మనిషితనం

“పాపం..షరీఫ్ గాడు సందమామ లెక్కుండేటోడు. అన్యాయంగ సంపిన్రు” కాంచ్ గిలాసల ఛాయ్ పోసి జనాలకిస్తున్న పెద్దమనిషి మాటలు కార్తిక్ కు ఇనిపించినయి.

“నిన్నటి దాక మంచిగ ఉండెనే శంకరన్న…రాత్రి మా షరీఫ్ గాని పిల్లలు ఈడు కల్సి ఇల్లంత అంగడంగడి జేసిన్రు.ఎవని కన్నువడ్డదో…ఏ గాలి దాకిందో…బిడ్డ లేవకుండైండు…”గుండెల్ని మెలిపెడుతున్న దుఖమేదో ఇస్మాయిల్ మాటల్ని బలవంతంగ ఆపింది.“యా అల్లాహ్ మేరే బచ్చే కో సహీ సలామత్ రఖ్ నా”అనుకుంట మంచం కోడును పట్టుకుని లేశి కూసుకున్నడు.

“అగో…ఇప్పుడేమైంది ఇస్మాయిల్…గంతగనం పరేషాన్ అయితున్నవు.షరీఫ్ వోయిండు గదా డాక్టర్ను తోల్కరానికీ.ఆళ్లనురానీ…డాక్టర్ సాబ్ ఏమంటడో ఇందాం పట్రాదు”అనుకుంట దుడ్డెల శంకర్ బీడి ముట్టిచ్చిండు.గట్టిగ ఓ దంబట్టిండు.ఎంబట్నే బీడీని కిందపడేసిండు.

“అగో మన షరీఫ్ గాడు మాయిళ్లనే డాక్టర్ ను తోల్కొస్తున్నడు గద”అన్నడు.ఆ మాటినంగనే మంచంల కూసున్న ఇస్మాయిల్ లేశి బయిటికొచ్చిండు.డాక్టర్ కు నమస్తే పెట్టిండు.ఇంటి ముందు గద్దె మీద పండబెట్టిన కొల్యాగను డాక్టర్ కు సూయించిండు.టార్చ్ లైట్ పెట్టి కొల్యాగ కండ్లల సూసినంక నోట్ల సుక్కల మందు పోసిండు డాక్టర్.అటెంక ఏదో పౌడర్ ను పేపర్ల కట్టకట్టి ఇస్మాయిల్ కిచ్చిండు.చిట్టి మీద మందులు రాసి షరీఫ్ చేతికిచ్చిండు.ధర్మారంల దొరకకుంటే కరీంనగర్ ల దొర్కుతయని చెప్పిండు.రెండు రోజులల్ల తగ్గకుంటే ధర్మారం తీస్కరమ్మన్నడు.

డాక్టర్ ను దించిరానీకి షరీఫ్ పోయిండు. కొల్యాగ మూతి నుంచి కారుతున్న సొల్లును లుంగితోని ఇస్మాయిల్ తుడ్సిండు. మూస్కపోయిన దాని కళ్లను తెర్శిచూసిండు. ఆ కండ్లల్ల ఏం కనిపిచ్చిందో ఏమో…ఇస్మాయిల్ కండ్ల నుంచి బొటబొట నీళ్లు రాలినయి.

“పిసగాని లేశిందా ఏందీ?డాక్టర్ ఏం కాదన్నడు కదా.మనిషికి ఓపిక ఉండాలె.రెండు రోజులు మందులేసినంక సూద్దాం.అటెంక ఆ భగవంతుడున్నడు. ఏం కాదు.ఊకో…”శంకర్ మల్లొక బీడీ ముట్టిచ్చిండు.గద్దె మీద కొల్యాగ తలకాయను తొడల మీద పెట్టుకుని కూసున్నడు ఇస్మాయిల్. కొల్యాగను ఇస్మాయిల్ ను చూసిన శంకర్ ఏదో ఆలోచించుకుంట నోట్ల బీడీ వెట్టుకున్నడు. అగ్గిపెట్టెను అంగిజేబుల పెట్టిండు. కాండ్రించి ఊంచినంక “కేశపట్నంల గొల్లోల్ల నర్సన్న అనేటాయన ఉంటడు. పశులకొచ్చె బీమార్లకు పసరుమందు వోస్తడు. అట్లనే మంత్రం సద్వుతడు. యంత్రం కడ్తడు. నాలుగైదు తంతెల నుంచి ఆళ్లు అదే పనిజేస్తున్నరు. నర్సన్నది మంచి హస్తవాసి.ఆళ్ల ఊరి సర్పంచ్ గొడ్డును మొన్న గుడ్డేలుగు కొడ్తే సచ్చిందని అడ్విల్నే ఇడ్సిపెడితే,నర్సన్ననేవోయి నడిపిచ్చుకుంట ఊర్లకు తీస్కచ్చిండు.ఏం జేసిండోఏమో?”

శంకర్ మాటలింటాంటే ఇస్మాయిల్ కండ్లు తేటగైనయి.

ఊర్లున్న ఒక్క తుర్కొల్ల ఇల్లు ఇస్మాయిల్ దే. ఒక్కడన్న సాయబు ఊర్లుండాలని పెద్దమనుషులంత ఇస్మాయిల్ ముత్తాతను కరీంనగర్ నుంచి ఊరికి పిలిపిచ్చిన్రు. చేస్కతిననీకి మూడెకరాల పొలం, ఉండనీకి రెండు గుంటల జాగ సూయించిన్రు. ఇండియాల హైదరాబాద్ దేశం కల్సినప్పుడు కాసులపల్లెకొచ్చిన ఆ కుటుంబానికి ఆ ఊరే అన్నం పెట్టే తల్లైంది. సోర పొరడుగున్నప్పుడు ఇస్మాయిల్ అన్నలల్ల కల్శిండు. విప్లవం వస్తదని నమ్మి అడ్వులల్ల తిర్గిండు. కొయ్యూర్ దగ్గర అన్నలు మీటింగ్ పెట్టిన్రని తెల్సి ఆడ్కివోయి దళ నాయకులను బతిమిలాడుకుని కొడుకును బైటికి తీస్కొచ్చుకున్నడు మగ్దూం. ఇస్మాయిల్ కు వ్యవసాయం తెల్వకపోయేసరికి తాబీజ్లు కట్టుడు నేర్పిండు. చాంద్ బీ కిచ్చి లగ్గం జేసిండు.షరీఫ్ కడుపులవడ్డంక మగ్దూం సచ్చిపోయిండు.పదొద్దుల దినాలనాడే తన పొలాన్ని ఇస్మాయిల్ కౌలుకిచ్చుకున్నడు. మొహర్రం అప్పుడు పీరీలను నిలబెట్టుడు, అవి నీళ్లలవడ్డంక ఆన్నే మసీదు కాడ తాబీజ్లు కట్టుడు షురూ జేసిండు. ఇస్మాయిల్ తాయెత్తు కడ్తే బరాబార్ మంచిగైతదన్నపేరు తెచ్చుకున్నడు. ఎట్లనో అట్ల చేసి షరీఫ్ ను డిగ్రీ దాకా సద్విచ్చిండు. డిగ్రీ అయిపోంగనే పొలం జేస్తనని షరీఫ్ అనుడుతోని ఇస్మాయిల్ కు గమ్మతనిపించింది. నీతోని అయితదా బేటా?అని అడుగుదామనుకున్నడు. కాని కొడుకు మీద నమ్మకంతోని సరే అన్నడు. ట్రాక్టర్ కొనే స్థోమత లేదని రెండెడ్లు కొన్నడు. అయ్యా అవ్వా లేని సల్మాతో షరీఫ్ షాదీ చేసిండు. మూడేండ్లల్ల ఇద్దరు ఆడపిల్లలు పుట్టిన్రు. చిన్నబిడ్డ పుట్టినంక సల్మాకు పాలు రాకపోయేసరికి లక్ష్మీఅనే ఆవును తెచ్చుకున్నరు.

“అన్నా…కొల్యాగ కోసం గింత దూరమచ్చుడు అవసరమా. మా దోస్తుగాని పెండ్లికి రేపు భూపాలపల్లి పోయేదుండె. మీ బాపచ్చిఅడిగేసరికి మా అయ్య గింత రాత్రి నీతోని పంపిండు. ఇంగ పెండ్లికి పోవుడు క్యాన్సిలే”టాటాఏస్ నడుపుకుంట బొంకూరి తిరుపతి మాట్లాడుతున్నడు.

“అరేయ్ తమ్మీ…నోరు లేని జీవంరా అది. నీ బిడ్డకో నా బిడ్డకో…పానం మంచిగలేకుంటే అట్లనే ఇడ్సిపెడ్తమారా? ఏడికన్న తీస్కవోయి సుదరాయించుకోమా చెప్పు?”మూసిన కండ్లు తెర్వకుండనే షరీఫ్ సమాధానం జెప్పిండు.

“నా చిన్నబిడ్డ పుట్టినంక మీ వదినకు పాలు రాలేదు. బర్రె పాలైతే జల్ది అర్గయని అబ్బఈ లక్ష్మీని తీసుకొచ్చిండు. ఈ సన్నీగాడు తాగిన పాలనే నా బిడ్డకు పట్టినం.ఒక్కోపారి షెడ్లకు వొయ్యి లక్ష్మీ పొదుగుకు మూతివెట్టి నా బిడ్డ పాల్తాగేది.అదేందోగాని లక్ష్మీ కూడా ఏం అనకపోయేది.”టాటా ఏస్ క్యాబిన్ ల కూసున్న షరీఫ్ కండ్లు తెర్సి ఎనక ట్రాలీలున్న లక్ష్మీ,సన్నీలను చూసిండు. లక్ష్మీ నిల్సోనే నెమరేస్తాంది. మాటిమాటికి సన్నీ నెత్తిని నాకుతాంది.

“సన్నీగాడి పానం మంచిగలేకపోయేసరికి లక్ష్మీ బేచైన్ బేచైన్ అయిందిరా. సక్కగ తింటలేదు. తాగుతలేదు. సన్నిగాడి సుట్టే తిరిగేది.ఎట్లైన నా బిడ్డ పానం మంచిగ చెయ్ అన్నట్టు నా దిక్కు చూసేది.నా బిడ్డకు పాలు తాగిచ్చిన నోర్లేని జీవం పరేషాన్ లుంటే అన్నం కూడా తినబుద్ది కాలేదు”

“నాకొకటి చెప్పన్న. మీ ఆవు పేరు లక్ష్మీ అని ఎందుకు పెట్టుకున్నరు?”ఎప్పటిసందో అడగాలనుకున్న ప్రశ్న అడిగానన్న తృప్తి బొంకూరి తిరుపతిల కనిపించింది.

“ఈ ఆవును మేం ఒకలిదగ్గరినుంచి కొన్నం. వాళ్లు దీనికి లక్ష్మీఅని పేరు పెట్టుకున్నరు. మా ఇంటికొచ్చినంక మేం ఏ పేరువెట్టి పిల్సినా ఇది దేకకపోయేది. లక్ష్మీఅని పిలిస్తెనే మా దిక్కు సూసేది.  ఇగ ఇదొచ్చినంకనే జర్రంత బర్కతయింది. ఇగ మా అబ్బ ఊకుంటడా! లక్ష్మీపేరుతోనే పిల్సుడు షురూ జేసిండు.”

“మంచిగున్నదన్న మీ ఆవు ముచ్చట” అల్ముకుంటున్న నిద్రను అదిలియ్యడానికి బొంకూరి తిరుపతి డెక్ సౌండ్ పెంచిండు. మధ్యరాత్రి ఒంటిగంటైంది. పొద్దుగాలనే హైద్రాబాద్ చిన్న బిడ్డ ఇంటికిపోతానా. మాయిళ్లనే రాల్లి అని గొల్లోల్ల నర్సన్న ఫోన్ ల చెప్పుడుతోని అప్పటికప్పుడు ట్రాలీ కిరాయి మాట్లాడుకుని కేశవపట్నం బయల్దేరిండు షరీఫ్.

ట్రాలీ అల్లనూరు చౌరస్తా దాటి వరంగల్ రూట్లకొచ్చింది. మానకొండూరు దాటినంక ట్రాలీని ఒక ఇన్నోవా ఓవర్ టేక్ చేసింది. ట్రాలీ ముందటికొచ్చిరోడ్డుకు అడ్డంగ ఆగింది. తిరుపతి సడెన్ బ్రేకేసిండు. ఎక్ దం ఆగుడుతోని నిల్సున్న లక్ష్మీ దబేల్మని కింద పడ్డది. షరీఫ్ తలకాయ ముందట డ్యాష్ బోర్డ్ కు గుద్దుకుంది. ఇన్నోవాకెల్లి ఐదుగురు వయసు పోరగాళ్లు దిగిన్రు. అండ్లకెల్లి ఓ ఇద్దరు ఇన్నోవా డిక్కీ తెర్సీ పెద్ద పెద్ద రాడ్లు బైటికి తీసిన్రు.

“గొడ్డుకూర తినే బాడ్కావుల్లారా…ఆవును ఏడికి తీస్కపోతాన్రా. కబేళాకు తీస్కపోతాన్రారా?” అనుకుంట ట్రాలీ అద్దాలను పలగకొట్టిన్రు. తోడెళ్ల మంద లెక్క ఒక్కసారి మీద పడేసరికి తిరుపతి హైబత్ తిన్నడు. క్యాబిన్లనే బీరిపోయిండు.గళ్లాపట్టి బైటికి గుంజేసరికి రోడ్డు మీదపడ్డడు. ఇంకొంతమంది షరీఫ్ ను గొఱ్ఱగొఱ్ఱ గుంజుకుంట రోడ్డు మీదికి తీసుకొచ్చిన్రు. ఇద్దర్నీ మోకాళ్ల మీద కూసోబెట్టిన్రు. మాట్లాడనియ్యకుండ నపరొకరు దెబ్బలేసిన్రు. తిరుపతి తలకాయ పలిగింది. బొటబొట రక్తం కారింది.షరీఫ్ ముఖం మీద రాడ్ల తోని కొట్టేసరికి ముక్కు చితికిపోయింది.నోట్లున్న పండ్లన్నీ రోడ్డు మీద పడ్డయ్.ఈ తతంగాన్ని ఫోన్ లొకడు వీడియో తీసిండు.

“అరేయ్…ఇంకోసారి ఎవడన్నా…మా ఆవుల్ని కబేళాకు తీస్కపోత నరికి పోగులు పెడ్తం బిడ్డ”అని అండ్ల లీడర్ లెక్కున్న ఓ పెద్దమనిషి గదమాయించిండు. ఇద్దరు పోయి ట్రాలీ డోర్ తీసిన్రు. పగ్గం పట్టుకుని లక్ష్మీని కిందకి గుంజిన్రు.రోడ్డు మీద బేహోశ్ గ పడున్న షరీఫ్ ను జూసి లక్ష్మీ కోపానికొచ్చింది. ముందటున్నోన్ని కొమ్ములతోని లేపి కిందెత్తేసింది. ఇంకొకని మీదికి రంకేసింది. ఆవు బెదిరిందని భయపడి ఎటోల్లటు ఉరికిన్రు.

పొద్దున్నే గావరగావర కార్తిక్ ఫ్లాట్ కొచ్చిండు శ్రీను. ఇంక లేవలేదని జ్యోతి చెప్పుడుతోని బెడ్ రూంల సొచ్చిండు.“ఏదో ప్రాజెక్ట్ వర్క్ ఉందని నైటంత కూసున్నడన్నా…”ఫ్రీజ్ లకెల్లి పాలప్యాకెట్ తీసుకుంట జ్యోతి చెపుతున్న మాటల్ని ఇనుకుంటనే రూంలకు పోయి శ్రీను తలుపేసిండు. కాళ్లకాడ కూసోని కార్తిక్ ను లేపిండు. అంత పొద్దుగాల ఇంట్ల శ్రీనును జూసుడుతోనే కార్తిక్ కు ఏం అర్థం కాలేదు.ఏందన్నట్టు ముఖం పెట్టిండు.

“మనం కరీంనగర్ ల ఇద్దర్ని కొట్టినం కదా అందులో ఒకడు నిన్న రాత్రి చనిపోయిండు”

కార్తిక్ కు నిద్రమత్తంత దిగింది.ఏసీల గూడ చెమటలు పట్టినయి.

“ఇంకొకడు కోమాలున్నడు వాడు గూడ బతుకుడు కష్టమే అంటున్నరు.”

“అట్లెట్ల చనిపోతడు? మనం ఏమంత కొట్టినం?”

“ఒకని తలకాయ పలిగింది. ఇంకొకని వెన్నుపూస ఇరిగితే మాములుగ కొట్టినట్టా? అప్పటికీ నేను మొత్తుకున్న.వద్దురా అని…నా మాట ఎవ్వడిన్లే. తాగి  తాగి ఆ శంకర్ సింగ్ గాడు చెప్పినట్టు చేసిన్రు. ఇప్పుడందరం ఇరికినం.”

“నీకింకో ముచ్చట చెప్పాల్నా. ఆ ఇద్దరీట్ల ఒగడు మనోడే. ట్రాలీ కిరాయికొచ్చిండట. సచ్చిపోయిన ముస్లీమే ఆ ఆవును పెంచుకుంటున్నడట. రోగమస్తే ఏదో మెడిసిన్ కోసం ఊరికి తీస్కపోతాల్లట”

మహేష్ కు ఏం అర్థం కాలేదు. ఆకాశం ఊడి మీద పడుతున్నట్టు అనిపించింది. కష్టపడి కట్టుకున్న అందమైన స్వర్గం కండ్ల ముందుట్నే కాలిపోతున్నట్టు కనిపించింది. అప్పుడే డోర్ తెర్సుకుని కార్తిక్ చిన్న కొడుకు “డాడీ”అనుకుంట లోపలికొచ్చిండు. మెడ సుట్టూ చేతులేసి గావురం పోయిండు. ఆడి మాటలు కార్తిక్ కు ఇనిపిస్తలేవు. వాన్ని అట్లనే చూస్తున్నడు. కొడుకు రూపం మసకమసకైంది. శ్రీను మాటలు వినిపించడం మెల్లగైంది. కార్తిక్ కండ్లల్లున్న పల్సటి నీళ్ల ధార చిక్కగైంది. బొటబొట రాలి కింద పడ్డది.

కార్తిక్ హైదరాబాద్ పద్మారావునగర్ ల ఉంటడు. తాతముత్తాతలది కూడా హైదరాబాదే. కులవృత్తి చేయకుండ కష్టపడిచదువుకున్నడు. ఐటీ కంపెనీల జాబ్ తెచ్చుకున్నడు. సిటీ లైఫ్ అతన్ని బయటి నుంచి రఫ్ గ తయారుచేసింది. కాని సున్నితమనస్తత్వం.

“ఇక్కడ షరీఫ్ ఇల్లెక్కడుంది?”

“సచ్చిపోయిన షరీఫేనా? సక్కగ వొయ్యి ఎడమదిక్కు మల్గితే కనవడ్తది. ఒక్కటే ఇల్లుందాడ.” దుకాణంల ఛాయ్ చేసుకుంట పెద్దమనిషి జవాబిచ్చిండు. ఆయన చెప్పిన దిక్కు కార్తిక్ అడుగులేసిండు. “పాపం..షరీఫ్ గాడు సందమామ లెక్కుండేటోడు. అన్యాయంగ సంపిన్రు” కాంచ్ గిలాసల ఛాయ్ పోసి జనాలకిస్తున్న పెద్దమనిషి మాటలు కార్తిక్ కు ఇనిపించినయి. కాని వెనక్కి తిరిగి చూడాలనిపించలేదు.

షరీఫ్ సచ్చిపోయిండని తెల్వంగనే ఆరోజు అతన్ని కొట్టినోళ్లంత కల్సుకున్నరు. తప్పు నీదంటే నీదని గల్లలువట్టుకున్నరు. అయితే అండ్ల లీడర్ లెక్కున్న శంకర్ సింగ్ అందరికి ధైర్యం చెప్పిండు. పోలీసులకు ఒక్క క్లూ కూడా దొరకలేదు. ఏం కాదన్నడు. చేసిందిచాలా పెద్ద తప్పు…ఏదో ఒక రోజు దొరకుతమన్నడు కార్తిక్. దొరికినా ఏం కాదన్నడు శంకర్ సింగ్. ఈ మధ్యకాలంలో దేశంల ఆవుల్ని తీస్కపోతున్న ముస్లీంల మీద జరిగిన మూక హత్యలు, గో రక్షక్ దళ్ ల దాడుల గురించి చెప్పిండు. వాళ్ల మీద పెట్టిన కేసులు, పడ్డ శిక్షలు,ఎన్ని రోజులకు బైటికొచ్చిన్రో చెప్పిండు. తమ కమ్యూనిటీ ఎమ్మెల్యే ఇసొంటి కేసుల్నే డీల్ చేస్తున్నడని చెప్పిండు. తను వెళ్లి మాట్లాడి ఏం కాకుండా చూస్తనని భరోసా ఇచ్చిండు. అయితే అప్పటిదాక ఒక్కరు కూడా పోలీసులకు దొరకొద్దని వార్నింగ్ ఇచ్చిండు. హైదరాబాద్ ఇడ్సిపెట్టి కొన్ని రోజులు ఏటైన పోమ్మన్నడు.

ఆ మీటింగ్ తర్వాత కార్తిక్, శ్రీనులు గోవాకొచ్చిన్రు.హోటల్ ల రూం తీసుకున్నరు.శ్రీనుతోని ఉన్నంత సేపే కార్తిక్ కు ధిలాసుండేది. తను లేకపోతే ఆ రోజురాత్రి జరిగినదంత కండ్ల ముందట కనిపించేది.ఒకరోజు హోటల్ రూంల ఉన్నప్పుడు శ్రీను మొబైల్ల ఆ రోజు షూట్ చేసిన వీడియోను అనుకోకుండ కార్తిక్ చూసిండు.కొడుతున్నప్పుడు షరీఫ్ తన కాళ్లు పట్టుకోవడం,కొట్టొద్దని దండం పెట్టడం,చిన్న పిల్లలు ఉన్నారన్నా…వదిలిపెట్టండని బతిమిలాడడం చూసినంక కార్తిక్ కు కడుపుల పేగుల్ని ఎవరో మెలిపెట్టి తిప్పినట్టైంది.ఆ రోజు నుంచి కన్ను మూయలేదు.ప్రతీ క్షణం షరీఫ్ ఆలోచనే.కన్ను తెరిస్తే రక్తం గడ్డకట్టిన షరీఫ్ ముఖమే కనిపించేది.

గల్లీల ఎడమ దిక్కు తిర్గంగనే గూన పెంకల ఇల్లొకటి కార్తిక్ కు కనిపించింది.ఆకిట్లిద్దరు ఆడపిల్లలు ఆడుకుంటున్నరు.ఒకరికి ఎనిమిదేండ్లు,ఇంకొకరికి ఐదేళ్లు.ఇద్దరి గౌన్లు ఆడాడ చిరిగిపొయున్నయి. కార్తిక్ ను సూడంగనే ఇద్దరు పిల్లలు“దాదా..”అనుకుంట లోపలికి ఉరికిన్రు.“ఎవలుల్లా”అనుకుంట ఇస్మాయిల్ ఇంటి ముందుకొచ్చిండు.కార్తిక్ దగ్గరికి పోయి“ఎవలు కావాలి బిడ్డా…”అని అడిగిండు. ఇస్మాయిల్ ను సూడంగనే కార్తిక్ కు షరీఫ్ ముఖం కండ్ల ముందు కనిపించింది. అచ్చం తండ్రి లెక్కనే షరీఫ్ ఉన్నడు కదా అనుకున్నడు.ఏం మాట్లాడకుండ అట్లనే నిలుసున్నడు. కార్తిక్ చేతులున్న పేపర్ ల షరీఫ్ చచ్చిపోయిన వార్త ఉన్నది. అది చూసినంక కార్తిక్ చెయ్యి పట్టుకుని ఇంట్లకు తీసుకపోయిండు. గడెంచ వేసి కూసోబెట్టిండు.తాగనీకి గిలాసల నీళ్లు తెచ్చి ఇచ్చిండు. మన్మరాండ్లొచ్చి చెప్పుడుతోని మధ్యల బంద్జేసిన టమాటలు కోసుడు మళ్లా మొదలుపెట్టిండు.

“పేపర్ల వార్త జూసొచ్చినవ కొడుకా?”

అవునన్నట్టు తలకాయ ఊపిండు కార్తిక్.“ఈ నెల రోజులల్ల మస్తు మంది ఇంటికొచ్చిన్రు కొడకా. దుఖపడ్డరు.కండ్లల్ల నీళ్లు తెచ్చుకున్నరు.అట్ల జరగకపోవాల్సిందన్నరు. నా కొడుకును సంపడం తప్పన్నరు. వాళ్లేదో తప్పు చేసినట్టు చేతిల చెయ్యేసి క్షమాపణలు చెప్పిన్రు” ఇస్మాయిల్ చెప్పుకుంట పోతుంటే కార్తిక్ కండ్లు ఇంటిని స్కాన్ చేసినయి. పెద్దగసామాన్లు గూడ లెవ్వు. ఆడాడ ఖురాన్ సూక్తుల ఫోటోలున్నయి. ఓ దిక్కు గోడకు ధోని బొమ్మ అతికించి ఉంది. అట్లనే చూస్తున్న కార్తిక్ కు ఓ రూంల ఆడమనిషి మంచం మీద పండుకుని కనిపించింది.

“ఆమె నా కోడలు. నా కొడుకు సచ్చిపోయినంక ఖయాల్ తప్పింది. మొగుడు రమ్మంటాండని బజాట్లకు ఉరుకుతది. ఆడి నెంబర్ కు ఫోన్ చేస్తది. భాయ్ జాన్ ఫోన్ లేపుతలేడని ఇల్లంత గాయి గాయి జేస్తది. పిచ్చిదైంది. ఆడు రాడని ఎంత సంజాయించినా నమ్ముతలేదు. ఇద్దరు ఆడిపోరగాల్లను యాద్ మర్సింది. నా ముసలిపానానికి ఇప్పుడీ ముగ్గురు నా మెడకు పడ్డరు.”

టమాటలు కోసుకుంటనే కార్తిక్ ను ఇస్మాయిల్ చూసిండు. బెదరుగొడ్డు లెక్క కూసున్నడు. “మీదేవూరు కొడుకా?”

“హైదరాబాద్”

ఇస్మాయిల్ కు తాజ్జుబనిపించింది. అంత దూరంకెల్లి అచ్చిండా!ఇప్పటిదాకొచ్చినోళ్లంత కరీంనగర్, గోదావరిఖని సైడ్ ఉన్నోళ్లే. హైదరాబాద్ నుంచి ఎందుకస్తరు?ఎవలొస్తరు?

“పిల్లలెంత మంది కొడుకా? ఏం జేస్తవాడ?”

కార్తిక్ ఏదో చెప్పాలనుకున్నడు. కాని మాట బయటకు రాలేదు. గొంతు పూడుకుపోయింది. నాలుకమర్లవడ్డది.గడెంచలకెల్లి లేచి బైటికి నడిసిండు. ఈలపీటను పక్కకువెట్టి ఇస్మాయిల్ లేశిండు. గల్మకాడికి పొయినట్టే వోయిన కార్తిక్ మళ్లా ఎనుకకు మర్రిండు. సక్కగొచ్చి ఇస్మాయిల్ కాళ్ల మీద పడ్డడు. ముసలాయనకు ఏం అర్థం కాలేదు.పైకి లేపిండు. కార్తిక్ కండ్లల్ల నీళ్ల సంద్రం. ముఖంల అంతులేని దుఖం.

“ఎందుకేడుస్తున్నవ్ కొడుకా? ఏడ్వకు. షరీఫ్ గాడు సత్తే నాకంటే ఎక్కువ ఈ లోకం దుఖపడ్డది. తెల్సినోడు, తెల్వనోడు,చిన్నా పెద్దా అంతా ఆడి పీనుగను సూడనీకొచ్చిన్రు. సంపినోళ్ల మీద మన్నువోసిన్రు. ఆళ్లందర్నీ సూసినంక మనిషులింకా బతికే ఉన్నరనిపించింది. మనిషితనం ఇంకా సావలేదనిపించింది.”

కార్తిక్ కండ్లు తుడ్సినంక ఇస్మాయిల్ మాట్లాడిండు.

“అయినా దేవుడు ఆని రాతను ఆడికే రాసిండు.టైమచ్చింది. తీస్కపోయిండు. ఎవలేం జేత్తం చెప్పు”

“నీ కొడుకును సంపినోళ్లల్ల నేను గూడున్న కాక.” పెయ్యిలున్న పానం అంతా కార్తిక్ నోట్లకొచ్చింది.

కార్తిక్ చేతుల్ని ఇస్మాయిల్ ఇడ్సిపెట్టిండు. అతని కండ్లల్ల చూసిండు. ఎర్రటి బొగ్గు పెల్లలెక్కున్నయ్ అవి. ముఖంల దుఖం కాదు అంతకంటే ఎక్కువే…ఇంకోదే ఉంది.

“చచ్చిపోతడని అనుకోలేదు. అందరం తాగున్నం. ఎన్ని చెప్పినా ప్రాణం ప్రాణమే. మళ్లా నీ కొడుకును తీస్కరాలేను. నన్నేం జేస్తవో చెయ్యి. నీ ఇష్టం. పోలీసులకు అప్పచెప్తవా. లేదంటే నీ చేతుల్తోనే చంపుతవా. నీ ఇష్టం.”

ఈలపీట తీసుకొచ్చి ఇస్మాయిల్ కిచ్చిండు.

నిలుసున్న భూమి బద్దలైతున్నట్టనిపించింది ఇస్మాయిల్ కు. కొడుకును సంపినోడు కండ్ల ముందటికొచ్చేసరికి ఆయన మెదడు, శరీరం కొట్లాడుకున్నయి. వాటి గెలుపు ఓటముల లెక్క తేలిందో ఏమో ఈలపీటను పట్టుకున్న చెయ్యి పైకి లేశింది. యా అల్లాహ్ అనుకుంట ఇస్మాయిల్ కండ్లు మూసుకున్నడు.

రంజాన్ పండగనాడు టోపి పెట్టుకుని కొత్త బట్టలు తొడుక్కున్న ఐదేళ్ల షరీఫ్…

టెన్త్ క్లాస్ ల ఫస్టొచ్చిన్నాడు అందరికి దూద్ పేడలు పంచుతున్న షరీఫ్…

పొలంల నాట్లేసిన్నాడు పెయ్యింత బురద బురదయ్యి పంపు కాడ తానం జేస్తున్న షరీఫ్…

మొహర్రం దినాలల్ల ఊదు పొగేసి గౌండ్లోల్ల రాజీరుకు ఉగ్రం తెప్పిస్తున్న షరీఫ్…

వినాయచవితి తెల్లారి మండపం కాడ వంటలండుతున్న షరీఫ్…

ఇద్దరు బిడ్డల్నివట్టుకుని సన్నిగాడితో ఆడుకుంటున్న షరీఫ్…

ట్రాలీల లక్ష్మీ,సన్నిలను ఎక్కించి ఏం కాదని ధైర్యం చెప్పి నవ్వుతున్న షరీఫ్…

ఇస్మాయిల్ గుండె భారం దిగింది. సచ్చిపోయిన కాడిసంది ఒక్కసారి కూడా కొడుకు రూపం కండ్లల్ల కానరాలేదని బాధపడ్డ ఇస్మాయిల్ కు షరీఫ్ జీవితం మొత్తం కనబడ్డది. ఈల పీట దూరంగ ఎగిరిపడ్డది. కార్తిక్ నెత్తి మీద ఇస్మాయిల్ చెయ్యి పెట్టిండు. కండ్లు తెర్సినంక కార్తిక్ ను దూరంగ దొబ్బేసిండు. వెళ్లిపొమ్మన్నట్టు చేతితో సైగ చేసిండు.

బైటికొచ్చిన కార్తిక్, గుమ్మం కాడ ఆడుకుంటున్న ఇద్దరు పిల్లల్ని దగ్గరకు తీసుకున్నడు. ముద్దుగున్నరు.బ్యాగ్ తెర్సి ఇద్దరికి డేయిరీ మిల్క్ చాక్లెట్లిచ్చిండు. అప్పుడే లక్ష్మీని చూసిండు.

“నా కొడుకు సచ్చిపోయిన రోజే…దీని కొల్యాగ కూడా సచ్చింది.ఆ దేవుడు మా ఇద్దరి కడుపుల్ని కాలవెట్టిండు. రేపో మాపో అది కూడా సస్తది. నేనే ఇట్ల పానమున్న పీనుగులెక్క బతకాలె” అనుకుంట ఇస్మాయిల్ గడెంచల కూలవడ్డడు.

దగ్గరికెళ్లి లక్ష్మీని కార్తిక్ చూసిండు. ఈడ్సకపోయుంది. బొక్కలు లెక్కవెట్టచ్చు. కండ్లు తెర్సి చూసే ఓపిక కూడా లేదు దానికి. కాని అలికిడికి రెప్పలు తెర్సుకున్నయి. ఏం అనిపిచ్చిందో గట్టిగ మూలిగింది. ఎక్కడ్నుంచో బలం తెచ్చుకుంది. మెల్లగ లేవనీకి కోశిశ్ జేసింది. దాన్నట్ల సూడంగనే కార్తిక్ నాలుగడుగులు ఎనకకేసిండు. లేశినట్టే లేశి లక్ష్మీ కూలవడ్డది.

తను చేరాల్సిన గమ్యం దిక్కు కార్తిక్ అడుగులు వేసిండు. ఫోన్ ఓపెన్ చేసి కొడుకు వాల్ పేపర్ చూసుకున్నడు. గట్టిగ ఊపిరి తీసుకున్నడు. ఎదురుంగున్న ఆటో దగ్గరికి పోయిండు.

“పెద్దపల్లి పోలీస్ స్టేషన్ వస్తవా?”

*

యాకుబ్ అలీ

నా పేరు సయ్యద్ యాకుబ్ అలీ. మాది మంచిర్యాల జిల్లా మందమర్రి ( కోల్ బెల్ట్ ఏరియా ). హెచ్.ఎం.టీవీ లో సబ్ ఎడిటర్ గా జర్నలిజంలోకి వచ్చాను. ఆ తరువాత టీ న్యూస్, వీసీక్స్ లో పనిచేశాను. 2014 నుంచి మిషన్ భగీరథలో పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ గా పనిచేస్తున్నాను. మీడియాలో పనిచేస్తున్నప్పటి నుంచి కథలు రాయడం అలవాటు. చిన్న చిన్న కథలు రాసి ఫ్రెండ్స్ గ్రూప్ లలో షేర్ చేసేవాడిని. 2009 సెప్టెంబర్ లో నేను రాసిన “చిచ్చా” నమస్తే తెలంగాణ సండే బుక్ లో పబ్లిష్ అయింది. ఇటీవలే విడుదలైన జార్జ్ రెడ్డి సినిమాకు కథా సహకారం కూడా అందించాను.

6 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • చాలా బాగుంది యాకూబ్ . ప్రతి మనిషిలో అంతర్గతంగా మానవత్వం నిండి ఉంటది . కానీ బాహ్య పరిస్థితులు ,అప్పుడప్పుడు దాన్ని kappestuntayi. పిల్లల మీద ప్రేమ మనుషులకే కాదు ప్రతి ప్రాణికీ ఉంటుంది గుర్తించే మనసుంటే . మనుషులు మాత్రమే కాకుండా జంతువులకి కూడా మతం రంగు పులిమె రోజులు రావడం దురదృష్టం .

  • ఈ రోజుల్లో జరుగుతున్న ముస్లిం హత్యల గురించి ఫిక్షనల్ గా చెప్పడం చాలా బాగుంది. ఇప్పుడున్న గో రక్షకులంతా చెడ్డవాళ్లు కాదు, వాళ్లను ఫాసిస్ట్ రాజకీయాలు అలా వాడుకుంటున్నాయి. మతం పేరుతో మనిషిని చంపినవాడి లోపల మనిషే ఉన్నాడు. ఆ మనసున్న మనిషితనం మన భారతీయుల సొంతం. మతం ఏదైనా మనం మనుషులం అనే థీమ్ తో నడిపారు. వాళ్లకు ఇచ్చే ట్రైనింగ్ ఎలాంటిదో గానీ, వాళ్లను కన్నూ మిన్ను కానని వాంపైర్స్ లా తయారుచేసి నరమేథం చేస్తూ ఈ దేశంలో మానవత్వాన్ని మంటగలపాలని చూస్తున్నారు. మంచి కథ యాకూబ్ భాయ్. రాయండి ఇంకా.. అభినందనలు.

  • చాలా బాగుందన్నా కథ చదువుతుంటే కండ్లళ్ళ నీళ్ళు తిరిగినయ్

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు