మరిన్ని గోడల్ని బద్దలు కొట్టాలని గుర్తించిన కల్పన

అల్లాడి వెంకట సుబ్బు స్మారక పురస్కారం అందుకున్న సందర్భంగా ఓల్గా ప్రసంగం

ప్రతి యేటా ఇద్దరు రచయిత్రులకు సమర్పించే వెంకట సుబ్బు అవార్డు, 2024 వ సంవత్సరానికి గాను  ప్రముఖ రచయిత్రులు కల్పనారెంటాల, డా. తాళ్లపల్లి యాకమ్మ లకు జనవరి 7 న హైద్రాబాద్ లో అందచేశారు. గత పదిహేనేళ్లుగా ఈ అవార్డ్ ను ప్రతి యేటా జనవరి మొదటి వారం లో జరిగే  కార్యక్రమం లో అంద చేస్తూ వస్తున్నారు. ఎందరో ప్రముఖ రచయిత్రులు ఈ అవార్డు ను అందుకున్నారు.  ఈ అవార్డు ప్రదానోత్సవం మీడియా రణగొణ ధ్వనులకు దూరంగా, ప్రైవేట్ గా ముఖ్యమైన అతిథుల సమక్షం లో జరుగుతుంది. ఈ యేడాది కూడా ఈ అవార్డు కార్యక్రమం ముఖ్యమైన సాహితీ ప్రముఖల ఆధ్వర్యం లో జరిగింది. అవార్డు గ్రహీతల సాహిత్య కృషి గురించి ప్రముఖ రచయిత్రి ఓల్గా, ముదిగంటి సుజాతా రెడ్డి, సాహిత్య విమర్శకురాలు , ప్రొఫెసర్ సునీతారాణి ప్రసంగించారు. దాదాపు మూడు దశాబ్దాలుగా తెలుగు సాహిత్యం లో భిన్న ప్రక్రియల్లో కృషి చేసి తనదైన విభిన్న ముద్ర వేసిన కల్పనారెంటాల సాహిత్యం గురించి ఓల్గా వివరంగా ప్రసంగించారు. 

ఓల్గా ప్రసంగం

అందరికీ నమస్కారం, అల్లాడి ఉమా ఈ వెంకట సుబ్బు అవార్డు పుట్టు పూర్వోత్తరాల గురించి వివరంగా చెప్పారు. ఈ పురస్కారానికి మొదటి నుంచీ దీనిలో ఉండటం అనేది నాకు సంతోషం, గర్వ కారణం గా భావించాను. ఈ అవార్డ్ కోసం మొదట్లో అబ్బూరి ఛాయాదేవి గారి తోను, సునీతా రాణి తోను, ఆ తర్వాత ముదిగంటి సుజాతారెడ్డి గారి తోనూ కలిసి పని చేయటం ఎంతో సంతోషం. వర్తమాన సాహిత్యం లో రాస్తున్న రచయిత్రుల కృషి ని ప్రతి సంవత్సరం మరింత లోతు గా, పరిశీలించటం వ్యక్తిగతం గా కూడా నాకెంతో సంతృప్తి ని కలిగిస్తోంది.

ఈ అవార్డు కోసం కాకపోతే చూపు అంత విస్తరించేది కాదేమో కూడా. ఈ అవార్డు ఎంపిక కోసం ఎవరేం రాస్తున్నారు?అని చూడటం నా దృస్తి ని విస్తరించిందని చెప్పవచ్చు. మేము ముగ్గురం జడ్జెస్ చర్చించుకొని ఒక నిర్ణయానికి వచ్చాక అల్లాడి ఉమా కు తెలియచేస్తాము. ఈ అవార్డు ఎంపిక లో ఉమా ఎలాంటి జోక్యం చేసుకోలేదు మొదటి నుంచి కూడా.  అవార్డు పెట్టిన వాళ్ళ నుంచి ఎలాంటి జోక్యం లేదా సలహాలు, సంప్రదింపులు లేనంటువంటి పురస్కారం ఇది. ఆ రకంగా కూడా ఈ పురస్కారం మరింత గౌరవప్రదమైందని చెప్పాలి. ఈ పురస్కారం లో విశేషం ఏమిటంటే, ఈ అవార్డు ప్రదానోత్సవం ఇన్ఫార్మల్ గా జరగటం, కేవలం సన్నిహితులకు మాత్రమే ఆహ్వానం, అలాగే పెద్ద ప్రచార ఆర్భాటాలు ఏమీ లేకపోవటం. ఇవి కూడా ఈ పురస్కారాన్ని నిర్మలంగా, విభిన్నం గా నిలబెట్టాయని చెప్పవచ్చు.

అవార్డు అందుకుంటున్న యాకమ్మ

అలాగే ఈ పురస్కార ప్రదానం లో విశిష్టత, అవార్డు గ్రహీతల కృషి గురించి, వారిని ఈ అవార్డు కు ఎంపిక చేయటానికి కారణమైన వారి కృషి గురించి న్యాయ నిర్ణేతలుగా మేము అయిదు, పది నిముషాలు మాట్లాడటం, అవార్డు గ్రహీతలు తమ సాహిత్య జీవితం లోని పోరాటాల గురించి విపులంగా, విస్తృతంగా మాట్లాడే అవకాశం కలిపించటం కూడా ఈ కార్యక్రమం లోని విశిష్టత. ఇది సామాన్యంగా మిగిలిన పురస్కారాల్లో దొరకదు. అవార్డు కార్యక్రమాలు సామాన్యం గా ఎలా జరుగుతాయంటే, అధ్యక్షులు, వక్తలు, వీళ్ళు, వాళ్ళు అందరూ మాట్లాడేశాక, అవార్డు గ్రహీతలకు “ ఈ పురస్కారం నాకు రావటం చాలా ఆనందాన్ని కలిగించింది” అని ఒక ముక్క చెప్పటానికి మాత్రమే సమయం లభిస్తుంది. తన జీవితం లోని యే పోరాటం  ఒక స్త్రీ గా, ఒక రచయిత్రి గా తనని ఈ స్థాయి కి తీసుకువచ్చిందో, ఎదుర్కొన్న అవరోధాలు ఏమిటో  చెప్పే అవకాశం రాదు సామాన్యం గా. ఒకళ్లనొకళ్లు తెలుసుకునే అపురూపమైన కలయిక ఈ అవార్డు కార్యక్రమం లో ప్రతి ఏడాది జరుగుతుంది. ఈ అవార్డు గ్రహీతలు దాదాపు గా అందరూ దూరం గా తెలిసిన వాళ్ళే. కానీ వాళ్ళు తమ జీవితం గురించి మాట్లాడుతున్నప్పుడు ఒక జీవితాన్ని గురించి తెలుసుకున్న ఆనందం కలుగుతుంది.

కల్పన చాలా సీనియర్ రైటర్. 2001 లో తన మొదటి కవితా సంపుటం “ నేను కనిపించే పదం” కు నేనే ముందుమాట రాశాను. అంతకు ముందే కల్పన ఓ జర్నలిస్టు గా, ఒక రచయిత్రిగా తెలుసు. కల్పన ఆహ్వానం పత్రికలో, ఆంధ్రభూమి పత్రికలో పని చేస్తున్నప్పటి నుంచే తెలుసు. ఎక్కువ సార్లు కలుసుకోకపోయినా, తన రచనల గురించి, తన సాహిత్య జీవితం గురించి, ఆమె తండ్రి అభ్యుదయ రచయిత రెంటాల గోపాలకృష్ణ గారి గురించి తెలుసు. ఆమె తండ్రి రెంటాల మంచి అనువాదకులు, కవి, రచయిత, నాటక కర్త కూడా. ఆ బాక్గ్రౌండ్ అంతా ఆమెకొక రిసోర్స్ అన్న మాట. అభ్యుదయ భావాలున్న తండ్రి నేపథ్యం నుంచీ సాహిత్యం లోకి వచ్చింది.

తన మొదటి కవితా సంపుటి తోనే మంచి కవయిత్రిగా పేరు పొందింది. భావుకత, స్త్రీల అస్తిత్వం గురించి ఒక వేదన, ఒక ఆసక్తి రెండూ కలగలసి ఉన్న కవయిత్రి అని ఆమె తన మొదటి పుస్తకం తోనే పేరు తెచ్చుకుంది.  మా నాన్న రైటర్ కాబట్టి నేనూ రాయాలని కాకుండా, తనంతట తాను, సాహిత్య లోకం లోకి రావాలన్న ఒక ఉత్సాహం తో, ఒక పెనుగులాట తో ఈ రంగం లోకి అడుగుపెట్టి తనను తాను నిరూపించుకుంది. తన సాహిత్య ప్రపంచాన్ని సొంతగా నిర్మించుకుంది, సృష్టించుకుంది. దాంట్లోనే ఒక స్థానాన్ని సంపాదించుకుంది. మొదట కవిత్వం, తర్వాత కథలు, నవలలు రాయటం మొదలుపెట్టింది. సాహిత్య విమర్శ వ్యాసాలు, అనువాదాలు కూడా చేపట్టింది. తన మొదటి నవల తన్హాయి సంచలనాన్ని సృష్టించింది. దానికి మంచి పేరొచ్చింది. చర్చలు బాగా జరిగాయి. తనలో ఉన్న అనేకానేక భావాలు ముఖ్యం గా ఆమె భావుకత, జీవితం లో ఒక రకమైన ప్రేమకు, ఆప్యాయత కు, అనుబంధాలకు ఉండే స్థానం, అవి దొరికినప్పుడు, అందుకోలేనప్పుడు మనిషి పడేటటువంటి ఆవేదన, ఆరాటం వీటన్నింటిని చక్కటి నవల లాగా సృజించగలిగిన నేర్పరితనం కల్పనది.  వివాహ బంధం లో ఉన్నప్పటికీ కూడా, మరొకరిని ప్రేమించటం చాలా సహజం. అలా జరగదని చాలా మంది అనుకున్నా, అదెంత సహజమో అందరికీ తెలుసు.

మొదట నేను ఈ నవల చదివినప్పుడు కల్పన ఈ నవలను ఇలా ఎందుకు ముగించిందని అనుకున్నాను. కానీ రెండు మూడు సార్లు చదివాక నాకు ఆ ముగింపు ఎందుకు కల్పన అలా చేసిందో మరింత అర్థమయింది. జీవితం లో ఒకళ్ళ ను చాలా ఇష్టపడినా కూడా, వాళ్ళతో జీవితం గడపటం అసాధ్యం అవటానికే ఎక్కువ చాన్సెస్ వున్నాయి కదా అనిపించింది. తన్హాయి నవల అనేక రకాలుగా ఓ ప్రత్యేకతను నిలబెట్టుకొని కల్పన కు మంచి పేరు తెచ్చి పెట్టింది. గోడలు పగలగొట్టడమే మా పని అని శ్రీశ్రీ మహా ప్రస్తానం లో అంటారు. నేను ఫెమినిస్ట్ స్టడీ సర్కిల్ పెట్టినప్పుడు మాకు గోడలు లేవు అని సిద్ధాంత గ్రంథాన్ని తీసుకు వచ్చాము. కల్పన అయిదో గోడ అనే కథల పుస్తకాన్ని వెలువరించింది. అంటే ఈ గోడల్ని పగలగొట్టడం లో మనం కొత్త గోడల్ని కూడా గుర్తించాలి. మామూలుగా మనం నాలుగు గోడలే అనుకుంటాము. కానీ కాదు. చాలా గోడలుంటాయి. కనిపించని అయిదో గోడ గురించి మాట్లాడింది కల్పన ఈ పుస్తకం ద్వారా.

నాలుగు గోడలు దాటి బయటకు వచ్చాక ఈ అయిదో గోడ మొదలవుతుంది మనల్ని ఆపటానికి. అయిదో గోడ దాటిన తర్వాత కూడా ఎన్ని గోడలుంటాయో? అంటే ఎప్పటికప్పుడు మనకు సంకెళ్లు, గోడలు, తలుపులు ఇవన్నీ బంధించి బంధించి ఉంచాలని చూస్తుంటాయి. కొత్త సంకెళ్లు గుర్తించటం తో పాటు కొత్త విడుదలలకు ఆరాట పడటం అనేది ఓ నిరంతర ప్రక్రియ. మేము మొదటి తరం ఫెమినిస్టులము అనుకుంటే, మా సమయం లో మేము జెండర్ మాత్రమే గుర్తించగలిగాము. కొంత కాలం గడిచాక కులం జెండర్ కంటే క్రూరమైనదన్న అవగాహన కలిగింది. ఆ తర్వాత మతం గుర్తింపు కలిగింది. ఒకొక్క సంకేల, ఒకొక్క గోడ గుర్తించుకుంటూ వచ్చి చివరకు ట్రాన్స్ జెండర్ ని గుర్తించటం దాకా వచ్చింది. ఇప్పటికీ ఇది చాలా మందికి కోరుకుడు పడని, అర్థం చేసుకోలేని అంశం గా మిగిలింది. ట్రాన్స్ జెండర్ గుర్తింపు కూడా కలిగాక, దీంతో మనం అన్నీ వివక్షలను గుర్తించేశామేమో అనుకుంటాము. కానీ అప్పటి దాకా మనకే తెలియని మరో వివక్ష ఏదో మన గుర్తింపు లోకి వస్తుంది. అంటే చూపు విశాలమవుతున్న కొద్దీ ఈ ప్రపంచం లో వివక్షలు ఎంత సూక్ష్మం గా కూడా ఉండొచ్చో అర్థమవుతుంది. ఉధారణ కు ageism. సెక్సీజమ్ లాంటిదే ఈ ageism కూడా. Ageism లోని ఇంట్రికసీస్ ని ఇంకా మనం చాలా అర్థం చేసుకోవాల్సి ఉంది.

మన చూపు విశాలమవుతున్న కొద్దీ అనేక రకాల వివక్షలు మనకు అనుభవం లోకి వస్తాయి. అన్నీ వివక్షలు  మనం ఒకటే సారి తెలుసుకుంటాము అనుకోవటం అసాధ్యం, తెలుసుకోలేము కూడా. ఎప్పుడైనా మనం మన నుంచే ప్రారంభమవుతాము. మన మీద ఎదురవుతున్నటువంటి, మనం అనుభవిస్తున్నటువంటి అణచివేత దగ్గర ప్రారంభమైతే, అక్కడ నుంచీ మనం పక్కకు చూసినప్పుడు అట్లా అట్లా మన చూపు , మన అనుభవం, మన పరిజ్ఞానం విశాలమవుతుంది. కల్పన అలా ఈ అయిదో గోడను గుర్తించగలిగింది. ఈ అయిదోగోడ ఎంత క్రూరమైనదీ, ఈ గోడ ను బద్దలు కొట్టడం ఎంత కష్టమైనదీ, అయినప్పటికీ దానికి పూనుకోవటం ఎంత అవసరమైనదీ అని అయిదో గోడ సంకలనం లోని కథలు మాట్లాడతాయి. కల్పన మరో అధ్బుతమైన నవల “ కావేరీ కి అటూ ఇటూ “ రాస్తున్నది. అది ఎడిటింగ్ లో వుంది. అదృష్టవశాత్తు ఆ నవల ను ముందుగానే చదివే అవకాశం నాకు దక్కింది. అది కూడా చాలా మంచి నవల.

అవార్డు అందుకుంటున్న కల్పనా రెంటాల

ఇలా కల్పన అనేక ప్రక్రియల్లో కృషి చేస్తోంది. నాకు ఏమనిపిస్తుందంటే, కల్పన ఓ అభ్యుదయ రచయిత కూతురి గా కొంత బరువు ని మోస్తుంది. తను పుట్టిన నేపథ్యం కులం కానీ, ఇంకొకటి కానీ అది మరో బరువు. ఆ తర్వాత జీవితం లో ఎదురైన అనుభవాల బరువు ని మోస్తోంది. తనంతట తాను ఎదిగింది చాలా వరకు. ఆ తర్వాత సమాజం లో ఏవైతే మనం ఓ గోడ గా చూస్తుంటామో ఆ గోడ ను దాటింది. వివాహం, తర్వాత మతం ఈ గోడల్ని దాటగలిగింది. ఆ తర్వాత దేశాన్ని దాటింది. అక్కడ మళ్ళీ జీవితం మొదటి నుంచీ మొదలు పెట్టి చదువుకొని అక్కడ కుదురుకోవటానికి కష్టపడింది. అక్కడ నుంచీ సారంగ పత్రిక నడుపుతుంది. అంటే ఇవన్నీ మామూలు గా కనిపించవు. లేదా అవేవో పెద్ద కష్టాలు, పోరాటాలు అనుకోము. కల్పన అనగానే ఓ హుషారైన నవ్వు తో కూడిన ఫోటో కనిపిస్తుంది. ఎంత శ్రమ పడితే ఇవాళ తను తానున్న స్థానం లో నిలబడగలిగింది అన్నది ఎవరికీ తెలియదు, అర్థం కాదు. కల్పన కల్పనలాగా ఉండటానికి ఎంత పోరాటం చేసింది? ఏమేమి కోల్పోయింది అన్నది పైకి కనిపించదు.

సత్యవతి గారి సన్మానం అప్పటి నుంచీ ఒక విషయాన్ని నేను పదేపదే చెప్తూ వస్తున్నాను. స్త్రీలను, రచయిత్రులను కానీ, వేరే రంగాల్లో పని చేసే వాళ్ళను కానీ ఒక ఇంటలేక్ఛువల్ గా గుర్తించరు. ఆ ఇంటలేక్చువాలిటీనీ నేను సత్యవతి లోనూ, కల్పన లోనూ,సజయ లోనూ, ఇంకొకళ్ళ లోనూ గుర్తించనంత కాలం అది వివక్ష అంటాను నేను. మేధావులు అనగానే మనకు బోలెడు మంది పురుషులు గుర్తుకు వస్తుంటారు. ఈవిడ మేధావి అని ఒక స్త్రీని ఇంట్రడ్యూస్ చేసినట్లు మనం చూడం. నేనెప్పుడూ వినలేదు.  ఎందుకు? ఈ విషయం గురించి పి. సత్యవతి గారికి హైద్రాబాద్ లోనూ, విజయవాడ లోనూ జరిగిన సన్మానాల్లో ఈ విషయం గురించి నేను చాలా గట్టిగా మాట్లాడాను. చాలా మందికి ఈ విషయమై కోపం వచ్చింది కూడా. డా. యాకమ్మ గానీ, కల్పన గానీ వాళ్ళు మేధావులు గా తయారవటానికి పడిన శ్రమ ను సమాజం ఎప్పటికీ గుర్తిస్తుంది? సారంగ పత్రికను నడపటం లో తన పాత్ర తక్కువదీ కాదు. ఆ పత్రిక ను నడపటం అనేది మామూలు విషయం కూడా కాదు. కేవలం వచ్చిన వాటినీ డీటీపీ చేసో, లేదో డిజైన్ చేసో ప్రచురించటం కాదు పత్రిక నిర్వహణ అంటే. యాకమ్మ విషయం లో కూడా అంతే. ఒక మేధావి గా రూపొందటానికి కావల్సిన అవకాశాలు స్త్రీలకు తగినంత  దక్కవు . స్త్రీలకుండే పరిమితులను అధిగమించి రచయిత్రులు ఆ క్రియేటివ్ స్పేస్ ని దక్కించుకోవటానికి కృషి చేయాలి. కృషి చేస్తున్నారు కూడా. దానికి తగిన గుర్తింపు మాత్రం ఇంకా దక్కటం లేదు. ఎలాగైతే మిగతా ప్లేసులను విస్తరించుకుంటూ వెళ్తున్నామో, ఆ ఇంటెలేక్చుయల్ స్పెసెస్ ని కూడా అలాగే ఆక్రమించాలి. అలా ఆక్రమించటం లో డా. యాకమ్మ , కల్పన చేసిన కృషి గానీ చాలా ముఖ్యమైనదని గుర్తిద్దాము.

*

ఓల్గా

1 comment

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • “సత్యవతి గారి సన్మానం అప్పటి నుంచీ ఒక విషయాన్ని నేను పదేపదే చెప్తూ వస్తున్నాను. స్త్రీలను, రచయిత్రులను కానీ, వేరే రంగాల్లో పని చేసే వాళ్ళను కానీ ఒక ఇంటలేక్ఛువల్ గా గుర్తించరు. ఆ ఇంటలేక్చువాలిటీనీ నేను సత్యవతి లోనూ, కల్పన లోనూ,సజయ లోనూ, ఇంకొకళ్ళ లోనూ గుర్తించనంత కాలం అది వివక్ష అంటాను నేను. మేధావులు అనగానే మనకు బోలెడు మంది పురుషులు గుర్తుకు వస్తుంటారు. ఈవిడ మేధావి అని ఒక స్త్రీని ఇంట్రడ్యూస్ చేసినట్లు మనం చూడం. నేనెప్పుడూ వినలేదు. ఎందుకు? ఈ విషయం గురించి పి. సత్యవతి గారికి హైద్రాబాద్ లోనూ, విజయవాడ లోనూ జరిగిన సన్మానాల్లో ఈ విషయం గురించి నేను చాలా గట్టిగా మాట్లాడాను. చాలా మందికి ఈ విషయమై కోపం వచ్చింది కూడా. డా. యాకమ్మ గానీ, కల్పన గానీ వాళ్ళు మేధావులు గా తయారవటానికి పడిన శ్రమ ను సమాజం ఎప్పటికీ గుర్తిస్తుంది? సారంగ పత్రికను నడపటం లో తన పాత్ర తక్కువదీ కాదు. ఆ పత్రిక ను నడపటం అనేది మామూలు విషయం కూడా కాదు. కేవలం వచ్చిన వాటినీ డీటీపీ చేసో, లేదో డిజైన్ చేసో ప్రచురించటం కాదు పత్రిక నిర్వహణ అంటే. యాకమ్మ విషయం లో కూడా అంతే. ఒక మేధావి గా రూపొందటానికి కావల్సిన అవకాశాలు స్త్రీలకు తగినంత దక్కవు . స్త్రీలకుండే పరిమితులను అధిగమించి రచయిత్రులు ఆ క్రియేటివ్ స్పేస్ ని దక్కించుకోవటానికి కృషి చేయాలి. కృషి చేస్తున్నారు కూడా. దానికి తగిన గుర్తింపు మాత్రం ఇంకా దక్కటం లేదు. ఎలాగైతే మిగతా ప్లేసులను విస్తరించుకుంటూ వెళ్తున్నామో, ఆ ఇంటెలేక్చుయల్ స్పెసెస్ ని కూడా అలాగే ఆక్రమించాలి. అలా ఆక్రమించటం లో డా. యాకమ్మ , కల్పన చేసిన కృషి గానీ చాలా ముఖ్యమైనదని గుర్తిద్దాము.”

    ఒల్గా గారు రెంటాల కల్పన గారి గురించి చాలా బాగా పై మాటల్లొ చక్కగా చెప్పారు.

    ముఖ్యంగా అయిదో గోడ కధా సంపుటి గురించి చాలా బాగా రాసారు.

    మేము ఆ ప్ల్లకధల మీద ధిల్లి లొ కల అంధ్రా సంఘం ద్వారా జూం మీటింగ్ నిర్వహించాను. చాలా మంచి చర్చ జరిగింది. ఆవిడను, అఫ్సర్ గారిని ఆ జూం మీటింగ్ ఎర్పాటు గా తరచు కంపుటర్ ద్వారా కలిసేవాల్లం.

    కల్పన గారిని బాగా ఒల్గా గారు బాగా పరిచయం చెసారు

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు