మచ్చపడ్డవాడు!

లా జరగకూడదు. కానీ జరిగింది. పొద్దున్నే ఆఫీస్ కి వెళ్ళడానికి తల దువ్వుకొని, కళ్ళజోడు పెట్టుకొని, స్ప్రే కొట్టుకొని, బూట్లు తొడుక్కుని దర్జాగా బయలుదేరి లోకం మీద పడ్డాడు శ్రీకాంత్. “నాన్నా మర్చిపోయావా ఈరోజు డ్రెస్ కొనిస్తా అన్నావు” మొబైల్లో గేమ్ ఆడటం ఆపి అన్నాడు ఆరో తరగతి చింటూ.

“ఏం బట్టలు రా. మొన్నే కదా కొనుక్కున్నావ్, బర్త్ డేకి” అమ్మ చేతిలో చీపురు ఉండడం వాడి దృష్టిని దాటిపోలేదు.

“నేనడగలేదు. నాన్నే కొనిస్తా అన్నాడు”

భర్త వైపు సిబిఐ ఆఫీసర్ లా చూసింది.

“ఏం లేదే…” భర్త.

“లేకపోతే ఎందుకూ! ”

“మ్మ్.. చెప్పేది పూర్తిగా వినవే. వర్షాకాలం స్టార్టయిందని ఎదురుగా మూడో ఇంటి చందుగాడు కొత్తబట్టలు కొనుక్కున్నాడు. మన ఇంటి ముందు వాడికి ఏం పని! ఆరుసార్లు తిరిగాడు. డ్రస్సు బానే ఉందనుకో. అయినా వాడికి బాగుండద్దూ! అలాంటిది మనోడికి కూడా ఒకటి తీద్దాం”

“అయితే ఇది వీడి మీద ప్రేమ కాదన్నమాట, వాడి మీద ఇదా?” మెటికలు విరిచింది.

“నీకర్థం కాదులే, రేయ్, సాయంత్రం వచ్చేటప్పుడు తెస్తాలే” అని మెట్లు దిగాడు.

కొడుకు ఖుషి అయి పల్టీలు కొట్టాడు. భార్య క్యారేజీ చేతికిచ్చి జేబులో వున్న సిగరెట్ ప్యాకెట్ లటుక్కున లాగేసుకుని వెనక్కి తిరిగింది.

“ఓయ్ ఓయ్.. దాంట్లో ఎక్కువేమీ లేవులే, ఇచ్చేయ్.  ఈ రోజుకి రెండు కన్నా ఎక్కువ కాల్చను”

భార్య వెనక్కి తిరిగి చూడకుండా “నీ సిగరెట్ వల్ల నువ్వు బాగానే ఉంటావు. నీ చుట్టూ ఉన్నవాళ్ళు పోతున్నారు. నాకు క్యాన్సర్ వస్తే ఏంటి పరిస్థితి?” లోనికి వెళ్తూ అంది.

“పిచ్చి పిచ్చి గా మాట్లాడకు”

“దీని పొగ ఊపిరితిత్తులలో తారులాగా పేరుకుంటుంది. ఆ యాడ్లలో చూడట్లేదా.. నల్లగా తారులాగా ”

తను పెద్ద క్రియేటివ్ కాకపోయినా క్షణాల్లో నల్లటి తారు, చిందిపడే తారు విజువల్ ఊహల్లో ఫ్లాష్ అయింది. జలక్ మన్నాడు. సైలెంట్ గా గాడ్స్ గిఫ్ట్ అని  పల్సర్ ఎక్కి బయలుదేరాడు.

***

ఎవరూ ఎదురు రాకూడదు అని లోలోపల అనుకుంటూ వీధి దాటాడు. ఈమధ్య హెచ్ఆర్ మేనేజర్ అయ్యాడు శ్రీకాంత్. కింద అనేకమంది ఉద్యోగులూ, ఆర్డర్ వేస్తే క్షణాల్లో అయ్యే పనులు.

అతనికి ఎదురైన మొట్టమొదటి మనిషిని చూసాడో లేదో అదిరిపడ్డాడు. వాడి తల స్థానంలో నల్లటి మచ్చ. ఇందాక భార్య చెప్పినట్టు కారుతున్న తారు మాదిరి.

కళ్ళు మూసుకొని ఏదో చాక్లెట్ యాడ్లో మోడల్ తల పేలిపోయి చాక్లెట్ కారుతున్న దృశ్యం ఊహించుకున్నాడు. సరిగ్గా పుచ్చకాయంత నల్లమచ్చ. ఆ వ్యక్తి రూపురేఖలు తెలియట్లేదు. ‘ఎవరైనా నిరసన తెలిపి ఇంకు మొహాన పోశారా? లేదా తల పగిలి రక్తం నల్లగా ఫౌంటెన్ కట్టిందా? ‘ తేల్చుకోలేక పోయాడు.

“ఏరా చూసి చూడనట్టు పోతున్నావ్?” ఆ వ్యక్తి.

పలకరించాక గుర్తుపట్టాడు. అతను రంగయ్య. బాబాయి వరస అవుతాడు. తాపీ మేస్త్రి.

కూలికి పోకుంటే గడవదు. అయినా పాటలు పాడుకుంటూ అంత జాలీగా ఎలా ఉంటాడు! శ్రీకాంత్ కిది వెయ్యి మార్కుల ప్రశ్న.

‘అదే మాకైతే టెన్షన్ తగ్గించుకోవడానికి సంవత్సరానికి ఒకసారి కార్పోరేట్ మెడిటేషన్ అని జ్ఞాన బోధ లాంటిదేదో చేస్తుంటారు ఆఫీస్ లో.

అదేదో ఇతన్నే అడిగితే పోలా.

‘ఇంత ఉద్యోగమూ, అంత జీతమూ, టక్కు, గిక్కు ఉన్న నీకు ఆమాత్రం తెలీదా? అని నవ్వుతాడేమో’

అనుకున్నాడు.

ఈమధ్య పొట్ట లేని మనుషులను గమనించడం ఎక్కువైంది. ఇప్పుడు మొహం చూసే అవకాశం ఎలాగూ లేదు. కాసేపు ఆయన పొట్ట లేని స్లిమ్ దేహాన్ని చూసి ట్యాంకర్ మీద కుదేసిన తన లగేజ్ సర్దుకుని “ఆఫీస్ కి టైం అయింది బాబాయ్” అని ముందుకెళ్లాడు. చాలా కాలంగా అది తనకు అలవాటే. రంగయ్య కు కూడా. అలా జరుకున్నా ఆయన చెరగని నవ్వు తో ఇంకో మనిషి దగ్గరికి వెళ్ళిపోయాడు.

ఆ సెంటర్లో అంబేద్కర్ విగ్రహం దాటి ముందుకి వెళ్ళాక స్వాతి లేడీస్ కార్నర్ లో నుంచి బయటికి వచ్చిన అమ్మాయి ఎదురుగా వస్తోంది. ఆమె మొహమూ అంతే. నేల మీద చిందిన కాఫీ చుక్కలా. గుండ్రంగా చివర్లు దారప్పోగుల్లా బయటకొచ్చి ఏదో వైరస్ లాగా ఉంది ఆ మచ్చ. మొహం తెలియకున్నా వయ్యారపు శరీరం బాగా తెలుసు. కళ్ళు అంత చేసి చూసాడు. బ్యాగ్ పట్టుకొని టిక్కు టిక్కుమని నడుముని ఊపుతూ పోతోంది.

“ఆ పిల్లే! నా చూపుని నడుముకు వడ్డాణంలా  కట్టుకొని తిరిగిన అమ్మాయి.

ఒకరోజు దగ్గరికి పోయి నిన్ను ప్రేమించాను అంటే.

అతని చూపు సగానికే ఉండటం చూసిందేమో

“నడుము వరకే ప్రేమించావా?” అంది.

అప్పుడు ఆమె కళ్ళలోకి చూడలేక పారిపోయాడు. ఇప్పుడు చూడాలని ఉన్నా కనపడదు. ఈమధ్య బ్యాంక్ లో క్యాషియర్ తో పెళ్లి కుదిరిందని తెలిసింది. వాడి బట్టతల చూసి వంకరగా నవ్విన నవ్వు ఎందుకో మళ్ళీ శ్రీకాంత్ పెదవి మీదకు వచ్చింది.

ఇలాంటప్పుడు ఒక స్టోరీ మైండ్లో రీల్ తిరుగుతుంది. తాను కనిపించిన ప్రతిసారి అదే స్టోరీ. ఆమె బట్టతల మొగుడితో సతీసావిత్రి లా నానా కష్టాలూ పడుతూ ఉంటుంది. ఏదీ గట్టెక్కలేని స్థితిలో తాను ప్రత్యక్షమవుతాడు. ఆమె అతన్ని చూసి గిల్ట్ తో తలదించుకుంటుంది. సాయం అడగలేక దిగాలుగా నేల చూపులు చూస్తుంది.

అతను హీరోలా క్షణాల్లో సాయం చేస్తాడు. సినిమాల్లో క్లైమాక్స్ లో ట్విస్ట్ వచ్చినట్టు. ఆమె మొగుడు ఒకరోజు పుటుక్కుమంటాడు. ఊరంతా ఆమెను పెళ్లి చేసుకుని జీవితాన్ని ఇవ్వాలని తనను ప్రాధేయపడతారు. తటపటాయించినట్టు నటించి సరే అని త్యాగరసం పండిస్తాడు. అప్పుడు బుర్రలో సెరటోనిన్ జాస్తిగా ఉబికి తృప్తి పడతాడు. డ్రీమ్ నుంచి బయటకు వచ్చి ఈ “ఊహాత్మకల” అర్థం ఏంటని ఎంత ఆలోచించినా కనిపెట్టలేకపోయాడు.

ఆమె పూర్తిగా దగ్గరకు వచ్చేసింది. అయినా నిరాశే. ఆమె మొహంలో నలుపే.

“నా పక్కనుంచే వెళ్తుంది గా, చూసే ఉంటుందిలే, మన రేంజ్ అలాంటిది” ఆమె తల పక్కకి తిప్పుకొని పోయిందని తెలియదు అతనికి.

***

దారిన వచ్చేవాళ్లు పోయేవాళ్ళు నమస్తేలు పెడుతుంటే గుండె నిండిపోయేది. ఆ పూట ఒకాయన గమనించకుండా పోయాడు.

“ఆ మనిషెవరు?” శ్రీకాంత్.

“చూశావుగా అన్నా” పాన్ డబ్బా శీను. కింగ్ సైజ్ అందించాడు.

“కంట్లో నలక పడింది గాని చెప్పవోయ్”

“ఆయన కోటేశ్వరరావు కాదూ” శీను.

‘మచ్చ ఎంత పని చేసింది. నేను గుర్తు పట్టలేదని తెలిసిపోయిందా ఏంటి?’ గింజుకున్నాడు శ్రీకాంత్.

“ఈ మధ్య ఆ టోల్ గేట్ కాడ మూడెకరాలు ల్యాండ్ తీసాడు” శీను కొనసాగింపు.

“అదే కనిపిస్తుంది. ఆస్తులు ఎంతకాలం ఉంటాయి ?మనుషులు కదా ముఖ్యం” స్టేట్మెంట్ పాస్ చేసి ముందుకు వెళ్ళిపోయాడు శ్రీకాంత్.

ఉన్నట్టుండి బుజంమీద అనకొండ పడ్డట్టుంది.

“అప్పుడే ఆఫీస్ ఏంట్రా! నా కేఫ్ లో కోల్డ్ కాఫీ తాగుదాం రా?” ఫ్రెండ్ సతీష్.

“పొద్దున్నే కోల్డ్ కాఫీ ఏంట్రా!” శ్రీకాంత్.

వీడు తనతోపాటే పరుపుల కంపెనీలో హెచ్ఆర్. ఇద్దరూ ఒకేసారి చేరారు. ఇలా మెత్తగా పరుపేసుకొని పడుకుంటే లాభం లేదని బయటకు వచ్చాడు. నెలరోజుల్లో బ్యాంకులోను తీసుకుని కేఫ్ పెట్టాడు. ఆరు నెలలకే అదిరిపోయే టర్నోవర్. ఇక ఈ కాలనీ మొత్తానికి అతనొక సెలబ్రిటీ. “డబ్బులు వచ్చే కొద్దీ మనుషులు మారిపోతారు అంటారు. అందుకే వీడి మొహం కనిపించట్లేదా నాకు?” లోలోపల మధనపడ్డాడు.

అతని బాడీకి సరిపడా మచ్చ మొహాన్ని దాచేసింది.

సతీష్ ఏదో మాట్లాడుతున్నాడు. అవన్నీ చెవిలోకి వెళ్లట్లేదు.

“ఎటు చూస్తున్నావు రా” అంటున్నాడు.

“అదీ.. ఆ.. నీ సక్సెస్ చూసి ఆశ్చర్యంగా ఉంది. ఇటు నేను పెద్దగా రాలేదు”  ఏమీ తేలినట్టే చెప్పాడు.

“పాతవన్నీ గుర్తు పెట్టుకోకు. నేను గతాన్ని ఎప్పుడో మర్చిపోయా. ఏదైనా మన మంచికే”

‘పైకి అలా అంటాడు కాని లోపల ఏమనుకుంటున్నాడో.. ‘ అని తానే అనేసుకుని-

“హ హ హ నువ్వు నా ఫ్రెండువి మామ. ఈ కేఫ్ ఓపెనింగ్ అప్పుడు బిజీగా ఉండి రాలేకపోయా”.

శ్రీకాంత్.

“అవును. నీకోసం చాలా ఎదురు చూసా. అప్పుడప్పుడూ అయినా వచ్చి కాఫీ తాగుతావేమో, కబుర్లు చెప్తావేమో అనుకుంటే ఆ జాబు జంజాటం లో మునిగిపోయావు. అయినా మన షాప్ గురించి మీ కొలీగ్స్ అందరికీ చెప్పి పబ్లిసిటీ చేశావంటలే, తెలిసింది”

“చెప్పాను గాని… అది పబ్లిసిటీ అంటావా.. అంతేలే!”

“కాదా మరి.. హా.. హహా”

“సరేగాని నీ ఫేసు కనిపించట్లేదురా. ఏదో మచ్చ అడ్డుగా ఉంది” మెల్లిగా అన్నాడు శ్రీకాంత్.

“ఏం మచ్చ!” అని అద్దంలొ చూసుకున్నాడు. ఏం లేదని తెలుస్తున్నా కర్చీఫ్ తీసుకొని తుడుచుకున్నాడు.

“పోయిందా?”

“ఇంచు కూడా పోలేదు”

తలగొక్కునీ “ఇంటికి వెళ్లి డెటాల్ తో కడుక్కొని వస్తా, ఈ లోపు నువ్వు బర్గర్ ఆర్డర్ చెయ్” ఇంటికి పోయాడు. శ్రీకాంత్ కాఫీ అక్కడ పెట్టి ఆఫీసుకు పోయాడు.

***

ఆఫీసులో బాస్ లేడు. కొన్నాళ్ల క్రితం ఒకరోజు ఇలాగే లేడు. అప్పుడు జరిగింది.

ఎందుకో గంట నుంచి తన సీట్లో కూర్చుంటే కంఫర్ట్ గా లేదు శ్రీకాంత్ కి. అటు ఇటు తిరుగుతూ ఉన్నాడు. చుట్టూ చూసి ఎవరూ లేరనుకుని బాస్ క్యాబిన్ లోకి వెళ్ళాడు. బాస్ చైర్ గేమ్ ఆఫ్ థ్రోన్స్ సింహాసనంలా ఉంది. మెల్లగా వెళ్లి అందులో కూర్చున్నాడు. హాయిగా కళ్ళు మూసుకున్నాడు. అలా ఎంత సేపు ఉన్నాడో తెలియదు. టాట్.. మని ఒక పెద్ద డాల్బీ శబ్దానికి లేచాడు. బాస్, ఆయన మూతి బిగగట్టిన పరుపులా బిర్రుగా ఉంది.

“నీకు ఈమధ్య మతిమరుపు పెరుగుతున్నట్లు ఉంది” నవ్వు తెచ్చుకొని అన్నాడు బాస్.

“అదేం లేదు సార్” అని మళ్లీ వచ్చి తన చెయిర్ లో కూర్చున్నాడు శ్రీకాంత్.

నిజానికి ఆరోజు హెచ్ ఆర్ మేనేజర్ ని ఎంచుకునే రోజు. తన సోషల్ స్టేటస్ కి ప్రమోషన్ వచ్చే రోజు.

ఒకేసారి పనిలో చేరిన శ్రీకాంత్, సతీష్ ఇద్దరూ మంచి పని మంతులన్న పేరు తెచ్చుకున్నారు.

మంచి ఉద్యోగులను ఎంపిక చేశారు. ఏ సమస్యా రానివ్వలేదు.

కానీ ఈరోజు జరిగిన దాన్ని బట్టి చూస్తే బాస్ భస్మాసురుడు అయ్యేలా ఉన్నాడు. అంతా తలుచుకుంటుంటే తన టై మెడకు బిర్రుగా బిగుస్తుంది. టెన్షన్..టెన్షన్.. టెన్షన్.

ఆఫీసులో ఏ మూల చూసినా తయారైన పరుపులు, అవుతున్న పరుపులు, ఓవైపు కాటన్, మరోవైపు మిషన్లు, యూనిఫాం లో ఉన్న అనేక మంది వర్కర్లు. బాక్సులలో హెవెన్లీ అన్న ఇంటర్నేషనల్ బ్రాండ్ లేబుల్స్. పెద్దగా మాటలు లేకుండా పనులు సాగుతూ ఉంటాయి.

మధ్యాహ్నాం ఆఫీస్ లో సిగరెట్ తాగకూడదన్న నిబంధన అతిక్రమించారు ఎవరో. అంటే పొద్దున తాగొచ్చు అని కాదు. అతిక్రమణ మధ్యాహ్నం అయిందని.

సరిగా ఆర్పని సిగరెట్ పీక పరుపుల మెటీరియల్ ను ముద్దాడింది.

వెచ్చదనం లేని మంట. నల్లటి పొగ. చుట్టూతా ఏం కనపడనివ్వని పోర. గగ్గోలు మొదలైంది. గుప్పు గుప్పున పొగ. మనుషులను కనపడకుండా దాచేస్తున్న పొగ. ఫైరింజన్ కి ఫోన్ చేశాడు శ్రీకాంత్. అది వచ్చేసరికి కొన్ని పరుపులు బూడిద పరుపులయ్యాయి. టైంకి స్పందించినందుకు బాస్ శ్రీకాంత్ ను అభినందించాడు. దానికి కారణమైన సతీష్ కి వూస్టింగ్ అయింది. శ్రీకాంత్ మేనేజర్ బాధ్యతలు తీసుకున్నాడు.

“సతీష్, నువ్వు కంటిన్యూ చెయ్ నేను బాస్ తో మాట్లాడుతా” అన్నాడు శ్రీకాంత్.

“నేను మరో తప్పు చేస్తే బాస్ రోడ్డున పడతాడుమామ.. హా.హా..హా” జాలితో జోకేసి నవ్వాడు సతీష్.

‘ఇంత విషాదంలో వీడికి నవ్వెలా వస్తుంది’ చిత్రంగా అనిపించింది.

తెల్లారి ఫైర్ ఆక్సిడెంట్ వార్త పేపర్లలో రావడం. అతన్ని అందరూ అభినందించడం చక్కగా జరిగి పోయింది. అప్పటినుంచి  అప్పుడప్పుడు ఎదుటి వాళ్ళ మొహాలు కనపడటం లేదు. మచ్చ… నల్లని మచ్చ ముఖాలను మాయం చేస్తోంది.

కృష్ణారావు అభినందిస్తే థాంక్స్ సుబ్బారావు అన్నాడు. బిత్తరపోయాడు కృష్ణారావు. అలా మొహాలు తెలియక ఒకరి నుంచి మరొకరికి థ్యాంక్స్ బట్వాడా చేసి, ఇక చెయ్యలేక నీరసపడ్డాడు శ్రీకాంత్. నిద్ర పోయినా కళ్ళనిండా మచ్చ ఆనందాన్ని ఆవిరి చేస్తోంది. ఎవరి మొహంలోని నవ్వు కనబడటం లేదు. ఆనందము, ఆప్యాయత, ప్రేమ, జాలి, ఏ ఎమోషన్ని దృశ్యరూపంలో చూడలేకపోతున్నాడు. ఈ రోగానికి మందు లేదా? అసలు ఇది రోగమేనా? ఈ మచ్చ కళ్ళకి మనసుకి పెద్ద శ్రమ పెడుతుంది. దాంతో అతను  అన్నం నీళ్లు సరిగా ముట్టలేదు.

మనిషి వింతగా ప్రవర్తిస్తున్నాడు అన్నారంతా. ఆ మాట పేటలు దాటి ఊరంతా పాకింది. మట్టి మనిషి కాస్తా మచ్చను చూసిన మనిషి అయ్యాడు.

***

ఆరోజు సాయంత్రం చందమామతో పాటు ఒక గడ్డమాయన ఇస్త్రీ చొక్కాతో ఆ కాలనీ కి వచ్చాడు.

దిగులుగా చెట్టు కింద కూర్చున్న  మన కథానాయకుడి దగ్గరకు వచ్చి-

“హలో శ్రీకాంత్, నీ పాపులారిటీ చాలా దూరం పాకిందయ్యా. ఈ వింత వ్యాధికి కారణాలు ఏమిటో తెలుసుకుందామని ప్రపంచ ఎదురుచూస్తోంది” అన్నాడు.

అతని వైపు చూశాడు శ్రీకాంత్. లాభం లేదు. అక్షరాలు మొత్తం అతని మొహం మీద మచ్చలా మారాయేమో. అతని నవ్వు వినబడుతుంది గానీ విచ్చుకున్న పెదవి కనబడడం లేదు.

“నా పేరు రచయిత, మీ మచ్చ కహానీ ఎంతో ఇంట్రెస్టింగ్ గా ఉంది. దాని గురించి రాస్తాను” అన్నాడు రచయిత.

దీని గురించి రాయడమంటే తన అవస్థ గురించి రాయడమే.

“అసలు మచ్చ ఎలా మొదలైంది?” అలవాటుగా అతని పర్మిషన్ లేకుండా స్టార్ట్ చేసాడు రచయిత.

“తెలియదు” శ్రీకాంత్.

“ఎందుకు మొదలైంది?”

“తెలియదు”

“ఎప్పుడు పోతుంది?”

“తెలియదు”

ఒక్క ముక్క రాయకుండానే నగ్నంగా ఉన్న పెన్ను కి క్యాప్ తొడిగాడు రచయిత. ఉఫ్ఫ్.. అని లేచి వెళ్లబోయాడు.

“అయినా నా కథలో ఏమి ఆసక్తి ఉంటుందని వచ్చావు?” శ్రీకాంత్.

అతను వెళ్ళిపోయేవాడు వెనక్కి తిరిగి అరనిమిషం తదేకంగా చూసి “నిజానికి నాకేమీ ఆసక్తి లేదు. తోచీ తోచనమ్మ పుస్తకం రాసిందనీ, నా సహ రచయిత ఒకడు వాడి పైత్యం అంతా ఒక పుస్తకంగా రాసి గొప్ప పేరు తెచ్చుకున్నాడు. నాకు ఇస్తే చదివి బిత్తరపోయాను. అది అస్సలు బాలేదన్నాను. ఫేస్బుక్లో మారు పేరుతో దాన్ని చీల్చి చెండాడాను. ఇంస్టాగ్రామ్ లో విరగ్గొట్టాను. అయినా వాడి పేరు ఆగలేదు, ప్రతిభ దాగలేదు”

కాసేపు మౌనం.

“అతను నీ ఫ్రెండేగా?” శ్రీకాంత్.

“అవును, అతని ప్రతిభని సమాధి చేద్దామనుకున్నా. నీ లాగానే”

“నేనేం చేశాను. ఎవరికీ చెడు చేయలేదే” సర్దుకున్నాడు శ్రీకాంత్.

“అవునా. ఇది చెప్పు.. ఆ దూదిని కాల్చిన సిగరెట్టు నీదే కదా”

తత్తర పడ్డాడు శ్రీకాంత్. తన మేనేజర్ గిరీకి పెట్టుబడి అది.

రచయిత కొనసాగించాడు “నీ ఫ్రెండ్ మీద అలిగేషన్ వస్తే నిజం చెప్పకుండా దాచలేదూ. నువ్వు తప్పు ఒప్పుకుంటే నీ ఉద్యోగం పోయేది”

“తన ఉద్యోగం కూడా పోవాలని నేను కోరుకోలేదూ”

“చెడు చేయడమే మనలోని చెడుకు నిదర్శనం కాదు. మనసులో అనుకోవడం కూడా చెడే. ఇప్పుడు నీకన్నా పైకెదిగిన అతని పట్ల నీ కళ్ళలో సంతోషం ఏది? నీకు దక్కని వ్యక్తి పట్ల నీకున్నది ఏది? నిన్ను గుర్తించని వాళ్ల పట్ల నువ్వు చూపినది ఏంటి? మొత్తంగా నీ స్థాయి పెరిగాక ఎదుటి వాళ్ళ మొహాలు కనబడటంలేదు”

శ్రీకాంత్ మౌనంగా వింటున్నాడు. మనసు భారంగా అయింది. కళ్లు కరిగి కొవ్వొత్తి ధారలా కారాయి.

“నువ్వు నా లాంటి వాడివే. ఏదో నీ మనసును తొలిచేస్తుంది. అది కదా నా కథ కు కావాల్సింది” రచయిత.

శ్రీకాంత్ భుజాలు కదులుతున్నాయి. అతను నవ్వుతున్నాడో ఏడుస్తున్నాడో, తెలియట్లేదు.

మచ్చ, కన్నీటిబొట్టు… రెండిటి మధ్య రసాయన క్రియ ఏంటో మరి.

మచ్చ, ఏడుపు

మచ్చ, ఏడుపు

మచ్చ, ఏడుపు…

తర్కించి తర్కించి ఉరుములేని వర్షంలా ఏడ్చాడు శ్రీకాంత్. పొగిలిపొగిలి ఏడ్చాడు. కన్నీరు చింది కళ్ళజోడు మీదా కళ్ళ కిందా కొడుతోంది. రచయిత మనోహర దృశ్యంలా చూస్తున్నాడు. చాలాసేపు దుఃఖపడి ఆగిపోయాడు శ్రీకాంత్.

నెమ్మదిగా కళ్ళజోడు తీసి తడిని తుడుచుకుని మళ్ళీ పెట్టుకున్నాడు.

“ఆహా” కేక పెట్టాడు.

రచయిత మొహం. విచ్చుకున్న పెదాలు కనిపించాయి. సంస్కారవంతమైన సబ్బు యాడ్ లాగా మచ్చ మటుమాయం. కళ్ళజోడు తుడిచిన కర్చీఫ్ చూసుకుంటే నల్లటి మచ్చ. అదే ఆకారం.

భారమంతా దిగినట్టు ఒళ్లంతా విదిలించాడు.

రచయిత భుజం మీద చెయ్యేసి “అప్పుడప్పుడు నీ లోపల నీకు తెలియకుండానే మచ్చ పేరుకుంటుంది. అందుకే అప్పుడప్పుడు ఏడిచేయ్.. అదే పోతుంది” అని చెప్పి వెళ్ళిపోయాడు. అతని వెనకాలే ‘నన్ను చూసి ఏడవకురా!’ అని వరల్డ్ ఫేమస్ కొటేషన్ ఉన్న లారీ పోతుంది. లోపల గూడుకట్టుకున్న తారు లాంటి మచ్చ కారిపోయింది. ఇప్పుడు సతీష్ కేఫ్ కి వెళ్లి వాడితో కలిసి కాఫీ తాగాలి, కబుర్లు చెప్పాలి అనిపించింది. ఇంకా రంగయ్య, బాస్, ఇష్టపడ్డ అమ్మాయి ఇలా అందరి మొహాలు స్పష్టంగా గుర్తొస్తున్నాయి.

*

చరణ్ పరిమి

Add comment

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు