‘ఒక మనిషి ప్రపంచాన్ని చిత్రించడం మొదలుపెడతాడు. సంవత్సరాల కాలం దొర్లిపోయాక, ప్రాంతాలు, సామ్రాజ్యాలు, పర్వతాలు, అఖాతాలు, నౌకలు, ద్వీపాలు, చేపలు, గదులు, పరికరాలు, నక్షత్రాలు, గుర్రాలు, ఇంకా మనుషులు వీటన్నిటి గురించిన చిత్రాలతో స్థలాన్ని నింపేస్తాడు. గహనమైన ఆ చిత్రాలకి గీసిన గీతలలో కనిపించేది తన ముఖమేనని, చనిపోవడానికి కొద్దిసేపు ముందు తనకి అర్ధమౌతుంది’. – హోర్హె లూయిస్ బోర్హెస్
హోర్హె లూయిస్ బోర్హెస్, అర్జెంటీనా రచయిత. లాటిన్ అమెరికా సాహిత్యకారులలో సుప్రసిద్ధుడైన, ప్రతిభావంతుడైన రచయిత. తాత్వికంగా తనది అజ్ఞేయవాదమని ప్రకటించుకున్నాడు. మితవాద రాజకీయాల పట్ల మొగ్గు చూపించాడు. రేసిజాన్నీ, అభివృద్ధినిరోధకులనీ, సైనిక నియంతలనీ సమర్ధించాడు. కమ్యూనిజాన్నీ, నాజీలనీ తానూ ద్వేషిస్తాననీ, ‘అయితే నా రచనలలో ఈ అభిప్రాయాలని వ్యక్తం కానివ్వన’నీ చెప్పాడు. ‘ప్రజాస్వామ్యం అంటే అది సంఖ్యాపరమైన దుర్వినియోగమేన’ని భావించిన బోర్హెస్, చివరి రోజులలో తన అభిప్రాయాలని మార్చుకుని, ప్రజాస్వామ్యాన్ని సమర్ధించాడు. తన అభిప్రాయాల సంగతి ఎలా ఉన్నప్పటికీ, ప్రపంచ సాహిత్యంలో బోర్హెస్ కి తనదైన స్థానం ఉంటుంది.
బోర్హెస్ రాసిన ‘సాక్షి’ – మూడు వందల పదాలకు మించని ఒక చిన్న కథ. ఈ కథ 1960 లో వెలువడిన తన సంకలనం ‘ది మేకర్’ (ఇల్ హాసిడోర్) లో వుంది. కథ రచనా కాలం 1957. ఈ స్పానిష్ కథకి, నార్మన్ థామస్ దె జియోవాని, మిల్డ్రెడ్ బోయర్, ఆండ్రాస్ కోర్బెన్ ఆర్తెన్ లు విడివిడిగా చేసిన మూడు ఇంగ్లీషు అనువాదాలు అందుబాటులో వున్నాయి. ముందుగా కథ ఏమిటో తెలుసుకుందాం.
సాక్షి
ఆ పశువుల కొట్టంలో ఒక మనిషి అక్కడి పశువుల వాసనలో కాళ్ళు చాచుకొని నేలమీద పడుకుని వున్నాడు. బూడిద రంగు కళ్ళు, నెరిసిన గడ్డం. నిద్ర పోవడానికి ప్రయత్నించే మనిషి లాగా, అతను అక్కడ మరణంకోసం నీరసంగా ఎదురుచూస్తున్నాడు. రాళ్ళతో కట్టిన కొత్త చర్చి నీడ దాదాపుగా ఆ పశువుల కొట్టం మీద పడుతున్నది. బ్రహ్మాండమైన రహస్య నియమాలకి ఒద్దికగా లోబడిన ఆ పగటి పూట, శిథిలమైన పశువుల కొట్టంలో వెలుగు నీడలు నిరంతరం దోబూచులాడుతూ ఉన్నాయి. పశువుల కొట్టానికి బయట దున్నిన పొలాలు, ఎండి, రాలిపోయిన ఆకులతో నింపిన లోతైన ఒక గొయ్యి, అడవి మొదలయ్యే అంచుల దగ్గర నల్లటి బురదలో తోడేలు అడుగులు. ఆ మనిషి నిద్రపోతూ కలగంటున్నాడు, మరచిపోతున్నాడు. ప్రార్ధన కోసం పిలుపునిస్తూ మోగిన గంటలు తనని నిద్రలోనుంచి మేల్కొనేలా చేశాయి. మధ్యాహ్నం వేళ గంటలు మోగించడం అన్నది ఇంగ్లండు సామ్రాజ్యంలో అప్పటికే ఒక ఆచారంగా స్థిరపడిపోయింది. కానీ, ఆ మనిషి మాత్రం తన బాల్యంలో ఓడాన్ దేవుడి ముఖాన్ని చూశాడు. భయ భక్తులూ, విస్మయానందాలూ నిండిన ఆధ్యాత్మిక అనుభవాలని చూసివున్నాడు. చిన్నతనంలో రోమన్ నాణేలనీ, బరువైన అంగవస్త్రాలనీ ధరించిన మొరటు కొయ్య విగ్రహాన్ని తాను చూసివున్నాడు. గుర్రాలనీ, కుక్కలనీ, ఖైదీలనీ బలి అర్పించే క్రతువులని చిన్నప్పుడే చూసివున్నాడు. అతనిక తెల్లవారే లోపు మరణిస్తాడు. తనతో పాటే తనకి ప్రత్యక్షంగా తెలిసిన ఆ బహుదేవతారాధకుల అన్యమత (పేగన్)ఆచారాలూ మరణిస్తాయి. ఆ ఆచారాలు మనకి ఇక తిరిగి కనిపించవు. ఆ శాక్సన్ మనిషి మరణంతో ప్రపంచం వాటిని కోల్పోతుంది, పేదదిగా మిగిలిపోతుంది.
ఒక మనిషి మరణించినప్పుడు, ఆ మనిషి ఆక్రమించిన స్థానమూ, స్థలమూ, తనతో పాటే అంతరించే విషయాలని చూసి మనం ఆశ్చర్యపడవచ్చు. కానీ ప్రతీ మరణంతో పాటు మరి కొన్ని విషయాలు, లేదంటే అనంతమైన అనేకానేక విషయాలు కూడా మరణిస్తాయి. దివ్యజ్ఞానవేత్తలు ఊహించిన విధంగా సార్వత్రికమైన జ్ఞాపకం లాంటిదేదో ఉంటే తప్ప అవి మరణించకుండా మిగిలి ఉండడం సాధ్యంకాదు. ఏసు క్రీస్తు మరణాన్ని కళ్ళారా చూసిన మనిషి శాశ్వతంగా కన్ను మూసిన ఒకానోక రోజు ఉండి ఉంటుంది. ఎవరో ఒక మనిషి మరణంతో హునీన్ యుద్ధం, హెలెన్ ప్రేమ కూడా మరణించే ఉంటాయి. మరి నేను మరణిస్తే నాతో పాటు మరణించేదేమిటి? ఏయే విషాద అనుభవాలు, పెద్దగా విలువలేని ఎలాంటి అప్రధానమైన విషయాలు, దృశ్య చిత్రాలు ఈ ప్రపంచం నుండి నాతోపాటు మాయమైపోతాయి? నేను వింటూ వుండిన మాసిడోనియో ఫెర్నాండెజ్ గొంతూ, సెర్రానో, చార్కాస్ వీధి మూలలోని ఖాళీ జాగాలో నేను చూసిన ఒక గుర్రమూ, మహాగనీ కలపతో చేసిన మేజా బల్ల సొరుగులో నేను దాచిన గంధకపు సబ్బు బిళ్ళా బహుశా నాతోపాటే మరణిస్తాయి.
కథ మొదటి పేరాలో, ముందు ఒక మనిషి మరణిస్తున్నాడనీ, అతని మరణంలో, తనతో పాటు తనకి మాత్రమే తెలిసిన విషయాలని, జ్ఞాపకాలని కూడా కోల్పోతూ, ప్రపంచం పేదదైపోతుందనీ రచయిత మనకి చెబుతున్నాడు. ఇక, రెండవ పేరాలో, ఎవరైనా ఒక మనిషి చనిపోతే, ఆ మనిషి అస్తిత్వంలో లేక పోవడంతో పాటు, అనంతమైన అనేకానేక విషయాలు కూడా అంతరించిపోతాయనీ, ఇక వ్యక్తిగా తాను (అంటే బోర్హెస్) మరణిస్తే, తనకి మాత్రమే అనుభవమైన, జ్ఞాపకమున్న విషయాలు కూడా తనతోటే అంతరించిపోతాయనీ అంటాడు.
అత్యంత క్లుప్తమైన ఈ కథలో పొరలు ఉన్నాయి. మళ్ళీ, మళ్ళీ చదివినప్పుడు అవి ఆసక్తికరమైన ప్రశ్నలనీ, ఆలోచనలనీ రేకెత్తిస్తాయి.
కథలో చనిపోతున్న మనిషి ఎవ్వరనేది నిర్దిష్టంగా మనకు తెలియదు. కానీ, క్రైస్తవేతర విశ్వాసాలనీ, బహుదేవతారాధక ఆచారాలనీ పాటించే పేగనిజాన్ని వెనక్కి నెట్టి ఇంగ్లాండులో క్రైస్తవ మతం దాదాపు పూర్తి ప్రాబల్యాన్ని సాధించిన కాలంలో, ఆ పేగన్ ఆచారాల గురించీ, క్రైస్తవ మతంతో సంబంధం లేని ఓడాన్ దేవుడిని గురించీ తెలిసిన మనిషి. వాటి గురించి ప్రత్యక్ష అనుభవం ఉండిన, సాక్షిగా ఉండిన చివరి మనిషి. అప్పటికి మధ్యాహ్న వేళ ప్రార్ధన కోసం గంటలు మోగించడం అన్నది కొత్త ఆచారంగా స్థిరపడిపోయింది.
క్రీస్తు శకం 5వ శతాబ్ది నుండి 11వ శతాబ్ది మధ్యకాలంలో ఉత్తర యూరప్ ప్రాంతాలనుంచి వలస వచ్చి బ్రిటన్ లో స్థిరపడిన జర్మానిక్ తెగల జనాలని ఆంగ్లో- శాక్సన్లు లేదా శాక్సన్లు గా వ్యవహరిస్తారు. వీరిని ఇంగ్లాండుకీ, ఇంగ్లీషు భాషకీ ఆద్యులుగా భావిస్తారు. ఇప్పటి ఇంగ్లాండు ఇంకా ఆగ్నేయ స్కాట్లాండ్ ప్రాంతాలలో ప్రధానంగా వీరు స్థిరపడ్డారు. క్రైస్తవ మతం ప్రాబల్యం సాధిచడంతో వీరి మత విశ్వాసాలు, ఆచారాలు మరుగున పడిపోయాయి. క్రైస్తవానికి భిన్నమైన వీరి మత విశ్వాసాలు, ఆచారాలని పేగనిజం గా వ్యవహరిస్తారు. 8వ శతాబ్దం తర్వాత పేగనిజం తెరమరుగై, క్రైస్తవ మతం ఆధిపత్యాన్ని సంపాదించింది.
శిథిలమైన పశువుల కొట్టం, దానిపై కొత్తగా రాళ్లతో కట్టిన చర్చి ప్రస్తావనతో కథ మొదలవుతుంది. ఆ కొత్త చర్చి నీడ పశువుల కొట్టం మీద పడడం, పశువుల కొట్టంలో పగటి వెలుగు, నీడలు దోబూచులాడడం (క్రైస్తవ పూర్వ) పేగనిజం పతనానికీ, స్థిరపడిన క్రెస్తవ మత ఆధిపత్యానికీ ప్రస్తావన. రాలిపోయిన ఆకులతో నింపిన లోతైన గొయ్యి ప్రస్తావన మరణానికీ, మరణాలతో మరుగున పడిపోయిన (పేగనిజం) జ్ఞాపకాలకీ ప్రతీక అనుకోవచ్చు. పేగన్ ఆచారాలు, దేవుడి గురించి తెలిసిన, వాటికి ప్రత్యక్ష సాక్షిగా ఉండిన ఆ చివరి మనిషి మరణంతో, ఆ జ్ఞాపకాలు కూడా అంతరించిపోయి ప్రపంచం పేదదిగా మిగిలిపోతుందని రచయిత అంటాడు.
బోర్హెస్ అక్కడి నుంచి ఆ ఆలోచనను పొడిగిస్తాడు. ప్రతీ మరణంతోనూ అనేకానేక అనంతమైన విషయాలు కూడా మరణిస్తాయని చెబుతాడు. ఏసు క్రీస్తు మరణాన్ని కళ్లారా చూసిన మనిషి, అలాగే పెరూ జాతీయ స్వాతంత్య్ర పోరాటంలో కీలక ఘట్టమైన 1824 హునీన్ యుద్ధంలో ప్రత్యక్షంగా సంబంధం ఉండిన మనిషీ (సైమన్ బోలివర్ పరోక్ష ప్రస్తావన అనుకోవచ్చా?), ఇంకా ప్రాచీన గ్రీకు గాథలో హెలెన్ ప్రేమ గురించి తెలిసిన చివరి మనిషీ ఉండి ఉంటారని బోర్హెస్ అంటాడు. ఆ జ్ఞాపకాలు చరిత్రలో కీలకమైన ఘట్టాలకి సాక్షుల జ్ఞాపకాలే కానవసరం లేదు. అవి అప్రాముఖ్యమైన, సాధారణమైన జ్ఞాపకాలు కూడా కావచ్చు. అందుకు నిర్దిష్ట ఉదాహరణగా, తాను మరణిస్తే, అంటే బోర్హెస్ తో పాటే మరణించే మూడు జ్ఞాపకాలని పేర్కొంటాడు. అందులో మొదటిది మాసిడోనియో ఫెర్నాండెజ్ గొంతు. మాసిడోనియో ఫెర్నాండెజ్ అర్జెంటీనా రచయిత, బోర్హెస్ కి గురుతుల్యుడు. నిజానికి ఇదే సంకలనంలో, డైలాగ్ ఎబౌట్ డైలాగ్ (సంభాషణ గురించి సంభాషణ) అన్న మరొక చిన్న కథలో మాసిడోనియో ఫెర్నాండెజ్ ప్రస్తావన ఉంది. ఆ కథలో అమరత్వం గురించిన చర్చ జరుగుతుంది. ఆత్మకు మరణం లేదనీ, మనిషి మరణం దానికదిగా అప్రాముఖ్యమైనదనీ మాసిడోనియో ఫెర్నాండెజ్ అన్నట్లుగా ఆ చిన్న కథలో ఉంటుంది. బోర్హెస్ మరణంతో పాటే తనకి పరిచితమైన ఆ మాసిడోనియో ఫెర్నాండెజ్ గొంతు గురించిన జ్ఞాపకం కూడా తనతో పాటే అంతరిస్తుంది. సెర్రానో, చార్కాస్ వీధి మూలలోని ఖాళీ జాగాలో తాను చూసిన గుర్రమూ, మహాగనీ కలపతో చేసిన మేజా బల్ల సొరుగులో తాను దాచిన గంధకపు సబ్బు బిళ్ళా దేనికి ప్రతీకలన్నవి మనకి స్పష్టంగా తెలియదు. అవి తనకి, తనలాంటి వ్యక్తులకి మాత్రమే తెలిసిన జ్ఞాపకాలు కావచ్చు. ఆ ప్రతీకలని అర్ధం చేసుకోవడంలో మన నేపథ్యానికి పరిమితి కూడా ఉంటుంది.
ఒక చారిత్రిక సన్నివేశంలో, నిర్దిష్ట పరిసరాలలో, ఎవరో (తెలియని) ఒక మనిషి మరణంతో కథ మొదలౌతుంది. ఏ మరణంలోనైనా ఆ మరణంతో పాటు అంతరించే విషయాలు అనేకం ఉంటాయని ప్రతిపాదిస్తుంది. బోర్హెస్ స్వీయ మరణపు నిర్దిష్టతను ప్రస్తావించి, తనతో పాటే మరణించే తన జ్ఞాపకాల నిర్దిష్టతతోనూ, ఆ జ్ఞాపకాలు దేనిని సూచిస్తాయో తెలుపని అస్పష్టతతోనూ కథ ముగుస్తుంది. కథ మనలో ఆలోచనలని, ప్రశ్నలని రేకెత్తిస్తుంది.
కథలో మరొక వైచిత్రి వుంది. ఇందులో నిజంగా సాక్షి ఎవరు? చనిపోయిన ఆ శాక్సన్ మనిషా? తాను క్రైస్తవ పూర్వ పేగన్ ఆచారాలకు ప్రత్యక్ష సాక్షి. మరి ఆ మనిషి మరణిస్తున్న తుది ఘట్టాన్ని గురించి రాసిన రచయిత? పేగన్ ఆచారాలకు ప్రత్యక్ష సాక్షి కాకున్నా, తన మరణ సన్నివేశాన్ని కళ్ళకు కట్టినట్టు చిత్రించి, ఆ శాక్సన్ మనిషి మరణంతోనే అంతరించి పోయాయనుకున్న జ్ఞాపకాలను క్లుప్తంగానైనా ప్రస్తావించిన రచయిత సైతం ఒక విధంగా సాక్షి కాదా? ప్రత్యక్ష సాక్షికాకుంటే పరోక్షమైన సాక్షి అనుకోవచ్చునా? మరి పాఠకులు? ఈ కథను చదివి మన మనసులో ఆ శాక్సన్ మనిషి మరణంతో పాటు, బోర్హెస్ మరణిస్తే తనతో పాటే మరణిస్తాయని తాను చెప్పిన వాటి గురించి ఆలోచించే పాఠకులు కూడా ఒక రకమైన సాక్షులేనని అనుకోవచ్చా? ఇవి కథలోపలి పొరలు, ఆలోచనలు.
II
ఇదీ బోర్హెస్ కథ. ఇంతవరకే చెప్పుకుంటే కథ పూర్తయినట్లు కాదు. బోర్హెస్ ఉద్దేశించినది కాదు గానీ, ఈ కథకి మరొక పొడిగింపు ఉంది.
అర్జెంటీనాలోనే జన్మించిన విప్లవకారుడు చే గెవారా పుట్టిన రోజు (14 జూన్ 1927), హోర్హె లూయిస్ బోర్హెస్ మరణించిన తేదీ (14 జూన్ 1986) రెండూ జూన్ 14 కావడం పూర్తిగా కాకతాళీయమైన విషయం. విషయం అది కానే కాదు. చే గెవారా మరణించిన మూడు దశాబ్దాల తర్వాత, 1998లో అర్జెంటీనా రచయితా, చిత్ర దర్శకుడూ, కళాకారుడూ అయిన లియాండ్రో కాట్జ్ ఒక డాక్యుమెంటరీ చిత్రాన్ని నిర్మించాడు. సుప్రసిద్ధ అర్జెంటీనా గాయకుడు కార్లో గార్డెల్ ప్రఖ్యాత గీతం ‘ ఎల్ డియా క్వె మీ క్వీరాస్ – ది డే యు లవ్ మీ’ (నువ్వు నన్ను ప్రేమించిన రోజు) శీర్షికయే ఆ డాక్యుమెంటరీ పేరు.
అది కేవలం ముప్ఫయి నిమిషాల నిడివి ఉన్న డాక్యుమెంటరీ. చేగెవారా మృత దేహాన్ని ఫోటో తీసిన వ్యక్తి ఫ్రెడ్డీ అల్బోర్టాని ఆ డాక్యుమెంటరీలో ఇంటర్వ్యూ చేశాడు. చిత్రకారుడూ, రచయితా జాన్ బెర్జర్ రెండు చిత్రాలని ప్రస్తావించాడు. చే మృతదేహపు ఫోటోలతో ఆ చిత్రాలకి ఉన్న పోలికలని జాన్ బెర్జర్ వివరించాడు. ఆ రెండు చిత్రాల గురించి అల్బోర్టాకి తెలుసా అని లియాండ్రో అడిగాడు. అల్బోర్టాకి ఆ విషయం తెలియదు, కానీ తాను తీయబోతున్న ఫోటోలు మామూలు ఫోటోలు కావన్న ఎరుక మాత్రం వుంది. గుర్తించాల్సిన విషయం ఏమిటంటే, అర్జెంటీనా రచయిత జార్జ్ లూయీ బోర్హెస్ రాసిన రెండు పేరాల అతి చిన్న కథ ‘ది విట్నెస్’ నీ, 1935 లోచనిపోయిన అర్జెంటీనా గీత రచయిత కార్లోస్ గార్డెల్ పాటనీ, పాబ్లో నెరూడా కవితనీ (నో ఫర్గెటింగ్ – మరచిపోలేను) లియాండ్రో కాట్జ్ అందులో ఉపయోగించాడు.
లియాండ్రో కాట్జ్ బోర్హెస్ కథలోని వాక్యాలని చే గెవారాకి అన్వయించడం కోసం వాటిలో కొన్ని మార్పులు చేసాడు. అవి ఆసక్తికరమైనవి.
‘ఆ పశువుల కొట్టంలో ఒక మనిషి అక్కడి పశువుల వాసనలో కాళ్ళు చాచుకొని నేలమీద పడుకుని వున్నాడు. నల్లని కళ్ళు, నల్లటి గడ్డం. నిద్ర పోవడానికి ప్రయత్నించే మనిషి లాగా, అతను అక్కడ మరణంకోసం నీరసంగా ఎదురుచూస్తున్నాడు. రాళ్ళతో కట్టిన పాత చర్చి నీడ దాదాపుగా ఆ పశువుల కొట్టం మీద పడుతున్నది‘. నల్లని కళ్ళు, నల్లటి గడ్డం చే గెవారాని సూచిస్తే, రాళ్లతో కట్టిన పాత రాతి చర్చి సామ్రాజ్యవాదానికి ప్రతీక. ఇక్కడ నూతనత్వాన్ని పాత ఆధిపత్యం హత్య చేసింది. మూలంలో ‘రోమన్ నాణేలనీ, బరువైన అంగవస్త్రాలనీ ధరించిన మొరటు కొయ్య విగ్రహాల’ గురించి బోర్హెస్ మాట్లాడితే, ‘వలసవాదం కొల్లగొట్టిన బంగారాన్ని మోస్తున్న ముతక విగ్రహాల ఊరేగింపు‘ జ్ఞాపకం చే గెవారాతో పాటు మరణిస్తుందని లియాండ్రో కాట్జ్ అంటాడు. ఇక్కడ లాటిన్ అమెరికా దేశాలనుండి బంగారాన్ని కొల్లగొట్టడంతో పాటు, వలసవాదం, సామ్రాజ్యవాద దోపిడీలను ఎదిరించిన ప్రతిఘటన జ్ఞాపకాలను ఇందులో ప్రస్తావిస్తున్నాడు. చే గెవారా మరణంతో అనంతమైన అనేకానేక విషయాలు మరణిస్తాయి. కానీ చే రచనలు, ఆచరణ, మిత్రుల జ్ఞాపకాలు అన్నీ సాక్ష్యాలుగా ఉన్నాయి. చే గెవారా విప్లవానికి సాక్షి. చే గెవారా మరణానికి అల్బోర్టా ఫోటోలతో పాటు ప్రపంచమే సాక్షి.
బోర్హెస్ మూల కథనీ, అందులోని పదాలలో కొద్దిపాటి మార్పులతో లియాండ్రో కాట్జ్ అన్వయాన్నీ దృష్టిలో పెట్టుకుని, మళ్ళీ ఒకసారి ఈ కథని చదవండి. కళ్ళు మూసుకుని తలచుకోండి. మీరు ఒక సాక్షి, నేనూ ఒక సాక్షిని..ఇది కూడా కథయే!
*
Add comment