భారతమాతాకి జై

సర్లేరా.. ఈ మతాలు, కులాల పట్టింపులేంటి?

గాలి పరదాలను చీలికలు పేలికలు చేస్తూ రైలు దూసుకుపోతోంది.

కిటికీ పక్కన సైడ్ బెర్త్ దొరికినందుకు ఆఖిల్ చాలా హ్యాపీగా ఉన్నాడు. కిటికీల్లోంచి బయటకు చూస్తూ ప్రయాణం చేయడం చాలా ఇష్టం.

ఏదో ఊరు … మేస్తున్న పశువులు, ఆడుకుంటున్న పిల్లలు.. ఊరి వాతావరణం అంటే తనకు చాలా ఇష్టం. పుట్టి పెరిగింది ఊర్లోనే, తర్వాత చదువులకు, పొట్టకూటికి పట్టణాల బాట పట్టినా ఊరు ఎప్పుడు ఒక నోస్టాల్జియా.

చాలా హఠాత్తుగా ఈ ప్రయాణం పెట్టుకున్నాడు. సెలవులు దొరకడం చాలా కష్టమైంది. ఎలాగోలా సెలవు సంపాదించి ప్రయాణమయ్యాడు. ఏమీ తోచక సెల్ ఫోనులో ఫేస్ బుక్ చూస్తూ కూర్చున్నాడు. అమరనాథ్ లో గుజరాత్ బస్సుపై దాడి జరిగిందంట. కొందరు చనిపోయారు. ప్చ్… ఈ టెర్రరిజం.. ఈ హింసాకాండ ఎప్పుడు ఆగుతుందో …

రైలు ఏదో స్టేషనులో ఆగి మళ్ళీ బయలుదేరింది. కొత్తగా ఎక్కినవాళ్ళు తమ సీట్లు వెదుక్కుంటున్నారు. అందరూ తనను పట్టి పట్టి చూస్తున్నట్లనిపించింది. ఎవరో ముసలాయన, నుదుటిన బొట్టు, పంచెకట్టు … తన లగేజీతో కష్టపడుతున్నాడు. ఆఖిల్ లేచి సహాయం చేయబోయాడు, కాని ఆ ముసలాయన చాలా విసురుగా వద్దనడం ఆశ్చర్యమనిపించింది. అయినా మనకెందుకులే అని వచ్చి తన బెర్తుపై కూర్చున్నాడు.

ఇంత హఠాత్తుగా ఊరికి వెళ్ళవలసి వస్తుందనుకోలేదు. ఎప్పుడో హైస్కూలు చదువుతున్నప్పుడే ఆ ఊరు వదిలేశాడు. పై చదువులకు పట్టణం రావడం, అటు నుంచి అలీగఢ్ విశ్వవిద్యాలయంలో సీటు దొరికితే అటు వెళ్ళిపోవడం వరుసగా జరిగిపోయాయి. కాలం గిర్రున తిరిగింది. ఊరు వదిలి పదిహేనేళ్ళ కన్నా ఎక్కువయ్యింది. పాత మిత్రులు కూడా ఎవరూ ఈ మధ్య కాలంలో తగల్లేదు. ఆ ఊరిలో బంధువులు కూడా ఎవరూ లేరు. అమ్మానాన్న కూడా ఊరి నుంచి వచ్చేశారు. అక్కడేమీ తాతల ఆస్తులు కూడా లేవు. సగటు ముస్లిం కుటుంబాల మాదిరిగానే పొలం పుట్ర ఉన్న కుటుంబమేమీ కాదు.తమ స్వంత ఇల్లు కూడా ఏదీ అక్కడ లేదు. నాన్న ఉద్యోగం వల్ల ఆ ఊళ్ళో అద్దె ఇంట్లో ఉండేవాళ్ళు. ఊరికి వెళ్ళవలసిన అవసరం కూడా రాలేదు. ఉన్నట్టుంది ఇప్పుడు ఎందు ప్రయాణం అంటే చిన్నప్పటి దోస్తు జాన్ గాడు ఫోన్ చేశాడు. అసలు వాడికి తన నెంబరు ఎలా దొరికిందో. ఎన్నో సంవత్సరాల తర్వాత జాన్ ఫోను రావడంతో సంతోషంతో ఎగిరి గంతేసినంత పని చేశాడు. జాన్ గాడు ఆన్ లైన్లో ఏదో పెద్ద రిసెర్చ్ చేసి తన నెంబరు పట్టుకున్నాట్ట. నువ్వొకసారి అర్జంటుగా ఊరికి రాగలవా అన్నాడు. ఎందుకు ఏమిటని అడగాలని కూడా అనిపించలేదు. ఊరికి వెళ్ళడానికి ఒక్క సాకు దొరికితే చాలని మనసులో ఎక్కడో ఉందనుకుంటా. వస్తాన్రా తప్పక వస్తాను అన్నాడు. జాన్ గాడే నెమ్మదిగా చెప్పాడు. చారీ గాడు ఒక సమస్యలో ఉన్నాడ్రా. నువ్వొస్తే పరిష్కారం కావచ్చేమో. రాగలిగితే రా అన్నాడు.

చిన్నప్పటి దోస్తులు, ఆటలు, చదువులు ఇలా ఏవేవో ఆలోచనలతో నిద్ర ఎప్పుడు పట్టిందో తెలియదు… తెల్లవారుజాము నాలుగ్గంటలకు రైలు ఊరి స్టేషనులో ఆగింది. లగేజీ తీసుకుని ప్లాట్ ఫాంపై నిలబడ్డాడో లేదా నలుగురు పోలీసు కానిస్టేబుళ్ళు చుట్టుముట్టారు.

పేరేంటి..

ముహమ్మద్ ఆఖిల్

ఎక్కడి నుంచి వస్తున్నావ్

అలీగఢ్

అదెక్కడుంది.. పాకిస్తానా?

అసిస్టెంట్ ప్రొఫెసర్ గా పనిచేస్తున్న ఆఖిల్ కి ఈ ప్రశ్నతో చిర్రెత్తుకొచ్చింది.

ఏయ్.. నీకేమన్నా పిచ్చా.. అలీగఢ్ అంటే పిచ్చిపిచ్చిగా మాట్లాడుతున్నావ్… అన్నాడు.

ఏంటి ఎక్కువగా మాట్లాడుతున్నావ్.. పద. స్టేషనుకు పద.. అసలు నువ్వెవరో ఏంటో అక్కడ తేల్చేస్తాం అన్నాడో కానిస్టేబుల్

ఏంటి.. ఆరెస్టు చేస్తున్నావా? నీకు అరెస్టు చేసే అధికారం ఉందా? ఆఖిల్ ఇంకా ఏదో అడగబోయే లోపే జాన్ అక్కడికి పరుగెత్తుకు వచ్చాడు.

జాన్ కానిస్టేబుళ్లతో ఏదో మాట్లాడి వాళ్ళను పంపేశాడు. తర్వాత ఆఖిల్ తో పదరా అన్నాడు.

ఊళ్ళో ఇంత పోలీసు సెక్యురిటీ ఏంటో ఆఖిల్ కి అర్ధం కాలేదు.

ఆఖిల్ బ్యాగు భుజాన్నేసుకుని, ఒక సిగరెట్ వెలిగిస్తూ, ఏంట్రా.. ఊళ్ళో ఇంత పోలీసు సెక్యురిటీ ఏదన్నా శత్రుసైన్యం దాడికి వచ్చిందా అన్నాడు నవ్వుతూ.

శత్రు సైన్యం దాడికి వస్తే మన సైన్యాన్ని పిలువ్.. కత్తులెక్కడా అన్నాడు.

జాన్ నవ్వేస్తూ… నీకు ఆ ఆటలు ఇంకా గుర్తున్నాయా అన్నాడు.

చిన్నప్పుడు రెండు సైన్యాలుగా విడిపోయి యుద్ధాలు చేసేవారు. న్యూస్ పేపర్లు గుండ్రంగా చుట్టి అవే కత్తులు. భీకరమైన యుద్ధాలు జరిగేవి. జాన్ అప్పుడు నిజానికి శత్రుసైన్యంలో ఉండేవాడు. అదే మాట చెప్పాడు. నేను నీ సైన్యంలో లేన్రా అన్నాడు.

ఆఖిల్ కూడా నవ్వేస్తూ.. అది సరే ఈ పోలీసుల హడావిడి ఏంటి అన్నాడు.

ఏముంది.. నీ అవతారం చూసాక నువ్వే శత్రుసైన్యం అన్నట్లుంది అన్నాడు.

తన నెత్తిన టోపీ, తెల్లని పఠానీ సూట్, గెడ్డం ఇవన్నీ తనను అనుమానితుడిగా నిలబెట్టాయన్నది ఆఖిల్ కి కూడా అర్ధమైంది. ఈ వాతవరణం తెలియని వాడేమీ కాదు కాబట్టి.. ఓహో .. అదా సంగతి… మనూళ్ళో కూడా ఇలాగే ఉందన్న మాట అన్నాడు.

మనూరేంట్రా బాబు.. దేశంలో ఎక్కడైనా ఇంతే అనుకో అంటూ జాన్ బండి తీశాడు.

జాన్ ఇల్లు చిన్నప్పుడు గడ్డితో పైకప్పు నేసిన గుడిసె. వ్యవసాయ కూలీగా వాళ్ళ నాన్న పనిచేసేవాడు. జాన్ చదువుకుని స్థిరపడ్డాడు. గుడిసె స్థానంలో కాస్త పక్కా ఇల్లు వచ్చింది.

ఇంట్లో అంతా నిద్రపోతున్నట్లున్నారు.

ఏరా ఏమన్నా తింటావా అన్నాడు జాన్.

వద్దు .. టీ దొరుకుతుందా అన్నాడు ఆఖిల్.

నా శ్రీమతి నిద్రపోతున్నట్లుంది. నేనే పెడతానుండు.. అనేలోపే భార్య లేచి వచ్చింది. జాన్ పరిచయం చేస్తూ, నాకు అన్న లాంటి వాడు, నీకు చెబుతూ ఉండేవాడినే ఆఖిల్ ఇతనే అన్నాడు. ఆ అమ్మాయి చేతులు జోడించి నమస్కారం చేసింది.

నమస్కారం కాదు. మీ అన్నయ్యకు టీ కావాలిప్పుడు. నేను చేస్తానన్నాను అన్నాడు జాన్.. ఆమెకు అర్ధమైంది. మీరు చేస్తే అన్నయ్య ఇప్పుడే తిరుగు ప్రయాణమైపోతాడు. నేను చేసి తెస్తానని లోపలికి వెళ్ళింది.

ఆఖిల్ మరో సిగరెట్ ముట్టించి.. సరే ఇంకేట్రా విశేషాలు. ఎంటి అంత హడావిడిగా రమ్మన్నావ్ అన్నాడు.

చారి తెలుసుగా అన్నాడు జాన్

చారిగాడు తెలియకపోవడమేమిటి? పైగా నా సైన్యంలో ఉండేవాడు అన్నాడు నవ్వుతూ ఆకిల్.

వాడే… లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు అన్నాడు జాన్

మంచిదేగా

మంచిదే… కాని అమ్మాయి పేరు కాథరిన్

మంచి పేరేగా అన్నాడు పరథ్యానంగా ఆఖిల్

నీ బుర్ర పాడైంది అన్నాడు జాన్ నవ్వుతూ

అప్పుడర్ధమైంది ఆకిల్ కి అసలు సమస్యేంటో

సర్లేరా.. ఈ మతాలు, కులాల పట్టింపులేంటి? వాళ్ళిద్దరు ప్రేమించి పెళ్ళి చేసుకున్నారు. వెరీగుడ్. చారి గాడేమన్నా పెళ్ళి తర్వాత వేషాలేస్తున్నాడా?

లేదులే.. చారిగాడికి ఆ అమ్మాయంటే చాలా ఇష్టం అన్నాడు జాన్.

ఈ లోపు టీ తీసుకుని వాడి భార్య వచ్చింది.

సమస్య రంగమ్మగారన్నయ్యా అంది. చారి ఈయనకు ప్రాణస్నేహితుడు. వాళ్ళ సమస్య ఈయన సమస్యే అనుకుంటారు అంది.

ఆ మాటకొస్తే చారిగాడు నాక్కూడా ప్రాణం లాంటోడు. వాడి సమస్య నాక్కూడా సమస్యే. అందుకే వీడు నన్ను పిలిచాడన్నమాట. ఇప్పుడు సీనంతా అర్ధమైంది అనుకున్నాడు ఆఖిల్.

అవున్రా.. ఆవిడకిప్పుడు డబ్బయి ఐదేళ్ళు. ఇంకా ఎక్కువే ఉండవచ్చు. కిరస్తానీ పిల్ల చేసింది నేను తినను… నా వంట నేనే చేసుకుంటానని, ప్రత్యేకంగా పాకలో వండుకుంటోంది. వాళ్ళిల్లు నీకు తెలుసుగా. చాలా పెద్ద ఇల్లు. ఇంటెనక పాక వేయించుకుని అందులోనే ఉంటోంది. ఈ వయసులో ఆమె వండుకు తినడం చూసి చారి గాడు కష్టపడుతున్నాడు. ఏం చేయాలో వాడికి తోచడం లేదు. అసలు పెళ్ళికే రంగమ్మ ఒప్పుకోలేదు. నానా గొడవ చేసింది. కిరస్తానీ పిల్లను చేసుకుని వంశాన్ని నాశనం చేస్తావురా అని నానా తిట్లు తిట్టింది. నీకు తెలుసుగా ఆవిడస్సలే చాలా పట్టింపు మనిషి అన్నాడు జాన్.

సర్లేరా.. పొద్దుట వెళ్ళి ఆవిడతో మాట్లాడదాం అన్నాడు ఆఖిల్.

జాన్ గాడు ఉలిక్కిపడి.. నేను ఆ ఇంట్లో అడుగుపెడితే ఆవిడ నా కాళ్ళిరగ్గొడుతుంది. నువ్వే వెళ్ళు. నువ్వంటే ఆవిడకు చాలా ఇష్టం. అందుకే నిన్ను పిలిచాను అన్నాడు.

అవును.. కేథరిన్ అంటే ఆరో క్లాసులో చీమిడి ముక్కుతో తిరిగేది ఆ అమ్మాయేనా అన్నాడు ఆఖిల్

హాహాహా… ఆ అమ్మాయే అన్నాడు జాన్.

ముక్కుమీద కోపం, ముక్కులో చీమిడి అని పెద్దగా నవ్వేశాడు ఆఖిల్

కాసేపు చిన్నప్పటి ముచ్చట్లు పెట్టుకున్నారు.

సరే రా… నువ్వు కాసేపు రెస్టు తీసుకో. పొద్దుట రంగమ్మగారితో ఎన్ కౌంటర్.. అనేసి జాన్ వెళ్ళిపోయాడు.

మంచం మీద నడుం వాల్చి ఆఖిల్ కళ్ళముందు అప్పటి రంగమ్మ గారి రూపం మసక మసగ్గా కనబడుతోంది. చాలా మంచావిడ. చారి గాడికి నాయనమ్మ. చారీగాడి అమ్మానాన్న ఇద్దరు వాడికి ఊహ తెలియకముందే చనిపోయారు. నాయనమ్మ, తాతయ్యలే పెంచారు. చారీతో ప్రయిమరీ క్లాసుల నుంచి స్నేహం. చిన్నప్పుడు ఎక్కువగా వాళ్ళింట్లోనే ఉండేవాడు. చారీ తాత, నాయనమ్మ కూడా ఆఖిల్ వాళ్ళింటికి రావడం పోవడం జరిగేది. రెండు కుటుంబాల మధ్య మంచి స్నేహం ఉంది.

రంగమ్మ గారు ఆవకాయ అద్భుతంగా పెట్టేవారు. ఆఖిల్ అమ్మ అప్పుడప్పుడు ఆవకాయ తీసుకురారా అని గిన్నె ఇచ్చి పంపేది. ఆఖిల్ ఆ గిన్నె ఆవిడ ముందు పారేసి .. అమ్మ ఆవకాయ ఇమ్మంది అనేవాడు పొగరుగా. ఏరా సాయిబు… పెద్ద నవాబులా తలెగరేసి హుకుం చేస్తున్నావ్ … ఇవ్వను పోరా పో.. అనేది రంగమ్మ. ఇవ్వకపోతే తాతకు చెబుతా అనేవాడు. ఈ లోపు ఆ తాతగారు వచ్చి, పోనీలేవే.. నవాబు దర్జా అది… అనేవాడు.

నువ్వు అనే పిలిచేవాడు. ఏంటే మామ్మ ఎందుకు తిడతావ్ అని పొగరుగా జవాబులు ఇచ్చేవాడు. ఆఖిల్ కి అన్నీ గుర్తొస్తున్నాయి.

ఆవిడ చాలా నిష్ఠగా ఉండేది. మడి కట్టుకుని కాని వంటగదిలోకి వెళ్ళేది కాదు. వాళ్ళింట్లో ఆడుకుంటూ తాను పొరబాటున వంటగదిలోకి వెళితే తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టేది. కావాలని ఏడిపించడానికి కూడా వెళ్ళేవాడు. వాళ్ళాయన్ను.. అంటే తాతను గట్టిగా విసురుగా పిలిచేది.. ఈ సాయిబుల కుర్రోడిని బయటకు లాక్కెళ్ళు.. వంట చేయనీడు. మళ్ళీ మడికట్టుకోవాలనేది. పాపం ఆయన వచ్చి ఒరేయ్ బాబు పదరా అని లాక్కెళ్ళేవాడు. పిండివంటలు బాగా వండేది. కూర్చోబెట్టి మరీ ప్రేమగా ఇచ్చేది. తినేసిన తర్వాత విస్తరాకు తీసుకెళ్ళి పారేసే పని మాత్రం తనదే. ఒక్కోసారి తుంటరిగా విస్తరాకు అక్కడే వదిలేసి పారిపోయేవాడు. పాపం తాతయ్య తీసి పారేసేవాడు. తలచుకుంటే ఇప్పుడు నవ్వొస్తుంది.

చారిగాడితో పాటు రామాలయం తోటలో ఆడుకునేవారు. గుళ్ళో రోజుకో ప్రసాదం వండేవారు. దద్దోజనమో, చక్రపొంగలో లేకపోతే పులిహారో ఏదో ఒకటి చారి ఎత్తుకొచ్చేవాడు. రెండు పొట్లాలు, తోటలో చెట్ల క్రింద కూర్చుని తినేవారు. పక్కనుంచే పసిరిక పాములు వెళుతుండేవి. చేత్తో పట్టుకుని విసిరేసేవాళ్ళు. చారి గాడు నామాలు లేకుండా ఎప్పుడూ కనబడేవాడు కాదు. ఇప్పుడు కూడా నామాలు పెట్టుకుంటున్నాడో లేదో..

ఆలోచనల్లో ఎప్పుడు నిద్రపట్టిందో తెలియదు.

పొద్దుట లేచి జాన్ గాడిని తీసుకుని చారి ఇంటికి బయలుదేరాడు. జాన్ గాడు ఇంటికి అంత దూరంలోనే.. ఇక నువ్వెళ్ళు… నేన్రాను అని పారిపోయాడు. ఆఖిల్ ఇంటివైపు నడిచాడు. చారిగాడికి తాను వస్తున్నట్లు తెలుసనుకుంటాను, ఎదురుచూస్తూ కనబడ్డాడు. బ్యాంకులో జాబు దొరికిందంట. కొత్తనోటులా ఉన్నాడు. వాడిని అలా చూస్తే సంతోషం అనిపించింది. ఇంట్లో తీసుకెళ్ళాడు. కేథరిన్ టీ తీసుకువచ్చింది. ఆఖిల్ ని చూడగానే గుర్తుపట్టి నవ్వింది.

అన్నయ్య.. స్కూల్లో చాలా ఏడిపించేవాడివి అంది.

ఆఖిల్ నవ్వుకున్నాడు. అవును. చీమిడి ముక్కని ఏడిపించేవాడు.

చారి గాడు నెమ్మదిగా మొదలుపెట్టాడు. పెళ్ళికి బామ్మ అస్సలు ఒప్పుకోలేదురా. తనకు తెలియకుండా పెళ్ళి చేసుకువచ్చేశాను. ఇప్పుడు సమస్యేమిటంటే, కేథీ వండితే తాను తినదు. అసలు ఆ వంటింట్లోకే రాననేసింది. పెరట్లో గొడ్లపాక ఉండేది కదా, దాన్నే బాగు చేయించుకుని, అక్కడే వండుకుని తింటుంది. ఈ వయసులో అంత కష్టం ఎందుకు? పైగా కళ్ళు సరిగ్గా కనబడవు.

సర్లేరా… పెద్దావిడ.. ఆవిడ చాదస్తాలు ఆవిడకు ఉంటాయి. పెద్ద వాళ్ళ కోసం మనం మారనట్లే.. మన కోసం మారిపోవాలని వాళ్ళకు చెప్పలేం. ఈ సమస్యకు పరిష్కారమేమిటో ఆలోచిద్దాం. ఒకసారి బామ్మను కలిసి వస్తానని పెరట్లోకి వెళ్లాడు. ఆ గొడ్లపాకలో ఇప్పుడు ఆవులు లేవు. అన్నీ అమ్మేసినట్లున్నారు. గొడ్లపాక శుభ్రం చేయించుకుని అక్కడే ఉంటుంది.

పాక బయటే ఉంది. చేటలో బియ్యం బాగు చేస్తోంది.

కళ్ళు కనబడ్డం లేదు. దగ్గరకెళితే కాని ఆమెకు తెలియలేదు. చాలా సంవత్సరాల తర్వాత చూస్తున్నాడు. కాలం మనిషిపై ఎంత ప్రభావం వేస్తుందో తెలుస్తోంది. ఎంత బలంగా, ఎంత గంభీరంగా ఉండేది. ఎంత హుందాగా ఉండేది. ఇప్పుడు వంగిపోయి, క్రుంగిపోయి …

తన దగ్గరకొస్తున్న ఆఖిల్ ని చూసి-

ఎవర్రా… అంది

గుర్తుపట్టలేదా అన్నాడు ఆఖిల్

లేద్రా అబ్బాయ్… కళ్ళు ఆనడం లేదు. ఎవర్రా అంది…

కళ్ళజోడు పెట్టుకోరాదు అన్నాడు.

లోపలెక్కడో ఉందిలేరా.. చెప్పు ఎవరు నువ్వు అంది.

భారతమాతాకి జై.. అన్నాడు నవ్వుతూ

ఆమె ఒక్క క్షణం తేరిపారా చూసింది.. ఓరి భడవా.. నువ్వు సాయిబుల కుర్రోడివి కదూ.. ఉండ్రా… కళ్ళజోడు తెస్తాను అంటూ కష్టంగా లేచి లోపలికి వెళ్ళింది.

ఆఖిల్ నవ్వుకున్నాడు. చిన్నప్పుడు ఆమె మడి కట్టుకుని వంటకు వెళ్ళబోయే ముందు ఆమెను ముట్టుకుని పారిపోయి దూరంగా నిలబడి భారతమాతా కి జై అని నవ్వేవాడు. ఆమె తిడుతూ వెంటపడేది. తాత ఒకసారి అడిగాడు, అలా ఎందుకు అంటావురా అని .. ఏమో .. బామ్మను చూస్తే అలా అనాలనిపిస్తుంది అనేవాడు. నిజంగానే అప్పట్లో చీర కట్టుకుని, పెద్ద బొట్టు పెట్టుకుని, నగలేసుకుంటే భారతమాత బొమ్మలాగే ఉండేది.

తాత ఇప్పుడు లేడు. చనిపోయి చాలా సంవత్సరాలైంది. విధవగా తెల్లచీరలో ఆమెను చూస్తే భారతమాత అనాలనిపించలేదు..ఈ లోపు ఆమె కళ్ళజోడు పెట్టుకుని వచ్చింది. అక్కడే ఉన్న ఒక రాయిమీద కూర్చున్నాడు. బాగా దగ్గరకు వచ్చి పట్టి పట్టి చూసింది. బాగా పెద్దవాడివి అయిపోయావు. నవాబులా గెడ్డం పెంచేశావు. ఆం… తెల్లజుబ్బా, టోపీ, చాలా బాగున్నావురా… అమ్మానాన్న అంతా బాగున్నారా? మీ అమ్మని చూడాలిరా.. చాలా రోజులైపోయింది. అవున్రా నాన్న ఎలా ఉన్నాడు? సిగరెట్లు మానేశాడా లేదా? వరుసగా ప్రశ్నలు .. ఆత్మీయంగా అడుగుతున్న ప్రశ్నలు. మనసంతా హాయిగా ఉంది. ఒక్క సిగరెట్టు దమ్ము లాగాలని ఉంది. కాని ఆవిడ ముందు సిగరెట్ వెలిగించడమే… అమ్మో…

అవున్రా… టిఫినీ చేశావా…

ఆం..ఆం.. అన్నాడు..

సర్లే… నీకు ఇడ్లీలు ఇష్టం కదా… పొద్దుట వండుకున్నా.. తెస్తానుండు అని లోపలికి వెళ్ళింది.

ఆకులో రెండిడ్లీలు, కారప్పొడి, కాస్త చట్నీ వేసుకుని వచ్చింది.

చిన్నప్పటి నుంచి ఆ ఇంట్లో తిరిగినవాడు. చనువుగా ఇడ్లీలు అందుకుని…

హివన్నీ నువ్వే వండేవుటే అన్నాడు నవ్వుతూ

ఏరా ముసల్దాన్ననుకున్నావా… నేనే వండా… తిను.. తిను అంది ప్రేమగా

ఇడ్లీ ముక్క విరిచి నోట్లో పెట్టుకుంటున్నప్పుడు ….

’’అయ్యయ్యో… నా మతి మండ… చట్నీలో ఉప్పు ఎక్కువైపోయిందిరా.. మరిచిపోయి వేశాను. కళ్ళు కనబడ్డం లేదుగా కాస్త ఎక్కువ పడింది‘‘ అంది.

చట్నీతో ఇడ్లీ నోట్లో వేసుకోగానే ఆఖిల్ కి అర్ధమైపోయింది. ఉప్పు ఎంత ఎక్కువగా ఉందో. ఆమె స్వంతంగా వండుకుంటూ, ఎలాంటి తిండి తింటుందో కూడా అర్ధమైపోయింది. అయినా ఆ ఇడ్లీ అలాగే తింటు… బామ్మా… నీ వంట సూపరంటే సూపరే బాబు అన్నాడు.

చాలా సంతోషంగా చూసింది.

తిన్న తర్వాత ఆకులు తీసుకెళ్ళి దూరంగా పారేసి వచ్చాడు.

కాసేపు పిచ్చాపాటి తర్వాత నెమ్మదిగా కదిపాడు

ఏదో చారిగాడు ప్రేమించి చేసుకున్నాడు… క్షమించేయవచ్చు కదా.

క్షమించడానికేముందిరా.. వాడిష్టపడ్డాడు, చేసుకున్నాడు… నాకేం కోపం లేదురా.. కాటికి కాళ్ళు చాపి ఉన్నా. వాడి ముందు బతుకుంతా ఉంది, అని చాలా మామూలుగా చెప్పింది.

ఆ అమ్మాయి కూడా చాలా మంచి పిల్ల అన్నాడు ఏదో చెప్పబోయి.

నిప్పులు కడిగే వంశంరా. అలాంటి వంశంలో కిరస్తానీ పిల్లను తెచ్చాడన్న బాధ ఉందనుకో. ఆ పిల్ల మీద నాకేం కోపం లేదురా. కాని పెద్దముండని నన్నిలా ఉండనీ అంది.

మరి ఆ ఇంట్లో వాళ్ళతో కలిసి ఉండవచ్చు కదా. నువ్విలా ఒంటరిగా ఈ పాకలో ఉంటే వాడికెంత కష్టం. వాడికి అన్నం సహిస్తుందా? పెళ్ళాంతో సంతోషంగా ఉండగలడా? నువ్వు కష్టపడుతుంటే వాళ్ళెలా సంతోషంగా ఉంటారు? నీ పిల్లలేగా.. అన్నాడు.

ఆవిడకు కూడా కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి. ఈ సమస్యకు పరిష్కారం లేదురా. నా జీవితంలో మడి లేకుండా అన్నం మెతుకు గొంతు దిగలేదు. చచ్చేముందు నిష్టను చంపగలనా? ఆ అమ్మాయి మంచిదే. కాని తాను వండింది నేను తినలేన్రా, చారీగాడికి కష్టమేననుకో.. కాని తప్పదు. ఈ జీవితమింతే.

అంటే… నీ గొడవంతా వంట గురించా. వంట తప్ప కలిసి ఉండడానికి అభ్యంతరం లేదన్నమాట అన్నాడు.

అభ్యంతరమేముందిరా, నువ్వు రావడం లేదా, జాన్ గాడు రాడా, వెధవ నన్ను తిడతాడు నాకు తెలుసు అంది.

వార్ని… వంట కోసం ఇంత సమస్య చేశావా? బామ్మా… నీకు వయసైపోయి బుర్ర పనిచేయడం లేదు అన్నాడు ఆఖిల్.

ఏరా… ఎందుకు అంది

సరే…. నీ కోడలు వండితే నీ మడి, నీ నిష్ట మట్టికొట్టుకుపోతాయి. అంతేగా.. నీ కొడుకే మడికట్టుకుని వండాడనుకో తిండానికి నీకేం అన్నాడు.

వాడెందుకు వండుతాడూ…మగాడు వంట చేస్తాడా, ఉద్యోగం చేస్తాడా?

వాడు వండుతాడు లేకపోతే వంటమనిషిని, మడికట్టుకుని వండే మనిషిని తీసుకువచ్చి వండిస్తాడు … నీకెందుకే… నీ మడికి లోటు లేకుండా ఉంటే నీకు అభ్యంతరమేమిటి అన్నాడు.

కాసేపు ఆలోచించింది.

ఇంకేం ఆలోచించకు. ఈ పాకొదిలేసి ఇంట్లోకి పద… అని చారిగాడిని గట్టిగా పిలిచాడు.

వాడు పరుగెత్తుకు వచ్చాడు.

ఏరా మీ బామ్మకు నువ్వు వండి పెట్టలేవా ఏంటి

అయ్యో … అంతకన్నానా… నేనే వండుతాను… నువ్వు పదవే అన్నాడు.

నీ పెళ్ళాం నాకు కొంచెం దూరంలో ఉండాలి. తాక కూడదు అంది.

సర్లేవే అలాగే పద అంటూ ఇంట్లోకి నడిపించాడు.

లోపల తనకోసం ఏర్పాటు చేసిన బెడ్ రూములో తీసుకెళ్ళి… కాసేపు నిద్రపో… చాలా అలిసిపోయుంటావ్. వంట నేనే చేస్తాను. తర్వాత వంటమనిషిని వెదుకుతాను. దొరక్కపోతే నేనే చేస్తాలే అన్నాడు చారి

ఈ వయసులో ఆవిడకు వంట చేసి పెట్టడం నీ అదృష్టం అనుకో అన్నాడు ఆఖిల్

నీకు వంట పని తప్పిందిలే అన్నాడు చారి కేథరిన్ తో

నా పని తప్పించుకోవాలనేం లేదు. అటు ఉద్యోగం, ఇటు వంట రెండు ఎలా చేసుకుంటారు అంది.

ఫర్వాలేదు… ఎలాగోలా చేసుకుందాం. ఎలాగో ఇంట్లోకి వచ్చింది. ఇంకేం మాట్లాడకు అన్నాడు చారి.

థాంక్యురా…వంట నేను చేయొచ్చుగా అన్న ఐడియా నాక్కూడా రాలేదు. అయినా నేను చెబితే వినేది కాదేమో. నువ్వు చెప్పావు కాబట్టి కాస్త మెత్తబడినట్లుంది అన్నాడు.

అప్పటికీ మధ్యాహ్నం అయిపోయింది.

సరేరా.. నేను మస్జిదుకు వెళ్ళి నమాజు చేసుకువస్తాను అన్నాడు ఆఖిల్.

త్వరగా వచ్చేయ్ కలిసి భోంచేద్దాం అన్నాడు చారీ

సరే అని బయటకు నడిచాడు ఆఖిల్

నమాజు ముగించుకుని మస్జిదు నుంచి బయటకు అడుగేస్తే…అంతా గోలగోలగా ఉంది.

భారతమాతాకి జై… భారతమాతాకి జై.. అని నినాదాలు వినిపిస్తున్నయి.

ఏమైందంటూ పక్కన ఉన్నవాడిని అడిగితే.. అమరనాథ్ యాత్రపై దాడికి నిరసనగా ర్యాలీ అని తెలిసింది.

నాలుగడుగులే వేశాడో లేదో.. ఆ ర్యాలీలోని జనం ఆఖిల్ని చుట్టుముట్టారు.

అమరనాథ్ యాత్ర పై దాడిని ఖండిస్తావా లేదా.. భారతమాతాకి జై అంటావా లేదా..

ఆఖిల్ కి కాసేపు ఏమీ అర్ధం కాలేదు. అమరనాథ్ యాత్రపై దాడిని ఖండించకుండా ఎలా ఉంటాడు. బారతమాతకి జై అనాలని తనపైన బలవంతం ఏంటి? తానే అంటాడు. వీళ్ళు చెప్పేది ఏంటి? అసలు అమరనాథ్ యాత్రపై దాడికి నిరసనగా ఆ ర్యాలీలో పాల్గొనమని అడిగినా పాల్గొంటాడు. కాని తానేదో శత్రువన్నట్లు చూస్తూ, తనతో అనిపించడం ఘనకార్యం అన్నట్లు వాళ్ళు మాట్లాడడం చూస్తుంటే ఒళ్ళుమండిపోయింది.

చుట్టుముట్టిన వాళ్ళు ఉద్రేకంగా, అసలు అమరనాథ్ యాత్రపై దాడి చేసింది నువ్వే అన్నట్లు రెచ్చిపోతూ.. భారతమాతాకి జై అంటావా లేదా అంటున్నారు. కొందరు బూతులు వాగుతున్నారు.

ఆఖిల్ కి కోపం వచ్చింది. భారతమాతాకి జై తానే అంటాడు. ఈ దౌర్జన్యం ఏంటి? వాళ్ళు బలవంతంగా అనమంటే ఒళ్ళు మండి.. నా ఇష్టం వచ్చినప్పుడు అంటాను పొండి అన్నాడు. అంతే వాళ్ళు ఒక్కసారి విరుచుకుపడ్డారు. పిడిగుద్దులు … దొమ్మి.. ఆఖిల్ అంతమంది ఒక్కసారి అలా గుంపుగా మీదపడి కొడతారని అనుకోలేదు. దెబ్బలకు ఒళ్లు హూనమైపోయింది. కొందరు వాళ్ళను ఆపారు. తీవ్రమైన దెబ్బలు తగిలిన ఆఖిల్ కింద పడిపోయాడు. బూతులు తిడుతూ వాళ్ళు వెళ్ళిపోయారు.

చాలా నిస్త్రాణగా ఉంది. అసలేం జరుగుతుందో, ఎందుకు జరుగుతుందో అర్ధం కాలేదు.

నెమ్మదిగా లేచి పక్కన ఉన్న అరుగుపై కూర్చున్నాడు.

పక్కనే చింపిరిజుత్తు, చిరిగిన దుస్తులతో ఒక చిన్నపిల్ల కూర్చుని ఉంది. బిచ్చమెత్తుకుంటుందేమో, చేతిలో ఏదో చిప్పలాంటిది ఉంది. అందులో ఒక సమోసా ముక్క ఏదో ఉంది. దెబ్బలతో వచ్చి కూర్చున్న ఆఖిల్ నే చూస్తుంది. కాసేపటి తర్వాత నెమ్మదిగా దగ్గరకు వచ్చి ఆ సమోసా ముక్క అతని వైపు చాపింది.

ఆఖిల్ కి నవ్వొచ్చింది. జుబ్బా జేబులో చేయిపెట్టాడు. పర్సు దొమ్మిలో ఎవడో కొట్టేశాడు. మరో జేబులో కొన్ని డబ్బులుండాలి. అవి ఉన్నాయి. అందులోంచి ఒక ఐదువందల నోటు తీసి ఆ పాపకిచ్చాడు. ప్రేమగా బుగ్గపై చిటికె వేసి… భారతమాతాకి జై అన్నాడు.

ఆ అమ్మాయి నవ్వుతూ భారతమాతాకి జై అంది.

*

వాహెద్

7 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • కథ బాగుంది వాహిద్. అయినా ఆ అత్యాచారాన్ని తగినంత గా ఎండగట్టలేదు. అమానుషత్వాన్ని ప్రేమతో ఎదిరించడం తాత్త్విక స్థాయిలో కరక్టే, ప్రస్తుత పరిస్థితుల్లో అనుమానమే.

  • I R K Rao.. కథ లో భావం చాలా బాగుంది.
    కులం అనో మతం అనో ఎవరి మీదా దౌర్జన్యం చెయ్య కూడదు. ఎవేరికి వారు స్వేచ్ఛగా జీవించాలి అని ఈ కథ theme.

  • Simple and discreet narration. Loved this story. So sad to see situations are worse that Aakil being demanded to be proving where his loyalties fall? Unfortunate.

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు