మనసున ఉన్నది…

Episode: 10

త పక్షం మనం ఉత్తమ పురుష కథనం (నేను కథలు) గురించి చెప్పుకున్నాం, అందులో ఏక ఉత్తమ పురుష కథనం (Single First-Person Narrative), బహుళ ఉత్తమ పురుష కథనం (Multiple First-Person Narrative) అనే రెండు రకాలు ఉన్నాయని తెలుసుకున్నాం. కానీ ఈ ఉత్తమ పురుష కథనంలో ఈ రెండే రకాలు అని చెప్పడానికి లేదు. రచయిత సృజనాత్మకతని బట్టి ఇందులో కొంత వైవిధ్యాన్ని జోడిస్తూ కథలు అల్లచ్చు. ముఖ్యంగా నవల లాంటి ప్రక్రియలో అలాంటి ప్రయోగాలకి అవకాశం ఉంటుంది. ఉదాహరణకి “చైతన్య స్రవంతి” కథనం. ఒక రకంగా ఇది “ఏక ఉత్తమ పురుష” కథనమే. కానీ కొంత వైవిధ్యం ఉంది.

చైతన్య స్రవంతి (Stream of consciousness) అనే ప్రక్రియలో కథలు రాసే రచయితలు ఒక పాత్ర (సామాన్యంగా కథకుడు)ని ఎన్నుకుని, ఆ పాత్ర మనసులో నిరంతరం నడిచే ఆలోచనలను, భావాలను, జ్ఞాపకాలను రాసుకుంటూ వెళ్తారు. అందువల్ల ఇవి మనస్సులో ఏది ఉంటే అది చెప్పేసే రీతిలో నడుస్తుంటాయి. సాంప్రదాయ వ్యాకరణ విధానాలను ధిక్కరించడం, ఒకోసారి తర్కాన్ని కూడా కాదనటం కనిపిస్తుంటుంది. ఉత్తమ పురుష కథనాలలో ఉన్న స్థిరమైన, సమగ్రమైన కథన నిర్మాణం ఇందులో ఉండకపోవచ్చు. ఈ కథలు తరచుగా నాన్-లీనియర్ విధానంలో, మన ఆలోచనలు ఎలా నడుస్తాయో సరిగ్గా అలాగే ఒక ఆలోచన నుండి మరొక ఆలోచనకు దూకుతూ ఉంటాయి. ఉదాహరణ చూద్దామా?

శరీరం మంచం దిగడానికి ఒప్పుకోవట్లేదు. లేవాలి. ఆఫీస్‌కి లేట్ అయితే ఆ చైతన్యగాడితో అనవసరంగా గొడవ. కాలేజీలో ఉన్నప్పుడు బాగానే ఉండేవాడు కదా? ఇప్పుడెందుకిలా తయారయ్యాడు?

లేవాలి.

మత్తు వదలరా నిద్దుర మత్తు వదులరా. నాన్న ఎప్పుడూ నిద్ర లేనిపినా పాడి వినిపించేవాడు. పాండవ వనవాసమా? పాండవీయమా? ఏదో మొత్తనికి… మత్తులోన పడితే చిత్తౌదువురా.

ఇంకేదో ఆలోచిస్తున్నాను.

యస్. చైతన్యగాడు. ఏమైనా క్లాస్‌మెట్ కింద ఉద్యోగం చెయ్యడం చాలా కష్టమబ్బా. అది కూడా నా షాలిని ఎగరేసుకుపోయిన ఆ చైతన్యగాడి కింద నౌఖరీ. డబ్బు కోసం బానిస. ధనమేరా అన్నిటికీ మూలం. పండంటి కాపురం. ఛ ఛ కాదే. శాంతినివాసమా? లక్ష్మీవిలాసమా? కాదు కాదు. లక్ష్మీనివాసం. అమ్మో ఎనిమిదీ పది. ఈ రోజు టిఫిన్ మానేసినా లేటే… 

