బెట్టింగ్

తండ్రి కంటే జానెడు ఎత్తు ఎక్కువ వుండే కొడుకు మీద  ఏ తండ్రి అయినా చెయ్యి చేసుకోగలడా? కోపాన్ని దిగమింగుకోడం తప్ప ఏం జేయగలడు ? యిప్పుడు నీ తండ్రి చేస్తుండేది కూడా అదేరా నాయనా! ఎన్ని ఆశలతో నిన్ను చదివిస్తున్నాంరా … మా కండల్ని కరగదీసుకుంటూ నిన్ను సదివిస్తాండాం కదరా …. ఎందుకు ? ఈ ఒక్క సంవత్సరం అయిపోతే నీ సదువు అయిపోతాది, నువ్వు ఇంజనీర్ అయ్యి మమ్మల్ని గడ్డన పడేస్తావని గంపెడంత ఆశతో వుంటిమి కదప్పా! ఏం ఆశలో ఏమోరా నాయన? రైతు ఆశలు తీరింది ఎన్నడు? మీ కాలేజోళ్ళు ఫోన్ చేసిన కాన్నుండి గొంతులోకి మెతుకు మింగుడు పడ్డం లేదురా నాయనా… కంటిమీదకు కునుకు అనేది లేకుండా అయ్యింది. పని జేసుకోడానికి కాళ్ళు , చేతులు ఆడటం లేదురా తండ్రి! నువ్వేం భయపడమాకు… నా ఊపిరి ఏం ఆగిపోదు… రైతు పానాలు అంత తొందరగా పోవు.

తిట్టి కొట్టే వయసు కాదు కదరా నీది. మంచి చెడ్డ తెలుసుకునే వయసులో వున్నావు. ఎవరి కొడుకువప్పా నువ్వు? మీ నాయన రైతు అన్న విషయం మనసుకు వుందంటావా ? నేను గుర్తు చేయాల్నేమిరా ? ఎట్లాంటి రైతు కొడుకువో నీకు ఎరుక లేకపోతే ఎట్లరా ? సంవత్సరానికి మూడు పంటలు పండే రైతు యిండ్లలో పుట్టి పెట్టిన మహారాజువా నువ్వు ఎమన్నా ? సంవత్సరం పొడిగీత , యింటి నిండా మూటలు మూటలు ధాన్యంతో మూలిగే యింట్లో పారాడినోనివి కాదు కదా నువ్వు ? గంజి పెట్టి ఇస్త్రీ చేసిన తెల్లబట్టలు కట్టుకొని , మోటారు సైకిల్ ఎక్కి ఝామ్మని టౌన్కు రేయింబగలు తిరిగే తండ్రా  నీ తండ్రి ఏమన్నా? జేబునిండా రూపాయి నోట్లతో, రెండు వేళ్ళతో నోట్లను యిసిరి పారేసే అంత  శక్తి వున్న పెద్ద ఆసామి కొడుకువు కాదురా నువ్వు. రోంత భూమి మీద నిల్చి కిందకు జూసుకుంటా నడ్సరా నాయనా ! ఓ తూరి మనింటిని జ్ఞాపకం  చేసుకోప్పా..! పదును అయ్యే వాన పడితే …అమ్మయ్య!.. ఈ ఏడాది బోరు ఏసే అవసరం లేదు. బోరు కోసం కొత్త అప్పు జేయ్యకుండా గడ్సిపోతుoది అని సంబరపడే రైతునురా నేను. ముడేండ్లకు  ఒక తూరి పంట పండితేనే మహా భాగ్యం అని మురిసిపోయేంత అల్ప సంతోషంతో బతుకుతున్న బక్క రైతునురా నేను.

మన స్థోమత ఏందో , మన యింటి పరిస్థితి ఏందో నీకు గుర్తు జేయాల్నా ? మీ అమ్మ , నేను పడే యిబ్బందులు ఏంటివో నీకు తెలియనివా ? నా శక్తికి మించిన పని అయినా నిన్ను ఇంజనీరింగ్ చదివిస్తాండేది ఎందుకురా ? ఈ రొంపిలో నువ్వు కూడా యిరుక్కుపోకూడదని , మాలెక్క మట్టి పిసుక్కుంటా బతక్కూడదని కదా ఈ తాపత్రయం అంతా !  నీకోసం ఎం చేస్తాండామో నీ కండ్లకు కనిపించలేదా ? నీ మనసుకు ఎప్పుడు తట్టలేదా ? మీ అమ్మ కష్టాన్ని ఎన్నాడయినా తల్చుకున్నావా? తల్చుకుంటే యిట్లాంటి పని ఎట్ల జేస్తావురా ? మీ కాలేజి వాళ్ళు ఫొన్ చేసి మీ వాడు యిట్లా అని చెప్తాంటే నాకు ఎట్లుంటుందిరా…! అది విని అరాయించుకునే  శక్తి అప్పులతో బతికే ఈ రైతుకు యాన్నుండి వస్తాదనుకున్యావు? అసలు మీ అమ్మతో నువ్వు చేసిన నిర్వాకం గురించి ఎట్ల చెప్పేది ? నీకోసం తన రక్తాన్ని చెమటగా  మార్చి సర్వం నీకే అందించే మీ అమ్మకు నీ కొడుకు కాలేజిలో ఎంత గొప్ప ఘనకార్యం చేసాడో అని చెప్తే … అ ఏర్రిమొగం దానికి తట్టుకునే శక్తి వుందనే అనుకున్నావా?

మీ కాలేజి నుండి ఫోన్ వచ్చి మూడు రోజులు అయ్యింది . యింట్లో మొగం సూపీకుండా తిరుగుతాండా ! గుండెకాయ ఎవరో పిసుకుతాన్యట్లు వుంది. గుండెల్లో అగ్నిపర్వతం రగులుతాంది. అది పగుల్తాదో ల్యాకుంటే యింకేమన్నా అయితాదో నాకు తెలీడంల్యా. అయినా చిత్రంగా అన్నం తింటానే వుండా . కండ్ల రెప్పలు మూత పడింటే వొట్టు. కండ్లు చింత నిప్పులు మాదిరిగా మండుతుండాయి. గుండె మాత్రం ఆగిపోలేదు… అంత గట్టి గుండెకాయరా  నీ తండ్రిది . రైతురా ..అనంతపురం రైతురా నీ తండ్రి. ఎన్ని జూసినామో! ఎన్ని అనుభవించినామో! నువ్వు గూడా కొన్ని అయినా జూసింటావు . మా నాయన , మాయబ్బ పడిండే అగసాట్లు నేను జూసినా . యిన్ని రాగి గింజల కోసం నాలుగు మిరపకాయల కోసం మాయమ్మ ఎన్ని యిండ్ల గడపలు ఎక్కి దిగేదో నేను మర్సిపోలేనురా ? ఐదొందల అప్పు గట్టలేక మా నాయన ఎంత సతమతమయినాడో నాకు యిప్పటికి కళ్ళ ముందు కదులుతానే వుంది. నులక మంచం మీద పండుకొని మొగానికి తువ్వాలు కప్పుకొని మా నాయన ఏడ్చిన ఏడుపు యిప్పటికి నాకు యిన్పిస్తానే వుండాది. ఆ ఏడుపు సుడల్యాక  మా యమ్మ తన చెవుల్లోని కమ్మలు తీసి మా నాయన చేతిలో పెడ్తే …మీ పుట్టింటోళ్ళు పెట్టిండేది మొత్తం కరగదిస్తిని గదే అంటూ మా యమ్మ మొగం జూడల్యాక తల పైకి కూడా ఎత్తలేకపాయ ఆ పొద్దు. అవి యిడిపీడానికి మా నాయన కాడ ఉసే దొరకలేదు. కడాకు చెవుల్లో కమ్మలు ల్యాకుండానే సచ్చిపాయ మాయమ్మ. అ పొద్దు మా నాయనను మా అక్కోళ్ళు ఎన్ని తిట్లు తిట్టినారోలే! కోటను ఏలిండే కులం అని కోతలు కోచ్చంటావే.! యాపోద్దయినా మాయమ్మను సుఖపెట్టినావా? బిడ్డలమే మేము అవసరం వచ్చి నాయనా అని చెయ్యి సాపితే యానాడయినా చేతిలో యింత పెట్టి  మమ్మల్ని సంతోషంగా అంపినావా ? బతకనియ్యరబ్బ ఈ ఆడిపిల్లోళ్ళు .. అంతా మీకు వూడ్చిపెట్టి పిల్లోని నోట్లో మట్టి పోయాల్నా అంటాoటివే.. యిప్పుడు మాయమ్మ నోట్లో గూడా మన్నే పొయ్యి. అంతకు మించి నీ కాడ ఏముంది?   ఎప్పుడూ అప్పులూ  ఖర్చులే..మా యమ్మ దగ్గరుండే ఆయింత బంగారాన్ని గూడా వుడబెరుక్కొని కుదవ బెడ్తివి. మళ్ళా యిడిపీడానికి  నీకు గతిల్యా. మా యమ్మది యిది అని చెప్పుకోడానికి కూడా ఎం ల్యాకుండా జేస్తివి. ధూ ! ఎంత ఏడ్సిన ఈ బతుకులు యింతే ! యా కొంపలో జూసినా యిదే రామాయణం. మా అక్కోళ్ళు తల్లి కోసం ఏడుస్తాండారో ల్యాకపోతే తమ బతుకులను తలుచుకొని ఏడుస్తాండారో  అ రోజు నాకు అర్థం కాలేదురా తండ్రి ! మూడు సంవత్సరాలకు ఒక తూరి కూతుర్లకు యింత చీర  రయిక పెట్టడానికి మా యమ్మ ఎన్ని అగసాట్లు పడేదో పిచ్చితల్లి!

కుదవపెట్టడాలు, అమ్మడాలు మనకు కొత్త కాదు. ఈ తిప్పలు అనంతపురం కోటను ఏలిండే రాజులకే తప్పలేదు. వాళ్ళు రాజులు. కష్టo జేయ్యడం అనేది వాళ్ళ రక్తంలోనే వుండదు. జల్సాలు జేస్తారు. చెడు అలవాట్లు ఎక్కువే. యాడుoడే లెక్కలు చాలవు వాళ్లకు. ఖర్చులేమో పెదిన్ని.  రాబడి పెద్దగా వుండేది కాదు మన వైపు పంటలు యానాడు సరిగ్గా పండినాయని రాబడి ఉండడానికి. పన్నులయితే కట్టాల్సిందే . యాన్నుండి వస్తాయి రూకలు. అప్పు చేయాల్సిందే . అంత అప్పు పుట్టదు. పన్ను కట్టకుంటే గుత్తి సుభేదార్ వూరుకుంటాడా ? కోటకు బీగాలు ఏసి అనంతపురం కోటను ఏలిoడే రాజును తీస్కపోయి జైల్లో పెట్టినారంట. మంచం ఎంతుంటే అంత కాళ్ళు చాపుకునే రకాలా ఆ రాజులు  ఏమన్నా! ఒక రూపాయి వస్తే పది రూపాయలు  ఖర్చు చేసే రకం . చివరకు ఏమయ్యింది.. జైల్లో కూచొని చిప్పకూడు తింటా దిక్కులేని సావు చచ్చిరి.

యిట్లా చెప్పుకుంటూ పొతే  కథ శానా వుందిలే. నీకు కూడా అ జాడే పడినట్టుంది. ల్యాకపోతే ఏందిరా ?  సదువుకోమ్మని అంపిస్తే  అడికి పొయ్యి నువ్వు ఎలాగబెట్టిoడేది ఏందిరా? చదువును పక్కన పెట్టి ఆ బెట్టిoగులు ఏoదిరా దరిద్రo కాకపొతే ! ఆ నాకొడుకులు ఎవ్వరో బెట్టిoగులు  కడ్తాoటే  నువ్వేందుకు దూరినావురా ఆ రొంపిలోకి? నీ క్రికెట్ పిచ్చికి యింత అగ్గివెట్టా! తలకాయలోకి ఎట్లాంటి విషపురుగును ఎక్కిచ్చుకున్యావురా ? యాడయినా , వుద్దరకు రాత్రికి రాత్రికి  లెక్కలు వచ్చి చేతుల్లో పడ్తాయా ? నిమిషాలలో రూపాయికి పది రూపాయిలు సంపాయించొచ్చు ..జల్సాలు చేయోచ్చు.. అనుభవించొచ్చు.. పైలా పచ్చీసుగా  తిరగొచ్చు అనుకున్నావేమో ! బొక్కబోర్ల పడి దుమ్ము నాక్కోని పోతావ్.  అంతే!

ఓరేయ ! జూదంలో ఆడి , గెలిచి బాగుపడినట్లు యింతవరకు దాఖలాలు లేవు. లక్షలల్లో ఎవడికో ఒకడికి అదీ ఎప్పుడో ఒక్కసారి జరుగుతాది. అందరికి , దిన్నమూ యాడయినా జరుగుతుందా ? ఎన్నడన్నా యిన్యామా? గెలిచినోడు వచ్చింది వచ్చినట్లు జెల్సాలు చేసి పాపర్ పడ్తాడు. ఓడిపోయినోడు ఉన్నదంతా పోగొట్టుకొని నెత్తిన గుడ్డ ఏసుకొని పోతాడు. క్లబ్బులు నడిపేటోళ్ళు యాడయినా యిస్పేట్ ఆకులు ఆడిండేది చూసినావురా?ఆడితే క్లబ్బు నడపలేడు. వాడు ఆడడు.. జనాలను ఆడేట్టుగా చేస్తాడు. ఈ చిన్న విషయం అర్థం చేసులోలేక సంసారాలను నాశనం చేసేసుకుంటాoడారు.

నెలనెల అoపిచ్చే డబ్బులు సాలవు నీకు ! జిరాక్స్ చేపిచ్చుకోవాలంటావు …ప్రింట్లు తిసుకోవాలంటావు… పుస్తకాలు కొనాలంటావు.. అది కాకపోతే పరీక్ష ఫిజులంటావు… యిట్లాటివి ఏంటివేంటివో నోటికొచ్చిన అబద్దాలల్ల చెప్పుకుంటా మా కాడ డబ్బులు తీస్కపోతివి. సరే తిస్కపోయినావు… బానే వుంది. ఏమన్నా ఉపయోగం వచ్చిండే పని చెసినావా?శభాష్ కొడకా అని అనేట్లు చేయలేదురా నువ్వు . అట్లా చేసింటే ఈ ఏడుపు అంతా ఎందుకు వుంటాది.  అ లెక్కంతా తీస్కపోయి క్రికెట్ బెట్టిoగులల్లో పెట్టినావే? మా దగ్గర మాయ మాటలు చెప్పడానికి నీకు నోరు ఎట్ల వచ్చిoదిరా? ఎంత డబ్బులు గుంజకపోతివిరా !అంతా  నాశనం చేస్తివి కదరా!

మేము మజ్జిగతో తిని నీకు గడ్డ పెరుగు పెట్టి పెంచినామురా నిన్ను. పాలు , నెయ్యి అమ్మి కూడబెట్టిన డబ్బులతో నీకు నెలనెల అంపిస్తే , తిని బలిసి యింత పని జేస్తావా? ల్యాప్ టాప్ లేకపోతె ఇంజనీరింగ్ చదవలేను కానేకావల్ల అని మమ్మల్ని నిమ్మళం పన్నీకపోతివి. మీ అమ్మ చచ్చిచెడి , ఆ పొదుపుగ్రూపుల దగ్గర అప్పు తెచ్చి కదరా నీకు  ల్యాప్ టాప్ కొనిచ్చిండేది. దాన్ని కుదవ పెడతావా ? కుదవ పెట్టిన డబ్బులతో బెట్టింగ్ ఆడతావా?అట్లా పని చేయడానికి నీకు మనసు ఎట్లా వచ్చిందిరా ? మీ అమ్మ చెమటను , రక్తాన్ని అమ్మినంత పని జేసినావు కదరా?

అ క్రికెట్ ఆడేటోళ్లకు కోట్లు కోట్లు డబ్బులు వచ్చి పడ్తాoటాయి. అ బెట్టింగులు నడిపేటోళ్లకు చేతి నిండా లెక్కలే. ఆడేటోళ్లకు ,  నడిపేటోళ్లకు యాదో లింక్ వుండే వున్నింటుoది. యింక మీలాంటి తిక్కనాకోడుకులు వుంటే వాళ్లకు డబ్బులకు కొదవ ఏముంటాది?  మీరు బెట్టింగులు ఆడటానికి వాళ్ళే అప్పులు యిస్తారు. మీ సామాన్లను వాళ్ళే కొదవ బెట్టుకుంటారు. వడ్డీలు వసూలు చేస్తారు. రూపాయి, రెండు రూపాయల వడ్డీ కూడా కాదు. పది రుపాయలంటనే. ఎక్కడ కనీ వినీ ఎరగము… ఎప్పుడు కట్టాలరా అంత వడ్డీ ? మామూలు మనుషులెవ్వరు అంత వడ్డీ ఎన్నటికి కట్టలేరు… యింక మీరేం కడ్తారు .. మీ సామాన్లను ఎప్పుడు యిడిపిచ్చుకుంటారు ? అది అయ్యే పనేనా? నాలుగు దినాలు చూసి వాళ్ళే అమ్మేసుకుంటారు. రూపాయి వస్తువును పైసాకు అమ్మేసే రకంరా మీ పిల్ల నాకొడుకులు. ఎంత తెలివి ల్యాకుండా, మర్యాద అనేది యిసుమంత కూడా లేకుండా బతికేస్తున్నారు కదరా !

మీ కాలేజిలో నువ్వు చెసిండే నిర్వాకం గురించి  , నీ చదువు గురించి మీ సారోళ్ళు చెప్తాంటే థూ.. నీ మొగాన వుమ్మేయలనిపిస్తాందిరా ! ఆడపిల్లోల్ల  దగ్గర కూడా అప్పులు జేస్తాండారంట కదరా ! ఏవేవో మాయమాటలు చెప్పి వాళ్ళ కమ్మలు , ఉంగరాలు కూడా యిప్పిచ్చుకుంటారoటనే ! నిజమేనా ? నిజమే అయ్యుంటాదిలే… ల్యాకపోతే వాళ్ళు ఎందుకు చెప్తారు ? మిమ్మల్ని ఆ అడపిల్లోల్లు ఎట్ల నమ్మి యిస్తాండారురా ? ఏదో అయిదు పది కాదు… ఏకంగా చేవులల్లోటివి , ముక్కులల్లోటివి , చేతులల్లోటివి తీసి మీ చేతుల్లో ఎట్ల పెడతాండారురా ? అంత తెలివి ల్యాకుండా వుండారా  కాలేజిలల్లో చదివే ఆడిపిల్లోల్లు..! అయినా నమ్మిండే ఆడిపిల్లోల్లను మోసం చేయడానికి నీకు మనసు ఎట్ల వచ్చిందిరా ? అట్లా మోసం చేసి బతికే బతుకు కూడా ఒక బతుకేనా ? యిoతమందిని గోడాడిచ్చి , ఏడ్పిచ్చి  , మోసం చేసి ఏం బాపుకుoటారురా ?

ఇవల్లా ఒక ఎత్తు. రేప్పొద్దున పోలీసోల్లు నిన్ను అరెస్టు చేసి జైల్లోకి ఏస్తే ఏం పరిస్థితి? ఊర్లో మేము తలకాయ ఎత్తుకొని ఎట్ల తిరగాలా? అన్న యిట్లా పోరంబోకోడు అని తెలిస్తే నీ చెల్లెల్ని ఎవరు పెండ్లి చేసుకుంటారు? పెండ్లికోడుకులు యింక కొండ ఎక్కి కూచుంటారు. చెల్లెలుకు పెండ్లి దగ్గరుండి చేయాల్సినోనివి , దానికి పెండ్లి కాకుండా వుండేందుకే పుట్టినట్లుండావు కదరా ! నీకు యాదో ఒకటి వుద్యోగం వస్తాది ,  యింటికి యింత ఆసరాగా వుంటావు.. చెల్లెలి పెండ్లికి సాయంగా వుంటావు అని    నేను , మీ అమ్మ అనుకుంటిమే ! హు..అనుకున్నవన్నీ ఏట్లో కలిసిపాయ! మేము ముందే జాగ్రత్త పడాల్సింది.. నువ్వు అడిగినప్పుడంతా డబ్బులు యియ్యకుండా వుండాల్సింది. ఏం జేస్తాం శని నీ రూపంలోనే  వచ్చి మా నెత్తిన కూచున్నప్పుడు. ఇంటిని గాలికి వదిలేసి జల్సాలు మరిగిన కొడుకును  నేను యింక ఎంత మాత్రం మోయలేనురా ! మోసి నీ చెల్లెలికి నా చేతులతోనే అన్యాయం చేయలేను.. నీ లాగా మీ అమ్మను నేను మోసం చేయలేను .. వాస్తవం జెప్తాను..ఏ తండ్రి మాత్రం నీలాంటి కొడుకును భరించగలడు? నీ చావు నువ్వు చావు.. మా అగచాట్లు యావో మేం పడతాం. ఎన్నటికైనా మా బతుకులు బాగ పడకపోతాయా ? దేవునికి మా మీద దయ కలగకపోతదా అని దేవుని మీద భారం వేసి బతుకుతున్న వాళ్ళం…అయినా ఎన్ననుకొని ఏం లాభం! కని పెంచితిమి… మాకళ్ళ ముందే తిరిగేతోనివి..నీకే దయ ల్యాకపోతే, కనబడని అ దేవునికి మామీద దయ కలుగుతాదా మా తిక్క కాకపొతే! ఏడ్చిన ఏడుపే ఎంతకాలం ఎడుస్తామురా ?

ఎక్కడైనా కొడుకనే వాడు తండ్రి భారాన్ని దిoచగలిగేట్లు వుండాలిరా.. తండ్రినే నడ్డి యిరగగొట్టే కొడుకును ఎ తండ్రైనా భరిస్తాడురా ? నా లాంటి బక్క రైతుకు అయితే ఎంత మాత్రం సాధ్యం కాదురా.. ఎన్నిటికో తట్టుకున్నాము . యిది కూడా ఒకటి అనుకుంటాము.. మాలాంటి తల్లితండ్రులు ఎంతమందో ! కష్టపడితే సుఖపడతారు అంటారు. తరతరాలుగా యింటానే వుండాము.. కష్టపడతానే వుండాము. సుఖపడింది మాత్రం ఎన్నడూ లేదు. కష్టాలు మావే.. త్యాగాలు మావే ..మోసపోవాటాలకు కూడా మా రైతులే దొరుకుతారు , అదీ మన వైపు ఊర్ల రైతులే దొరుకుతాన్నారు.  మన  రైతులు దుమ్ము నాక్కొని పోతాన్నారు. ఎంత కాలంరా యిట్లా? బయటోడు మోసం జేసింటేనే కదా మా తాతల కాలం నుండి బయట పడల్యాక యిట్లా అంగలారుస్తాండాం. యింక యింట్లో వాడు కూడా తయారయ్యి గొంతులు కోస్తాంటే ఏం చెయ్యాల? ఎవరికీ చెప్పుకోవాలా? మీరేదో వచ్చి మమ్మల్ని వుద్దరిస్తారనుకుంటే..మీరు కూడా వాళ్ళల్లో ఒకరు అయిపోతాంటే యింక మా గోడు అర్థం చేసుకునే వాళ్ళు ఎవరురా?  నీకు ఎట్ల చెప్తే అర్థం అయితాది? నాలాంటి వానాకాలం సదవర్లు సుద్దులు చెబితే మీ తలకాయలల్లోకి  ఎక్కవు కదరా..  ఎవరు చెప్తే అర్థం చేసుకుంటారురా?  ఎప్పుడు చేసుకుంటారురా? ఏమోరా నాయనా మా అదృష్టం నీ దయ. నేను బతికి వుండంగానే నువ్వు బాగుపడితే మాకు అంత కంటే ఎం కావాలి.

*

సుభాషిణి

2 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)
‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు