మాస్టారూ… జవాబు చెప్పరూ !

“మాస్టారూ.. చదువుకోవాలంటే కష్టపడాలండీ… !” అని యశోద అడిగిన ప్రశ్న – ఆరేళ్ల తర్వాత కూడా పిల్లల విషయంలో ఏమాత్రం ఏమరుపాటుగా వున్నా – హెచ్చరిస్తుంటుంది నన్ను.

“మాస్టారూ.. చదువుకోవాలంటే కష్టపడాలాండీ… !? ” అని అడిగింది.

ఎందుకడిగిందా అని ముఖంలోకి ఆశ్చర్యపోయి చూసేను. నిజంగానే ఆశ్చర్యమేసింది.

” ఏమలా అడిగావు.. ” తనేం చెప్తదో తెలుసుకోవాలనుకున్నాను.

” ఊహూ.. ఏం కాదు చెప్పండి… చదువుకోడానికి డబ్బులుండాలాండీ.. ? ”
ఈసారి మరింత రెట్టించి అడిగింది.

తనేం అన్నదో, ఎందుకలా అన్నదో అప్పుడికి గాని పూర్తీగా అర్థంకాలేదు.

” అవును! ” అన్నాను… అని వొకసారి తన ముఖంలోకి చూసేను. నేనిచ్చిన జవాబు తనకి బాధపెట్టినట్టుంది.

తలొంచుకుంది.

” అవును!  కానీ.. బాగా చదువుకుంటే ఈ డబ్బులతో పని వుండదమ్మా… ” అని కొనసాగించేను.

తలెత్తింది.

కొత్త శక్తినేదో పొందినట్టు కనిపించింది.

” ఇష్టంతో చేసే ఏ పనేనా మన ఆత్మవిశ్వాసాన్ని పెంచి ఎన్ని ఆటంకాలెదురైనా వాటన్నిటిని తుత్తునియలు చేసే చేవ కూడగడుతుందమ్మా.. భయం లేదు ” అని చెప్పేను.

” … అలాగే మాస్టారూ…. వుంటాను.. ” అని నా దగ్గర నుంచి వెళ్లిపోయింది.

తనతో ఈ సంభాషణ జరిగి ఆరేళ్లవుతుంది.

” …… మరొద్దునె మేట్టారూ.. యెక్కువ యిబ్బందెట్టకండి… మాటికి మాటికి అడిగిపించుకోడం మాగ్గూడ యిట్టం నేదు. అయ్యలేని బిడ్డ గూడులేని పిట్ట వొగే తీరవ అంతరు. మా నుదిటిని యెలగ రాసుంతె అలగ గడుత్తదినెండి. మగ తోడులేని బతుకు.. యేటిసెయ్యడం. వుప్పుడు నానొక్కత్తినె యింటికి దన్ను.. దాని అన్నయ్య వుండు గాని వొయిజాగుల వుండు – మగోడు యెలిపేనట్టుగ ఆడోలిమి యెలుపోనేము గదా – యిల్లెగులిన బిడ్డ కన్నొదిలిన గొడ్డు వొగటె అంతరు. ”

.. చెప్తూ ఆగింది. కొంగుచివరతో కళ్లొత్తుకుంది. నేను మౌనంగానే వున్నాను. మళ్లీ మొదలెట్టింది.

” ….. దాని గతి అలగ యేడ్సిందినెండి. యెవుల్నేటంటె యేటి నాబం.. సచ్చినోడినీ అన్నేం, బతికున్నోడినీ అన్నేం. సర్లె మరొద్దునెండి. అయిన ఆ వుజ్జోగాలు మానాటోలికి వత్తాయా యేటి! కూటికి తక్కువోలిం. మరొద్దునె మేట్టారూ.. బలవొంతం సేకండీ – వొగిలీండి.”

చివరిసారిగా వూపిరి తీసుకుని.. కరాఖండిగా చెప్పేసింది పార్వతమ్మ.

సాయంత్రం నాలుగూనలభైకి బడి వదిలిన తర్వాత సరాసరి ఇద్దరు విద్యార్థులను తోడు తీసుకుని పక్కూర్లో వున్న వాళ్లింటికెళ్లాను. చివరిసారిగా చెప్పొద్దామని.. ఈ క్రమంలో గొప్ప తృప్తిని మూడగట్టుకోవాలని ఆశతో వెళ్లేను. తీరా వెళ్లి మాటాడీసరికి పార్వతమ్మ నుంచి ఎదురైన సమాధానం యిది.

విలవిలలాడిపోయేను. కొన్ని రోజుల పాటు మానసికంగా బాధపడ్డాను.

ఎంతో ఆశతో ఆ పిల్లని చదివే ఏర్పాటు చేయాలనుకున్నాను. ఆశాభంగమయింది. మా హైస్కూల్ వూరిని ఆనుకునున్న వూరిలోనే కాలేజీ కూడా వుంది. కనీసం అక్కడేనా ఫీజు లేకుండా చదివేట్టు చేయాలని ఆలోచన. కానీ నిరాశ ఎదురయింది.

పార్వతమ్మతో చివరిసారిగా ఈ సంభాషణ జరిగి ఇంచుమించు ఐదేళ్లయింది.

ఆ రోజు – జిల్లాస్థాయి సైన్స్ ఫెయిర్ కు స్టూడెంట్స్ ని ప్రిపేర్ చేయిస్తున్నాను.

“మాస్టారూ.. మమ్మల్ని సైన్స్ ఫెయిర్ కి తీసుకుని వెళ్లరా…. !? ఎప్పుడూ మగపిల్లల్నే తీసుకునివెళ్తే – మాక్కూడా రావాలని, పార్టిసిపేషన్ చేయాలని వుంటుంది కదా!”

అడగాల్సిన మాటని సూటిగా నిక్కచ్చిగా అడిగింది.

” నిజమే కదా.. !” అన్నాను. నవ్వేను.

” ఊ.. మరేమి?” అంది.

” …. కానీ.. సైన్స్ ఫెయిర్ మొత్తం మూడురోజులు వుంటుంది కదమ్మా.. రాత్రికి మీరు అక్కడే వుండాలి… మీకు యిబ్బంది అవుతుందేమో!  అని ఆలోచించాను. లేకపోతే మిమ్మల్ని కూడా తీసుకుని వెళ్దూను.”అనునయంగా అన్నాను.

“ఫర్వాలేదు.. మాకేం భయం లేదు. తీసుకుని వెళ్లండి ” చాలా ఆత్మవిశ్వాసంతో అంది. తన పట్ల తనకున్న నమ్మకానికి, మాటతీరుకు ముచ్చటేసింది.

ఒక్కో సంఘటన కళ్లముందు కదులుతుంది.

అది.. జూన్ నెల పదిహేనో తారీఖు. ఎనిమిదో తరగతి క్లాస్ రూం.

హాజరుపట్టి తీసి హాజరు వేస్తున్నాను.

ఎటెండెన్స్ ప్లీజ్. రోల్ నెంబర్ వన్ –  వరలక్ష్మి, టూ – రమ, త్రీ – యశోద.

“ఎవరూ.. యశోద… !” పిల్లల వైపు చూసేను.

తను కూర్చున్న చోటు నుంచి నెమ్మదిగా చేతులు కట్టుకుని నిల్చుంది. లేత ముఖం.

“నువ్వేనా… యశోదా…. !” అడిగేను.

“అవును మాస్టారూ… ” అని ఒద్దిగ్గా జవాబిచ్చింది.

యశోద ఎనిమిదో తరగతిలో కొత్తగా జాయినయింది. అంతకు ముందు ఆరు ఏడు తరగతులు యింకో స్కూల్లో చదివి ఎనిమిదో తరగతికి నేను చెప్తున్న స్కూల్ కొచ్చింది.

ఆ రోజు నుంచి ప్రతి రోజు క్లాస్ రూంలో పాఠం శ్రద్ధగా వినీది. ఒక్కరోజు కూడా క్లాస్ కి ఆబ్సెంట్ అయింది లేదు. క్లాస్ రూంలో వేసిన ప్రశ్నలకు అందరికన్నా ముందు తనే జవాబిచ్చీది. ఒన్ ఆఫ్ ద యాక్టివ్ పార్టిసిపెంట్ ఇన్ మై క్లాస్ రూం.

ఫైనల్ ఎక్జామ్ లో తనే క్లాస్ ఫస్ట్ గా నిల్చింది.

ఎయిత్ క్లాస్ తర్వాత నైన్త్ క్లాస్ లో కూడా అంతే ఏకాగ్రతతో చదివింది.

టెన్త్ కొచ్చింది. ఎయిత్, నైన్త్ లోని ఏకాగ్రతని మించి కష్టపడి చదివింది. సందేహాలొస్తే నివృత్తి చేసుకునీది. సైన్స్ డయాగ్రమ్స్ వేసేటప్పుడు అడిగి మరీ సులువుగా వేయడమెలాగో నేర్చుకునీది.

టెన్త్ పబ్లిక్ ఎక్జామ్స్ లాస్ట్ త్రీ మంత్స్ మరీ ఎక్కువుగా కష్టపడటం వల్ల ఒకటి రెండుసార్లు జొరం కూడా వొచ్చింది. అయినా పట్టుదలతో చదివింది.

టెన్త్ ఎక్జామ్స్ రాసింది.
నెల రోజుల్లో ఫలితాలొచ్చేయి.
స్కూల్ ఫస్ట్.

వేసవి సెలవులు కావడం మూలాన రిజల్ట్స్ నేనే చూసేను. తనకి ఫోన్ చేసి అభినందించేను. పొంగిపోయింది.

“బాగా చదువుకోవాలి. ఇంకా ఇంకా బాగా చదువుకోవాలి. జీవితంలో గొప్ప స్థాయికి వెళ్లాలి. మన జీవితాలలో మార్పుని తీసుకొచ్చేది చదువొక్కటే. నీ కలల్ని నీవు నిజం చేసుకోవాలి.”

ఆనందంతో తనకి చెప్పేను.

నిశ్శబ్దంగా వింది.

” ఊ….. ” అంది.

సెలవుల్లో ఎ.పి.ఆర్.జె.సి ఎక్జామ్ కి అప్లికేషన్ పెట్టించేను. పుస్తకాలు సమకూర్చేను. ఎలా ప్రిపేర్ కావాలో ఏమిటో చెప్పేను. ఎక్జామ్ ముందు రోజొకసారి గుర్తుచేసేను.

” ఊ…. అలాగే……. ” అంది.

ఎక్జామ్ రోజు ఉదయం నా ఫోన్ మోగింది. కొత్త నెంబర్. రిసీవ్ చేసుకున్నాను.

” హలో…. ! ”
” మాస్టారూ.. నేను… ”
” ఆ.. ఆ… చెప్పమ్మా…. ”
” నేనూ……… ” చెప్పటానికి సంకోచించింది.
” చెప్పమ్మా!  ఫర్వాలేదు…. ”
” నేనూ.. ఎక్జామ్ రాయట్లేదండీ.. అమ్మ గారు వద్దనీసేరు…. ”

ఆశ్చర్యపోయేను.

నోట మాట రాలేదు.
” ఏం.. ! ” అన్నాను.
” అంత దూరమెందుకు.. ఆడపిల్లవి..  యిక్కడే దగ్గర్లో చదువుకుందువులే… ” అని అమ్మ అంటుందండి – చెప్పింది.

తన గొంతు భేలగా వినిపించింది.

పెరుగుతున్న చిగుళ్లను గోటితో చిక్కేస్తున్నారేమో.. అన్పించి… వొక నిముషం వూపిరాడలేదు.

నా చేతుల్లోంచి నా కలలేవో చేజారిపోతున్నట్టగనిపించింది.

ఏం చేయాలి? ఎలా? ఎందుకిలా… !
తలపట్టుకున్నాను.

ఏం చేయలేకపోయేను.

విద్యార్థుల భావి జీవితంపై నాకెప్పుడూ బెంగగా వుంటుంది. అయినా నేను ఆశాజీవిని. నా ఆశలని ఎప్పటికప్పుడు బతికించుకుంటుంటాను. నాపై నాకు చాలా నమ్మకం.

యశోద అమ్మగారితోనూ మాట్లాడేను.

” ఆ పరీచ్చ వొద్దునె మేట్టారూ.. దాపులేని బిడ్డ.. దానికి వున్నా పోయినా నానొక్కత్తినే… అంతలేసి దూరమెల్లి అదేటి సదుతాది. మరేటి అనుకోమాకండి మేట్టారూ….. ”  కొద్దిగా బింకంగానే మాటాడేరు.

విన్నాను.

” పోనీ.. తర్వాతేమైనా ఉపయోగపడగలనేమో, అలాంటి అవకాశం వుంటుందిలే… ” అని నాకు నేను సర్దిచెప్పుకున్నాను.

ఆ తర్వాత నెల రోజులపాటు మాట్లాడలేదు. ఎండాకాలం. లోపల యశోద తారట్లాడుతూనే వుంది. ‘తన చదువెలా… ?’ అనే ప్రశ్న వెంటాడుతుండీది.

వేసవి సెలవులయిపోయేయి. జూన్ లో బడులు ప్రారంభమయ్యేయి.

బడికెళ్లిన మొదటి రోజే – తనతో పాటే చదువుకున్న స్నేహితుల్ని వాకబు చేసేను.

” ఇంటర్ లో జాయినయ్యిందా…. ?” అని.

.. అయినట్టు చెప్పేరు.

సంతోషమేసింది.

తర్వాత కొన్ని రోజులకు యశోద కాలేజీకి వెళ్లటంలేదని తెలిసింది. తన వూరి పిల్లలు చెప్పేరు.

” ఏం….. ! ” అడిగాను.

రోజూ కాలేజికి వెళ్లిరాటాకి బస్సుకి టికెట్ డబ్బులు చాలట్లేదని చెప్పారు. ఏమో ! బస్సు పాస్ వుంటుంది కదా – అనుకున్నాను. ‘ బస్సు పాస్ కి కూడా డబ్బులుండాలి కదా ‘ గుర్తొచ్చింది. తను కాలేజికి వెళ్లకపోటానికి కారణమేటో అర్థమవసాగింది.

” అయ్యో…. ! ” అనుకున్నాను.

మళ్లీ వారం రోజులు పోయిన తర్వాత పిల్లలను అడిగేను.

“ఊహూ… వెళ్లటలేదు.. మాస్టారూ… ఇంటి దగ్గరే వుంటుంది” అని చెప్పేరు.

బాధ పడ్డాను. దిగులేసింది.

“తన కోసం ఏం చేయగలను?  ఎలా సాయపడగలను? ” సతమతమయ్యేను. నిల్చున్నచోట నిలబడలేకపోయేను. ” ఏం చేయాలి?  ఏం చేయాలి? ” రాత్రిపగలూ ఒకటే ప్రశ్న. ఇంటి వద్దా, బడిలోనూ అదే ప్రశ్న వెంటాడీది.

ఒకట్రెండుసార్లు వాళ్లమ్మ గారికి ఫోన్ చేసేను. జవాబు లేదు. నైరాశ్యం ఆవరించీది.

ఒకసారి మాట్లాడేరు. సరైన ప్రతిస్పందన లేదు.

ఒక రోజు వాళ్లింటికే వెళ్లాను.

ఇంటివద్ద యశోద కనిపించలేదు. పార్వతమ్మతో చివరి సంభాషణ అప్పుడే జరిగింది.

కొత్త తరగతి గదులు. కొత్త విద్యార్థులు.

నా బడిపనిలో నేను పడిపోయేను. ఉదయం ఏడింటికి ఇంటి వద్ద బయలుదేరటం మళ్లీ సాయంత్రం ఏడింటికి ఇంటికి చేరడం. బడి తప్ప పిల్లలు తప్ప యింకోటి లేకపోయింది. రోజులు గడిచిపోతున్నాయి. పాఠం చెప్తున్నప్పుడు ఎవరేనా విద్యార్థి లేచి ఠక్కున జవాబు చెప్పినా, సందేహాల నివృత్తి కోసం ఉత్సాహంగా వొచ్చినా – ఆ పిల్లే గుర్తొచ్చీది.

అక్టోబర్ ఫస్ట్ వీక్ లో క్వాటియర్లీ ఎక్జామ్స్ అయ్యాక – స్కూళ్లకు దశరా సెలవులిచ్చేరు. సెలవుల్లో టెన్త్ క్లాస్ పిల్లలకి స్పెషల్ క్లాస్ లు నడిచేయి.

పదిరోజుల తర్వాత – స్కూళ్లు రీ ఓపినింగ్ అయ్యేయి.

ఒక అమ్మాయెవరో వచ్చి చెప్పింది.

“మాస్టారూ.. యశోద వాళ్లమ్మతో పాటూ పత్తి పనికెళ్తుందండీ ” అని.

పత్తి తోట కాపుకొచ్చినతర్వాత – ఎండిన పత్తికాయలను ఏరి బుట్టలోకి వేస్తుంటారు. గోనె మీద పరిచి రెక్కలను తొలగించి లోపలి తెల్లని పత్తిదూదిని వేరు చేస్తుంటారు. ఈ పనికి మహిళలు మాత్రమే వెళ్తుంటారు. కూలి తక్కువే. రోజుకి నూటనలభై, నూట ఏభై ఇస్తారు.

ఎన్ని రోజులని పత్తి పని వుంటాది?  ఎన్ని రోజులని వెళ్తారు? ఆకలి యాత్రకి అంతూపొంతూ లేదు. అవిరామం.

స్కూలు నడుస్తుంది.

ఈలోగా యూనిట్ టెస్ట్ త్రి అయిపోయి.. పిల్లలు హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతున్నారు.

డిసెంబర్ నెల మొదటి వారంలోనే యూనిట్ టెస్ట్ అయిపోయింది. జనవరి రెండు నుంచి హాఫ్ ఇయర్లీ ఎక్జామ్స్.

ఎక్జామ్స్ కి ప్రిపేర్ అవుతున్న పిల్లలని చూస్తూ వున్నప్పుడల్లా.. ముందుటేడు పరీక్షల కోసం పూర్తి సమయం ఏకాగ్రతతో చదువుకునే యశోదే కనిపించీది. చాలా దుఃఖమేసీది. ఎంతో తెలివైన పిల్ల కనీసం ఇంటర్ మీడియట్ పూర్తి కాకుండా చదువు ఆగిపోయిందే అనే దిగులు.

నా పనిలో వున్నా – ఎప్పటికప్పుడు యశోదని గురించి వాకబు చేస్తూనే వున్నాను.

యశోద వూరి పిల్లలే చెప్పేరు.

” మాస్టారూ.. యశోద టైలరింగ్ నేర్చుకోడానికి నెల రోజుల నుంచి వెళ్తుందండీ…. ” అని.

నా ప్రమేయం లేకుండానే రెప్పలు మూసుకున్నాయి. లోపల కన్నీళ్లు సుడులు తిరిగేయి. గొంతు పొడిబారినట్టిగయింది.

చివరికి ఏం చేయలేకపోయాననే వేదన గుండెల్లో గునపంతో పొడుస్తున్నట్టుగనిపించింది.

సంక్రాంతికి టైలర్స్ కి గిట్టుబాటు.. కొత్త బట్టలు కుట్టించుకోడాకి అందరూ టైలర్ షాపులకి ఎగబాకుతుంటారు. ఏ కాలానికి ఆ కాలం బతుకు తెరువులో చిక్కుకున్న యశోదని తలచుకుంటే కన్నీరు కట్టలుతెచ్చుకుంటుంది. యశోద కష్టం చదువుకు ఉపయోగపడలేకపోయిందని దిగులు నిలువనీయలేదు.

ఏం చేయగలను?

ఆనాడు బడి నుంచి సరాసరి వాళ్లింటికెళ్లి వాళ్లమ్మతో ఆడిన మాటలే చివరివి. ఆ తర్వాత వాళ్లమ్మతో గాని, యశోదతో గాని మాట్లాడింది లేదు.

మళ్లీ మాట్లాడి కొత్త విద్యాసంవత్సరంలోనేనా కాలేజ్ లో జాయిన్ అయ్యేట్టు చూడాలని – అవసరమైతే బతిమాలాడాలని – అనుకున్నాను.

మార్చి నెలలో ఇంకో విషయం తెలిసింది. యశోదకి పెళ్లి ఖాయమయిందని.. మే నెలలో పెళ్లి. టైలర్ వృత్తిగా జీవిస్తున్న ఒక దూరపాయనతో పెళ్లిని కుదిర్చేరు.

ఆశలు అడియాశలయ్యాయి.

ఒక ఏడాది పాటు నాలో రేగిన ఘర్షణంతా ఒక్కసారిగా కూలిపోయింది. నా లోపల ఘర్షణ జరిగినప్పుడు కూడా ఆశలు సజీవంగానే వుండీవి. ఘర్షణంతా కోల్పోయిన తర్వాత – అస్సలు మోయలేని బరువేదో మీదొచ్చి పడి – యిక వూపిరి ఆడనట్టగయ్యింది. నిశ్శబ్ద చీకటిగుహ నా చుట్టూ మొలుస్తున్న అనుభవం. స్థితి.

ఇంకేదయినా చేయడానికి ఏముంది ?

చదువొక్కటే ఆశల్ని వెలిగించే దీపమని అన్నాను కదా నేను. జీవితంలో గొప్ప స్థాయికి వెళ్లాలి వెళ్లాలి అని చెప్పాను కదా నేను. బాగా చదువుకుంటే ఈ డబ్బులతో పనేమి వుండదమ్మా…… అని నేనే కదా చెప్పాను. మనం ఇష్టంతో ఆత్మవిశ్వాసంతో ఏ పని చేసినా – ఎన్ని ఆటంకాలెదురైనా జయిస్తామని నేనే కదా అన్నది.

యశోద చదివేట్టు చేయటానికి నా శక్తి చాల్లేదా ?  అశక్తున్నయిపోయానా ? ఇంకోదారి వుండొచ్చేమో ?! వెతకలేకపోయానా? ప్రశ్నల మీద ప్రశ్నలు, ప్రశ్నల మీద ప్రశ్నలు – పాలుపోలేదు.

ఏ ఆడపిల్లకేనా పెళ్లితో కొన్ని సమస్యలు గట్టెక్కుతాయనే మాటలో నాకు నమ్మకం లేదు. నమ్మను కూడా. కొత్త సమస్యలు రావని నమ్మకమివ్వగలరా ఎవరేనా – ఆడపిల్లల ఆర్థిక స్వావలంబన గురించి ఆలోచిస్తుంటాను నేను. భావి జీవితం పట్ల ఎంత ఆశని నూరిపోయగలను.. వ్యాకులత పడుతుంటాను!

మరి నేను ఓడిపోయేనా ?

సంవత్సరాలు దొర్లిపోయాయి. యశోద గాయంగానే మిగిలిపోయింది.

కొత్తగా ఎనిమిదో తరగతిలోకొచ్చిన పిల్లలకి పాఠం చెప్తున్నాను. తరగతి గది చాలా నిశ్శబ్దంగా వుంది. పిల్లలంతా ఏకాగ్రతతో వింటున్నారు.

క్లాస్ అయిపోయిన తర్వాత విద్యార్థులతో మాట్లాడటం ఇష్టం. నిజానికి పాఠం చెప్పటం వొక నెపం మాత్రమే నాకు – విద్యార్థులతో చేసే సంభాషణ ముఖ్యమైనదిగా భావిస్తాను. విద్యార్థుల కుటుంబ నేపథ్యాలూ, వూరి నేపథ్యాలూ – వాళ్ల ఆలోచనలూ, ఆకాంక్షలూ తెలుసుకోటం తరగతి గదిలో చెయ్యాల్సిన అత్యంత ప్రధానమైన పని అని నమ్ముతున్నవాణ్ణి నేను.

తొలి నుంచి ఈ పనిని చేస్తున్నాను.

యశోద గురించి పిల్లలకి చెప్పేను.

పిల్లలంతా కన్నీళ్లు పెట్టుకున్నారు.

మరుసటి రోజు యధాతథంగా తరగతిగదిలో పిల్లలతో మాట్లాడుతున్నప్పుడు –

” మాస్టారూ.. యశోదను గురించి మా అమ్మ గారికి చెప్పేనండీ… అమ్మా బాధపడింది. నువ్వు ఎంత వొరకు చదవాలనుకుంటే అంత వొరకూ నిన్ను చదివిస్తానమ్మా.. బెంగపడొద్దు… మాస్టార్ కి చెప్పు – అంది ”  అని ఎగురుతున్న కళ్లతో ఆనందంతో విజయ చెప్పింది. విజయ కూడా చదువు పట్ల గొప్ప శ్రద్ధ వున్న విద్యార్థిని. తన మాటల మీద, చేతల మీద పూర్తి నమ్మకం, ఆత్మ విశ్వాసం వున్న విద్యార్థిని.

ఏదైనా అనుకుంటే సాధిస్తుంది.

విజయ చెప్పిన మాటతో తృప్తిగా అనిపించింది.

నా కలలు బతికే వున్నాయనిపించింది.

ఆరేళ్ల కిందటి.. “మాస్టారూ.. చదువుకోవాలంటే కష్టపడాలండీ… ! ” అని యశోద అడిగిన ప్రశ్న – ఆరేళ్ల తర్వాత కూడా పిల్లల విషయంలో ఏమాత్రం ఏమరుపాటుగా వున్నా – హెచ్చరిస్తుంటుంది నన్ను.

ప్రతిసారి సరైన జవాబునివ్వడానికే ప్రయత్నిస్తున్నాను.

*

బాలసుధాకర్ మౌళి

జూన్ 22, 1987 లో పోరాం గ్రామం, మెంటాడ మండలం, విజయనగరం జిల్లాలో పుట్టాను. ఎనిమిదిన్నరేళ్లుగా ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాను. సమాజం తరగతిగదిలో సకల అంశాలతో ప్రతిబింబిస్తుందని నా నమ్మకం. కవిత్వమంటే ఇష్టం. 2014 లో 'ఎగరాల్సిన సమయం', 2016 లో 'ఆకు కదలని చోట' కవితా సంపుటాలను తీసుకుని వచ్చాను. కథంటే అభిమానం. మొదటి కథ 'థింసా దారిలో' 2011లో రాశాను. మొత్తం ఐదు కథలు. ఇన్నాళ్ల నా పాఠశాల అనుభవాలను విద్యార్థుల కోణంలోంచి రాజకీయ సామాజిక ఆర్థిక అంశాలను చర్చిస్తూ కథలుగా రాయాలని ఆకాంక్ష. గొప్ప శిల్పమున్న కథలు రాస్తానో లేదో గాని - ఇవి రాయకపోతే వూపిరాడని స్థితి.

28 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

 • Very moving narration mouli.yashoda haunts me , takes up my subsided anger . yashoda an anger sharpener.

 • బాగుంది మౌళీ .. బాగా రాసావు. నువ్వు మంచి కవి వే అనుకున్నా ఇన్నాళ్లూ – గొప్ప మనసున్న మాష్టారువని ఈ కథ వల్ల తెలిసింది – శుభాకాంక్షలు.

  • మీ కథల్లోని తడితనం ఈ కథలకి కాస్తా అంటితే చాలు..

 • కధ చాలా బాగుంది. మన నిస్సహాయతను గుర్తుచేసే ఎంతోమంది పిల్లలు గుర్తొచ్చారు.

 • కంటతడి పెట్టించిన కథ మౌళిగారు.
  చాలా బావుంది.

  • థాంక్యూ సృజన్ గారూ.. వాస్తవ జీవితం భయంకరమైనది.

 • చదువు’కొనే’ వారి మధ్యన చదువుకునే వారి ఆరాటం …వారిని చదివించాలన్న తపన కలిగిన మనిషి మనసు ….మనసుకు హత్తుకునేలా రాసినందుకు అభినందనలు.

 • గొప్ప ఉపాధ్యాయులు మీరు..
  మీ అనుభవాలు, ఆలోచనలు అందరికీ చేరాల్సిన అవసరం ఉంది..
  పిల్లల సమస్యలు, సమాజం వైపు ఇబ్బందులు, ఉపాధ్యాయుల కష్టాలు… అన్ని కోణాల కధలు మీరు ఇవ్వగలరు..
  నిస్సహాయత దహించివేస్తుంది.

  • రాస్తాను రాజశేఖర్ గారూ. బడి కేంద్రంగా జీవితాంతం కథలు రాయొచ్చు.

   లోగో రూపొందించినందుకు కృతజ్ఞతలు.

 • నిజానికి పాఠం చెప్పటం వొక నెపం మాత్రమే నాకు – విద్యార్థులతో చేసే సంభాషణ ముఖ్యమైనదిగా భావిస్తాను. విద్యార్థుల కుటుంబ నేపథ్యాలూ, వూరి నేపథ్యాలూ – వాళ్ల ఆలోచనలూ, ఆకాంక్షలూ తెలుసుకోటం తరగతి గదిలో చెయ్యాల్సిన అత్యంత ప్రధానమైన పని అని నమ్ముతున్నవాణ్ణి నేను.

  గ్రేట్ లైన్స్. అవును అది బాగా తృప్తినిచ్చే పని కూడా…. ప్రతి టీచర్ కు అనుభవమే… కానీ చాలా సందర్భాలలో టీచర్లు అశక్తులు . … అనేక కారణాలు. బాగా పట్టుకొన్నారు కథలో

  అభినందనలు

 • మౌళీ..కథ బాగుంది.
  విషయం పాతదే అయినా చెప్పేవిధానంతో మెప్పించావు.
  అభినందనలు.

 • ఈ మధ్య నన్నింత కదిలించిన కథ లేదు. కథనం ఎలాగుందని ఆలోచించకు. మనసుని ఎప్పుడూ ఇలాగే ఉంచుకొని నీ పాఠశాలను చూడటం కొనసాగించు. పేరు కోసం ఆలోచించకు. నా ప్రస్తుత నిరాశామయ సాహిత్య సమాజ దర్షనంలో నీవు నాకు ఆశ కలిగించావు.

 • ఈ మధ్య నన్నింత కదిలించిన కథ లేదు. కథనం ఎలాగుందని ఆలోచించకు. మనసుని ఎప్పుడూ ఇలాగే ఉంచుకొని నీ పాఠశాలను చూడటం కొనసాగించు. పేరు కోసం ఆలోచించకు. నా ప్రస్తుత నిరాశామయ సాహిత్య సమాజ దర్షనంలో నీవు నాకు ఆశ కలిగించావు.

  • మీ మాట చాలా ఆనందం కలిగించింది.. మీరు చెప్పినవి అమలుచేస్తానండీ….

 • Commitment ఉన్న ప్రతి ఉపాధ్యాయులు ఎదుర్కొనే వేదనే..హృద్యమైన కథగా మలిచారు..ప్రతి సంవత్సరం ఇలాంటి ఆరాటమేదో ఉత్సాహంగా మొదలై నిర్వేదంగా మిగిలిపోతుంది..

 • మీలో కవేకాదు
  కధకుడు కూడా ఉన్నాడన్నమాట..
  యాత్ర కొనసాగించండి..

 • యశోద జీవితంలో జరిగిన పోరపాటు తరువాతి పిల్లలకు కనువిప్పు కలిగించేలా చేసిన ప్రయత్నం బాగుంది. అందుకే జీవితాలనే పాఠాలుగా నేర్పగల్గిన మీ వంటి ఉపాధ్యాయులు ఇప్పటి తరానికి చాల అవసరం. మీ అనుభవాలను ఇలాగే అక్షరీకరిస్తే అక్షరం విలువ రెట్టింపవుతుంది.

 • baagundi katha . vedana ardhamaindi. manachuttoo unna jeevithamlonoi dukhanni enthapatuukunnamannadi mukhyam. ilaanti kathale kaavaalippudu.

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు