“మరీ లేత కుర్రాడట…!”

“ఈవారం ప్రభ చూసావా? పద్మనాభం సినిమాలో ఎవరో కొత్త కుర్రాడు పాడుతున్నాడట…” క్లాసురూంలో పక్కనే గుసగుసలాడాడు శ్రీగిరిరాజు దుర్గాప్రసాద్.

 1. ఎసెల్సీ రోజులు.

చదువుతోబాటు పుస్తకాలూ సినిమాలూ అంటే పడి చచ్చే బృందమొకటి ఉండేది. నేను, దుర్గాప్రసాద్, విష్ణు, శివరామకృష్ణ. విజయవాడ సీవీయార్ స్కూలు. మళ్లీ ఆటల బృందం వేరే.

‘అగ్గిపిడుగు’నుంచి ‘సుమంగళి’దాకానూ, ‘కౌసల్యాదేవి’నుంచి ‘ముప్పాళ్ల’దాకానూ ఏదీ ఎవర్నీ వదలని ఉదార అభిమానాలు మావి. (అగ్గిపిడుగునీ కౌసల్యాదేవినీ దాటడానికి మరో రెండేళ్లు పట్టింది). కానీ పాటల విషయానికొస్తే ఘంటసాలనుగాకుండా పీబీ శ్రీనివాస్‌ను అభిమానించాం. ‘ఆడబ్రతుకు’, ‘ప్రేమించిచూడు’ సినిమాల్లో శ్రీనివాస్ సర్వం తానై స్వరం కలిపితే బాగా సంతోషించాం. మోహన్రాజులాంటి కొత్త గాయకులు సాక్షిలో కనిపిస్తే ఆశగా చూశాం.

“మరీ లేత కుర్రాడట. ఏదో పాటలపోటీలో కోదండపాణికి నచ్చాడట. ఈ అవకాశం ఇస్తున్నాడట”. విష్ణు అదనపు సమాచారం.

ఆ కుర్రాడు – ఎస్ పి బాలసుబ్రమణ్యం – 1966 చివరిలో పాట రికార్డ్ చేశాడు. 67లో ఆ శ్రీశ్రీశ్రీ మర్యాదరామన్న కథ విడుదలైంది. “ఏకంగా వీరాభిమన్యుడికే పాడాడే! అందులోనూ మరో ముగ్గురు హేమాహేమీల మధ్య! పర్లేదు. గొంతు వినిపించగలిగాడు. కానీ కుర్రాడు ఎంతకాలం నిలబడబోతున్నాడో చెప్పలేం. చూద్దాం”. మా జ్ఞానబృందపు తీర్పు!

67లోనే వచ్చిన ‘ప్రైవేటు మాస్టారు’ సినిమాలో “పాడుకో పాడుకో” అంటూ బాలసుబ్రమణ్యం పాడటం గమనించాం. 68 తొలిదినాలలో ‘మేడంటే మేడా కాదు…’ అంటూ కోదండపాణికే పాడటం చూశాం. పాట హిట్టయినా దాన్ని ‘ఇది మల్లెలవేళయనీ’ బాగా డామినేట్ చేసేసింది.

 1. కాలేజీ మెట్లెక్కిన తొలిదినాలు. ఇంటినుంచి ఎస్సారార్ కాలేజ్ మైలు దూరం. ఓ అక్టోబరు సాయంత్రాన చుట్టుగుంట ప్రాంతంలో నడుస్తూ ఉండగా ఎక్కడ్నించో ‘ఓ చిన్నదానా…’ అంటూ మొదలెట్టి ‘గుంతలకిడి గుంతలకిడి గుంతలకిడి గుమ్మా’ అంటూ ముగిసిన అల్లరి పల్లవి చుట్టుగుంట జీడివాసనలా మనసుకు పట్టేసింది. ఎవరూ- పిఠాపురమా? కాదు. బాలసుబ్రమణ్యం. నేనంటే నేనే అన్న హిట్టు సినిమా. ‘బావుంది. పాటలో ఊపుంది. విరుపుంది. ఈజ్ ఉంది. ఫ్లో ఉంది. ఈ కుర్రాడు వన్‌టైమ్ వండర్ కాదు.. నిలబడేలా ఉన్నాడు. కానీ ఘంటసాల పాటల జడిలో ఈ బక్కప్రాణి నిలబడతాడా?!’ అన్న భావన. అభిమానిద్దామా అన్న ఆలోచన వచ్చింది. కానీ అటుచూస్తే కృష్ణ. ఇటు చూస్తే లల్లాయిపాట. అభిమానం అన్న మాటను పక్కన పెట్టాను. కృష్ణకే పాడే మనిషిని అభిమానించడం ఎలా? అటు కృష్ణను చూస్తే ఆశ్చర్యం, జాలి; అవి తాత్కాలికంగా పోడానికి మరో ఆరేళ్లకు అల్లూరి సీతారామరాజు రావలసి వచ్చింది.

* * *

బాలసుబ్రమణ్యం అభిమానుల మానసచోరుడు. గజదొంగ!

ఏడాది తిరిగేలోగా నా నిర్లిప్తతను జయించి మనసులో తిష్ట వేశాడు. ఏభై యేళ్లు దాటినా ఆ పారిజాత పరిమళం వదల్లేదు; అది జివితాన్ని వెలిగించే పరిమళం.

 1. ఏకవీర.

ఘంటసాలతో నిలబడగలడా అన్న ప్రశ్నకు సమాధానం దొరికింది. తన ఉనికికి గాఢత గంభీరత సంతరించుకోగలడా అన్న ప్రశ్నకూ సమాధానం దొరికింది.

ఇప్పటికీ నాకు తెగని ప్రశ్న – ఆ సినిమాలోని ‘ప్రతి రాత్రి వసంత రాత్రి’ని ఎక్కువ అభిమానిస్తానా? ‘ఏ పారిజాతమ్ములీయగలనో సఖీ’ని ఎక్కువ ప్రేమిస్తానా?! అభిమానంకన్నా ప్రేమే మిన్న!!

ఏకవీర పాటలు విని మహదేవన్ మహదానందపడి ఉండాలి. కోదండపాణి అండ లేకపోయినా గెలిచి రాగలడు అన్న నమ్మకం నాకు కలిగింది.

* * *

1973నాటి ‘కన్నెవయసు’ పాట – ‘ఏ దివిలో విరిసిన పారిజాతమో’ – బాలు పాటల జీవితంలో తిరుగులేని మైలురాయి అన్నమాట నేనూ ఒప్పుకొంటాను – కానీ…

అంతకన్న ముందుగా చెప్పుకోవలసిన పాటలు నాలుగు ఉన్నాయి.

67నాటి ‘పాడుకో పాడుకో చదువుతూ పాడుకో’ లోనే ఇతని గొంతులో మెలోడీ పండుతుంది అన్న ఛాయ కనిపించింది. 1970నాటి సంబరాల రాంబాబుపాట ‘మామా-చందమామా..’ ఈ మనిషి కరుణ ఒప్పించగలడు అని చెప్పింది. ‘రాశాను ప్రేమలేఖలెన్నో..’ ఎంతోమంది బిడియస్తులకు ‘నేనూ రాస్తే బావుంటుందీ’ అన్న ఆశ కలిగించింది. 72నాటి ‘తనివితీరలేదే..’ అన్న  గూడుపుఠాణీ పాట ‘ఇతగాడు ప్రణయ గీతాల పెన్నిధి కూడానూ’ అని చాటి చెప్పింది. 1971 నాటి శంకర్ జైకిషన్ పాట ‘సువ్వి సువ్వి’ ‘జీవితచక్రం’ పాట హుషారు పాటలను మోతెక్కించగలడు అన్న ఆశ కలిగించింది. 1973నాటి ‘పూలు గుసగుసలాడేనని..’ అప్పటికీ ఇప్పటికీ విడువని ఊసుల బాసల పెన్నిది. అయినా-

అవును. ‘ఏ దివిలో విరిసిన పారిజాతమో’ అతని గమనాన్ని మార్చిన, ఎత్తులు ఎక్కడానికి సిద్ధపరచిన, ఆత్మవిశ్వాసం గుండెల్లో నింపిన, రామకృష్ణలాంటి ఒడిదుడుకులను ఎదుర్కొనే స్థైర్యం ఇచ్చిన – ల్యాండ్‌మార్క్ పాట.

* * *

1974లో అయిదేళ్ల స్నేహాల తర్వాత క్లాసుమేట్లమంతా విడివడవలసిన సమయంలో వేదనకు గురి అవుతున్నప్పుడు ఎక్కణ్నించో వినవచ్చిన ‘స్నేహ బంధమూ, ఎంత మధురమూ..’ అన్న పాట గుండెల్లో ఇంకా కొట్టాడుతోందంటే అది బాలు పుణ్యమే. మిగతా క్లాసుమేట్ల సంగతి తెలియదుగానీ నాకు మాత్రం ఆ బంధానికి ఆ పాట ప్రతీకగా నిలబడిపోయింది.

 1. ‘శివరంజనీ..’ తూర్పు-పడమర.

ఉద్యోగరీత్యా నివాసం ఢిల్లీకి మార్చి తెలుగు దేశం మీది మమతతో సెలవుపెట్టి విజయవాడకు వచ్చినపుడు నన్ను పలకరించిన పాట. ఇహ ‘బాలు’ కు మాలాంటి వాళ్ల అభిమానమే తప్ప ప్రోత్సాహం పొగడ్తలు అవసరంలేదు అన్న ఎరుక కలిగించింది ఆ పాట. అప్పటికే వచ్చి పదేళ్లవుతోంది. అటు క్రిష్ణకూ, ఇటు శోభన్‌బాబుకూ, మధ్యలో రాజబాబుకూ – అందరి గళాలనూ తన గొంతుతో పలికిస్తూ అక్కడి మహమ్మద్ రఫీలాగా జైత్రయాత్ర చేస్తున్నాడు బాలు.

కానీ ఇంకా జయించవలసిన దుర్గాలు రెండు. నాగేశ్వర్రావు, రామారావు.

1972లో అనుకుంటాను – ‘ఇద్దరమ్మాయిలు’ సినిమాలో నాగేశ్వర్రావుకు పాడాడు బాలసుబ్రమణ్యం. అదో డిజాస్టర్.

‘నా హృదయపు కోవెలలో..’ అని మొదలెట్టగానే హాలు బిత్తరపోయింది. తేరుకొని ఘొల్లుమంది. తెలివిగలవాళ్లు టీ తాగడానికి బయటకు వెళ్లారు. ఈ లోపల ఘంటసాల తన గానసభ చాలించాడు. అన్ని వేపులా వ్యాపించగలిగిన బాలు, అగ్రనాయకుల విషయంలో దిక్కుతెలియని వాడయ్యాడు. అచ్చం ఘంటసాలలాగా పాడే రామకృష్ణ ఘంటసాలనుంచి బ్యాటన్ అందుకొన్నాడు.

ఏ కళాకారుడికయినా ఇది భీతిగొలిపే సవాలు.

ముప్ఫై నిండిన బాలు సవాలు స్వీకరించాడు. మార్గాలు వెదికాడు. తనను తాను లేవనెత్తుకున్నాడు. శ్రమించాడు. ఏయే అంశాలమీద శ్రద్ధ పెట్టాలో గుర్తుపట్టాడు.

‘చిత్రం – భళారే విచిత్రం..’ అని పాడి ఒప్పించాడు. ‘యమగోల’ సరేసరి. ఆ గోల పాటల మధ్య ఇతర నటులకూ ‘మధుమాస వేళలో’ అనీ, ‘మానసవీణా మధుగీతం’ అంటూనూ, ‘వీణవేణువైన సరిగమ విన్నావా’ అంటూనూ పాటను కొత్త పుంతలు తొక్కించాడు. ప్రతి పాటా మనకోసమే పాడుతున్నాడా అనిపించేశాడు. ‘ఇదేపాట, ప్రతీ చోట, ఇలాగే పాడుకొంటాను’ అన్నాడు.

* * *

మామూలు మనుషులు ఈ బిందువు దగ్గర నిలబడిపోయి తమను తాము అనుకరించుకొంటూ ఒకేపాట పదిమార్లు పాడుకొంటూ శ్రోతలకు శ్రమ కలిగిస్తూ అభిమానం కోల్పోతూ మెల్లగా కనుమరుగయ్యే తరుణమది.

బాలు మామూలు వ్యక్తి కాదు.

తపన. విపరీతమైన తపన. తెలియని లోతులు అందుకోవాలనీ, మనిషి చేరని ఎత్తులు చేరుకోవాలనీ- తపన.

జనవరి 1980. శంకరాభరణం

అప్పటికి ఏడాదిబట్టీ వింటూనే ఉన్నాను. కె. విశ్వనాథ్ సంగీతప్రధానంగా ఓ సినిమా తీస్తున్నాడు. అందులో హీరోలూ హీరోయిన్లూ లేరట. సంగీతమే హీరో అట. సోమయాజులు అన్న పెద్దాయన సంగీత విద్వాంసుడట. మంజుభార్గవి అన్న చిరు నాట్యగత్తె మరో ముఖ్యమైన పాత్ర పోషిస్తుందట. మహదేవన్ సంగీతం..

విశ్వనాథ్ చాదస్తాల్లో ఇదీ ఒకటి అనుకొన్నాను. పాపం ఏడిద గోపాలరావు అనుకొన్నాను. పాపం ప్రేక్షకులూ అనుకొన్నాను. నిర్లిప్తత.

కానీ పాటలు పాడేది బాలూ అని విని ఉలిక్కిపడ్డాను.

‘ఏవిటీ తలతిక్కా?! హంసగీతె మంగళంపల్లి ఉన్నాడుగదా’ అనుకున్నాను.

బాలు ముందు ఇష్టపడలేదనీ, తాను అందుకు తూగలేననీ అన్నాడనీ- వార్తలు. మహదేవన్, పుహళేంది కలిసి మెడలు వంచారనీ వార్తలు.

అప్పటికే అభిమానిని గదా – ‘అయ్యోపాపం పసివాడు, బాలు’ అనుకొన్నాను.

శంకరాభరణం విడుదల అయింది. సినిమా గురించీ, బాలు పాటల గురించీ మళ్లా చెప్పను. అవసరమూ లేదు – ఆ శక్తీ నాకు లేదు. కానీ ఒకటి రెండు సంఘటనలు చెపుతాను.

ఢిల్లీలోని మా కాలనీ పొరుగింట్లో డాక్టర్ కోషీ – రీనా కోషీ ఉండేవారు. మాకు మంచి మిత్రులు. నేను విజయవాడ వెళుతోంటే రీనా అడిగారు ‘నాకు శంకరాభరణం ఎల్‌పీ తెచ్చిపెట్టు’ అని. ఆశ్చర్యమనిపించింది. ‘ఈ పాటలేగాదు, సినిమా కూడా కేరళ అంతటా ప్రభంజనమైపోయిందీ’ అంటూ ఆమె నా కళ్లు తెరిపించారు. తమిళనాడూ కర్ణాటకా సరేసరి. తెలుగుతోపాటు మిగిలిన మూడు దక్షిణ భారత రాష్ట్రాల్లోనూ పాడి మెప్పించడమన్నది అప్పటికే జరిగిపోయింది.

మరో రెండేళ్లకనుకొంటాను- హిమాచల్ ప్రదేశ్‌లోని డల్‌హౌసీ అన్న పట్నం తిరిగిరావడానికి కుటుంబమంతా కలిసి వెళ్లాం. ఓ ఇంట్లోంచి ‘శంకరా నాద శరీరా పరా..’ అంటూ బాలు గొంతు వినిపించింది. ఆశ్చర్యంతో మొహామొహాలు చూసుకొని, ‘ఇది తప్పకుండా తెలుగువాళ్ల ఇల్లే అయి ఉంటుంది’ అని తలుపుకొట్టాం. ఓ పహాడీ పెద్దాయన తలుపు తెరిచాడు. ‘మీకే కాదు, మాకూ ఈ పాటలు ఇష్టం’ అన్నాడు. ‘ఏక్ దూజే కే లియే’ లో పాడింది ఈ మహానుభావుడే అని వివరం అందిస్తే ‘ఔనా’ అంటూ నోరు వెళ్లబెట్టాడు. తేరుకొని, మాకు ఆతిథ్యం ఇచ్చి, సాగనంపాడు!!

* * *

బాలు రఫీకి వీరాభిమాని.

రఫీ ప్రేరణతోనే తాను పాటల్ని సీరియస్‌గా తీసుకొన్నాను అని అన్నాడట.

రఫీ పాటల్లోని అందాలను బాలు చెప్తోంటే వినడం – అదో అనుభవం.

మరి తనకూ హిందీలో పాడాలని ఉండదూ?! ఉంటుంది.

ఉఛ్ఛారణలో దక్షిణాదితనం సంగతేమిటీ?

అప్పటికే ఆరేళ్లనించీ జేసుదాసు హిందీ పాటలు పాడుతున్నాడు. రఫీ, కిషోర్‌లకు దీటుగా పాడుతున్నాడు. కానీ అతనిది ఏక్సెంట్ లేని గళం.

‘ఏక్ దూజే కే  లియే’ లో బాలుకు బంగారంలాంటి అవకాశం వచ్చింది.

కథానాయకుడు దక్షిణాది మనిషి. ఇహ యాస సమస్యే కాదు.

అందివచ్చిన అవకాశాన్ని రెండు చేతులతోనూ అందిపుచ్చుకొని బాలు చెలరేగాడు. ‘తేరే మేరే బీచ్ మే’ అంటూ లతాతో సరితూగాడు. ‘మేరే జీవన్ సాథీ..’ అంటూ ఆబాలగోపాలాన్నీ ఆనందపరచాడు.

కమలహాసన్‌కు హిందీ గళమయ్యాడు.

తర్వాత వచ్చిన సల్మాన్‌ఖన్‌కు గళరూపమయ్యాడు.

విజయాలు అందుకొన్నాడు. ఆ కథంతా చెప్పను. దక్షిణాది  సంగీతయానం బంగాళాఖాతంలో స్వేఛ్ఛావిహారమయితే బాలు హిందీ సినీ సంగీతం అరేబియా సముద్రంలో సింద్‌బాద్ యాత్ర!

* * *

80లు గడిచిపోయాయి. 90లు గడిచిపోయాయి. ఇళయరాజాలు, సాగరసంగమాలు, నాగేశ్వర్రావు, రామారావు వెళిపోయి నాగార్జున, బాలక్రిష్ణ, చిరంజీవి, వెంకటేష్ వచ్చారు. నాగచైతన్యలూ వచ్చారు. వారికీ పాడాడు బాలు. మూడు తరాల వారికి పాడాడు. ముప్ఫై సంవత్సరాలు విరామం లేకుండా పాడాడు. అంతా తానొక్కడై పాడాడు.

కానీ ఎవరో (?!) మార్పు కావాలన్నారు. ఉదిత్ నారాయణ అన్నారు. మనో అన్నారు. హరిహరన్, శంకర్ మహాదేవన్…

బాలూకు అరవై ఏళ్లొచ్చాయి.

జీవితమంతా ఉఛ్ఛస్థాయిలో గడిపిన వాళ్లు రిటైర్మెంట్ తట్టుకోలేరు.

స్వీయజ్ఞానం ఉన్నవాళ్లను రిటైర్మెంట్ ఇబ్బంది పెట్టదు. అదే వరం అవుతుంది. తాము ఇష్టపడే పనులు తమ ఇష్టం ప్రకారం చేసుకొనే వెసులుబాటు కలిగిస్తుంది రిటైర్మెంటు.

బాలు విషయంలో అదే జరిగింది.

‘పాడుతా తీయగా చల్లగా’ అన్నాడు. ‘స్వరాభిషేకం’ అన్నాడు.

యువతరంలో పాటలంటే ఆసక్తి కలిగించి, ప్రోత్సహించడం తన బాధ్యత అనుకొన్నాడు. తన బాట తనే పరచుకొన్నాడు. కొత్త బాటలు నిర్మించుకొన్నాడు. ఇతరులు ఊహించని మార్గాల్లో అలవోకగా సాగిపోయాడు. ఆబాలగోపాలమూ ప్రేమించే మనిషిగా పరిణితి చెందాడు. మనుషులందరినీ తాను ప్రేమించాడు. అది మనసులోనే దాచుకోకుండా ఉదారంగా పంచిపెట్టాడు. ‘మనిషంటే అలా ఉండాలి’ అని తెలిసినవాళ్లూ తెలియనివాళ్లూ ఆపేక్షగా తనకేసి చూసేలా చేశాడు.

జీవితాన్ని పరిపూర్ణంగా ఆస్వాదించాడు. జీవనలాలస ప్రదర్శించాడు. మనసుమీద వయసు ప్రభావం పడనివ్వలేదు. పాటకే కాదు, బతుక్కూ నిర్వచనమయ్యాడు. కానీ ఈ హఠాన్నిష్క్రమణం ఏమిటి? ఏవిటా తొందరా? మరో పదేళ్లు చేసినా తరగని పనులున్నాయిగదా. మరికొన్ని వందల గంటలు చెప్పినా వినదగిన సంగీతపు విశేషాలు ఉన్నాయి కదా – అవన్నీ అలా తనతో తీసుకు వెళిపోతే ఎలా?

ఊహించని రీతిలో వెళ్లిపోయాడు. వెళ్లిపోయినా అతని పాటలు ఉంటాయి. రఫీ పాటలు నలభై యేళ్లు నిలిచిలేవూ?!

బాలూ లేకపోయినా అతని పాట ఉంటుంది.

నాతోపాటు ఏభైమూడేళ్లు కలసి ఆడి పాడిన బాలు లేడు. అది వాస్తవం. అతని పాటలు నిలచి ఉంటాయి – నా తరమంతా వెళ్లిపోయినా. అదీ వాస్తవం.

సంగీతం అజరామరం. పాట చిరాయువు.

*

Dasari Amarendra

61 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

 • ఆ ప్రశ్నార్థకం పేరు ఏ.ఆర్ రహమానేనా….
  బాలు సినీ ప్రస్థానాన్ని హృద్యంగా చెప్పారు

 • నేను సారంగలో ముందు ఎందుకు రాయలేదు బాలూ గురించి, అసూయగా వుంది. మంచి నివాళి.

 • ఇది గుండె కింద సదా మండుతుండే ఒక తడి మంట. ప్రపంచం ఆగదేమోకానీ, స్పష్టమైన తెలుగు పలుకునూ, భావప్లావితమైన స్వరసురలనీ కలబోసుకుని సాగే ఒక మధుకెరటం మాత్రం ఆగిపోయింది. ఇంకెక్కడి శాంతి?

   • బాలు గారి పాటల యాత్ర తో బాటు తెలుగు పాటల్లో కొత్త నీరు వచ్చి పా త నీటిని కొట్టేస్తుంది అనే వొరవ డి నీ , అలాగే సత్తా వున్నవారు ఏ పోటీ అయినా తట్టుకుని నిలబడతారు అనే విషయాలను కళ్లకి కట్టినట్లు పాటలతో ఉదహరించారు. మా తరానికి బాలు నే singer అంటే. 80 నుంచి 2000 వరకు . 🙏

 • మా లాటి చాలా మందికి కలుగుతున్న బాధకి విలువైన అక్షరరూపం ఇచ్చారు. ధన్యవాదాలు.
  పాటలు, పాటలతో పాటే పెనవేసుకుపోయిన బాల్యమూ, యౌవనమూ,వాటి తాలూకు మధుర స్మృతులూ, అన్నీ కలిపి ఒకలాటి వ్యథ.
  శారద

 • బాగుంది మీ నివాళి. మరణం అనేది ఖాయమని తెలిసినా జీవితం పైన అంత ప్రేమ వున్న బాలు ఇంత హఠాత్తుగా వెళ్ళిపోవడం చాలా బెంగగా వుంది. ఎప్పటికప్పుడు పోటీకి తగ్గట్లుగా తనను తాను మలుచుకుంటూ, అంత కృషి చేసి ది బెస్ట్ అయిన ఆ మనిషిని పట్టుకుని “తొక్కేసాడు” అనే వాళ్ళను చూస్తే ఏమనాలో అర్థం కాదు. నా జీవితకాలంలో ఇంత versatile singer ఇంకొకరిని చూసే ఆశ లేదు.
  శంకరాభరణం నిర్మాత ఏడిద నాగేశ్వరరావు గారు (గోపాలరావు కాదు).

 • 1966 నుంచి 1980 వరకూ క్రోనలాజికల్ హైలైట్స్ తో వారి పాటలను
  వచనామృతంలా మాకందిస్తూ వారికి నివాళులర్పించారు. చివరగా, ఆరు తరాల వారి మనసుల్లో చెరగని ముద్రవేసిన బాలుగారి యశస్సు శాశ్వతమైనదని చెప్పి ముగించారు. ధన్యవాదాలు.

 • తీగ మీద నడకలాంటి వృత్తిలో బాలు గారు నిలదొక్కుకున్న తీరుని చిక్కగా చాలా బాగా రాసారు సర్.

 • very well written Amarendragaru. I was lucky enough to discuss Rafi with him and listen to him sing ‘Tum ne kisiki jaan ko jaate hue dekha hai from Rajkumar. I supplied the lyrics he forgot and there started our conversation on Rafi. that went on for more than an hour to the utter chagrin of our host Varaprasad garu, who shouted ‘Annayya sing a Telugu song no? ‘ Balugaru turned to me and said ‘Mrunalinigaru, why dont you explain the greatness of Hindi songs to Varaprasadgaru? and especially Rafisaab?”

  • Santosham Mrunalini gaaroo..aayanatho ekaveera padyaalu paadinchukovaali annadi naa jeevita korika..konni korikalu korikalugaane undipotaayi..

 • బాలు గారితో మీ ప్రయాణం, మజిలీలు, జైత్ర యాత్ర జెండాలు, మీ ట్రావెల్ గైడ్ లాగా చాలా బాగుంది. ఇంకా మనతో ప్రయాణం చేస్తే ఖచ్చితంగా ఎన్నో కొత్త స్థావరాలను కనుగొనేవారు ఆ కర్మ యోగి

 • ఘంటసాల ను అభిమానించే తెలుగు వాళ్లందరినీ, ఏ క్రమం లో తన వేపుకు తిప్పుకున్నాడో.. అది ఘంటసాల గారి వీరాభిమనులకు సైతం తెలియకుండా జరిగిన రహస్య ప్రక్రియ..
  ఇది మీ వ్యాసం లో చాలా అందంగా చెప్పారు.

 • ఎంత కరెక్ట్ గా రాశారు సార్. అద్భుతం. మా అనుభూతులని మీ మాటల్లో వింటున్నట్టు ఉంది.

 • అమరేంద్ర గారికీ నమహ్ సుమాంజులతో

  ఎవరో లేత కుర్రాడట అంటూ మొదలు పెట్టి ఎంత బాగా సెలవిచ్చారు. నిజమే కఠిన పరిస్థితులో ఎలా జీవించాలో జీవితాన్ని ఎలా జీవించాలో బాలు జీవితం గురించి ఎంత బాగా చెప్పారు
  K Sudhakarbabu

 • ఈ ఉదయం మీ వ్యాసం ఎంతో తృప్తి కలిగించింది. బాలు గారి గురించిన గుండెల్లోని బాధ కు ఉపశమనం కలిగింది.ధన్యవాదాలు అమరేంద్రాజీ!

 • అలవోకగా రాయగలగటం, అసాధారణమైన జ్ఞాపకశక్తి, అంతులేని ప్రీతి కలగలిస్తేనే ఇలాంటి నివాళి అక్షతమవుతుంది అమరేంద్రా! బాలుకి లభించేన ప్రశంసాపుష్పాలలో ఒకటవుతుంది.

 • మాటరాని మౌనమిది అమరేంద్ర సర్. మీ నివాళి కన్నీటి తరంగాలను తరలించింది. నమస్సులు.

  – నండూరి సుందరీ నాగమణి

 • చాలా బాగా రాసారు అమరేంద్ర గారు . మా మనసులొని మాట మీ కలంలొ బయటకు వచ్చింది . అవును ఆయన పాట అజరామరం .

 • మీ ప్రేమను ఆయన ప్రయాణంతో ముడిపెట్టి అద్భుతంగా వ్రాసారు.

 • మంచి.నివాళి అమరేంద్ర గారూ. మీరు చెప్పిన ఈ స్టేజిలన్నీ ఇలాగే నేను బాలూ పాటలు వింటూ పెరగటమే కాదు మొదట్లో ఘంటసాల జాగా తీసుకుంటున్నాడని బాధ పడ్డాను కూడా. అయి బాలూ పట్టువదలని విక్రమార్కుడిలా అంతటా తానై ఆయన లేని సంగీతప్రపంచం లేదన్నంతగా ఆక్రమించుకున్నాడు. నిబద్ధత, పాట పట్ల మాటపట్ల మమకారం వీటితో ప్రపంచాన్ని జయించాడు.

 • మంచి నివాళి అమరేంద్ర గారూ.. ఇదే ప్రయాణం నేను చేసాను..మీరు రాసినది నేను ఇంకేంరాయక పోయినా పర్వాలేదనిపించేట్టు వుంది. నేను కూడా ఘంటసాల జాగా తీసు కుంటున్నాడని బాధ పడ్డాను. కానీ నిబద్ధతతో, పాట పట్లా మాటపట్లా మమకారంతో బాలూ మనుష్యుల హృదయాలని జయించి బాలూ పాట లేని ప్రపంచాన్ని ఊహించలేని స్థితి కి మనల్ని తీసుకువచ్చి నిష్క్రమించాడు.. బాగా రాశారు.

 • నాకు సంగీత పరిజ్ఞానం కానీ, సంగీత విద్వాంసుల గురించి కానీ ఏమీ తెలీదు. తెలిసిందల్లా హిందీలో రఫీ పాటలు వినడం, తెలుగులో బాలు పాటలు వినడం అంతే. పాటంటే బాలు, బాలు అంటే పాట. అలాంటి బాలు గారి గురించిన మీ మాటలు బావున్నాయి.💐

 • మీ మాటల్లో బాలు ఎదుగుదల, మీ యవ్వనానుభూతుల్లో బాలు పాత్ర చక్కగా గోచరించాయి. మాకెంతో ఆనందం ఇటువంటి వ్యాసాలు చదువుతోంటే! కేవలం బాలు పాటను మాత్రమే అభిమానించేవాళ్లకు అతని వ్యక్తిగత వ్యవహారాలు నచ్చకపోయే అవకాశం ఉంది. కానీ మీరు వ్రాసింది చదివితే అతను ఎలా స్ఫూర్తిదాయకంగా తనను తాను మలచుకున్నాడో అర్ధమవుతుంది. గొప్ప రచన అమరేంద్ర గారు! ధన్యవాదాలు!

 • అమరేంద్ర గారు ఆనిలువెత్తు పాటకి అంతే ఎత్తున్న నివాళి మీరు ఒక ఆర్డర్ లో వాసిన క్రమం ఆకట్టుకుంది. పాట మూగపోయింది అన్నారు కొంత మంది కానీ మీరన్నట్లు అది చిరంజీవి.
  చాల బాగా వ్రాసారు

 • అనప్పిండి సూర్య లక్ష్మీ కామేశ్వరరావు says:

  ‌బాగుంది అమరేంద్రా, శ్రీ కృష్ణసత్య 1971 లో పద్యాలు బాలువి విని ఎంత కోపగించుకున్నామో, కర్ణ 1977 లో పద్యాలతో అంతగా మెప్పించిన ఘనుడు. కృషి ఉంటే మనుషులు ఋషులౌతారని ‌నిరూపించిన బాలు ఆదర్శంగానే , 50 సంవత్సరాల వయసులో ఏదీ ఆలస్యం కాదు అనుకుంటూ, ఒక 6 నెలలు శాస్ర్తీయ సంగీతం నేర్చుకొన్నాను ఓనమాలను.

 • 1966 నుంచి 1980 వరకూ బాలు గారి తెలుగు సినీసంగీత ప్రపంచ యాత్ర తాలూకు మధుర స్మృతులు ఎంతో ఆర్తితో నివాళి అర్పిస్తూ తలపోసిన అమరేంద్ర గారూ! మీకు నెనర్లు. ( సంగీతంతోనే కాక మీరు, బాలూ మరో భవబంధంతో ముడివడి ఉన్నారు … బాలు మా అనంతపూర్ లో, మీరు కాకినాడలో చదువుకున్నా ఒకే బడికి… JNTU యూనివర్సిటీకి… చెందిన వాళ్లు మీరు. )

  నాలుగు దశాబ్దాలు తన సుమధుర గాత్రంతో 16 భాషల్లో 40 వేలకు పైగా పాటలు పాడి తెలుగు, తమిళ, కన్నడ, హిందీ ఇంకా మరెన్నో భాషల్లో సాధారణ ప్రజల నుంచి సంగీత ప్రియుల వరకూ అభిమానుల్ని సంపాదించుకున్న బాలు ధన్యజీవి.

  ప్రభుం ప్రాణనాథం, విభుం విశ్వనాథం, శివం శంకరం శంభు మీశానమీడే అంటూ శివాష్టకమ్…

  గంగా తరంగ రమణీయ జటా కలాపం, గౌరీ నిరంతర విభూషిత వామ భాగం, వారాణసీ పురపతిం భజ విశ్వనాధమ్ అంటూ కాశీ విశ్వనాధ అష్టకము ఆలాపించి…

  అంతర్యామి అలసితి సొలసితి ఇంతట నీ శరణిదె జొచ్చితిని అని…

  చిదానంద రూపః శివోహం శివోహం అంటూ ఆది శంకరుల నిర్వాణాష్టకం జపిస్తూ నిష్క్రమించిన బాలు గారి ఆత్మకు శాంతి… వారి కుటుంబ సభ్యులకు, అభిమానులకు సాంత్వన ఆ జగతః పితరుడు ప్రసాదించాలని ప్రార్ధిస్తూ…

 • ఆయన జీవితం, ఆయన వ్యక్తిత్వం ఎంతో స్ఫూర్తిదాయకమైన ఓ చాలా చక్కగా వివరించారు. అజరామరమైన గొంతు. ఎప్పుడు మనకు ఆయన పాటలే ఇక మనకి ధైర్యం.

 • అచ్చం గా నా అనుభూతులూ ఇవే అమరేంద్ర గారూ. చిన్న సవరణ ‘ఇద్దరు అమ్మాయిలు ‘ వచ్చింది 1970 లో..

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు