భార్యామణి నవ్వు  

రాత్రి తొమ్మిదిగంటల సమయం.   మయూరి బార్ అండ్ రెస్తారెంట్లో కూర్చొని ఉన్నాడు మహేష్ తన స్నేహితులతో. మందంగా వెలుగుతున్న లైట్లూ, మంద్రంగా వినిపిస్తున్న పాశ్చాత్యసంగీతం, చల్లటి వాతావరణం. నగరంలో అత్యంత ఖరీదైన బార్లలో ఒకటేమో, ఎక్కడా ఒక్కమాటకూడా గట్టిగా వినిపించడంలేదు.  నిశ్శబ్దంగా, నియమబద్దంగా ఉంది లోపటి వాతావరణం.

వాళ్ళు నలుగురూ ప్రాణస్నేహితులు. యూనివర్సిటీలో కలిసి చదువుకోవడమేకాక, పోటీ పరీక్షలు కూడా కలిసి ప్రిపేరై రాసారు. నలుగురూ  నాలుగు బేంకుల్లో ఆఫీసర్లుగా సెలెక్టయ్యి, ఉద్యోగరీతా దేశం నలుదిక్కులా చెదిరిపోయినా, స్నేహాన్ని మాత్రం పదిలంగా కాపాడుకుంటూ వస్తున్నారు ఇన్నాళ్ళూ.

అంతటి  ప్రాణస్నేహితులకి ఇంచుమించు ఒకే సమయంలో తాము చదువుకున్నఊరికే  బదిలీ కావడంతో వారి ఆనందానికి అంతులేకుండా పోయింది.  “మహా అయితే  మూడేళ్ళుంటాం ఇక్కడ. తరవాత మళ్ళీ ఎవరిదారిన వారు వెళ్ళిపోవలసినదే. సో…..ఈ మూడుసంవత్సరాలూ యూనివర్సిటీలో ఉన్నప్పటిలా బాగా ఎంజాయ్ చేద్దాం” అని ఒట్టేసుకున్నారు నలుగురూ.

దానిలో భాగంగా,  కనీసం నెలకొకసారి ఏదైనా ‘క్వయట్ అండ్ డీసెంట్ స్పాట్’లో కలుసుకొని,   ‘సరదాగా’ గడపాలని నిర్ణయించుకున్నారు.

“మీరు మాత్రమే, అదికూడా ‘క్వయట్ ఎండ్ డీసెంట్ స్పాట్లో’… అంత అవసరమా” అంటూ సన్నాయినొక్కులు నొక్కిన సహధర్మచారిణులని “వియ్ షుడ్ హావ్ సమ్ స్పేస్ ఓన్లీ ఫర్ అవర్సెల్వ్స్ యూ సీ. కైండ్లీ అండర్స్టాండ్” అని బ్రతిమాలి ఒప్పించేరు. అనుకున్నట్టు నెలకొకసారైనా కలవడం ‘రెలిజియస్’గా అమలు చేస్తున్నారు.

కాకపోతే ఈనాటి వారి కలయికకి ముఖ్యమైన కారణం వేరే ఉంది.   తమలో ఒకడైన మహేష్ అసిస్టెంట్ జెనరల్ మేనేజర్ గా పదోన్నతి సాధించడమే…ఆ కారణం.   తమ నలుగురిలో ఒకడికి  ప్రమోషన్ రావడం  తమకే వచ్చినంత  సంతోషంగా  ఉన్నారు మిగిలిన ముగ్గురూ. ఆ ఆనందాన్ని అక్కడ కలిసి పంచుకుంటున్నారు.

అప్పటికే రెండు పెగ్గుల “బ్లేక్ డాగ్ ట్రిపుల్ గోల్డ్“ విస్కీ గొంతులోకి జారిందేమో హుషారు స్థాయి ఎక్కువగానే ఉంది  స్నేహితుల్లో. ప్రపంచంలో జరుగుతున్న ప్రతీవిషయం వాళ్ళ కబుర్లలో సునాయాసంగా దొర్లిపోతోంది.  మధ్యమధ్యలో  యూనివర్సిటీలో వారితో కలిసిచదువుకున్న అమ్మాయిల కబుర్లుకూడా. “ఇంకా అమ్మాయిలేంట్రా మాఁవా. వాళ్ళింకా అప్పటిలాగే ఉంటారనుకుంటున్నావా లేతగా, నాజూగ్గా సన్నజాజి మొగ్గల్లా? మనం పొట్టలు పెంచుకొని అంకుల్స్ అయిపోలేదూ, అలాగే వాళ్ళందరూ ఆంటీలైపోయుంటారీపాటికి” అన్నాడు మహేశ్ గట్టిగా నవ్వుతూ.

ఇంతలో సడన్ గా, “అన్నట్టు చెప్పడం మరచిపోయానూ, పోయిన వారం నీ ‘మోనాలిసా’    కనిపించిందిరా మాఁవాఁ” అన్నాడు నలుగురిలో ఒకడైన సురేంద్ర మహేశ్ తో.

కుర్చీలో కాళ్ళు బారజాపుకొని, జారబడికూర్చొని, డ్రింక్ సిప్ చేస్తున్న మహేశ్, ఒక్క ఉదుటున నిటారుగా లేచి కూర్చున్నాడు.

“ఇంద్రాణీ కనిపించిందా? ఎప్పుడు? ఎక్కడ? ఎక్కడుంటుందట? ఇక్కడికెప్పుడొచ్చిందట? ఆ నవ్వు ఇప్పటికీ అలాగే ఉందా?” ప్రశ్నలవర్షం  గుప్పించాడు ఆతృతగా.

“రెండునెలలైందట మాఁవా ఇక్కడికి వచ్చి. సీతమ్మధారలో  ఉంటోందట. ఇక తన నవ్వంటావా అలాక్కాక ఇంకెలా ఉంటుందిరా” తిరిగి ప్రశ్నించాడు సురేశ్

”నా గురించి అడిగిందా మాఁవా” అడిగాడు మహేశ్ జాలిగా.

“ఎందుకడగదూ;  అడిగింది.  నీగురించి అడుగుతున్నప్పుడు మాత్రం ఆపిల్ల కిందిపెదవి చిగురుటాకులా వజవజా వణికింది మావాఁ. కళ్ళనుండి ముత్యాల్లాంటి కన్నీటిచుక్కలు జలజలా నేలరాలాయిరా. అది చూసి రక్తకన్నీరు కార్చేనంటే నమ్ము” అన్నాడు సురేంద్ర నాటకీయంగా.

కడుపులో స్కాచ్  తనప్రభావాన్ని చూపించడం అప్పటికే మొదలైందేమో, మిగిలిన స్నేహితులిద్దరూ పడిపడీ నవ్వారా జోకుకి.  దానితో బార్లో కూర్చున్న మిగిలిన కస్టమర్లు వీళ్ళవేపు కాస్తంత  విస్తుగ్గా చూడడంతో  సర్దుక్కూర్చున్నారు.

“కుళ్ళుజోకులు చాలుగాని, ఎప్పుడో వారంరోజుల క్రితం కనిపిస్తే ఇప్పుడటరా చెప్పేది స్కౌండ్రల్“ విసుక్కున్నాడు మహేశ్.

“వెంటనే చెప్పేవాడినే మాఁవా. ఎందుకు చెప్పలేదంటే… వాళ్ళాయన ఇక్కడ టూటౌన్ సర్కిలినస్పెక్టరట. ఇంద్రాణీ ఇక్కడుందని తెలిసేక  నువ్వు  వాళ్ళింటి చుట్టూ… ఆరోజుల్లో మహారాణీపేట హాస్టల్ చుట్టూ తిరిగీవాడివి చూడూ… అలా తిరగడం మొదలెట్టేవనుకో, వాళ్ళాయన కొట్లోనూ, మీఆవిడ ఇంట్లోనూ,  పడేసి నిన్ను ఉతికేస్తారన్న భయంతో  చెప్పలేదురా.” అన్నాడు మళ్ళీ గట్టిగా నవ్వుతూ.

”రాస్కెల్స్ నాసొమ్ముతో ఉల్ఫాగా మందుతాగుతూ నాకే తాటాకులు కడతార్రా.  బిల్లు నేను పే చెయ్యను. ఎలా చస్తారో చావండి” అన్నాడు మహేశ్ తెచ్చిపెట్టుకున్న కోపంతో.

తెప్పించిన ఫుల్ బాటిల్ ఖాళీ అయిపోయింది. కాస్ట్లీ స్కాచేమో,  కిక్కు సున్నితంగా, నెమ్మదిగా నసాళానికెక్కుతోంది. వెలుగుతున్న లైట్లూ, ఖాళీ అయిన గ్లాసులూ,   ఒక్కొక్కటీ రెండుగా కనిపించడం మొదలెట్టాయి.

మిత్రులకి అర్దమైంది అప్పర్ లిమిట్ కి చేరువవుతున్నామనీ, ఇళ్ళకు చేరే సమయం ఆసన్నమైందనీ. దానితో తినడానికి ఫూడ్ ఆర్డర్ చేసారు. అరగంట తరవాత  బేరర్ సర్వ్ చేసిన  పుల్కా, ఖీమా ప్రై తీరికగా ఆరగించారు.  ఆపైన  ఇంకొక అరగంటసేపు పిచ్చాపాటీ కబుర్లు చెప్పుకొని,   అవి కూడా  పూర్తయ్యాక…

“స్టీవార్డ్, బ్రింగ్ ద చెక్“  అంటూ కేకేసాడు మహేష్ దర్పంగా.

బిల్లూ, దానితో పాటూ  స్వైపింగ్ మెషీనూ తీసుకొచ్చిన  స్టీవర్డ్ “సిక్స్ థౌజెండ్ ఫోర్ హండ్రెడ్ సర్. టిప్ ఏమైనా ఏడ్ చెయ్యమంటారా” అని అడిగాడు వినయంగా, మహేష్ దగ్గర్నుంచి క్రెడిట్ కార్డ్ అందుకుంటూ.

“యా..యా.. మేకిట్ రౌండ్ సెవెన్ కే యార్.”  అన్నాడు మహేశ్ చేతిని  నిర్లక్ష్యంగా ఊపుతూ.

“థేంక్యూ సర్” అంటూ ఏడువేలకి కార్డు స్వైప్ చేసి, కార్డూ, బిల్లూ చేతిలోపెట్టి, ఆనందంగా  అక్కడ్నుండి వెళ్ళిపోయాడు స్టీవార్డ్.

స్నేహితులు  ఎవరింటికి వారు చేరుకునేటప్పటికి అర్దరాత్రి పన్నెండు దాటింది.

–00–

మహేశ్ నిద్రలేచేటప్పటికి ఉదయం తొమ్మిదయింది. తల భారంగా అనిపిస్తుంటే కప్పు ‘బ్లేక్ కాఫీ’ తాగి, ఆదివారం కావడంతో,  పేపర్ చూస్తూ కూర్చున్నాడు.

ఇంతలో వాళ్ళ వీధిలో  కాలవలు శుభ్రపరచి,  చెత్త తీసుకెళ్ళే రంగయ్య వచ్చి  నిలబడ్డాడు చేతులుకట్టుకొని.  “చెత్త తీసుకెళ్ళేవాడివి కదూ.  ఏంటిలా వచ్చావ్ ఉదయాన్నే”  చిరాకుగా ప్రశ్నించాడు మహేశ్.

“పండగ డబ్బులేవైనా ఇప్పిత్తారేమోననీ“ సమాధానం ఇచ్చాడు రంగయ్య వినయంగా.

“పండగా ఇప్పుడేం పండగ” అంటూ నొసలు చిట్లించి, “సర్లే ఏదో ఒకపండగ. పండగలకే లోటా మనకి” అని విసుక్కుంటూ “శాంతీ ఒక పాతిక రూపాయలు  తెచ్చి ఈ చెత్తోడికివ్వు. ఏదో పండగంటున్నాడు” అని  కేకవేసాడు గట్టిగా.

“నాను చేసీది ఎవ్వడూ చెయ్యని కచ్చిడాపని బాబయ్యా. కుసింత చూసివ్వండి” విన్నవించుకున్నాడు రంగయ్య చేతులు నలుపుకుంటూ.

“డబ్బులు మాక్కూడా తేరగా రావయ్యా. కష్టపడితేనే వచ్చేది. పండగనీ పబ్బవఁనీ డబ్బులు  బాగానే దండుకుంటారుగాని, పని దగ్గరకు వచ్చేసరికి మాత్రం  సవ్యంగా చేసిచావరు” రెచ్చిపోతున్న మహేశ్ వాక్ప్రవాహానికి అడ్డుకట్ట వేస్తూ…

“ఎంతన్నారూ పాతికా” అని అడిగింది శాంతి.

“పాతిక చాలవట. సణుగుతున్నాడు. ముప్పయ్యివ్వు”  సమాధానమిచ్చాడు  మహేశ్ కోపంగా.

“సరేనండీ” అంటూ బెడ్రూమ్లోనుంచి  బయటకు వచ్చిన శాంతి,  తలుపు బయట నిలబడ్డ రంగయ్యవద్దకు నెమ్మదిగా, చాలా నెమ్మదిగా,  నడుచుకుంటూ వెళ్ళింది. వెళ్ళాక తలతిప్పి మహేశ్ వేపు గమ్మత్తుగా చూసి, పెదాలు విడీవిడకుండా, చిన్ననవ్వొకటి, ‘మోనాలిసా’ నవ్వులా కనీకనబడకుండా నవ్వింది. నవ్వాక…

“ఇదిగో రంగయ్యా,  ఈ మూడువందలూ ఉంచు. పండగనాడు కనిపించు. పిండివంటలు   ఇస్తాను, పిల్లలకి తీసుకెళ్దువుగాని” అంటూ రంగయ్యచేతిలో మూడు వందరూపాయినోట్లు పెట్టింది. తరవాత  మహేశ్ దగ్గరకు నెమ్మదిగా వెళ్ళి, అతని కళ్ళలోకి చూస్తూ, మడిచిన  కాయితంముక్క ఒకటి అతని చేతిలో పెట్టి, మళ్ళీ ఇంకొకసారి, ఇంతకు ముందు నవ్వినట్టే, మిస్టీరియస్ గా నవ్వి,  వచ్చినంత నెమ్మదిగానూ ఇంట్లోకి తిరిగి వెళ్ళిపోయింది.

*****

చెత్తవెధవకి మూడువందలు ధారపోస్తే పోసిందిగాని, తనను చూసి, భార్యామణి ఎందుకలా  నవ్విందో, దాని భావమేమిటో  బోధపడని మహేశ్ బుర్రగోక్కుంటూ  తనచేతిలోని కాయితాన్ని విప్పి చూసి… బుర్రగోక్కోవడం మానేసి… దానిమీదున్న నాలుగు వెంట్రుకలూ పీక్కోవడం మొదలుపెట్టాడు.

ఎందుకంటే…మహేశ్ చేతిలో ఉన్నది… చింపి, డస్ట్ బిన్ లో పారేయకుండా… జేబులో పెట్టుకొని… జాగ్రత్తగా ఇంటికి మోసుకొచ్చిన మయూరి బార్ ఎండ్ రెస్టారెంట్ బిల్ మరి.

*

కృపాకర్ పోతుల

Add comment

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు