బ్రహ్మాస్త్ర

క ఆలోచన, ఆశ నుండి ఆశయంగా మారినప్పుడు, అది మనల్ని దాటి నలుగురిని చేరాలంటే, ఎంత ఇష్టం ఉంటుందో, అంతకు మించిన కష్టం ఉంటుంది.

నా మేనల్లుడు, ఓ రోజు టీవీ లో ఏదో ఇంగ్లీష్ సినిమా చూస్తున్నాడు. ఏం సినిమారా అని అడిగాను. వకాండ అని అన్నాడు. అంతే కాదు, ‘మామ, ఈ సినిమా కి వెళ్ళాలి మామ అన్నాడు’. అవెంజర్స్ సినిమాల్లాంటి వి చూసే వారికీ ఈ వకాండ కొత్త ఏమీ కాదు, అవెంజర్స్ అయితే అది వేరే లెక్క. అలానే, డీసీ ఎక్స్టెండెడ్ యూనివర్స్(wonder woman, Batman v Superman, Justice League, Aquaman),

మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ లో “The Infinity Saga”,

Phase One  – Iron Man, The Incredible Hulk, Iron Man 2 , Thor, Captain America, The Avengers.

Phase Two – Iron Man 3, Thor: The Dark World, Captain America: The Winter Soldier, Guardians of the Galaxy, Avengers: Age of Ultron, and Ant-Man .

Phase Three – Captain America: Civil War, Doctor Strange, Guardians of the Galaxy Vol. 2, Spider-Man: Homecoming, Thor: Ragnarok, Black Panther, Avengers: Infinity War, Ant-Man and the Wasp, Captain Marvel, Avengers: Endgame, and Spider-Man: Far From Home.

Phase Four “The Multiverse Saga” – Black Widow, Shang-Chi and the Legend of the Ten Rings, Eternals, Spider-Man: No Way Home, Doctor Strange in the Multiverse of Madness, Thor: Love and Thunder (2022), and Black Panther: Wakanda Forever (2022).

చూసారా, ఎన్ని ఉన్నాయో. మళ్ళీ అన్నీ ఒకదానితో ఒకటి క్రాస్ కనెక్షన్ తో వేరే సినిమాలు గా కూడా ఎలా వస్తున్నాయో. మరి ఇలాంటివి మనకి రావంటామా? రావొచ్చు, వస్తాయి. కానీ, వచ్చిన ప్రతీ సారీ, నడిచే డిస్కషన్ ఏంటి అంటే,  వాళ్లంతా గొప్పగా ఉండవని. ఎందుకు? వాళ్ళ గ్రాఫిక్స్ ఎక్కడ, మనవి ఎక్కడ? వాళ్ళ బడ్జెట్స్ ఎక్కడ, మనవి ఎక్కడ? అవునా, ఇందులో ఎంత వరకు నిజం? ముమ్మాటికీ చాల మటుకు నిజమే. ఈ సినిమాలనే కాదు, కొద్దిగా మంచి విజువల్స్, అది కూడా గ్రాఫిక్స్, విజువల్ ఎఫెక్ట్స్ తో ముడిపడి ఉన్న సినిమాని తీయాలంటే, బడ్జెట్ ఎంత ముఖ్యమో, బడ్జెట్ ఉన్నా కూడా ఆ ఎగ్జిక్యూషన్, గ్రాఫిక్స్ కరెక్ట్ గా, గ్రాండ్ గా రావాలన్నా కూడా మనకి కష్టం అయిపోతున్నాయి. పెద్ద దర్శకులలో, రాజమౌళి ఒక్కడే కొద్దిగా సక్సెస్ సాధించాడు. అక్కడక్కడా, చిన్న దర్శకులు. మిగతా అంతా, వచ్చిన దానిలో సర్దుకుపోవటమే, తప్పదు మరీ. మిన్నల్ మురళి సినిమా మాత్రం దీనికి మినహాయింపు. సూపర్ పవర్స్ ఉన్న ఇద్దరు గ్రామస్తుల జీవితం లో ప్రేమ అనే ఎమోషన్ తో సంఘర్షణ తీసుకొచ్చి, అసలు గ్రాఫిక్స్ విషయం లో కూడా చాలా బాగా వచ్చిన అయినా సినిమా అది.

అయితే పైన చెప్పిన యూనివర్స్ సినిమాలలాగా, మనకి కూడా రావా అన్న ప్రశ్నకి సమాధానంగా వచ్చిన సినిమానే బ్రహ్మాస్త్ర. మన దగ్గర, కథలకి ఏం కొదువ లేదు. కానీ, ఇలాంటి కథలు హాలీవుడ్ నుండే రావాలన్నట్టు అయిపోయింది. నిజమే, అలాంటి అనుభవంలోకి వాళ్ళు మనల్ని తీసుకెళ్తారు. అయితే, బ్రహ్మాస్త్ర సినిమా విషయం లో నాకెందుకో దర్శకుడి ఆలోచనని, అతని ప్రయత్నాన్ని, కష్టాన్ని అభినందించకుండా ఉండలేను. నిజానికి, నాకు ఈ సినిమా మీద మొదట్లో, రణబీర్ కపూర్ కాబట్టి కొంత ఇంటరెస్ట్ ఉండింది. కానీ, అదెప్పుడయితే KaJo యూనివర్స్ నుండి వస్తుంది అని విన్నానో, అందునా RaMou కూడా సపోర్ట్ చేసేసరికి(ఎన్నో మంచి లేదా చిన్న సినిమాలకి కాకుండా, అందునా తెలుగు కాని సినిమాకి అండగా నిలబడటం నాకు వ్యక్తిగతంగా నచ్చలేదు), అదేదో వీడియో లో న్యూస్ రీడర్ అన్నట్టు, ‘మూడ్, ఉత్సాహం రెండు పోయాయి”. కానీ, తెలుగు వెర్షన్ కి సపోర్ట్ చేయటానికి KaJo కాకుండా, దర్శకుడు అయాన్ ముఖర్జీ తో తాను మాట్లాడిన తర్వాత, ఈ నిర్ణయం తీసుకున్నా అనటంతో, ఒక సారి నాలో రచయిత, దర్శకుడు అయాన్ ముఖర్జీ వైపు దృష్టి పెట్టారు. అతని మొదటి సినిమా, కమింగ్ ఆఫ్ ఏజ్ జానర్ లో వచ్చిన ‘వేక్ అప్ సిద్’ నాకు నచ్చిన సినిమా. ఆ తర్వాతి సినిమా, ‘ఏ జవానీ హై దివానీ’ మాత్రం నాకంతగా నచ్చలేదు. కానీ అతని సినిమాల్లో కెమెరా వర్క్, ఫ్రేములు, లైటింగ్, కలర్ పాటర్న్, అన్నిటికి మించి మ్యూజిక్ భలేగా ఉంటుంది. నిజంగానే, బ్రహ్మాస్త్ర లాంటి ఒక కథని(మన ఫోక్లోర్ లేదా మైథలాజికల్), ఊహించుకోటం, రాయటం, నారేట్ చెయ్యటం, నిర్మాతల్ని ఒప్పించటం, తన టీం తో కలిసి ఇప్పుడు మనం ఏదైతే చేస్తున్నామో(లేదా చూసి పేర్లు, వంకలు పెడుతున్నామో) ఆ ఔట్పుట్ ని తీసుకురావటం అంటే మామూలు విషయమా?

ఈ సినిమాని ఇంట్లో అప్రయత్నంగానే చూసాను. అందునా థియేటర్ లో చూడలేదు. కాబట్టి, థియేటర్ లో చూసి నచ్చని వారికీ, నా క్షమాపణలు. ఈ సినిమా ని ముందు నుండి మనకి ‘అస్త్రావర్స్’ సినిమాగా పరిచయం చేస్తూ వచ్చారు, సినిమా ఓపెనింగ్ సీన్ కూడా అదే. బ్రహ్మ శక్తి కారణంగా, పంచభూత అస్ర్తాలు, పశుపక్ష్యాదుల అస్త్రాలు జన్మించిన తర్వాత, ఋషులు బ్రహ్మ శక్తిని శాంతిపచేసిన కారణంగా బ్రహ్మాస్త్ర కూడా పుడుతుంది. ఆ బ్రహ్మాస్త్ర, కేవలం చూడటానికే కాదు, శక్తి విషయంలో కూడా,  శివుని త్రినేత్రంలా ఉంటుంది. దానికి సృష్టి మరియు వినాశక శక్తులు రెండూ ఉంటాయి. ఇక్కడ బ్రహ్మ శక్తి అంటే, బ్రహ్మ యొక్క శక్తి అని కాదు, అదొక గొప్ప దైవ శక్తి అని. అలానే మనం పాత సినిమాల్లో ఈ అస్త్రాల కాన్సెప్టులు చూసే ఉంటాము. ఒకరు అగ్ని బాణం వేస్తే మరొకరు నీటి బాణం వెయ్యటంలా అన్నమాట. రామాయణంలో, ఇంద్రజిత్తు(రావణకుమారుడు) వేసిన నాగపాశానికి, రామలక్ష్మణులు స్పృహ తప్పగా, హనుమంతుడి చొరవతో, గరుత్మంతుడు(పక్షిరాజు), రామలక్ష్మణులను రక్షిస్తాడు. ఆ వెంటనే, వాసవి శక్తి ని ప్రయోగించటంతో, లక్ష్మణుడు చావకుండా, హనుమంతుడు సంజీవని మూలిక కోసం, హిమాలయాల నుండి ద్రోణగిరిని తీసుకొస్తాడు.

శివ తనకున్న శక్తి సాయం తో బ్రహ్మాస్త్ర యొక్క ఒక భాగాన్ని కాపాడుతున్న సైంటిస్ట్ ని, అతని దగ్గరున్న వానర అస్త్రాన్ని, అతని మీద దాడి చేసిన, జునూన్,  తన సభ్యులని చూస్తాడు. జునూన్ ఎలా ఆ వానర అస్త్రాన్ని, బ్రహ్మాస్త్ర భాగాన్ని వశపరచుకుందో కూడా చూస్తాడు. ఇక్కడ జునూన్ ని రెండు రకాలుగా చూడొచ్చు. వెనక ఉండి నడిపిస్తున్న దేవ్ యొక్క జునూన్ అంటే ప్యాషన్ గాను, అలాగే జునూన్ ఒకవేళ దేవ్ ని వాడుకుని తన పని ఏదన్నా జరుపుకోవాలి అని ఇదంతా చేస్తుంటే, ఆమె  ప్యాషన్ గాను చూడొచ్చు. అందుకే ఆమెకి పింక్ కలర్  ఛాయని  పెంచి, ఆమె వచ్చినప్పుడల్లా చూపిస్తారు.

జరిగింది అంతా చూసి కళ్ళు తెరచిన శివ, ఇషా(ఆలియా) ని చూస్తాడు. ఆ వెంటనే వచ్చే ఓ సీన్ లో, రావణదహనం జరుగుతున్నప్పుడు, శివ ఇషా ని చూడగానే ఆ అగ్ని పైకి ఎగసిపడుతుంది. ఈ అగ్ని మాములుగా,  గోల్డెన్ లేదా ఎల్లో షేడ్ కాకుండా, దాన్లో పింక్ కలర్ మిక్స్ అయిన మంటలా మనకి కనపడుతుంది. దర్శకుడు ఇకపై ఏం చెప్పాలనుకుంటున్నాడో, చూపించాలనుకుంటున్నాడో, మనం ఈ సీన్ తో అర్ధం చేస్కోవచ్చు. శివలో ఉండే శక్తికి ఆ ప్రేమ ఎలా ఆజ్యం పోయగలదో మనం చూడొచ్చు. దర్శకుడు ఆట్టే టైం వేస్ట్ చెయ్యాలనుకోలేదు. అందుకే మొదటినుండి వారి బాండింగ్ ని పోయెటిక్ గానో, నోవెలిస్టిక్ గానో చూపే ప్రయత్నం చేసాడు. ఉదాహరణకి, శివ, ఇషాని, తన ప్లేస్ కి తీసుకువెళ్ళడానికి, పెద్దగా కష్టపడడు. ఆమె కూడా అతనితో ముందు నుండే కనెక్ట్ అవుతున్నటుగా దర్శకుడు చూపిస్తాడు. ఆమెని తన ప్లేస్ కి తీసుకువెళ్లే స్టైల్ పోయెటిక్ గా, రసియా అనే మెలోడియస్ పాటలో, శివకి ఇషాపై కలిగిన ఫీలింగ్స్ ని,  మోంటేజ్ లో వ్యక్తపరచడం బాగుండింది. ఆ తర్వాత శివ అనాధ సెంటిమెంట్ సీన్ రొటీన్ అయినా, వెంటనే వాళ్ళ మధ్య కాన్వర్సేషన్ ని, ఎమోషన్స్ ని, పింక్ మరియు బ్లూ లైట్స్ వాడుకుని దర్శకుడు ప్రయత్నించిన తీరు బాగుంది. ఆ వెంటనే వాళ్ళ మధ్య బాండింగ్ బలపడుతూండగా, మళ్ళీ బయటెక్కడో వెలుగుతున్న టపాసుల నిప్పు, గోల్డ్ , పింక్ షేడ్ అగ్నిలా రావటం చూస్తాం.

ఆ వెంటనే సైంటిస్ట్ మరణం, ఆర్టిస్ట్(నాగార్జున) ని సేవ్ చేయటం కోసం ఇద్దరు ప్రయత్నించటం, చివరకి ఆర్టిస్ట్ జునూన్ ని అడ్డుకునే క్రమంలో చనిపోతాడు. ఆర్టిస్ట్ దగ్గర ఉన్న నంది అస్త్ర, జునూన్ ని చేరుతుంది. బ్రహ్మాస్త్ర  రెండో భాగం తో కష్టపడి ఆశ్రమం చేరతారు శివ, ఇషాలు. అక్కడ ఇషా ని రక్షించటం కోసం, మరొక సారి తన శక్తిని, ఇషా పై తనకున్న ప్రేమ సాయంతో, అగ్నిని అస్త్రం లా వాడతాడు శివ. ఇది గమనించిన గురూజీ(అమితాబ్), శివ లో దేవ్ ని, అగ్ని అస్త్రాన్ని చూడటం తో ఇంటర్వెల్.

ఆ తర్వాత ఇషాకి ఏదో సమస్య వచ్చినప్పుడు, ఆశ్రమం లో ఉన్న శివ, తనకున్న శక్తి వల్ల తెలుసుకుంటాడు, అప్పుడే తనలో అగ్ని దానంతట అదే రావటంతో, అక్కడనుండి ఆ శక్తి పై సాధన చేస్తాడు. ఆ మొత్తం ఎపిసోడ్ ని, దేవా అనే అద్భుతమైన పాటలో, దర్శకుడు మోంటేజ్ లో చూపించటం చాలా చాలా బాగుంది. ముఖ్యంగా ఆ పాట, చింగారియా అనే లైన్ తో అరిజిత్ సింగ్ ఎత్తుకోవడంతోనే ఆ ట్రాన్స్ మొదలవుతుంది.

చింగారియా ఏ జో మేరే సీనే మే హై దఫన్

ఇంకో జరా దేకే హవా బన్ జావు మై అగన్

నా హృదయంలో అణచివేయబడిన నిప్పురవ్వ బయటకు వచ్చి అగ్నిగా మారనీ

దహక్ రహా హై బన్ కే షరారా దేఖ్ మేరా బదన్

సబ్ కుచ్ మేరా కర్కే ఫనా కర్తా హూ మై హవన్

నా శరీరం “అగ్ని మెరుపు”లా కాలిపోతోంది, నా దగ్గర ఉన్నదంతా ఈ పవిత్ర అగ్నికి అంకితం చేస్తున్నాను.

మెహసూస్ ఖుద్ కో మైనే కియా జబ్ తూనే చువా – నువ్వు నన్ను తాకినప్పుడు నేను మళ్ళీ బ్రతికినట్లు అనిపించింది

మనిషికి, దైవానికి ఉండే అందమైన రిలేషన్ ని, దైవానికి, దైవ చిత్తానికి మనిషి సరెండర్ అవ్వటం అనే కాన్సెప్ట్ ని, అలాగే శివ ఇషా ల ‘ఫైర్’ కనెక్షన్ ని ఎంత బాగా అమితాబ్ భట్టాచార్య రాసారో, ఎంత బాగా ప్రీతమ్, అతని టీం దీన్ని ఓ మంచి పాటలా మార్చారో, దాన్ని ఎంత బాగా చిత్రీకరించారో, దాన్లో రణబీర్ ఎంత బాగా జీవించాడో. ముఖ్యంగా, ఆ ఫైర్ అతని చుట్టూ మ్యూజికల్ ఫ్లేమ్ ఫైర్ వర్క్స్ లా ఆడటం చాలా బాగుంది. అలాగే ఇది గ్రాఫిక్ లేదా వి ఎఫ్ ఎక్స్  తో ముడిపడిన పాట, కానీ రణబీర్ అక్కడ ఫైర్ ఉన్నట్టు ఊహించుకొని చెయ్యటం అనేది, దర్శకుడి గొప్పతనమో లేక రణబీర్ నటనా కౌశల్యమో తెలియదు. అలాగే ఫైర్ తో ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు దాని నీడ, దాని వెలుగు, నేల మీద పడటం అనే డిటెయిలింగ్ కూడా చాలా బాగా చేసాడు దర్శకుడు , అతని టీం.

సంగీతం చాలా బాగుంది. ‘ఏ దిల్ హై ముష్కిల్ ‘ తర్వాత ప్రీతమ్, అరిజిత్ కాంబోలో ఇదో మంచి మ్యూజికల్ ఆల్బం. వాళ్ళిద్దరి కాంబో లో మంచి మ్యూజిక్ ఆల్బమ్స్ ఉన్నాయి. కేసరియా పాట మీద కాపీ కాంట్రవర్సీ ఉంది, ఆ పాట పై నాకంత ఆసక్తి లేదు ఎందుకు అంటే, రసియా, దేవా పాటల ఇంపాక్ట్ వేరే కాబట్టి. ఓ అవార్డు ఫంక్షన్లో, అరిజిత్, ప్రోటోకాల్(సూటు, బూటు) కాకుండా, పైజామా,  చెప్పులతో రావటం, తాను అవార్డు తీసుకునేసరికి నిద్రపోవడం, వీటన్నిటిని ఓ బడా హీరో సర్కాస్టిక్ గా స్టేజి పైన మాట్లాడినప్పుడు, అరిజిత్ ‘క్యా కరుణ్ యార్, ఆప్ లోగోనే సులా దియా’ అన్నాడు. అప్పటినుండి, అరిజిత్ కి పాటల అవకాశాలు రాలేదు. దానికే ఆ బడా హీరో మరియు అతని ఆదేశాలతో, ఓ పెద్ద పాటల కంపెనీ అధినేత అని వార్తలొచ్చాయి. పాటలు వచ్చిన, అవి ఆల్బం వెర్షన్లగానే మిగిలిపోయాయి. బహుశా ఇది, తనకి ఆ దేవుడు పెట్టిన ట్రాన్స్ఫర్మేషన్ పీరియడ్ కావొచ్చు. మళ్ళీ ఇప్పుడిప్పుడే చిగురిస్తున్నాడు, ఈ సమయంలో ఈ ఆల్బం అతని విలువని మరొకసారి బాలీవుడ్ కి బల్లగుద్ది చెప్పింది. దేవా దేవా పాట, అరిజిత్ గాత్రం, ఆ ఇన్స్ట్రుమెంటేషన్ అన్నీ కలిపి ప్రాణం పోశాయి.

మామూలు గా అయితే ఇలాంటి దేవుడి పాటల ఇన్స్ట్రుమెంటేషన్ వేరేలా ఉంటుంది. కానీ ఇక్కడ మాత్రం, దేవా దేవా పాట ఓ అప్ లిఫ్టింగ్ గోస్పెల్ సాంగ్ లాగా ఉండటం ఓ విశేషం.. ఆల్బం వెర్షన్ లో రసియా అనే పాట అరిజిత్ పాడాడు, అది కూడా చాలా బాగుంది. ప్రీతమ్ దగ్గర సన్నీ.ఎం.ఆర్ లాంటి మంచి టెక్నీషియన్స్  ఉన్నారు. సన్నీ తెలుగులో స్వామి రారా , కేశవ, రౌడీ ఫెలో సినిమాలకి మ్యూజిక్ చేసాడు. సన్నీ మరియు అరిజిత్ కాంబో గురించి వేరే చెప్పక్కర్లేదు. షాదాబ్ రయీన్ ప్రీతమ్ పాటలకి, అందునా అరిజిత్ ఉంటే, ఇంకా బాగా మిక్స్ చేస్తాడు. బీజీమ్ బాగుంది. మన తెలుగు సినిమాలకి బీజీమ్ చేసే ‘సదరు మనిషి’, bgm అంటే బాగా గట్టిగా మోగించటం అనే సూత్రాన్నే వాడుతున్నాడు. ఈ మధ్య విదేశాల్లో ఒక సినిమాకి, సౌండ్ లిమిట్ ని గుర్తుచేస్తూ, థియేటర్ల బయట నోటీసు లు కూడా పెట్టారు. దాన్ని మనోడు, అదీ మన తెలుగోడి ప్రతిభ అంటుంటే, ఏమనాలో అర్థంకాలేదు. విజువల్స్ కూడా బాగున్నాయి. ఒక్కసారి గ్రాఫిక్స్ కాకుండా, ఆ ఫ్రేమ్స్ చూస్తేనే అర్ధం అయిపోతుంది. ఈ సినిమాకి 5 మంది డీ.ఓ.పీ లు కెమెరా వర్క్ చేసారు. ఎడిటింగ్ బాగుంది.

మెహసూస్ ఖుద్ కో మైనే కియా, జబ్ తూనే చువా – నువ్వు నన్ను తాకినప్పుడు నేను మళ్ళీ బ్రతికినట్లు అనిపించింది – ఈ లైన్ దైవానికి, శివకి మాత్రమే కాకుండా, శివ కి ఇషా కి కూడా సెట్ అవుతుంది. అసలు సినిమా కథ అంతా కూడా ఇదే. దైవ కార్య సిద్ధికి అతనొక అస్త్రంగా మారటం లో అతని ప్రేమే కారణం. అంతే కాదు దేవ్ ని అమ్రిత ఎదుర్కోగలిగింది అంటే, అక్కడ వారి ప్రేమ కూడా ఓ కారణమే. సెకండ్ పార్ట్ మొత్తం దేవ్ కథ కాబట్టి, దేవ్ గురించి ఎక్కువ చెప్పకుండా దాచిపెట్టాలనే దర్శకుడి తపన కూడా కనపడింది. అందుకే నేను కూడా దేవ్ ని టచ్ చెయ్యటం లేదు. ఆ దేవ్ గా మళ్ళీ మనం రణబీర్ నే చూస్తాం. అలా కాకుండా, దేవ్ పాత్రలో, రణ్ వీర్ ని కానీ , హ్రితిక్ ని కానీ చూపించిన ఆశ్చర్యపోనక్కర్లేదు.

ఇక జునూన్ గ్యాంగ్ తో యుద్ధం జరిగేటప్పుడు, ఫైట్ చేస్తున్న ఆశ్రమం వారి అస్త్రాల రంగుల విషయంలో చాలా మంది ట్రోల్ చేసారు. నిజానికి బిగ్ స్క్రీన్ పైన అలాంటి రంగులే వాడాలి. మనం స్టాండర్డ్ గా చెప్పుకునే అవెంజర్స్ లో కూడా మనం ఈ సినిమా లో చూసిన రంగులే వాడారు. థానోస్ ‘ఇన్ఫినిటీ స్టోన్స్’ అన్నిటిని సేకరిస్తాడు బలవంతంగా, మరి ఆ ఒక్కో రాయి కి ఏం రంగు వాడారు, ఇవి కాదా? స్పేస్ స్టోన్ కి బ్లూ, మైండ్ స్టోన్ కి యెల్లో, రియాలిటీ  స్టోన్ కి రెడ్, పవర్ స్టోన్ కి పర్పుల్, టైం స్టోన్ కి గ్రీన్, సోల్ స్టోన్ కి ఆరంజ్. అలాగే bladerunner2049 లో పింక్, వయొలెట్ వాడకం ఎక్కువగానే ఉంటుంది. ముఖ్యంగా సినిమాని 3D కోసం డిజైన్ చేస్తే ఈ రంగులు వాడాల్సిందే. డిస్నీ వాళ్ళ సినిమాలు అయితే మరింత రిచ్ బ్రైట్ రేడియం కలర్స్ ని వాడతారు. అవతార్ లో ఏం రంగులు వాడారు. అవతార్ 2 ట్రైలర్ చూసి వారిని తెగ ఆకాశానికి ఎతేస్తున్నాం. అవతార్ 2  ట్రైలర్ లో చూపించిన వాటర్ వరల్డ్ సీనరీ అంతా, ఐమాక్స్ కోసం స్పెషల్ గా షూట్ చేసిన వీడియోస్, డాక్యూమెంటరీస్ లో ఇంతకు ముందే వచ్చేసాయి. అవతార్ తర్వాత ఆ తరహా కూడా మనం చూసేసాం. అవతార్ 2 ట్రైలర్ లో నాకైతే ఎగ్జైటింగ్ వర్క్ ఏమీ కనపడలేదు, దర్శకుడి మీద గౌరవం, ఎన్నో ఏళ్ళ అతని కృషి తప్ప.  కాబట్టి బ్రహ్మాస్త్రాన్ని అంతలా తీసిపారేయ్యాల్సిన అవసరంలేదు. డిస్నీ encanto మూవీ లో వాళ్ళ ఫ్యామిలీ లో నే మ్యాజికల్ పవర్స్ ఉంటాయి దాన్ని కుటుంబ విలువలు, బంధాలతో కలిపి చెప్తే మనం వావ్ అనట్లేదా. షాంగ్-చి సినిమాలో కథకి, ఇక్కడ కథకి ఏమంత తేడా ఉందని.

నిజమే సినిమా లో గ్రాఫిక్స్ గొప్పగా ఏమీ లేవు, కొన్ని డిటైలింగ్ ఇవ్వటం లో దర్శకుడు తడబడ్డాడు. గురూజీ పాత్ర చేత పెద్ద ఇంపాక్ట్ ఏమీ చూపించలేదు. అన్నిటికి మించి, ప్రేమని దైవ కార్యాన్ని ముడిపెట్టి అతను ఈ కథ ఎంచుకున్నాడు. ఇలాంటి ఆలోచనలు, కథలు, ఒక్కోసారి పేపర్/సిస్టం మీద స్క్రిప్ట్ లాగా మారాలంటేనే ఎంతో కష్టం. అలాంటి ఊహని, విజువల్స్ ని, విజన్ ని పెద్ద తెర మీద ఆవిష్కరించటం అంటే మాటలా? మిగతా హాలీవుడ్ సినిమాల మాదిరిగానే, ఈ సినిమా చివర్లో ఎండ్ క్రెడిట్స్ వచ్చేటప్పుడు, సినిమాలోని కీలక సన్నివేశాల యానిమేషన్ ఇమేజెస్ స్క్రీన్ పైన వెళ్తుంటాయి. దాన్ని స్టోరీబోర్డ్ లాగా కూడా చూడొచ్చు. దర్శకుడి విజన్ ని అక్కడ చూడొచ్చు, తాను ఎలా అనుకున్నాడు ఎంతవరకు దాన్ని అందుకున్నాడు అని. మామూలు సినిమాలకైనా సరే, మన మైండ్ లో ఉన్నది పేపర్ పైకి వచ్చి, అక్కడనుండి తెరమీద ఫైనల్ గా చూస్కునేదానికి చాలా తేడా ఉంటుంది, దాని వెనక వేరు వేరు కారణాలు ఉంటాయి. అసలు సినిమా తీయటమే పురిటి నొప్పులు పడి బిడ్డని కనటం అయితే, ఇలాంటి సినిమాలు తీయటాన్ని దేంతో పోల్చాలో. యాక్టర్ రాజశేఖర్, గరుడవేగ సినిమా ఫంక్షన్ లో ఇలా అన్నాడు, ‘ ఇల్లు కట్టి చూడు పెళ్లి చేసి చూడు అని అంటారు కాని నేనంటాను, అలానే సినిమా తీసి చూడు అని’.

ఇంకో కొన్ని మంచి విషయాలు ఏంటి అంటే, అసురులు కాలకేయులు పేరుతో, వర్ణ వ్యవస్థని హైలైట్ చేసే ఎలాంటి ప్రయత్నం చేయకపోవటం, బాయ్కాట్ ట్రెండ్ లో ఈ సినిమా మతం రంగు పులుముకోకపోవటం. అలాగే, మనలో ఆశ, అత్యాశ అయినప్పుడు, చీకటి వైపు ఎలా నడిపిస్తుంది అనే మంచి పాయింట్ ని హైలైట్ చెయ్యటం. శివని ఇషా అడుగుతుంది, ‘ఇన్ని లేకున్నా, నువ్వెలా ఆనందంగా ఉంటున్నావ్ అని’, దానికి శివ అంటాడు, ‘ నేను వెలుగుని వెతుక్కుంటాను అని’. వెలుగు గా దేవుడ్ని లేదా మంచిని చూడటం. జార్జ్ అథాస్ అనే  క్రిస్టియన్ స్కాలర్ ఇలా అన్నాడు, ‘చీకటి అంటే అదేం కొత్త శక్తి లేదా ప్రపంచం కాదు. వెలుగు లేకపోవటం అంటే, దేవుడు, దేవుని వెలుగు, దేవుడు చెప్పిన విలువలు, న్యాయం, మార్గం లేకపోవటమే’. ఆ వెలుగు చీకటి మధ్య పోరాటం లో ప్రేమ  ముఖ్య పాత్రని దర్శకుడు తీసుకొచ్చాడు. వెలుగు వైపు నడిపే ఆ ప్రేమ, దేవుడిది అయినా లేదా మనిషిది అయినా కూడా మంచిదే. అందుకే, బ్రహ్మాస్త్ర శక్తిని ప్రేమాస్త్ర గా మార్చాడు దర్శకుడు. ఇది చాలా మందికి మింగుడు పడని విషయమే.

దైవ శక్తినే కాదు, ప్రేమ ముందు సైన్స్,  విధి తలవంచటం అనే పాయింట్ ని, టైం, గ్రావిటీ అనే కాన్సెప్ట్ లతో మన బుర్రని బంతి  ఆడేసుకునే ఓ ప్రముఖ దర్శకుడు కూడా వాడాడు. అందుకే, ఈ బ్రహ్మాస్త్రాన్ని నేను కూడా ప్రేమాస్త్ర గా చేసుకొని, ఆ కుంభస్థలాన్ని గెలిచేందుకు వెళ్తున్నాను. త్వరలోనే దాని పై మాట్లాడటానికి ఇక్కడికే వస్తాను, ఆ కుంభస్థలం పేరు ‘క్రిస్టోఫర్ నోలన్’.

ఇది రివ్యూ కాదు, మేధోప్రదర్శన అంతా కన్నా కాదు. సినిమా చూసినప్పుడు నేర్చుకున్న, గమనించిన అంశాలు. ఎందుకంటే నాకు సినిమా అంటే ఎంటర్టైన్మెంట్ కాదు, ఎడ్యుకేషన్.

*

Add comment

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు