మళ్ళీ మా ఊరెళితే బాగుండు!

HAIDARAABAADH డేస్ అను పల్లెటూరోని కైతలు – 6

లిగిపోయిన దేహంతో
ఎటు చూసినా ఏముంది
అంతా ఒక దిగులు
ఒక బెంగ
సంతోషం లేదు
మనుషులతో సరిపడదు
ఎం చేయాలో తెలీదు
మళ్ళీ మా ఊరెళితే బాగుండు అనిపిస్తోంది
చల్లగా చెట్టు నీడన కూసింత సేపయినా నిద్రించాలని ఉంది
అమ్మ వాళ్ళకి ఏం మిగిల్చాను
నన్ను కన్నందుకు అదే కూలి బతుకుని తప్పా
వయసు ఉంది కానీ అస్సహాయత
కాస్తంత కునుకు పాటు తల్లిదండ్రులకు ఇవ్వలేని వాణ్ణి
ఈ నగరంలో వేల లైట్ల కాంతుల మధ్య
ఆకాశంలో రెపరెపలాడే నక్షత్రాల మధ్య చీకటిలో మగ్గుతున్నవాణ్ణి
మా ఊరొదిలి వచ్చి ఏం సాధించాను
ఓటమో ఏడుపో దిగులో
సరే ఇవేవి కాదు ఒక ఒంటరితనమో
మనిషిగా పుట్టి కోల్పోవడం అన్నది విషాదమే కానీ
దీనిని ఎవరు ఆప గలరు
మనుషుల్ని యంత్రాల మధ్య ఆడించే
సామాజిక శక్తులు ఏమిటో నాకు తెలుసు
ప్రాన్సులో, లండన్లో పసి పిల్లలు పదారు గంటలు
నిద్రమాత్రల మత్తులో జోగాడుతున్నప్పుడు
మార్క్స్ కార్చిన కన్నీటి చుక్కల రూపాంతరమే
నేటి ఈ నగరంలో చేరిన పల్లెటూరి యువకుని ఒంటరి తనం.
దీనిని ఆర్థిక సూత్రాలతో కొలిచే ముందు
ఇది మనిషి ఒంటరి తనపు బానిసత్వం అని తెలుసు.
కానీ దీనికి కారణం ఎవరు?
మనిషిని ఒంటరి వాణ్ణి చేయటం కన్నా
సామాజిక శక్తులకు విజయం ఎక్కడుంది?
చూడండి! అనాగరికులని ముద్రపడి
అదే ప్రాచీన మట్టిలో బతుకుని వెళ్లదీసే
మా ఊరి మనుషుల మధ్య ఉన్న
సామాజిక ఒడంబడిక గురించి ఏ జాన్ లాక్ చెబుతాడు
నగరం ఒక పెట్టుబడి దారుడి ఒంపుడి గత్తె
అది క్యాప్టలిస్ట్ సొంత ఆస్తి.
అవును… నేనిప్పుడు నగరం గురించే మాట్లాడుతున్నాను.
కారల్ మార్క్స్ గురించే మాట్లాడుతున్నాను.
ఇక్కడ అంబేద్కర్ ప్రస్తావన మీకు కావాలంటే
క్యాప్టలిస్ట్ ఆధిపత్యం కోసం పాకులాడే
ఐక్యరాహిత్య దొంగ దళితబహుజన మేధావుల లారా?
మీరు కులం గజ్జి కుక్కని అమాయకులపైకి వదిలి పబ్బం గడుపుకొని
మనువుతో మద్యం సేవిస్తున్నారు.
నేను ఎర్ర ముసుగు మనువులకు వకల్తా పుచ్చుకున్నాను అనుకుంటే
అప్పుడే మీ బుర్రలో మద్యం మత్తు నిండుగా చేరినట్లే.
అసలు నగరాలను నిర్మించిన వాడెవడు?
నగరాలు, పచ్చని అడవుల్లో అనకొండలు
అవి సూర్యుణ్ణి పడగ కింద కప్పి పావురాల్లని మింగుతాయి.
ఇక వెలుగే లేని అడివిలో పచ్చదనానికి తావు లేదు.
అభివృద్ధి గురించి మాట్లాడే ఆర్థిక వేత్తలారా !
నగరాలను కూల్చండని
మీ పేదరిక నిర్మూలన సూత్రాల్లో ఎందుకు ఉండదు?
పల్లెలు సమాధుల తోటలు అవుతున్నప్పుడు
సువార్తలు వల్లించే వ్యవసాయ రంగాల మీద
మీ మొసలి కన్నీటి బజ్జెట్లు ఎందుకు?
మానవుడికి ఇంత తిండి కోసం ఏడుపు ఎందుకు
తల్లి చన్నులకి బిడ్డ పెదాలకి మధ్య ఇంత దూరం ఎందుకు
కాసేపు కంటికి కమ్మని నిద్రపోలేని దుస్థితి ఎందుకు?
ఈ రాత్రి చంద్రుడి మీద కాండ్రించి ఉయ్యాలని ఉంది
అది సిగ్గులేనిది
కళ్ళు లేని నగరంలో పాల కొంగలా ఎగురుతోంది
ఈ మలినమైన గాలి తగిలితేనే చాలు నా మట్టిదేహం నగరమై పోతుంది.
మానవజాతి మానం మీద వ్యాపారం చేసే నగరమా
నిన్ను కుళ్ళిన ధర్మశాస్త్రం అనాలని ఉంది
ఈ నగరం పగటి ముసుగేసుకున్న కఠీన చీకటి దిబ్బ.
*

గూండ్ల వెంకట నారాయణ

Add comment

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు