మానవత్వం పరిమళించే హృదయస్పందన

హారం పంచడం అనేది అంత సాఫీగా జరిగిన వ్యవహారమేమీ కాదు. ప్రభుత్వం వైపు నుంచీ వెంటవెంటనే మార్చేసే ఎన్నోరకాల నిబంధనల్ని ఎదుర్కోవాల్సి వచ్చింది. మానవ హక్కులవేదిక జంటనగరాల ఉపాధ్యక్షుడు 36 సంవత్సరాల బిలాల్ మాలిక్ లాక్ డౌన్ సమయంలోనే కాక దాదాపు అనేక సంవత్సరాలనుంచీ కొన్ని ప్రభుత్వ ఆసుపత్రుల దగ్గర అక్కడ వేచివుండే పేద రోగులకు, వారి తరఫు బంధువులకు భోజనం అందిస్తున్నాడు. ఈ పనిలో అతని కృషికి చేయూత నందించేవారు ఎంతోమంది. లాక్ డౌన్ లో అతను తన పనిని మరింత విస్తృత పరచాల్సి వచ్చింది. ఈ పని మీదే అతను బయటకు వస్తే లాక్ డౌన్ సమయంలో బయటకు వస్తావా, అసలు మీవల్లే వైరస్ పెరుగుతోంది అంటూ ఒక విద్వేషపు ధోరణితో పోలీసులు విపరీతంగా కొట్టారు. ఆరోగ్యపరమైన అంశాన్ని పోలీసులు శాంతి భద్రతల అంశంగా తీసుకోవటం వల్ల వచ్చిన సమస్య ఒకటయితే, మతంతో ముడిపెట్టి చూడటం అనేది ఇంకో కోణం. అవసరాల కోసం బయటకు వచ్చినవారి మీద, ఊర్లకు బయలుదేరిన వలస కార్మికుల మీద పోలీసు లాటీలు లేచాయి. పరిథులు దాటి బూతులతో మాట్లాడారు. ప్రభుత్వాధినేతలు అనాలోచితంగా ‘అవసరమైతే షూట్ ఎట్ సైట్ ఆర్డర్లు ఇవ్వాల్సి వస్తుంది, మర్కజ్ వల్లే ఇదంతా’ అంటూ చేసిన ప్రకటనలు పరిస్థితిని మరింత జటిలంగా చేశాయి. అయితే, ఇలాంటి కొన్ని విపరీత చేదు అనుభవాలున్నప్పటికీ, చాలా చోట్ల కింది స్థాయి పోలీసు ఉద్యోగులు నడిచివెళుతున్న ప్రజలను తామే దగ్గరుండి లారీలను ఆపి ఎక్కింఛి పంపించటంలో ఎంతో సహాయ పడిన సంఘటనలు కూడా వున్నాయి. పోలీసు వ్యవస్థగా అధికారంతో ప్రయోగించే హింస, నిర్బంధాన్ని వేరుగా, వ్యక్తులుగా వారు చేసే సహాయాన్నీ వేరు గానే అర్థం చేసుకోవాలి.

ప్రభుత్వానికి పంపించిన విజ్ఞప్తులు:

నిజానికి ఈ సమస్యలన్నిటినీ పట్టించుకుని పరిష్కరించవలసింది ప్రభుత్వం. వైరస్ మీద యుద్ధం అంటూ లాక్ డౌన్ అనే నిర్ణయం, ఇప్పటికే దిగజారిన దేశ ఆర్థిక వ్యవస్థను మరింత కోలుకోలేని దెబ్బ తీసింది. కోట్లాదిమంది శ్రామికులు రాత్రికి రాత్రి తమ ఉపాధి నుంచీ పెకిలించి వేయబడ్డారు. వీరి సంఖ్య ఎంత వుంది అనేది ఏ ప్రభుత్వం దగ్గర కూడా సరైన గణాంకాలు లేవు. వారి శ్రమను నిర్లజ్జగా కొల్లగొట్టటమే తప్పించి అసంఘటిత కార్మికుల జీవనభద్రత గురించి ఏమాత్రం పట్టించుకోలేదు. ఇప్పటికి వచ్చిన అంచనా ప్రకారం దేశం మొత్తం మీద దాదాపు నలభై కోట్లమంది వలస కార్మికులుగా జీవిస్తునారు. కానీ, వారి జీవన భద్రత గురించిన విధానమే కరువయింది. ఒకపక్క విస్తృతమవుతున్న నగరాలు, పట్టణాలు. కానీ, వాటిని తీర్చిదిద్దుతున్న కార్మికుల జీవితాల పట్ల ప్రభుత్వాలు ఏ బాధ్యతా తీసుకోవనేది తేటతెల్లమయిపోయింది.

ఎన్నో సంవత్సరాలుగా ప్రజా సమూహాలతో క్షేత్ర స్థాయిలో పనిచేస్తున్న కార్యకర్తలుగా ప్రధానంగా ప్రభుత్వం తక్షణం బాధ్యతగా స్పందించాల్సిన అంశాలపై దృష్టి పెట్టాం. ఆహారం, రేషన్ పంపిణీ, ఆరోగ్య స్థితిగతులు, వలస కార్మికుల ప్రయాణం…ఇలా అనేక అంశాల మీద ప్రభుత్వ యంత్రాంగానికి మెమొరాండంలు ఇస్తూ వెళ్ళాము. మొత్తం లాక్ డౌన్ సమయంలో ఈ గ్రూప్ నుంచీ కనీసం 25-30 మెమొరాండం లు వెళ్ళాయి. వీటిని రాయటంలో, సమాచారాన్ని సేకరించటం లో, అందరి అభిప్రాయాలకోసం పంపించడంలో ముఖ్యపాత్ర సునీత తీసుకుంది. ఒకపక్క రేషన్ పంపిణీలో, కోవిద్ సమయంలో తీసుకోవాల్సిన ఆరోగ్య సూచనల పోస్టర్ల తయారీ బాధ్యతలో, ట్రావెల్ సపోర్ట్‌లో వుంటూనే ప్రభుత్వానికి పంపించే మెమొరాండంలను రాసే బాధ్యతను కూడా నెత్తినేసుకుంది. తనతో పాటుగా మీరా సంఘమిత్ర, ఉష సీతాలక్ష్మి, అనువాదాలలో ఆషా, వసంతలక్ష్మి ఇంకా మరెంతోమంది పనిచేశారు.

షెల్టర్ హోముల ఏర్పాటు:

ఒక పక్క లాక్ డౌన్ తో పోలీసు నిర్బంధం ఉన్నప్పటికీ వలస కార్మికుల నడక ఆగలేదు. వారికి తాత్కాలిక షెల్టర్ హోముల ఏర్పాటుకు ప్రభుత్వానికి ఒక మెమొరాండం ఇచ్చిన తర్వాతే అక్కడి నుంచీ అడుగు పడింది. దీనివలన, అంకురం సంస్థ నుంచీ సుమిత్ర బోగారంలోని తమ ఆఫీసు ప్రాంగణంలో అనేకమందికి వలస కార్మికులకు విడతలు విడతలుగా ఆశ్రయం కల్పించగలిగారు. రాతికి రాత్రే లాక్ డౌన్ ప్రకటించడంతో పాటు, గాంధి హాస్పిటల్ ను కోవిద్ హోస్పిటల్ గా మార్చటంతో అక్కడ ఇతర సమస్యలతో చికిత్స పొందుతున్న అనేకమందిని డిశ్చార్జ్ చేయటంతో వారంతా ఎటూ వెళ్ళలేక రోడ్డు మీదే ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆపరేషన్లు అయినవాళ్లు, ప్రసవమయిన స్త్రీలు చంటిబిడ్డలతో రోడ్డుమీద్ నిలబడాల్సి వచ్చింది. ఊర్లు చేరటానికి రవాణా లేదు. వారితో పాటు అనేకమంది పనులు కోల్పోయిన కార్మికులు. అమన్ వేదిక సంస్థ దాదాపు రెండువందలమందికి లాలాగూడ స్టేడియంలో తాత్కాలిక షెల్టర్ హోం నడపటానికి బాధ్యత తీసుకుంది. అనురాధ, అంబిక, ఇందిర, ఫిరోజ్ ఇంకా అనేకమంది ఆ ఏర్పాట్లలో తలమునకలైపోయారు. షెల్టర్ హోం లో వారందరికీ ఆహారం, నిత్యావసర వసతులతో పాటు వారికి అవసరమైన బట్టలు, తువ్వాళ్ళు, దుప్పట్లు, బ్రష్‌లు, పేస్టు, సబ్బులు, దువ్వెనలు ఇలా అన్నిటి కోసం అందరం నగరం నలుమూలలకూ పరుగులు పెట్టాల్సి వచ్చింది. దుకాణాలు అన్నీ మూతబడటంతో తక్షణ అవసరాల కోసం స్నేహితులు, బంధువుల దగ్గరనుంచీ సేకరించి ఇచ్చాం. మరోపక్క కొంపల్లిలోని ఒక ఫంక్షన్ హాల్లో మరో రెండువందల మంది కార్మికులని పోలీసులు పెట్టారు. అక్కడ అవసరమైన ఆహార వస్తువులను, గ్యాస్ సిలిండర్లతో సహా సమకూర్చటంలో శరత్ దావల, వసుధ బాధ్యత తీసుకున్నారు. లాక్ డౌన్ నాలుగో దశకు వచ్చేసరికి అమన్ వేదిక సంస్థ దాదాపు ఐదు, ఆశ్రిత సంస్థ ఒకటి చొప్పున తాత్కాలిక షెల్టర్ హోమ్ లను మే నెల చివరి వరకూ నిర్వహించాయి.

రేషన్ పంపిణీ:

ఇక్కడ మరో ముఖ్యమైన అంశం గురించీ ఇక్కడ ప్రస్తావించుకోవాలి. నగరంలో చిక్కుబడిపోయిన కార్మికుల డేటా సేకరించటం మొదలుపెట్టాం. వారందరికీ ఆహారం పెద్ద సమస్య. అందరూ ఏరోజు సరుకులను ఆరోజు కొనుక్కుని గడిపేవారే! మా దృష్టికి వచ్చిన వారికి వివిధ రకాలుగా రేషన్ అందిస్తూ వస్తున్నాము. వలస కార్మికులే కాకుండా, స్థానికంగా వుండే పేద అసంఘటిత సమూహాల ప్రజలు కూడా ఎంతోమంది రేషన్ అందక ఇబ్బందులు పడుతున్నారు. మేమూ ఈ పనిలో పాలుపంచుకుంటామంటూ ముందుకు వచ్చినవారు అంజు ఖేమాని, సి.వనజ, వి. జ్యోతి, కృష్ణ కుమారి, సుమాంజరి తదితరులు. తమ స్నేహితులు, బంధువులు ఇచ్చిన విరాళాలతో ఒక్కో కుటుంబానికి నెలరోజులు సరిపోయేలా సరుకులు కొని పంచడం మొదలుపెట్టారు. సుజాత సూరేపల్లి, దీప్తి(వరంగల్) ఇంకా అనేకమంది కూడా అప్పటికే తమ తమ ప్రాంతాల్లో రేషన్ అందించడం ప్రారంభించారు. ఈ పనులన్నీ కూడా మార్చి 30 నాటికి ఊపందుకున్నాయి. కోవిద్-19 లాక్ డౌన్ అడ్వోకసి గ్రూప్ విస్త్రుతమవుతూ వచ్చింది.

దీప్తి మాట్లాడుతూ, “మా చిన్నప్పటినుంచీ స్లమ్స్ లో జీవితాల గురించి ప్రత్యక్షంగా చూస్తూనే పెరిగాను. ఒక్క వారం రోజులు పనిలేకపోతే ఎంత సమస్యో నాకు తెలుసు. వరంగల్ లో మా ఇంటి దగ్గరున్న ఆటో డ్రైవర్ల కుటుంబాల వాళ్లు పనిలేక గడవటానికి ఇబ్బందిగా వుంది అని చెప్పారు. నిజానికి వాళ్ళందరూ కూడా పనిచేసుకుంటూ గౌరవంగా బతుకుతున్నవాళ్ళు. అలానే మాకు దగ్గరలో సంచారజాతుల వాళ్ళు వున్నారు. నేను, ఒకరిద్దరు స్నేహితుల సాయంతో వరంగల్‌లో 900 మంది కుటుంబాలకి సహాయం అందించగలిగాను” అని చెప్పింది. రేషన్ పంచే క్రమంలో అందరికీ ఎన్నో రకాల పరిశీలనలూ, అనుభవాలు. పెద్ద సమస్య ముందుగా రేషన్ అవసరమయిన వాళ్ల సమాచారం సేకరించుకుని, ముందే పేర్లు రాసుకుని క్రమ పద్ధతిలో వెళ్ళినా గానీ, అక్కడ మరికొంతమంది నుంచీ ఇవ్వమనే వత్తిడి వుంటుంది. ఎవ్వరినీ కాదనలేని పరిస్థితి, అలా అని అందరికీ ఇవ్వలేని పరిస్థితి కూడా! ఒక్కోసారి, స్థానిక ప్రజల అసహనాన్ని మాటల ద్వారా ఎదుర్కోవాల్సి వచ్చేది. కానీ, ఎక్కడా కూడా పరిస్థితులు అదుపు తప్పే విధంగా మారలేదు. నిజానికి, మేమందరం వెళ్లింది మామూలుగా ఎంతో సమస్యాత్మకంగా పేరు పడ్డ ప్రాంతాలే. ఉదాహరణకు, హిమాయత్ నగర్ లోని ఫరీద్ బస్తీలో దాదాపు ఐదు వందలకు పైగా జనాభా వుంటారు. రేషన్ కావాలని ఆ బస్తీ నుంచి విజ్ఞప్తి రావటంతో వనజ అక్కడ సమయం కేటాయించి వంటిచేతి మీద సర్వే చేసి అందరికీ అవసరమైన రేషన్‌ని సమీకరించగలిగింది. పెద్ద బస్తీ అవటంతో, రేషన్ పంపిణీ ఫలానా రోజు చేస్తామని స్థానిక పోలీస్ స్టేషన్ కు సమాచారం ఇచ్చి వెళ్లారు. కేవలం ఇద్దరంటే ఇద్దరు కానిస్టేబుళ్లు వచ్చారు. స్థానిక రాజకీయ నాయకులు కొంత హంగామా చేయబోయారు కానీ కుదరలేదు. ప్రజల సహకారంతో వనజ తను ఒక్కతే నిలబడి ఏ రకమైన ఘర్షణ లేకుండా క్రమపద్ధతిలో రేషన్ పంచగలిగింది. ప్రతిఒక్కరికీ ఇలాంటి ఎన్నో అనుభవాలను వున్నాయి. వాటన్నిటినీ నమోదు చేయవలసిన అవసరం వుంది. జ్యోతి అనుభవం కూడా దాదాపు ఈ విధంగానే వుంది. తను పెద్ద మొత్తంలో అంటే వందా రెండు వందలమందికి రేషన్ పంచాల్సి వచ్చినప్పుడు స్థానికంగా వుండే ప్రజా సంఘాల కార్యకర్తల సహాయం తీసుకున్నానని చెప్పింది.

 ‘సహాయ’ సామాజిక సంస్థల ఉమ్మడి రేషన్ పంపిణీ కార్యక్రమం:

ఈ లోపల తెలంగాణా సోషల్ ఇంపాక్ట్ గ్రూప్ కార్పొరేట్ సంస్థల నుంచీ వచ్చిన విరాళాలతో వలస కార్మికులకు రేషన్ అందించటానికి ముందుకు వచ్చింది. అసలు సమస్య ఏమిటంటే పెద్ద ఎత్తున సరుకులను కొంటే ఎక్కడ వాటిని నిల్వవుంచాలనేది పెద్ద ప్రశ్న. ఫంక్షన్ హాల్స్ లాంటివి మూతబడి వున్నాయి. అవి తెరిచినా గానీ ఉచితంగా ఇచ్చేవాళ్ళు ఎవరు వుంటారు? అదిగో, అప్పుడు మేమున్నామంటూ సెయింట్ ఆన్స్ సిస్టర్స్, మాంట్ ఫోర్ట్ బ్రదర్స్ ముందుకు వచ్చారు. వారి సహకారంతో విజయనగర్ కాలనీ సెయింట్ ఆన్స్ స్కూల్, లిటిల్ ఫ్లవర్ ప్రైమరీ స్కూల్ ప్రాంగణాలు ఈ బృహత్తర కార్యక్రమానికి వేదికగా నిలిచాయి. అవసరంలో వున్న వలస కార్మికులకు నెలకు సరిపడే విధంగా సరుకులను పంపిణీ చేయడానికి ‘సహాయ’ పేరుతో కృషి ప్రారంభమైంది. చైల్డ్ రైట్స్ యాక్టివిస్ట్ వర్షాభార్గవి సమన్వయకర్తగా, నేను, ఖలీద, అంబిక, రవి కన్నెగంటి, సంతోష్, షకీల్ బృందంగా పని మొదలుపెట్టాం. తన ఇంటికి దగ్గరే అవటంతో నేనూ భాగమవుతానంటూ కవిత పులి వచ్చింది. నిజానికి, కవిత చాలా ముందు నుంచే వాలంటీర్ గా వస్తానంది కానీ, తన ఆరోగ్య రీత్యా, రెండేళ్ల క్రితం జరిగిన కిడ్నీమార్పిడి ఆపరేషన్ని దృష్టిలో పెట్టుకుని బయటకు రావొద్దని ఆపుతూ వస్తున్నాము. కానీ, ధైర్యం చేసి వచ్చి వారం రోజులపాటు ఆ పనిలో సీరియస్ గా పాల్గొంది.

ఈ కృషిలో మాకు తోడుగా, భరోసాగా అనేకమంది యువ వాలంటీర్లు. కొద్దిరోజులు సెయింట్ ఆన్స్ లో ఈ పని నడిచిన తర్వాత ఆబిడ్స్ లోని లిటిల్ ఫ్లవర్ ప్రైమరీ స్కూల్ వేదికగా ఈ కార్యక్రమం టీఎస్ఐజి, రైతు స్వరాజ్య వేదిక నిర్వహణలో కొనసాగింది. పీపుల్ హెల్పింగ్ చిల్డ్రన్, అమూమత్ సొసైటీ, అమన్ వేదిక, కేరింగ్ సిటిజన్స్ కలెక్టివ్, రైతు స్వరాజ్యవేదిక వేదిక, పిడిఎస్యు, దళిత్ విమెన్ ఫోరం, అక్షర ఇంటర్నేషనల్ స్కూల్ నాలుగో తరగతి సిబ్బంది వాలంటీర్లుగా వచ్చి ఆ పనిలో పాలు పంచుకున్నారు. మూటలు మోశారు, పొట్లాలు కట్టారు, లిస్టులు తయారు చేసారు, ట్రక్కుల్లో నిలబడి ఎంతో దూరాలకు వెళ్లి వేలాదిమంది వలస కార్మికులకు రేషన్ పంచి వచ్చారు. ఒక పని అని లేదు, ఎదురుగుండా ఏ పని కనిపిస్తే ఆ పని చేసుకుంటూ వెళ్ళిపోయారు. ముఖ్యంగా చెప్పవలసింది పీపుల్ హెల్పింగ్ చిల్డ్రన్ వాలంటీర్లు సంతోష్ బృందం కృషిని. ఈ కృషి జరుగుతున్నంత కాలం విసుగు అనేది లేకుండా అలా బలమైన దన్నుగా నిలబడ్డారు. ఇలా పనిచేస్తున్న అందరికీ సమయానికి బువ్వ పెట్టి విజయనగర్ కాలని, బైబిల్ హౌస్ ప్రాంతాల్లో వున్న అమన్ వేదిక స్నేహఘర్ హోమ్స్ నిర్వాహకులు ఆదుకున్నారు. వర్షాభార్గవి రూపొందించిన మోడల్ని స్పూర్తిగా తీసుకుని వనపర్తి, సిద్ధిపేట, ఇంకా ఇతర జిల్లాల్లో కూడా ప్రభుత్వ అధికారులు అదే తరహాలో రేషన్ పంపిణీని చేపట్టారు.

 హెల్ప్ లైన్ (99858 33725):

ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఇతర అధికారులతో ఏప్రిల్ 6 న సచివాలయంలో అడ్వోకసి గ్రూప్ ప్రతినిధులతో ఒక సమావేశం జరిగింది. దీనిలో బ్రదర్ వర్గీస్, మజ్హర్ హుస్సేన్, కిరణ్ విస్సా, అనురాధ, సజయ పాల్గొన్నారు. హెల్ప్ లైన్ ఏర్పాటు, వలస కార్మికుల కోసం షెల్టర్ హోముల విస్తరణ, ఆరోగ్య అంశాల్లో అవగాహన కోసం విస్తృత పరచాల్సిన వాలంటీర్ల వ్యవస్థ గురించి, ఇంకా రేషన్ వంటి ఇతర అంశాల గురించి వివరంగా చర్చించడం జరిగింది. ప్రభుత్వం వైపు నుంచీ హెల్ప్ లైన్, షెల్టర్ హోములు వంటి ఒకటి రెండు విషయాల్లోనే కొంత సానుకూలత వచ్చింది. ఆ తర్వాత, వెంటనే రైతు స్వరాజ్య వేదిక చొరవతో అప్పటికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రారంభమైన హెల్ప్ లైన్ ని తెలంగాణాకు కూడా ఏప్రిల్ 7న విస్తరించడం జరిగింది. హెల్ప్ లైన్ నెంబర్ మీడియాలో, సామాజిక మాధ్యమాలలో విస్తృతంగా ప్రచారం చేయటంతో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలనుంచీ రేషన్ కోసం ఫోన్ కాల్స్ రావడం మొదలైంది. వివిధ జిల్లాల్లో సమన్వయం కోసం జిల్లాల వారీగా వాట్సాప్ గ్రూపులను ఏర్పాటు చేసి అందరినీ సమన్వయ పరచడంలో రవి కన్నెగంటి, కిరణ్ విస్సా, కొండల్, కవిత కురుగంటి వంటి వారు ఎంతో కృషిచేసారు. దాదాపు తెలంగాణా రాష్ట్ర్ర వ్యాపితంగా ఐదువందలమందికి పైగా ఈకృషిలో పాలు పంచుకున్నారు. అన్నిటికంటే ముఖ్యంగా చెప్పుకోవలసింది ముందు నలుగురైదుగురు వాలంటీర్లతో మొదలైన హెల్ప్ లైన్ కొద్దిరోజులు గడిచేటప్పటికే కాల్స్ తాకిడిని తట్టుకోవడం కోసం నలభైమంది వాలంటీర్లకి పైగా పనిచేయాల్సిన అవసరం వచ్చింది. ఫోన్ కాల్స్ తీసుకోవటం, వాటిని ప్రాంతాల వారీగా విడగొట్టటం, ఎక్కడెక్కడ రేషన్ అవసరం వుందో వాలంటీర్లకు సమాచారం అందించడం, రేషన్ అందిందో లేదో తిరిగి కనుక్కోవటం ఇలా అనేక రకమైన పనులను క్రమ పద్ధతిలో చేసుకుంటూ వెళ్ళిపోయారు. చెప్పాల్సిన ముఖ్యమైన అంశం ఏమిటంటే, వీరంతా కూడా ఎక్కడా బయటకు కనిపించకుండా ఎంతో నిశ్సబ్దంగా ఈ పనిని నిర్వర్తించారు. సంయుక్త, శ్రుతి, రాధిక ఇంకా ఎంతోమంది సమర్థవంతంగా హెల్ప్ లైన్ ని నిర్వర్తించారు కాబట్టే కొన్ని వేలమందికి రేషన్ అందించడంలో నిర్విరామంగా వాలంటీర్లు ఎంతోమంది ఆ పనిలో ఏ గందరగోళం పడకుండా పాలుపంచుకోవటానికి సాధ్యమయింది. చెప్పాల్సిన ముఖ్యమైన విషయం ఏమిటంటే వీరెవరూ కూడా ఒకే నేపథ్యంతో వున్నవాళ్లు కాదు. ఒకే వయసు వాళ్ళు కూడా కాదు. ఒకరితో ఒకరికి పరిచయం కూడా వున్నవాళ్లు కూడా కాదు. కానీ, హెల్ప్ లైన్ అనే ఒక అంశంలో అందర్నీ కలిపింది. అందరూ, ఒకరికొకరు కనిపించకుండానే, వారి ఇళ్లలోనే వుంటూ, ఎంతో నిబద్ధతతో కలిసి పనిచేశారు. ఇందులో టీచర్లు, గృహిణులు, ఇతర వృత్తి ఉద్యోగాల్లో వున్నవారు, విద్యార్థులూ వున్నారు. మే చివరి నాటికి హెల్ప్‌లైన్ కి దాదాపు నలభైవేల ఫోన్లు వచ్చాయి. సుమారు పాతికవేలమందికి రేషన్ సహాయాన్ని అందించగలిగాము. ఇంకా ఐదువేల మందికి సహాయం అందించడానికి కృషి జరుగుతోంది. కేవలం రేషన్ పంపిణీ మాత్రమే కాక తమ స్వరాష్ట్రాలకు వెళ్ళాలనుకున్న కార్మికులను శ్రామిక రైళ్లతో అనుసంధానం చేయటంలో, వారికి సహాయంగా నిలబడటంలో, అధికారులతో మాట్లాడటం వంటివాటిలో హెల్ప్ లైన్ వాలంటీర్లు హర్ష, నవీన్, స్వప్న ఇంకా అనేకమంది చేసిన కృషిని ప్రత్యేకంగా చెప్పుకోవాలి. సామాజిక కార్యకర్తలు నిర్వహించిన ఈ హెల్ప్ లైన్ ఒక వినూత్న ప్రయోగం. ఈ హెల్ప్ లైన్ ద్వారా రెండు రాష్ట్రాలలోని వేలాదిమంది కార్మికులను వారి స్వరాష్ట్రాలకు పంపించటానికి, ఇతర రాష్ట్రాలతో అనుసంధానం చేయటానికి ప్రతిఒక్కరూ రాత్రింబవళ్ళూ కృషి చేశారు.

రేషన్ పంపిణీలో వివిధ సంస్థల కృషి:

నిజానికి ప్రభుత్వం బాధ్యత పడాల్సిన ఈ పనిలో ఎన్నో సంస్థలు స్వచ్చందంగా ముందుకువచ్చి నగరం నలుమూలలా రేషన్ ను పంపిణీ చేశాయి. ప్రభుత్వం కేవలం బియ్యం, స్థానికంగా రేషన్ కార్డు ఉన్నవారికి 1500 రూపాయలు మాత్రమే ఇచ్చి చేతులు దులుపుకుంది. ఎంతోమందికి రేషన్ కార్డులు లేకపోవటంతో ఆ మాత్రం కూడా అందుకోలేకపోయారు. వలస కార్మికులకు కూడా ప్రకటించిన 500 రూపాయలు అందరికీ అందలేదు. రేషన్ కోసం ప్రజలు దుకాణాల ముందు తెల్లవారుజాము నుంచే లైన్ల లో నిలబడటం మొదలయింది. ఆ డీలర్లు రోజుకి వందమంది కంటే ఎక్కువ ఇవ్వలేకపోయారనేది వాస్తవం. అర్థరాత్రి నుంచీ వేచివుండాల్సిన పరిస్థితి ఉండటంతో చాలామంది ఒంటరి మహిళలు రేషన్ తీసుకోవటంలో ఎన్నో సమస్యలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇది గమనించిన తర్వాత ప్రభుత్వ, ప్రైవేటు పాటశాలలు, ఫంక్షన్ హాళ్ళను తెరిచి రేషన్ పంపిణీని విస్తృతం చేయమని, ఆహారం విషయంలో ప్రజలకు అభద్రత రాకుండా ఉంటుందని మా నుంచి చేసిన విజ్ఞప్తిని ప్రభుత్వం పట్టించుకోలేదు.

దీనితో, ఏప్రిల్ మొదటివారం నుంచీ నగరంలోని వివిధ సంస్థలు కూడా తాము పనిచేసే ప్రాంతాల్లో విస్తృత స్థాయిలో నగరంలో రేషన్ పంపిణీ ప్రారంభించారు. హైదరాబాద్ లో ఎంతోమంది వ్యక్తులు, సంస్థలు ఈ రేషన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. వీరందరూ కూడా ప్రభుత్వ యంత్రాంగానికి మించి లాక్ డౌన్ సమయంలో అత్యంత విలువైన కృషిని చేసారు. సఫా సొసైటీ, భూమిక, అమన్ వేదిక, సిసిసి, ఎమ్మెస్సై, ఆశ్రిత, అమూమత్ సొసైటీ, కోవా, యాక్షన్ ఎయిడ్, పివోడబ్ల్యు ఇంకా ఎన్నో సంస్థలు తాము పనిచేసే ప్రాంతాల్లో విస్తృతంగా రేషన్ పంపిణీచేశారు. ఇంకా చేయాల్సిన అవసరం కూడా ఎంతో వుంది. రేషన్ పంపిణీలో అజీం ప్రేమ్‌జీ ఫిలాంత్రోఫికల్ ఇనిషియేటివ్ వారి సహకారాన్ని ఇక్కడ ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం వుంది. బహుశా వ్యక్తులుగా, సంస్థలుగా, ఛారిటీ సంస్థలు, కార్పోరేట్ సంస్థలు ముందుకు వచ్చి ప్రభుత్వం నిర్వర్తించాల్సిన బాధ్యతను తమ నెత్తిమీద వేసుకోకుంటే పరిస్థితి ఇంకా విషమించివుండేదనటంలో ఏ సందేహం అవసరం లేదు.

మళ్లీ ప్రారంభమైన వలస కార్మికుల నడక: కేరాఫ్ మేడ్చల్

ఎంత పనిచేస్తున్నా చీమల పుట్ట పగిలినట్లు వలస కార్మికులు వస్తూనే వున్నారు. ఇంకో పక్క కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్ పొడిగించుకుంటూ వెళ్తూనే వుంది. కొద్ది రోజులే అని ఓపిక పట్టినవాళ్ళు కూడా భరించలేక మళ్లీ నడక ప్రారంభించారు. ఒకపక్క పనిలేకపోవటం, ఆకలి, ప్రభుత్వం నుంచీ సరైన విధంగా రేషన్ అందకపోవటం, మరోపక్క వైరస్ భయం, అయినవాళ్ళు ఊర్లలో ఎలా వున్నారో తెలియని అయోమయం, ఇక్కడ జబ్బుపడితే ఏమైపోతామో అనే ఆందోళన అన్నీ కలిసి వలస కార్మికులను అభద్రతకు గురిచేశాయి. కష్టకాలంలో అయినవాళ్ళ దగ్గరే ఉండాలనుకోవటం, స్వంత ప్రాంతంలో ఉండాలనుకోవటం అత్యంత సహజమైన విషయం. కానీ ఈ అంశం పట్ల ప్రభుత్వాలు కనీస మానవత్వంతో కూడా ప్రవర్తించలేదు. శ్రామిక రైళ్లు అన్నారు కానీ, వాటి నిబంధనలు అందరికీ అర్థమయ్యేవిగా లేకపోవటం, పోలీసు నిర్బంధం ఉండటం మరింత అభద్రతకు గురయ్యారు.

లాక్ డౌన్ ని నిరంతరం పెంచుతూ పోవటంతో షెల్టర్ హోమ్స్ లో వున్నవాళ్ళు గోడలు దూకి పారిపోవడం ప్రారంభించారు. నడవగలిగినంత దూరం నడవటం, ఏదైనా ట్రక్కు డ్రైవరు దయతలిస్తే కొంతదూరం వాటిలో ఎక్కి వెళ్ళగలిగినంత దూరం ప్రయాణించడం. మెల్లగా జాతీయ రహదారి 44 మేడ్చల్ పాయింట్ నుంచీ స్వరాష్ట్రాలకు వలస కార్మికుల ప్రయాణం మొదలైంది. ఒకపక్క ప్రభుత్వం వైపు నుంచీ వీరిని స్వరాష్ట్రాలకు చేర్చే కార్యక్రమం ఏమీ కనిపించడం లేదు. ఇంకో పక్క నిరంతర అభద్రత. ట్రక్కుల్లో ప్రయాణించడానికి అనుమతి లేదు. ప్రమాదం కూడా. వైరస్ గురించీ చెప్పే ముందు జాగ్రత్తలన్నీ కూడా ఇక్కడ అర్థరహితం. ట్రక్కుల్లో చాలా డబ్బులు కూడా పెట్టాల్సి వస్తుంది. వున్న కొద్దిపాటి డబ్బుని కూడా దీనికే ఖర్చు పెట్టాలి. దారిలో ఎవరన్నా దాతలు తిండీ నీళ్ళూ ఇస్తే ఇచ్చినట్లు, లేదా ఆ వేసవి మే నెల ఎండలో అలా దప్పికతో ప్రయాణించడమే ఏకైక దారి. అయినప్పటికీ వలస కార్మికుల ముందు వేరే ప్రత్యామ్నాయం లేదు. ప్రమాదమని తెలిసినా గానీ ఆ మార్గాన్నే ఎంచుకున్నారు. జాతీయ రహదారి 44 నుంచీ వలస కార్మికులు పెద్ద ఎత్తున వెళుతున్నారనే సమాచారం అడ్వోకసి గ్రూప్ సభ్యుడు శరత్ దావలకు అందింది. అలా వెళ్తున్న వాళ్లకు ముఖ్యంగా పిల్లలు స్త్రీలు వున్న గ్రూపుల వారికి కొంత సహాయాన్ని అందించడం మొదలు పెట్టాడు. ట్రక్కు డ్రైవర్లతో ఫోన్లో మాట్లాడి, తక్కువ డబ్బుకి వొప్పించడం, జాగ్రత్తలు చెప్పడం, డబ్బు లేనివాళ్ళకు తానే కట్టడం, అలా ట్రక్కుల్లో వెళ్ళినవారి సమాచారాన్ని ఆయా రాష్ట్రాల అధికారులకు అందేలా చేయటం వంటి ఎన్నో పనులను నిశ్సబ్దంగా చేసుకుంటూ వెళ్ళిపోయాడు.

ఇదే సమయంలో, రేషన్ ఇచ్చే సందర్భంలో ఆర్టిసి క్రాస్ రోడ్స్ లోని పాత ఓడియన్ సినిమా హాలులో నిర్మాణమవుతున్న భవనంలో వున్న కార్మికులు వనజకు పరిచయం అయ్యారు. అక్కడ ఒక గర్భిణీ మహిళకు నెలలు నిండటంతో ఏ వైద్య సహాయం లేకుండానే ఆమె ఒక పాపకు మే 1న జన్మనిచ్చింది. ఆ విషయం వాళ్లు తనకు తెలిపి సహాయం అడిగారు. వాళ్లకు సహాయం చేస్తున్న క్రమంలో మేడ్చల్ నుంచీ ఇలా ట్రక్కులు వెళుతున్నాయని, తమను కూడా అక్కడకి తీసుకెళ్లి ట్రక్కు ఎక్కించి సహాయం చేయమని అడగటంతో తను ఆ వారంరోజుల పాపను, బాలింతరాలైన తల్లిని, ఆ కుటుంబాన్ని తీసుకుని మేడ్చల్ వెళ్లి చూసినప్పుడు వందలమంది అక్కడ పడిగాపులు పడివుండటం, తాగటానికి మంచినీళ్ళు కూడా లేకపోవటాన్ని గమనించింది. కొద్దిగంటల తేడాతో వసుధ కూడా అక్కడికి వెళ్ళటంతో ఇద్దరూ కోవిద్ అడ్వోకసి గ్రూప్ దృష్టికి ఈ విషయాన్ని తీసుకువచ్చారు. ఆ మర్నాటి నుంచీ అక్కడికి మంచినీళ్ళు, బ్రెడ్ పాకెట్లు, మజ్జిగ పాకెట్లతో వనజ, వసుధ, సత్యవతి వెళ్ళటం మొదలుపెట్టారు. ఎంత తీసుకువెళ్లినా గానీ ఒక గంటలోనే అయిపోయేవి. వాళ్లు చెప్తున్న వివరాల ప్రకారం ఫేస్బుక్ లో అక్కడి అవసరాల గురించి అందరికీ తెలియచేయటం ప్రారంభించాము.

బెంగుళూరు, రాయలసీమ నుంచీ నడిచి వచ్చే వారికి ఆరాంఘర్ ఒక ముఖ్యమైన కేంద్రం. ప్రతీరోజూ ఉదయం నుంచీ సాయంత్రం వరకూ అక్కడికి చేరుకునే వారికి ఆహారం అందించడం ఒక పెద్ద పనైతే, అక్కడ నుంచీ వారిని మేడ్చల్ (40 కిలోమీటర్లు), హయత్ నగర్ల(25 కిలోమీటర్లు) వరకూ చేర్చటం ఇంకో పెద్ద పని. దారిలో వెళ్లే ప్రతి ట్రక్కును ఆపి వారిని బతిమాలి వీళ్ళను తీసుకెళ్లమని అడగటం. కార్మికుల వివరాలను అడిగి, ఫోన్ నెంబర్లను తీసుకుని శరత్ కు అందిస్తే వాళ్లు మళ్లీ వారి వూర్లు చేరేవరకూ కాంటాక్ట్ లో వుండటం తన పని. ఒరిస్సా, ఛత్తీస్‌ఘడ్ కార్మికులు కుటుంబాలతో పిల్లలతో సహా వుంటారు. చిన్నచిన్న పిల్లలు, బాలింతలు, కడుపుతో వున్న స్త్రీలు అలా నిశ్సబ్దంగా చీమలబారులా ఒకరి వెనుకాల ఒకరు అలా చేకట్లో నడుస్తూ వుంటే ఏ లారీనో ట్రక్కో గుద్దేసి వెళ్ళిపోయినా పట్టించుకునే దిక్కు కూడా వుండదు. ఏదైనా బండి ఆపి ఎక్కండి అంటే, చాలా దూరం వెళ్ళాలి అంత డబ్బులు లేవు అని చెప్పేవారు. ఎంతో కొంత వారి చేతిలో పెట్టి ట్రక్కు దొరికే వరకూ అలాంటి సమూహాలతో అర్థరాత్రి వరకూ వున్న రోజులే ఎక్కువ. దాదాపు శంషాబాద్, గగన్‌పహాడ్, ఔటర్ రింగ్ రోడ్, చాంద్రాయణగుట్ట, ఎల్బినగర్ , హయత్ నగర్ వరకూ రకరకాల మార్గాల్లో వెళుతున్న వలస కార్మికులకు రాత్రి ఏడుగంటల నుంచీ దాదాపు అర్థరాత్రి వరకూ బ్రెడ్, గుడ్లు, మజ్జిగ పాకెట్లు, పండ్లు అందిస్తూ ఎంతో శ్రమ తీసుకుని షహనాజ్, ఐజాజ్ ఎన్నోరోజులపాటు పంచారు. సంధ్య కన్నెగంటి కూడా తమ వైపు నుంచీ బ్రెడ్ పాకెట్లను వారం రోజుల పైనే పంపించారు. ఘటకేసర్ లో పిట్టల శ్రీశైలం తన పిల్లలతో కలిసి వివిధ వ్యక్తుల, సంస్థల సాయంతో వలస కార్మికులకు నిరంతరం ఆహారం పంచాడు.

మేడ్చల్ లో అక్కడి స్థానిక అధికారులు కూడా సహకరించడంతో మే 10 నుంచీ మేడ్చల్ ఫుడ్ క్యాంప్ ప్రారంభమైంది. అనేకమంది దాతలు ఈ బృహత్కార్యంలో పాలుపంచుకోవటం ప్రారంభించారు. వనజ, సత్యవతిల బృందానికి తోడయ్యారు చైతన్య పింగళి, సజ్జా శ్రీనివాసరావు. ప్రత్యక్షంగా అక్కడ నిలబడటమే కాకుండా అపూర్వమైన మద్దతుని కూడగట్టటమే కాకుండా ఆ క్యాంప్ ని నిత్య చైతన్య స్రవంతిలా మార్చారు. ఇంకా మరెంతోమంది చేతులు వీరికి తోడయ్యాయి. అందరూ కలిసి నిర్విరామంగా ఆ ఫుడ్ క్యాంప్ ని పదహారు రోజులపాటు నడిపారు. రెండు లక్షల మందికి పైగా అన్నం పెట్టారు. దాహానికి నీళ్ళు, మజ్జిగ వంటివి ఇచ్చారు. క్షేమంగా వాళ్ల వూర్లు చేరటానికి తమవంతు సాయంగా అనేకమంది దాతల సాయంతో బస్సులు ఏర్పాటు చేశారు. శ్రీరామ్ కంచర్ల, రాణి, అపర్ణ, మిర్చి మహేష్, శరత్చంద్ర, రేణుక, కవిత పులి, మధుకళ, సంధ్య, అనురాధ, విజయ, ఉష, సందీప్…ఈ లిస్టు అనంతం.

కవిత పులి మాట్లాడుతూ, “నేను అత్తాపూర్ లో ప్రభుత్వ ప్రాథమిక పాటశాల లో టీచర్ గా పనిచేస్తున్నాను. మా స్కూల్ కి వచ్చే పిల్లలు ఎక్కువగా వలస కార్మికుల పిల్లలే వుండేవారు. అక్కడ పెట్టే మధ్యాన్న భోజనమే వారికి ప్రధానమైన ఆహారం కూడా! మా స్కూల్ పక్కేనే వున్న అంగన్వాడీ సెంటర్లో కూడా ఈ పిల్లలే ఎక్కువ వుంటారు. లాక్ డౌన్ అనేది వారికి ఆహారం లేకుండా చేసింది. అంగన్వాడీ ఆయాకు ఫోన్ చేస్తే వాళ్లంతా నడిచి వెల్లిపోతున్నారని చెప్పింది. వారిని తలుచుకుంటే నాకు మనసు ఏదోలా అయిపోయింది. చిన్న పిల్లలు తిండి లేకుండా ఆకలికి అల్లదిపోవతమంటే ఏమిటో నేను చిన్నప్పటి నుంచీ ప్రత్యక్షంగా అనుభవించినదాన్ని. ఎండాకాలం, చెప్పులు కూడా సరిగా లేకుండా నడుస్తున్నారంటే దుఃఖం వచ్చేసింది. నా హెల్త్ రీత్యా రిస్క్ తీసుకోవద్దని అందూ అనేవారు. అయినా మనసు ఊరుకోక ‘సహాయ’ రేషన్ పంపిణీలో కొంతకాలం పాల్గొన్నాను. మేడ్చల్ ఫుడ్ క్యాంప్ మొదలయిన తర్వాత ఇంక నా ఆరోగ్యం అనేదాన్ని పక్కన పెట్టి వచ్చేశాను. నాకు తెలుసు రిస్క్ తీసుకుంటున్నానని, కానీ అక్కడికి వెళ్లి ఎంతోకొంత నేను చేయగలిగిందే చేస్తాను అని వెళ్లటం మొదలుపెట్టాను. అక్కడ అంతమంది చిన్నపిల్లలను చూస్తే ‘నడుకు వీళ్ళకింత కష్టం, ఎవరు ఈనికి బాధ్యులు, ఇంత నిర్లక్ష్యంగా ప్రభుత్వాల నిర్ణయాలు ఉండటమేమిటి అని చాలా ఏడుపు వచ్చేసింది. రిటైర్డ్ అధికారి భరత్ భూషణ్ సార్ అందరికీ చెప్పులు తెచ్చి పంచేవారు. ఆడవాళ్ళకి చీరలు తెచ్చి పంచారు. నా ఫ్రెండ్స్ తో మాట్లాడి రెండురోజులపాటు ఒక మెడికల్ క్యాంపు ఏర్పాటు చేయించగలిగాను. వాలంటీర్లను సమీకరించడంలో , ఫుడ్ వడ్డించడంలో, ట్రావెల్ లిస్టులు తయారు చేయటం, వారిని జాగ్రత్తగా బస్సులు ఎక్కిన్చేదాకా వుండటం ఇలా చేయగలిగినంత చేశాను. ఉత్తరప్రదేశ్ వెళ్లే ఒకతను పొరపాటున లింగంపల్లి స్టేషన్ కి బదులు ఘటకేసర్ వెళ్లాడు. అదొక మూల ఇదొక మూల! దాదాపు ట్రైన్ తప్పిపోయే పరిస్థితి ఏర్పడింది. అతన్ని సమయానికి ట్రైన్ ఎక్కించటానికి చాలా రిస్క్ తీసుకోవాల్సి వచ్చింది. మాకు ట్రావెల్ పర్మిషన్స్ విషయంలో ఎస్ఐ హరీష్ ఎంతో సహాయపడేవారు. ఇక్కడ కూడా ఆయన సహాయంతోనే అతన్ని రైలు వరకూ చేర్చగలిగాము. అతను క్షేమంగా ఊరు చేరి, ‘దీదీ అమ్మ దగ్గరకు చేరానని’ ఫోన్ చేసినప్పుడు ఎంత ఆనందం అనిపించిందో.”

అపర్ణ తోట ఇలా చెప్పింది. “నాకు ఇంట్లో వున్న బాధ్యతలవల్ల మేడ్చల్ కి వెళ్లటం తక్కువే అయినప్పటికీ, మా స్నేహితులు బాధ్యత తీసుకుని చేస్తున్న ఈ పని గురించి సామాజిక మాధ్యమాలలో అందరికీ చెప్పే బాధ్యత తీసుకున్నాను. ఆ విధంగా నా ఫ్రెండ్స్ దగ్గర నుంచీ ఆ కాంప్ కి అవసరమైన కొన్ని ఫండ్స్ ని సేకరించే పని చేశాను. కార్మికులు అలా నడిచి వెళుతున్నారంటే చాలా గిల్టీ గా అనిపించేది. వాళ్లేసిన రోడ్ల మీద మనం తిరుగుతుంటాం. వాళ్ళు కట్టిన ఇండ్లలో మనం సుఖంగా వుంటాం. కానీ ఒక కష్టకాలంలో వారిని కనీస సౌకర్యంగా కూడా పంపించలేకపోతున్నాం. ఆ గిల్ట్ నుంచే నేను చేయగలిగిన విధంగా సహాయం చేయాలనుకుని ఇక్కడ అందరూ చేసే పనిలో ఇన్వాల్వ్ అయ్యాను”.

ట్రావెల్ వరకి వచ్చేసరికి నవీన్, స్వప్న, వసుధ, సునీత, సుజాత సూరేపల్లి, శరత్చంద్ర, మహేందర్, బండి సురేష్, శంకర్, శ్రీను నాని, కవితపులి వలస కార్మికుల లిస్టులను తయారు చేయటంలో ఎంతో శ్రమ తీసుకున్నారు. ఈ ఫుడ్ క్యాంప్ కేంద్రంగా ఎంతోమంది స్వచ్చందంగా తమవంతు సాయం అందించడానికి వచ్చారు. నడిచివెల్తున్న వాళ్ల కాళ్ళకి చెప్పులు కూడా వుండటం లేదని గమనించి చెప్పులు పంచుదామని వచ్చిన ఇండస్ మార్టిన్, అరుణాంక్, సిద్ధార్థ కట్టా, ఉషాజ్యోతి వంటి రచయితలు, మోషే డయాన్ వంటి చిత్రకారులూ, అప్పటికే నగరంలోనే కాకుండా కరీంనగర్ వంటి ప్రాంతాల్లో కూడా రేషన్ పంపిణీ బాధ్యతను నిర్వర్తిస్తున్న సుజాతా సూరేపల్లి వంటి సోషల్ యాక్టివిస్టులు, పీపుల్ కంబైన్ ఫౌండేషన్ సభ్యులు అభి, తవి, శ్రీనివాస్‌లు వలస కార్మికులను వారి సొంత వూర్లకు చేర్చే బాధ్యతను నెత్తిమీద వేసుకున్నారు. ప్రాంతాల, దేశాల కతీతంగా వారికి తోడయిన అసంఖ్యాకమైన స్నేహ బృందం. బస్సులను మాట్లాడి క్షేమంగా వారిని వారి ఊర్లకు పంపించటంలో వీళ్ళందరూ తీసుకున్న శ్రమ మామూలిది కాదు. మేడ్చల్ ఫుడ్ క్యాంప్ కేంద్రంగా కనీసం 80 బస్సులవరకూ (ఇంకా ఎక్కువే వుండొచ్చు) సమీకరించి వందలాదిమందిని వారి ఇళ్ళకు చేర్చటంలో ప్రతిఒక్కరూ చేసిన కృషి అసామాన్యమైనది. నిజానికి ఈ పని అంతా జిల్లా ప్రభుత్వ యంత్రాంగం చేయాలి. అది బాధ్యత కూడా. ఆ బాధ్యత నుంచీ ప్రభుత్వం వైదొలగిపోయింది, విఫలమయ్యింది. ఫుడ్ క్యాంపుకి, ట్రావెల్ బాధ్యత చూస్తున్న అందరికీ వారధిగా, పోలీసు పర్మిషన్ తీసుకోవటం నుంచీ ఇంకా అనేక పనులకు బాధ్యతగా నిలబడిన వెటర్నరీ డాక్టర్ సజ్జా శ్రీనివాసరావు పని ఇప్పటికీ ఇంకా కొనసాగుతూనే వుంది. బస్సు ఆపరేటర్లకు అక్కౌంట్స్ సెటిల్ చేయడం, రసీదులు తీసుకోవడంలో ఇంకా తలమునకలుగానే వున్నారు. పోలీసు అధికారులూ, మునిసిపల్ అధికారులూ, పారిశుద్ధ్య కార్మికులూ అందరూ సహకరించిన అద్భుతమైన స్వతంత్ర ప్రజాకార్యాచరణ మేడ్చల్ ఫుడ్ కాంప్. ఒక్కొక్క గడ్డి పరక కలిసి బలమైన మోకు గా తయారయినట్లు మేడ్చల్ ఫుడ్ కాంప్ ని, ట్రావెల్ సపోర్ట్ ని నిర్వహించడంలో అనేకమంది పాలు పంచుకున్నారు. అందరికీ పేరు పేరునా వందనాలు. అడ్వోకసి గ్రూప్ సభ్యులంగా దీనిలో పాలు పంచుకోవటం మాకందరికీ నిజంగా ఒక గొప్ప అనుభవం.

న్యాయస్థానం తలుపు తట్టాల్సిన పరిస్థితులు:

ఒకపక్క స్వచ్చందంగా ప్రజలు ముందుకు వచ్చి చేస్తున్న ఈ సహాయంలో ప్రభుత్వాల నిబంధనలు అడుగడుగునా ఎదురవ్వటం మొదలయ్యాయి. ట్రక్కుల్లో పంపించడం ప్రమాదమనుకుంటే, బస్సుల్లో పంపించడానికి కూడా అనేక నిబంధనలు. ప్రయాణానికి అంతర్రాష్ట్ర అనుమతులు లేకపోవటం, దానికోసం ప్రయత్నాలు. మరోపక్క శ్రామిక రైళ్ల రిజర్వేషన్లలో వున్న అతి గోప్యత కారణంగా, ఆ యాప్ కేవలం పోలీసులకు మాత్రమే అందుబాటులో వుండటం ఒక కారణం. నిజానికి, సాంకేతిక విషయాలతో ముడిపడివున్న ఈ విషయాల్ని నిర్వర్తించటానికి పోలీసు సిబ్బందికి వున్న అనుభవం ఎంత అనే ప్రశ్న సహజంగానే వస్తుంది. ఎందుకంటే వారి పనివిధానం ఈ అంశాలతో ముడిపడి వుండదు కాబట్టి. ఇది, కేవలం ఫోనులో ఫోటో తీయటం అనే ఒక్క దానితోనే ముడిపడి వుండదు. అనేక అంశాలు వుంటాయి. పోలీసులతో ఈ పని చేయించాలన్న ఆలోచన ప్రభుత్వానికి ఇచ్చిన మహానుబావులు ఎవరో??

చాలా రైళ్లలో అనుమతించిన బెర్తులు కూడా నిండకుండానే రైళ్లు వెళుతున్నాయనే వార్త తెలిసింది. దీనికి కారణం ప్రభుత్వ యంత్రాంగంలోని విభాగాలలో కొరవడిన సమన్వయం. రిజిస్టర్ చేయించుకున్న కొంతమంది కార్మికులకు సమయానికి పోలీసుల నుంచీ సమాచారం అందకపోవటం కూడా ఇంకో కారణం.ప్రజలతో సన్నిహిత సంబంధాలతో మొదటినుంచీ పనిచేస్తున్న ఎవర్నీ ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం చేయకపోవటం. సాంకేతిక అంశాల్లో నైపుణ్యం వున్న ఐటి కంపెనీలు ప్రభుత్వం ఈపని అడిగితే చేసివుండేవి కాదా? పైగా, మిగతా రాష్ట్రాల కన్నా బాగా మనమే చేస్తున్నామని దబాయింపు కూడా ఒకటి.

ఎక్కడో ఉత్తరప్రదేశ్ లో జరిగిన ట్రక్కు ఆక్సిడెంట్ దృష్టిలో పెట్టుకుని, ఎవర్నీ రోడ్ల మీద నడవనీయకుండా బస్సుల్లో వారి స్వంత ఊర్లకు పంపిస్తామని చెప్పిన రాష్ట్ర ప్రభుత్వం మేడ్చల్ దగ్గర జమ అవుతున్న కార్మికులను తీసుకుని ఆదిలాబాద్ దగ్గర వున్న మహారాష్ట్ర బోర్డర్లో వదిలేస్తోందనే విషయం మా దృష్టికి వచ్చింది. అక్కడ వారికి కనీసం మంచినీళ్ళ సౌకర్యం కూడా లేదు. ఇంకా తిండి మాట చెప్పనవసరం లేదు. జిల్లా యంత్రాంగమే అల్లకల్లోలమైపోయింది వారికి సౌకర్యాలు చూపించలేక! వలస కార్మికులను అక్కడ అర్ధంతరంగా వదిలేస్తే మళ్లీ అక్కడ నుంచీ వారి నడక మొదటికొచ్చింది.

లాక్ డౌన్ మొదలయిన దగ్గర్నుంచీ కూడా వలస కార్మికులు వారి స్వంత వూరు వెళ్లాలనుకోవటం వారి హక్కని, వారిని గౌరవప్రదంగా వారి ఊర్లకు చేర్చే బాధ్యత ప్రభుత్వాలదే అని పదేపదే చెబుతూ రావటమే కాక తెలంగాణా రాష్ట్ర ప్రధాన కార్యదర్శికి అడ్వోకసి గ్రూప్ నుంచి ఏప్రిల్ నెల లోనే ఒక ఓపెన్ లెటర్ రాశారు రిటైర్డ్ ప్రొఫెసర్ రమా మెల్కోటే. వయసుభారం రీత్యా రోజువారీ సహాయ కార్యక్రమాల్లోకి రాలేకపోయినప్పటికీ, నిరంతరం జరుగుతున్న ఈ పరిణామాలన్నీ గమనిస్తున్న ఆమె వలస కార్మికులను పక్క రాష్ట్రం బోర్డర్లో వదిలిపెట్టడాన్ని వ్యతిరేకిస్తూ, వీరిని స్వంత ఊర్లకు చేర్చే బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాల్సిందేనంటూ అడ్వకేట్ వసుధ నాగరాజ్ ద్వారా తెలంగాణా హైకోర్ట్ లో ప్రజా ప్రయోజన వాజ్యం వేశారు. దీనికి స్పందించిన కోర్ట్, నడిచి వస్తున్న వలస కార్మికులకు షెల్టర్ ఏర్పాటు చేయాలని, వారిని శ్రామిక రైళ్లలోగానీ, బస్సుల్లో గానీ పంపించే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలదే అని ఆదేశించడంతో ఆఘమేఘాల మీద ఒకేరోజు నలభై రైళ్లలో కార్మికులను పంపించింది ప్రభుత్వం.

అయితే, సమస్య ఇక్కడితో తీరిపోలేదు. తుఫాను కారణంగా వెళ్ళాల్సిన పశ్చిమ బెంగాల్ రైళ్లు రద్దు అయ్యాయి. వారిని ఎలా స్వరాష్ట్రానికి చేర్చటం అనే సమస్య ఎదురైంది. ఇటుక బట్టీల్లో పనిచేసే ఒరిస్సా కార్మికులు ఇంకా వేలమంది వుండిపోయారు వారి పరిస్థితి ఆగమ్యగోచరంగా మారింది. లాక్ డౌన్ సమయంలో కూడా వారితో పనిచేయించుకున్న యాజమాన్యాలు వారిని తిరిగి స్వంత ఊర్లకు పంపించడం విషయమై బాధ్యత వదిలేసారు. ఈ విషయంలో స్పందించాల్సిందిగా మానవహక్కుల వేదిక ఉభయరాష్ట్రాల బాధ్యులు జీవన్ కుమార్ కూడా హైకోర్ట్ లో ప్రజాప్రయోజన వాజ్యం వేశారు. ఈ రెండూ విచారణకు వచ్చినప్పుడు, అసలు మేడ్చల్ లో ఒక్కరంటే ఒక్కరు కూడా వలస కార్మికులు లేరని, అందర్నీ శ్రామిక రైళ్లలో పంపించివేశామని ప్రభుత్వం తరఫు లాయర్లు వాదించారు. ఈ విషయంలో నిజాల్ని తెలుసుకోమంటూ హైకోర్ట్ ఒక అమికస్ క్యూరీగా తన తరఫున ఒక అడ్వకేట్ ని నియమించిది. అమికస్ క్యూరీ గా వచ్చిన అడ్వకేట్ కె. పవన్ కుమార్ మేడ్చల్ జాతీయ రహదారి మీద వున్న వలస కార్మికులను, ఇన్నిరోజులుగా అక్కడ సేవలు అందిస్తున్న వాలంటీర్లను కలిసి వాస్తవ సమాచారం సేకరించి, ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యల మీద సమగ్రమైన రిపోర్ట్ ఇచ్చారు. అందులో ముఖ్యమైనవి, వలస కార్మికులను సత్వరం వారి వారి స్వస్థలాలకు చేర్చే విధంగా రాష్ట్ర ప్రభుత్వం విధానపరమైన నిర్ణయం తీసుకోవాలని, మండే ఎండల్లో గర్భిణీ స్త్రీలూ, బాలింతలు పసిపిల్లలతో నడిచివెళ్లటం బాధాకరమని, ఇప్పటివరకూ సామాజిక కార్యకర్తలు పూనుకుని వీరిని స్వస్థలాలకు చేర్చటంలో ఎంతో కృషి చేశారని, పరిస్థితులు చక్కబడేలా రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం రాష్ట్ర ప్రభుత్వానికి దిశానిర్దేశం చేయాలని కోరారు. ఈ రిపోర్ట్ ఆధారంగా హైకోర్ట్ న్యాయమూర్తులు, వలస కార్మికులు, ఇటుకబట్టీ కార్మికులపై రమా మెల్కోటే, జీవన్ కుమార్ లు వేసిన ప్రజా ప్రయోజన వాజ్యాలపై ఆదేశాల నిస్తూ, వలస కార్మికుల ప్రయాణ బాధ్యతను సంపూర్తిగా రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత తీసుకోవాలని, వారు ఉండటానికి అన్ని సౌకర్యాలతో షెల్టర్ హోములను ఏర్పాటు చేసి ఆహార ఏర్పాట్లు చేయాలని చెప్పింది. ఈ ఆదేశాలు కూడా అమలులోకి రావటానికి మరింత సమయం పట్టింది. అప్పటివరకూ ఇటుకబట్టీ యజమానులు కార్మికులను తీసుకువచ్చి మేడ్చల్ లో తెల్లవారుఝామున వదిలేసి వెళ్ళిపోయేవారు. వారి ప్రయాణ ఏర్పాట్లను చూసింది పూర్తిగా సామాజిక కార్యకర్తలే. సూరేపల్లి సుజాత అయితే అన్ని జిల్లాల నుంచీ ఇటుకబట్టీ కార్మికుల గురించి నిరంతరం సమాచారం తెలుసుకుంటూ, మేడ్చల్ ఫుడ్ కాంప్ ముగిసిన తర్వాత వారికి తిండిపెట్టే డోనర్ల కోసం ప్రయత్నాలు చేస్తూ, వారిని బాధ్యతగా రైళ్లు, బస్సులు ఎక్కించేదాకా అలా పని చేస్తూనే వుండేది.

మేడ్చల్ నుంచీ సికింద్రాబాద్ స్టేషన్‌కు మారిన దృశ్యం:

హైకోర్ట్ ఆదేశాలతో అప్పటికే ప్రారంభమైన రైళ్ళలో వలస కార్మికులకు ప్రయాణ ఏర్పాట్ల బాధ్యత కూడా మళ్లీ సామాజిక కార్యకర్తల మీదే పడింది. కార్మికులు సికింద్రాబాద్ స్టేషన్ కి రావటం మొదలయింది. అలా ఎండలో, కూర్చోవటానికి కూడా సౌకర్యం లేక రోడ్ల మీదే గడపాల్సిన పరిస్థితి. ప్రయాణపు రోజు తప్పించి ఎవర్నీ స్టేషన్ లోకి అనుమతించడం లేదు. సత్యవతి, ప్రశాంతి , సునీత, వసుధ, సుజాత, అభి, ఇంకా వాలంటీర్లు శరత్చంద్ర, ఉషాజ్యోతి, బండి సురేష్, రవి, బాలాజీ, సాయి ఇంకా అనేకమంది పరుగులు పెడుతూ కార్మికులకు సహాయపడే కార్యక్రమంలో మునిగిపోయారు. కార్మికులకు కూసింత చోటు కోసం మళ్లీ వెతుకులాట. ఎన్నిసార్లు అభ్యర్ధించినా హైదరాబాద్ కలెక్టర్, రెవిన్యూ యంత్రాంగం ఆ పనికి పూనుకోలేదు. సిటీ బస్సులు నడవటం లేదు కాబట్టి రేతిపైల్ బస్ స్టాండ్ ఇవ్వగలుగుతారేమో అని ఒక ప్రయత్నం చేశాం! అదీ కుదరలేదు. హైకోర్ట్ ఆదేశాలను జిల్లా యంత్రాంగం పట్టించుకోవడం లేదని న్యాయమూర్తులకు మళ్లీ తెలియచేయడంతో, వారి ఆదేశాలతో తప్పనిసరై స్టేషన్ కి దగ్గరలోని ఒక ప్రభుత్వ పాటశాలలో షెల్టర్ ఏర్పాటు చేశారు అధికారులు. అది కూడా భూమిక కలెక్టివ్ నుంచీ ప్రశాంతి స్థానిక పోలీసు అధికారులతో సుదీర్ఘమైన సంప్రదింపులు జరిపిన తర్వాత! అమ్మయ్య, ఒక సమస్య తీరింది అనేలోగానే అక్కడ టాయిలెట్స్ పనిచేయడం లేదని కబురు. మళ్ళీ వీళ్లే పరుగులు పెట్టి వాటిని బాగు చేయించడం. సరైన కనీస సౌకర్యాలు లేకపోవడంతో, కార్మికులు కూడా ఎక్కువ ఉండటంతో మళ్లీ వసుధ, సత్యవతి, సిస్టర్ లిజీ పూనుకుని దగ్గరలో వున్న అమృతవాణి అనే సంస్థ హాలుని అద్దెకి తీసుకుని కొంతమందిని అక్కడికి పంపించారు. రైళ్ళలో పంపించడం సాధ్యం కానివారిని మళ్లీ బస్సులు పెట్టి పంపించడం, వాటికి అనుమతులూ, ఆ క్రమంలో వచ్చే ఆటంకాలూ, సమస్యలూ అన్నీ షరా మామూలే. ఏదీ కూడా సునాయాసంగా అవలేదు. ప్రతి రోజూ ప్రతి క్షణం కొత్త కొత్త సవాళ్లు, ప్రతిదీ ఒక యుద్ధమే.

ఈ లోపల బీహార్ వెళ్లే కార్మికులకు ఒక ప్రత్యేక విమానం ఏర్పాటు చేస్తామంటూ నేషనల్ లా స్కూల్ పూర్వ విద్యార్ధుల అభ్యర్థనతో 180 మంది కార్మికులకు నాలుగు రోజుల పాటు షెల్టర్‌తో పాటు ప్రయాణ ఏర్పాట్లు చూడాల్సిన బాధ్యత వసుధ మీద పడింది. ‘మా దగ్గర వారికి షెల్టర్ ఇచ్చే అవకాశం వుందని’ అంకురం నుంచీ సుమిత్ర, మాంట్ ఫోర్ట్ సోషల్ ఇన్స్టిట్యూట్ నుంచీ బ్రదర్ వర్ఘీస్ బాధ్యత తీసుకోవటంతో వారిని ఒక ప్రైవేటు బస్సు అద్దెకు తీసుకుని మరీ అక్కడికి పంపించాల్సి వచ్చింది. ఆర్టీసి బస్సులు ఏర్పాటు చేయగలరేమో అని మావైపు నుంచీ ఫోన్లలో ప్రయత్నం చేశాము కానీ ఫలించలేదు. వారికి వున్న ఆదేశాల మేరకు జిల్లా కలెక్టర్ లేదా పోలీసుల నుంచీ రిక్వెస్ట్ వెళితేనే అవి కదులుతాయి. బిహార్ వెళ్లే ఈ బృందం ఎయిర్పోర్ట్ కు వెళ్ళేంత వరకూ కూడా ఆ ప్రయాణానికి అవసరమైన సాంకేతిక అంశాలను ఒక క్రమ పద్ధతిలో సమన్వయం చేయటమనేది నిజంగా ఊపిరి సలపని అంశం.

ఎట్టకేలకు అనేకమంది కార్మికులను వివిధ పద్ధతుల్లో పంపించిన తర్వాత, వలస కార్మికులను స్వరాష్ట్రాలకు పంపించటానికి దాదాపు మే 1 నుంచీ జూన్ 13వరకూ ఒక్కరోజు కూడా ఖాళీ లేకుండా సామాజిక కార్యకర్తలు అలుపెరగని మారథాన్ చేసిన తర్వాత హై కోర్ట్ వేసిన అక్షింతలతో జిల్లా యంత్రాంగంలో చిన్న కదలిక! సికింద్రాబాద్ రైల్వే సమీపంలోని స్కూల్ వున్న షెల్టర్ లో దాదాపు వేళ్ళమీద లెక్కపెట్ట గలిగిన కార్మికులు మిగిలిన తర్వాత మేము రెజిష్ట్రేషన్ చేస్తామంటూ జిల్లా రెవెన్యూ యంత్రాంగం ముందుకు వచ్చింది. అంతా వింటే ఏదో పాత సామెత గుర్తుకువస్తోంది కదా!

వలస మహిళా కార్మికులు, పిల్లలతో ఉషాజ్యోతి ‘బంధం’ విలక్షణం. వారిని తను అక్కున చేర్చుకున్న విధానం అపురూపం. అసలు కోవిద్ భయం గానీ, భౌతిక దూరం పాటించడం గానీ ఏమీ లేదు. ఎన్నెన్ని అనుభవాలు, ఎన్నెన్ని కన్నీళ్లని పంచుకుందో. ఇప్పటికీ ఆ షెల్టర్ కు వస్తున్న వాళ్లకు అంతే ఓపికగా సహాయం చేస్తూనే వుంది. ‘మేడ్చల్ టు సికింద్రాబాద్ స్టేషన్’ అంటూ తను రాసే వ్యదార్థ గాథల గురించి మనమంతా వేచివుండాలి. ఇప్పటికే ఎంతోమంది ఫేస్ బుక్ మాధ్యమంగా తమ అనుభవాలను పంచుకున్నారు. అలాగే, మిగిలిన వాలంటీర్లవి కూడా వివిధ మాధ్యమాల్లో నమోదు అవ్వాలి.

వైద్య ఆరోగ్య అంశాలలో పౌరసంస్థల స్పందన :

కోవిద్-19 అనేది ఆరోగ్య అత్యవసర స్థితి. నిజానికి ఎవరు పనిచేసినా దీని గురించే పనిచేయాలి. కానీ, లాక్ డౌన్ పేరుతో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల సామాజిక సంస్థల ప్రధాన కార్యాచరణ వలస కార్మికుల రేషన్, వారి ప్రయాణ ఏర్పాట్ల చుట్టూనే ప్రధానంగా తిరగాల్సి వచ్చింది. వైరస్ నేపథ్యంలో ప్రజలు తీసుకోవాల్సిన వివిధ జాగ్రత్తల గురించీ మార్చ్ చివరినాటికి అన్వేషి హెల్త్ గ్రూప్ మెడికో ఫ్రెండ్స్ సర్కిల్‌తో కలిపి కొన్ని సలహాలను పోస్టర్ల రూపంలో తెలుగు, హిందీ, ఇంగ్లీష్, ఉర్దూ, బెంగాలీ వంటి వివిధ బాషలలో తయారు చేసింది. ఏప్రిల్ మొదటివారంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఇతర అధికారులకు అడ్వోకసి గ్రూప్ సభ్యులకు మధ్య జరిగిన సమావేశంలో వీటి గురించి ప్రస్తావించటం, ఆ తరువాత వివరంగా ఆయనకు మెయిల్ చేయటం కూడా జరిగింది. వేరే అంశాల గురించి వారి నుంచి స్పందన వుంది కానీ, ఈ అంశాన్ని గమనంలోకి తీసుకోలేదు అని మాకు అర్థమయింది. ఆ తర్వాత, మేమే క్షేత్రస్థాయిలో పనిచేసే కొన్నిసంస్థల ద్వారా వాటిని ప్రజా సమూహాలను అందించే కార్యక్రమాన్ని మొదలు పెట్టాం. అనేక బస్తీల్లో ఈ పోస్టర్లను విడుదల చేస్తూ అవగాహనా కార్యక్రమాలు నిర్వహించడంలో అమన్ వేదిక, రెయిన్బో హోమ్స్ మిత్రులు చొరవ తీసుకుని పనిచేశారు.

ఒక పక్కన, వైరస్ ఎవరినయినా అంటుకునే అవకాశం వుందని, దీనికి వర్గ, కుల, మత, జెండర్ బేధాలు ఉండవని ప్రపంచ ఆరోగ్య సంస్థ లాంటివి చెబుతున్నప్పటికీ ఢిల్లీ లో మర్కజ్ ఉదంతం బయటకు రావటం, దానిని మైనారిటీ సమూహాలకు వ్యతిరేకంగా దుష్ప్రచారం చేయటం కూడా పెద్ద ఎత్తున మీడియాలో, సామాజిక మాధ్యమాలలో మొదలయింది. పాజిటివ్ గా నిర్ధారణ అయినవాళ్లు, వారి కుటుంబ సభ్యులకు క్వారంటైన్ సెంటర్ లలో ఎదురవుతున్న సమస్యల గురించీ హైదరాబాద్ పాత బస్తీ నుంచీ బిలాల్ అడ్వోకసి గ్రూప్ దృష్టికి తీసుకువచ్చారు.

సునీత క్వారంటైన్లో వున్న కొంతమంది అనుభవాలను వారితో ఫోన్ లో మాట్లాడి వివరంగా డాక్యుమెంట్ చేసింది. వాటి ఆధారంగా, మీడియాలో ప్రసారమైన ప్రతికూల రెచ్చగొట్టే రిపోర్టులను కూడా జతచేసి, ఒక ఆరోగ్య అత్యవసర పరిస్థితిని ఎదుర్కోవటంలో పౌర సమాజంగా మా నుంచీ సూచనలను వివరిస్తూ, ఒక వివరణాత్మకమైన మెమొరాండం ని తయారుచేసి ప్రత్యక్షంగా తెలంగాణా ఆరోగ్య శాఖా మంత్రి ఈటెల రాజేందర్ గారిని ఏప్రిల్ 24న ఆయన ఆఫీసులోనే కలిసి అందజేశాము. మంత్రి గారిని కలిసిన బృందంలో సునీత, సంధ్య, ఖలిద పర్వీన్, వనజ, కొండవీటి సత్యవతి, అంబిక, అనురాధ, సజయ వున్నారు. అయితే, ప్రభుత్వం వైపు నుంచీ అదే పాతధోరణే కొనసాగుతుండటంతో ఈ మొత్తం విషయమై అడ్వోకసి గ్రూప్ సూచనలను పత్రికాప్రకటన ద్వారా కూడా తెలియజేశాము. ఆ ప్రకటన యథాతధంగా ఇక్కడ పొందుపరుస్తున్నాను.

తెలంగాణ ప్రభుత్వం మర్కజ్ ని తిట్టటం మాని కరోనా కట్టడికి అవసరమయిన చర్యలు చేపట్టాలి!

 కరోనా వైరస్ కి మతం, కులం, వర్గం, జెండర్ లేవని ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించింది. వ్యాధి సోకిన ప్రజలు, సోకి చని పోయిన వారి జాబితా చూస్తే కూడా ఇది స్పష్టమవుతుంది. అంతే కాదు, వ్యాధి సోకిన వారిలో ఎంత మంది చనిపోతారనేది ఆయా దేశంలో వుండే అసమానతలు, పేద వర్గాల, అణగారిన, జాతి ప్రజలకి ప్రజారోగ్య వ్యవస్థ ఎంత అందుబాటులో వుంది, అసలు ప్రజారోగ్య వ్యవస్థ ఎంత బలంగా పనిచేస్తోంది, దాని కెంత వనరులున్నాయి, ఆయా సమాజాల్లో వుండే అల్ప సంఖ్యాక వర్గాల ప్రజలని ప్రభుత్వం, వ్యవస్థ వివక్ష చూపకుండా చూసుకుంటోంది అనే విషయాలపై ఆధారపడుతుందని అమెరికా, జెర్మనీ ల మృతుల వివరాలు తెలుపుతున్నాయి. న్యూయార్క్ లో కొరోనా వైరస్ బారిన పడి చనిపోయిన వారిలో ఎక్కువగా ఆఫ్రికన్ అమెరికన్ ప్రజలు వున్నారు, వారిలో అనేకమందిని ఆస్పత్రుల నుండి తిప్పి పంపేశారు. ప్రజల్లో అవగాహన పెంచి, పెద్ద ఎత్తున కోవిద్ పరీక్షలు జరిపి, దానికనుగుణంగా అందరికీ సరయిన ఆరోగ్య వసతులు కల్పించి, వివక్ష లేకుండా చూసుకున్న జెర్మనీ లో అమెరికాలో వలే పెద్ద ఎత్తున మరణాలు సంభవించలేదు.

ప్రపంచ ఆరోగ్య సంస్థ, ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్ కేవలం లక్డౌన్ తో సరిపోదని, అనేక ఇతర చర్యలు తీసుకోవాలని చెపుతూ వస్తున్నా సరే, దురదృష్టవశాత్తు తెలంగాణ లో లాక్ డౌన్ అమలు పైన పెట్టిన ద్రుష్టి, లాక్ డౌన్ సమయంలో చెయ్యాల్సిన ఇతర చర్యల పై పనులపై పెట్టలేదని గత నెలన్నర పరిణామాలు వివరిస్తున్నాయి. పెద్ద పెద్ద ఆస్పత్రులు కోవిడ్ ఆసుపత్రులుగా మార్చామని, 10,000 పడకలు ఉన్నాయని, 1000 వెంటిలేటర్లు రాబోతున్నాయన్న ప్రచార హోరులో, డాక్టర్లు, నర్సులు, ఇతర సిబ్బంది ఆస్పత్రుల్లో, బయట పడుతున్న ఇబ్బందులు వెనక్కి పోయాయి. డాక్టర్లకి, నర్సులకి, ఇతర సిబ్బందికి సరయిన రక్షణ కవచాలు లేవనే విషయం బయటికి చెప్పిన నర్సుల పని పడతామని దాన్ని లేవనెత్తిన జర్నలిస్టులకి పరోక్షంగా వార్నింగ్ ఇవ్వటం జరిగింది. ఇప్పటికీ కొనబోతున్న వెంటిలేటర్లు నడపగలిగే సిబ్బంది ఆస్పత్రుల్లో ఉన్నారా అన్నది మన ప్రభుత్వం చెప్పట్లేదు. ప్రజల్లో అవగాహన పెంచటానికి అవసరమయిన కార్యక్రమాలు అటుంచి, అనుమానితులకి కూడా అవగాహన పెంచట్లేదు. క్వారంటైన్ చెయ్యటానికి వివిధ కమ్యూనిటీలని సిద్ధ పరచటం లేదు. ప్రాణాలకి తెగించి పని చేస్తున్న ఆశా వర్కర్ లకి తగినంత అవగాహన కల్పించలేదు. ఐసోలేషన్ అన్నా క్వారంటైన్ అన్నా భయపడి ప్రాణాలని కూడా తీసుకోవటానికి సిద్ధ పడుతున్నప్పటికీ, యాక్టివిస్టులు సూచించిన హెల్ప్ లైన్ ఏర్పర్చలేదు. ఆస్పత్రులకు రాలేని డాక్టర్లు, వైద్య విద్యార్థులతో ప్రజలకి, క్వారంటైన్ లో, ఐసోలేషన్ లో వున్న వారికి కౌన్సెలింగ్ చెయ్యగలిగే ఫోన్ వాలంటీర్ల బృందాన్ని సిద్ధపరిచే అవకాశం ఉన్నప్పటికీ, అది వేరే రాష్ట్రాలు చేస్తున్నప్పటికీ, కేసులు తక్కువున్నాయి కాబట్టి మాకవసరం లేదని ఆరోగ్య శాఖా మంత్రి చెపుతున్నారు, నమ్ముతున్నారు.

వివిధ రాష్ట్రాల కేసులు, కోవిద్ పరీక్షలు పోల్చి చూసినప్పుడు, పరీక్షలు తక్కువగా చేసిన రాష్ట్రాల్లో తెలంగాణా ఒకటి. ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్ దాదాపు ఇరవై రోజుల క్రితం కోవిద్ పరీక్షలు విదేశాల నుండి వచ్చిన వారినీ, వారి బంధువులని మాత్రమే కాక (కాంట్రాక్ట్ ట్రేసింగ్) ఆస్పత్రుల్లో శ్వాస సంబంధిత వ్యాధులతో చేరిన రోగులకు చెయ్యాలని చెప్పింది. అలాగే ఇతర ప్రజారోగ్య నిపుణులు, ముందు వరసలో పని చేస్తున్న డాక్టర్లు, నర్సులు, పోలీసులు, వైద్య అధికారులకు, కోవిద్ లక్షణాలతో ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలకు, ప్రయివేటు ఆస్పత్రులకు వస్తున్న వారికి ఈ లాక్ డౌన్ సమయంలో కోవిడ్ పరీక్షలు జరపాలని, అలా జరిపితే తప్ప మన రాష్ట్రంలో అది కమ్యూనిటీ వ్యాప్తి దశకి చేరిందా/లేదా అన్న విషయం తెలియదని, అది తెలిస్తే కానీ లాక్ డౌన్ ఎప్పుడు ఎలా రిలాక్స్ చెయ్యాలో నిర్ణయించలేమని చెప్పినప్పటికీ మన ప్రభుత్వం అటువంటి చర్యలేమీ తీసుకోలేదు. రెడ్ జోన్ అని ప్రకటించిన సూర్యాపేట లోనే ఏప్రిల్ రెండవ వారం నుండి పరీక్షలు చెయ్యలేదని వార్తలు వస్తున్నాయి. గ్రామీణ, పట్టణ ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలని సన్నద్ధం చేసిన దాఖలాలు లేవు. దాని గురించి సమాచారమూ లేదు. ఎందుకు కోవిద్ పరీక్షలు చెయ్యట్లేదన్న ప్రశ్న ఎవరయినా వేస్తేనే ప్రభువుల వారికి ఆగ్రహం వస్తోంది!

ఎందువల్ల? ఇన్నాళ్లు ప్రభుత్వం తెలంగాణా లో కోవిద్ రావటం మర్కజ్ వల్లే అనే భ్రమలో ప్రజలని పెట్టింది. తెలంగాణ లోకి ఫిబ్రవరి నుండి అనేక వేల మంది అనేక దేశాల నుండి వచ్చారని, వారిలో కొంత మందికి వైరస్ సోకిందని, అందువల్ల కంటైన్మెంట్ జోన్లు, లాక్ డౌన్ ప్రకటించామని ఒక పక్క చెప్తూనే, కేవలం ఢిల్లీలో మర్కజ్ సమ్మేళనానికి వెళ్లిన తెలంగాణ ముస్లింల వల్లే రాష్ట్రం లో వైరస్ వ్యాప్తి చెందుతోందని, లేకుంటే తెలంగాణ వ్యాధి రహితంగా వుండి ఉండేదనే విచిత్ర వాదన చేస్తూ వచ్చింది. ఈ వాదాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్ళటానికి తెలుగు టెలివిజన్ తమ వంతు బాధ్యతగా చాలా గట్టి ప్రయత్నమే చేసింది. పాత బస్తీలో పరీక్షల కోసం తీసుకెళ్తున్న వారిని చూపి పరీక్షలు జరపక ముందే వారికి వ్యాధి సోకినట్లు ప్రచారం చేసింది. పరీక్షల తరువాత వారికి వ్యాధి లేదని వచ్చిన ఫలితాలని పట్టించుకోలేదు. వాస్తవంనమ్మటానికి అవసరమయిన ఆధారాలువిదేశాల నుండి ఎందరిలో కాంట్రాక్టు ట్రేసింగ్, ఎన్ని పరీక్షలు చేస్తే ఎంత మందికి వైరస్ సోకింది, ఏ ఆధారంగాఅంటే వ్యాధి లక్షణాలు వున్నవారిలో, అసలు లేనివారిలో, ఎంత మందికి పరీక్షలు చేస్తే ఎంత మందికి వైరస్ వుంది, చనిపోయిన వారిలో ఇప్పటికే ఇతర వ్యాధులు వున్న వారు ఎంత మందిఈ వివరాలు ప్రజలకి అందించలేదు. కేవలం మర్కజ్ సమ్మేళనాన్నుండి వచ్చిన వారికే, వ్యాధి లక్షణాలు వున్నా, లేకపోయినా (ఎసింప్టోమాటిక్ వ్యక్తులకి) పరీక్షలు చేసి, ఎన్నో దేశాలనుండి వచ్చిన వారిని గాలికి వదిలేసిందనే వాస్తవం బయటకి రాకుండా చేసింది. మర్కజ్ వల్లే తెలంగాణలో వ్యాధి వ్యాపించిందని గుడ్డిగా నమ్మిన ముస్లిమేతర తెలంగాణా సమాజం ఈ వివరాలు అడక్కుండా తాము ముస్లిం సమాజం నుండి దూరంగా ఉంటే వ్యాధి సోకదనే మూఢ నమ్మకంలోకి జారుకునేలా చేసింది!

దీని వల్ల తెలంగాణా సమాజానికి జరిగిన నష్టం అపారమైంది. కరోనా వైరస్ తో పోటీ పడే మత విద్వేష వైరస్ తెలంగాణ సమాజంలో వ్యాప్తి చెందింది. మర్కజ్ రోగులు డాక్టర్లపై వుమ్మేశారని, బట్టలు విప్పుకుని తిరిగారని అబద్ధాలతో కూడిన ప్రచారం చేసి దానికి మొత్తం ముస్లిం సమాజాన్ని బాధ్యులని చేసి, ముస్లింలని తీవ్రంగా ఆక్షేపించటంతో ముస్లింల పట్ల ద్వేషం అందరిలో తీవ్రంగా ప్రబలి, వారిని వివక్షకు గురిచేయ్యటం సరైందే అనుకునే వాళ్ళు ఎక్కువయ్యారు. వివక్ష వల్ల కరోనా అంటే మరింత భయం పెరిగి రోగులు బయటకి రారు. అంతే కాదు, మర్కజ్ సమ్మేళన వ్యక్తులకి, వారి బంధువులయిన వారికి మాత్రమే పరీక్షలు ఎక్కువగా జరిపి, వారిపైనే ద్రుష్టి పెట్టి, వారినే క్వారంటైన్ చేయటం వల్ల కలిగిన పర్యవసానం ఏమిటంటే అధిక సంఖ్యాకులయిన ముస్లిమేతర ప్రజా సమూహం తమలో వైరస్ వ్యాపించదనే భ్రమలో బ్రతుకుతున్నారు. కొరోనా పరీక్షల గురించి, వైద్య సిబ్బంది గురించి, రక్షణ కవచాల గురించి, ఆరోగ్య అవగాహన గురించి వివరాలు తెలుపని ప్రభుత్వం ఇటువంటి ద్వేషం, అజ్ఞానం, వివక్ష ప్రబలటంలో మాత్రం తనదయిన పాత్ర పోషించింది. దీని పర్యవసానమే క్వారంటైన్, ఐసోలేషన్ చేస్తారనే భయంతో సమయానికి ఆస్పత్రికి వెళ్లకుండా, నిన్న అల్వాల్ లో నివసించే ఒక ముస్లిమేతర యువతి ప్రాణాలు పోగొట్టుకుంది.

తెలంగాణ సమాజం మర్కజ్ భ్రమల్లోంచి బయటికొచ్చి కరోనా గురించి ప్రభుత్వం చెప్తున్న విషయాలని విమర్శనాత్మకంగా చూసి ప్రభుత్వం నుండి అడగాల్సినవి అడగాలి.

  • ప్రభుత్వం కొరోనా ని మర్కజ్ కి ముడి పెట్టటం ఆపి, ద్వేషం వివక్షకి, అజ్ఞానానికి దారి తీసి, కొరోనా వైరస్ వ్యాప్తికి తోడ్పడుతోందని గుర్తించి, ముస్లింల పట్ల ద్వేష పూరిత ప్రచారాన్ని కట్టడి చెయ్యాలి.
  • కొరోనా పరీక్షలు ఐసిఎంఆర్ సూచించినట్లు పధ్ధతి ప్రకారం మరింత విస్తృతంగా చెయ్యాలి. కొరోనా లక్షణాలు వున్న వారికి పరీక్షలు సులువు చెయ్యాలి. సమాచారాన్ని ఇతర రాష్ట్రాల వలే అందరికీ అందేలా చెయ్యాలి.
  • వైద్య సిబ్బందికి తగినన్ని రక్షణ కవచాలు అన్ని స్థాయిల్లో ఏర్పర్చి ప్రజారోగ్య వ్యవస్థని బలపరచాలి. ప్రజలకి క్వారంటైన్, ఐసోలేషన్ గురించిన భయాలు పోగొట్టాలి.
  • రోగులకు, క్వారంటైన్లో వున్న వ్యక్తులకి అవసరమయ్యే ఆన్లైన్ సహాయ వాలంటీర్ వ్యవస్థని పౌర సమాజ సహకారంతో ఏర్పాటు చెయ్యాలి.

అన్నీ తామే చేస్తున్నామన్న భ్రమని, అనవసర భేషజాలని పక్కన పెట్టి లాక్ డౌన్ సమయంలో వలస కార్మికులకు, అన్నార్తులకి రాత్రి పగలు చేయూత నందిస్తున్న తెలంగాణ పౌర సమాజ ప్రయత్నాల్ని ఇప్పటికయినా గుర్తించి ఆరోగ్య అవగాహన పెంచటంలో వారి సలహాలని స్వీకరించాలి. పౌరులందరినీ సమానంగా, వివక్ష లేకుండా చూడాలనే తన రాజ్యాంగ బాధ్యతలని మాటలలో కాకుండా, చేతలలో చూపించాలి.

మొదటి నుంచీ కూడా కోవిద్ కట్టడిలో ప్రభుత్వం అనుసరించిన రహస్య విధానం వల్ల ఉపయోగం లేకపోగా అది విపరీత పరిణామాలకు కూడా దారితీసిందనేది స్పష్టంగా బయటకు వచ్చేసింది. మొత్తం భారాన్ని గాంధి హాస్పిటల్ మీదే మోపటం తో అక్కడి వైద్య సిబ్బంది మీద పెరిగిన వొత్తిడి, పేషంట్ బంధువులు జూన్ 10న డాక్టర్ల మీద భౌతిక దాడికి పాల్పడటం, దీనికి నిరసనగా రోడ్డెక్కిన జూనియర్ డాక్టర్లు, అక్కడ అదుపు తప్పిన పరిస్థితులను వెలికి తీశాయి. విధి నిర్వహణలో వైరస్ బారిన పడిన జర్నలిస్ట్ మనోజ్ మృతి కూడా గాంధి హాస్పిటల్ లో పేషంట్లకు కొరవడిన మద్ధతు వ్యవస్థల గురించి బట్టబయలు చేసింది. ఈ నేపధ్యంలో ఒకప్పుడు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల స్థాయిలో ఆరోగ్యశాఖలకు ప్రధాన కార్యదర్శులుగా పనిచేసి రిటైరయిన ఐఏస్ ఆఫీసర్లు, వైద్యరంగంలో విశేష అనుభవం ఉన్న డాక్టర్లు, సామాజికవేత్తలు, పరిశోధకులూ, జర్నలిస్టులూ కలిసి, “ఇప్పటికైనా యుద్ధప్రాతిపదికన కొన్ని నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం వుందని, ప్రజారోగ్యానికి సంబంధించి తాత్సారం చేయకూడదని, మద్ధతు వ్యవస్థల రూపకల్పన అత్యంత ముఖ్యమైనదని” సూచిస్తూ ప్రభుత్వానికి ఒక బహిరంగలేఖను రాశారు. అదే సమయంలో ఆరోగ్య వసతులలో వాస్తవ పరిస్థితి గురించి తక్షణం రిపోర్ట్ ఇవ్వాలని కూడా హైకోర్ట్ ఆదేశించడం జరిగింది. వీటన్నిటి తర్వాత కొంత దిద్దుబాటు చర్యలు మొదలయ్యాయి. కానీ వైరస్ కట్టడి కోసం వైద్య వ్యవస్థకు అనుసంధానంగా ప్రజా భాగస్వామ్యాన్ని మరింతగా వుండేలా ఆరోగ్య కార్యకర్తలను బహుముఖాలుగా విస్తృత పరచాల్సిన అవసరం ఎంతో వుంది. అవగాహన కార్యక్రమాలు విస్తృతంగా పెంచాలి.

ఇది ముగింపు కాదు:

హెల్ప్ లైన్ ద్వారా వివిధ రాష్ట్రాల లోని కార్మికులను అక్కడి సామాజిక సంస్థలతో అనుసంధానం చేయటం, అక్కడ చిక్కుపడిన తెలుగువారిని కొంతమందిని తీసుకురావటానికి వారి సహాయం తీసుకోవటం జరిగింది. రేషన్ ఇచ్చే సమయంలో, ప్రయాణ ఏర్పాట్లు చేస్తున్న సమయంలో వలస కార్మికులు ఎన్ని రకాల వృత్తి నైపుణ్యాలతో మన చుట్టూ వున్నారో గ్రహింపుకి వచ్చింది. బట్టల మీద డిజైన్ ఎంబ్రాయిడరీ చేసే మగ్గం కార్మికులు, హోటళ్లలో వంటచేసే వారూ, బ్యూటీ పార్లర్లలో పనిచేసేవారూ, పానీపురి బండ్లవాళ్ళూ, ఐస్ క్రీం బండ్లు నడుపుకునే వారూ, బొమ్మలు అమ్మేవాళ్ళూ, బురఖా తయారు చేసేవారూ, భవన నిర్మాణ కార్మికులు, కార్పెంటర్లు, గ్రానైట్ పాలిష్ చేసేవాళ్ళూ , ఇటుక బట్టీ కార్మికులు…ఇలా ఎన్నో వైవిధ్యమైన శ్రమల్లో కనీస వేతనాలు, హక్కులూ లేకుండా మన చుట్టూ బతుకున్నారనేది ఉనికి లోకి వచ్చింది. వీరి హక్కులను కాపాడవలసిన కార్మిక శాఖ ఏం చేస్తోందో తెలియదు. ఇదంతా కూడా ఒక సంక్లిష్టమైన అంశం.

మార్చి మొదటివారం నుంచీ దాదాపు మూడున్నర నెలల పాటు హైదరాబాద్ నగరంలో ఒక మారథాన్ లాగా ప్రజా సమూహాల కార్యాచరణ నడిచించి. ఇంకా పూర్తి కాలేదు. సికంద్రాబాద్ షెల్టర్ హోంలో రోజుకొక సవాలు ఎదురవుతూనే వుంది. స్వరాష్ట్రాల్కి వలస కార్మికుల ప్రయాణం చివరి దశకు ఎప్పుడు వచ్చేను?

వివిధ వ్యక్తులు, సంస్థలు తమ శక్తికి మించి, వివిధ రూపాల్లో వైవిధ్యంగా పనిచేశారు. సామాజిక మాధ్యమాల ద్వారా మద్దతుని అపురూపంగా కూడగట్టారు. ఒక్కొక్కరిదీ ఒక్కో విధానం. ఆ క్రమంలో కొందరు విమర్శల పాలయ్యారు కూడా! పైకి కనిపించేవాళ్ళు కొందరయితే, నిశ్శబ్దం గా పనిచేసేవారు మరికొందరు. ఎంతోమంది దాతలు. ఒకరెక్కువ ఒకరు తక్కువ అనే తేడా అవసరం లేదు. ప్రజాస్వామ్యవాదులుగా ఈ బృందం చేసిన కృషిని సహించలేని ఆధిపత్య కులతత్వ మతోన్మాద మూర్ఖుల నుంచీ ఒక ద్వేషాన్ని కూడా ఎదుర్కోవాల్సి వచ్చింది. నిజానికి ఈ మొత్తం ప్రయత్నమంతా కూడా అప్పటికప్పుడు ఎదురవుతున్న పరిస్థితులను బట్టి, మానవ, ఆర్ధిక, సామాజిక వనరులను సమీకరించుకుంటూ బహుముఖాలుగా స్వతంత్రంగా కార్యరూపం దాల్చిన అపురూప దృశ్యం. ఈ కార్యాచరణ కేవలం హైదరాబాద్ నగరానికి మాత్రమే పరిమితమైన విషయం కూడా కాదు. ముందే చెప్పినట్లు హైదరాబాద్ లోనే కాదు, అనేక ఊర్లలో వలస కార్మికుల పట్ల అపురూపమైన ప్రజా స్పందన వుంది. మేము పనిచేస్తున్న క్రమంలో సాధ్యమైన మేరకూ, నా దృష్టికి వచ్చిన కార్యక్రమాల వివరాలు, సంస్థల పేర్లు, వ్యక్తుల పేర్లూ ప్రస్తావించాను. ఎవరినైనా మర్చిపోయి వుంటే క్షమించాలి.

శరత్ దావల మాటలతో ఈ సుదీర్ఘ వ్యాసాన్ని ముగిస్తాను.

“ సాధారణంగా మానేజ్మెంట్ కాలేజీల్లో, డెవలప్మెంట్ సంస్థల్లో ఏం చెప్తామంటే, టీమ్స్ ని ఏర్పరచాలి, అందరూ దానిలో పనిచేయాలి, నైపుణ్యాలు పెంచుకోవాలి, వ్యక్తిగా కాకుండా టీం స్పిరిట్ తో పనిచేయాలి అని. అవి థియోరిటికల్ గా మొనాటనస్ గా వుంటాయి. అయితే, మనం ఈ క్రైసిస్ లో అప్పటికప్పుడు ఒక టీం గా మారిపోయి పనిచేశాం. నిజానికి ఇది కేవలం ఒక టీం మాత్రమె కాదు. ఎన్నో టీంలు ఏర్పడ్డాయి. అనేక ఉదాహరణలు. ప్రతి కార్యాచరణ ఒక్కో విలువైన అనుభవంగా మారింది. మనం కార్మికులను రకరకాల పద్ధతుల్లో పంపించాము. ఒక్కరు చేసిన విషయం కాదు ఇది. ఒక సుదీర్ఘమైన కార్యాచరణలో అవసరానికి తగ్గట్టుగా అప్పటికప్పుడు చిన్న గ్రూపులు ఏర్పడటం, ఆ పనిని పూర్తి చేయడం, ఇంకొకరికి ఆ పని కొనసాగింపుని అందజేయటం…అలా అనేక విషయాలలో ఈరకమైన ఆచరణ మంచి ఫలితాలను ఇవ్వటం మనం గమనించవచ్చు. ఒక చిన్న ఉదాహరణ పంచుకుంటాను ఇక్కడ. అస్సాంకి పదిమంది అమ్మాయిలు తమిళనాడులోని తిరుపూర్ లో ఇరుక్కుపోయారు. స్కిల్ డెవలప్మెంట్ పేరు మీద వారిని ఒక ఫ్యాక్టరీ లో పనికి పెట్టారు. లాక్ డౌన్ లో యాజమాన్యం వారిని వెళ్లనీయలేదు. ఆ యాజమాన్యంతో ఒక గ్రూప్ కోట్లాడి విడిపించి కోయంబత్తూర్ వరకూ చేర్చింది. అక్కడి నుంచీ ఇంకో గ్రూప్ వారి బాధ్యత తీసుకుని హైదరాబాద్ వరకూ చేర్చగలిగారు. హైదరాబాద్‌లో సిస్టర్ లిజీ వాళ్ళు ఇంకో గ్రూప్ గా వారికి కొన్నిరోజుల పాటు షెల్టర్ ఇచ్చారు. హైదరాబాద్ నుంచీ గౌహతి వరకూ పంపించగలిగాం. అయితే అక్కడ కంపెనీ దళారులెవరైతే వున్నారోవారి నుంచీ బెదిరింపులు వస్తున్న క్రమంలో అక్కడ ఇంకో గ్రూప్ ఈ అమ్మాయిలను క్షేమంగా ఇళ్లకు చేరే బాధ్యతను తీసుకుంది.

కార్పోరేట్ మానేజ్మెంట్ భాషలో ఈ రకమైన టీం వర్క్ కోసం కోట్లాది రూపాయలు ట్రైనింగ్‌ల పేరు మీద ఖర్చు చేస్తారు. ఎన్నో ప్రయత్నాల తర్వాత కొన్ని ఫలితాలు కూడా రాబడతారు . వాళ్ళు చెప్పొచ్చు, ఇదొక ఎమెర్జెన్సీ పరిస్థితి, అందరూ చాలా ఎమోషనల్ గా పనిచేశారు, రిజల్ట్ వచ్చింది అని విశ్లేషించవచ్చు. అయితే, ఇక్కడ నేనేమంటానంటే, ఇక్కడ టీం ల ఏర్పాటు, వాటిలో వచ్చే భిన్నాభిప్రాయాలు, వ్యక్తుల మధ్య వచ్చే ఘర్షణలు తక్కువేమీ వుండవు. కానీ, వీటివలన చేరవలసిన లక్ష్యాన్ని దారితప్పకుండా వాటిని పరిష్కరించటంలో వివిధ సభ్యులు చేసే ప్రయత్నాలు, ఒక్కోసారి వైఫల్యాలు ఎన్నో వుంటాయి. ఇలాంటి ఆకస్మిక విపత్తులలో వివిధ టీంలు ఏర్పరచడం, అవి స్వతంత్రంగా పనిచేయలిగే వాతావరణాన్ని, సమర్థవంతంగా పనిచేయగలిగే పరిస్థితులను కల్పించుకుంటూ వెళ్లటం అనేది ఏంటో ముఖ్యం. ఈ విషయంలో హైదరాబాద్ అడ్వోకసి గ్రూప్ చేసిన కృషి ఎంతో ముఖ్యమైనదని నేను భావిస్తున్నాను.”

కోవిద్-19 ప్రపంచానికి భయాన్ని కలిగించటమే కాదు, మానవత్వంతో పరిమళించే హృదయస్పందన వున్నఅనేకమందిని కూడా వెలికి తీసింది. ప్రతి ఒక్కరికీ ప్రేమ పూర్వక అభినందనలు.

*

సజయ. కె

2 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)
  • Thanks for the detailed report regarding the covid advocacy group. It has been a very enlightening and heart warming report. Many thanks to all of you for this effort and for reaffirming that humanism isn’t dead even in these troubled times. I regret deeply that I wasn’t aware of these activities and I couldn’t participate in them.

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు