మండుటెండలో నీటి చెలమలు

వుందో లేదో తెలియని వ్యాధికి కీమో థెరపీల వంటి వేదనాభరితమైన ట్రీట్మెంట్ , జుట్టు వూడిపోయి మొహం మాడిపోయి చందమామను రాహువు మింగేసినట్టు విలవిలలాడే నా మనసును చందన లేపనంలా చల్లబరిచిన మనుషుల కధలే అడయార్ కధలు .

పోరాటం అనివార్యం అని తెలిశాకా వచ్చే ఒక ధైర్యం అడయార్ కేన్సర్ ఇన్స్టిట్యూట్ లో వైద్యానికి వచ్చిన వాళ్లల్లో కనిపించేది . ఎవ్వరూ దిగులుగా గానీ జీవితం ఇంకొన్నాళ్లేనేమోనన్న ఆందోళనతో గానీ కనిపించేవారు కాదు .

మృత్యువు ముంగిటే నిల్చుందని తెలిసినా అంతులేని ఆశల్నీ ఆనందాన్నీ గుండె నిండా ధైర్యాన్నీ నింపుకుని “నువ్వా నేనా రా ! తేల్చుకుందాం ” అన్నట్టు వుండేవారు .
మనుషులం ఎక్కడికక్కడ ఒక ప్రపంచం సృష్టించుకుంటాం . అలాగే మేమూ ఆ ఇన్స్టీట్యూట్ లో ఒక ప్రపంచాన్ని సృష్టించుకున్నాం .
తెలుగువాళ్లు ఎక్కువగా వుండేవాళ్లం. పొద్దున్న డాక్టర్ల రౌండ్స్ అయ్యాకా మళ్లీ సాయంత్రం అందరం వార్డ్ బయట అరుగుల దగ్గర మాకోసం వచ్చిన వాళ్లం అంతా కలిసి కబుర్లు , నవ్వులు .

అది చూసి తమిళులు వుడుక్కునే వారు . ” మీ తెలుంగు అంతా ఒకటే యూనిటీ ” అనేవారు . పతి ఒక్కళ్లకీ ఎదుటివాళ్లు యూనిటీగా వున్నట్టు కనబడతారో ఏమో .
అదేంటో 16 ఏళ్ల లోపు పిల్లలు ఎక్కువగా కాలిఎముకలకి వచ్చే సార్కోమా బారిన పడేవారు .

వాళ్లల్లో శ్రీనివాస్ , సురేష్ , ప్రకాష్ నాకు బాగా ఫ్రెండ్స్ అయ్యారు .

శ్రీనివాస్ వాళ్ల నాన్న బందరు రోల్డ్ గోల్డ్ పని . అతనికి ట్రీట్మెంట్ , ఆపరేషన్ చేసి కాలు తీసేయడంతో కృత్రిమ కాలు వేశారు . ఇక ప్రకాష్ వాళ్ల నాన్న రైల్వే వుద్యోగి . తనది థర్డ్ స్టేజ్ అని హాస్పటల్ లో చేర్చుకోలేమని అంటే కాళ్లావేళ్లా పడి బతిమాలితే సరే ట్రై చేస్తామని చేర్చుకున్నారు .

సురేష్ వాళ్లది వైజాగే . వాళ్ల నాన్న మోటారు ఫీల్డ్ కావడం తో మా ఆయనకి కూడా పూర్వ పరిచయం వుంది .

తమ కూతుర్ని వాళ్ల అమ్మమ్మ దగ్గర వుంచి భార్యా భర్తలిద్దరూ వచ్చి సురేష్ కి వైద్యం చేయిస్తున్నారు .

ముగ్గురూ ఇంటర్మీడియట్ పిల్లలే నన్ను అక్కా అంటా ఆత్మీయంగా పిలిచేవారు . అసలు మేమంతా కలిస్తే ఏదో హలీడే ట్రిప్ కి వచ్చినట్టు జోక్స్ తో , హాస్పటల్ బయట వున్న మిరపకాయ బజ్జీలు తింటూ రాత్రి వరకూ అరుగుల మీద కాలక్షేపం చేసేవాళ్లం .

అప్పటికీ సురేష్ వాళ్ల అమ్మ ఆ నూనె మంచిది కాదని గోల చేసినా ఈ పిల్లలు వింటేగా నన్నూ లాక్కు పోయేవారు .

కొన్నాళ్లకి శ్రీనివాస్ బందరు వెళ్లి పోయాడు . తరవాత నెలరోజులకి ఈ లోకాన్నే వదిలి పోయాడు . ఆ వార్త తెలిసి మా కంటే ఎక్కువ సురేష్ వాళ్ల అమ్మగారు ఏడ్చారు .
సురేష్ వాళ్ల అమ్మ ” అతడు అడవిని జయించాడు ” నవల చదివి నాతో అంది ఆ ముసలివాడు ఆ పంది సలుగుల్ని రక్షించుకోవాలని ఎంత ఆరాట పడ్డాడో !! అవి తోడేళ్లపాలు కాకూడదని నేనూ నవల చివరిదాకా దేముడికి దణ్ణాలు పెట్టుకున్నా అంది . ఆ అమ్మ ఆరాటానికి గుండె నీరయ్యింది .

ఇక నా మొదటి కీమో థెరపీ మొదలైంది . ఎదురు బెడ్ మీద వున్న గుండుబోయినపాలెం మామ్మగారు ” ఏం దిగులుపడబోకమ్మా ! మేమంతా నీ ఎదురుగానే వుంటాం కదా ” అంటే మా పిన్నత్తగారు ” తనకి చాలా ధైర్యం అండీ ” అని నన్ను మానసికంగా సిద్ధం చేశారు . “పాము విషంతో చేస్తారటమ్మా ఈ మందు ” అన్నారు మామ్మగారు .

ఆమె అమాయకంగా అన్నా ఆ హాలాహలం నరనరాల్లోకి ఎక్కుతున్నప్పుడు మాత్రం అనిపించింది నిజమేనేమోనని .
మూడు రోజులు ఈ లోకంతో సంబంధం లేనట్టు మెలకువా కాదూ స్పృహా కాదన్నట్టుండేది .

కడుపులో ఒక సముద్రమధనం జరుగుతున్నట్టుండేది . వికారం , వాంతులు , చిరాకు …
అసలీ వైద్యం వద్దు అని లేచి ఇంటికెళ్లి ఎన్నాళ్లుంటే అన్నాళ్లు బతికేస్తే బాగుండునని లోలోపల అనుకునేదాన్ని . నా ఘోష వినేదెవరు ?
ఇక కీమో అయ్యాక నోరు చప్పగా ఎదోగా వుండేది .

పంచభక్ష్యాలు తెచ్చినా నోట్లో పెట్టుకోవాలంటే ఇష్టం వుండేది కాదు . కానీ గేటు బయట అమ్మే నాటు రేగు పళ్లు మాత్రం నచ్చేవి .
నెమ్మదిగా ఒక వారానికి కాస్త తిండి తినగలిగేదాన్ని .

మా ఆయన్ని మాత్రం తెగ విసిగించేదాన్ని . పొద్దునే శరత్ ఇంటినుంచి వస్తూ బయట టిఫిన్ తిని నాకు ఏదో ఒకటి తెచ్చేవారు . ఇక మధ్యాన్నం భోజనం అడయార్లో వున్న హోటల్ లో తెస్తే చచ్చినా తిననని మొండికేసేదాన్ని .

టి. నగర్ లో మానస అని బెజవాడ వాళ్ల హోటల్ నుంచి తెమ్మనే దాన్ని .

పాపం మళ్లీ టీ నగర్ బస్ ఎక్కి వెళ్లి భోజనం తెచ్చి ఇచ్చి మళ్లీ శరత్ ఇంటికి వెళ్లే వారు .
క్యారేజీ కొన్నాళ్లు బాగానే వుండేది . మూడు రోజులకే మొహం మొత్తేది .
ఈ సమయం లోనే మామ్మగారు నన్ను కనిపెట్టుకుని కూర్చునేవారు .
షర్మిలా ! కాస్త తినమ్మా , ఆ భోజనం ఆయాలకే ఇచ్చేస్తున్నావ్ .

ఇలాగైతే బలం వుండొద్దూ మళ్లీ కీమో కి అని కోప్పడేవారు .
మామ్మగారి వయసురీత్యా ఆవిడకి రేడియేషన్ మాత్రమే ఇచ్చేవారు .
ఆవిడ కూతురు మెడ్రాస్ లోనే వుండేది , కానీ వూరి చివర ఎక్కడో వుండేవాళ్లు .
అయినా రోజూ కూతురు రెండు బస్ లు మారి మామ్మగారికి క్యారేజీ తెచ్చేది .

వాళ్లు బ్రాహ్మలు . వాళ్ల అమ్మాయి తెచ్చే చింతకాయ పచ్చడి మాత్రం మామ్మగారికి కూడా మిగల్చకుండా గబగబా తినేసేదాన్ని .
ఆవిడ భోజనం నేను తింటే పాపం ఆవిడ నా హోటల్ కూడు తినేది .

ఒకసారి ఉగాదికి వాళ్ల అమ్మాయి ఇంటికి నన్ను తీసుకెళ్లి రుచికరమైన భోజనం పెడితే నేను తిండి మొహం ఎరగని దానిలా తిన్నాను .
నాకు హాస్పటల్ అంతా చుట్టాలే . అందరినీ చుట్టేసి వచ్చేసరికి ఒక్కో రోజు రాత్రి 9 దాటి పోయేది .

పెందలాడే భోంచేసే అలవాటున్న మామ్మ గారు . నా కోసం తినకుండా కూర్చునేది . “ఎక్కడికి పోయావ్ తల్లీ ! రా తిందాం ” అని ప్రేమగా పిలిస్తే నన్ను ప్రాణంగా పెంచి ఇప్పుడు నేను క్షేమంగా తిరిగిరావాలని ఏడుస్తూ వేల దేముళ్లని వేడుకునే మా నాయనమ్మ గుర్తొచ్చింది .

నాయనమ్మ ప్రేమకి ఏదో శక్తి వుందేమో అందుకే మామ్మగారి లాగా ఇక్కడికి వచ్చిందేమో ! ఏమోమరి అలా అనిపించేది .

( వచ్చే సంచికలో ప్యారీ గురించి )

షర్మిలా కోనేరు

షర్మిలా కోనేరు

Add comment

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు