మరిన్ని సందేహాల రైలుబడి!

పిల్లలు-చదువులు….ఇదొక అనంతమైన టాపిక్. దీని గురించి ఎంత మంది ఎంత చెప్పినా తక్కువే. తరతరానికి పిల్లలను పెంచే విధానం, వాళ్ళ చదువులూ మారుతూనే వస్తున్నాయి. ఎప్పటికప్పుడు కొత్త ఛాలెంజ్ లు పుట్టుకు వస్తూనే ఉన్నాయి. అసలు పిల్లలను పెంచడమే ఒక పెద్ద సవాల్ ఈ రోజుల్లో. నా చిన్నప్పుడు పెద్దవాళ్ళు ఏది చెపితే అది వినేవాళ్ళం.కానీ ఇప్పుడు పిల్లలు పుట్టడమే ప్రశ్నలతో పుడుతున్నారు. నేను కానీ, మా అక్క కానీ ఇప్పుడు విరించి, సుమాళి అడుగుతున్నన్ని ప్రశ్నలు ఎప్పుడూ అడగలేదు నాకు గుర్తున్నంత వరకు. అసలు అలా మాట్లాడొచ్చని కూడా తెలియదు. ఏదైనా కొంచెం ఎక్కువ మాట్లాడినా, ప్రశ్నలు వేసినా ఏమిటా పెద్ద మాటలు అంటూ నన్ను దెబ్బలాడేవారు కూడా ఇంట్లో. కానీ ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. ఇప్పుడు పిల్లలు, వారికున్న తెలివితేటలు, వారికున్న విషయ పరిజ్ఞానం , పెరుగుతున్న పరిస్థితులు అన్నీ మారిపోయాయి. విరించి మాట్లాడే మాటలకు కానీ, అడిగే ప్రశ్నలకు కానీ, వాడికున్న విషయ పరిజ్ఞానానికి కానీ నేను ఆశ్చర్యపోని రోజు లేదు. వాడు రోజూ ఏదో ఒక కొత్త విషయం తెలుసుకుంటూనే ఉంటాడు. కొన్ని మేము చెప్పినవైతే, కొన్ని స్వతహాగా చదివో, చూసో తెలుసుకున్నవి.

ప్రస్తుతం ఇంకా చిన్నపిల్లాడు కాబట్టి ఎలా ఉన్నా పర్వాలేదు. కానీ రేపు పెద్దయ్యాక ఇలానే ఉంటడా…వాడి చదువు, చుట్టూ ఉన్న పరిసరాలు అందుకు సహకరిస్తాయా అనేది పెద్ద ప్రశ్న. తల్లిదండ్రులు వారి పిల్లలను సరిఅయిన దారిలోనే నడిపిస్తున్నారా అనే సందేహం. విద్యాలయాలు సరైన విద్యనే అందిస్తున్నాయా అంటే కచ్చితంగా అవుననే చెప్పలేని సందిగ్ధం. నా బాల్యాన్ని, నేను చదువుకున్న విధానాన్ని తీసుకుంటే నేను చాలా మంది కంటే….అంటే నాతోటి విద్యార్ధులు, స్నేహితుల కంటే నేను కొంత మెరుగైన వాతావరణంలో పెరిగాను అని అనుకుంటుంటాను ఎల్లప్పుడూ. మా ఇంట్లో ఎప్పుడూ చదువును రుద్దలేదు….చదువు కోసం మమ్మల్నీ రుద్దలేదు. చదువు ఎంత ముఖ్యమో అని మాత్రమే చెప్పారు. విగ్నానం కోసం మాత్రమే చదువుకోండి అంటూ ప్రోత్సహించారు. మాలోని సహజగుణాలు పోకుండా కాపాడారు. అయితే ఇప్పటి….ఇప్పుడే కాదు చాలా ఏళ్ళ నుంచి చాలా ఇళ్ళల్లో, బడుల్లో ఇలా సహజగుణాలు పోకుండా ఉండే విద్యను పిల్లలకు అందిస్తున్నారా అనేది పెద్ద ప్రశ్న.

అసలే చాలా రోజుల నుంచీ ఇలాంటి కన్ఫ్యూజన్ లో ఉంటే ఇప్పుడు కొత్తగా చదివిన రైలుబడి పుస్తకం మరింత సందేహాలలో పడేసింది. పుస్తకం విషయానికి వస్తే చాలా బావుంది. చాలా మంచి విషయాన్ని చర్చించారు. ఓ దారి కూడా చూపించారు. కానీ అలాంటి దారి ఈ రోజుల్లో దొరుకుతుందా లేదా అనేదే నా అనుమానం.

చదువు అంటే…స్కూలు, తరగతులూ, పాఠాలూ, హోం వర్క్ లూ, అదనంగా ట్యూషన్ లూ, కోచింగ్ లూ. ఒకరకంగా పిల్లలందరూ బాగా ఒత్తిడి ఉండే వాతావరణంలో పెరుగుతున్నారు. దానివల్ల చాలామంది సహజంగా ఉండే తమ లక్షణాలను కోల్పోయి కృత్రిమ మేథస్సుకు అలవాటుపడిపోతున్నారు. దానివల్ల అసలుచోట డీలా పడిపోతున్నారు. చాలామంది ఎంతో విలువైన బాల్యాన్ని కూడా కోల్పోతున్నారు. ఆటలు, పాటలూ వంటివి నేర్చుకుంటున్నా కూడా వాటిని కూడా పోటీల కోసమే తప్ప మనోవికాసానికి, ఆనందించడానికి కాదు. ఇప్పటికే బాల్యాన్ని కోల్పోయి సంతోషం అంటే ఏంటో తెలియని చాలా మందిని చూస్తున్నాం. భవిష్యత్తులో వీరు మరింత పెరిగే సూచనలే కనిపిస్తున్నాయి కానీ ఎక్కడా తగ్గే జాడ కనిపించడం లేదు. వీరంతా ఉన్నత చదువులు చదివి, మంచి సంపాదన కలిగి ఉన్న వారే అయుండచ్చు, కానీ ఏకాంతంగా కూర్చుని వారితో మాట్లాడితే అటువంటి వారు తప్పక బాధపడుతూ చెప్పే విషయం ఒకటే అవును మాకు బాల్యం లేదు అని, మాది అసంపూర్ణ జీవితమే అని. మనిషికి నిజానికి అటువంటి జీవితం అవసరమా?. మనం కోరుకుంటున్న జీవితం అదేనా? అంటే దీనికి మన ఆలోచనా విధానం మారితే తప్ప బతుకుల్లో మార్పు రాదు.

సరిగ్గా దీని గురించే రైలుబడి పుస్తకం చర్చిస్తుంది. నిజానికి ఇది జపనీస్ భాషా సాహిత్యంలో నుంచి వచ్చినది. టోటోచాన్ అనే వ్యక్తి తన చదువు గురించి చెప్పిన కథ. అందరూ తెలుసుకోవలసినది, వీలయితే ఆచరించవలసిన కథ. రెండు ప్రపంచ యుద్ధాల సంధి సమయంలో జపాన్ లో విద్యాసంక్షోభం ఏర్పడిందట. జపాన్ లో ఈ పరిస్థితిని మార్చడానికి ఎందరో ఆలోచనాపరులైన విద్యావేత్తలు కొత్త విద్యావిధానాలను ప్రతిపాదిస్తూ వచ్చారట. అందులో ఒకరే సొసాకు కొబయాషి. ఇతను టోమో అనే పాఠశాలను స్థాపించి ఒక కొత్త విద్యా విధాన సిద్ధాంతాన్ని రూపొందించారు. దాని వల్ల అప్పటి పిల్లల్లో చాలా మందికి మంచి చదువే కాకుండా జీవినవిధానం కూడా అందింది అంటారు రచయిత టోటోచాన్. యూనిసెఫ్ అంబాసిడర్ గా పనిచేసిన టోటోచాన్ తాను ఇంత ఉన్నతస్థాయిలోకి రావడానికి టోమో స్కూలే కారణమని గర్వంగా చెప్పుకుంటారు.

చిన్నపుడు చదివిన స్కూలు తాలూకు ఆలోచనలు ఎంత పెద్దయినా గుర్తుంచుకున్నామంటే కచ్చితంగా అది మనలో ఆ బడి వేసిన బలమైన ముద్రలే కారణం. యాంత్రికంగా చేసే ఏ పని మన బుర్రలో నాటుకోదు. కానీ యునిసెఫ్ అంబాసిడర్ గా పని చేసే టొటోచాన్ తన ఎదుగుదలకు తను చదువుకున్న టొమో పాఠశాల, అందులోని ప్రధానోపాధ్యాయుడు కొబయాషినే కారణమని చెబుతుంది. ఇతరులతో పోల్చి చూసుకుంటే తాను ఎంతటి నిజమైన సహజమైన చదువును చదివానని అంటుంది. అందుకే కొబయాషీ ఆలోచనలు ఈ సమాజానికి ఎంత అవసరమో గుర్తించి తన పాఠశాల అనుభవాలను రైలుబడి పుస్తకంగా అందరి ముందు తీసుకువచ్చింది. ఆ పుస్తకం రాయడం వలననే ఆమెకు ఆసియా ఖండం నుండి యునిసెఫ్ గుడ్విల్ అంబాసిడర్ గా పదవి లభిస్తుంది.

టోమో పాఠశాల చాలా భిన్నమైనది. మిగతా స్కూళ్ళల్లా నాలుగు గోడల మధ్యనా కాకుండా పచ్చని ప్రకృతిలో రైలుబోగీల్లో విద్యాబోధన ఉంటుంది. ఈ బడిలో ఏ పిల్లా, పిల్లాడు బలవంతంగా చదువుకోరు. వారికి నచ్చిన పనిని చేస్తూ అందులో నుంచి జీవితానికి అవసరమైనవి నేర్చుకుంటుుంటారు. ఎవరైనా ఒక విద్యార్ధి తనకు చదువుకోవాలని లేదు….రైలు కిటికీలోంచి చూడాలని లేదా పిచ్చుకలో మాట్లాడాలని ఉంది లేదా ఇంకేదైనా చేయాలని ఉంది అంటే ప్రధానోపాధ్యుడు, కానీ ఉపాధ్యాయులు కానీ అస్సలు ఆపేవారు కాదట. అలా కాదని వారికి కావలసిన పనిని చేయనివ్వకుండా బలవంతంగా చదవించడం వల్ల పిల్లలకు ఏమీ రాదని అక్కడి టీచర్లు అభిప్రాయపడేవారంట. అసలు వినడానికి, చదవాడికే ఎంతో బావుంది ఈ మాట. అలాంటిది అందులో చదువుకున్న టోటోచాన్ ఇంకెంత అందమైన బాల్యం అనుభవించి ఉంటుందో కదా.

ఈ రోజుల్లో లాగా ఒకటి ఒకటి ఒకటి రెండూ రెండూ రెండూ అంటూ టీవిల్లో ఊదరగొట్టే పాఠశాలలు లేకున్నా, ఆ రోజుల్లో కూడా మా స్కూలులో ఇది చేస్తాం అది చేస్తాం అని ప్రచారం చేసుకునేవారట. కానీ కొబయాషీ ఏ రోజుకూడా తన స్కూలు ఫోటోలు పేపర్ లో ముద్రించడానికిగానీ, దాని అసాధారణ సిద్ధాంతాన్ని ప్రచారం చేయడానికిగానీ ఇష్టపడలేదు. యాభై మందికి మించని ఒక అనామక పాఠశాలనుండి ఆయన ప్రపంచం నేర్చుకోతగ్గ ఎన్నో పాఠాలను తన విద్యా బోధన పద్దతి ద్వారా అందించారు. పిల్లల సహజగుణాలైన అల్లరినీ, వదరుబోతుతనాన్నీ, ప్రకృతి ఆరాధననూ, ప్రతీ చిన్న విషయానికీ ఆశ్చర్యాన్నీ అద్భుత రసాన్నీ పలింకించే ఉల్లాసమైన మనసునూ అర్థం చేసుకోకుండా పుస్తకాలతో హోం వర్క్ లతో అర్థం పర్థం లేని శిక్షలతో చదువు నేర్పిస్తున్నామనుకోవడం పూర్తిగా అర్థరహితం అంటారు కొబయాషీ.

టొటోచాన్ అల్లరి పిల్ల అనీ, తరగతి గది కిటికీలోంచి బయటకు చూస్తూ పిట్టలతో మాట్లాడటం చేస్తూందని ఒక స్కూలు నుంచి పంపించేస్తారు. టొమో స్కూలుకు వచ్చిన చిన్నారి టొటోచాన్, మొదటి పరిచయంలోనే కొబయాషీ ప్రేమకు పాత్రురాలవుతుంది. కొబయాషీ ఆ చిన్నారిని నీకేం తెలుసో చెప్పమని అడుగుతాడు. టొటోచాన్ నాలుగు గంటలకూ సరిపడా విషయాలను గుక్కతిప్పుకోకుండా చెబుతూ పోతుంది. ఐదేండ్ల చిన్నారిలో అంత సేపు చెప్పగల సమాచారం ఉంటుందని తెలుసుకోవడమే వారి విద్యకు మొదటి మెట్టు. వారి అసాధారణ గ్రాహ్య శక్తిని గుర్తించడం చేసినపుడే వారికి నిజమైన విద్యా బోధన జరుగుతుంది. మాట్లాడకండి, నిశ్శబ్దంగా ఉండండి అని చెప్పే పాఠశాలలు, అల్లరి చేస్తే పిల్లలు అని కూడా చూడకుండా చితకబాదే మన ఉపాధ్యాయులు ఈ విషయాన్ని ఎప్పటికైనా తెలుసుకోగలరా.

నేర్చుకోవడం ఒక ఆటలాగా మార్చే విద్యా విధానాన్ని, పిల్లల స్వభావాలు వీలయినంత సహజంగా ఎదిగించే విద్యా విధానాన్నీ నేర్పిన ఈ రైలు బడి రెండవ ప్రపంచం యుద్ధం సమయంలో బాంబు దాడిలో ధ్వంసమైపోయింది. కానీ ఆ స్కూలు నేర్పిన విలువలు మాత్రం ఇప్పటికీ చెక్కుచెదరకుండానే ఉన్నాయి. ఇందుకు టొటోచాన్ రాసిన రైలుబడి పుస్తకమే మంచి ఉదాహరణ. పిల్లలను అర్థం చేసుకోవాలనుకొనే తల్లిదండ్రులకు, పిల్లలను నిజంగా స్వచ్ఛంగా ప్రేమించగలిగిన స్కూలు ఉపాధ్యాయులకూ ఈ పుస్తకం ఒక మార్గదర్శకం. నన్నడిగితే ఈ పుస్తకాన్ని టీచర్ ట్రైనింగ్ లో కానీ, లేదా స్కూలు పాఠంగా కానీ పెట్టాలి. రోజూ చదువుతుంటే కొంత అయినా మనబుర్రల్లోకి ఎక్కుతుంది. అప్పడు అయినా మనం పిల్లలను పిల్లలుగా చూడగలుగుతామనిపిస్తోంది. పిల్లలను ఎలా పెంచాలి అని చెప్పే పుస్తకాలు చాలానే ఉన్నాయి. వాటిల్లో కచ్చితంగా ఈ పుస్తకం ముందు వరసలో నిలుస్తుంది.

 

మనోజ్ఞ ఆలమూరు

2 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)
  • ధన్యవాదాలు మనోజ్ఞ గారూ….

  • రెండో ప్రపంచ యుద్ధం తరువాత వొచ్చిన సంక్షోభం కంటే పెద్ద సంక్షోభం లో ఇప్పటి పిల్లల చదువులు వున్నాయి, ఆంధ్ర ప్రదేశ్ లో ఈరోజు కృష్ణా జిల్లాలో ఒక కార్పొరేట్ కాలేజీ లో అమ్మాయి ఆత్మహత్య చేసుకుంది.

    కరోనా తరువాత కోట్లాది మంది పిల్లలు చదువులకు దూరమయ్యారు. మన ప్రభుత్వం జాతీయ విద్యా విధానంలో రెండుకోట్ల బడి బయట బాలలను డిజిటల్ విద్య, ఓపెన్ స్కూల్ విద్యతో వయసుకు తగిన క్లాసులో కూర్చో పెడతాను అంటోంది. డిజిటల్ సేఫ్టీ గురుంచి మనకు సరైన ప్రమాణాలు లేవు.
    అయితే ఆడుతూ పాడుతూ విద్య అంటూ వృత్తి విద్య ప్రోత్సహిస్తోంది, ఎవరు వృత్తి విద్యలు తీసుకొని అక్కడితో తమ ప్రయాణాన్ని ముగిస్తారు అన్నది అందరికి తెలిసిందే,పోనీ నాణ్యత గల వృత్తి విద్య అందుతోందా .. దానికీ సరైన సమాధానం లేదు.

    జాతీయ విద్యా విధానం మీద చర్చ తక్కువ స్థాయిలో జరిగిన సమయంలో, ప్రత్యామ్నాయ విద్యపై వొచ్చిన ఈ వ్యాసం బాగుంది.

    విద్యావేత్తలు, ప్రభుత్వాలు, సామాజిక కార్యకర్తలు పునరాలోచన చేయవలసిన చారిత్రక సమయం, ఈ పుస్తకం మల్లీ ఎవరైనా ప్రచురణ చేశారా ? ఈ పుస్తకాన్ని టీచర్ ట్రైనింగ్ లో ఒక పాఠంగా పెట్టాలి, మంచి సూచన.

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు