మహర్షి సినిమా గురించి నాలుగు మాటలు

కేవలం సెల్ఫీలు దిగటానికి పనికి వచ్చే వీకెండ్ వ్యవహారంగా వ్యవసాయాన్ని చూపించడంలో విజయవంతమయ్యారనుకుంటా!

హర్షి సినిమాలో రిషి కుమార్ ఎలా హీరో అయ్యాడు, రవి ఎందుకు హీరో కాలేదు? ఈ ప్రశ్న ఎంతమందికి వచ్చి వుంటుంది? వాటిని పోషించిన వ్యక్తులే దానికి కారణమా? పోనీ ఇలా ఆలోచించి చూద్దాం, రిషి పాత్ర అల్లరి నరేష్ వేసి, రవి పాత్ర మహేష్ బాబు చేసి వుంటే కథ ఎలా నడిచి వుండేది? హీరో ని బట్టే కథ వుండటం అనేది తెలుగు సినిమా లక్షణం కాబట్టి మనకు పెద్ద హీరోలు ఏ పాత్ర చేస్తే అందుకు తగినట్టుగానే కథ మారుతుందనే దానిలో సందేహమెందుకు? తిప్పి రాసే ఈ కథలో, అమెరికా వెళ్ళిపోయిన రవికుమార్ ని వూరిలో వుండిపోయిన రిషి కుమార్ ఎంత బలంగా నిలదీస్తాడో ఊహించగలుగుతాం. వ్యవసాయాన్ని నిర్లక్ష్యం చేసి ఈ దేశ రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా గానీ డాలర్ల వెంట పరిగెత్తే దుర్మార్గపు యువతరాన్ని చీల్చి చెండాడి ఉండేవాడు, ‘ఎట్లా నిద్ర పడుతుందిరా మీకు, ఇక్కడ ఇంతమంది ఆత్మహత్యలు చేసుకుని చనిపోతుంటే’ అని నిలదీసి ఉండేవాడు కదా!

ఇప్పుడు మళ్లీ వంశీ పైడిపల్లి కథను పరిశీలిద్దాం. రెండు ప్రధానమైన అంశాలు దీనిలో డైరెక్టర్ చూపించాడు. ఒకటి, సాంకేతిక రంగంలో అత్యున్నతమైన స్థానాన్ని, నిరంతరం గెలుపు లక్ష్యంగా ఉండాలనుకునే ఈనాటి యువతరాన్ని హై లైట్ చేయటం, రెండు రైతుల సమస్యల గురించి చర్చించడం. సినిమాలో మసాలా కోసం పెట్టె సీన్ల గురించి ఇక్కడ మాట్లడదలచలేదు. అవి మాట్లాడితే, ఇది వ్యాపారం, తప్పవు అనే అరిగిపోయిన రికార్డు ఒకటి ముందుకు వస్తుంది. వీటికన్నా ఈ సినిమా తీయటం వెనుక వున్న అంతః సూత్రం ఏమిటి అనేది ముఖ్యమనుకుంటున్నాను.

ఈ సినిమా ఎవరికోసం అనే ప్రశ్న వేసినప్పుడు ఇంటర్మీడియట్ చదువుతున్న మా మేనకోడలు చెప్పిన విషయమేమంటే ‘స్టూడెంట్స్ కి సక్సెస్ గురించి ఇచ్చిన మెసేజ్’ అంది. మరి రైతుల విషయమేమంటే, ‘దానిని ఎవరూ తమ లక్ష్యంగా చేసుకోరు, సినిమా అసలు దాని గురించి కాదు’ అని చాలా స్పష్టంగా చెప్పింది.

పోనీ, ఆ వయసు వారికి సామాజిక అంశాల పట్ల పరిణితి తక్కువే అని వొప్పుకున్నా గానీ, దాదాపు దశాబ్దంన్నర కాలంగా వ్యవసాయ రంగం మీద పనిచేస్తూ, దాదాపు ప్రతిరోజూ రైతు ఆత్మహత్య బాధిత కుటుంబాలతో, రైతులతో పనిచేస్తున్న నాకు కూడా ఈ సినిమా రైతుల గురించి అని అనిపించకపోవటానికి కారణమేమై వుంటుంది? అలా అని సినిమా బాగా తీయలేదని నేను అనటం లేదు. రైతుల గురించిన కొన్ని వాస్తవ అంశాలను చర్చించారు. కొన్ని మంచి పరిష్కారాలను కూడా సూచించారు. మరి సమస్య ఎక్కడుంది? సమస్య ఎక్కడుందంటే, రైతుల అంశాలను కథకు అనుసంధానించడంలో వుంది. వ్యవసాయ రంగానికెదురవుతున్న సమస్యల మూల కారణాన్ని అర్ధం చేసుకోవటంలో వుంది. ‘వ్యవసాయం మనిషి కి భూమి కి మధ్య వుండే జీవనవిధానం’ అని హత్తుకునేలా డైలాగు చెప్పించగలిగారు కానీ, ఆ విషయాన్ని కథనంలో పెట్టటంలో విఫలమయ్యారు. ఏది చెప్పినా ముక్కలు ముక్కలుగా వుంది తప్పించి, వాటిమధ్య వుండే అవినాభావ సంబంధాన్ని అర్ధంచేసుకోవటంలో లోపం జరిగింది.

నిజానికి కథలో కొన్ని ముఖ్యమైన అంశాలు వున్నాయి కానీ, వాటికి ఇవ్వాల్సిన ప్రాధాన్యత ఇవ్వలేదు. కథ మొదలుపెట్టేదే భూసేకరణ వ్యవసాయం మీద చూపిస్తున్న ప్రభావం గురించి కానీ అదంతా ఒక వ్యక్తిగత అంశంగా మారిపోతుంది. ‘అభివృద్ధి’ పేరు మీద భూసేకరణ అనేది ఎలా జరిగినా గానీ అది అత్యంత బాధాకరమైనది. అవి, జాతీయ ప్రాజెక్ట్ల పేరు మీద ప్రభుత్వాలు చేసినా, కార్పోరేట్ కంపెనీలు చేసినా జరిగేదంతా హక్కుల ఉల్లంఘన, చట్ట ఉల్లంఘన. పునరావాసం పేరుతో జరిగే మోసాలు. ఈరోజు వ్యవసాయానికి, రైతులకు వచ్చిన అతిపెద్ద ముప్పు ఈ భూసేకరణ. లక్షలాది సారవంతమైన పంటభూములు ఈ ప్రాజెక్ట్ల పేరు మీద ధ్వంసం అయిపోయాయి. ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో జరుగుతున్న ముఖ్యమైన విధ్వంసం ఇదే. ఇంకో ముఖ్యమైన విషయం, మద్దతు వ్యవస్థలు లేక, అప్పుల పాలై చనిపోతున్న రైతులు, సంక్షోభం లో కూరుకుపోతున్న వారి కుటుంబాలు. దేశం మొత్తం మీద ఇలా ఆత్మహత్యలు చేసుకున్న కుటుంబాల సంఖ్య 3 లక్షల పైనే వుంది. వారి గురించి ఆలోచించటానికి ప్రభుత్వాలకు సమయం వుండదు. సినిమాలో అమెరికా నుంచి దిగివచ్చిన హీరో ఒక ప్రెస్ మీట్ పెడితేనే స్పందించే ముఖ్యమంత్రి వుంటారు, స్పందించే అపార్ట్ మెంట్ వాసులూ, ఉద్యోగులు, స్కూల్ యాజమాన్యాలు! కానీ, వాస్తవంలో ఎన్ని సార్లు సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని ప్రయత్నించినా పట్టించుకోని ముఖ్య మంత్రులే ఈ రెండు రాష్ట్రాల్లోనూ ఉన్నారు.

ఈ మొత్తం సినిమాలో చికాకు పెట్టిన మరో అంశం ఏమిటంటే, మహిళల పాత్రలను మలిచిన తీరు. ఎం.టెక్ చదవటానికి వచ్చిన హీరోయిన్కి తన వృత్తి పరమైన కెరీర్ పట్ల ఒక స్పష్టత లేకపోవటంగా చూపించటం అనేది ఏ దశాబ్ద కాలం నాటి ఆలోచన! వున్న ఇంకో రెండు మూడు పాత్రలు కూడా కొడుకుల కోసం నిరంతరం ఎదురుచూసే పాత్రలే! అది రిషి తల్లి అయినా, బస్ స్టాండ్ లో వుండే ముసలామే అయినా! ఆఖరికి, హీరో తన స్నేహితుడు రవి ప్రేమించిన అమ్మాయికి ఇచ్చే సలహా కూడా అతన్ని బాగా చూసుకోమనే! ఆఖరికి తాను ఫలానా అయన కొడుకు అని చెప్పుకునే హీరో తనవెన్నంటి ఒక మార్గదర్శి లాగా వుండే తల్లి పేరు చెప్పడు! అవునూ, ఇంతకీ రిషి తల్లి పాత్ర పేరేమిటి ఈ సినిమాలో ? ఎవరికన్నా తెలుసా? ఈ కొడుకుల్ని, మొగుళ్ళని, ప్రియుల్ని చూసుకోవడం తప్పించి ఆడవాళ్ళకు ఇంక చేయాల్సిన పనులేమి వుండవు మరి! నాకు ఇక్కడ కూడా ఇదే కథను హీరోయిన్ దృష్తి కోణం నుంచి రాస్తే ఎలా వుంటుంది అనే ఒక చిలిపి ఆలోచన వచ్చింది. పూజాని ప్రేమించిన రిషి, కెరీర్ కోసం ఆమె తనను వదిలేసి వెళితే ఎలా స్పందిస్తాడు! అమ్మో, తీసేవాళ్ల, చూసేవాళ్ల మనోభావాలు దెబ్బతినవు?

ఇక్కొక్క పెద్ద జండర్ బ్లైండ్నెస్ గురించి చెప్పి ముగించేస్తాను. భారతదేశ వ్యవసాయంలో 68% మహిళలు ఉన్నారన్నది అధికార గణాంకాలు చెప్తున్నాయి. రైతులుగా, వ్యవసాయ శ్రామికులుగా అడుగడుగునా వీరి ప్రమేయం లేకుండా వ్యవసాయం ముందుకు వెళ్ళే ప్రసక్తే లేదు. వారెవరూ ఈ సినిమాలో మచ్చుకి కూడా పొలాల్లో గానీ, పోరాటంలో గానీ ఎక్కడా కనిపించరు. రైతు అంటే కేవలం పంచె పైకెగట్టి తలకు తుండు గుడ్డ చుట్టే మగవాళ్ళు అనే ఆలోచనలోనే ఆగిపోవటం దానికి కారణం. నిజానికి మన దేశంలో వ్యవసాయం బరువు బాధ్యతలు మోస్తున్నది ప్రధానంగా మహిళలే అనే విషయం డైరెక్టర్కి ఎందుకు తెలియలేదు! కేవలం సెల్ఫీలు దిగటానికి పనికి వచ్చే వీకెండ్ వ్యవహారంగా వ్యవసాయాన్ని చూపించడంలో విజయవంతమయ్యారనుకుంటా!

సినిమాని విమర్శించి నంత తేలిక కాదు ఒక సినిమా తీయడమంటే అని ఈ మధ్య పదే పదే ఒక మాట వింటున్నాం. నిజమే, ఏ వృత్తి కూడా సులభమైన విషయం కాదు. వ్యవసాయం కూడా అంతే. కానీ మనసు పెట్టి చేస్తే అన్ని విషయాలు అర్థమవుతాయి కదా! ఒక సామాజిక పరమైన కథనం తీసుకున్నప్పుడు దానిలో వుండే అనేక అంశాల ప్రాధాన్యతను కూడా చూడగలిగితే బాగుండేది. వ్యాపారం పేరు మీద వాటిని కప్పెట్టేస్తారా?

ఇప్పటివరకూ రైతుల అంశాలు రాజకీయ నాయకులకు వోట్లు కురిపించే బంగారు బాతులు అని తెలుసు కానీ ఇప్పుడు సినిమా వాళ్లకు కూడా కాసులు కురిపించే అంశం అన్నమాట!? సినిమాలో హీరో 90% తన ఆదాయాన్ని రైతుల సంక్షేమం కోసం ప్రకటించడం, వినడానికి చూడటానికి చాలా బాగుంది కానీ, ఈ సినిమా కి వచ్చిన లాభాలలో కనీసం 25% ఈ రైతు ఆత్మహత్య బాధితుల కుటుంబాల లోని పిల్లల చదువుకి, ఆ కుటుంబాలు నిలదొక్కుకోవటానికి అందజేసే హృదయం ఈ చిత్ర హీరో మహేష్ బాబుకి, దర్శక, నిర్మాతలకు వుందా?

*

సజయ. కె

సజయ. కె

29 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

 • Well said Sajaya good analysis
  I understood thatnothing will change in our Telugu film industry I can skip watching this s film

 • గొప్పగా రాసారండి. మా వాడు కూడా life లో success కొట్టాల్సిందే అనిపిస్తుంది ….అగ్రికల్చర్ interest ఉన్నవాళ్లే చదువుకుని అలా చేయగలరు అన్నాడు movie చూసి. ఇప్పటి పిల్లల ఆలోచనే ఇంతేనేమో.
  నేను సినిమా చూడలేదు. మళ్లీ నాతో చూస్తాను అన్నాడు. మీరు రాసింది చదివాక వెళ్లి చూడాలనే ఉంది.చూస్తా.

  • థాంక్యూ నిత్యా! వ్యవసాయం మన జీవితంలో ఒక మరవకూడని భాగం అని సమాజం మరిచి పోయింది. ఇంక ఈ వయసు పిల్లల కు ముఖ్యంగా నగర పట్టణ ప్రాంతాల్లో అసలు తెలియదు. కానీ గ్రామీణ శ్రామికుల పిల్లల నిత్యజీవితంలో అది రోజువారీ జీవితం. కానీ, ఆధునిక ప్రపంచం వారిని గుర్తించదు. వారి అనుభవానికి విలువ ఇవ్వదు. అదే, ఇంటర్నేషనల్ స్కూల్స్ లో చదివే పిల్లలు ఒకరోజు పొలం గట్టుమీద నిలబడినా గానీ అపురూపమైన దృశ్యం గా ప్రాజెక్ట్ చేస్తారు.

   • Pune based krishi vigyan Kendra కి ప్రతీ వీకెండ్ అప్పుడూ వెళ్ళి వ్యవసాయం గురించి తెలుసుకుని పిల్లలకూ చూపించి ఆ inspirationతో జాబ్ resign చేసి మరీ వ్యవసాయం చేసిన కొంతమందిని చూశాను. కానీ వాళ్ళు ఆ పని చేసినందుకు ఇంట్లో వాళ్ళతో సహా ఎవరూ ప్రోత్సహించలే. దు. అందులో సక్సెస్ అయ్యాకే విలువ తెలిసింది. కానీ అంత ఇష్టంతో ధైర్యంతో కష్టపడటానికి సిధ్ధం అయ్యే వాళ్ళు తక్కువ. ఇప్పటి తరం వాళ్ళలో చాలా మటుకు తమకు ఇష్టం అయినవే చేయడానికి సిధ్ధపడుతున్నారు…ఇలా వ్యవసాయం కూడా. అది కొంచెం సంతోషం కలిగిస్తుంది.

 • ఈ రోజుల్లో సినిమా ప్రభావం చాలా మంది యువత మీద ఉంది, ఈ మధ్య మా సహొధ్యొగి ఒకరు సినిమా చూసి అన్నారు, 3 రకాల విషయాలను ఒకె చోట చూపడానికి ప్రయత్నించారని, కాని యువతకు ఒక ఎంటర్టైనమెంట్ లాగనె ఉంది, కాని స్ట్రాంగ్ మెసేజ్ రైతు గురించి వెళ్లలేదు అని, రైతు పట్ల వ్యవహరించవలసిన,చూడ వలసిన విధానమూ మారవలసి ఉన్నది,

  మీరు వ్రాసిన ఆర్టికల్ చదివిన తర్వాత, సినిమా చూడాలని అనుకుంటున్నాను,

  • థాంక్యూ కృష్ణమూర్తి గారు! ఆలోచనా విధానం మారటమే పెద్ద విషయం.

 • మీ విశ్లేషణ చాలా బాగుంది సజయా గారు…మీరు వేసిన ప్రశ్నలు కూడా బాగున్నాయి…మీరు చెప్పినవి జరగాలంటే…మహిళలు సినీపరిశ్రమ లోకి రావాలిసిన అవసరం ఉంది….ఉన్న వాళ్ళు కూడా పురుషుడి వైపునుంచే కథని చూస్తున్నారు….వాస్తవం వేరు…కల్పన వేరు…. ఇది సినిమా వ్యవసాయం….మనిషికి అవసరమైనవి పండించరు….కాసులు వచ్చేవి పండిస్తారు….మీరు చెప్పేవి అక్షర సత్యాలు….కొత్తవాళ్ళు రావాలి ..కాసుల కోసం కాకుండ జనం కి పనికివచ్చే సినిమాలు తీయాలి… ఆరోజులు వస్తాయని కోరుకుంటూ….మీరు సినిమాని చక్కగా విశ్లేషించినందుకు అభినందనలు తెలుపుతూ… ముందు ముందు…ఇలాగే విశ్లేషణలు రాస్తారని ఆశిస్తున్నాను సజయా గారు

  • థాంక్యూ హరిశ్చంద్ర గారు! సినిమా రంగంలో స్త్రీలు వున్నారు కానీ తీవ్రమైన లైంగిక, ఆర్ధిక దోపిడీలకు గురవుతున్నారు అని మనకు బోలెడన్ని సంఘటనలు తెలియ జేస్తున్నాయి.
   తెలుగు సినిమా రంగం సామాజిక దృష్టి కోణంలో చాలా ఎద గాలి. ఫ్యూడల్ భావజాలం వదిలించుకుని ప్రజాస్వామ్య భావనలు అలవర్చుకోవాలి.

 • మీరు రాసిన వాటిలో చాలా వాస్తవాలున్నాయి సర్ , ముందు హీరో మహేష్ , దర్శకుడు సూపర్ స్టార్ కృష్ణ గారిని కలిసి ఎలా తీయాలో అని అడిగితే తగు సూచనలు చేశారు. సినిమాగానే తీసారు తప్ప సమస్యలకు సరైన పరిష్కారం చూపలేకపోయారన్న మీ అభిప్రాయంతో సంపూర్ణంగా ఏకీభవిస్తున్నా.

 • సజయ గారు, సినిమా నేను చూడలేదు కానీ .. రివ్యూ నచ్చింది . సక్సెస్ గురించి మెసేజ్ ఇవ్వడం లో సినిమా ఉద్దేశం కూడా అదేనేమో. పెట్టుబడి కి పదింతలు రాబట్టాలనే. వ్యవసాయం, వ్యాపారం ఒకటి కాదని తెలీదా? ఎక్కడో చదివాను ..బాలగోపాల్ గారు అనుకుంటా… (pl correct me if I am wrong) నాగార్జునసాగర్ వచ్చాక, అక్కడ చుట్టు ప్రక్కల భూములు సస్యశ్యామలం అవగా, పెరిగిన సంపద, ఆదాయం దారి మళ్ళి సినిమారంగానికి చేరిందని. ఇప్పుడు చతికిల పడిన వ్యవసాయ రంగానికి సినిమా రంగం న్యాయం గా తిరిగి ఇవ్వాలి.

  • కోస్తా ఆంధ్రా నుంచి వ్యవసాయ మిగులే సినిమా రంగానికి వచ్చిన పెట్టుబడి సునీత గారు. నాగార్జున సాగర్ గురించి బాలగోపాల్ చెప్పింది కరక్టే. వ్యవసాయాన్ని ధ్వంసం చేసిందే వాళ్లు.

 • వాస్తవాలను అధ్యయనం చేయకుండా, మన తెలుగు దర్శకులు తమ మేథో చిత్రాన్ని వాళ్లకు నచ్చినట్లు ఆవిష్కరించుకుని నవ్వుల పాలు కావడం తరచుగా జరిగేదే. హీరో ఇమేజ్ ని బట్టి ఏది తీసినా అమాయక ప్రేక్షకులు చూస్తారనే ధీమాతో నాలుగు సినిమాలు కలిపి రుబ్బి ఇలాంటి మిక్సర్ చిత్రాలను జనం పైకి వదులుతుంటారు. నిజానికి తెలుగు చిత్ర దర్శకుల్లో చాలా మంది కి అహంకారం, మితిమీరిన ఆత్మవిశ్వాసం తప్ప ఉండాల్సిన లక్షణాలు లేవు.

  • కరెక్టు చెప్పారు శంకర్ ప్రసాద్ గారూ! ధన్యవాదాలు

 • సజయ నమస్తె ! సినిమా చూడలేదు.చూస్తాను,ట్రయల్చూస్తన్నము.భరత్అనేనేను’ ఫ్యన్సీఎక్స్ప్రెషన్ నిజానికి సాద్యమయ్యేవేనా అని అనిపిస్తది నిజానికి మహేబాబు కనక సియం ఐతె.
  మహర్షిసినిమాగురించి—మీరు రాసిన నాలుగుమాటలు బాగున్నాయి. 65 శాతం గా నిమగ్నమై నిబద్దతతో పనిచేస్తున్న స్త్రీల రోల్గురించి ప్రస్తావన లేకపోవడం మీరుగమనించడం. సినిమాలో వచ్చిన లాబాల్లో 25% సియం రిలీఫ్ఫండ్లో జమచేస్తే. అలాచేస్తెపబ్లిసిటీఇచ్చుకుంటె అదనంగా 100కోట్లు కలెక్షన్ వస్తుందికదా.ఈ రెండు చలి రాయటానికి కేవలం 75 నిమిషాలు పట్టింది

  • థాంక్యూ బాలరాజు! వాళ్ల నిజాయితీ ఎంతో చూద్దాం!

 • ఇప్పుడే చదివాను. చాల బాగా విశ్లేషించారు.ముఖ్యంగా వ్యవసాయం అనేసరికి మగవాడినే చూపుతారు కానీ అంతే శ్రమనిచేసే మహిళగుర్తుకురాదుఅనేది.బాగాచెప్పారు.నిజానికి ఏ వృత్తి అయినా అందులో భాగస్వామ్యం మహిళకు కూడా అంతే ఉంటుంది.మహిళ అప్పుడుకూడా ఇంటిపనితో పాటూ వృత్తిపనిలోనూ సహాయపడుతుంది.

 • సజయ గారు,
  మీ సూటి ప్రశ్న….
  “సినిమాలో హీరో 90% తన ఆదాయాన్ని రైతుల సంక్షేమం కోసం ప్రకటించడం, వినడానికి చూడటానికి చాలా బాగుంది కానీ, ఈ సినిమా కి వచ్చిన లాభాలలో కనీసం 25% ఈ రైతు ఆత్మహత్య బాధితుల కుటుంబాల లోని పిల్లల చదువుకి, ఆ కుటుంబాలు నిలదొక్కుకోవటానికి అందజేసే హృదయం ఈ చిత్ర హీరో మహేష్ బాబుకి, దర్శక, నిర్మాతలకు వుందా?”
  ఈ సినిమాకు నిర్మాతలు ముగ్గురు. దర్శక నిర్మాతలు, హీరో మీరు చెప్పిన పని చేస్తే… ఆ ఐదుగురూ రియల్ హీరోలు అవుతారు. కానీ వాళ్ళు ఆ పని చేయాలిగా..

 • సజయ చాల బాగా విశ్లేషణ చేసారు. మీరన్నట్లు 25% ఇచ్చే సహృదయత ఉందంటారా ? మొన్ననే ఏదో discuss చేస్తున్నప్పుడు అనిపించింది. మనలో ఎంతమందిమి రైతుల గురుంచి కనీసం ఆలోచిస్తున్నాము. అందుకు తగ్గ ఏదైనా ఒక కొత్త ఆలోచన ప్రతిపాదిస్తే సినిమాలో బావుండేదోమో ? కాకపోతే రైతు కూడా కమర్షియల్ కధా వస్తువు అయిపోయడనే ది ముల్లుల్లా గుచ్చుతోంది.

 • Sajayaji..what you said is cent percent correct. But అర్ధం పర్ధం లేని ప్రేమ కథల కన్నా యువకుడు ముఖ్యమంత్రి అయితే ఏం చె.
  య్యొచ్చు ? గ్రామాలను దత్తత తీసుకుని ఎలా బాగు చెయ్యొచ్చు? వ్యవసాయం చేసే రైతు పరిస్థితి ఏంటి? అన్న అవగాహనా దిశకు యువతకు కొంచెమైనా ఆలోచింపచేసేట్టుగా సినిమా లుండడం కాస్త ఆశావహంగా ఉంది అని నా ఉద్దేశ్యం. ` `

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు