మగాళ్ల కంటిమీద కునుకు పట్టనివ్వని కత

వీరత్వాన్ని ప్రదర్శిస్తున్నామనుకునే వొట్టి అర్భకులు మగవాళ్లు. తెలివిగా వ్యవహరిస్తున్నామనుకునే పిచ్చి అమాయకులు మగవాళ్లు.

ఎంత ప్రజాస్వామిక విప్లవం వచ్చేసిందనుకున్నా అంత తేలిగ్గా మగవాళ్లలోని మగ చావదు. లోపల్లోపలెక్కడో ఏ మూలనో నక్కి ఉంటుంది. వెలుతురు ప్రపంచంలో జెండరాతీతంగా  కనిపించినా, చీకటిపడ్డాక కలుగులోంచి బయటకు వచ్చినట్టుగా పడగ్గదిలో బుస్సుమంటూ బయటకు వస్తుంది. భాష మారిపోతుంది. ప్రవర్తన మారిపోతుంది. వాడు మొగుడైతే మరీ!

మగానుమానం ఆడవాళ్లను వెంటాడి వేధిస్తుంది కానీ, అంతకన్నా ఎక్కువగా లోపల సుళ్లు తిరుగుతూ హింసపెట్టేది మాత్రం మగవాళ్లనే. కాకపోతే ఆ నిజాన్ని గ్రహించడానికి కూడా మగఅహం అడ్డొస్తుంది.  వీరత్వాన్ని ప్రదర్శిస్తున్నామనుకునే వొట్టి అర్భకులు మగవాళ్లు. తెలివిగా వ్యవహరిస్తున్నామనుకునే పిచ్చి అమాయకులు మగవాళ్లు. కళ్లకు కనిపించని కెమెరాలు తగిలుంచుకున్నామనీ, ఇక అంతా కట్టుదిట్టం చేసేశామనీ బ్రమిసే ప్రపంపం పాపం వాళ్లది. ‘కనుపాపను కూడా కత్తిరించుకుపోయి గెలాయించుకురాగల సామర్థ్యం ఆడవాళ్లదని తెలియదు’ అని అందుకే ఎండపల్లి భారతి మగవాళ్లను తలచుకుని జాలిపడుతుంది ‘ఆడదాన్ని నమ్మితే సొమ్ము నమ్మకుంటే దుమ్మే’ అనే కథలో.

తెలుగు కథా ప్రపంచంలోకి కొత్త తలుపులు తెరుచుకుని జొరబడ్డ కథకుల్లో ఒకరు భారతి. రెండు మూడేళ్లుగా ఎండపల్లి భారతి కథలు అక్కడా అక్కడా కనిపిస్తూనే ఉన్నా చూసీ చూడనట్లుగా కథామేథోలోకం టలాయిస్తోంది. కారణం ఆమె ఏ రైటర్స్‌ మీట్‌లలోనూ, కథా పాఠశాలల్లోనూ, కథా సంకలనాల ఆవిష్కరణ సందర్భాల్లోనూ, సోషల్‌ మీడియా సమూహాల్లోనూ బొత్తిగా కనిపించకపోవడం కూడా కావచ్చు. కథల మీద ఆమె చర్చలు చేయదు. కథా నిర్మాణ సూత్రాల గురించి మాట్లాడదు. శైలీ ఎత్తుగడల వ్యూహాలు కథలకుంటాయని కూడా నమ్మినట్లు కనిపించదు. కానీ భారతి కథల్లో మాత్రం ఇవన్నీ నిండుగా ఉంటాయి. తరం నుంచి తరానికి అందే నోటికథలోని వొడుపు భారతి రాతకథలోకి అలాగ్గా వచ్చి కూర్చుంది.

జీవితానుభవాల్లోంచి కథలను ఏరి కూర్చుకుంటూ వస్తోంది. అందుకే ఎండపల్లి భారతి కథలు ఏ తొడుగులూ కప్పుకోవు. నివురు తొలగిన నిప్పుకణికల్లా మండుతుంటాయి. లేనిది ఉన్నట్టు, ఉన్నది లేనట్టు కల్పించి కథగట్టాల్సిన అవసరం ఆమెకి ఇప్పటికైతే వచ్చినట్లు లేదు. కారణం, పొద్దు పొడవకముందే లేచి ఇంటెడు పనీ చేసుకుని, ఆవులు తోలుకుని అడివికో, కూలి పనుల కోసం పొలాలకో ఇప్పటికీ వెళ్తూ ఉండడమే కావచ్చు. పల్లెల్లో పనులంటే  కష్టాలను మోస్తున్నామని కన్నీళ్లు పెట్టుకోవడం కాదు, దుఃఖసుఖాల కబుర్లు కలబోసుకోవడం కూడా. ఆ కలబోతలోంచే కతలు పుడుతున్నాయి భారతికి.  అట్లా పుట్టిన కథల్లో ఒకటే ‘ఆడదాన్ని నమ్మితే సొమ్ము నమ్మకపోతే దుమ్మే’. 2020లో ప్రజాశక్తి ఆదివారం పుస్తకంలో ఈ కథ అచ్చయ్యింది.  ఎండపల్లి భారతి రెండో కథల పుస్తకం ‘బతుకీత’ లోనూ ఉంది. హైదరాబాద్‌ బుక్‌ట్రస్ట్‌ ఈ పుస్తకాన్ని ప్రచురించింది.

ఈ కథను కూడా తన ఇతర కథల్లాగే భారతి పాఠకులకు తనే చెబుతుంది. భారతి, సరస చిన్నప్పటి నుంచీ ఒకరిని విడచి ఒకరు ఉండలేకుండా పెరిగారు. పుట్టిన ఊరూ, మెట్టిన ఊరూ కూడా ఇద్దరికీ దిగువబురుజు మాదిగపల్లే అయ్యింది. మొగుళ్లు తిట్టినా జత వీడని స్నేహం వీళ్లది. సరస చీటికి మాటికి అలిగి పుట్టిల్లు చేరుతుందని ఊళ్లో అందరికీ ఎగతాళి. బిడ్డలు తమంత అయినా సరస వరస మారలేదు. అందరి నోళ్లలో నానినా తనెందుకు ఇట్లా చేస్తోందో, సీతాఫలం కాయలు పెరుక్కొచ్చుకోవడానికి గుట్టల్లోకి పొయ్యినపుడు భారతికి చెప్పుకుంది. నిజానికి సరస కష్టం కొత్తదేమీ కాదు. అందరు ఆడవాళ్లూ పడేదే. ‘చెప్పుకుంటే సిగ్గుచేటు’  అనుకుని కడుపులోనే కుళ్లబెట్టుకుని కుంగిపోతారు ఆడవాళ్లు. పెళ్లాం పౌడరు పూసుకుని, పూలు పెట్టుకుని కనిపిస్తే, ‘ఏమి ఈ పొద్దు బలే సోగ్గా ఉండావు ఎవునికన్నా వస్తానని చెప్పినావా’ అని మొగుడు పొడుస్తాడు. ఒంట్లో నలతగా ఉండి ఏ రాత్రి అయినా సహకరించకపోతే, ‘బయట రుచి మరిగితే ఇంట్లో మొగుడు నచ్చడులే’  అని దెప్పి పొడుస్తాడు. మొగోళ్లంతా ఇంతేలే, మొగుడే కదా అని సర్దుకుపోతారు.

మాటను తుడిచేసుకుని ఒక్కోసారి ప్రేమ పొంగుకొచ్చి హత్తుకుని ముద్దులు పెడితే, ‘ఈ మధ్య నీకు ఎవుడో బాగా నేర్పిస్తా ఉండాడు’ అని అనుమానపు పోటు పొడుస్తాడు. ఎందుకొచ్చిన బాధ అని మెదలకుండా చేతులెత్తేస్తే, ‘నీకు నా మీద బెమ లేదు. నీకు నేను సాల్లేదులే’ అంటాదు. ఇట్లా మాటలు పడీ పడీ గడ్డకట్టిన ఆడవాళ్లలో సరసకూడా ఒకరు. కడుపు చించుకున్న జతగత్తెకు ఓదార్పు మాటలు చెప్పడం తప్ప ఏం చేస్తుంది భారతి మాత్రం. ఇద్దరూ కలిసి మగవాళ్లని తిట్టుకుని, ‘అయినా యా నా కొడుకు ఆడదాన్ని అర్తం చేసుకున్నాడు కాబట్టి’ అని సర్ది చెప్పుకుంటారు. అంతటితో అయిపోతే, మగవాళ్లమీద దుమ్మెత్తి పోసే సాధారణ కథే అయిపోయేది ఇది. మగఅవమానాలను ఎంత ఎదుర్కొంటున్నా ఏడుస్తూ ఉండిపోరు గ్రామీణ శ్రామిక స్త్రీలు. తిరగబడలేని చోట కష్టం చెప్పుకుని కన్నీళ్లు పెట్టుకున్నా కాసేపటితే తేరుకుని, మగవాడి బీరత్వాన్ని తలచుకుని నవ్వుకుంటారు. ఎగతాళి చేసుకుంటారు. అట్లా మాదిగపల్లెలో గంగతాత చెప్పే ఒక కతని సరసకి చెబుతూ, ఈ కథతో ముడేసింది రచయిత్రి.

ఆ కథ ఇదీ..

తనను కోరుకున్నోళ్లకి కొంగుబరిచి కడుపు నింపుకునే ఒక ఆడమనిషి మీద ఊరి మగవాళ్లు పగబట్టారు. చంపేశారు. నీతి తప్పిందని రాజుకి నివేదించుకున్నారు. రాజు కూడా మగవాడే కదా. శభాష్‌ అన్నాడు. ఊళ్లోని అడవాళ్లందరికీ ఇది హెచ్చరిక కావాలని ఆదేశించాడు. ఆ ప్రకారం ఊరి ఆడవాళ్లు రోజూ నీళ్లకు వచ్చే రేవు దగ్గర ఆమె శవాన్ని పడేశారు. నీళ్ళకు వాచ్చేటపుడూ, వెళ్లేటపుడూ ఆ శవాన్ని చూసి ఆడవాళ్లు ఏమనుంటున్నారో విందామని రాజూ, ఆయన తమ్ముడూ చాటున చేరారు. ‘ఇట్టాంటి పని ఎందుకు చేయాల. ఎందుకు చావాల’ అని చీదరించుకుని అందరూ తప్పుకుపోతూ ఉంటే, నీళ్లకి వచ్చిన అక్కాచెల్లెళ్లలో అక్క మాత్రం ఆ శవం దగ్గర కూలబడి బోరోమని ఏడ్చింది.   ‘అది నీకేమన్నా అంటా సంటా, అందెంల గెంటా.. చచ్చినదాని కోసం నువ్వెందుకు ఏడస్తావు’ అని చెల్లెలు విసుక్కునింది. ‘అదీ మనట్లా ఆడదే కదా, చేసిన మగ నా కొడుకులు బాగానే ఉండారు. చేపించుకున్న దాన్ని చంపేసినారు’ అని అక్క దుఃఖపడుతూంటే,  ‘అది కాకపోతే అరువు ఎరక్క లంజరికం చేసి కొంటినక్కల పాలైంది. అదే నేనయితే మొగున్ని మిండగాన్ని చేసిందు.  మిండగాన్ని మొగున్ని చేసికునిందు’  అని అక్కని లాక్కుపోయింది.  చెల్లెలు అన్న ఈ మాటతో రాజులైన అన్నదమ్ములకి దిమ్మ తిరిగిపోయింది. ‘మొగున్ని మిండగానిగా, మిండగాన్ని మొగునిగా’ ఈ ఆడది ఎట్లా చేస్తుందో చూడాలనిపించింది. నేరుగా అక్కచెల్లెళ్ల వెనకే వెళ్లారు.

‘మాది తూర్పు తుంగభద్ర రాజ్యం. మా తమ్ముడికి మీ రెండో  పిల్ల నచ్చింది. చేసుకుంటాం’ అని అడిగారు. రాజులంతటోళ్లే అడిగితే కాదనేదెవరు? పెండ్లి చేశారు. సవాలు విసిరిన పిల్లని అన్నా తమ్ముళ్లు గుర్రం మీద ఎక్కించుకుని రాజ్యానికి పయనమయ్యారు. ఆ కతేందో, ఎట్లా చేస్తుందో తేల్చుకోవాలని కదా పెళ్లి చేసుకునింది. ఆ పిల్లని ఒంటి స్తంభం మేడలో పెట్టి ఈ పక్కన అన్న, ఆ పక్కన తమ్ముడు పడుకుని రెప్ప వాలకుండా కాపలా గాశారు. ఏడాది గడిచింది. సడీ సప్పుడూ లేదు. అలిసిపొయిన అన్నాదమ్ములు ఒక రోజు ఒళ్ళెరగక నిద్రపోయారు. ఇదే సందని, ఆయమ్మ తన ప్రియుడిని  పిలిపించుకునింది. తెల్లారుజాము కాడ చప్పుడికి తమ్ముడికి మెలకువ వచ్చింది. పక్కన దుప్పటి కదలతా ఉంది. ‘మా యన్న చూడు.. నాకు చెప్పి ఉంటే నేను కడగా పోయుందు కదా’ అని ఆ పక్కకు తిరిగి పడుకుని నిద్రపోయాడు. ఇంకాసేపటికి అన్నకి మెలకువ వచ్చింది. పక్కన కదులుతున్న దుప్పటిని చూశాడు. ‘నా తమ్ముడు చూడు.. నాకు చెప్పి ఉంటే నేను దూరంగా పోయుందును కదా’ అనుకుని ఇంకో పక్కకి తిరిగి పడుకున్నాడు. తెల్లారాక అన్నదమ్ములిద్దరూ లేచి యేటికి బయలుదేరారు. ఇద్దరి మధ్యా మాటా పలుకు లేదు. ఒకరిమీద ఒకరికి కోపంగా ఉంది. తిరిగి వచ్చేటపుడు రాత్రి  జరిగిన కత చెప్పుకుని గొడవ పడ్డారు. నేను కాదంటే, నేను కాదని అరుచుకున్నాక తేలిందేమిటంటే, రాత్రి ఇంకెవరో వచ్చారని.  సరిగ్గా అప్పుడే ఊరిచివర మర్రి చెట్టు కిందకి ఇద్దరు బైరేగులు వచ్చి దిగారు. ‘అలిసిపొయినాం. కాసేపు సుద్దులాడుకుందాం’ అనుకుని తమ జుట్టులో దాచిపెట్టుకున్న  ఇద్దరు అమ్మాయిల్ని బయటకు తీశారు. వాళ్లతో ఆడిపాడి ఆనందించి నిద్రపోయారు. వాళ్లట్లా నిద్రపోగానే ఆ చెలికత్తెలు తమ రైకముడులు విప్పి ఇద్దరు ప్రియుళ్లని బయటకు తీశారు. ఆ ఇద్దరితో సరసలాడుకున్నారు. వాళ్ల తెగింపుకి విచిత్రపోయిన  రాజుసోదరులు,  తెల్లారినాక చెట్టుకిందకి వచ్చి బేరేగులిద్దరినీ తమ ఇంటికి భోజనానికి పిలిచారు. ఏడు ఇస్తరాకులు కుట్టి వడ్డించమని అమ్మకి చెప్పారు.

వచ్చింది ఇద్దరే కదా అనుకున్నా, అమ్మ ఏడు ఇస్తర్లూ కుట్టి వడ్డించింది. బైరేగులిద్దరూ భోజనంలో చేయి పెట్టబోతూ ఉంటే రాజులు వారించారు.‘మీరు తిని మీ చెలికత్తెలు తినకుంటే మాకు పాతకం వాళ్లని కూడా పిలవండి’ అని కోరారు. రాజులకి తమ కత తెలిసిపోయిందని అర్థమైన  బైరేగులకి జుట్లు విప్పక తప్పలేదు. నాలుగురూ విస్తళ్లలో చేతులు పెట్టబోతూ ఉంటే,  ‘అమ్మా మీరు తిని మీ చెలికాల్లు తినకుంటే మాకు మహాపాతకం’ అని వారించారు. గుట్టు దాగలేదని అర్థమయ్యాక రైకముడులు విప్పి ప్రియుళ్ళని బయటకు తీశారు.  ఆరుగురూ అన్నాలకి కూర్చున్నా ఇంకా ఒక ఇస్తర ఖాళీగానే ఉంది. ఇక అప్పుడు, పెళ్లిచేసి తెచ్చుకున్న పిల్లని పిలిచి, ‘వీళ్లందరూ తిని రాత్రి వచ్చినోడు తినకపోతే మరీ పాతకం. వాన్నీ రమ్మను’ అని చెప్పారు. గది తాళం తీసి రాత్రి వచ్చినోడిని ఆమె విస్తరి ముందు కూర్చోబెట్టింది.. ఏడు ఇస్తర్లు ఎందుకు కుట్టమన్నారో అమ్మకి అప్పుడు అర్థమయింది. భోజనాలు అయినాక రాత్రి వచ్చినోడికి ఆయమ్మని ఇచ్చి పెండ్లి చేశారు.

ఆట్లా చెల్లెలు అక్కతో రేవు దగ్గర  అన్న మాట నిజం అయ్యింది.

మాగిన సీతాఫలం పండ్లు తింటూ, భారతి ఈ కత సరసకి చెప్పినాక ఇద్దరూ తేలికపడి, కడుపు నిండుకీ నవ్వుకుని, తియ్యటి పండ్లు నెత్తికెత్తుకుని ఎవురిండ్లకు వాళ్లు  పొయ్యుంటారు, మొగుళ్లకి తినబెట్టడానికి.

జరిగింది జరిగినట్లే రాసినట్లు కనిపించినా, తెలియని అల్లిక ఏదో ఈ కథను ఒక్క గుక్కలో చదివిస్తుంది. ఎండకి వేపచెట్టుకింద చేరిన నేస్తులకి కత చెప్పినట్టే ఉంటుంది భారతి శైలి. సామెతలు, నానుడులతో సాగే మదనపల్లె యాస కథలోని పాత్రలను పాఠకులకి చేరువ చేస్తుంది. అడవి అంచు పల్లె బతుకుల్లోని స్వచ్ఛత ఈ కథల్లో కనిపిస్తుంది. తమ ఊళ్లో దాగిన తియ్యటి తెలుగు మాటలెన్నింటినో ఏరి కూర్చి కథగట్టి అందిస్తోంది ఈ రచయిత్రి.  భారతి కథల్లో ప్రత్యేకంగా ఆకట్టుకునేది, ఒక కథలోంచి ఇంకో కథను చెప్పడం. జానపద కాల్పనికతనూ, వర్తమానాన్నీ గొలుసుకట్టి కథ అల్లుతుంది. ఈ నేర్పును ఉగ్గుపాలతో పట్టి తెలుగు కథాసాహిత్యానికి ఎండపల్లి భారతిని కానుకగా ఇచ్చిన దిగువబురుజు మాదిగపల్లె ఎంతో పుణ్యం చేసుకునింది.

*

ఆర్‌.ఎం. ఉమామహేశ్వరరావు

4 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • మట్టిళ్ళ గోడలమింద తెల్లసున్నం, ఎఱ్ఱమట్టి గలిపి గీసేటి పల్లి బతుకు బొమ్మలు భారతక్క కతలు. ఏడేడి సంగటి ఎనికిల కూరాకులో కలద్దుకోని తిన్నంత కమ్మంగా ఉంటాది ఆయమ్మ కత. అంతే బాగా గెవణం జేసినావు ఉమన్నా..

  • సహజ రచయిత్రిని పరిచయం చేసినందుకు ధన్యవాదాలు ఇంతవరకు ఆమె కథలు చదవలేదు తప్పకుండా చదువుతాను

  • మగానుమానం ఆడవాళ్లను వెంటాడి వేధిస్తుంది కానీ, అంతకన్నా ఎక్కువగా లోపల సుళ్లు తిరుగుతూ హింసపెట్టేది మాత్రం మగవాళ్లనే. కాకపోతే ఆ నిజాన్ని గ్రహించడానికి కూడా మగఅహం అడ్డొస్తుంది. వీరత్వాన్ని ప్రదర్శిస్తున్నామనుకునే వొట్టి అర్భకులు మగవాళ్లు. తెలివిగా వ్యవహరిస్తున్నామనుకునే పిచ్చి అమాయకులు మగవాళ్లు. కళ్లకు కనిపించని కెమెరాలు తగిలుంచుకున్నామనీ, ఇక అంతా కట్టుదిట్టం చేసేశామనీ బ్రమిసే ప్రపంపం పాపం వాళ్లది. ‘కనుపాపను కూడా కత్తిరించుకుపోయి గెలాయించుకురాగల సామర్థ్యం ఆడవాళ్లదని తెలియదు

    yadhardham sir

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు