మంగలేశ్ దబ్రాల్…ఇష్టమైన యాది!

ఈ మధ్య కాలంలో తెలుగువాళ్ళకి ఇంత దగ్గిరగా వచ్చిన మరో హిందీ కవి లేరంటే అతిశయోక్తి కాదు!

మంగలేశ్ దబ్రాల్ గారు.. వారి కవితల ద్వారానే ముందు నాకు పరిచయం. హిందీ చదవటం వచ్చిఉండటం వల్ల ఆయన కవిత్వాన్ని నేరుగా చదివి ఆస్వాదించే అవకాశం దక్కింది.

మంగలేశ్ దబ్రాల్ హిందీ కవి. ఆయన పాత్రికేయుడుగా పనిచేసారు. పది వరకు కవిత్వం సంకలనాలు అలాగే వచన సాహిత్యం మీద  పుస్తకాలు వెలువరించారు. 2000 సంవత్సరంలో ఆయన రాసిన ” హం జో దేక్ తే హై ” అనే కవిత్వ పుస్తకానికి గాను ఆయన కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డ్ అందుకున్నారు.

2017 ఏప్రిల్ నెలలో ఆయనతో face book messenger లో మొదటి సారి మాట్లాడాను. ఎంతో ప్రోత్సాహాన్నిస్తూ మాట్లాడతారు ఆయన ప్రతి మాట ఆచి తూచి. హైదరాబాద్లో జరిగే ” కవిత ” అనే వేదికపై తన కవిత్వం చదవటానికి వస్తున్నట్టు చెప్పారు కానీ రాలేక పోయారు. అలా అప్పట్లో ఆయన్ని కలవటం కుదరలేదు. అప్పటికే ఆయన హిందీ కవితనొకదాన్ని “మంచు జ్వరం” పేరుతో తెలుగులోకి అనువాదం చేసాను. చాలా సంతోషపడ్డారాయన. ఆ తర్వాత 2018 లో ఒకసారి కలవాల్సి ఉండి కలవలేకపోయాను. 2019లో Gateway literary festival జరిగింది ముంబైలో. మంగలేశ్ సర్ కూడా అందులో అతిధి ఇంకా ప్యానెలిస్ట్ . మాకు విడిది ఏర్పాటు చేసిన హోటల్ లో ఉదయాన్నే బ్రేక్ ఫాస్ట్ కోసం కూచున్నాం అందరం. అప్పటికే సుభోద్ సర్కార్, అడూర్ గోపాల్ కృష్ణన్ సర్, ప్రతిభా రే మాతో టేబుల్ షేర్ చేసుకున్నారు. మంగలేశ్ దబ్రాల్ సర్ కూడా వచ్చి మాతో చేరారు. నన్ను నేను ఆయనకి పరిచయం చేసుకున్నాను. ఆయన వెంటనే గుర్తుపట్టారు. అలా ఆ రెండు రోజులు Gateway literary festival లో చాలా విషయాలు కవిత్వం గురించి, రాజకీయాల గురించి మాట్లాడుకున్నాం.

2019 లో ఆయన తెలంగాణ సాహితీ వాళ్ళు నిర్వహించిన సాహిత్య పండగకి హాజరు అవటానికి హైదరాబాద్ కూడా వచ్చారు. హైదరాబాద్ వస్తున్నట్టు నాకు మెసేజ్ చేశారు. ఆయన విడిది చేసిన హోటల్ కెళ్ళికలిశాను. చాలా సేపు మాట్లాడారు. చాలా విషయాలు మాట్లాడారు. నాకోసం ఆయన కవిత్వ పుస్తకాలు రెండు తెచ్చారు. అవి నాకు బహుమతిగా ఇచ్చి వాటిని అనువాదం చేయమన్నారు. నేను చాలా సంతోషంగా వాటిని స్వీకరించి సరే అన్నాను.

నాకు చాల చాలా ఇష్టమైన కవి ఈ కరోనా బారిన పడి ఇలా చివరి సంతకం చేసి వెళ్లి పోతారని అనుకోలేదు. ఆయన లేని లోటు చాలా పెద్దది. మతోన్మాదరాజకీయాలు పెట్రేగిపోతున్న ఈ కాలంలో ఆయన తన కవిత్వం ద్వారా చాలా సున్నితంగా సూటిగా ప్రశ్నిస్తూ కవిత్వం రాసిన తీరు నాకు చాలా నచ్చుతుంది. అంత బాధ్యతగా కవిత్వం ఎందుకు రాయాలో చెప్పే ఒక తరం మెల్లిగా మాయం అవుతుంటే భయం కూడా వేస్తుంది. నేను ఆయన్ని జ్ఞాపకం చేసుకుంటూ హిందీ నుంచి తెలుగులోకి అనువాదం చేసిన ఆయన కవితలు కొన్ని.

1

తల్లి చిత్రం

ఇంట్లో

మా అమ్మది ఒక్క చిత్రంకూడా లేదు

 

ఛాయాచిత్రాలు తీసుకునే అవకాశం వచ్చినప్పుడు కూడా

ఇంట్లో కోల్పోయిన

ఏవో వస్తువుల కోసం వెతుకుతూ ఉండేది అమ్మ లేదా

గడ్డీ, నీరూ ఇంకా కలప తేవడానికి వెళ్లుండేది

 

ఒక సారి అమ్మకి అడవిలో పులి కనిపించింది

అయినా అమ్మ భయపడలేదు

పులిని తరిమేసి

గడ్డి కోసి, కలపకొట్టి

ఇంటికొచ్చి పొయ్యివెలిగించి వంటవండి

ప్రతి ఒక్కరికీ వడ్డించింది

 

గడ్డీ, కలప తేవడానికి

నేను ఎప్పుడూ అడవులకు వెళ్ళలేదు

ఎప్పుడూ కలపని కొట్టి మంటరాజేసి

పొయ్యి వెలిగించలేదు

కానీ మా ఇంట్లో తరతరాలుగా ఉన్న

అందంగా చెక్కిన పాతకుర్చీపై కూర్చుని ఉన్నాను

అందులో కూర్చుని కొన్నేళ్ల నుంచి

మా వాళ్ళు ఫోటోలు దిగుతున్నారు

 

ఇప్పుడు నేను

నా తల్లి ముఖాన్ని గుర్తుచేసుకుంటుంటే

అడవీ

కలప

గడ్డీ

నీరూ లాంటి వాటితో పాటు

తప్పిపోయిన ఏదో వస్తువు కనిపిస్తుంటుంది

2

అమ్మ నమస్కారం

 

అమ్మ వృద్ధాప్యంలోకి అడుగిడి

యేళ్లు గడుస్తున్నప్పుడు

వచ్చీపోయే బంధువులందరికీ

చేతులు జోడించి నమస్కారం పెట్టేది

 

తానో పసిపాపైనట్టు

పరామర్శించటానికి వచ్చిన వాళ్లు తనకన్నా పెద్దవాళ్ళైనట్టు

బంధువులకు నమస్కారంచేసి

ఆవిడ అనేది

-” రండి రండి కూర్చోండి, యేదైనా తీసుకుని తినండి”..

 

వచ్చిన వాళ్ళు మొహమాటానికైనా ఫలహారాన్ని చేతపట్టుకొని

ఆమె పక్కన కూర్చునే వాళ్లు

ఆమె చిన్నపాపలా సంతోషించేది

వాళ్లు వెళ్లేప్పుడు మళ్ళీ వాళ్లకు నమస్కారం చేసేది

 

నిజానికామె వయసుకు

ఆమె నమస్కారం చేయాల్సిన అవసరమే లేదు

అప్పుడప్పుడు ఆమె ఒకత్తే ఉన్నప్పుడు

భూమికీ నమస్కారం చేసేది

 

ఆమె చివరి దినాల్లో

మృత్యువు ఆమెను సమీపించినప్పుడు

ఆమె మృత్యువుకూ నమస్కరించి ఉంటుంది

తన జీవనాన్ని మృత్యువుకు అప్పగిస్తూ అనుంటుంది

-“రండి రండి కూర్చోండి,

యేమైనా తినడానికి తేనా అని”

3

 ఇల్లు ప్రశాంతంగా ఉంది

 

మెళ్లి మెళ్లిగా ఎండ

ఇంటిగోడల్ని వేడెక్కిస్తుంది

 

ఇంటి పరిసరాల్లో

సన్నటి నిప్పుల కుంపటి రగులుతున్నది

 

మంచంపై ఓ బంతి పడుతుంది

అరల్లో పెద్ద కళ్లేసుకుని చూస్తున్న పుస్తకాలు

వాటిలో ఎంతో నిశ్శబ్దాన్ని దాచుకున్నాయి

 

నేను సగం మెలుకువ సగం నిద్రతో ఉన్నాను

అవును సగం నిద్రతో సగం మెలుకువతో ఉన్నాను

 

బయటి నుంచి వస్తున్న శబ్దాల్లో

ఎవరి రోదన వినబడ్డం లేదు

ఎవరి బెదిరింపులూ భయపెట్టే గొంతులేదు

ఆ శబ్దాల్లో ఎవరి ప్రార్థన లేకపోగా

ఏ అడుక్కునే వాడి శబ్దమూ వినబడ్డంలేదు

 

నా లోపల ఏ కోశాన కొద్దిగానైనా చెడుతనంలేదు

కాకపోతే కొంచెం ఖాళీ స్థలం ఉంది

అక్కడ ఎవరో ఒకరికి అనిపించొచ్చు

ఈ క్షణం నేనేమి నిస్సహాయుడిని కాను

కానీ అగోచరమైన వేదనతో మాత్రం నిండుకొని ఉన్నాను

 

నాకిప్పుడు నా చిన్ననాటి ఇల్లు ఙ్ఞాపకం వస్తుంది

ఆ ఇంటి ఆవరణలో బోర్లా పడుకుని

నా వీపుపై ఎండని మోసేవాణ్ని

ఈ ప్రపంచాన్ని నేనేమీ కోరడంలేదు

అక్కడ పడున్న బంతిలాగానో , చిన్న ఉడతలానో

లేక గడ్డిపోచల్లానో

ఏ చింతాలేకుండ నేను బ్రతికేయొచ్చు

అవును ప్రశాంతంగా బ్రతికేయొచ్చు

 

కానీ ఎవరికి తెలుసు

ఎప్పుడు

ఏ నిమిషాన

ఈ ఇంటిని కదిలించి పడదోస్తారో

ప్రశాంతంగా ఉన్న ఈ ఇల్లు కూడా

ఎప్పుడు కూలుతుందో?

4

మంచు జ్వరం

 

చిన్నప్పుడెప్పుడైనా నాకు జ్వరం వస్తే

అమ్మ అనేది

– “చూస్తూ ఉండు నాన్న ఇంకొద్ది సేపట్లో మంచుకురుస్తుంది”

 

అమ్మ మాటలెప్పుడూ నిజమయ్యేవి

అమ్మకి మాటల్ని తిరగేసి చెప్పటం అస్సలురాదు

 

జ్వరంతో కాలుతున్న నా ఒంటిపై

నేను కప్పుకున్న కంబళిని లాగేసి

నాన్న ఓ చేదు కషాయాన్ని నా కోసం చేసి

బలవంతంగా తాగిస్తూ అనేవాడు

-“ఇప్పుడు దుప్పటి కాదు నీ వొళ్లంతా చెమటలు పట్టాలి”

 

నాన్న లేనప్పుడు

నేను కిటికీ దగ్గరకెళ్లి

బయట పాలమీగడలా కురిసే మంచును చూసేవాణ్ని

 

అంతలో నా జబ్బపట్టి లాగి ఈడ్చుకెళ్లి

నన్ను కంబళి కిందకు నెట్టేవాడు నాన్న

 

కిటికీ దగ్గర లేకున్నా నాకు తెలుసు

కొందరు పిల్లవాళ్లు ఆ మంచులో తడుస్తూ ఆడుతుంటారు

మంచుని చిన్న చిన్న బంతులుగా చేసి ఒకరిపైకొకరు

విసురుకుంటుంటారు

 

నాకు బాగా గుర్తు

మా ఊళ్లో మంచుకేవలం రెండురోజులే కురిసేది

ఆ రెండురోజులూ నాకు జ్వరం ఉండేది

రెండు రోజుల్లో నా జ్వరం తగ్గాక బయటికొస్తే

మంచుకురవడం ఆగిపోయి మంచుకరిగిపోయుండేది

 

ఇప్పుడప్పుడైనా జ్వరం వస్తే

బయట చూడాల్సిన పనిలేదు

మంచుకురవడం ఎప్పుడో ఆగిపోయింది

అప్పుడనిపిస్తుంది

-” అమ్మ ఉంటే బాగుండు జ్వరం రాగానే అనేది

చూడు బయట మంచుపడుతుందని”

 

5

 ఒక జీవితం కోసం

 

బహుశా అక్కడ

చిత్తడి చిత్తడిగా కొంత తేమ ఉండిందేమో

లేదా తేలికపాటి కొంత రంగు

లేదూ చిగురుపాటి వణుకో లేక ఆశో

 

బహుశా అక్కడ ఓ కన్నీటి చుక్క ఉన్నట్టుంది

లేదా ఒక చిన్న ముద్దు

 

ఙ్ఞాపకంగా మారడానికే అన్నట్టు

అక్కడ మంచు పడ్డట్టున్నది

లేదా ఒక పసిప్రాయపు హస్తం

లేదూ స్పృశించడానికి జరిగిన ప్రయత్నం

 

బహుశా అక్కడ చీకటి ఉందేమో

లేదా ఓ ఖాళీ మైదానం

అదీ లేక నిలబడ్డానికి అనువుగా కొంత స్థలం

 

బహుశా అక్కడ

ఓ మనిషి ఉండేవాడనుకుంటా

అతనికి తెలిసిన పద్ధతిలో అతడు

యుద్ధం చేస్తూ

*

మెర్సీ మార్గరెట్

6 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • అమ్మ జ్ఞాపకాలను అక్షర రూపంలో పదిలంగా పొందుపరిచారు…

    పసి ప్రాయం గుర్తులు గుర్తు చేసారు
    ఆ గడిచిన మధుర క్షణాలు గుర్తు చేసుకుంటూ తన్మయత్వం లో ఉన్న

    చాలా హృద్యంగా వర్ణించారు ధన్యవాదాలు

  • ఆయన కవిత్వం చాలా సరళంగా, సూటిగా మనసులోకి దూసుకుపోతుంది. నేనూ ఆయన కవిత ఒకటి అనువదించి ఆయనకు నివాళిగా ఫేస్ బుక్ లో సమర్పించాను. మీ అనువాదాలు హృద్యంగా వున్నాయి.

  • Very nice information about Manglesh Dabtal and his poems or kavitas are very good
    Credit goes to Mersy for her excellent translation

  • అక్క గొప్ప కవిని , కవితో మీ అనుబంధాన్ని చక్కగా అందించారు..కవితలు చాలా చాలా నచ్చాయి..

  • అద్భుతమైనకవి పరిచయం అద్భుత కవిత్వం… అభినందనలు

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు