మాస్టారూ మీరెవరు?

కాళీపట్నం రామారావు. కారా. నాకు తెలీదు.

తెల్లటి పంచె లాల్చీ జేబులో నల్లటి లావు పెన్నుతో పెద్ద మనిషి నా యెదురుగా నిలబడ్డా నాకు తెలీదు. నేనెప్పుడూ చూడలేదు. చూస్తే కదా గుర్తు పట్టడానికి? పలుకరించడానికి? ఆయనే నన్ను చాలాకాలంగా యెరిగి వున్నట్టు యింటిపేరుతో సహా నా పూర్తి పేరు పెట్టి పలుకరించారు. భుజమ్మీద చెయ్యేసి కావలసిన మనిషిలా దగ్గరకు లాక్కున్నారు. గుండెకు గుండె ఆనించి “నువ్వా..” నమ్మలేనట్టు చూసి “చిన్నవాడివి, నువ్వనే అంటాను. ఎంతో పెద్ద ముసలివాడివనుకున్నానయ్యా” యిష్టంగా ఆత్మీయంగా మాట్లాడేస్తున్నారు. ఆయన ముఖంలో సంతోషం చూస్తే వెతికితే దొరికినట్టున్నాను. ముప్పైయేళ్ళ క్రితం తొంభై వొకట్లో విరసం విశాఖ సభల్లో నా జేబుమీది బేడ్జీలో పేరు చూసి పట్టేశారు. నేనప్పుడు అయోమయంగా ఆయన జేబుమీది బేడ్జీ చూస్తుంటే తనని తాను పరిచయం చేసుకున్నారు. ఇది నా వొక్కడి అనుభవం కాదు, చాలా మంది కథకుల యించుమించు అనుభవం.

కథ తప్ప యిద్దరి మధ్యా యే సంబంధమూ లేకపోయినా అంతకు మించిన బంధుత్వం యేముందని నమ్మి నడిచిన కథకుడా మీరెవరు?

అది మొదలు కథ మొదలైపోయింది. ఉత్తరాల్లోనో నేరుగానో కలవడంతో ఆగిపోలేదు. ఏం చదవాలో యెవర్ని చదవాలో సిలబస్సు రెడీగానే వుంది. గురజాడ, చాసో, చలం, శ్రీపాద, కొకు, రావిశాస్త్రి నుండి రాజయ్యా రఘోత్తం వరకూ ఇంగ్లీషు రాకపోయినా పర్లేదు రష్యన్ అనువాదాల వరకూ యెందరివో రచనల లిస్టు జిరాక్సులిచ్చి పుస్తకాలిచ్చి లేదంటే దూరంగా వుంటే అవి యెవరి దగ్గర దొరుకుతాయో చెప్పి చదివి జాగ్రత్తగా తిరిగి యిమ్మనీ చెప్పి మధ్యలో ప్రిపరేషన్ యెలా వుందో అన్నట్టు మాట్లాడి అర్థం చేయించడమే తప్పితే పరీక్షలు పెట్టని మాస్టారూ మీకెందుకంత శ్రద్ధ? మీరెవరు?

కలిసినప్పుడల్లా చేతిలో పిల్లలకు చాక్లెట్ పెట్టినట్టు కొత్త పుస్తకం వొకటి పెట్టేవారు. నా ముఖంలో తృప్తి లేకపోవడం పసిగట్టి అడిగారు. ‘మీ కథల పెద్ద పుస్తకం కావాల’న్నాను. కాపీలు లేవు, రీప్రింట్ వస్తే అన్నారు. తలూపాను. సంపాదిస్తానన్నారు. ఎక్కడా దొరకలేదు. కాని తెచ్చిచ్చారు. నా ముఖంలో ఆనందం చూసి ‘యెవరిచ్చారో చూడు’ అన్నారు. నా పేరు రాసి ‘మేష్టారి ద్వారా అభిమానంతో’ అని చేసి వున్న సంతకం. అర్థం కాలేదు. ‘మీ అమ్మగారు, అదే మా గృహిణి సీత కాపీని నీకోసం అడిగి వొప్పించా, యింతలో యగళ్ళ రామకృష్ణ కాపీ యిస్తే ఆయన చేతే…’ నాకర్ధమయిపోయింది. కళ్ళు చెమర్చాయి. థాంక్స్ కూడా చెప్పలేకపోయా. ఇంత వాత్సల్యం చూపించడానికి మాస్టారూ మీరెవరు? షరతులు వర్తిస్తాయి అన్నట్టు ‘నీ ఆదాయం యెంతయితే అంత. అందులో పది శాతం పుస్తకాలు కొనడానికి కేటాయించు’ అని రచయితకి దన్నేమిటో చెప్పకనే చెప్పిన మాస్టారూ మీరెవరు?

ఓ రోజు ‘కొడవటిగంటి కుటుంబరావు’ పేరు పైన ‘మా గురువులు’ అని రాసుకున్నారు, మొదటి సంపుటి అది. ఆపైన నాపేరు రాసి యిచ్చారు. ‘మీ గురువుది మా గురువుగారు యిచ్చారు’ అన్నాను ప్రసాదం అందుకున్నట్టు. అంతకన్నా పెద్ద విషయం చెప్పాలి. నీకు మంచి పుస్తకం యిస్తాను అని ‘రాజు మహిషి’ చేతిలో పెట్టారు. కవరు తెరవగానే కళ్ళు తిరిగాయి. ‘నా వద్దకన్నా ఉపయోగపడే చోటు రచయిత బమ్మిడికి-‘ అని ఆగినా అర్థం చేసుకుందును. ‘దీనిని మించిన రచన చేయమని’ అని సంతకం చేసి వుంది. బమ్మిడి మీద బమ్మిడికి కూడా లేని నమ్మకం మీరు పెట్టుకోవడానికి ప్రోత్సహించడానికి మాస్టారూ మీరెవరు?

‘ఈ పని చేయవలసింది నేను కాదు, తగినవారింకొకరెవ్వరూ పూనుకోనందువల్లే నాకు చేతనైన విధంగా దీన్ని చేయబోయాను’ అని క్షమాపణలతో మొదలు పెట్టి ‘కథా కథనం’ అని పేరు పెట్టి కథ రాయాలంటే… కథేది కానిదేది వస్తువేది వస్తువెంపికెలా రచనా కథా సామాగ్రిగా వర్ణనలు పాత్రలు సంభాషణలు సన్నివేశాలు సంఘటనలు భాష కథకి పేరు పెట్టడం దగ్గర్నుంచి ముగింపుదాక పరమ ఆప్తంగా నాలాంటివాళ్ళ కోసం ఆనాడే ప్రాధమిక పాఠాలు రాసిపెట్టిన మాస్టారూ మీరెవరు?

మీరు కథలు రాయకుండా కథానిలయం బరువులు యెత్తుకుంటే యెలా అన్నప్పుడూ అదే మాట. ‘సరే యీ పని నేను చేయవలసింది కాదు, తగినవారింకొకరెవ్వరూ పూనుకోనందువల్లే…’ మీ రాతని పక్కనపెట్టి మా రాతల్నిభద్రపరచడానికి దిగిన మాస్టారూ మీరెవరు?

dav

తొలిరోజుల్లో రాసిన కథని యెప్పుడన్నా అచ్చుకు ముందు చూపించే అవకాశం వస్తే యిస్తే చదివి చేర్పులూ మార్పులూ అవసరమైతేనే చెప్పి అవసరం లేనిది నిర్మోహంగా తీసేసేలా బోధపరిచి అక్షరదోషాల దాకా దిద్ది తూకం పట్టినట్టు వొక్క వాక్యం వొక్క పదం వొక్క అక్షరం హెచ్చూ తగ్గూ లేకుండా సరిగ్గా లెక్క తూచి ‘మన సమయంకన్నా పాఠకుడి సమయం విలువైనది’ అని చెప్పినందుకేనా మీరు లెక్కల మాస్టారూ?

రాసేశాక మన రచనని మనమే మోసుకు తిరగ కూడదు, అసలు లెక్క చేయకూడదు అని మీ గురువు రావిశాస్త్రిగారు మాట చెప్పిందీ మీరే మాస్టారూ!

‘ఒక ప్రతిమ లోపలి గడ్డీ వెదురూ యినుమూ బయటికి కనిపిస్తే ఆ ప్రతిమ అందవికారంగా కాదు, వికృతంగానూ కన్పిస్తుంది. కథయినా అంతే. సారం చదివేవాళ్ళలో యింకాలి తప్పితే కథకుడు అరిచి ఓ బయటపెట్టకూడదు’ అని కళాశాస్త్రం గుట్టు చెప్పినా ‘యధాతంగా జరిగింది జరిగినట్టు రాయడం కంటే వాస్తవానికి కల్పన జోడించి అది అందరిదిగా చేయడంలోనే సాఫల్యత’ అని రచనాశాస్త్రం మర్మం విప్పినా అందులోనూ మేం తెలుసుకోవాలనే మక్కువే మీకెందుకు మాస్టారూ?

‘నీది కంగాళీ బాష’ అని తిట్టినా ‘నీవు యెంచుకున్న వస్తువులు గొప్పవి’ అని దీవించినా వేస్తున్న అడుగులు నేనెప్పుడూ లెక్క పెట్టకపోయినా  ‘అందరూ వాళ్ళ వాళ్ళ కథల గురించి అడుగుతారు, నువ్వు అడగవేం?’ అడిగారో రోజు. ‘ఏదన్నా వుంటే మీరే చెపుతారుగా’ అన్నాను. గుంబనంగా చూశారు. కాని నేనూ అడిగే రోజు వచ్చింది. ‘చావు కార్యం జరిగిన నాలుగురోజులకి భార్యా భర్తలు కలవరా?’ అని అంటే, ఆ విమర్శ తానూ చదివినట్టు తలాడించి అలాంటిదే తన అనుభవాన్ని దాపుడు లేకుండా చెప్పారు. పుట్టెడు దుఃఖంలోనూ అప్పటికే దూరంగా వున్నందువల్ల దగ్గరైన వైనాన్ని చెప్పారు. మనసూ శరీరం వేరుపడ్డ వైనాలు వివరించారు. ఎక్కడైనా సహజాతాలు మారవన్నారు. వాటిని ప్రభావితం చేసే అంశాలని చూడగలగాలన్నారు. నా బరువు దించడానికి అంతరంగిక విషయాలు బయటపెట్టుకున్న మాస్టారూ మీరెవరు?

‘నీకు పెళ్ళయిందా?’ అడిగారు. అప్పటికి లేదు కాబట్టి తలడ్డంగా వూపాను. ‘ఆడవాళ్ళతో సంబంధాలు వున్నాయా?’ అడిగారు. అడ్డంగా తలూపాను. గొడ్డు, రెక్కలగూడు కథలు చదివి అనుమానంతో ‘నీకు యివన్నీ యెలా తెలుసు’ అడిగారు. ‘అంటే… మిత్రులకూ వాళ్ళ భార్యలకూ పదిమంది వరకూ కొన్ని ప్రశ్నలు రాసి అడిగా, స్త్రీ శరీరం గురిచి తెలుసుకున్నా’ అన్నాను. కథలో వొక వాక్యం తీసి చూపించి ‘యిదెలా రాశావ్?, అనుభవం లేకుండా’ అన్నారు. నేను బేలగా చూశాను. కిళ్ళీ నములుతూ నవ్వి ‘నీకూ వంగపండులా అంబ పలుకుతోంది’ మెచ్చుకోలుగా చూశారు. తరువాతెప్పుడో అనుభవలేమితో రాశానని వొకే వొక్కరు విమర్శ చేస్తే, పాలిచ్చే తల్లులకు జ్వరంతో రొమ్ములు గడ్డలు కట్టడం గురించి చెప్పి, ‘మా అమ్మకి ఆడపిల్లలు లేరు, నేను ఆడపిల్లనై దగ్గరగా సాయం చేశా’నన్నాను. ‘రాసే ముందు అడిగి తెలుసుకున్నా’నన్నాను. ‘నిజం నీకు తెలుసు కదా, యెప్పుడూ లేంది నువ్వు యిలాగేమిటి?, వదిలేయ్’ అన్నారు. మళ్ళీ యెప్పుడూ నా కథల గురించి జీవితంలో నేను మాట్లాడలేదు. రణస్థలి సంపుటిలో ‘తెల్లవారకముందే’ కథ చదివి ‘మాండలికం బాగుంది, అన్నీ అలానే రాసావేమో అని భయపడ్డా, యిప్పటి వాళ్ళు చదవరు’ అని నొచ్చుకొని యాస భాషల గురించి ఆందోళన పడడానికి మాస్టారూ మీరెవరు?

కట్నకానుకల్ని కాదనుకున్న పెళ్ళిలో దూరం పెట్టిన ఆర్ధిక సంబంధాలు దగ్గరై నన్ను అతలాకుతలం చేసినప్పుడు కుటుంబ సభ్యులకన్నా యెక్కువగా కేర్ తీసుకొని డబ్బైయేళ్ళ వయసులోనూ నన్ను చూడడానికి అనేక దఫాలు విజయనగరం వచ్చి చూసి వెళుతూ అక్కున చేర్చుకున్న మీరెవరు? కష్టం నష్టం దాంపత్య సంబంధాలూ అన్నీ విప్పి చెప్పి నీవనుకున్నట్టు ఆదర్శాలూ అభిరుచులే సరిపోవు, పుష్టికరమైన శారీరక సంబంధాల ప్రమేయమూ పాత్రా తక్కువ కాదని, మనల్ని మనం విడిపోయి యెలా చూడాలో చెప్పి నన్ను నన్నుగా నిలబెట్టిన మాస్టారూ మీరెవరు?

అంతేనా, హైదరాబాదులో వొంటి గదిలో నా కాపురం చూసి మీ గత కాపురం గుర్తు చేసి కాళ్ళు చాచుకుంటే తగిలి పడిపోయిన గిన్నెలూ తపేళాలూ అర్ధరాత్రి శబ్దాలూ గుర్తుకు తెచ్చుకొని అక్కడి నుండి మీ ప్రయాణం ‘నో రూమ్’ కథకు వేసిన దారులు చెప్పడంలో నాలో ధైర్యం నింపడానికి మాస్టారూ మీరెవరు?

నా కోరిక మేరకు యింటి లైబ్రరీలో మీకు కావలసిన పుస్తకాలు వెతికి తీసుకొని ‘పర్లేదు కదా?’ అంటే ‘నాకన్నా వుండవలసిన చోటు’ అని మీ మాట మీకే అప్ప జెప్పాను. సరే, వెళ్తూ వెళ్తూ ‘మీ ఆవిడ పెద్ద గొంతుతో మాట్లాడింది చూశావా’ అని గుసగుసగా అని ‘వయసయితే పాపం మనకి వినబడదనుకుంటారు’ శాంతంగా నవ్వుతూ అందర్నీ అర్థం చేసుకున్న మాస్టారూ మీరెవరు?

హైదరాబాదు వచ్చినపుడల్లా వీలున్నప్పుడల్లా మీ చేతికర్రల్లో నేనూ వో వూతకర్ర. నా భుజమ్మీద చెయ్యి వేసి చిన్ననాటి దోస్తుల్లా యిద్దరం నడుస్తుంటే ఆటోలు యెక్కి దిగుతుంటే యెంత గర్వంగా వుండేదని? మార్గం మధ్యలో యెన్నెన్ని కబుర్లు చెప్పేవారు. జేబులోంచి రూపాయి తియ్యనిచ్చేవారు కాదు. చిన్న బేగులో బోలెడు పర్సులు. కథానిలయం పర్సు, పుస్తకాలు అమ్మగా వచ్చిన డబ్బు అప్పగింతల చిట్టీల పర్సు, పర్సనల్ ఖర్చుల పర్సు. ఒక జేబులోది మరో జేబులోకి పోరాదు. రారాదు. లెక్కల మాస్టారూ అని లోపల నేను నవ్వుకుంటే, నాకు ఆర్ధిక పాఠాలు అర్థం చేయించి స్థిరంగా ఆదాయం లేపోతే జీవితం యెంత అస్థిరం అయిపోతుందో యెరుక పరచడానికి మాస్టారూ మీరెవరు?

ఇల్లిల్లూ తిరిగి పోగు చేసిన పుస్తకాలు. వయసునే మొయ్యలేం, ఊరూరూ తిరుగుతూ పుస్తకాలను మోస్తూ కథానిలయపు వొక్కో అరలో పేర్చిన మాస్టారూ మీరెవరు?

తల్లి ఋణం తండ్రి ఋణం గురువు ఋణం యీ మూడే ఋణాలు తెలిసిన మాకు నాలుగో ఋణం సామాజిక ఋణం గురించి విడమర్చి చెప్పి మన సౌఖ్యం వెనుక యెందరి శ్రమ వుందో గుర్తు చేసి ఆ శ్రమ జీవుల పక్షం నిలబడవలసిన బాధ్యతని గట్టిగా చెప్పడానికి మాస్టారూ మీరెవరు?

ఎక్కడో బస చేస్తే, మీతో పాటు మేమూ వుంటే, ‘యింట్లో పరవాలేదా?’ అని అడిగి, మా కాలంలో రాత్రులు చర్చలతో తెల్లవారేవని చెప్పి, అప్పుడు మా సీతని యిరుగూ పొరుగూ ‘రాత్రి పూట మీ ఆయన ఆలస్యంగా యింటికి వస్తున్నాడు కనిపెట్టుకో’ అని అన్న మాటల్ని అమ్మగారే మీకు చెప్పారని మురిపెం కూడా బయటపడకుండా చెప్పేవారే. అమ్మగారితో చదువులూ ఆటలూ అన్నీ తోబుట్టువులానే. అమ్మగారు వెళ్ళిపోయాక మీ ఆరోగ్యము పాడైంది. ఆ సందర్భంలో మృత్యువు గురించి మాటలువస్తే మన కంటే చిన్నవాళ్ళూ మన తోటివాళ్ళూ కాలం చెల్లిపోతుంటే యెలా వుంటుందో చెప్పి, అంతలోనే మాది వినే వయసు కాదనేమో చావుల్ని మనసు మీద పడనివ్వకు దాన్ని గురించి యెప్పుడూ ఆలోచించకు అని చీకటి నీడ కూడా పడనివ్వకుండా చూసుకోవడానికి మాస్టారూ మీరెవరు?

కథలు రాయడంలో గేప్ వస్తే, అప్పటికి విరసంలో వుండి కార్యక్రమాల్లో భాగం అవుతుంటే ‘కార్యకర్తగా మారిపోకు’ అని యెప్పటికప్పుడు సున్నితంగా హెచ్చరించి అలర్ట్ చెయ్యడానికి మాస్టారూ మీరెవరు?

పద్నాలుగేళ్ళు భుజం భుజం కలిపి కలిసి పని చేసిన విరసం సహచరులకు నా ఆత్మవిమర్శా నేనూ అర్థమో అపార్ధమో అయినప్పుడు మొదటి నుండి అన్నీ తెలిసిన మీరు విరసం పెద్దల్ని కలిసి నా తరుపున వకల్తా పుచ్చుకొని మాట్లాడి నాకు వెన్ను దన్నుగా నిలబడడంలో మీ నమ్మకమేమిటి మాస్టారూ? నా జీవితం కుప్ప కూలినప్పుడు నేను ప్రేమించే మనుషులంతా దూరమై వొంటరినైనప్పుడు మీరు కదా నాతో వుండి ధైర్యం చెప్పి మాట్లాడి బురద తేట తెల్లమయ్యేవరకు బుజ్జగించి భుజం తట్టి మీరే ఫోనులు చేసి వచ్చి కలిసి యెప్పుడూ అంటిపెట్టుకొని వుండడానికి అసలు మీరెవరు మాస్టారు? పైగా సఫర్ అవుతున్నది నూటికి తొంభైమంది ఆడవాళ్ళే, పది మంది మగాళ్ళలో నువ్వున్నా తొంభైమంది వైపే నిలబడు, రాయి, అది అవసరం అని అప్పుడు కూడా తప్పటడుగు వెయ్యకుండా కాపాడుకోవాలనే మాస్టారూ మీరెవరు?

నా వొక్కడితోనే కాదు, నాలాంటి వందలాదిమందితో మీరు యిలానే కొద్దిపాటి హెచ్చుతగ్గులతో వున్నారని నాకు తెలుసు. మీ కథ గురించి మాట్లాడేవాళ్ళున్నారు. వ్యక్తిగతంగా అనిపించినా గాని కథకుల వెనుక మీరెలా వున్నారో యిప్పుడన్నా చెప్పకపోతే యింకెప్పుడూ చెప్పలేను. మాస్టారూ…

నేను మీలా లేను. చెయ్యి వదిలేసి తిరిగాను. మీరు వెంటపడి నా చెయ్యి పట్టుకు నడిపించి మీకేమవసరం మాస్టారు? నాకు వయసు పైబడింది, యెవ్వరూ యిన్నాళ్ళలా మాట్లాడడం లేదన్నప్పుడు తల నేలలో పాతుకోవాలని అనిపించినప్పుడు మళ్ళీ మీరే నగర జీవితం అనేసి, స్థిరమైన జీవితం కాదనేసి, నీకే బోలెడు సమస్యలు అనేసి పశ్చాత్తాప పడే అవకాశం కూడా యివ్వకుండా వెనకేసుకొచ్చి అబ్బో మాస్టారూ మీరు నన్నెందుకిలా బంధం వేశారు? తరువాత మీరు మాట్లాడలేని పరిస్థితీ వచ్చింది. అప్పుడూ మీ మతిమరుపు మీద జ్ఞాపకశక్తి మీద నిందలు వేసుకోవడానికి మాస్టారూ మీరెవరు?

ప్రేమతో వాత్సల్యంతో ముప్పైయేళ్ళ కాలం నన్నూ నా కథనీ నాలాంటి వాళ్ళనీ వాళ్ళ కథల్నీ ఎత్తుకు తిరిగి మోసిన కథకుడా మీ పాడె మోసే అవకాశం కూడా నాకివ్వలేదు. నాకు తెలుసు మీరేమంటున్నారో ‘కరోనా కాలంలో యెక్కడికి వస్తావయ్యా, యింటి పట్టున వుండక’ అని అంటున్నారు కదా, యిప్పుడూ కరోనా రోజుల్లో పోయిన మీదే తప్పు, రాలేని నాది కాదు. నన్ను చెడగొట్టారో బాగుచేశారో నాకు తెలియడం లేదు మాస్టారూ?

అసలు నన్నిలా ఏడిపించడానికి మాస్టారూ మీరెవరు? మీరెవరు?

*

బమ్మిడి జగదీశ్వరరావు

17 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)
 • Very touching account of his affinity towards Kaaraa Mastaaru. Even I have many fond memories of him. One cannot believe that a person who wrote only 26 stories has thousand of followers. more than his stories, his analysis and keen observation made him a cult figure in Telugu Literature. His commitment to Telugu Short story is unquestionable. His creation “Katha Nilayam”” is a towering example of his passion for Telugu stories. My salutations to that departed soul.

 • మనసును అమాంతం కదిలించి వదిలి పెట్టింది, బజరా గారూ మీ మనోగతం!

 • గుండెల్ని కదిలించేవాడే కథకుడు అందుకే కారా మిమ్మల్ని కదిలించడమేకాదు కార్యక్షేత్రాన్ని మీముందుంచారు అదే కథా నిలయం కథలాడడం అందుకు మీ భాధ్యత ఎంతో ఉందంటూ మీ మిత్రుడు

  సియ్యార్కే, విశాఖపట్టణం.

 • కళ్ళల్లో నీళ్ళు తెప్పించారు అండీ.బమ్మిడి గారూ..

  సామాజిక బాధ్యత నిరంతరం మోసిన ఆయన మీ లాంటి వారి మీద , ఆ బాధ్యత మోపుతూ , భుజం మార్పిడి చేసుకున్నారు..ఇదో రిలే రేస్..ఒకరి తర్వాత ఒకరు అందుకోవాలి అని చెప్పకనే చెపుతూ వచ్చారు.మీ మాష్టారూ మీకు. ఆయన లెక్కల మాష్టారూ , ఆంగ్ల మాష్టారూ తో ఆగిపోలేదు , సమాజం మొత్తం కి సుద్దులు చెప్పే మాష్టారు గా మారి పోయారు.

  ఆ మాష్టారూ గారి తో మీ అనుబంధం , ఇప్పుడు కూడా నిత్యనూతనంగా మిగిలిపోవాలని మేమందరం ఆశించడం లో మా స్వార్ధమే..కనిపిస్తుంది…మేం అంతే మరి..

  మరొకసారి మాష్టారు గారు , కారా మాష్టారు గారిని తలుచుకుంటూ , కథకి వందనం.కథా నిలయం కి వందనాలు ..

  వసంత లక్ష్మి , పి.

 • సామాజిక ఋణం తీర్చుకొనేందుకు రాస్తున్నావనుకున్నా బజరా ! గురు ఋణం కూడా జోడించడంతో కళ్ళు చెమర్చాయి. మాష్టారితో అపురూపమైన ఆత్మీయ అనుబంధాన్ని ఇంతకన్నా ఆర్ద్రం గా ఎవరూ చెప్పలేరేమో !

 • కారా మాష్టార్ని మరొక్కమారు కళ్ళెదుట సాక్షాత్కరింపజేసారు.
  పి. శేషారావు.

 • ఇది కారా మాస్టారు గురించి రాసిన మేరకే ఆగిపోలేదు..ఒక సాహిత్య కారుని,nay, ఒక నిజమైన సాహిత్య కారునితో పరిచయం,లేదా interaction ,ఏ విధంగా ఇతరులను ప్రభావితం చేస్తుందో ఒక research project గా భావించవచ్చు..జ్వలేన జ్వలితే..అతను ప్రకాశించి నిన్ను ప్రకాశింప జేశారు.
  Management లో ఒక సూత్రం ఉంది.. A successful manager is one who leaves a successful manager.. ఆ విధంగా ఒక విజయవంతమైన సాహిత్య కారుడుని నీ రూపంలో వదిలారు..

 • మాష్టారంతే బజరా గారూ! అందరినీ ఏడిపించి మరీ వెళ్లారు. మాష్టారితో మీ అనుబంధం మాకూ కన్నీళ్ళు తెప్పించింది.

 • మాస్టారంతే బజరా, ప్రసాద్ అంకుల్ ఒకసారి నన్ను యగళ్ళ ఇంటికి తీసుకెళ్ళారు. వెళ్ళగానే అంకుల్ కి కాళ్ళు నిలవవు కదా వెంటనే మాస్టారింటికెళ్ళారు. వస్తూనే అరేయ్, నిన్ను కారా గారు వాళ్ళింటికి తీసుకు రమ్మన్నార్రా అన్నారు. నేనాయనకు తెలియదు, కథలూ రాయలేదు! మనిషిని మనిషిగా ప్రేమించే నిజమైన మనుషులందరూ వెళ్ళిపోతున్నారు.

  యగళ్ళని గుర్తుచేసినందుకు ధాంక్స్ బజరా! పద్మక్క డాక్టర్ కదా? సీతమ్మ గారినీ మాస్టారినీ ఎంతో అపురూపంగా చూసుకునేవారు.

  పాఠకుల్ని ఎడా పెడా రుద్దేస్తున్న మహా మహా రచయితల పక్షాన గాకుండా “పాఠకుల సమయం కూడా విలువైంది” అని చెప్పిన ప్రజారచయిత కారా మాస్టారికి హృదయపూర్వక శ్రద్ధాంజలి!

 • Gunde లోతు లోంచి badha padamai, వాక్యmai… Mi kalam nundi pravahinchindi. Inta varaku gontu lone nilabadi poyina baruvu nitturpu laga bayata పడింది, Mi మాష్టారు migilina vari kante, marinta దగ్గరగా tostunnaru Bajara

 • కారా నాకు తెలీదు అంటూనే కారా మాస్టారు గురించి చాలా విషయాలు తెలియజేశారు. అంతే కాకుండా ఈ నివాళి వ్యాసంలో కథలు ఎలా ఉండాలి. ఎలా రాయాలి వంటి ముఖ్యమైన విషయాలు కూడా తెలుసుకునే అవకాశం కలిగించిన మీకు కృతజ్ఞతలు సార్.

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు