మంటో మెరుపు కథలు

మంటో గల్పికలు ఇక నుంచి ప్రతి పక్షం చదవండి!

1947 లో దేశం విభజన తర్వాత తానెంతో ప్రేమించే బొంబాయి నగరాన్ని విడిచి మంటో  పాకిస్తాన్లో లాహోర్ లో స్థిరపడ్డాడు. హిందువులు ముసల్మానుల మద్య చెలరేగిన మత వైషమ్యాలు, ఫలితంగా జరిగిన మారణహొమం మానసికంగా ఆయనను కలచివేశాయి. వాటిని నిరసిస్తూ శక్తివంతమైన కథలూ గల్పికలూ (చిన్న కథలు) చాలా రాశాడు. కథలు కొన్ని. తెలుగులో అనువాదం అయ్యాయి కానీ ఆయన రాసిన వ్యంగ్యంతో కూడిన గల్పికలు తెలుగు పాఠకులకు పరిచయం చెయ్యాలని ఈ ప్రయత్నం.

*

1

ఓడిపోయిన ఆనందం

వేశ్యాగృహంలో చూపించిన షుమారు డజన్ మంది అమ్మాయిలలో , ఇద్దరు స్నేహితులూ కలిసి చివరగా ఒక అమ్మాయిని ఎన్నుకుని , తమ ఇంటికి తీసుకువెళ్లారు .

వారిలో ఒకడు రాత్రి అంతా ఆ అమ్మాయితో గడిపిన తరువాత “నీ పేరేమిటి ” అని అడిగాడు .

ఆ అమ్మాయి తన పేరు చెప్పఁగానే ఉలిక్కిపడి
“నువ్వు వేరే మతానికి చెందిన అమ్మాయివని  చెప్పారే ” అన్నాడు .

అమ్మాయి “వాళ్ళు అబద్దం చెప్పారు ” అంది .

“దొంగనాకొడుకులు మోసం చేశారు . మాకు మా మతానికి చెందిన దాన్నే అమ్మేసారు . నాకు నా డబ్బులు వాపసు కావాలి ” అని గట్టిగా అరిచాడు.

*

భగవంతుడు గొప్పవాడు

రసికులందరూ ఒక్కొక్కరుగా ఆ  గాయని సంగీత మందిరం వదలి వెల్లిపోవడంతో ఆ రోజు సాయంత్రం ఎలాగైతేనేం ముగిసింది .
యవ్వనంలో వున్న ఆ వేశ్య మందిరంలో రోజూ సాయంత్రం సంగీత సభకు ఏర్పాట్లు చూసే ముసలాడు ఒక్కసారిగా శృతిలో “భగవంతుడు నిజంగా గొప్పవాడు  ” అని వంతపాడాడు .  “దేశం ముక్కలయ్యాక ఆవల పక్క మన ఆస్తిపాస్తులన్నీ వదిలేసుకొని మనం ఈ నగరానికి వచ్చాం , కానీ ఇక్కడ ఈ ధన వర్షాన్ని కురిపిస్తున్న ఆయన్ని మనం తప్పక పొగడాలి ” అన్నాడు .

*

తొలగించబడిన తప్పు

 

“నువ్వు ఎవరు ?”
“ఎయ్ నువ్వు ఎవరు ?”

“హర్ హర్ మహదేవ్ ,
హర్ హర్ మహదేవ్”
“నువ్వు చెబుతున్నదానికి సాక్ష్యం ఎమిటి ?”
“సాక్ష్యమా ! నా పేరు ధరమ్ చంద్ , అది ఒక హిందువు పేరు “
“ఇదేం సాక్ష్యం కాదు “
“సరే ! నాకు వేదాలన్నీ కంఠస్తా వచ్చు . నాకు పరీక్ష పెట్టండి “
“మాకేం వేదాల గురించి తెలియదు . మాకు సాక్ష్యం కావాలి !”
“ఎమిటి ?”
అతడు తన ప్యాంటు కిందకి జార్చగానే , పెద్ద అరుపులు మొదలయ్యాయి ” వీణ్ణి చంపండి , వీణ్ణి చంపండి “
“ఆగండి , దయచేసి ఆగండి అన్నలారా ! భగవంతుడి సాక్షిగా నేను మీ తమ్ముడినే “
“అలాగైతే నీ పురుషాంగం ఎందుకు కత్తిరించబడి వుంది ?”
“నేను ఇంతకు ముందు తప్పించుకు వచ్చిన ప్రాంతం మన శత్రువుల ఆధీనంలో వుంది . అక్కడ నించీ తప్పించుకు రావడానికి వేరే గత్యంతరం లేక నా జీవితం కాపాడుకోవడానికి ఈ ముందు జాగ్రత్త తీసుకున్నా , ఇదొక్కటే నేను చేసిన తప్పు , మిగిలిన శరీరమంతా సరైనదే !”
“ఈ తప్పుని తొలగించండి “
తప్పు తొలగించబడింది దానితోపాటే ధరమ్ చందు కూడా !
*

ఆర్ . ఎస్ . వెంకటేశ్వరన్ .

2 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • చాలా బావునగనాయి
    మాంటోని కొనసాగించండి
    ఇప్పటి అవసరం మాంటో..

    • తప్పకుండా కొనసాగిస్థా

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు