మన లాంటి ఎన్నో పాత్రల విచికిత్స!

స్‌స్టాండ్‍లో కూర్చుని చలం మ్యూజింగ్స్ చదువుతోందో అమ్మాయి. ముందు ఆ అమ్మాయి చదివే పుస్తకాన్ని చూసి, తరువాత సామాన్యంగా ఉన్న ఆ అమ్మాయిని చూసి, “పుస్తకాలు చదివే ఆడవాళ్ళంటే నాకు గౌరవం. చలాన్ని చదివే ఆడవాళ్ళంటే ప్రత్యేకమైన గౌరవం” అంటూ మాటలు కలిపాడో మనిషి.

“జీవించినందుకు రెండే ఫలితాలు. తీవ్రమైన ప్రేమతో జీవితం వెలగాలి. లేకపోతే విరహంతో కాలిపోవాలి. అంతేకానీ ధనమూ సుఖమూ భోజనమూ ఇవన్నీ కలిగి బ్రతకడమెందుకూ?” అన్న ఆ చెలమే వారధిగా కొన్నాళ్ళకి వాళ్లిద్దరి మధ్య స్నేహం చిగురించింది.

విశాఖ సముద్రం సాక్షిగా, యారాడకొండ సాక్షిగా, ఆమె కన్నుల్లోని అర్థమ్ము కాని భావగీతమ్ములను అతడు చదవగలిగాడు. పట్టిపట్టి చూస్తున్నా తొణుకూబెణుకూ లేకుండా ఉన్న ఆ కళ్ళలో దయాపారావతాలను దర్శించగలిగాడు. అతని గుండెల్లోని వెలితి ఏదో, సన్నగా రివటలా కనపడే అతన్ని నలిబిలి చేస్తున్న వ్యధ ఏదో ఆమె పట్టుకోగలిగింది. సమాజపు ఆమోదంతో సంబంధం లేకుండా శివరామారావు, జయ అనబడే ఈ ఇద్దరి మధ్యా కుదురుకున్న వివాహేతర సంబంధం అన్న తీగ మీద అల్లబడ్డ నవల – “కొంతమంది… కొన్ని చోట్ల”. ఈ బంధం వల్ల రామారావు భార్య అనసూయ, పిల్లలు కవిత, నవతల జీవితాలు ఏ మలుపులు తిరిగాయి, జయ జీవితంలో ఏం జరిగింది, రామారావు జీవితం ఏమయ్యింది అన్నది స్థూలంగా కథ. చెడ్డ కథకులే తప్ప చెడ్డ కథలేమీ ఉండవని ఒక మాట ఉంది. ఇంత చిన్న లైన్ ఆధారంగా, ఇంత విస్తారమైన నవల రాసిన వివిన మూర్తిగారి ప్రతిభ చూస్తే, ఏమి చెబుతున్నామన్నది కాదు, ఎలా చెబుతున్నామన్నదే కథనంలో ప్రముఖ పాత్ర వహిస్తుందని మరోసారి తెలుసుకున్నట్టయింది. నవల యొక్క ప్రథాన ఉద్దేశ్యమైన కథని కొనసాగిస్తూనే, ఎన్నో వ్యక్తిగతమైన మీమాంసల నుండి సామాజిక అన్యాయాల దాకా; తాత్విక చింతన నుండి మార్క్స్, ఆరెస్సెస్‍ల దాకా, కథనంలో అనాయాసంగా, అర్థవంతంగా చొప్పించిన నేర్పు ఈ పుస్తకాన్ని ప్రత్యేకంగా మార్చి చివరికంటా ఆసక్తిగా చదివిస్తుంది.

జయ శివరామారావుకి రాసిన ఉత్తరం, అతని భార్య కంటపడటంతో మొదలవుతుంది నవల. ఒక ఘటన. ఒక ఉత్తరం. దానిని చదివిన మనుషుల ప్రవర్తనలు, ప్రతిస్పందనల మీదుగా పరుచుకునే కథనం. అంటే, ఈ కథన వృత్తానికి కేంద్రంగా లేదా తొలి బిందువుగా ఈ ఉత్తరాన్నుంచి, దాని చుట్టూ ఉన్న కథని అల్లుకుంటూ, తిప్పుకుంటూ, విప్పుకుంటూ కథలోని మిగతా మనుషులు చేసిన ప్రయాణాన్ని చూపించడం; మూడు తరాల జీవితాలను తాకుతూ, ఆ పాత్రల పరిణామ క్రమాన్ని చూపెడుతూ, ఒకరి జీవితం నుండి మరొకరి జీవితానికి ఉన్న లంకెలన్నీ బిగించి పూర్ణవలయంగా ముగించడం, ఈ నవల శిల్పం.

*

సృష్టిలో ప్రాణం ఉన్న జీవులన్నీ తమ కదలిక ద్వారానో చర్యల ద్వారానో స్పందనల ద్వారానో తమతమ ఉనికిని చాటుకుంటూ ఉంటాయి. వాటి వెనుక ఆయా ప్రాణులకు మాత్రమే అర్థమయ్యే ఆలోచనలు బహుశా ఉండే ఉంటాయి. కానీ, ఒక్క మనిషికి మాత్రమే ఈ ఆలోచనలను వ్యక్తపరచడానికి, ఆలోచనల్లోని తప్పొప్పులను బేరీజు వేసుకోవడానికి, తర్కించుకోవడానికి, తాత్విక చింతనకు, భిన్నమైన ఆలోచనలను అర్థం చేసుకుని ప్రభావితం కావడానికి, ప్రభావితం చెయ్యడానికి, తద్వారా వైయక్తికమైనదో, సామాజికమైనదో, మార్పుకు దోహదం చెయ్యడానికి వెసులుబాటు ఉంది.

ఎన్నో వ్యక్తావ్యక్త స్పష్టాస్పష్టమైన ఆలోచనల చమురుతో నడిచే బండి మానవజీవితం. ఆ ఆలోచనల వెనుక సొంత అనుభవాలుంటాయి, తార్కిక తాత్విక చింతనల్లో నుండి ఏర్పడే సిద్ధాంతాలుంటాయి, కర్ణాకర్ణిగా విన్న ఊసులుంటాయి. కొందరి జీవితాలను చూసి ఏర్పరచుకున్న ఆదర్శాలుంటాయి. గాయాల నుండి ఏర్పడే భయాలు, గాయాల నుండే ఏర్పడే ధైర్యాలు, భయాల నుండి పుట్టే వైరాగ్యాలు, తెగింపులూ కూడా ఆలోచనల్లో నలిగి నలిగి ఏర్పడే ముద్రలే తప్ప ఆకస్మికాలూ, అసంకల్పితాలూ కావు. అయితే ఒక మనిషికి ఆలోచించే తత్వమంటూ అలవడ్డాక, ఆలోచనల్లోని మంచీ చెడుల బేరీజు అలవాటుగా మారిపోయాక, ఆలోచనల్లోని లోతుని, తీవ్రతని పరిశీలించి అర్థం చేసుకునే ఒడుపు తెలిశాక, ప్రశ్న వెనుక ప్రశ్నగా ఏ సందర్భాన్నైనా చివరికంటా అర్థం చేసుకునే ప్రయత్నం రివాజుగా మారాక, అతనికిక తన జీవితంతో సహా, ఎవరి జీవితమూ సరళరేఖలా కనపడే వీల్లేదు. ఉయ్ ఆర్ వాట్ వి థింక్- మన ఆలోచనే మన అస్తిత్వం -అన్న భావన చెప్పేది, జాగురూకతతో కూడిన ఆలోచన మనిషిని రూపొందిస్తుంది అన్నదే.

**

చీకటి, వస్తువును దాచి ఉంచినట్టు, అజ్ఞానం జ్ఞానాన్ని కప్పి ఉంచుతుంది. మాయను తొలగించుకోవాలంటే, ప్రతి క్షణం యథార్థ తత్వాన్ని గురించి ఆలోచన (విచారణ) చేస్తూ ఉండాలి అంటారు శంకరులు అపరోక్షానుభూతిలో. అట్లాంటి నిరంతర చింతన మాత్రమే మనిషి స్థితిలో మార్పును తేగలదు.

“కొంతమంది… కొన్ని చోట్ల” నవల ప్రాథమికంగా ఒక మార్పుకు ఒక సమాజం స్పందించే తీరుకి అద్దం పడుతుంది. ఏమి మార్పు? వివాహేతర సంబంధం మాత్రమే కాదు. స్త్రీ పురుష సంబంధాలు, స్త్రీ విద్య, స్త్రీ స్వేచ్ఛ, స్త్రీ ఆశించే కుటుంబం, సమాజం, గౌరవం, వీటి కోసం ఆమె వేసే అడుగులు, తీసుకునే నిర్ణయాలు, ఎంచుకునే జీవన విధానం – ఇవి సమాజం చూపించిన మూసకి ఏ మాత్రం భిన్నంగా ఉన్నా అది మార్పు. ఈ నవల మొదలైనది జయ రామారావు ల సంబంధం మీదే అయినా, దాని పునాదిగా నవల ఎన్నో మార్పులను ముందుకు నెట్టి చూపించింది. చర్చించింది. ఇంకా సూక్ష్మంగా చెప్పాలంటే, ఒక్కొక్క మనిషి ఆలోచించే తీరుని బట్టి, ఎలా ఈ సమాజం ఏర్పడుతుంది, ఎలా ప్రభావితమవుతుంది, ఎట్లాంటి మార్పులకు లోనవుతుంది అన్నది ఈ నవలలో అంతర్లీనంగా సాగిన అతిముఖ్యమైన పాయ.

The observer is the observed అంటాడు జిడ్డు కృష్ణమూర్తి. ఈ కథలో ప్రతీ పాత్ర దానికొక ఉదాహరణ. ఒక బంధాన్ని ఎవరెలా చూసారన్నది వాళ్ళ వాళ్ళ అనుభవాల, ఆలోచనల, అన్నేళ్ళ జీవితం వాళ్ళకు అందించిన వ్యక్తిత్వాల మీదుగా ఏర్పడిన దృక్పథం. అనివార్యమైన ఈ భిన్న దృక్పథాల మధ్య ఘర్షణకు పైకి కనిపించే స్పష్టమైన, ప్రత్యక్షమైన కారణాలను దాటుకుని, ఇంకా లోతుల్లోకి సమస్యల మూలాల్లోకి, ఆయా దృక్పథాలకు ఆధారభూతమైన వాదాలలోకి నడిపించేటప్పుడు, రచయిత ఎవరి తరఫునా వకాల్తా పుచ్చుకోకుండా తటస్థంగా కథనంతా విప్పుకుపోవడం, ఈ రచనకు అదనపు విశ్వసనీయతను చేకూర్చింది.

నవల మొత్తంలో రచయిత శ్రద్ధ రెండు విషయాల మీద ఉన్నట్టు కనిపిస్తుంది. ఒకటి మార్పు. రెండు ఆలోచన. ఎలాంటి మార్పు, ఏ స్థాయి మార్పు, అన్న దానితో నిమిత్తం లేకుండా, మార్పుకీ ఆలోచనకీ ఉన్న అవినాభావ సంబంధాన్ని, ఆ సంబంధపు ప్రాముఖ్యతని రచయిత ఎన్నో విధాలుగా నవల ఆసాంతం నొక్కి చెప్తూనే ఉంటారు. అంతే కాదు, నవల్లోని పాత్రలు కూడా, ఈ రెండింటి సంబంధం ఆధారంగా విశ్లేషించడానికి అనువుగా రూపొందించబడటమన్నది కూడా, నాదొక గమనింపు. మంచి చెడు, తప్పు ఒప్పుల ద్వంద్వాలకు అతీతంగా నవలలోని చాలా పాత్రలు వాళ్ళ వాళ్ళ సహజ స్వభావాలను పరుచుకుంటూ వాళ్ళకు వాళ్ళుగా అందిపుచ్చుకున్న జ్ఞానంతో “ఎందుకు ఆలోచించాలి” అన్న ప్రశ్నతో తమ జీవితాలను అర్థం చేసుకోవడం, తద్వారా వాళ్ళను వాళ్ళు జీవితంలోని మరో దశకు తీసుకుపోవడం నవలలో ఎన్నోచోట్ల కనపడే ఆసక్తికరమైన అంశం.

ప్రస్తుత వ్యాసంలో, నవలలోని కొన్ని ముఖ్యమైన పాత్రలను తీసుకుని, వాళ్ళ ఆలోచనా ధోరణిని, వాళ్ళ జీవితాల్లోని మార్పుకీ వారి ఆలోచనాసరళికీ ఉన్న సంబంధాన్ని, దాని తాలూకు పరిణామాలని చర్చించే ప్రయత్నం చేస్తున్నాను.

జయ .

శివరామారావుని కలిసేనాటికి, ఈమె కూడా వివాహిత, విధవ. అక్క బావల దగ్గర ఉండి చదువూ, జీవితమూ అప్పుడప్పుడే చేతుల్లోకి తెచ్చుకుంటోన్న మనిషి. అదృష్టవశాత్తూ ఆమెకు గురువులాంటి బావ దగ్గర ఆలోచనామృతం అనుభవమైంది. అది ఆమెకు అన్నాళ్ళూ లేని కొత్త బలాన్నిచ్చింది.

అందుకే, జయ తన ఆలోచనలను చిత్రిక పట్టుకుని, తను కోరుకున్న మార్పుకై ముందడుగు వేయగలిగింది. ఆమెలో ధైర్యం ఉంది. నచ్చిన మనిషి కోసం సాంఘిక భద్రతను వదులుకోగలిగిన తెగువ ఉంది. ఒంటరి తల్లిగా బిడ్డను పెంచగల తెగింపు, బిడ్డను అపరాథ భావనేదీ లేకుండా కనగలిగిన మానసిక సంసిద్ధతా ఉన్నాయి. ఆమెకు తన నిర్ణయం పట్ల పూర్తి బాధ్యత తీసుకోగలిగిన పరిపక్వత ఉంది. తన అనుకున్న మనిషి జీవితం పట్ల అక్కరను వదులుకోలేని ఆదర్శం ఉంది.

“నువ్వు ఉన్నావు కనుక నీ ఆలోచన ఉంది. నీ ఆలోచన ఉంది కనుక నువ్వు ఉన్నావు. నువ్వు ఉన్నావు కనుక నీకు ఎంపిక ఉంటుంది. ఎంచుకోగలిగితేనే నువ్వు ఉన్నట్టు” అన్న తన గురువు మాటలను ఆమె నమ్మింది. ఆమె రామారావు తో జీవితం పట్ల నిర్ణయం తీసుకుంది అంటే, ఆమెకు ఇక మరే ప్రశ్నలూ లేవని కాదు. మరే దుఃఖాలూ ఆమెను తాకలేదని కాదు. కానీ, ఆమె “జ్ఞానం కలిగించే బాధ వల్ల అజ్ఞానం గొప్పదవుతుందా?” అన్న ప్రశ్నను ఎదుర్కోగలిగింది. వెలుతురు కలిగించే వేడి వల్ల, చెమట వల్ల చీకటి మాత్రమే కోరుకోకూడదని నిర్ణయించుకోగలిగింది. అది ఆమె ఆలోచన. అందుకే ఆమె స్వంతంగా జీవితాన్ని నిర్మించుకోవడంలో ఉండే ఆనందం కోసం తపనపడింది. ఆ దారిలో ఎదురైన కష్టాలను, దుఃఖాలను ఈ ఆనందం పక్కన చిన్న గీతలుగా గీసుకుంది.

ఒక ఆలోచనను మనసారా నమ్మి, అది తెచ్చే మార్పును మనసా వాచా కర్మణా ఆహ్వానించి ఆ మార్పుతో కలిసి ప్రయాణించిన మనిషిగా జయ ఈ నవలలో బలంగా నిలబడుతుంది.

*

నవత.

సంఘంలో ఎప్పుడైనా సరే, ఒక మార్పు ఎదురవబోతుంటే దాన్ని పాత తూనికలతో, అప్పటికే అమలులో ఉన్న నీతి, న్యాయపు తూనిక రాళ్ళతో మాత్రమే కొలిచి – తేడాలుంటే నిరోధించజూసే సమూహం ఒకటి ఉంటుంది. నవత మొదట ఆ మూర్ఖపు నమ్మకాల సమాజానికి ప్రతినిధి. మంచీ చెడులను పాలూ నీళ్ళలా విడదీసి చూడగలననుకునే అమాయకురాలు. ఉద్వేగపరురాలు. కానీ సమాజంలోని ప్రతి మనిషి ఒక సందర్భానికి ఒకే విధంగా ప్రతిస్పందించగల అవకాశం ఉండదు అని అర్థం చేసుకోవడానికి చాలా సహానుభూతి కావాలి. సంస్కారం కావాలి. వాటిని జీవితానుభవాలు, ఆ అనుభవాల్లో నుండి పుట్టే ఆలోచనలు ఇవ్వగలవు. ఆ ఆలోచనలను బలపరిచే సాహిత్యమూ, ఆ సాహిత్యపు వెలుగుని దారి దీపంగా నిలిపి ఆ త్రోవన నడిచేందుకు ధైర్యాన్నిచ్చే మనుషులు- వీళ్ళ వల్ల మాత్రమే మార్పు నేరమో ద్రోహమో పాపమో కాదని, మార్పు ఒక అవసరమని, మార్పు మాత్రమే శాశ్వతమనీ అర్థం చేసుకోగల శక్తి, మహామాయానుభవం లాంటి జీవితం పట్ల వినమ్రత అబ్బుతాయి. తన జీవితానుభవాలు, వాటి నుండి పుట్టిన ఆలోచనలు, ఆవేశపూరితమైన నవత వ్యక్తిత్వాన్ని ఎలా నునుపుదేలుస్తూ వచ్చాయో గమనించడం దానికదే ఒక స్పూర్తిపాఠం. మార్పు విలువను గుర్తించే సమూహాలు, భిన్న వ్యక్తిత్వాలను గౌరవించే సాంగత్యాలు, ఆలోచించి, ప్రశ్నించే ధోరణి ఎంతటి మొండి మనస్తత్వాలనైనా కాలక్రమేణా ఎలా మారుస్తాయో చూపించే కీలకమైన పాత్ర నవతది.

“నేను లేకపోతే నువ్వు కూడా ఉండదు. ప్రశ్నా ఆలోచనా లేకపోతే నమ్మకం ఎక్కడ నుండి వస్తుంది. ఒకటి ఉంటేనే “ఇదేమిటి” వస్తుంది. ఇదేమిటి వచ్చాక, ‘చూసే’ నేనేమిటీ వస్తుంది. ‘ఇదీ’ ‘నేనూ’ ఏమిటని తల కొట్టుకుంటే మొదట వచ్చే సమాధానం ఏమిటి? మనకన్నా సర్వశక్తిమంతుడు ఈ ప్రకృతి పురుషులను సృష్టించాడు. అదే జవాబుని పట్టుకుని ఉండిపోతే నువ్వవుతావు. అంటే నమ్మకానివి. ఇంకేముందో అని వెదికితే నేను అవుతాను. అంటే ఆలోచనని.”

ఇదీ నవత మనసు. రచయిత ఈమెను ఆలోచనకి ప్రతీకగా చూపించదలిచాడు.

తన తల్లికి జరిగిన అన్యాయానికి ఆవేశంతో కుతకుతలాడిపోతుంది నవత. తండ్రిని నిలదీస్తుంది. జయని అసహ్యించుకుంటుంది. వాళ్ళిద్దరినీ ఖండించని అక్కనీ, అమ్మనీ ఏవగించుకుంటుంది. ఆ పరిస్థితుల నుండి దూరంగా పారిపోతుంది. తప్పో ఒప్పో ఆమెను అంటిపెట్టుకు ఉన్నది ఒక్క ఆలోచన మాత్రమే. ఆ ఆలోచన ఉంది కనుకే, మార్పుని ఆమె వెనువెంటనే అంగీకరించకపోయినా దాని గురించి తనదైన ఆలోచన చేస్తూ వచ్చింది.

తన కుటుంబాన్ని కుదిపేసిన ఆ మార్పుకి ఎడంగా ఉంటూ చదువుకుంది. బాధ్యతగానో అనాలోచితంగానో అలవాటుగానో చదువు ఇచ్చే భద్రత మీది ప్రీతితోనో కాదు. పట్టుదలతో, జవాబుల కోసం చదువుకుందామె. ఆ చదువుతోనే ఆమెకు కొత్త ఆలోచనలు కలిగాయి. పాత పట్టుదలలు సడిలాయి. ఆలోచనల్లో నలిగే బుద్ధి వలనే ఆమె తనకు తానుగా కొత్త మార్గాల్లో నడిచింది. పాత పంతాలను అనుభవాల ఒరిపిడితో నిగ్గు తేల్చుకుని వదిలించుకుంది. కమ్యూనిస్టులని, ఋషులని, ఈనాటి మతవాదులని కూడా ఒకే వరుసలో నిలబెట్టి చూడటాన్ని అర్థం చేసుకుంది.

నిలువెత్తు ఆలోచనకి స్త్రీ రూపం నవత. మార్పుని అంగీకారయోగ్యం చేయడానికి కావలసినది నిర్బంధమో, నియంతృత్వమో, అవసరమో, వేడుకోలో కాదు – ఆలోచన అన్న వాస్తవానికి ప్రతీక ఈమె పాత్ర. ఆలోచన స్థిరంగా ఉండనీయదు. పరుగులెత్తమనే చెప్తుంది. ప్రవహించకపోతే కల్మషాలు పేరుకుపోయి కుళ్ళిపోతామనే చెప్తుంది. అందుకే నమ్మిన విశ్వాసాల ఓటిదనం తెలిసేదాకా, అవసరమైనా అక్క పంచన చేరలేదు. రాజుని చేరుకుంటే స్థిరత్వం దొరుకుతుందని తెలిసినా అతనితో ఆగిపోలేదు. ఆచరణ చెయ్యి పట్టుకుని, అన్వేషణలో కొనసాగిన ఆలోచన, నవత.

**

బాలు.

సొంత ఆలోచనా శక్తి లేని చోట, చిన్న మార్పైనా మనిషిని ఉక్కిబిక్కిరి చేస్తుందనీ, అది ప్రాణాంతకం కాగలదనీ, కాబట్టి, ఆలోచన అన్నది మనిషికి జీవమని గొప్ప ప్రతీకాత్మకంగా చెప్పే పాత్ర బాలుది.

ఈ పాత్ర ఎంత సజీవంగా నవల్లో ఒదిగిదంటే, ఆ పాత్రని స్మృతిపథంలో నుండి చెరపడం అసాధ్యమనిపించేంత. ఆ పాత్రలో చదువు పరంగా కనపడే మేథస్సు, వ్యక్తిత్వపరంగా కనపడే ప్రత్యేకతా, అతని ముచ్చటైన “ఎందుకూ?” అన్న ప్రశ్న, అతని నియమాలూ, అతని హద్దులూ, ప్రేమ వ్యక్తీకరణా- ఒకటి కాదు. బాలు పాత్ర నవలలో అడుగుపెట్టిన క్షణం నుండీ ఒక హాయి తెమ్మెర లాంటిదేదో తాకిన భావన. ఆ పాత్ర చిత్రణలో కనపడే సౌకుమార్యం, అతని మాటల్లో తొణికిసలాడే లాలిత్యం, అమాయకత్వం, అతన్ని ఒక అపురూపమైన పాత్రగా మార్చి కళ్ళ ముందుకు తెస్తాయి. ఆలోచన అన్నది మనిషికి ఎంత అవసరమో, ఎంతటి వరమో ఈ పాత్ర చెప్తుంది. రచయిత అతని మానసిక సమస్యను అత్యంత ప్రతిభావంతంగా వాడుకుంటూ, నాటకీయతను పండిస్తూ, ఆలోచనకు సంబంధించి కొన్ని ముఖ్యమైన ప్రతిపాదనలు చేస్తారు.

“సరైనదీ కానిదీ ఆలోచించే మనిషి సంఘంలో మంచి వ్యక్తి అవుతాడట. ఆ లోలోపలి చర్చ మనిషికీ సంఘానికీ మేలు చేస్తుందిట.”

“మనిషి ఎదుగుదలకి మూలం ప్రశ్న. ప్రశ్నలన్నింటిలో మొదటిది ఏమిటి. మనిషిని ముందుకు నడిపించినది ఎందుకు. ఏదో ఒక జవాబు ఇచ్చుకోవడం, దానిని పరిశీలించుకోవడం. ఇది నాగరికత నడిచి వచ్చిన మార్గం. మన సంస్కృతిలో ఉపనిషత్తులు ఈ పద్ధతిలో ఉంటాయి. నువ్వు ఆ పద్ధతిలో ఆలోచించాలి” అంటాడు బాలుతో అతని తండ్రి.

నవలలో బాలుకి ఆరోగ్యపరమైన సమస్య ఉంది. ఒకరకంగా ఇతన్ని, సమాజంలో స్వంతంగా ఏ నిర్ణయాలూ తీసుకోలేని, ఒక ఆమోదాన్ని పొందితే తప్ప జీవించలేని సమూహానికి ప్రతీకగా తీసుకోవచ్చు. కానీ, జీవితంలో అన్ని సందర్భాలకూ ఆమోదయోగ్యమైన సమాధానాలు దొరుకుతాయని లేదు. అలా దొరకని సందర్భాలు నీతిమాలినవనీ కాదు. ఈ విచక్షణ మనిషికి ఆలోచనల సారాన్ని గ్రహించే నేర్పు ఉంటేనే సాధ్యం. ఒక రూల్ బుక్ ని ఆదర్శంగా పెట్టుకుని, అందులో దొరకని సందర్భాలకి అతలాకుతలమైపోయి తననీ, తనతో పాటుగా ఉన్నవారినీ అకారణంగా నొప్పించుకునే ధోరణి ఇక్కడ కనపడుతుంది. ఆలోచన ఆగిపోయిన చోట, సొంత ఆలోచనకు తావు లేని చోట, బ్రతుకు నిర్వీర్యమవుతుందన్నదే బాలు జీవితం చెప్పే పాఠం. మనిషికి ఆలోచనే జీవం అన్న ఊహను ఎంతో ప్రతిభావంతంగా నవలలో చొప్పించిన రచయిత ప్రతిభ కనపడుతుందిక్కడ.

*

రాజు.

“చదివితే తెలిసేది సమాచారం. ఆలోచిస్తే తెలిసేది సారం” అని చెప్పిన రాజు మాటల్లోని ఆంతర్యమూ ఇదే.

“మన పూర్వీకులు ఒక పద్ధతి అనుసరించారు. అది ధ్యానం. మనసు లగ్నం చేసి ఆలోచించడం. కాగ్నిటివ్ స్కిల్స్ లో మొదటిది ఇదే. అటెన్షన్, ఒక వస్తువు, ఆలోచన, చర్య. పరిసరాలు దేనిమీదైనా మనసు లగ్నం చేసి దీర్ఘకాలం ఆలోచించడం. మనవాళ్ళు దీనిని బాగా వృద్ధి చేసారు. అభ్యసించారు. రెండవది ఇంట్యూషన్. ఇది అంతర్బుద్ధి. ప్లేటో దీని ఉనికిని గమనించాడు. నిర్వచించడానికి ప్రయత్నించాడు. శాశ్వతమైన, నిరంతరమైన, అనంతమైన ఆత్మలో దాగున్న జ్ఞానం జాగురూకమవడంగా దీన్ని చెప్పాడు. ఈ జాగురూకమవడం అనేది యాదృచ్ఛికంగా జరుగుతుంది అన్నద్ ప్లేటోతో సహా చాలా మంది అనేది. అది జాగురూకం చెయ్యడం మనవాళ్ళు చేశారని అనుకుంటాను. ధ్యానం అనే పద్ధతిలో ఈ రెండూ ఉన్నాయని నాకు అనిపిస్తుంది..” అని రాజు అనడం, హేతువుతో ముడిపడినవీ హేతువు తొందరగా బోధపడనివీ అని అతను చేసిన విభాగం మరెన్నో కొత్త ఆలోచనలకు తెరదీయడమే కాదు, నవలలోనూ నవత పాత్ర నడతను ప్రభావితం చేయడానికి సాయపడుతుంది. వారిద్దరి మధ్యా ఈ సంభాషణ అనంతరం మొదలయ్యే సన్నివేశాలను కూడా – ఈ హేతువుకు అందేవీ అందనివీ అన్న చర్చ, చింతన ఒక సమర్థనగా ముందుకు నడిపిస్తుంది. ఇట్లా, రచయిత ఒక వంక ఎన్నో లోతైన ఆలోచనలను, ప్రతిపాదనలను పాఠకుల ముందు ఉంచుతూనే వాటిని అవలీలగా కథనాన్ని ముందుకు నడిపించడానికి, కథని మరింత బలోపేతం చేయడానికి వాడుకున్న తీరు ఎక్కడికక్కడ ఆశ్చర్యంలోకి నెడుతూనే ఉంటుంది.

తాను నమ్మిన సిద్ధాంతాలను, తనవైన విశ్వాసాలను ఆలోచనల దన్నుతో సరిచూసుకుంటూ ప్రయాణాన్ని కొనసాగించే మనిషి రాజు. మార్పుని అర్థం చేసుకోవడానికి ఆలోచన ఎలా సాయపడుతుందో చూపించే ప్రతీకగా ఇతని పాత్రను గుర్తించవచ్చు.

*

జీవితంలో జయ ఒకరకం మార్పుని కోరుకుంది. ఆ సమయంలో ఆమెకి అండగా నిలబడింది ఆమె బావగారు.

నవత కూడా ఒక మార్పుని అసహ్యించుకుని బాబాయి ఇంటికి చేరింది. బాబాయి మురళి ఆమెకప్పుడు అండ.

అక్కడ నుండి ఇద్దరూ తమ తమ వ్యక్తిత్వాలకు తగ్గట్టు నిర్ణయాలు తీసుకున్నారు.

“ఆలోచించడం నేర్పేక – ఎలా ఆలోచించాలో, ఏం ఆలోచించాలో- నేర్పించిన వాడి అధీనంలో ఉండదు” అంటాడు జయ బావగారు. అది మార్పు అనివార్యమన్న ఎరుక ఉన్న మనిషి స్పందన. అట్లాంటి సమాజానికి ఆ వ్యక్తి ప్రతీక. బాధ్యతతో సహా ఒక మార్పుని తలకెత్తుకున్న మనిషికి పక్కకు తొలిగి దారివ్వడమే తాను చెయ్యగలిగినది అనుకున్న ఆ మనిషి, ఒక ఆదర్శ సమాజానికి ప్రతినిధి.

నేను సాయం చేస్తాను కానీ, నీ జీవితం నా కనుసన్నల్లో, నేను గీసిన పరిథిలో, నేను చెప్పిన నియమాలకు లోబడే సాగాలి అన్న నియంతృత్వ ధోరణికి మురళి ప్రతీక. వీళ్ళు సమాజాన్ని ఎటూ పోనీరు. వాళ్ళు స్వయంగా నీతినియామాలకు లోబడి ఉన్నా ఉండకపోయినా వాటిని పది మందిమీదా బలవంతంగా రుద్ది ఉక్కిరిబిక్కిరి చేయాలనుకునే కుత్సిత సమాజానికి మురళి ప్రతీక. వాళ్ళకు విలువ ఈయవలసిన అవసరం, అగత్యం లేదని అర్థమవుతూనే ఉంటుంది. కానీ అవసరాలని దాటుకుని, అన్యాయాలని చేతనైనంత ఖండించి, వాళ్ళని దాటి వెళ్ళడానికి ఎంతో మానసిక, శారీరక, ఆర్థిక ధృడత్వం అవసరం. సమాజాన్ని ఉద్ధరిస్తున్నామనుకునే మురళి లాంటి వాళ్ళ వల్ల నిజానికి మేలు కన్నా కీడే ఎక్కువ. ఆలోచనల నోరు నొక్కి, అవకాశవాదంతో సుఖాలను పొందుతూ, మార్పు తమ జీవితపు సౌఖ్యాలను కొల్లగొడుతుందన్న భయానికి, అభద్రతా భావానికి, మార్పుని ఎక్కడికక్కడ బలవంతంగా తొక్కిపెట్టే సమాజానికి, మురళి ఒక ప్రతీక.

*

శివరామారావు.

“నేనో కొత్త ఆలోచన చేస్తున్నాను. దోవ తీస్తున్నాను. అది రహదారి అయే వరకూ సమస్యలుంటాయి.” అని అంటాడు శివరామారావు. అతడికి మార్పు అవసరం తెలుసు. అతను కోరుకున్న జీవన సౌందర్యం, మాధుర్యం, గౌరవం తాను పుట్టిన, పెరిగిన వాతావరణంలో లేదని తెలుసు. దానికోసం తన పరిధిలో చెయ్యగలిగినది నిదానంగా చేసుకుంటూ వచ్చిన మనిషితడు. చలాన్ని చదువుకున్నవాడు, చలాన్ని చదువుకునే స్త్రీ పట్ల గౌరవం ఉన్నవాడు. స్త్రీపక్షపాతం చూపించిన చలం, మగవాడి ఒంటరితనంలో తోడు అని గుర్తుపట్టగల వివేకం ఉన్నవాడు. చలం చెప్పిన మనసు ప్రాముఖ్యతను పట్టుకున్నవాడితడు. “స్త్రీల గురించి సరిగ్గా ఆలోచించి సంస్కారంతో ప్రవర్తించండి” అన్న చలం మాటలు ఇంకించుకున్నవాడు.

తాను పెరిగిన కుటుంబ వాతావరణానికి భిన్నంగా, భార్యతో ఎన్నడూ అవమానకరంగా మాట్లాడకపోవడం, కూతుళ్ళని స్వేచ్ఛగా పెంచడం, చదివించడం, -ఎక్కడో ఓ చోట కవిత అన్నట్టు, అతడు అన్నింటిలో కలుగజేసుకుని తన అభిప్రాయాలు రుద్దకపోవడం వల్లే అతని పిల్లలూ తమ ఆలోచనలను స్వేచ్ఛగా వ్యక్తపరుచుకునే ధైర్యాన్ని అలవరచుకున్నారు- ఇటువంటివన్నీ చేశాడు రామారావు. ఇతని జీవితంలోకి జయ రావడం, ఆ బంధాన్ని అతను కొనసాగించదల్చుకోవడం ఆవేశంలో జరిగినది కాదు. ఆ నిర్ణయం వెనుక వాళ్ళిద్దరే సాగించుకున్న ఎన్నో ఆలోచనలున్నాయి. పరుచుకున్న ఆశలున్నాయి. “మనిషి మాత్రమే తన జీవితాన్ని నిర్మించుకోగలిగిన, నిర్వచించుకోగలిగిన ప్రాణి. దాన్ని తన చేతుల్లోకి తీసుకోవడం ద్వారానే మనిషికి అస్తిత్వం. కాదంటావా?” అన్న జయ ప్రశ్నకి అతడు “మన నిర్ణయాలు ఇతరులను బాధించకూడదు కదా” అనే అనేకానేక తర్కాల తరువాత కూడా అనుకోగలుగుతాడు. వ్యక్తి నీతి, సంఘ నీతి ఒక వైపు, ఎదిగిన పిల్లల ఆలోచనా ఉధృతి ఒకవైపు, ఉప్పెనలా ముంచిన జయ ప్రేమ, లాలన, సంస్కారం, జీవితం పట్ల ఆలోచనాభరితమైన ఆమె చూపు అతన్ని తలో దిక్కుకీ లాగాయి. జయ, గోపి తన బాధ్యత కాదని మొదటి నుండీ అనుకుంటాడు. చివరి షేర్ లెక్కల్లో కూడా అదే కనపడుతుంది. జయ ఏమైనా చెప్పి ఉండవచ్చు, ఆమె ప్రతిభ మీద, సంసారాన్ని ఒంటరిగా నిభాయించుకోగల ఆమె సామర్థ్యం మీద అతనికి ఎంత నమ్మకమైనా ఉండి ఉండవచ్చు; కానీ అతని ఆస్తి ఏర్పాట్లు గమనించినప్పుడు, నిజంగానే వారి పట్ల బాధ్యత తీసుకోలేదా అన్నది పాఠకులను చకితులను చేసే ప్రశ్న. అది జయ పట్ల నమ్మకమా? అనసూయ తన కుటుంబాన్ని నిలబెట్టుకోలేదు కనుక అదనపు బాధ్యతా? ఇతను వీళ్ళకి అన్యాయం చేసిన భావనతో చేసిన అదనపు ఏర్పాటా? లేదూ పెళ్ళి అన్న కట్టుబాటు ఉన్న చోటే బాధ్యత ఉంటుందనుకునే ఇరుకు మనస్తత్వమా అర్థం కాదు. ఇతడు పిల్లలను మిగతావారి కంటే భిన్నంగానే పెంచిన మాట నిజమే కానీ, నవత మాటలంటే భరించడు. చెయ్యెత్తడానికి వెనుకాడడు. గొడవ ముగిశాకా దుఃఖంతో గదిలోకి వెళ్ళి తలుపులు వేసుకుంటాడు.

ఏ రకంగా చూసినా, శివరామారావు మార్పుని కోరుకునేవాడే కానీ, దాని తాలూకా పరిణామాలకు బాధ్యత వహించగలిగే సన్నద్ధత లేనివాడిగానే కనపడతాడు. నిర్వచించుకోలేని అసంతృప్తి, నిర్ధారించుకోలేని ఆశల నడుమ, అయోమయంలో గడిచిన జీవితంగానే అర్థమవుతాడు. అతనికి ఒక కొత్త దారి తీస్తున్నాను అన్న ఎఱుక ఉంది కానీ, అందులోని ప్రశ్నలని భరించే శక్తి లేదు. ఆ ఘర్షణని ఎదుర్కునే ధీమా లేదు. ఉన్నది వదిలి, కావలసిన దానితో ఏ అపరాధభావనా లేకుండా సుఖంగా మనగలిగిన తెలివీ ఉన్నట్టు కనపడదు. ఉంటే, అన్నీ వదిలి బెంగళూరు రావడం అర్థం కాదు. అట్లా అని పాతదారిలోనో అందరూ నడిచే దారిలోనో రివాజుగా నడవనూ లేడు. ఈ సంధి మనిషికి ప్రతీగా నిలబడ్డ పాత్ర శివరామారావుది.

ఏ రకంగానూ తన వాళ్ళందరినీ, తాను నమ్మిన మార్గాన్ని బలపరించే ఏకాభిప్రాయానికి తీసురలేనన్న అపనమ్మకానికి తలవంచి పారిపోయిన మనిషితడు.

ఇతనికి ఆలోచించడమూ తెలుసు, ఆలోచన ద్వారా పొందగలిగిన మార్పు ఎంత అపురూపమైనదో తెలుసు. కానీ, ఆ మార్పు బరువుని మోసే బలం లేదు. సంఘం పూర్తిగా ఆమోదించని మార్పుని తానే స్వయంగా భుజాలకెత్తుకుని మోసే ధైర్యం లేని మనిషికి, ఈ పాత్ర ప్రతీక. వీళ్ళు మార్పు దారిలో అడుగులేస్తున్నారు. ప్రయాణం అసంపూర్ణం. ప్రశ్నార్థకం. నవల్లో అతని పాత్ర కూడా అలా అర్థాంతరంగా మాయమయ్యేదే. ఎన్నో ప్రశ్నలను విడిచిపెడుతూ.

*

అనసూయ.

జీవితం పట్ల స్వభావసిద్ధమైన ఒక అంగీకారగుణం ఎలాంటి మార్పునైనా ఆమోదయోగ్యం చేస్తుందనే భావనకు ప్రతీక అనసూయ పాత్ర.

ఈ మొత్తం పుస్తకంలో ఊహించలేని విధంగా తీర్చిదిద్దబడిన పాత్ర అనసూయది. దుఃఖపు చెరసాలకూ, ఒప్పుకోలుతో కూడిన విడుదలకూ మధ్య ఉండే వైరుధ్యాలతో సహా, ఆమె పాత్ర చిత్రణ అత్యంత సహజంగా సాగుతుంది. వైరుధ్యమే సహజంగా, సహజత్వమే ప్రత్యేకతగా తమాషాగా చిత్రించిన పాత్ర అనసూయది. ఇట్లాంటి పాత్ర చిత్రించడానికి రచయితగా ఎంత అనుభవం కావాలో, మనిషిగానూ అంత జీవితానుభవం కావాలేమో అనిపిస్తుంది. రెండిందాలా రచయిత ప్రతిభ అసాధారణంగా ఇక్కడ భాసిల్లుతుంది.

జయ గురించి తెలిసిన సందర్భాల్లో కానీ, జయని కలిసిన సందర్భాల్లో కానీ, అనసూయలో అనుమానం, అభద్రత కన్నా ఒకింత ఆశ్చర్యమే ఉన్నాయేమో అనిపిస్తుంది. అభ్యుదయ ఆలోచనలు ఉన్న నవత కన్నా, స్వభావసిద్ధంగా నెమ్మదియై, ఆలోచనాపరురాలైన కవిత కన్నా, అందరి కన్నా ముందుగా, హాయిగా ఈ జయను ఆదరపూరితంగా చూసినదీ, మన్నించినదీ అనసూయే. హాస్పిటల్‌లో కలిసినప్పుడు ఆమెను ఆపేయడం, ఇంటికి తీసుకు వచ్చి మర్యాదగా చూసుకోవడం మొదలుకుని మురళి వాళ్ళు ఇంటికి వచ్చి జయ గురించి అవమానకరంగా మాట్లాడినప్పుడు చెవులు మూసుకుని వాటికి ఖండన తెలిపే సంఘటన దాకా – అనసూయది ఒక ఆసక్తికరమైన పాత్ర. ఆమెలో తన అందం గురించి ప్రశ్నలు లేవని కాదు, తన పిల్లల భవిష్యత్తు గురించి బెంగ లేదని కాదు. కానీ ఆమె చూపుడువేలు అందరిలా మొదట జయ మీదకి పోలేదు. పోయి అక్కడే నిందాపూర్వకంగా నిలిచిపోలేదు. ఇట్లాంటి వాళ్ళు మనకు తారసపడుతూనే ఉంటారు. తమకు జరిగే అన్యాయాల పట్ల ఉదాసీనభావంతో, ఒప్పుకోలుతో ఉంటూ, ఎవ్వరిపట్లా ప్రతీకార భావనల్లేకుండా, జీవితాన్ని రేపేమిటి? అన్న ప్రశ్నతో ముందుకు నడిపించుకునేవాళ్ళు. వీళ్ళకి మార్పు పట్ల అవగాహన లేకపోవచ్చు. ఏది ఎందుకు జరిగిందో తరచి చూసుకుని విశ్లేషించుకునే జ్ఞానం లేకపోవచ్చు. కానీ, మనుషుల పట్ల మానవసహజమైన అక్కర, నమ్మకం నిలుపుకోగలిగిన అదృష్టవంతులు వీళ్ళు. ఒక “ఇన్స్టింక్ట్” ద్వారా ఆమె జయ మాటలన్నీ నిజమేనని నిర్ధారించుకుంటుంది. అదే ఊతంగా, ఆఖరు రోజుల్లో ఆమెతో హాయిగా ఒక ఫ్లాట్ పంచుకుంటుంది. అనసూయది బ్రతుకు కోసం అందిపుచ్చుకున్న అవకాశవాదం మాత్రం కాదు. అది అవ్యాజమైన కరుణ. అపారమైన నమ్మకం. చాలా అరుదుగా మనుషుల్లో కనిపించే ఒప్పుకోలు స్వభావం.

సరిగ్గా దీనికి భిన్నంగా, ఆలోచన చెయ్యగలిగీ అర్థం చేసుకోగలిగీ మార్పు అవసరం తెలిసీ, మారే అగత్యం లేక చిక్కుపడి ఉండిపోయిన శైలజ కథను నవత నవల చివర్లో చెప్తుంది. సర్దుబాట్లూ, హిపోక్రసీతో కూడిన ఒప్పుకోళ్ళూ, సర్దుకోలేక పారిపోవడాలూ- అచ్చంగా అనసూయ కథకి మరో వైపు ఇది.

**

కవిత.

ప్రతి సమాజంలోనూ మార్పుకి ఎవరో ఆలోచన చేస్తారు. ఎవరో ఆచరిస్తారు. కానీ, ఆ మార్పుల తాలూకు ప్రభావాలను భరించి, ఆ మార్పుని అర్థం చేసుకుని బలపరచి నిలబెట్టవలసిన సమూహం ఒకటి ఉంటుంది. వాళ్ళలో ధైర్యం ఉండాలి. సహానుభూతి ఉండాలి. పరిస్థితులను అర్థం చేసుకోగల వివేచన కావాలి. మనుషులని ఘటనలుగా విడదీసి కాకుండా మొత్తం జీవితంగా పరికించగల పరిపక్వత కావాలి. సంఘం ఆమోదించని దారిలో నడవబోతున్నవాళ్ళకి వెన్నుదన్నుగా నిలబేటప్పుడు, ఆ రాళ్ళదెబ్బలు వీరికీ తగులుతాయన్న తెలివిడితో పాటు, వాటికి ఎదురొడ్డి నిలబడగల అపారమైన శక్తి కూడా కావాలి. ఇంతా చేసి వాళ్ళకు ఈ మొత్తం వ్యవహారంలో స్వంతానికి దక్కేది ఏమీ ఉండకపోవచ్చు. దక్కడం పక్కన పెడితే, గౌరవంతో సహా కోల్పోవలసినవీ ఎన్నో ఉండవచ్చు. కానీ వీళ్ళు లేకపోతే మార్పుకు ఉనికి లేదు. మార్పు తెచ్చే ఫలాలు మంచివో చెడ్డవో గమనించే వీలూ లేదు. మార్పుకి ఊతంగా నిలబడే సమూహాలకి ప్రతీక, కవిత.

ఆమె తండ్రిని అర్థం చేసుకోవాలనుకుంది. ప్రతిగా చెల్లి దగ్గర పడరాని మాటలు పడింది. చదువు నేర్పిన సంస్కారంతో జయతో విసురుగా ప్రవర్తించలేకపోయింది. బంధువర్గాల్లో ఒకరకంగా తన అవసరాలకు జయ పంచన చేరినట్టు చిత్రీకరించబడింది. తన తోటి విద్యార్థితో, అలవాటు లేని కంబైండ్ స్టడీస్‌కి ఊఁ కొట్టి, దాని ద్వారా వచ్చిన ఇబ్బందులను, నిందలను ఎన్నాళ్ళో మోసింది. కేవలం తన తండ్రి, బాలు తండ్రి, తన మీద ఉంచిన నమ్మకాన్ని కాదనుకోలేక, అది మంచి ఆలోచనే అని నమ్మడం వల్ల జరిగిన చేటుని జీవితంలోని అతి ముఖ్యమైన దశలో వయసుకి మించిన పరిణతితో భరించింది. జయ విషయంలోనూ ఆమె ఆలోచించింది, ఆమె మాటలనీ, తండ్రి మాటలనీ తిరస్కరించే ఉద్దేశ్యంతో కాదు, వీళ్ళిలా ఎందుకయ్యారన్న కుతూహలంతో విన్నది. వాళ్ళ జీవితాల్లోని లోటుని, వాళ్ళ నిర్ణయాల్లోని ఆలోచనని, అలా తప్ప మరొకలా ఉండలేని వాళ్ళ అసహాయతనీ అర్థం చేసుకుంది. ఆమె తనకున్న పరిమితుల్లోనే, తనకు చేతనైన రీతిలో మార్పుకు సహకరించింది. మార్పుని ముందుకు తీసుకువెళ్ళింది. మరొక ఆదర్శవంతమైన తరాన్ని తయారుచెయ్యడంలో తన పాత్రను, నిశ్శబ్దంగా, రహస్యంగా సాగిస్తూ వచ్చింది. అందుకే ఈమె జీవితంలో నవత జీవితంలో ఉన్న నాటకీయత కనపడదు. జయ జీవితంలోని ఘర్షణ కనపడదు. అనసూయలా ప్రశ్నల్లేకుండా ఒదిగిపోవడమూ కాదు. బాలు లా సమాధానం లేక మాయమవడమూ, శివరామారావులా ఏదీ ఎదుర్కోలేక పారిపోవడమూ కాదు. ఆమె అన్నింటినీ తట్టుకు నిలబడింది. చివరికంటా.

“లోకంలో కోట్లాదిమంది సామాన్యులు చెప్పుకోదగిన ఎటువంటి ఘటనలూ లేకుండా జీవించారు. నిర్ణయాలు తీసుకోవలసిన సందర్భాలు లేకుండా బ్రతికారు. జీవితాన్ని ముగించారు. అది కోరదగినది కాదా?

నేను ఏమిటో తెలియజెప్పే ఘటనలు లేని జీవితంలో నేను లేనా?

సాహసం చైతన్యం ప్రదర్శించితే తప్ప అలాంటి అవకాశాలు జీవితం కల్పిస్తే తప్ప, నేను నేను కానా?”

అన్న మీమాంసలో పడుతుంది కవిత ఒక చోట. చివరికి ఆమె జీవితమే ఈ ప్రశ్నలన్నింటికీ సమాధాన పత్రమైంది. జీవిత పర్యంతం ఇన్ని యుద్ధాలు చేసింది కదా కవిత, ఏమిటి ఆమె బలం అన్న ప్రశ్న రాకపోదు. అలిశెట్టి ప్రభాకర్ లా ఈమె కూడా, ” నా ఆలోచనల ఆయుధాగారం తెరిచేనా…” అనే అంటుందేమో!

**

మనిషిని కొన్ని కోట్ల ఆలోచనలరాశిగా చూడవచ్చేమో. ఏ ఆలోచనల మీద మన బుద్ధి నిశితంగా పనిచేస్తుందీ, దేనిని అకారణంగా తిప్పి కొడుతుందన్నది, తిరిగి మన అనుభవాల మీద, అవసరాల మీద, క్షణక్షణానికీ ప్రోది చేసుకునే సంస్కారాల మీదా ఆధారపడుతుంది. మనిషి తాలూకు ఏ స్పందనా తక్షణం అయ్యే వీల్లేదు. మనం అసంకల్పితం, అకారణం, అనాలోచితం అనుకునే మామూలు చర్యల వెనుక కూడా, మనం ఊహించలేనంత వెనుకటి కాలాల్లోని ముద్రలు, నీడలు, గుర్తులు ఉంటాయి. అవే మనమెప్పుడు ఎలా స్పందించాలో మెదడుకి తర్ఫీదునిస్తూ ఉంటాయి. అలాంటిది, ఎన్నో ఏళ్ళుగా, మెలకువతో ఆచరిస్తోన్న కట్టుబాట్లకు, నమ్మకాలకు విరుద్ధంగా ఒక పని చేస్తున్నామంటే, లోపలి నుండీ, చుట్టూ ఉన్న లోకం నుండి తిరస్కరణ అన్నది ఊహించలేనిది కాదు.

కాలం చెల్లిన కారణానికి చెరపడానికి వెనుక కొన్ని వందల ఏళ్ళ చరిత్ర ఉంది. పునరాలోచించుకుని వదిలించుకునేందుకు పుచ్చిపోయిన విలువలు ఎటు చూసినా కనపడుతున్నాయి. వీటి కన్నా ముందు, మనిషిగా సంస్కరించబడటానికి, మరింత ఉన్నతిలోకి, ఔదార్యంలోకి, వెలుతురులోకి అడుగేయడానికి అందరికీ ఆస్కారముంది, అవకాశం ఉంది, హక్కు ఉంది. అవసరం కూడా ఉంది. గతం తాలూకు పాఠాలను మాత్రం గుర్తుంచుకుని, గతాన్ని వదిలివేయందే, వ్యక్తికి కాని, సమాజానికి కాని, మొత్తం మానవజాతికి కాని భవిష్యత్తు లేదు. ఆ ఎరుక, ఆ మార్పు, ఒక్క మెలకువతో కూడిన ఆలోచన నుండే వస్తుంది. అట్లాంటి ఆలోచనలను, స్వీయవిచారణా బుద్ధిని, మన లాంటి ఎన్నో పాత్రలను, వాళ్ళ వాళ్ళ విచికిత్సలను మన ముందుంచి మేల్కొల్పే నవల “కొంత మంది..కొన్ని చోట్ల”.

*

మానస చామర్తి

5 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • Entire essay ran like a thesis…great retro feel as we did this technique for nondetailed novels.great job Manasa garu.kudos.hoping to read the novel….

  • విశిష్టమైన పుస్తకంలోని పాత్రల అద్భుత విశ్లేషణ అభినందనలు మానసా

  • నాన్నా నా నవలలో ఎవరైనా అనసూయ పాత్ర గురించి పట్టుకుంటారా అని ఎదురుచూసాను “జీవితం పట్ల స్వభావసిద్ధమైన ఒక అంగీకారగుణం ఎలాంటి మార్పునైనా ఆమోదయోగ్యం చేస్తుందనే భావనకు ప్రతీక అనసూయ పాత్ర.” ఈ ఒక వాక్యం నాకు చాలా తృప్తి కలిగించింది. అసాధారణమూ, అసామాన్యమూ అయిన వ్యక్తులను పాత్రలుగా చేయటంలో రచయితకి సౌల్లభ్యం ఉంటుంది. వాస్తవ జీవితంలో వారి సంఖ్య సముద్రంలో కాకిరెట్ట. కాని సాహిత్యంలో వారిదే హవా. అయినా, అసాధారణ పాత్రలే సామాన్యమైన సామాజిక అవగాహనలు చెప్పటానికి సాధారణంగా సాహిత్యంలో పనికి వస్తాయి. నేనీ పాత్రని డీల్ చేసినపుడు కుటుంబరావు గారన్న విషయం నా మనసులో ఉంది. సామాన్యాంశాన్ని సామాన్యంతో చెప్పటం చాలాకష్టం. నీ వ్యాసం చదివాక నాకు నా శ్రమ ఫలించిన ఫీలింగ్ కలిగింది. ఏ రచనా పరిపూర్ణం కాదు. అది ప్రయత్నం. పాఠకుడిని పట్టుకోవాలన్న స్పృహ ఉంటుంది. తన అభిప్రాయాన్ని చెప్పాలన్న తహతహ ఉంటుంది. స్థలకాలాలను బట్టి విశ్వసనీయమైన(convictionగల) రచయిత రచనా ప్రయత్నం ఉంటుంది. విమర్శకుడు స్థలకాల దృష్టితో విమర్శకు దిగాలి. నీలో ఆ రకమైన చూపు ఉంది. దాన్ని నీ చైతన్యంలో భాగం చేసుకుంటే తెలుగు సాహిత్యానికి ఒక అవసరమైన విమర్శకులు లభిస్తారు. నీ అనే సంబోధన కి ఈ వృద్ధుడిని మన్నించు.

  • అరుదైన నవలకు ఎంతో అర్ధవంతమైన విశ్లేషణ

  • నవలలోని పాత్రలన్నిటినీ నువ్వే సృష్టించావేమో అన్నంతగా ఉంది నీ పరిశీలన మానసా. రచయిత కన్నా నువ్వు ఎక్కువ శ్రద్ధగా వాళ్ళ మానసిక స్థితి అర్ధం చేసుకున్నావేమో అనిపించింది ఒక్కక్షణం నాకు. మొత్తం చాలా ఆసక్తిగా చదువుతూ, అనసూయ గిరించి ఏం చెపుతావా అని ఎదురుచూసాను. నిరాశపరచ లేదు నువ్వు. నువ్వు ప్రస్తావించిన చోట్లనే అనసూయని చూసి నేనూ ఉలిక్కి పడి, అబ్బురపోయాను. ఎలా మొదలయిన మనిషి ఎలా చెక్కబడింది!!! ఎదురుచూడని చోట ఎదురుచూడని మార్పు. రచయిత ప్రత్యకత, అనుభవం తెలిసేది ఇలాంటి చోటే. అనసూయ, కవితలు నాకు బాగా నచ్చిన పాత్రలు.
    నీలా చదివి ఆనందించేవాళ్ళు కొద్దిమంది ఉన్నా రచయితల కష్టం, తృష్ణ తీరినట్టే. మంచి పరిచయానికి అభినందనలు, కృతజ్ఞతలు.

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు