మంగ్లేష్ దబ్రాల్ లో నేను

1960లలో మంగ్లేష్ దబ్రాల్ ఉత్తరాఖండ్ లోని తెహ్రీ గహర్వాల్ లోని కఫియా పానీ అనే గ్రామం వదిలి పత్రికల్లో అక్షరాలు వెదజల్లేందుకు దేశ రాజధాని ఢిల్లీ వచ్చారు. మూడేళ్ల క్రితం ఒక శీతాకాలం రోజు ఆయన ఉన్నట్లుండి కరోనా పీడితుడై అదృశ్యమై మేఘాల్లో విహరించేందుకు వెళ్లారు. అక్కడి నుంచి ఎవరు తిరిగి వస్తారు?

రోడ్లపైనా, బస్సుల్లో, సభల్లో,

జన సమ్మర్ధంలో ఇప్పుడెవరూ అనరు

నాకు నిరాలా పంక్తులు కొన్ని గుర్తొచ్చాయని

ఎవరూ అనరు నేను నాగార్జునను చదివానని

ముక్తిబోధ్ ఎలా మరణించారో ఎవరూ చెప్పరు.

ఒకడంటాడు జీవితంలో నేనెంతో ఎదిగానని

మరొకడు సంతోషిస్తాడు తనకు ఇవాళ బస్సులో సీటు దొరికిందని

ఇంకొకడంటాడు ఈ సమాజం తన మాట ఎందుకు వినడం లేదోనని

ఒకడు మీ మొత్తం భవిష్యత్తు చూస్తాడు

మీ దారి ఎలా మారుస్తానో చూస్తూ ఉండు అంటాడు

ఒకడు చెపుతాడు నేనేంతో పేదవాడినని

నా వద్ద ఏ శబ్దాలూ లేవని !

అని ఒక రోజు వాపోయిన మంగ్లేష్ దబ్రాల్  ఢిల్లీలో ప్రవేశించినప్పుడు వాతావరణమే వేరు. “నేను ఢిల్లీవైపు చూసి చిరునవ్వు నవ్వి లోపలికి ప్రవేశించాను. ఇక్కడ నివసించాలని ఎరు అనుకోరు అని అబ్బురం చెందాను. ఎన్నడూ వెనక్కి వెళ్లలేదు..” అని ఆయన ఒక కవితలో రాసుకున్నారు.

ఆయన  ఢిల్లీలో ప్రవేశించినప్పటి వాతావరణం వేరు. మేధావిత్వం ఉప్పొంగుతున్న రోజులవి. నెహ్రూ కాలపు కలలు కరిగిపోయి భ్రమలు వ్యాపించిన రోజులవి. వ్యవస్థను విమర్శిస్తూ రాంమనోహర్ లోహియా తలెత్తిన రోజులవి. అమెరికన్ కవిత్వపు బీట్ తరం  రోజులవి. అలెన్ గిన్స్ బర్గ్ భారతదేశంలో అడుగిడిన రోజులవి. మేరా వియత్నాం, తేరా వియత్నం నినాదాలు ప్రతిధ్వనించిన రోజులవి. నీవే మరణం, నీవే రిక్తం, నీవే వ్యర్థం, నీ ధ్వంసమే కేవలం నీ అర్థం అని పెట్టుబడి దారి సమాజంపై ఎలుగెత్తిన ముక్తిబోధ్ మరణించిన రోజులవి. నక్సల్బరీ, బెంగాలీ ఆకలితరం, మరాఠీ దళిత పాంథర్, దిగంబర కవిత్వ గీతాలు దేశాన్నిఅట్టుడికిస్తున్న రోజులవి. “ఈ ధిక్కార స్వరాలే నన్ను తీర్చిదిద్దాయి..” అని మంగ్లేష్ దబ్రాల్ ఒక సందర్భంలో చెప్పుకున్నారు.

దేశ రాజధాని ఢిల్లీలో నేనెన్నోసార్లు కలుసుకున్నాను ఆయనను.  కొన్ని కవి సమ్మేళనాల్లో కలిసి కవిత్వం చదివాము. హైదరాబాద్ నుంచి చార్మినార్ సిగరెట్లు తెమ్మని అడిగేవాతడతడు. కవితల్ని హిందీలో తర్జుమా చేయించి తనకు పంపించమనేవాడు.  ప్రెస్ క్లబ్ ఆఫ్ ఇండియా లో ఒకరోజు కూర్చున్నాక అర్థమైంది. నేను ఆయనతో ఏవిషయంలోనూ పోటీపడలేనని!

హిందీ పాట్రియట్ పత్రికతో ప్రారంభించి, ప్రతిపక్ష్, ఆస్ పాస్,జనసత్తా, సహారా సమయ్, పబ్లిక్ ఎజెండా లాంటి అనేక పత్రికల్లో పనిచేశారాయన. భోపాల్ లోని భారత్ భవన్ పత్రిక  పూర్వగ్రహ్ కు సంపాదకత్వం వహించారు. 2000లో ఆయన కు కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం కూడా లభించింది. ఏమి చేసినా కవిత్వమంటే ఆయన ప్రాణం ఇచ్చేవారు. ఘర్ ఏక్ రాస్తా, హమ్ జో దేఖ్తీ హై,ఆవాజ్ భీ ఏక్ జగా హై, ముఝే దిఖా ఏక్ మనుష్య్  మొదలైన అనేక కవితాసంపుటాల్ని వెలువరించారు. బ్రెహ్ట్, నెరూడాలను హిందీ పాఠకులకు పరిచయం చేశారు. చివరగా అరుంధతి రాయ్ రచించిన ‘ద మినిస్ట్రీ ఆఫ్ అట్ మోస్ట్ హ్యాపీనెస్’ ను హిందీలో అనువదించారు.

“నేనో గులకరాయిలా పర్వతాల్ని తప్పించుకుని నాకు చోటు దొరికిన నగరాల్లో పడ్డాను. నేను ఏ చోటుకీ చెందని వాడినని నాకు కొన్నిసార్లు అనిపిస్తుంది. నేను పుట్టిన ఊరు స్థానికతా నాలో లేదు. ఢిల్లీ లాంటి మహానగరం కూడా నాది చేసుకోలేకపోయాను. ఒక రకంగా నేను ఎక్కడా స్థిరపడలేని శరణార్థిని. ఏదో ఉద్వేగం ఎప్పుడూ నాలో.. నేను పుట్టిన ప్రాంతపు జ్ఞాపకాలు, పట్టణ అనుభవాల మధ్య కొట్టుమిట్టాడుతూ.. బెర్టోల్డ్ బ్రెహ్ట్ అన్నట్లు పర్వతాల బాధలు మన వెనుక ఉన్నాయి. మైదానాల వేదనలు మన ముందున్నాయి. బహుశా నా కవితలు పర్వతాలు, నగర మైదానపు ఉద్వేగ శూన్యంలో జన్మించాయేమో…”అన్నారు ఆయన.

ఈ నంబర్ మనుగడలో లేదు

నేనెక్కడికివెళ్లినా,ఏ నంబర్ నేను డయల్ చేసినా

మరో వైపు నుంచి ఒక విచిత్రమైన స్వరం వినిపిస్తుంది

ఈ నంబర్ మనుగడలో లేదు..అని

ఇదే నంబర్ లోనేను కొద్ది కాలం క్రితం వరకూ

జనాన్నిచేరుకునేవాడిని

అని ఆయన అవతలి వైపు నెలకొన్న శూన్యాన్ని చూసి వాపోయేవారు.

నిద్రపోయే ముందు

నేను నా పుస్తకాల్ని మూస్తాను

వాటిలో చెట్లూ, పర్వతాలూ,

ఇళ్లూ,మనుషులూ

తెలుపు,నలుపు నిస్పృహల్లో

కూరుకుపోతాయి

ప్రేమ ఒక శిథిలమైన

పిట్టగూడులా కనిపిస్తుంది

..

నిద్ర పోయే ముందు అంటాను

నిదురా, నాకో మంచి స్వప్నం ఇవ్వు.. అని!

మంగ్లేష్ దబ్రాల్ కవితావస్తువులు అతి సామాన్యమైనవి.  మూత్ర శాలల వద్ద, బస్సుస్టాపుల వద్ద అంటించిన పోస్టర్లలో ఇంటి నుంచి మాయమైన వ్యక్తుల్నిఆయన పరికించి చూస్తారు. పోస్టర్ల లో ప్రకటించిన  అదృశ్యమైన వ్యక్తుల రూపురేఖల్ని,రంగునీ, పుట్టుమచ్చల్నీ వర్ణిస్తారు. అదృశ్యమైన వ్యక్తి కోసం తల్లి రోదిస్తున్న దృశ్యాలూ ఆయన మనసులో దూరకుండా ఉండవు.

కిటికీ ఊచలనుంచి తొంగి చూసే లాంతరు  కాంతి పచ్చటి పుష్పాల్లా ఆయనకు గోచరిస్తుంది.  హార్మోనియం నుంచి వచ్చే రాగాలు గడ్డిమోపులు, వంటచెరుకును మోసుకుంటూ ఇంటికి తిరిగి వచ్చే  స్త్రీల అడుగుల ధ్వనితో పాటు మేఘాల్లా తేలిపోతుంటాయి. ఎందరో జనం ఊపిరి తో నిర్మించిన పాత ఇళ్లను ఆయన గుర్తు చేసుకుంటారు. తిరిగి వచ్చిన ప్రతి సారీ ఆయనకు గత చరిత్ర శిథిలాల్లో అడుగుపెట్టినట్లనిస్తుంది. గత చలికాలాన్ని తలుచుకుని ఆయన ఈ చలికాలం రాకముందే వణికిపోతాడు.

కొన్ని సజీవ దగ్ధ దృశ్యాల్నికూడా మంగ్లేష్ దబ్రాల్ చూస్తాడు. అప్పుడు ఆయన కవితలు హృదయవిదారక దృశ్యాల మధ్య నిలువెల్లా కాలిపోతున్నట్లు కనిపిస్తాయి. ‘గుజరాత్ లో మరణించిన వాడి వాంగ్మూలం’ అనే కవిత చదవండి.

ఇంతకు ముందు కూడా

నేను కొంచెం చనిపోయి ఉండవచ్చు

చిన్నతనం నుంచీ నేను

జీవిస్తూ,మరణిస్తూనే ఉన్నాను

జీవితం మనుగడ సాధించేందుకు

నిరంతర అన్వేషణ

నన్ను ధగ్దం చేసి చంపినప్పుడు

అగ్నిని అలా ఉపయోగిస్తారని

కూడా నాకు తెలియదు

నేను వస్త్రాలకు రంగులద్దేవాడిని

విరిగిపోయిన వస్తువులను

మరమ్మతులు చేసేవాడిని

చెక్కతో రంగులరాట్నాలనీ

గర్భా నృత్యపు డాండియాలనూ

చేసేవాడిని

అల్యూమినియం తీగలతో

పిల్లలకు  చిన్న చిన్న సైకిళ్లనూ

తయారు చేసే వాడిని

అందుకు బదులుగా చెప్పుల జతో

ఒక  లుంగీయో వచ్చేవి

పేదరికం దినాల్లో రోజంతా ధరించి

రాత్రి దాన్ని కప్పుకునేవాడిని

నా భార్యకూ సగంవాటా ఇచ్చే వాడిని

 

నేను అగ్నికి ఆహుతి కావడానికి ముందే

ఆమె కు నిప్పంటించి చంపారు

నన్నుకాపాడేందుకు

నా ముందు నిలబడింది కదా..

నా పిల్లలను చంపిన విషయం కూడా నాకు తెలియదు

వారెంత పసిపిల్లలంటే

వారి అరుపులు కూడా వినబడలేదు.

నా చేతుల్లోని వృత్తి నైపుణ్యానికి

ఏమయిందో నాకు తెలియదు

నా చేతులకేమయ్యాయో కూడా తెలియదు

అవిప్పుడు మాడిపోయిన దేహానికి

అంటుకున్న అస్థికలు.

ఎంతో మందిని ఒకేసారి చంపినట్లు

నన్ను చంపారు.

నేను బతకడం వల్ల పెద్ద ప్రయోజనం లేదు

కాని నన్ను చంపడమే ప్రయోజనం అనుకుని

చంపారు

నీ వెవరు?

శత్రువు పేరును నీలో దాచుకున్నావా?

నీ మతమేది?

నీ తావీదు ఏది?

అంటే ఏం చెప్పగలను

నాలో ఏదీలేదు

ఒక కలంకారీ తప్ప

ఒక మెకానిక్ తప్ప

ఒక హస్త కళాకారుడు తప్ప!

..

నన్నిప్పుడు చంపారు కనుక

మరణించిన మానవత్వంలో

కనిపెట్టారు కనుక

జీవించిన మనుష్యులకంటే

ఎక్కువ వాస్తవాన్నిచెప్పగలను

మరింత స్పందించగలను

మీ అనాగరిక జీవన ప్రపంచంలోకి

తిరిగి రానన్నందుకు

నన్ను ఇంకా చంపకండి

కాల్చకండి

నేనిప్పుడు మానవ ఆకారాన్ని

చెరిగిపోయిన ముఖాన్ని

మరణించిన పేరును

 

నీవు భయాశ్చర్యాలతో

నా వైపు చూస్తూ

ఏమి గుర్తించాలని

ప్రయత్నిస్తున్నావు?

నాలో నీ పిల్లా పాపల్నెవరినైనా

చూస్తున్నావా?

నీ మిత్రుడినో,పరిచయస్తుడినో

లేక నిన్నే చూస్తున్నావా?

నీ ముఖంలోకి తిరిగి వస్తున్న

మరే ముఖాన్ని చూస్తున్నావా?

మంగ్లేష్ దభ్రాల్ ఆరు దశాబ్దాలకు ముందు మంచుకొండల ప్రాంతం నుంచి  దేశ రాజధాని వచ్చి అమృతకాలంలో బతికి మృత్యువు విలయ భీభత్సాన్ని చూస్తూ మండిపోతూ సెలవు తీసుకున్నాడు.మూడు దశాబ్దాల క్రితం పాలమూరు,వరంగల్,హైదరాబాద్ గుండా దేశ రాజధానిలో ప్రవేశించిన నేను కుప్పకూలిపోతున్నదేహాల మధ్య, బూడిదల్లా రాలుతున్నస్వప్నాల మధ్య, నిరంతరం ప్రకంపిస్తున్న వాతావరణం మధ్య  నిప్పుల రహదారిలో ఎంతకాలం  కొనసాగాలో?

*

కృష్ణుడు

వారం వారం ఆంధ్రజ్యోతి దినపత్రికలో ఢిల్లీ నుంచి కాలమ్ రాసే ఎ. కృష్ణారావు, అడపా దడపా కవితలు రాసే కృష్ణుడూ ఒకరే. జర్నలిస్టుగా 34 సంవత్సరాల అనుభవం ఉన్న కృష్ణుడు కవి, సాహితీ విమర్శకుడు కూడా. ఇండియాగేట్, నడుస్తున్న హీన చరిత్ర పేరుతో రాజకీయ వ్యాసాల సంకలనాలు వెలువరించిన కృష్ణుడు ఇంకెవరు, ఉన్నట్లుండి, ఆకాశం కోల్పోయిన పక్షి అనే కవితా సంకలనాలను వెలువరించారు.

6 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • చాలా గొప్పగారాసారు కృష్ణుడు గారు. మంగ్లేష్ దబ్రాల్ అనే ఉత్తరాఖండ్ కవిని.

    “మంగ్లేష్ దభ్రాల్ ఆరు దశాబ్దాలకు ముందు మంచుకొండల ప్రాంతం నుంచి దేశ రాజధాని వచ్చి అమృతకాలంలో బతికి మృత్యువు విలయ భీభత్సాన్ని చూస్తూ మండిపోతూ సెలవు తీసుకున్నాడు.మూడు దశాబ్దాల క్రితం పాలమూరు,వరంగల్,హైదరాబాద్ గుండా దేశ రాజధానిలో ప్రవేశించిన నేను కుప్పకూలిపోతున్నదేహాల మధ్య, బూడిదల్లా రాలుతున్నస్వప్నాల మధ్య, నిరంతరం ప్రకంపిస్తున్న వాతావరణం మధ్య నిప్పుల రహదారిలో ఎంతకాలం కొనసాగాలో?” అంటూ హ్రుదాంతంగా ముగించారు

  • కృష్ణుడు గారు చల అద్భుతంగా ఉత్తరాఖండ్ కవి మంగ్లేష్ దబ్రాల్ ని పరిచయం చేసారు.

    మంగ్లేష్ దభ్రాల్ ఆరు దశాబ్దాలకు ముందు మంచుకొండల ప్రాంతం నుంచి దేశ రాజధాని వచ్చి అమృతకాలంలో బతికి మృత్యువు విలయ భీభత్సాన్ని చూస్తూ మండిపోతూ సెలవు తీసుకున్నాడు.మూడు దశాబ్దాల క్రితం పాలమూరు,వరంగల్,హైదరాబాద్ గుండా దేశ రాజధానిలో ప్రవేశించిన నేను కుప్పకూలిపోతున్నదేహాల మధ్య, బూడిదల్లా రాలుతున్నస్వప్నాల మధ్య, నిరంతరం ప్రకంపిస్తున్న వాతావరణం మధ్య నిప్పుల రహదారిలో ఎంతకాలం కొనసాగాలో? అంటూ కదిలించేలా ముగించారు

      • Sir I am honored by liking your Krishnapaksham series and different write ups. Many people might have translated ఉత్తరాఖండ్ కవి మంగ్లేష్ దబ్రాల్ kavitalu. your pen gives that oneness feeling.

  • మంగ్లేష్ డబ్రాల్ కవితలు చాలా అనువదించాను. నా ఫేస్బుక్ వాల్ పై. చాలా శక్తిమంతమైన కవితలు ఆయనవి. కొండ ప్రాంతం ప్రజల గళం దేశానికి వినిపించిన కవి.

  • మంగ్లేష్ దభ్రాల్ గూర్చి చాల చక్కగా పరిచయం చేశారు. అయన కవితలు ఆలోచనాత్మకంగా ఉన్నాయి. మీకు హృదయపూర్వక అభినందనలు.

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు