భమిడిపాటి  ఉత్త హాస్యరచయిత మాత్రమేనా?!

ఒక కథనో  దేన్నో చదువుతున్న అనుభూతి కలిగేలా చిన్నచిన్న విన్యాసాలు చూపించారు పతంజలి శాస్త్రి గారు మోనోగ్రాఫ్ రచనలో.

సాహిత్య అకాడెమీ వాళ్లు దేశ భాషా సాహిత్యాల్లో ప్రముఖలైన  వాళ్ళగురించి ‘భారతీయ సాహిత్య నిర్మాతలు’ అనే మోనోగ్రాఫ్‌ల పరంపర వెలువరిస్తూ వస్తున్నారు. అందులో భాగంగా భమిడిపాటి కామేశ్వర రావుగారి గురించి రాసేపని  పతంజలిశాస్త్రిగారికి అప్పగించారు.ఈ సాహిత్య నిర్మాతల పరంపరకి పుటల పరిమితి మాత్రమే కాకుండా, చట్రపరిమితి, ధ్యేయ పరిమితి కూడా ఉంటాయి.ఆ చట్రంలోనే రాయాలి. ఆ సాహిత్య కారుడిని పరిచయం చేస్తూనే అంచనా కూడా వెయ్యాలి.సాధారణంగా ఆయా సాహిత్య నిర్మాతలగురించి భక్తి శ్రద్ధలతో తయారవుతాయి మోనోగ్రాఫులు. శాస్త్రిగారు భక్తి శ్రద్ధలకి మరో రెండుఅంశాల్ని జోడించారు. ‘‘సభక్తికంగా, విమర్శన దృ ష్టితో, ఈ తరానికి చెందిన రచయితగా కామేశ్వరరావుగారిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తూ చేసిన రచన ఇది’’ అని ముందుమాటలో చెప్పుకున్నారు. ‘విమర్శన దృష్టి’ అన్నమాట, ‘ఈ తరానికి చెందిన రచయితగా’ అన్నమాట గుర్తుంచుకోదగ్గవి. ఈ పుస్తకం అదనపు విలువ వాటిల్లో ఉంది. గౌరవాన్నీ, దాంతోబాటే వివేచననీ, కాలిక స్పృహ నీ విడిచిపెట్టకుండా రాస్తాను అన్నారు.అన్నట్టే రాశారు.

సేకరించిన సమాచారాన్ని కుమ్మరించడం కాక, దాన్ని సొంతం చేసుకుని రాయడం వల్లా, శాస్త్రిగారు ఒక విలక్షణ కథా రచయిత కావడంవల్లా, కామేశ్వర రావుగారి జీవిత విశేషాలు కూడా ఈ పుస్తకంలో పొందిగ్గా అమిరాయి. ఒక కథనో  దేన్నో చదువుతున్న అనుభూతి కలిగేలా చిన్నచిన్న విన్యాసాలు చూపించారు రచనలో.

కామేశ్వరరావుగారికి తండ్రి నుంచి సంక్రమించింది పట్టుదల ఒక్కటే అని చెప్పేటప్పుడు, చిన్న డేష్‌ పెట్టి` ఇరవై వెండి రూపాయల కాక అని రాశారు.

‘‘అప్పటికే ఆయనకి లేమితో బాగానే పరిచయం ఏర్పడింది.’’ అని రాశారు మరోచోట.

కామేశ్వర రావుగారు ‘‘ఇడ్లీ కాఫీ సేవించి, పేపరు తిరగేసి, రేడియో లో వార్తలు విని, అప్పుడు మొదటి కారా కిళ్లీ బిగించి, ఇంటికి’’ వెళ్లేవారట. ఈ కథనంలోని బిగుసుకుపోయిలేనితనం గమనించండి .

మరో వాక్యం ‘‘విషాదం మేష్టారి సహోదరి.’’

కేన్సర్‌వచ్చి హాస్పిటల్లో చేరినప్పుడుకూడా కారా కిళ్ళీ విడిచిపెట్టలేదని చెప్పాక, ‘‘మృత్యువు పట్ల, నిర్భీతి, అలక్ష్యం ఆయన్ని చివరి వరకూ కాపాడేయి’’ అని రాశారు.‘కాపాడేయి’ అన్నమాట ఒక విలక్షణమైన వ్యాఖ్య.

‘‘రాత్రి పన్నెండవుతూ ఉండగా ఆ వెన్నెల రాత్రి  మేష్టారు తుదిశ్వాస విడిచారు.

మర్నాడు పెద్ద వాన కురిసింది. గోదావరి ఒడ్డున అంత్య క్రియలు జరిగినచోట అస్తి సంచయం కోసం ఉదయం వెళ్లినప్పుడు రాధాకృష్ణగారికి అక్కడ ఏవీ కనిపించలేదు. మేష్టారి పార్థివ దేహాన్ని కూడా వర్షంతో గోదావరి తనలో కలిపేసుకుంది .’’

ఈ చివరి వాక్యాలు చదివితే జీవిత చరిత్రను చదువుతున్నట్టుకాక ఒక కథలో చివరి వాక్యాలు చదువుతున్నట్టు ఉంటుంది.

ఇంకొక విశేషం ఏమిటంటే, కామేశ్వరరావుగారి గురించి చెప్పేటప్పుడు మాటిమాటికీ ఆ పేరుతో కాని, భమిడిపాటి వారు అని ఇంటి పేరుతో కాని, క్లుప్తీకరించి రావుగారు అన్న నామఖండంతో కాని రచన చెయ్యలేదు శాస్త్రిగారు. ‘మేష్టారు’ అనిరాస్తూ వచ్చారు. అందువల్ల వేరే కథనం ఏమీ అవసరం లేకుండానే ఆయనపట్ల తనలోపల ఉన్న గౌరవాభిమానాల్ని  పాఠకుడికి ప్రస్ఫుటం చేశారు. అవే గౌరవాభిమానాలను పాఠకుడి  లోపల కూడా కలిగించారు. ఇది కథా రచయితగా శాస్త్రిగారి సున్నితమైన పన్నుగడ.

మళ్ళీ, విమర్శ దగ్గరకు వచ్చేసరికి గౌరవాభిమానాలు అడ్డుపడకుండా చూసుకున్నారు. ఆయన లోపాలేవో ఆయన పరిమితులేవో గుర్తెరిగి వేటికవిగా ప్రస్తావించారు.

కొన్ని పరిశీలనలు చాలా నిశితంగా ఉన్నాయి.

ఒకప్పటి హాస్యరచనలు చదివి ఇప్పుడు నవ్వమంటే మనకి కష్టంగా ఉంటుంది. గణపతి చదివి నవ్వలేం. చిలకమర్తి   లక్ష్మీ నరసింహంగారి ప్రహసనాలు ఎక్కడోగాని నవ్వించవు. పాత సినిమాల హాస్యం, ఒకప్పుడు  ప్రేక్షకుల్ని విపరీతంగా నవ్వించిన హాస్యం, ఇప్పుడు నవ్వించదు` రాయితీ ఇచ్చి, ఇతరేతర కారణాలవల్ల నవ్వి గౌరవించాల్సిందే తప్ప. ఆ సంగతి చెబుతూ శాస్త్రిగారు ఏమన్నారంటే-‘‘మిగత రచనలకంటే హాస్యరచనలకి త్వరగా కాలదోషం పడుతుంది. జీవన విధానం ప్రాపంచిక దృక్పథం ఆధునికం అయ్యే కొద్దీ ఒక అమాయకపు ప్రపంచం కనుమరుగైపోతుంది.’’ అన్నారు. ‘అమాయక ప్రపంచం కనుమరుగైపోతుంది’ అన్నది చాలా మంచి గమనింపు.హాస్యంస్వభావం మీద, సమాజం స్వభావంమీద కూడా, లోతైన విశ్లేషణ ఉన్న వాక్యం.  ఒకప్పటి హాస్యం తరువాత కాలంలో హస్యం కాకుండాపోయిన అనేకానేక సందర్భాలకు ఇది గుర్తుంచుకోదగ్గ వివరణ.

‘‘తెలుగువారికి త్యాగయ్యను పరిచయం చేసే అవసరం ఇంకా పూర్తిగా రాలేదు. దీనికి మరో దశాబ్ది పడుతుంది.’’ ఇలాంటి వాక్యాలు మనకి ఈ రచనలో అక్కడక్కడా తటస్థపడుతూ ఉంటాయి. అవి రచనకు వింత రుచిని ఆపాదించాయి. ఈ వాక్యమే తీసుకుంటే దీంట్లో విచారం, విరుచుకుపడని గంభీరాధిక్షేపం కలగలిసిపోయి ఉన్నాయి.

కామేశ్వరరావుగారు ‘‘త్యాగరాజు ఆత్మవిచారం’’ అని ఒక పుస్తకం రాశారు. వింత అయిన రచన. ఆయన అప్పటికి అందుబాటులో ఉన్న త్యాగరాజ కీర్తనలను అన్నింటినీ పోగుచేసి, వాటిని విషయాల వారీగా వేరుచేసి, వరసలో పెట్టుకుని, ప్రతి కీర్తనకి తాత్పర్యాలు రాసుకుంటూ వెళ్ళారు.ఆయన చేసిన పనిఅల్లా కేవలం తాత్పర్యాలు  రాయడమే. అటువంటప్పుడు ఆ పుస్తకం చప్పగా తయారయి ఉండాలి. కానీ అలా కాలేదు. గొప్ప జీవంతో కూడిన పుస్తకంగా తయారయింది. కారణం ఏమిటంటే కామేశ్వర రావుగారు ఆ కీర్తనలలోని భావాన్ని అనుభవించి, ‘గొప్ప వాడుక భాషలోకి’ అనువదించి రచించారు.ఆ వాక్యాలలో మంచి ధార, ఎంతో ఆర్తి ఉంటాయి.కొన్ని కీర్తనలకు ఆయన తాత్పర్యం రాయడం కోసం ఎంత శ్రమించారు అనిపించే పట్టులు కనపడతాయి.అవి ఒకపట్టాన లొంగవు అన్వయానికి.

ఆ పుస్తకం చదివేదాకా, వట్టి  తాత్పర్యాల పుస్తకం అంత సజీవంగా తయారయ్యే అవకాశం ఉందని మనకి తట్టను కూడా తట్టదు. దాన్ని పరిచయం చేశారు పతంజలి శాస్త్రిగారు. చాలా బాగా చెయ్యగలిగారు. అందుకు కారణం ఉంది. పతంజలి శాస్త్రిగారికి సాహిత్యంలో లోతైన అవగాహన ఉండడమే కాక సంగీతం అంటే వల్లమాలిన ఇష్టం ఉంది.    ఎంత సంగీతం విన్నారో లెక్కలేదు. బొంబే జయశ్రీ, సంజయ  సుబ్రహ్మణ్యంలాంటి వాళ్ళంటే ఉన్న ఇష్టం ఆరాధనే. సంగీతం నేర్చుకోలేదని అంటారు గానీ,ఈ మక్కువవల్ల ఆయనకి సంగీతంమీద ఒక అవగాహన అధికారం సంక్రమించాయి.కొన్ని మంచి వాఖ్యలు చేశారు.

సాహిత్యాన్ని విస్మరించి`అంటే అనుభవించకుండా, గమనించకుండా `పాడుకుంటూ పోతున్న మన సంగీత విద్వాంసుల వైఖరికి విచారిస్తూ కొన్ని గొప్ప పంక్తులు రాశారు పతంజలి శాస్త్రిగారు.

‘‘ఒక రకంగా చూస్తే  శ్రోతకంటే గాయకుడే ఎక్కువ నష్టపోతున్నాడు.శ్రోతకి స్వర మాధుర్యం, ఆలాపన మాత్రం అయినా  దక్కుతున్నాయి. తన ఆవరణంలోంచి మరో ఆవరణంలోకి పొంగిపోయే ఒక ఉత్కష్టమైన అవకాశాన్ని గాయకుడు ‘గానవిడుచుకుంటున్నాడు’’’ అన్నారు.

‘‘సాహిత్యం, తదర్థం అప్రధానం అనుకోవడం వల్ల గానంలో ఆర్తీ ఆర్ద్రత కరువైపోయాయి.’’ కర్నాటక సంగీతంలో మనకి విద్వాంసుడనే మాటేగాని కళాకారుడు అనే మాట వ్యాప్తి లోకి రాలేదు. అలా రాకపోవడం వెనక ఒక అజ్ఞాత అవగాహన ఉంది. ఆ అవగాహనకి మాటలు తొడిగితే ఈ వాక్యం పుడుతుంది.

అండర్‌ స్టేట్‌మెంటు శాస్త్రిగారికి చాలా ఇష్టమైన ఉక్తి రీతి. ఎవర్నీ అమితంగా పొగడరు ఎంత ఇష్టులైన కూడా. అటువంటిది ఎంత మాట అనేశారో చూడండి .

‘‘నిజానికి మేష్టారే త్యాగరాజస్వామి అయి రచించిన గ్రంథం ఇది.’’ మళ్ళీ ఇందులో ఒక జాగ్రత్త ఉంది. త్యాగరాజ స్వామివారే మేష్టారయి రచించిన పుస్తకం అని అనడంలేదు.

అలాగే లోప ప్రస్తావనలూ చేస్తారు.

కామేశ్వరరావుగారి రచనలలో అతివ్యాప్తి దోషం కనిపిస్తుంది అన్నారు ఒకచోట (ఏమరు పాటున). ఇంకొంచెం క్లుప్తీకరిస్తే  బాగుండేది అన్నారు.ఇక్కడ వారు చెప్పాలనుకున్నది అతి వ్యాప్తి దోషం కాదు పునరుక్తి దోషం అనో, అధిక ప్రసంగ దోషం అనో అనాలనుకుంటాను. నేను చెప్పదలుచుకున్న విషయం ఏమిటంటే శాస్త్రిగారు ఎక్కడయిన భమిడిపాటివారి లోని లోపాన్ని చెప్పాల్సి వస్తే  చెప్పనే చెప్పారు మర్యాదకు లోపం లేకుండా. ఇది ఉండాల్సిన గుణం.

ఆంధ్రనాటక పద్య పఠనం అనే కామేశ్వరం వుగారి పుస్తకం గురించి రాస్తూ చివర్న ఆయన ఏం చేసి ఉంటే మరింత  బాగుండేదో కూడా చెప్పారు. ‘‘మేష్టారు ‘ఆపెం ’ లనబడే కేవల సంగీత రూపకాల గురించి ‘బేలీ’ గురించీ ఒక అధ్యాయంలో వివరించి ఉంటే బాగుండేది….. ఆ (వాటితో)పోలిక మేష్టారి సిద్ధాంతాన్ని మరింతగా బలపరిచి ఉండేదనుకుంటాను’’ అన్నారు. ఇది లోతుగా ఆలోచిస్తే గాని అనలేని మాట.

కామేశ్వరరావుగారి నాటక సాహిత్యంగురించి రాసిన అధ్యాయంలో ఒకటి రెండు మంచి పరిశీలనలున్నాయి. ఒకటోది‘‘మానవ స్వభావాన్ని కొంత కేరికేచర్‌ చెయ్యడం ఉద్ధేశ్యం అయితే అది నెరవేరలేదనే చెప్పాలి. నాటకాలలో సంభాషణల విషయంలో మేస్టారు అవలంబించిన వాక్య నిర్మాణం ఒకటి అనువాదం అనుసరణాకాకుండా మధ్యస్తంగా ఉండిపోయి అసౌకర్యం కలగజేస్తుంటాయి.’’ అని నాన్పుడు లేకుండానే చెప్పారు.

‘‘అలాగే అనువాదం చదువుతుంటే సుఖంగా ఉండదు. సంభాషణలు సంబోధనలు, ఇంగ్లీషు వాక్యనిర్మాణాన్ని గుర్తుచేస్తూ ఉంటాయి. నేటివిటీ కోసం ప్రయత్నించలేదు మేష్టారు.’’ అని రాశారు వినయ ప్రభ నాటకం గురించి.

భాసుడు రాసిన పౌరాణిక నాటకాలకు భమిడిపాటి వారు వాడిన మాండలికం నప్పలేదని చెప్పడానికి మొహమాట పడలేదు.‘‘విమర్శన దృష్టితో చూసినట్టయితే ఆయన ఏ ఉద్దేశ్యంతో తెనిగించారో అది పూర్తిగా నెరవేరిందని చెప్పలేం….  ఉపయోగించిన భాష, వాక్య నిర్మాణం, సౌకర్యంగా లేవని చెప్పాలి….. చారిత్రక నాటకాల్లో, పౌరాణిక నాటకాల్లోకూడా ఒకే రకమైన మధ్యతరగతి గోదావరి మాండలికాన్ని ఉపయోగించారాయన.’’

ఇలా చెప్పడానికి వీలివ్వని సందర్భంలో మరో పంథా అనుసరించారు. ఇది శాస్త్రిగారిరచన రీతి ఎరిగిన వాళ్ళకి ఆశ్చర్యం కలిగిస్తుంది.

మోలియర్‌ షెరిడాన్‌ నాటకాల అనుసరణల గురించిన అధ్యాయంలో  శాస్త్రిగారు తనకు ఏమాత్రం నచ్చనిపని ఒకటి చేశారు. ఆయా నాటకాల కథల్ని పరిచయంచేసి ఊరుకున్నారు. పైగా ఆ కథలు అస్సలు ఆసక్తికరంగా ఉండవు.కథలుగా వాటిని చదవనేలేం.చదివినా  అవగాహనకు అందవు. అలాంటి పరిచయం చేసి ఆశ్చర్యపరిచారు.ఒక జీవిత చరిత్ర కారుడు గా ఆయన ఏం చెయ్యాల్సి ఉంది? ఏంచేసినట్టు? అని.

అంతకన్న ముఖ్యమైన ప్రశ్న ఎందుకు చేసినట్టు అన్న ప్రశ్న. ఇది కీలకమైన ప్రశ్న.

భమిడిపాటి వారు రాసిన నాటకాలలో దేశకాలపాత్రాదులేవీ తెలుగువి కావు. షెరిడాన్‌, మోలియర్‌ సృష్టించిన పాత్రలు మనకి మన సంఘంలో కనిపించవు.ఇక్కడ ఆ సంఘటనలు జరిగే అవకాశం లేదు.అందుచేత వాళ్లు తెలుగు మనుషులనీ, అది తెలుగు వాళ్ల జీవితమనీ, అనిపించదు. భాష మాత్రం తెలుగుతనంతో ఉంటుంది. ఈ స్థితిని సమర్థించడం, ప్రశంసించడం కష్టం. ఇక్కడ హాస్యం ఉంది, కానీ అది పాతబడిన హాస్యం. ‘ఈ కాలపు రచయితగా విశ్లేషిస్తాను’ అని మొదట్లో అన్న శాస్త్రిగారి వాక్యాన్ని గుర్తుకు తెచ్చుకోవాలి.కాలదోషం పట్టిన హాస్యం కనక వదిలేశారు. కానీ కాలాన్ని దాటి   బతికిన హాస్యం కూడా అక్కడక్కడా ఉంది. పోనీ ఆ హాస్య సృజనను  విశ్లేషిద్దామా అంటే హస్యసృజనలో భమిడిపాటి  వారి భాగం ఎంతో, మూల రచయిత భాగం ఎంతో తేలాలి. ఈ క్లేశం శాస్త్రిగారికి అడ్డుతగిలి ‘‘నేను ఈ అనుసరణలు, అనుసృజనలు చేసి ఉండాల్సింది కాదు’’ అని కామేశ్వరరావుగారు వాపోయిన విషయాన్ని మాత్రం గట్టిగా గుర్తుచేసి నాటకాల కథల సారాంశాల్ని గుదిగుచ్చి వదిలేశారు.

అయితే భమిడిపాటివారి వ్యాసాలు ఆయన సొంతరచనలే. అందులో కనిపించే వస్తువుగురించి, హాస్య సాధన సామగ్రి గురించి రాయవలసి ఉంది. శాస్త్రిగారు ఆ పనిచేసినట్టయితే మంచి విశేషాలు,విశ్లేషణలు బయటపడి ఉండేవి.

అయితే ‘‘ఎన్ని పరిమితులున్నా  శానయ్య(భమిడిపాటి వారి నాటకాలలో పాత్ర) అసలుసిసలైన తెలుగువాడు’’ అని రాయడం మరిచిపోలేదు.

పునర్మూల్యాంకన విమర్శ పేరుతో సాగుతున్నవిశ్లేషణగురించి సందర్భం వచ్చినప్పుడు శాస్త్రిగారు చేసిన వ్యాఖ్యలు గమనించదగ్గవి.‘‘మిగతా  అనేక మాత్సర్యాలు దురభిప్రాయాలతో పాటు రచయిత జీవించిన కాలం గురించి మర్చిపోవడం ఈ విమర్శలో ప్రాథమికమైన లోపం,’’ అని చచ్చు తెగేసి చెప్పారు.

ఈ పుస్తకంలో శాస్త్రిగారు ఇతరులు దృష్టిపెట్టని ముఖ్యమైన పని ఒకటి చేశారు.

త్యాగరాజు ఆత్మవిచారం పుస్తకంలో వ్యాసాల్లో, సంవాద రూపకాల్లో ఆయన సాహిత్య దృష్టి సూటిగా వెల్లడి  అయిందనీ కానీ దానికి రావలసినంత ప్రచారం రాలేదనీ గుర్తింపచేశారు.

ఉదాహరణకు `‘‘ పదాడంబరంతో నిస్సారమైన తెలుగు కవిత్వాన్ని , భాషాపరంగా తెలుగు తనం లోపించిన కవిత్వాన్ని, పద్యాలు అల్లడమే కవిత్వం అనుకునే అమాయికత్వాన్ని, మేష్టారు అనేక సందర్భాల్లో బట్టబయలు చేశారు….గడచిన తొలిశతాబ్ది తొలిరోజులలోనే సాహిత్యం ఏ ఒక్క సామాజిక వర్గానికో చెందినది కాదని అనడం మేష్టారి నిజాయితీకి  మచ్చుతునక’’ అన్నారు.

కామేశ్వరరావుగారి ఆధునిక భావాలు ఆయన హాస్య సృజన ప్రతిభ మరుగునపడి మనం గమనించలేదనడం మరో విశేషం. వీరేశలింగంగారు స్థాపించిన అనాథ మహిళా సదనానికి వెళ్లి సాయంత్రంవేళల్లో పాఠాలు చెప్పేవారని తను సేకరించిన సమాచారాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించారు.

శాస్త్ర ప్రసక్తి వచ్చినప్పుడు ఏదైన కాన్సెప్టుని వివరించాల్సి వచ్చినప్పుడు కామేశ్వరరావుగారు వాడే భాష ఎంత నిర్దుష్టంగా మరెంత నిర్దిష్టంగా ఉంటుందంటే జాగ్రత్తగా చూసినవాళ్లు ఆశ్చర్యపోతారు. ‘‘శాస్త్రం ఎప్పటికప్పుడు అసంపూర్ణం. కళ ఎప్పటికప్పుడు సమగ్రమే.’’ లాంటి వాక్యాల్ని ఎత్తిచూపి శాస్త్రిగారు ఆ విషయం గమనింపచెయ్యడం బాగుంది.

వాడుక భాష పట్ల భమిడిపాటి వారికి ఉన్న ఇష్టాన్ని తెలపడానికి ఇష్టం అనేమాట చాలదు.‘‘ నీ హృదయ స్థితి నువ్వు మాట్లాడగలిగితే భాష గురించి సిగ్గుపడకు. ఎవడి హృదయ స్థితికి తగ్గ భాష వాడికి అమిరే ఉంటుంది. మాట్టాడేసెయ్యి….. హృదయానందానుభవాన్ని లిఖితం చేసేటప్పుడు మానవాతీతుణ్ననుకోకూ ఆ పళంగా అనెయ్‌ దాన్లోవిశేషం ఏమిటంటే దేశంలో హృదయం గల మనుషులు దాన్ని నిలుపుకుంటారూ…’’ ఇలా చెబుతారు.ఈ మాటలు గిడుగు వారి గురించి రాసే సందర్భంలో చెప్పిన కామేశ్వర రావుగారి మాటలే అని సులువుగా గ్రహించొచ్చు. ఇలాంటి విశేషాల్ని గమనింప చెయ్యడం శాస్త్రిగారి మోనోగ్రాఫ్‌లో మరో విశేషం.

భమిడిపాటి కామేశ్వరరావుగారు ఉత్త హాస్యరచయిత కాదని హెచ్చరించడం తక్కువ సంగతి ఏమీ కాదు.

(తల్లావజ్ఝల పతంజలి శాస్త్రి గారికి అజో విభో కందాళం ఫౌండేషన్ వారి ప్రతిభామూర్తి జీవిత కాల సాధనా పురస్కారం జనవరి 9 న కాకినాడ లో ప్రదానం చేస్తున్న సందర్భంగా  భమిడిపాటి కామేశ్వరరావు గారి మీద శాస్త్రి గారు రాసిన మోనోగ్రాఫ్ గురించి రాసిన వ్యాసం )

*

 

శ్రీ వేంకటేశ్వర రావు రెంటాల

Add comment

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు