1324 లో ఢిల్లీ సుల్తానుల దక్షిణ భారతదేశ దండయాత్రలతో ప్రారంభమైన పరాయి పాలన బహమనీలు, కుతుబ్ షాహీలు, మొఘల్ లు అటు తర్వాత ఆసఫ్ జాహి లు.. మొత్తం 624 సంవత్సరాలు, తర్వాత నిజం రాజ్ ప్రముఖ్ గా 8 ఏండ్లు, అటు తర్వాత 58 సంవత్సరాలు ఆంధ్ర వలస పాలకులు.. వెరసి మొత్తం 690 ఏండ్లు కర్కశ అణచివేత, దోపిడి జరిగిన కాలంలో తెలంగాణ భయంకరమైన హింసనూ, ఆధిపత్యాలనూ, ఆక్రమణలనూ, బానిసలుగా దుఃఖాన్నీ నిశ్శబ్దంగా అనుభవించింది. ఈ శతాబ్దాల కాలంలో తెలంగాణా జరిపిన అనేక రకాల పోరాటాలు , యుద్ధాలూ, తిరుగుబాట్లూ, త్యాగాలూ ఎన్నో.
చరిత్రను నిశితంగా, లోతుగా, శాస్త్రీయంగా విశ్లేషిస్తే స్పష్టంగా తెలియవచ్చే విషయమేమిటంటే.. ఈ దోపిడీలో, దౌర్జన్యాలలో పరాయి వ్యక్తులు చేసిన ద్రోహంకంటే ఇంటిదొంగలుగా మన మనుషులే ఇతరులతో కుమ్మక్కై ‘ కోవర్ట్ ‘ లుగా మారి, అసమర్థులుగా తలపెట్టిన ద్రోహమే ఎక్కువ. ఈ ఇంటిదొంగలను నిర్మూలించడం అంత సుళువైన విషయం కాదని పోరాట జీవితం గురించిన లోతులు తెలిసిన విజ్ఞులు అంగీకరిస్తారు.
తన విముక్తికోసం, దాస్య శృంఖలాలను తెంచుకుని తలెత్తుకుని జీవించడం కోసం, స్వేచ్ఛ కోసం, తెలంగాణ పడ్డ అంతర్ఘర్షణలెన్నో. ప్రపంచప్రసిద్ధి చెందిన , 4500 పైగా వీరులను కోల్పోయిన ‘ తెలంగాణా రైతాంగ సాయుధ పోరాటం ‘ తో పాటు 1969 తెలంగాణ తొలి విముక్తి పోరాటం.. 369 మంది యువకుల ప్రాణత్యాగాలు.. మళ్ళీ 2001 లో మొదలై 2014 దాకా సాగిన చారిత్రాత్మక అహింసాయుత సుదీర్ఘ తెలంగాణ ‘ మలి దశ పోరాటం ‘ .. దాదాపు వేయికిపైగా వీరుల ఆత్మబలిదానాలు.. ఈ పుణ్యభూమి యొక్క స్వతంత్రత వెనుక ఉన్న ప్రజ్వలిత నేపథ్యం.
ఏది ఏమైనా.. తెలంగాణ అంటే.. నిరంతర నిప్పుల కొలిమి, బిగించిన పిడికిలి, ఒక తిరుగుబాటు, ఒక అవిశ్రాంత ప్రతిఘటన. తెలంగాణ అంటే నిజాయితి, తెలంగాణ అంటే అమాయకత్వం, మాటకు ప్రాణమిచ్చే త్యాగశీలత, వలసలు, పెనుగులాటలు, దుఃఖాలు.. కన్నీళ్ళు.
అంతిమంగా తెలంగాణ అంటే భూమిని చీల్చుకుని శూలమై నిలబడ్డ ఒక ప్రశ్న.
ఈ నేపథ్యంలో విడమర్చి చెప్పిన ఒక తెలంగాణ స్త్రీమూర్తి యొక్క స్వయంనిర్మిత జీవిత గాథ ఈ ‘ మనిషి పరిచయం ‘.
*
Add comment