అర్థమైందిగా. చాలాసార్లు కథ రచయిత చేతిలో ఉందా లేక దారితప్పి ఎటో వెళ్లిపోయిందా అన్న అనుమానం వస్తుంది. కానీ చదవటానికి బాగుంటుంది. ముఖ్యంగా పాత్ర అర్థమౌతుంది. ఆ పాత్రతో కలిసి ప్రయాణం చెయ్యడం సులభమౌతుంది. అందుకే ఈ శైలి కథాంశం మీద ఆధారపడిన కథల కంటే పాత్రల అంతరంగిక స్థితిని అన్వేషించే రచనలకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. భావోద్వేగ లోతులను, విడిపోయిన జ్ఞాపకాలను, అంతర్గత సంఘర్షణలను, చూపించే నవలలకి, చిన్న కథలకు బాగుంటుంది. వర్జీనియా వూల్ఫ్, జేమ్స్ జాయిస్, అంపశయ్య నవీన్, కాశీభట్ల వేణుగోపాల్ వంటి రచయితలు ఈ పద్ధతిని ఉపయోగించి తమ పాత్రల మానసిక స్థితిని పాఠకులకు పరిచయం చేశారు.

మనం కూడా చైతన్య స్రవంతిలో మాట్లాడుకుంటూ ఎటో వెళ్లిపోయే ప్రమాదంలో ఉన్నాం. అసలు ఈ రోజు మనం చెప్పుకోవాల్సిన విషయం “అతను కథల” గురించి. థియరీ ప్రకారం తెలుగులో తృతీయ పురుష కథనం, ఇంగ్లీష్‌లో Third-person narration అని అంటారని మనం మునుపు కలిసినప్పుడే చెప్పుకున్నాం. గుర్తుందా? అయితే తృతీయ పురుష కథనంలో వాడే సర్వనామమేమిటో చెప్పండి?

అతను, ఆమె, వారు, వాళ్లు, అది

ఇంతకు ముందు “నేను కథల” గురించి మాట్లాడుకున్నప్పుడు, చాలా మంది రచయితలు ఈ ఉత్తమ పురుష కథనంతోనే రచనలు మొదలుపెడతారని చెప్పుకున్నాం. రాయడానికి కొంత సులువుగా ఉండటం కూడా ఒక కారణం అనుకున్నాం కదా? మరి అన్నీ కథలు నేను కథలుగా ఉండకుండా ‘అతను’ లేదా ఆమె కథలుగా ఎందుకు మారుతున్నాయి? అది అర్థం చేసుకోడానికి ఈ మూడు ఉదాహరణలు చూడండి –

ప్రియ కోర్టు గదిలో ఒక మూలగా నిల్చుని ఉంది. ఇదంతా ఒక కలలా అనిపిస్తోందామెకి.  వారం రోజుల క్రితం లోకం దృష్టిలో లక్షలు సంపాదించే వ్యాపారవేత్త నుంచి, ఈ రోజు భర్తని నిర్దాక్షిణ్యంగా చంపేసిన రాక్షసిగా మారిపోయింది. ఇదంతా కుటుంబసభ్యులు అల్లిన ఉచ్చు అని ఆమె ఎంత చెప్పినా వినేవాళ్లు లేరు.

జడ్జ్ లోపలి రాగానే అందరూ లేచి నిలబడ్డారు. ఆమెతో పాటే కూర్చుంటూ పబ్లిక్ ప్రాసిక్యూటర్, ప్రియ లాయర్ వైపు చూసి తలాడించాడు. వాళ్లిద్దరిలో ఒక అవగాహన ఉన్నా వాళ్ల ముఖాలపై అలాంటిదేమీ కనపడటం లేదు. ప్రియకు తెలియని మరో విషయం ఎమిటంటే జడ్జ్ ఇప్పటికే ఆమెకు వ్యతిరేకంగా నిర్ణయం తీసేసుకుంది. వాదన కేవలం లాంఛనమే.

ఇదే కథ ఉత్తమ పురుషలో చెప్తే ఎలా ఉండేది? కేవలం ప్రియ ద్వారా కథ జరిగుండేది. అప్పుడు వాదన నడిచి తీర్పు చెప్పేదాకా ఆమె వెనుక ఒక కుట్ర జరుగుతోందని పాఠకులకి తెలిసేది కాదు. ఎందుకంటే ఆ విషయం ప్రియ కి కూడా తెలియదు కాబట్టి. తృతీయ పురుష కథనంలో ఆ అడ్డంకిని అధిగమించవచ్చు. ఇంకో ఉదాహరణ –

అరుణ్ బైక్ దిగి పార్సిల్ చేతిలోకి తీసుకోని నెమ్మదిగా మెట్లు ఎక్కాడు. ఆ అపార్ట్‌మెంట్ అతనికి చాలా బాగా తెలుసు. ర్యాపిడో డెలివరీ బాయ్‌గా అక్కడికి చాలాసార్లు వచ్చాడతను. కానీ అపార్ట్‌మెంట్ బాగా తెలియడానికి కారణం అది కాదు. అతను అక్కడే పుట్టి పెరిగాడు. అతను డెలివరీ ఇవ్వడానికి వెళ్తోంది తన ఇంటికే.

ఒక స్ట్రిక్ట్ పోలీస్ ఆఫీసర్ పెంపకం అతనికి ఆ ఇల్లు ఇరుకు అనిపించేలా చేసింది. తండ్రితో గొడవపడి ఇంట్లో నుంచి వెళ్లిపోయిన తరువాత సుఖంగా లేడు కానీ సంతోషంగా ఉన్నాడు. ఆ తరువాత ఇదే మొదటిసారి ఇంటికి రావటం. ఇంట్లో వాళ్లు ఎవరూ చూడకుండా ప్యాకేజ్ గుమ్మం దగ్గరే పెట్టేసి వెనక్కి తిరిగాడు. అయినా చెల్లెలు మీనా చూసింది.

“అమ్మా అన్నయ్య.. అన్నయ్యా…” అని ఆమె అరుస్తున్నా వినపడనట్లు కన్నీళ్లు తుడుచుకుంటూ మెట్లు దిగేశాడతను.

అతనికి తెలియని విషయం ఏమిటంటే ఆ ప్యాకేజీలో ఉన్న టైమర్ ఇప్పటికే టిక్ టిక్ మని కొట్టుకుంటోంది. అతని తండ్రిని చంపడానికి ఆయన శత్రువులు చేసిన కుట్రలో అతనే ఒక పావుగా మారటం విధి.

చివరి రెండు వాక్యాలు తీసేస్తే ఈ కథని ఉత్తమ పురుష కథనంలో రాసినా పెద్ద తేడా ఉండేది కాదు. కానీ ఆ చివరి వాక్యాలు కథలోకి ఏం తీసుకొచ్చాయో గమనించారా?

డ్రామా, ఐరనీ, ఉత్కంఠ.

కథలో ఉన్న పాత్రలకి తెలియని ఒక విషయం పాఠకుడికి తెలియటం వల్ల తరువాత ఏం జరుగుతుందో అన్న ఉత్కంఠత కేవలం తృతీయ పురుషలో రాయబడింది కాబట్టే సాధ్యమైంది. మరో ఉదాహరణ చూడండి –

రేఖ మౌనం బరువు అతనికి తెలుస్తోంది. అతని చూపులో కోపం ఆమెకు అర్థమౌతోంది. ఒకే గదిలో ఆ చివర ఒకరు ఈ చివర ఒకరు అపరిచితుల్లా ఉన్నారు. పెళ్లైన ఐదేళ్ల తరువాత మొదటిసారి జరిగిన గొడవ.

ఒక్కసారి క్షమాపణ చెప్తే ఆమె కరిగిపోతుందని అతనికి తెలుసు. కానీ తప్పు చెయ్యనప్పుడు నేనెందుకు క్షమాపణ చెప్పాలి అని అతను ఆలోచిస్తున్నాడు. ఆమెని అలాగే వదిలేసి ఆఫీస్‌కి వెళ్లిపోతే సాయంత్రానికి మామూలు మనిషి అవుతుందా కాదా అన్న ఆలోచనే మళ్లీ మళ్లీ వస్తోంది. ఆఫీస్‌లో చాలా ముఖ్యమైన క్లైంట్ మీటింగ్ ఉంది.

ఆమె మరో రకంగా ఆలోచిస్తోంది. నా సంపాదన అతని సంపాదన కన్నా తక్కువ కాబట్టి నాకు విలువ లేదు. ఫ్యామిలీ కోసం ఆన్‌సైట్ వదులుకున్నాను, మెటర్నిటీ లీవ్‌తో సంవత్సరం పని చెయ్యలేదు. అందుకే ఇంకా లీడ్‌గానే ఉండిపోయాను. ఒక్క రెండు సంవత్సరాలు వాడు ఫ్యామిలీని చూసుకుంటే నేనేంటో చేసి చూపిస్తాను.

ఇది రెండు పాత్రల మనసుల్లో జరుగుతున్న కథ. ఆ ఇద్దరిలో భావోద్వేగం వేరు వేరుగా ఉంది. అలా వేరు వేరుగా ఉన్న పాత్రల ఆలోచనని, వాళ్ల వాళ్ల perspectiveని చెప్పడానికి ఈ కథనం చాలా బాగా ఉపకరిస్తుంది. పరిమితులతో నడిచే ఉత్తమ పురుష కథనంలో ఇది అసాధ్యం.

మొదటిసారి కథలు రాస్తున్నవాళ్లు, ముఖ్యంగా తొలి కథ రాసేటప్పుడు ఎక్కువగా వాడేది ఉత్తమ పురుష కథనం అయితే, కాస్త చెయ్యి తిరిగిన రచయితలు ఎక్కువగా వాడేది తృతీయ పురుష కథనం. ఎందుకని? అలాంటి కథనం వాడటానికి కొన్ని కారణాలు చెప్పుకుందాం రండి –

  1. విస్తృతమయ్యే దృక్పథం

తృతీయ పురుష కథనంలో రచయితకు ప్రపంచాన్ని, సంఘటనలను, పాత్రలను స్వేచ్ఛగా వివరించడానికి అవకాశం దొరుకుతుంది. ఉత్తమ పురుష కథనంలో కథకుడి (narrator) ప్రత్యక్ష అనుభవాలు, అతని లేదా ఆమె జ్ఞానం వరకే కథ పరిమితమై ఉంటుంది.

  1. నిష్పక్షపాతం, సమతుల్యత

రచయిత ఏ పాత్రవైపు నిలబడకుండా తటస్థంగా ఉన్నాడు అని పాఠకులకు అనుకునేందుకు third person narrative బాగా ఉపయోగపడుతుంది. రచయిత అన్ని ముఖ్య పాత్రల మనసులో ఉన్నది చెప్పే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ రచన నమ్మదగినదిగా అనిపిస్తుంది. ముఖ్యంగా భావోద్వేగాలు ఉండే కథలలో, వాదనలను వినిపించాల్సి వచ్చినప్పుడు, నైతికమా అనైతికమా లాంటి సంక్లిష్టమైన విరుద్ధ సిద్ధాంతాలను చెప్పేటప్పుడు ఈ కథనం బాగా పని చేస్తుంది. ఉత్తమ పురుషలో కథకుడి స్వరం ఒక వైపే ఉంటుంది కాబట్టి పైన చెప్పిన లాంటి కథలకు అది పక్షపాతంలా అనిపించే అవకాశం ఉంది..

  1. అనేక పాత్రల మనసులలోకి వెళ్లే అవకాశం

తృతీయ పురుష కథనంలో ముఖ్యంగా సర్వసాక్షి కథనంలో (దీని గురించి తరువాత చెప్తాను) రచయిత అనేక పాత్రల మనసులలోకి వెళ్ళి వాళ్ల ఆలోచనలను, వాళ్ల అనుభవాలను పాఠకుడితో పంచుకోవచ్చు. ఉత్తమ పురుష కథనంలో చూపు ఒక దృష్టికోణంలోనే ఉంటుంది. ఆలోచన కూడా ఒక పాత్రకే పరిమితం అవుతుంది. అయితే, మనకి అడ్డు లేదు కదా అని రచయిత ప్రతి సంఘటనలో ఉన్న అన్ని పాత్రల మనసులో ఏం జరుగుతోందో చెప్పడం మొదలుపెడితే ఆ కథ కంగాలీగా మారుతుంది. (ఉదాహరణతో తరువాత చర్చిద్దాం).

  1. కథనం నడిపే టోన్‌ని నియంత్రించే అవకాశం

ఉదాహరణకి ఒక కథని వ్యంగ్యంగా చెప్పాలని మీరు అనుకున్నారు. దాన్ని ఉత్తమ పురుషలో రాయచ్చా? రాయచ్చు. కానీ ఏ పాత్ర తరఫు నుంచి ఈ కథని (ఉత్తమ పురుష) చెప్పాలనుకుంటున్నారో, ఆ పాత్ర సహజంగా వ్యంగ్య ధోరణి కలిగి ఉండాలి. అప్పుడు ఆ రచన వ్యంగ్యమౌతుంది. ప్రధాన పాత్ర కామెడీగా మాట్లాడే వ్యక్తి అయితే, అందులో మీరు వ్యంగ్యం ఎలా తీసుకురాగలుగుతారు? తృతీయ పురుషలో రచయిత కావాల్సిన టోన్ ఎంచుకునే స్వతంత్రం ఉంటుంది. దాన్ని నియంత్రించే అవకాశం ఉంటుంది.

  1. ఉత్కంఠత, నాటకీయత, ఐరనీ వంటివి కల్పించడానికి

తృతీయ పురుష కథనం పాఠకుడికి పాత్రలకి, ముఖ్యంగా కథానాయకుడు/నాయకికి తెలియని విషయాలను తెలుసుకోవడానికి అవకాశం ఇస్తుంది. ఇది ఎలా డ్రామాని (నాటకీయత), ఐరనీని సృష్టిస్తుందో పైన ఇచ్చిన రెండో కథలో చూశారు కదా? ఉత్తమ పురుష కథనంలో ఇది సాధ్యం కాదు ఎందుకంటే ఆ కథనంలో పాఠకుడికి కథకుడికి తెలిసినది మాత్రమే తెలుసుకునే అవకాశం ఉంటుంది.

  1. పెద్ద రచనలకు అనువైనది

300 పేజీల నవల రాయాలంటే మొత్తం ఉత్తమ పురుషలో రాసి మెప్పించడం కష్టం (అలా అద్భుతమైన రచనలు చేసినవాళ్లు చాలామంది ఉన్నారు). నవల ఇలాంటి ప్రక్రియలో అనేక ఉపకథలుంటయి. ఒక్కో పాత్రకి ఒక నేపథ్యం ఉంటుంది. అసలు పాత్రలే అనేకం ఉంటయి. ఇవన్నీ చెప్పాలంటే అందుకు తృతీయ పురుష కథనం అనువైనది. కల్పనికచరిత్ర, థ్రిల్లర్లు, పురాణాలు, ఫాంటసీ లాంటి కథలకి ఈ కథనం సరిగ్గా సరిపోతుంది.

తృతీయ పురుష కథనంలో నాలుగు రకాలుగా కథ చెప్పచ్చు. వాటి గురించిన కొంత వివరణ ఇస్తున్నాను.

  1. నిష్పాక్షిక తృతీయ పురుష కథనం (Objective Third-Person Narrative)

ఇందులో రచయితకి ఎక్కడ ఏం జరిగినా తెలుస్తుంది. తలుపేసి ఉన్న గదిలో భార్యా భర్తా సరసమాడుకుంటున్నారా? గొడవపడుతున్నారా? అన్న విషయం రచయితకి తెలిసిపోతుంది. కానీ ఆ భార్యా భర్త మనసులో ఏముందో తెలియదు.

ఈ విధానంలో కథకుడు కేవలం బాహ్య ప్రపంచంలో కళ్లకి కనిపిస్తున్నదే చెప్పగలడు. పాత్రల అంతర్గతమైన ఆలోచనలు, భావోద్వేగాలు గురించి తెలియదు. అందువల్ల కళ్లకు కనిపించే చర్యలు, సంభాషణ, శరీర భాష వంటివి మాత్రమే కథలో చెప్పబడుతుంది. ఒక కెమెరా ఒక సన్నివేశంలో పాత్రలను అనుసరించినట్లుగా కథ నడుస్తుంది. ఈ విధానంలో పాఠకుడికి పాత్రల ప్రవర్తనను విశ్లేషించి, ఎవరు ఎందుకు ఎలా ప్రవర్తిస్తున్నారో, వాళ్ల మనసులో ఏముందో ఊహించుకునే అవకాశం ఇస్తుంది. నాటకీయమైన కథలకు, అస్పష్టత ఉండే కథలకి బాగా నప్పే కథనమిది. చెప్పినంత సులభంగా ఇది రాయలేము. చాలా క్రమశిక్షణతో రాయాల్సిన రచనా శైలి. మినిమలిస్ట్ ఫిక్షన్, డిటెక్టివ్ కథలు, నోయిర్ కథలకు, రచయిత స్పష్టమైన తీర్పులు చెప్పాల్సిన అవసరం లేకుండా ఉండే కథలకు ఇది బాగా సరిపోతుంది.

  1. ఏక తృతీయ పురుష కథనం (Single Third-Person Narrative)

ఇందాక చెప్పిన నిష్పాక్షిక తృతీయ పురుషలో రచయితకి పాత్రల మనసులో ఏముందో తెలియదు. ఏక తృతీయ పురుష కథనంలో రచయితకి ఒక వరం ఉంటుంది. ఇందులో ఉన్న ఏదైనా ఒక పాత్ర (సామాన్యంగా ప్రధాన పాత్ర, లేదా నరేటర్) మనసులో ఉన్నదంతా రచయితకి తెలిసిపోతుంది. కాబట్టి కథ అంతా ఒకే పాత్రను చుట్టూ తిరుగుతుంది. కథకుడు ఆ పాత్ర దృష్టితో ప్రపంచాన్ని చూస్తాడు, దాంతో పాటు ఆ పాత్ర అంతర్గతమైన ఆలోచనలను, భావోద్వేగాలను తెలుసుకోగలుగుతాడు. ఈ పద్ధతి ఉత్తమపురుషలో ఉండే సౌలభ్యాన్ని ఇస్తూనే అందులో ఉండే కొన్ని సమస్యలని అధిగమిస్తుంది. నేను కథలలో – “నేను అసలే చాలా దయాగుణం ఉన్నవాడిని” అని చెప్పడం కష్టం. అదే ఏక తృతీయ పురుష కథనంలో “అతని మనసు వెన్నపూస” అని ధైర్యంగా చెప్పేయచ్చు. మిస్టరీ నవలలు, లిటరరీ ఫిక్షన్, ఒకే ప్రధానపాత్ర మీడ దృష్టి సారించే సాహస కథనాలకు ఇది బాగా సరిపోతుంది.

  1. బహుళ తృతీయ పురుష కథనం (Multiple Third-Person Narrative)

ఈ రకం కథనం దగ్గర రచయితకి మరో వరం వచ్చింది. రచయిత ఏ పాత్ర కావాలంటే ఆ పాత్ర మనసులో ఏం జరుగుతోందో తెలుసుకోవచ్చు. కానీ ఒక సమయంలో ఒకరి మనసులో ఉన్నది మాత్రమే తెలుస్తుంది. అంటే ఒక అమ్మాయి (హీరోయిన్), ఒక అబ్బాయి (హీరో) ఉన్నారనుకోండి. ఒక ఛాప్టర్‌లో హీరో ఉన్న సన్నివేశాలు రాస్తూ హీరో మనసులో ఉన్నదేమిటో రచయిత చెప్పేస్తాడు. ఆ తరువాత ఆధ్యాయంలో హీరోయిన్ మనసులో ఉన్నది చెప్పేస్తాడు. వీళ్లిద్దరు కాకుండా వాళ్ల కుటుంబ సభ్యులు, ఫ్రెండ్స్ మొదలైన ఇతర పాత్రల మనసులో ఏముందో రచయితకి తెలియదు. కాకపోతే ఈ శైలి ఎంచుకున్న రచయితకి సమస్య ఎప్పుడొస్తుందంటే – హీరో, హీరోయిన్ కలిసినప్పుడు. ఆ సమస్య గురించి వివరంగా మళ్లీ చెప్తాను. నేను చెప్పిన హీరో హీరోయిన్ ప్రేమ కథలకు, డ్రామా కథనాలకు, హిస్టారికల్ ఫిక్షన్‌కు, కుటుంబంలో నడిచే డ్రామా కథలకు, కొన్ని రకాల థ్రిల్లర్లకు ఈ కథనం బాగా సరిపోతుంది.

  1. సర్వసాక్షి తృతీయ పురుష కథనం (Third-Person Omniscient Narrative)

ఈ రకం కథనంలో రచయితకి ఎప్పుడు ఏం కావాలంటే అది తెల్సుకునే వరం ఉంటుంది. ఎక్కడ జరిగినా, ఎప్పుడు జరిగినా, ఏం జరిగినా, ఎవరు ఎలా ఆలోచించినా రచయితకి తెలుసు.

“పన్నెండేళ్ల క్రితం రాబర్ట్ చేసిన అన్యాయానికి పగ తీర్చుకోవాలని ఫణిభూషణరావు ఈ పల్లెటూర్లో రగిలిపోతుంటే అక్కడ అమెరికాలో స్కాచ్ తాగుతూ, ఫణిభూషణరావు కూతురిని ఎలా తన కొడుక్కి ఇచ్చి పెళ్లి చెయ్యాలి అని ఆలోచిస్తున్నాడు రాబర్ట్. ఆ ఇద్దరూ ఊహించని మరో సంఘటన వాళ్లు కోరుకున్నదేదీ జరగనివ్వదని అప్పటికింకా వాళ్లకి తెలియదు.”

పై వాక్యాలు చూశారా? భూత, భవిష్యత్, వర్తమాన కాలాలు ఉన్నాయి. రెండు పాత్రల మనసులో ఏముందో తెలుసు. పల్లెటూర్లో జరుగుతున్నది, అమెరికో జరుగుతున్నది ఒకేసారి రచయితకి కనిపెట్టేశాడు. పైగా క్షణంలో ఇక్కడ్నుంచి అక్కడికి దూకేస్తాడు కూడా. రవి కాంచని చోట కవి కాంచును అన్నారే – అది ఈయన గురించే – సర్వసాక్షి కథనంలో కథ చెప్పే రచయిత. సాహిత్యంలో చాలా వరకు ఈ కథనాన్ని వాడతారు. మీకు ఇంతకు ముందే చెప్పినట్లు కొత్త రచయిత మొదటి కథలలో ఉత్తమ పురుష కథనం, రాయడం పట్టుబడిన తరువాత రచయిత రాసే కథలలో సర్వసాక్షి కథనం ఎక్కువగా కనిపిస్తయి. బహుశా రచయిత స్వతంత్రంగా రాయగలడం, అవసరమైతే తన స్వంత వ్యాఖ్యానం జోడించడం (కన్నతల్లి అని కూడా మర్చిపోయి కర్కశంగా ప్రవర్తించింది ఆమె), భవిష్యత్‌ని సూచిస్తూ నాటకీయత పెంచే అవకాశం (అతను ఎంత పెద్ద తప్పు చేస్తున్నాడో ఆ క్షణం అతనికి తెలియదు) వంటివి ఈ శైలి విరివిగా వాడటానికి కారణాలు అనుకుంటాను. ఎక్కువ పాత్రలు ఉండే నవలలు, క్లిష్టమైన విషయాల గురించి చర్చలు ఉండే కథలు, సమాంతరంగా నడిచే కథనాలకు, ఫాంటసీలు, ఇతిహాసాలు మొదలైన ఈ పద్ధతి బాగా సరిపోతుంది.

కానీ స్వతంత్రం ఎక్కువైతే ఉండే ప్రమాదాలు కూడా కొన్ని ఉన్నాయి. ఈ థియరీ అయిపోయింది కాబట్టి తరువాత అంశంగా స్వతంత్రం వల్ల రచయిత చేసే తప్పుల గురించి మాట్లాదుకుందాం.

(మళ్లీ కలిసినప్పుడు – తలతిరుగుడు కథలు)

అరిపిరాల సత్యప్రసాద్

Add comment

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు