మధురానగర్ మెట్రోస్టేషన్

ఇద్దరూ ఒకర్నొకరు చూసుకుంటున్నారే గానీ మాట్లాడుకోవడం లేదు. మాటల అవసరం కూడా లేదేమో. ఇలాంటి క్షణాలు ఎన్ని ఎక్కువుంటే అంత ఆనందంగా ఉంటాం.

శుక్రవారం కావడంతో త్వరత్వరగా వర్క్ ఫినిష్ చేసుకుని కార్డ్ స్వైప్ ఔట్ చేసేసి ఆఫీసు నుండి బయటపడ్డాడు సూర్య. ఆఫీస్ బిల్డింగ్ ఉన్న కాంపౌండ్ నుండి గేటు దాటి బయటికి రాగానే సూర్య లానే బయటికొచ్చిన ఎంతోమంది కనిపించారు. అందులో సగం మంది స్కూటర్ల మీద వెళ్తుంటే మిగతా సగం మెట్రోస్టేషన్ వైపు వెళ్తున్నారు.

సూర్య కూడా మెట్రో వైపు బయల్దేరాడు. ఒక్కొక్క మెట్టు ఎక్కి పైకెళ్ళి బ్యాగ్ స్కాన్ అయిపోయాక కార్డ్ ట్యాప్ చేసి ప్లాట్‌ఫార్మ్ మీద నిలబడ్డాడు. అమీర్‌పేట్ వైపు వెళ్ళే ట్రైన్ రాగానే ఎక్కాడు.

అదృష్టం. ఈ రోజు నిలబడ్డానికి కొంచెం చోటు దొరికింది. చుట్టూ చూసాడు. ఒకమ్మాయి మొబైల్ స్క్రీన్ లోకి చూస్తూ ముసి ముసి నవ్వులు నవ్వుతోంది. మీమ్స్ చూస్తోందేమో. ఒకబ్బాయి సపోర్టింగ్ పోల్ పట్టుకుని నిలబడి కళ్ళు మూసుకున్నాడు. తలకి హెడ్‌సెట్ ఉంది. ఇళయరాజా పాట పెట్టుకుని వింటూ జోన్ అవుట్ అయిపోయాడు కావొచ్చు. ఒక అంకుల్ మాస్క్ పెట్టుకోని వాళ్ళ వైపు గుర్రుగా చూస్తున్నాడు. ఒక చిన్న పాప వాళ్ళమ్మ ఒడిలో కూర్చొని పక్కసీట్లో కూర్చున్న అమ్మాయి బ్యాగుకున్న బార్బీ బొమ్మ కీచైన్‌తో ఆడుకుంటోంది.

బ్యాగుల్లో ఉన్న విలువైన వస్తువులు కొట్టేస్తారని అందరూ బ్యాగులు ముందరివైపు తగిలించుకుని నిలబడ్డారు. అందర్లో అలసట కనిపిస్తోంది. తనక్కావలసిందేదో దొరకలేదు అన్నట్టు కింద వెళ్తున్న వాహనాలను కిటికీలోంచి చూస్తూ నిలబడ్డాడు సూర్య.

ట్రైన్ యూసుఫ్‌గూడ దాకా రాగానే దిగాలని అనుకొని ఆగిపోయి అమీర్‌పేట్‌లో ఆగగానే దిగిపోయాడు. అక్కడ దిగి మధురానగర్ వైపు నడవటం మొదలుపెట్టాడు.

*****

మూడు సంవత్సరాల ముందు,

సూర్య, వెన్నెల ఒకరి చేయి ఒకరు పట్టుకుని అమీర్‌పేట్ రోడ్డు మీద నడుస్తూ మైత్రివనం దగ్గర రోడ్డు దాటి మధురానగర్ వైపు నడవటం మొదలుపెట్టారు.

“ఇంకెన్ని రోజులు కష్టపడాలిలా?” వెన్నెల అడిగింది సూర్యని.

“జాబ్ వచ్చేదాకా”

“జాబెప్పుడొస్తుంది?”

“ఇంటర్‌వ్యూలో సెలెక్ట్ అయినప్పుడు”

“ఎందుకింత లేటవుతోంది?”

“ఎక్స్‌పీరియెన్స్”

“మ్మ్..?”

“నాకొచ్చిన టెక్నాలజీలో ఓపెనింగ్స్ దొరకట్లేదు. ఉన్నవన్నీ ఎక్స్‌పీరియెన్స్ ఉన్న వాళ్ళకే అంట”

“కానీ బాగా వచ్చు అన్నావ్ కదా?”

“అయినా సరే ఫ్రెషర్ అనగానే పట్టించుకోట్లేదు”

“ఎలా మరి?”

“అదే చూస్తున్నా”

“మ్మ్…”

“నీ సంగతేంటి మరి?” ఈ సారి సూర్య అడిగాడు వెన్నెలని.

“గత వారం రోజుల్లో రెండు ఇంటర్‌వ్యూలిచ్చాను. వాటి రిజల్ట్స్ కోసం వెయిటింగ్”

“ఈసారి వస్తుందంటావా?”

“ఒకటయితే కచ్చితంగా రాదు. ఇంకోటి చాన్సుంది అనిపిస్తోంది”

“అనిపిస్తోందా? ఓకే. ఇంట్లో వాళ్ళతో ప్రాబ్లమ్ లేదా?”

“ఉందిగా. అసలదేగా మెయిన్ ప్రాబ్లమ్”

“ఏమంటున్నారు?”

“బెంగళూరులో తెలిసిన వాళ్ళ కంపెనీ ఉంది. అక్కడికి వెళ్తే చాలు. ఉద్యోగం ఇస్తాం అంటున్నారంట”

“బావుంది”

“మ్మ్… మరి మీ ఇంట్లో?”

“మా ఊర్లో ఒకడు ఫేక్ ఎక్స్‌పీరియెన్స్ పెట్టి జాబ్ తెచ్చుకున్నాడు. కానీ జాబ్ తెచ్చుకోవడం వరకే తెలుసు మా వాళ్ళకి. కొన్ని రోజులుగా అతను రోల్‌మోడల్ మా ఇంట్లో. రోజూ అతని ఫోటోకి పూజ చేయమంటున్నారు”

“సరిపోయింది”

మాటల్లోనే మెట్రోస్టేషనొచ్చింది. దాని పక్క వీధిలో నుండి ఇద్దరూ నడుస్తూ వెళ్ళారు. గర్ల్స్ హాస్టల్ దాకా వెళ్ళి నిలబడ్డారు. కాసేపు మాట్లాడి వెన్నెల లోపలికెళ్ళింది. అమీర్‌పేట్‌లో ఉన్న తన హాస్టల్ వైపు బయల్దేరాడు సూర్య.

*****

మధురానగర్ నుండి నడుస్తూ యూసఫ్‌గూడ దాకా వచ్చి రూమ్ కొచ్చాడు సూర్య. రూమ్మేట్ ఊరి నుండి ఇంకా రాకపోవడంతో ఒక్కడే ఉన్నాడు.

ఫ్రెషప్ అయి కాఫీ చేసుకుని, ఆ కప్ తీసుకుని బాల్కనీకెళ్ళి కూర్చున్నాడు. చుట్టుపక్కల ఉన్న బిల్డింగ్‌ల లోని బాల్కనీలన్నీ చూస్తూ ఒక చోట ఆగాడు. ఒకమ్మాయి, అబ్బాయి కలిసి సెల్ఫీలు దిగుతున్నారు. వెంటనే ఏదో గుర్తొచ్చినట్టు లోపలికెళ్ళాడు. బీరువా ఓపెన్ చేసి వెతకడం మొదలు పెట్టాడు. ఎంతకీ దొరకట్లేదు.

బీరువాలోని బట్టలన్నీ తీసి కిందేసాడు. కనపడలేదు. విడిచేసిన బట్టలు తీసి వాటి జేబుల్లో వెతికాడు. లాభం లేదు. “పొరపాటున ఈ విషయం వెన్నెలకి తెలిస్తే అంతే. అంత స్పెషల్ రింగ్ పోగొట్టుకుంటావా?” అని తిడుతుంది. మాట్లాడటం మానేస్తుంది. ఇప్పుడెలా?” అనుకుంటూ రూమంతా వెతుకుతున్నాడు.

ఫ్రిడ్జ్‌లో ఉన్న ముందురోజు రాత్రి తెచ్చుకున్న పేస్ట్రీల పక్కనుంది ఆ ఉంగరం. అదక్కడికెలా వచ్చిందో ఆలోచించకుండా ముందు ఉంగరం తీసుకుని వేలికి పెట్టుకున్నాడు. ఫ్రిడ్జ్‌లో ఉన్న రెండు పేస్ట్రీలు తీసి సోఫాలో కూర్చొని ఒకదాని తరాత ఒకటి రెండూ తినేసాడు. నీళ్ళు తాగుదామని చూస్తే బాటిల్లన్నీ ఖాళీగా ఉన్నాయి. క్యాన్ మూలన పడి ఉంది. ఖాళీ క్యాన్ తీసుకొని కిందికి బయల్దేరాడు. నీళ్ళు తెచ్చుకుని తాగి ఆ సోఫాలోనే నిద్రపోయాడు.

పొద్దున్నే ఆరు గంటలకి లేచి , తల స్నానం చేసి, బ్లూ జీన్స్ వైట్ షర్ట్ వేసుకుని, కళ్ళకి నల్లటి షేడ్స్ పెట్టుకుని బయటికొచ్చాడు.

నడుచుకుంటూ వచ్చి మధురానగర్ మెట్రోస్టేషన్ కిందున్న ఖాళీ స్థలంలో నిలబడ్డాడు. మాటిమాటికీ వాచీ వైపు, రోడ్డు వైపు చూస్తూ “ఇంకా రాట్లేదేంటీ?” అనుకుంటూ నిలబడ్డాడు.

*****

“ఈ మెట్రో అమీర్‌పేట్ దాకానే కదా? హైటెక్ సిటీ దాకా ఈ లైనెందుకు మరి?” వెన్నెల అడిగింది సూర్యని.

“ఏమో, ఇది కూడా స్టార్టవుతుందనుకుంటా త్వరలో”

“ఓహో. మనకుద్యోగాలొచ్చేసాయిగా, ఇది కూడా స్టార్టయితే బావుండు. ఎంచక్కా ఇందులోనే ఆఫీస్ కెళ్ళి రావచ్చు”

“అన్నీ మనమనుకున్నట్టే జరుగుతాయి మరి!”

“జరుగుతున్నాయిగా..!”

“అద్సరే గానీ, సినిమా కెళ్దాం పదా”

 

సరిగా నెల రోజులకి మెట్రో ‘హైటెక్ సిటీ ‘ దాకా ఎక్స్టెండ్ అయింది.

 

“చెప్పాగా నేను. ఇంక మనం ఇందులోనే వెళ్ళొచ్చు” అంటోంది వెన్నెల.

ట్రైన్ అమీర్‌పేట్‌లో ఆగింది. దాదాపు ఖాళీ అయిపోయి, మళ్ళీ సగం నిండింది. అమీర్‌పేట్ దాటగానే ట్రైన్ ఒక పెద్ద అర్ధవృత్తం గీస్తూ మధురానగర్ వైపు బయల్దేరింది. ట్రైన్లో నుండి చూస్తే ఎడమ వైపు సారథి స్టూడియోలో ఉన్న సినిమా సెట్లన్నీ కనిపిస్తున్నాయి.

పెద్ద పెద్ద భవనాలు, అందమైన, ఇల్లు, పోలీస్ స్టేషన్, మార్కెట్ సెట్ అన్నీ భలే ఉన్నాయి. తలుపులకున్న అద్దాల్లో నుండి వాటిని చూస్తూ నిలబడ్డారిద్దరూ. కొంచెం దూరం పోగానే ఆ పెద్ద పెద్ద భవనాలు, అందమైన ఇల్ల వెనుక భాగాలు కట్టెల తోనూ, చెక్కల తోనూ కట్టబడి ఉండటం చూసి ఒకరి మొహమింకొకరు చూసుకున్నారిద్దరూ.

వెంటనే వెన్నెల “ముందు కనపడినదంతా మనుషులు పరిచయమైన మొదటి రోజులు. మనకి వాళ్ళలో అన్నీ నచ్చినవే కనిపిస్తాయి. కొన్నిరోజులాగాక వాళ్ళ గురించి మొత్తం తెలుసుకున్నాక నచ్చనివి కనిపిస్తాయి. అచ్చం ఇందాక కనిపించినట్టు” అనేసి ఆపేసింది.

“ఏం మాట్లాడుతున్నావో నీకైనా అర్థమవుతోందా?”

“ఏదో చెప్దామని ట్రై చేసా. సెట్ కాలేదు. వదిలేయి.”

“కొంచెం అర్థమయ్యేట్లు చెప్పుండొచ్చు కదా?”

“నేను లోపల అనుకున్నప్పుడు బావుందది”

“మరి?”

“నీకు చెప్పేటప్పుడు సరిగ్గా రాలేదు”

“సరే వదిలేయి”

అంతలో “దర్వాజే బాయీ తరఫ్ ఖులేంగే” అని వినపడి తలుపులు తెరుచుకున్నాయి. ఇద్దరూ ట్రైన్ నుండి బయటికొచ్చి మెట్లు దిగి కిందికొచ్చారు. కింద చాలామంది మనుషులు, హడావిడిగా ఉంది. ఏంటిది చూద్దామని అని వెళ్ళారు. ఎగ్జిబిషన్ అని తెలుసుకుని మొత్తం ఒకసారి తిరిగి మళ్ళీ రోడ్డుమీదికొచ్చారు.

ఒకరి చేయొకరు పట్టుకుని నడుచుకుంటూ వెన్నెల రూమ్ దాకా వెళ్ళారు. అక్కడ వీళ్ళ లాగానే ఎంతో మంది హాస్టల్ బయట రోడ్డు మీద, స్కూటర్ల పక్కన, పక్కనున్న షాపుల మెట్ల మీద, దగ్గర్లో ఉన్న ఫుడ్ కోర్టులో చాలామంది ఉన్నారు. కాసేపు వాళ్ళలానే నిలబడి మాట్లాడుకున్నారు. వెన్నెల లోపలికెళ్ళిపోయింది. కరెంటు పోయింది. ఆ చీకట్లో నడుస్తూ సూర్య రూమ్ కెళ్ళిపోయాడు.

*****

“ఇంకా రాట్లేదేంటీ?” అనుకుంటూ నిలబడ్డ సూర్య ఇంకా అక్కడే ఉన్నాడు. మధ్యాహ్నం దాకా అక్కడే నిలబడి తిరిగి నడుచుకుంటూ రూమ్ కెళ్ళిపోయాడు.

ఆకలేసి కప్‌బోర్డులో వెతికితే రెండు మ్యాగీ ప్యాకెట్లు కనపడ్డాయి. ఎక్స్పైరీ డేట్ చూడకుండా వండుకుని తిని నిద్రపోయాడు. రాత్రెప్పుడో లేచి బయటికెళ్ళి రోడ్డు మీద నడుస్తూ వెన్నెల వాళ్ళ హాస్టల్ దగ్గరికెళ్ళి బయట నిలబడ్డాడు.

ఏదో గుర్తొచ్చి మళ్ళీ వెనక్కెళ్ళిపోయాడు. బాల్కనీలో ఉన్న కుర్చీ, టేబుల్ తీసి రూమ్‌లో పెట్టి, రూమ్‌లో మంచం మీదున్న బెడ్ తెచ్చి బాల్కనీలో వేసాడు.

ల్యాప్ టాప్, బ్లూ టూత్ స్పీకర్ తెచ్చిపెట్టి, మళ్ళీ కిందికెళ్ళి చిప్స్ ప్యాకెట్లు, సాఫ్ట్ డ్రింకులూ, ప్రాసెస్డ్ ఫుడ్ అన్నీ ఒక పెద్ద కవరు నిండా తెచ్చుకోని బెడ్ మీద వేసి సినిమా ప్లే చేసాడు.

తెచ్చుకున్నవన్నీ తింటూ, తాగుతూ సినిమాలు చూస్తూ గడిపితే తెల్లవారుజామున అయిదైపోయింది. అప్పుడు లోపలికెళ్ళి బ్రష్ చేసి, స్నానం చేసి బయటికెళ్ళేవాడిలాగా తయారయ్యి, బాల్కనీలో ఉన్న బెడ్ తెచ్చి హాల్లో వేసి, అన్ని కిటికీలూ, తలుపులూ మూసేసి లైట్లన్నీ ఆర్పేసి, పీస్‌ఫుల్ మ్యూజిక్ అని యూట్యూబ్‌లో సెర్చ్ చేసి ఒక అయిదు గంటలపాటున్న వీడియోని ప్లే చేసి నిద్రపోయాడు.

మధ్యాహ్నమెప్పుడో లేచి తర్వాతి రోజు ఆఫీసు పని గురించి కొలీగ్‌కి కాల్ చేసాడు.

*****

సూర్య, వెన్నెల ఒకరి ముఖాలొకరు చూస్తూ సిగ్గు పడుతున్నారు. వాళ్ళిద్దరి చేతులకీ ఉంగరాలున్నాయి. కాసేపటి క్రితమే ప్రపోజ్ చేసాడు సూర్య. అంతా అనుకున్నట్టే జరిగింది.

భూమ్మీద సూర్య కంటే ఆనందంగా ఉన్నవాడు లేడు. ఇద్దరూ ఒకర్నొకరు చూసుకుంటున్నారే గానీ మాట్లాడుకోవడం లేదు. మాటల అవసరం కూడా లేదేమో. ఇలాంటి క్షణాలు ఎన్ని ఎక్కువుంటే అంత ఆనందంగా ఉంటాం. ఆరోజు సాయంత్రం దాకా బయటే తిరిగారు. ఇష్టమైన చోటులకీ, నచ్చిన రెస్టారెంట్‌లకీ వెళ్ళారు.

సాయంత్రం నుండి రాత్రి దాకా మెట్రోస్టేషన్ దగ్గర కూర్చుని మాట్లాడుకున్నారు. చీకటి పడ్డాక నడుస్తూ హస్టల్ దాకా వెళ్ళారు. లోపలికెళ్ళి లగేజీతో బయటికొచ్చింది వెన్నెల. ఆరోజు రాత్రికి ఇంటికెళ్తోంది తను. ఆటో ఎక్కి అమీర్‌పేట్‌లో దిగారు. కే.యల్.యమ్ ఫ్యాషన్ మాల్ ముందు నిలబడ్డారు.

“ఎందుకింత సడెన్‌గా..?” అడిగాడు సూర్య.

“సడెన్‌గా ఏమీ లేదు. అనుకున్నదే”

“కానీ ఇలాంటి మూమెంట్‌లో నువ్విక్కడుంటే బావుండేది”

“ఇదే సడెన్‌గా జరిగింది. అయినా నేను ఊహించలేదు కదా నువ్వీరోజే ప్రపోజ్ చేస్తావని”

“అదీ నిజమేలే”

“కదా..!”

“కానీ ఉండొచ్చు కదా!”

“వచ్చేస్తా కదా”

“తర్వాతెళ్ళొచ్చు కదా?”

“ఇలా మొండిగా ఉండకూడదు”

“…………”

ఉంగరం తీసి బ్యాగులో వేసుకుంది వెన్నెల.

“అదేంటి ఉంగరం తీసేసావ్?”

“అమ్మో, ఇంట్లో వాళ్ళు చూస్తే ఇంకేమైనా ఉందా..!”

“ఏం చేస్తారు?”

“ఏం చేస్తారా, నా పెళ్ళి చేస్తారు”

“నాతోనే కదా?”

“హా, నీతోనే” అనేసి నవ్వింది.

“సరే ఎప్పుడు మళ్ళీ?”

“వచ్చే వారం వస్తా. శనివారం పొద్దున్నే నువ్వు మెట్రోస్టేషన్ దగ్గరికొచ్చేయి. అక్కడ కలుద్దాం”

వాళ్ళ ఊరికెళ్ళే బస్సు రాగానే వెళ్ళి సీట్లో కూర్చుంది వెన్నెల. లగేజీ తీసుకెళ్ళి పెట్టాడు సూర్య. కిటికీలోంచి బై చెప్తూ చెప్తూ వెన్నెల, అలా దూరం వెళ్ళేదాకా చేయి ఊపుతూ ఉన్నాడు సూర్య.

రూమ్ కెళ్ళి వంట చేసుకుని, తిని, పన్నెండు దాకా ఏదో సినిమా చూసి గంటకొట్టినట్టు పన్నెండు కాగానే నిద్రపోయాడు సూర్య.

*****

మధ్యాహ్నమెప్పుడో లేచి తర్వాతి రోజు ఆఫీసు పని గురించి కొలీగ్‌కి కాల్ చేసాడు. కాసేపు మాట్లాడి వెంటనే ల్యాప్‌టాప్ తీసి పనికి సంబంధించిన ప్రెజెంటేషన్ తయారు చేస్తూ కూర్చున్నాడు. అదయ్యేలోపు సాయంత్రమయింది.

ఇంటికి ఫోన్ చేసి మాట్లాడి, ఆ తర్వాత కాలేజీ ఫ్రెండ్సుని కలవడానికి బయటికెళ్ళొచ్చి పన్నెండుకి పడుకున్నాడు.

సోమవారం పొద్దున్నే లేచి, వంట చేసుకుని, లంచ్ బాక్స్ రెడీ చేసుకుని, స్నానం చేసి, తయారయ్యి ఆఫీసుకి బయల్దేరాడు.

*****

వెన్నెల చెప్పిన ‘తర్వాతి వారంలో వచ్చే శనివారం’ వెళ్ళిపోయి ఒక తొమ్మిది శనివారాలు కూడా అయిపోయాయి. వెన్నెల రాలేదు. ఇంక రాదేమో!

పదో శనివారానికి ముందు రోజు.

శుక్రవారం కావడంతో త్వరత్వరగా వర్క్ ఫినిష్ చేసుకుని కార్డ్ స్వైప్ ఔట్ చేసేసి ఆఫీసు నుండి బయటపడ్డాడు సూర్య. ఆఫీస్ బిల్డింగ్ ఉన్న కాంపౌండ్ నుండి గేటు దాటి బయటికి రాగానే సూర్య లానే బయటికొచ్చిన ఎంతోమంది కనిపించారు. అందులో సగం మంది స్కూటర్ల మీద వెళ్తుంటే మిగతా సగం మెట్రోస్టేషన్ వైపు వెళ్తున్నారు.

సూర్య కూడా మెట్రో వైపు బయల్దేరాడు. ఒక్కొక్క మెట్టు ఎక్కి పైకెళ్ళి బ్యాగ్ స్కాన్ అయిపోయాక కార్డ్ ట్యాప్ చేసి ప్లాట్‌ఫార్మ్ మీద నిలబడ్డాడు. అమీర్‌పేట్ వైపు వెళ్ళే ట్రైన్ రాగానే ఎక్కాడు.

ట్రైన్ యూసుఫ్‌గూడ దాకా రాగానే దిగాలని అనుకొని ఆగిపోయి అమీర్‌పేట్‌లో ఆగగానే దిగిపోయాడు. అక్కడ దిగి మధురానగర్ వైపు నడవటం మొదలుపెట్టాడు. రాత్రి దాకా ఆ చుట్టు పక్కలే తిరుగుతూ రాత్రికి రూమ్ కొచ్చి నిద్రపోయాడు.

తర్వాతి రోజు పొద్దున్నే ఆరు గంటలకి లేచి , తల స్నానం చేసి, బ్లూ జీన్స్ వైట్ షర్ట్ వేసుకుని, కళ్ళకి నల్లటి షేడ్స్ పెట్టుకుని బయటికొచ్చాడు.

నడుచుకుంటూ వచ్చి మధురానగర్ మెట్రోస్టేషన్ కిందున్న ఖాళీ స్థలంలో నిలబడ్డాడు. మాటిమాటికీ వాచీ వైపు, రోడ్డు వైపు చూస్తూ “ఇంకా రాట్లేదేంటీ?” అనుకుంటూ నిలబడ్డాడు.

*

 

షేక్ మొహమ్మద్ గౌస్

తక్కువ సమయంలో ఎక్కువ రాస్తూ గుర్తింపు పొందిన రచయిత. స్వస్థలం అనంతపురం జిల్లా తాడిపత్రి. జననం: 1997. బీ.టెక్ కంప్యూటర్ సైన్స్ చదివారు. తొలికథ 'చిల్డ్రెన్స్ డే' 2020లో వెలువడింది. ఇప్పటివరకూ 30 కథలు రాసి వాటిలో రాయలసీమ యాసలో రాసిన కథలన్నీ కలిపి 'గాజులసంచి' గా వెలువరించారు. శిల్ప ప్రాధాన్యంగా రాయడం సాధన చేస్తున్నారు. ఐటీ రంగంలో ఉద్యోగం. ప్రస్తుత నివాసం: హైదరాబాద్.

1 comment

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • బాగుంది గౌస్, jumbled narrative structure నచ్చింది నాకు.

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు