా బాధయ్యింది. మనిషి మొత్తం బక్కగయ్యింది. రొండుమూడు సంవత్సరాలకిప్పటికి సగమయ్యింది. ‘‘ఎప్పుడచ్చిండ్లురా బిడ్డ అంత మంచేనా’’ అన్నది. ‘‘ఆ… అంత మంచే అక్కా రాత్రొచ్చినం’’ అన్న. మంచిశెడు మాట్లాడుతానం. మాట్లాడుతాంటె, మాట్లాడుతాంటెనె ఆమె కండ్ల్ల నీళ్ళూరుతానయ్, నిమ్మలంగ నిమ్మలంగ ఆమె కండ్ల్లకెళ్ళి నీళ్ళు వడుత్తానయ్. అరె ఎందుకు ఏడుత్తానవ్ ఊకో అక్క… అన్న. ఆమె దు:ఖం ఆపుకోలేక బాగ ఏడుస్తాంది. కండ్ల అద్దాు తీసి పక్కన బెట్టింది, ఊకో అక్క ఊకో అని కండ్లనీళ్ళు తుడిసినా ఆమెకు దు:ఖం అసలే ఆగుతలేదు. ఆమె కండ్లపొంటి నీళ్ళు కారుతనే ఉన్నయ్. కారెనీళ్ళను కొంగుతోని తుడుసుకుంట ఏడుస్తాంది. ఆమె అట్ల ఏడుస్తాంటె నాక్కూడ మస్తు ఏడుపచ్చింది, ఆమెను ఎట్ల ఊకుంచాల్నో అర్దంగాక నాకండ్లకెళ్ళి గూడ వట్ట వట్ట నీళ్ళు వడుత్తాంటె నాకు అప్సోస్(ఆశ్చర్యం) అనిపిచ్చింది. ఎందుకంటె గుండెను కాలిసె ‘‘ఎత’’ నా లోపల వున్న కూడ నా కండ్లకు నీళ్ళురావ్. అసొంటి నేను గూడ ఏడిసిన. అట్ల శానాసేపు ఆమె ‘‘సొద’’ సల్లారెదాక ఏడిసింది. ‘‘కొంచెం ఏడుసుడు ఆపినంక ‘‘ఎందుకు ఏడుస్తానవ్ అక్క నీకేం తక్కువయ్యింది మేమంత లేమా’’ అన్న ‘‘కంటిమీద రెప్పవాల్తలేదురా బిడ్డ. తిండసలే సయించుతలేదు. పాణం మన కాలి వుంటలేదు.. ఎటోపోతాంది, కయాల్ తప్పుతాంది, గుండెదడత్తాంది, అంత భయంభయమయితాంది, ఒంటరి బతుకయిపోయిందిర. సచ్చిపోవాలెననిపిస్తాంది’’ అనుకుంట కొంగుతోని కండ్లనీళ్ళు తుడుసుకున్నది. అంతట్లకే మా నాయిన ఒక పాత ‘‘ఐరోండ్లకుండ’’ల సున్నం కలుపుకొని దాంట్లె ‘‘బ్రెష్’’ ఏసుకొని వచ్చిండు. అరుగు పక్కన ఎడమరోకు అంతకుముందు రోజే ‘‘బద్ది పోచమ్మ’’ కు ఒక చిన్న గుడి కట్టిండు, మా నాయిన సుతారి పనిశేత్తడు అందుకే ఆయినే కట్టిండు, ఆ గుడికాడ కూసోని గుడికి సున్నం ఏసుకుంట ‘‘ఊకోవే అనసూర్య. ఇగ బద్ది పోచమ్మకు గూడ శెయ్యబడితిమి కొంటెతనంబోయి అంత మంచే జరుగుతది తియ్ ఊకె ఏడువకు బాధపడకు’’ అన్నడు.
పొద్దుగూకుతాంది చిన్నగ మెల్లగ చీకటయితాంది. టైము ఐదారున్నరయితాన్నట్టున్నది ఇగ గొర్రెను కోద్దామని అందరు గుమిగూడిండ్లు. ఇంటిముందు యాపశెట్టుకు గొర్రెను కట్టేసి ఇంతంత పచ్చగడ్డేశిండ్లు. అది పొద్దటిసంది పచ్చగడ్డి నములుతనే వున్నది. మా చిచ్చ ‘‘నర్సింహస్వామి’’ యాటను కోశెదానికి కత్తి పట్టుకొని వచ్చిండు. వీళ్లు మా పాలోళ్ళు. నాకు ఆయినె చిన్నాయినయితడు. ‘‘గొర్రెను రొండు కాళ్ళసందు పెట్టుకొని గొర్రె కడుపుకింద శేతులేసి లేపి బరువు సూశిండు. ఓ పది కిలో కూర ఎల్తది కావచ్చు, బోటి, కాళ్ళు ,తలకాయ కలిపి ఓ మూడు మూడున్నర కిలోలు ఎల్తది, మొత్తం పదమూడు చిల్లరే ఎల్తది కూర అన్నడు. ఆ గొర్రె రొండు మూడు ఈతలు ఈనిందట. ‘‘బద్దిపోచమ్మ’’కు మగ గొర్రెపోతును కొయ్యద్దట. ఆడ గొర్రెను అది ఓ రొండు మూడు ఈతు ఈనిన పిల్ల తల్లిని కొయ్యాల్నట. ఇవన్ని ఇంటాంటె గమ్మతనిపిచ్చింది. ఈ రూల్స్, పద్దతు ఎవ్వు పెట్టిండ్లు, ‘‘బద్దిపోచమ్మ’’ వచ్చి వీళ్ళకు శెప్పిందా అనిపిచ్చింది. గొర్రెను బద్దిపోచమ్మ గుడికాడికి తీసుకచ్చిండ్లు, గొర్రెకు బవంతంగా కొంచెం కల్లు తాపిచ్చిండ్లు. మా అనసూర్యక్కచ్చి గొర్రె ‘‘నొసు’’(నుదురు) మీద కుంకుమ బొట్టు పెట్టి పసుపు రాసింది. గొర్రె కాళ్ళు మొక్కింది. పక్కనున్న మా చిన్నమ్మ ‘‘ఇగ అనుమానమద్దు తల్లీ మంచి జరుగుతె మళ్ళా వచ్చే ఏడు శేత్తం ‘‘జడత’’ ఇయ్యి అన్నది. ఒగలెనుక ఒగలు పోయి కుంకుమబొట్టు, పసుపుబొట్టు పెట్టి గొర్రె కాళ్ళు మొక్కిండ్లు. మా నర్సింహస్వామి చిచ్చ దాని ఈపు(వీపు) మీద నీళ్ళు సల్లి దువ్విండు యాట ‘‘జెడుత’’ ఇయ్యంగనే కోషిండ్లు, ఒక ఎనుకకాలు సప్ప(లెగ్) తీసి దాషిండ్లు. మిగతది వండిండ్లు అందరు తిని పండుకున్నరు.
నేను ‘‘ఎగిలిబారంగనే’’ (ఎర్లిమార్నింగ్) లేశి హైదరాబాదుకు రావాల్నని తయారయితాన. సాయత్రం కోశి దాశిన ఎనుకకాలు సప్ప వండెదానికి మావోళ్ళు మాల్ మసాల తయారుజేత్తాండ్లు. ‘‘మీరు కూడ ఇంత సల్లబడిపోండ్లి. హైదరాబాదుకు పొయ్యెటాలకు ఏ టైం అయితదో ఏందో’’ అన్నది మా అనసూరక్క. నేను సరేనన్నా. అన్నం తిని బయుదేరే ముందు మా భార్య నాదగ్గరికచ్చి ‘‘అనసూర్యక్కను హైదరాబాదుకు తీసుకపోదం అక్కడ ‘‘కిమ్స్’’ హస్పటల్ల సూపిద్దం, ఆమె పరిస్థితి మంచిగలేనట్టనిపిస్తాంది రాత్రి మూడు నాలుగు గంట్లకు మీ చెల్లె దగ్గరకచ్చి ఏడిసిందట, నేను సచ్చిపోతనంటాందట. అసలే నిదురత్తలేదట ‘‘సైక్రియాటిస్ట్’’ డాక్టర్‌కు సూపిద్దం’’ అన్నది. సరేనన్నా మరి వత్తదో, రాదో అడుగన్న. అడుగుతె వత్తనన్నది, హైదరాబాదుకు మాతోని తీసుకచ్చినం. తెల్లారి ‘‘కిమ్స్’’కు సైక్రియాటిస్ట్ డా॥ నాగలక్ష్మి దగ్గరికి తీసుకపోయినం. డాక్టరమ్మ మా అనసూర్యక్క తోటి శానసేపు మాట్లాడిరది. డాక్టరమ్మతోని తన బాధ శెప్పుకుంట మా అక్క ఏడిసింది. డాక్టరమ్మ పరిక్షచేసి ‘‘ఈమె చాలా డీప్ డిప్రెషన్‌లో వున్నది. 20 రోజులకి మెడిసన్ కోర్స్ రాస్తున్నా, 20 రోజుల తరువాత మళ్ళీరండి ఆమెను జాగ్రత్తగా చూసుకొండి. మీ దగ్గరే ఓ నెల రోజులు వుంచుకొని జాగ్రత్తగ సూసుకోండి’’ అన్నది సరేనన్నాం, మా దగ్గర మూడురోజులున్నది, నాలుగో రోజు అమ్మటాల్లకు (ఉదయం ఎనిమిది, పది గంట మధ్య) ఇగ నేను పోతర బిడ్డ అన్నది ‘‘వుండరాదక్క ఊళ్ళెకు బోయి ఏం జేత్తవ్’’ అన్న. ‘‘లేదుర బిడ్డా పోత’’ అన్నది మా కొడుకును ఆమెను ఊళ్ళె తోలిరమ్మని ఆమె ఎంట పంపిచ్చిన. నేను నా రాసుకునే, చదువుకునె రూముకు పోయి తలుపు మూసుకొని కూసున్న ఏందోత్తలేదు. గుడిపాటి వెంకటాచంగారి గీతాంజలి (ఠాగూర్ అనువాదం) మళ్ళా ముందటేసుకున్న నా పుస్తకాల ర్యాక్‌ల శాన్నే పుస్తకాలుంటయ్ సదివినయి, సదువనియి. కాని నా చెయ్యి చలం పుస్తకాలకాడికే పోతది. ‘‘చలం నన్ను మింగిండు’’ చలం పుస్తకాలు సదువుతాంటె బతుకు రుచనిపిస్తది, పెద్ద పెద్ద బాధలు చిన్నగనిపిస్తయ్. మనుషులను ప్రేమించాలనిపిస్తది, కష్టాలను కావలిచ్చుకోబుద్దయితది, ‘‘లేకిడి’’ తనం పోయి గుండె బారిదయితది. ఎట్ల బతుకాల్నో, ఎందుకు బతుకాల్నో ఎరుకయితది. బతికే రీతిని చలం గుండెకు ‘‘ఇంజెక్ట్ చేస్తడు’’. గీతాంజలి సదువుకుంటపోతాన ‘‘ప్రేమ ఏకం. ఏకమైన ప్రేమ ఐక్యం కావాలనే కాంక్షలో రెండు రూపాల విభాగమై తనని తాను వ్యక్తం చేసుకుంటోంది. ఒకటే విద్యుచ్చక్తి ఆకాశాన ఈ మూల ఒక మెరుపుగా, ఆ మూల ఒక మెరుపుగా చలించి పెనవేసుకుని ఐక్యమై తేజస్సుని మించిన అంధకారంలో లీనమౌతుంది. విద్యుచ్చక్తి అంతా ఒకటే కాని పాజిటివ్ మరియు నెగిటివ్ అని విభాగమై ఇన్ని గృహాల్ని, ఉత్సవాల్ని వెలిగించి ఐక్యమై ఇన్ని చిత్రాలుగా దీపాలుగా నవ్వుతోంది.’’ ఇట్లా… దనాదన సదువుకుంటపోతానే వున్నా. పుట సంఖ్య.65
36 వ గీతం సదువుతాన
‘‘ఇదే నీకు నా ప్రార్థన, ప్రభో!
నరుకు నరుకు
నా హృదయంలోని దరిద్రాన్ని సమూలంగా నరకు.
నా సుఖదు:ఖాల్ని తేలికగా తీసుకునే బలాన్ని నాకియ్యి.
సేవలో నా ప్రేమను సఫలం చేసుకునే శక్తిని ప్రసాదించు.
దీనుల్ని నిరాకరించే దుర్గతి నించి నన్ను తప్పించు.
మదాంధుల ముందు మోకరించనీని అభిమానాన్ని నాలో పెంపొందించు.
నిత్య జీవనంలోని అల్ప విషయాల నించి
నా మనసుని తప్పించే నేర్పునియ్యి.
ప్రేమలో నీ సంకల్పానికి
నా శక్తిని అర్పించుకునే బలాన్ని కటాక్షించు.’’
ఈ గీతం సదువుడు అయిపోంగనే మా అనసూర్యక్క గుర్తుకచ్చింది. నేను దేవున్ని నమ్మాల్నని మస్తనుకుంట కాని నమ్మ, కాని… ‘‘ఈ భూలోకాన్ని, మనిషిని, మాకును, పుట్టను, పురుగును, నిప్పును, నీటిని, గాలిని, ధూళిని నడిపించే శక్తి ఏదో వున్నదట. ఆత్మ అవినాశి, బహిర్గత సౌందర్యం కన్న ఆత్మ సౌందర్యం గొప్పది. అని నేను నా చిన్నప్పుడు ‘‘సొక్రటీస్’’ పుస్తకంల చదివిన ఆ మాటలు నా గుండెలకు గుసాయించి, నా దమాక్‌ల జమాయించి కూసున్నయ్. ఆ‘‘శక్తి’’ని లేదా ఈ లోకులు పూజించే ‘‘దేవున్ని’’ కన్నీళ్ళతోని నేను రవీంద్రనాథ్ ఠాగూర్ లెక్క ప్రార్దించిన. మా అనసూర్యక్క ఇప్పుడు పుట్టెడు దు:ఖంలున్నది. ‘‘సుఖదు:ఖాల్ని తేలికగా తీసుకునే బలాన్ని ఆమెకియ్యి. నీ సేవలో ఆమె ప్రేమను సఫలం చేసుకునే శక్తిని ఆమెకు ప్రసాదించు. ఈ మూర్ఖపు లోకం ముందు మోకరించనీని అభిమానాన్ని ఆమెలో పెంపొందించు. నిత్యజీవనంలోని అల్పవిషయాల నించి తప్పించుకునే నేర్పుని ఆమె మనసుకియ్యి, ప్రేమలో నీ సంకల్పానికి ఆమె శక్తిని అర్పించుకునే బలాన్ని మా అనసూర్యక్కకు కటాక్షించు’’ అని దిల్‌సే ఏడిసిన.
ఆమె దు:ఖం చెప్పుకునేది కాదు. చెప్పుకుంటె తీరేదికాదు. ఆమెకు అన్నీ వున్నయ్… ఇల్లు, జాగ, ఎద్దు, ఎవుసం, పైసలు కాని… ఆవ్వెవీ ఆమెకు సంబురాన్నియ్యయి, సంతోషపెట్టయి. ఆమెకు అందరున్నరు. బలుగం, బంధువు, అన్నలు, తమ్ముళ్ళు, మనుమలు, మనువరాండ్లు కాని… ఎవలు ఆమె వాళ్ళు కాదు. అన్నీ వున్నట్టె అనిపిస్తయ్ కాని బతుకంత ఎల్తి ఎల్తి వుంటది. అందరు వున్నట్టె అనిపిస్తరు కాని ఎనుకకు తిరిగి సూసుకుంటె ఎవరుండరు. ఆమె తట్టుకోలేని ఒంటరితనం వుంటది. ఈ పరిస్థితిని ఆమె ఎవ్వలకు చెప్పుకోలేదు, ఆమె పరిస్థితి ఇదని బహిరంగంగ ఒప్పుకోలేదు. చెరువుతెగి చెర్లనీళ్ళు చెరువెనక పడ్డయ్. ఇప్పుడు శెప్పుకొని ఏంలాభం అని సప్పుడుజేక వూకుంటది. అప్పుడప్పుడు బాధలు, ఒంటరితనం ఆమె గుండెను ‘దబ్బుడుకం’ (గోనె సంచు కుట్టె సూది) లెక్క పొడిశినప్పుడు అవస్థను తట్టుకోలేక సాటుకో, నేటుకో, అయినోళ్ళతోని శెప్పుకొని ఏడుస్తది.
మా అనసూర్యక్కకు ఇప్పుడు దగ్గరదగ్గర ఓ యాభైఅయిదు సంవత్సరాల ఉమర్(వయసు) వుంటది. నాకు ఊహ తెలిసి తెలవకముందే ఓ పది పదకొండు సంవత్సరాల వయసునే ఆమెకు పెండ్లయ్యింది. పెండ్లయ్యినంక కొన్ని రోజులు అత్తగారింటికి పోయింది. తరువాత పోనని ఏడుసుడు మొదలుబెట్టి వచ్చి మా ఇంటికాన్నే వున్నది. అట్లా శానా దినాలు గడిశినయ్. మా అనసూర్యక్క చానా ‘‘కష్టబోతు’’. మొగోళ్ళతోని సమానంగా పనిజేత్తది. అత్తగారింటికి పోకుంట ఇంట్లనే వున్నప్పుడు, ఇంటికాడ, అన్నం, కూర వండుడు. ఇల్లు, వాకిలి ఊడుసుడు, అంట్లుతోముడు, అలుకుసల్లుడు దగ్గర్నుంచి, వ్యవసాయం పనులు ఎక్కువ చేసుడు మొదలుబెట్టింది. ఎందుకంటె మాఅక్కోళ్ళ అవ్వ, నాయిన, అరె బిడ్డ మస్తు పనిచేత్తాంది, మంచిగ ఆసరయితాందని, అత్తగారింటికి పంపియ్యరని ఆమె ఉపాయమేసింది. ఆమె ఉపాయం కరక్టే అయ్యింది. ఇంటిపని, వంటపని, వ్యవసాయం పని అన్నీ మా అక్క ఒక్కతే ఒంటిశేతి మీద శేత్తాంటే మా తాతకు శానా ఆరామ్(రిలాక్సేషన్) దొరికింది. శానా సుఖానికి అవాటుపడ్డడు. వుంటాంటె వుంటాంటె కొంత కాలం తరువాత మా తాత పని శెయ్యాల్సిన అవసరం కనిపించకుంట పోయింది. ఓ నాలుగురోజులు కనుక ఏ పెండ్లికో, పేరంటానికో మా అనసూర్యక్క పోతే ఎక్కడి పనులు అక్కణ్ణే ఆగిపోయే పరిస్థితి వచ్చింది. వుండంగ వుండంగ మా అక్క మనసు మారింది. మనిషిలో మార్పు మాములే కదా. అత్తగారింటికి పోవాల్నని నిర్ణయించుకున్నది. మా అక్కను పెండ్లిశేసుకున్నాయినే కూడా శానా మంచి మనిషే ఈమెను బతిలాడో, బామాడో తీసుకపోయెటానికి శానాసార్ల వచ్చెటోడు. అత్తగారింటికి పోవాల్నని మా అక్క మనసు కూడా వుండేది. కాని మా తాత పంపించెటోడు కాదు. ఈమె మా అత్తగారింటికి నేను పోత అని శెప్పలేని పరిస్థితి. మా తాత, మా అక్క భర్తను తిట్టి, బెదిరించి పంపించెటోడు. ఎందుకంటె ఈమె అత్తగారింటికి పోతే ఎక్కడ పనులు అక్కణ్ణే పంటయ్ అని మా తాత బాధ. కొంతకాలం తరువాత మా అక్కకు విడాకులు కూడా చేసేసిండు మా తాత. ఇంట్ల ఏ పని చెయ్యాల్నన్న, ఏ నిర్ణయం తీసుకోవల్నన్న అంతా మా తాత శేతుల్నే వుండేది.
‘‘మా అనసూర్యకు మళ్ళా పెండ్లిశెయ్య ఎందుకంటె దానిమీద దేవుడున్నడు దాన్ని దేవునికి ఇడిసిపెడుతాన’’ అని మా తాత మా బందువులకు శెప్పిండు. మా నాయినమ్మ, మా నాయిన, బాబాయి, కోడళ్ళు అందరూ మా తాత మాటను ఎదురించలేక తలకాయూపిండ్లు. ఆ కాలంల అది మంచా, చెడా, అని ఆలోసించె తెలువులు వాళ్ళకు కూడా లేవు. పాపం మా అనసూర్యక్క పరిస్థితి గోరంగ తయారయింది. ‘‘నాకు పెండ్లి శెయ్యిండ్లి అని అడగలేని పరిస్థితి, నాయినను ఎదురించలేని స్థితి’’ ఆడోళ్ళు ఈ కాలంల్నే నాకు పెండ్లి శెయ్యిండ్లి అని అడగలేని పరిస్థితి. ఆ కాలంల ఆ స్థితే లేదు. కాని మా అనసూర్యక్కకు నాది అనే ఒక కుటుంబం వుండాల్నని, ఆమె కడుపు పుట్టిన పిల్లలు, ఓ సంసారం వుండాల్నని శానా‘‘కాయిశు’’ వుండేది. నేను పసిపోరణ్ణయిన ఆమె కండ్లల్ల ఆ బలమైన ‘‘కాయిశు’’ను పసిగట్టిన శానాసార్ల. మా అక్కకు ఇడుపుకాయితం (విడాకులు) అయినంక కూడా మా అక్క ఆమె మెడ తాళిబొట్టు తియ్యలే….దేవుని పేరుమీద అట్లనే ఏసుకునేది. శానా రోజుల తర్వాత ఆ పసుపుతాడు రంగు ఎలిసి పోయి షీకిపోయే దశకు రాంగనే, మా ఊరుపక్క నర్సంపేటల ఆదివారం నాడు అంగడి జరుగుతది, ఆ అంగట్లకుపోయి పూసబెర్లోల్ల దగ్గర కొత్త పసుపుతాడు కొనుకచ్చుకునేది, మెడల్నుంచి పాత పసుపుతాడు తీసి దాని ముళ్ళిప్పి, సకిలముకిలం పెట్టుకొని కూసోని ఆమె ఒళ్ళె (ఒడిలో) ఆ పాత పసుపుతాడుకున్న నల్లపూసలగుండ్లు, బంగారుగుండ్లు, బంగారు చింతాకుపువ్వు, తాళిబొట్టు అన్నీ….పోసుకొని, కొనుక్కచ్చుకున్న కొత్త పసుపుతాడుకు సంటర్ల (నడుమ) తాళిబొట్టునుకట్టి నల్లపూస గుండ్లను, బంగారుగుండ్లను, చింతాకు ఆకారంల వుండే బంగారు పువ్వును, వరుసగా లెక్కతప్పకుంట ప్రేమగా, సుతారంగా కుచ్చి మళ్ళా మూడుముళ్ళేసుకొని మెడలెసుకొని పొగసూరి మసకబారిన పాత చిన్న అద్దంల మంచిగున్నదా…. లేదా… అని సూసుకునేది అప్పుడు నేను శానా చిన్న పోరగాణ్ణి.
పినిశెట్టి రామస్వామి అని మా నాయినమ్మోళ్ళ తమ్ముడు వుండెటాయినె ఆయిన మా అనసూర్యక్కకు మేనమామ. ఓసారి నోరిడిషి మా అక్క మా రామస్వామి తాతకు చెప్పింది. ‘‘మామ నేను పెండ్లి శేసుకుంటనే నాకూ సంసారం, పిల్లో, జెల్లో, ఇల్లు, వాకిలి ఉండాలె కదనే. రేపు నాకు కాళ్ళు, రెక్కలు దగ్గరబడి పురాగ శాతగాక మంచంబడితే నన్ను ఎవ్వరు అర్సుకుంటరు. నా కడుపు పుట్టిన పిల్లలుంటె నన్ను సూసుకుంటరు. ఇట్ల ఇంటిమీద ఎన్నిరోజుండాల్నే అన్నది’’ పాపం మా రామస్వామి తాత ఆమె దు:ఖం అర్దం శేసుకొని “అనసూర్యవ్వ నేను చెప్తా ఆగు టైం వచ్చినప్పుడు” అన్నడు.
కొన్ని రోజుల తరువాత మా రామస్వామి తాత ఓ మంచి సంబంధం సూశిండు. పిలగాడు మంచి బుద్దిమంతుడు. మా కుమ్మరి పని మంచిగ శేత్తడు కాని ఎనుకముందు ఎమీ లేరు. పిలగానికి మా అనసూర్యక్క గురించి చెప్తె చేసుకుంటనన్నడు. మా అక్కకు కూడా పిలగాని గురించి చెప్తె సరే మామ చేసుకుంటనన్నది. ఓ రోజు మా కట్టయ్య తాత దగ్గరికి మా రామస్వామి తాత పోయి ‘‘అనసూర్యకు ఓ మంచి సంబంధం తెచ్చిన్నే బావ! అని పిలగాని గురించి శెప్పిండు, ఎంటనే మా కట్టయ్య తాత మస్తు సీరియస్ అయ్యి ‘‘ఎడమకాలు చెప్పుదీసి కొడుత బాడుకావ్ అని ఎడమకాలు శెప్పు దీసిండు. బామ్మర్ధివి బామ్మర్ధి లెక్కుండు. నా బిడ్డకు నువ్వు పెండ్లి సంబంధం సూశెటోనివి అయినావురా? అని అనరాని మాటనుకుంట, దానికి పెండ్లిజెయ్య ఏంజెయ్య దేవునికి ఇడిషిపెట్టిన’’ అన్నడు. ఎందుకంటే మా అక్కకు మళ్ళ పెండ్లిజేత్తె కట్నం, కానుకలు, బట్టు, బాతు, బోజనాల ఖర్సు ఎటులేదన్నా ఓ యాభైవేల రూపాలన్న ఖర్చుయితయి ఆ రోజుల్ల, మళ్ళా మా అనసూర్యక్క పెండ్లి శేసుకొని అత్తగారింటికిపోతె ఎక్కడి పనులు అక్కణ్ణే ఆగిపోతయ్ అని మా కట్టయ్య తాతకు మనసు వుండేది కాని….బయటికి శెప్పెటొడు కాదు. మా రామస్వామి తాత చేసేదేమి లేక జరిగిన సంగతి మా అక్కతోని చెప్పిండు. ఏం జెయ్యాల్నో అర్దంగాక మా అక్క బాగా ఏడిషింది. ఆడపిల్లకు కష్టమస్తె కన్నోళ్ళముందో, తోడబుట్టినోళ్ళముందో, అయినోళ్ళముందో వాళ్ళ కష్టం ఎల్లబోసుకుంటరు. కాని కన్న తండ్రే కన్న బిడ్డ రెక్క కష్టానికి అలవాటుపడి, బిడ్డ కాయకష్టం నుంచి పొందే సుఖానికి మరిగి, పరాణ్ణజీవి ‘అమీబా’ లెక్క మారినప్పుడు… కన్నతల్లి, అన్నదమ్ములు, వదినొ నవారుపట్టె మంచం నల్లులలెక్క నిమ్మకు నీరెత్తనట్లు సప్పుడు జేకుంట, మాటగూడ మాట్లాడకుంట ఊకుంటె పాపం ఒక ఆడిమనిషి ఏంజెయ్యగలుగుతది. కొంగునోట్లె కుక్కుకొని సప్పుడు గాకుంట సాటుకు ఏడుసుడు తప్ప. అప్పుడు మా అక్క అట్లనే ఏడిసింది. ‘‘ఈ వదిన తోని, మరుదళ్ళతోని, అన్నదమ్ములతోని, అయినోళ్ళతోని, కానోళ్ళతోని నేను మాటు పడలేను. నన్నొక అయ్య శేతుల పెట్టుండ్లి, నా బతుకేదో నేను బతుకుతా… అని సాటుంగ, నేటుంగ శానాసార్ల అడిగింది, కాని అప్పటికే మా అనసూర్యక్క మీద దేవుడున్నడు, ఆమెను దేవునికి ఒదిలేశిండ్లు అనే ముచ్చట ఆ నోటా, ఈ నోటా మా చుట్టాందరికి తెలిసింది. వుండంగ వుండంగ ఆమె పెండ్లిగురించి మాట్లాడే మనుషులే కరువయ్యిండ్లు. ఆమెకు పెండ్లి మీద ఆశ సచ్చిపోయింది. మా అక్కమీద దేవుడున్నడట. కనీసం ఆ దేవునికి కూడ మా అక్క మీద జాలి కలుగలే. ఆఖరికి మా అక్కమీద కూడా మా అక్కకే జాలిపోయింది. ఆమె కసిగా పెండ్లి అనే మాటను తన ఎడమకాలి బొటనఏలు(మే)తో ఎర్రచీమను నలిపేసినట్టు నలిపేసింది.
ఇప్పుడు మా అక్కకు యాభై అయిదు సంవత్సరాలపైనే వయసుంటది. కూలికో, నాలికో పోతది, ఆమెకు వున్న బుంతంత చొక, ఇంత కోతిమీర, ఇంత ఉల్లాకు, ఇంత గోగ్గూర, ఇంత సుక్కకూర, ఇంతంత పాలకూర సీజన్‌ను పట్టి చిన్నచిన్న ‘‘మడులు” అలుకుకుంటది. సాయంత్రం కోసుకస్తది. వాకిట్ల సాపపరుసుకొని కూసోని, కోసుకచ్చిన ఆకు కూరలు, చీరిన తాటాకు ఈనెతోని కట్టు కట్టుకుంటది, పెద్ద గంపల వరుసగా బతుకమ్మను పేర్సుకున్నట్టు పేర్సుకుంటది. తెల్లారి మబ్బుల లేత్తది. యాపపుల్లతోనన్న లేకపోతే బొగ్గుతోనన్న (ఎనుకటయితే ‘‘పిడిక’’ బొగ్గుతోని తోమేది ఇప్పుడు పిడికలు లేవు) పళ్ళు తోముకొని మొఖం కడుక్కుంటది. గంపనెత్తి పెట్టుకొని నర్సంపేటకు నాలుగు కిలోమీటర్లు నడుసుకుంట పోతది, అక్కడ కూరగాయల అడ్డమీద కూసోని అమ్ముకుంటది. పాణం పురాగ శాతగానినాడు మారుబేరపోళ్ళకు ఎంతకో ఒగంతకు అడ్డికి పావుశేరు గుత్తకు అమ్ముతది. వచ్చిన పైసలు బొడ్లె సచ్చిల పెట్టుకొని ఇంటికత్తది. అన్నం కూర వండుకొని తిని, అరుగుమీద కూసోని బొడ్లె సంచిల పైసలు అరుగుమీద కుమ్మరిత్తది, రూపాయి, రెండు రూపాయలు అన్నీ లెక్కేత్తది, ఒక పాత చెక్క బొట్టుపెట్టెల పైసలు దాసుకుంటది, ఓ బర్రెను కొనుక్కున్నది. దాని పాలు పిండి అమ్ముకుంటది, సగంపాలను పెరుగు తోడేత్తది, పెరుగు అమ్ముకుంటది. పైసలు అసలే ఖర్సుపెట్టది. కడుపుకు ఆయిమనంగ తినది. రాతెండి టిఫిని గిన్నెల (లంచ్‌బాక్స్) ఇంతంత అన్నం బెట్టుకుంటది. చిన్న స్టీలు కటోరల ఇంతంత కూర, లేకపోతే మామికాయ తొక్కో, టమాట తొక్కో పెట్టుకుంటది. ఆ కటొరను టిపిని బాక్స్‌ల పెట్టుకుంటది. ఎడ్ల బండి కట్టుకొని బాయికాడికి పోతది. ఎడ్లబండి నొగుల బట్టి ఒక్కతే లేపుతది, ఎడ్లు వచ్చి బుద్దిగా ‘‘కాణి’’ కింది మెడలు పెడుతయ్, సతాయించయ్. ఎడ్లకు కూడా మా అనసూర్యక్కంటె అంత ప్రేమ, జాలి. ఈ ప్రేమ, జాలి, పావురం మా కట్టయ్య తాతకు మా అక్కమీద వుండివుంటే మా అక్క బతుకిట్ల ఒంటరిదయ్యేదికాదు. గత యాభై సంవత్సరాలుగా మా అనసూర్యక్కది ఇదే దినచర్య. ఎసొంటి మార్పు శేర్పు లేవు. అప్పుడప్పుడు బతుకు రోటీన్‌గా, రోతగా అనిపిచ్చినప్పుడు ‘‘నా పెండ్లయినప్పుడు నేను చిన్నదాన్ని. అవ్వగారి ఇంటిమీద మనుసుగుంజి అత్తగారింటికి పోనని మంకుపట్టు బట్టిన. నాలుగు బుద్దిమాటలు జెప్పి తోలియ్యాలె, మా అత్తగారోళ్ళు వచ్చినప్పుడన్న తోలియ్యాలె గదా? ఆ సంబంధం ఇడుపుకాయితం (విడాకు) అయ్యినంకనన్నా మళ్ళా నన్నో అయ్యశేతులబెట్టాలే కదా, మా రామస్వామి మామ తెచ్చిన సంబంధాన్ని కూడా శెడగొట్టె, పని చేసి చేసి నా బొక్కలు షీకిపోయినయ్. నేను బండెడు కష్టం జెత్తాంటే తిని కూసోని సుఖానికి మరిగి నాది ఇట్లా ఎటుగాని ఒంటరి బతుకుజేసిండు మా నాయిన ‘‘లంజకొడుకు’’ అని ఆమె ఎత తీరెదాకా ఏడుస్తది.
ఇప్పుడు మా అక్క అన్నదమ్ములందరు ఏరుబడ్డరు, అన్నదమ్ముల పిల్లలకు పిల్లలయిండ్రు, ఎవ్వల కుటుంబాలు వాళ్ళకున్నయ్, పాపం మా అనసూర్యక్కకే ఓ కుటుంబం లేకుంటయ్యింది. ఏదయిన పండుగకో, ప్రభోజనాకో మా చెల్లెండ్లు, మా తమ్ముండ్లు, మేము, మా పిలగాండ్లను తీసుకొనిపోతం, ఆ రొండు రోజులు సంబురంగనే వుంటది. ఎక్కడోళ్ళక్కడ పోంగనే బెంగట్నీట్టయితది. ‘‘సముద్రం కెరటాలు ఉవ్వెత్తున ఎగిరెగిరి పడుకుంటొచ్చి తీరాన్ని ముంచినప్పుడు, తీరానికి సంబురమయితది. బతుకు సుట్టూరంగా మస్తుతోడు భద్రతునట్టనిపిస్తది. అవే కెరటాలు ఎనుకకు మర్లిపోయినప్పుడు తీరం ఒంటరితనంతోటి ఏకాకై బెంగటిల్లి ఏడుస్తది’’ ఇప్పుడు మా అనసూర్యక్క బతుకు ఆ ఒంటరి తీరం లెక్కున్నది.
ఆమె బాల్యం, ఆమె యవ్వనం, ఆమె గుండెల పురుడుపోసుకున్న ఆశలు, కోరికలు, అమె జీవితం, అన్నీ… ‘‘వానలు బాగ కొట్టినప్పుడు మా ఊరి చెరువునిండి మత్తడి పడ్డప్పుడు రువ్వడిగ (అతి వేగంగా) ఉరికే మా ఊరి పెద్ద వాగు పడి కొట్టుకపోయినయ్. కాదు, కాదు, మా తాత ‘‘మాదర్‌చోద్’’గాడు మా అక్క బతుకును ఆ వాగు పారబోషిండు’’. ఎవ్వులు తెచ్చిత్తరు ఆమె బతుకును ఎనుకకు. ఏ నడిజామ్ రాత్రో ఆమెకు నిద్ర రాక జారిపోయి మట్లె గలిసిన జీవితం యాదికచ్చి, ‘‘కష్టమస్తె గుండెకు అమురుకొని ఏడిసెదానికి కడుపు పుట్టన బిడ్డలు లేరని, కండ్లనీళ్ళు తుడిసెదానికి ఓ తోడు లేదని, ఎక్కెక్కి ఏడుస్తాంటే మావోళ్ళు ఇది బద్దిపోచమ్మ కొంటెతనమంటాండ్లు మావోళ్ళు పిచ్చోళ్ళు. కాని…..మా అక్క గుండె యాభై సంవత్సరాలుగా మండుతున్న ఒక ఒంటరి బాధ సూర్యగోళం, ఆమె కండ్లు గడ్డకట్టిన కన్నీటి హిమాలయాలు. ప్రతిరోజు ఆమెకు ఆమె ఒంటరి బతుకు మీద రోతపుట్టి బాధను ‘‘బర్ధాష్’’ చెయ్యలేక గుండె భగ్గున మండుతాంటే ఆ మంట శెక (సెగ) ఆమె కండ్ల కన్నీటి హిమాలయాలను తాకి అవి కరిగి ఆమె కండ్లు కన్నీటి నదులై ప్రవహిస్తాంటయ్, పాపం మా అనసూర్యక్క ఓ కన్నీటి జీవనది.
*
జనవరి 21,2016
ఆద్యంతం ఆసక్తికరం గా కథ
కన్నీటి నివాళి
చాలా మంచి కథ