మరో దశాబ్దంలోకి సారంగ!

ఇది వొక సమిష్టి ప్రయాణం. అందరి సంబరం! ఇంకో పదేళ్ళు ఇలాగే కలిసి ప్రయాణం చేద్దాం!

“సారంగ” ఇవాళ రెండో దశాబ్దంలోకి అడుగు పెడుతోంది!

అంటే, పదేళ్ళు గడిచిపోయాయి. ఈ పదేళ్ళలో “సారంగ” అంటే వొక ఆత్మీయత, భిన్నతరాల రచయితలూ, పాఠకుల వేదిక. ఈ ప్రయాణం చిన్నదేమీ కాదు. కాలం దానికదే దీర్ఘమే అనుకుంటే అనుభవాల రాపిడి దానికి పదింతల వయసులోకి తీసుకెళ్తుంది. ఈ అనుభవాలన్నీటిని ఇవాళ వెనక్కి తిరిగి చూసుకుంటే, కొన్ని విస్మయాలూ, కొన్ని ఆశ్చర్యాలూ, కొన్ని మందహాసాలూ, కొన్ని నిట్టూర్పులు. ఇవిగాక ఇంకా అనేకానేక అనుభూతుల వరసని ఏకరువు పెట్టచ్చు. అన్నిటికంటే మించి- “సారంగ” సగర్వంగా పదిలపరచుకునే అనుభవం మాత్రం- కొత్త తరం రచయితల్నీ, పాఠకులనీ వొక దగ్గిరకి తీసుకువచ్చి, వాళ్ళ మనోసంగీతాన్ని అందంగా వినిపించడం!

“సారంగ” వెబ్ పత్రిక మొదటి సంచిక పదేళ్ళ కిందట కనిపించినప్పుడు “ఇది మూడు నెలల ముచ్చటే!” అని పెదవి విరిచిన వాళ్ళున్నారు. మాకున్న పనుల వొత్తిడి వల్లా, time is money అనుకునే ఈ కాలపు ప్రయోజనవాదం వల్లా అలా అనుకోవడంలో ఆశ్చర్యమేమీ లేదు. డబ్బుగా తర్జుమా కానిదేదీ నాలుగునాళ్ళు నిలబడదనే ధోరణి సాహిత్యలోకంలో కూడా పెరుగుతూనే వుంది. అవార్డులో, నగదు మొత్తాలో  కొలమానాలుగా వుంటే  కానీ సృజనాత్మకత కట్టలు తెంచుకొని ప్రవహించలేని కాలం ఇది. అలాంటి రచనల్లో సృజనాత్మక అన్వేషణ లేదని కాదు. లేకపోతే ఆ మాత్రం కూడా వాక్యాలు కదలవు. ఈ బహుమానాల కొలమానాలు లేని నిన్నమొన్నటి కాలాల్లో గొప్ప రచనలు ఎన్నో వచ్చాయి. ఎలాంటి గోడచేర్పులు  లేకుండానే  ఆ బంగారమంతా నిలిచి మెరిసింది. అందుకే, మళ్ళీ చలం, మళ్ళీ కొడవటిగంటి, మళ్ళీ శ్రీదేవి, మళ్ళీ రంగనాయకమ్మ, మళ్ళీ బుచ్చిబాబు, మళ్ళీ శ్రీశ్రీ, మళ్ళీ జాషువా, మళ్ళీ దేవులపల్లి, మళ్ళీ బైరాగి, తిలక్, శివసాగర్—మన ఇప్పటి లోకంలోనూ తళుక్కున మెరుస్తూనే వున్నారు. వాళ్ళని తలచుకునేటప్పుడు వాళ్ళ కాలాల నిర్దాక్షిణ్యతని కూడా మనం గుర్తుచేసుకుంటూనే వున్నాం.

సాహిత్యానికి దానికదే వొక సొంత వెలుగు వుండి తీరాలి. రచయిత గానీ, కవిగానీ, విమర్శకులు గానీ తమదే అయిన బతుకు పుస్తకాల నుంచి పలకరిస్తూనే వుండాలి. ఈ పలకరింతకి ఇంకో కృత్రిమమైన నగిషీ అసలే అక్కర్లేదు. ప్రచురణకర్తల ప్రచార ఆర్భాటమో, పత్రికల ప్రమోషన్ వంతలో, సంఘాల ఎజెండాలలోంచో ఆ వెలుగు రాదు. పరిమితమైన స్వేచ్చతో పనిచేసే అచ్చు పత్రికలు గానీ, కొంత వెసులుబాటున్న స్వేచ్చతో వెలువడుతున్న వెబ్ పత్రికలు గానీ ఈ వెలుగుని ప్రసరించడంలో కొంత నిలకడగా పనిచేయాల్సిన సందర్భం ఇప్పుడు వచ్చేసింది. ముఖ్యంగా, వెబ్ పత్రికలు ఇంతకుముందు కంటే ఎక్కువ ప్రభావాన్ని చూపించే వాతావరణం ఇప్పుడు ఏర్పడి వుంది. ఈ ప్రభావం ఎలా వుండాలి అన్న విషయంలో కూడా ఇప్పుడు చర్చోపచర్చలు జరుగుతూనే వున్నాయి.

ఈ విషయంలో తన వంతు బాధ్యత పరిమితమైందే అని “సారంగ” నమ్మకం. ఏ పత్రికా, ఏ ప్రచురణ సంస్థా రచయితల్ని సృష్టించే కర్మాగారం కాదు. రచయితల్ని ఫ్యాక్టరీ కార్మికులుగానో, సరుకులుగానో భావించడం అన్యాయం. రచయిత సృజనాత్మక సరళి మీద భరోసా వుండాలి. రచనగా రూపు దిద్దుకునే క్రమంలో ఆ రచయిత ఎదుర్కొనే ఆలోచనల రాపిడి మీద మనకి గౌరవం వుండాలి. బయటి శక్తులుగా – అంటే ప్రచురణ కర్తలుగానో, ఎడిటర్లుగానో, పాఠకులుగానో- ఆ రచనలో మన ప్రమేయానికి తప్పనిసరిగా పరిమితులున్నాయి. ఇక్కడ అకారణమైన అనవసరమైన దూకుడు వల్ల రచన పూర్తిగా దాని సహజత్వాన్ని పోగొట్టుకునే ప్రమాదం వుంది. మొదటి నుంచీ “సారంగ” ఈ విషయంలో తన పరిమితుల్లో తాను సంచరిస్తోంది.

ముఖ్యంగా, సంపాదకులు స్వయంగా రచయితలు అయినప్పుడు ఇంకొన్ని అదనపు కష్టాలుంటాయి. వాటిల్లో వొకటి: తమ రచనలకు సమయం పెట్టలేకపోవడం! ఈ పదేళ్ళలో “సారంగ” కి ఎప్పుడూ రచనల కరువు లేకపోగా, ప్రతి రోజూ లెక్కకి అందనన్ని కథలూ, కవితలూ, వ్యాసాలూ వస్తున్నాయి. ప్రతి రచననీ మేం శ్రద్ధగా చదవాల్సిందే. ప్రముఖులు కదా అని పైపైనా, కొత్త వాళ్ళు కదా అని అక్షరక్షరం పట్టి పట్టి చదవడానికి లేదు. డ్రాఫ్టింగ్ విషయానికి వస్తే, ఇద్దరూ వొకే విధమైన పొరపాట్లు చేస్తూనే వుంటారు. రచనల విషయంలో మేం కొందరు సమీక్షకుల ఫీడ్ బాక్ తీసుకుంటున్నప్పటికీ, డ్రాఫ్టింగ్ జాగ్రత్తలు మేమే తీసుకోవాలి. ప్రచురణకి పంపించే తుది ప్రతి ఎలా వుండాలి అన్న విషయంలో మనం ఇంకా చాలా నేర్చుకోవాలి. సాంకేతికంగా ఎలా వున్నా, తన రచనని తానే రెండు మూడు సార్లు తిరగ చదువుకునే అలవాటు చాలా అవసరం అని మాకు అనేక సార్లు అనిపించింది.  రచయితలు అలా చేయగలిగితే, మా సమయం చాలా కాపాడిన వాళ్ళు అవుతారు.

ఈ పదేళ్ళలో “సారంగ” లో రచనల ప్రచురణ పద్ధతులు మారాయి. వొక రచన రాగానే వెంటనే ఏదో వొక సమాధానమివ్వాలన్న తొందర మాకు లేదు. ఆ రచనని వీలైనంత తొందర్లో చదువుతున్నాం. మా వీలునిబట్టి  ఇతర సమీక్షకులకు పంపిస్తున్నాం. వాళ్ళ సలహాలూ సూచనలూ తీసుకొని, రచయితలకు పంపిస్తున్నాం. వాటిని ఎంతవరకు స్వీకరించాలన్న స్వేచ్చని ఆ రచయితలకే వదిలివేస్తున్నాం. అదే ధోరణిని ఇక ముందు కూడా కొనసాగిస్తాం. అయితే, వొక విషయం మాత్రం గమనించాం. పంపించిన రచనకూ, అచ్చయిన రచనకూ మధ్య జరుగుతున్న ప్రయాణాన్ని చాలా మంది “సారంగ” రచయితలూ, కవులూ సహృదయంతో అర్థం చేసుకుంటున్నారు. మా సమీక్షకుల సూచనల్ని చేయి చాచి అందుకుంటున్నారు. ఇలాంటి కరచాలనాలు సాహిత్య పరిణతికి బలానిస్తాయి. సాహిత్య బంధాన్ని పదిలం చేస్తాయి. ఈ క్రమంలో రచనల అచ్చులో కొంత ఆలస్యం అవుతున్న మాట నిజం. కానీ, ఆ ఆలస్యం వల్ల మంచి జరుగుతోందన్న నమ్మకం చాలా మంది “సారంగ” రచయితల్లో ఇప్పుడు ఏర్పడింది.

అలాంటి అవగాహనే లేకపోతే, నిజమే- సారంగ మాత్రమే కాదు, ఇంకే దారి అయినా మూసుకుపోతుంది. ప్రయాణం అర్థాంతరంగానే ఆగిపోతుంది. ఈ పదేళ్ళ “సారంగ” కృషిలో మేం ఎంత సమయం వెచ్చించామో, అంతకు రెట్టింపు సమయాన్ని రచయితలూ, పాఠకులూ వెచ్చించారు.  కాబట్టి, ఇది వొక సమిష్టి ప్రయాణం. అందరి సంబరం! ఇంకో పదేళ్ళు ఇలాగే కలిసి ప్రయాణం చేద్దాం!

ఇతరుల రచనలు చదివే అలవాటు క్రమంగా తగ్గిపోతున్న కాలంలో  ప్రస్తుత సారంగ కాలమిష్టులు చేస్తున్న కృషిని ఈ సందర్భంగా ప్రత్యేకంగా మేం గుర్తు చేసుకోవాలి. ప్రతి కథనీ ఎంతో ప్రేమగా చదువుకొని, ఆ కథ గురించి మనసు లోతుల్లోంచి రాస్తారు ఆర్. ఎం. ఉమా మహేశ్వర రావు. ఎంతో మంది కొత్త కథకుల్ని “సారంగ” వేదిక మీద పరిచయం చేస్తున్నారు సాయి వంశీ. ప్రతి సంచిక కోసం కొత్త కథల్ని ఆహ్వానించి, వాటిని చదివి, ఆ ప్రతిని ఎంతో శ్రద్ధతో తిరగరాసి, ఆ రచయితతో ముఖాముఖీ చేస్తున్నారు. ఇలాంటి కృషికి పునాది వేసిన వేంపల్లె షరీఫ్, చందు తులసి, శ్రీధర్ వెల్డండి, రమణమూర్తి  తదితరులను  మరచిపోలేము.

ఇక  శ్రీనివాస్ బందా అందిస్తున్న ఆడియో వీడియోలు సారంగ కి అదనపు అలంకారం. వొక రచనని చదవడంలో ఆయన సాధించిన పరిణతీ, నేర్పూ, ఆ స్వరంలోని ఆత్మీయతా- వాటి గురించి ఎంత చెప్పినా తక్కువే. ఈ మధ్య కాలంలో ఎక్కువ అభిమానుల్ని సంపాదించుకున్న ఇంగ్లీషు సారంగని  ఎంతమంది తెలుగు పాఠకులు అనుసరిస్తున్నారో ఇంకా కచ్చితంగా తెలీదు. కానీ, ఈ ఇంగ్లీషు సారంగలో నౌడూరి మూర్తి గారి కథానువాదాలు, అప్పుడప్పుడూ ప్రచురిస్తున్న అల్లాడి ఉమా, ఎమ్. శ్రీధర్ ల అనువాదాలు  సారంగ అందిస్తున్న ప్రత్యేక కానుక! అలాగే, మేం ఎప్పుడు ఏ రచన పంపించినా, విసుక్కోకుండా తమ ఫీడ్ బాక్ అందిస్తున్న రచయితలూ, విమర్శకులకి మా థాంక్స్! సారంగ లో కనిపించే చిత్రకారులు చరణ్ పరిమి, అన్వర్, రాజ్ చంద్రం, సృజన్ రాజ్, తిలక్ లకు మా ధన్యవాదాలు.

ఇక సారంగని అభిమానించే పాఠకులుగా మీరు చేయాల్సిందల్లా వొక్కటే: చదివిన ప్రతి రచన గురించి మీ ప్రతిస్పందన రాయండి. రచయితల్ని ప్రోత్సహించండి. సారంగలో మీ భాగస్వామ్యం- అదే సారంగకి సగం బలం!

*

చిత్రం: చరణ్ పరిమి 

ఎడిటర్

11 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

 • మూడో దశాబ్దం లోకి అడుగుపెడుతున్న సారంగ కు శాబాభివందనములు.

 • సారంగ మిత్రులకు అభినందనలు. నాకు సాహిత్యంపై మక్కువ తక్కువే. అయినా, అప్పుడప్పుడు ఇలా వచ్చి అలా వెళ్తుంటాను. కొన్నింటిని ఆసాంతం చదువుతుంటాను. నాకు ఇష్టమైన పదాలున్నా, భావాలున్నా మళ్లీ మళ్లీ చదువుతుంటా. సారంగ పత్రికలోని కథలనూ అంతే చదువుతుంటా. చాలా వరకు నచ్చినవే ఉన్నాయి. కథల్లో విషయం ఉంటుంది. జీవితంతో ముడిపడ్డ బంధాలుంటాయి. ఈ సారంగ పదేళ్లు పూర్తి చేసుకోవడం ఆనందదాయకం. సంతోషం. నాలాంటి సామాన్య పాఠకుడిని కూడా ఇటుగా తీసుకొచ్చారంటే..అది కథకుల గొప్పతనమే. సాహిత్య విలువలు పెంచుతూ…మంచి అభిప్రాయాలను, మంచి రచనలను పంచుతూ మునుముందుకు సాగాలని అభిలషిస్తాను. ఎడిటర్ రాసిన ఆశావహ పరిణామాలను కూడా చదివాను. బాగుంది. సారంగ మిత్రులందరికీ అభినందనలు, శుభాకాంక్షలు.

 • ఇంకో పదేళ్ళు ఇలాగే కలిసి ప్రయాణం చేద్దాం!… అన్నారు. పదేళ్ళు మాత్రమే అని ఎందుకనుకోవాలి?
  చక్కటి సాహితీ పత్రిక.
  వందేళ్ళు కొనసాగాలని ఆకాంక్షిస్తూ….

 • మరెన్నోదశాబ్దాలుఇలాగేసాగాలి.
  శుభాభినందనలు.

 • సాహిత్య ప్రయోజనాన్ని తప్ప మరే ఇతర ప్రయోజనాన్నీ ఆశించకుండా, పది సంవత్సరాలు ఒక వెబ్ పత్రికని కొనసాగించడం సామాన్య విషయం కాదు.

  అందుకు మీ సంపాదక వర్గానికి హృదయపూర్వక అభినందనలు.

  మరొక దశాబ్దంలోకి అడుగుపెడుతున్న శుభ తరుణంలో, సారంగ పదికాలాలపాటు వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.

  ఎన్. ఎస్. మూర్తి.

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు