బాధ్యత ఏమిటో నిర్ణయించుకోండి: శాంతినారాయణ

అనంతపురం జిల్లాలోని గ్రామీణ, రైతు జీవితాలను కథలు, నవలలుగా మలుస్తున్న నిరంతర సాహితీ కృషీవలుడు డా. శాంతినారాయణ. దాదాపు 20 పుస్తకాలు ప్రచురించారు. సాహిత్య రచనతో పాటు రచయితలను ప్రోత్సహించేందుకు విమలాశాంతి పురస్కారం నెలకొల్పారు. ఈ ఏడాది 75 వసంతాలు పూర్తిచేసుకుంటున్న డా. శాంతినారాయణ గారితో ప్రగతి ముఖాముఖి సారంగ పాఠకుల కోసం.

ప్ర. కథలు, నవలలు, ఫీచర్స్, కవిత్వం రాశారు వీటిలో మీకు నచ్చిన సాహితీ ప్రక్రియ ఏది? కథా, నవలా రచయితగా మీ పైన ఇతర రచయితల ప్రభావం ఉందా? ఉంటే ఎవరికి, ఎంతమేరకు ఉంది? మీ ప్రభావం మీ తర్వాతి రచయితల పైన ఉండటం గమనించారా?

శాంతినారాయణ: ప్రతి ప్రక్రియా ఇష్టమైనదే. అయితే వొక సంఘటననో, సందర్భాన్నో, వొక సామాజిక సంక్లిష్టాత్మక సమస్యనో, వొక జీవిత పార్శ్వాన్నో, అస్తిత్వ తీవ్రతనో చిత్రించి, వెంటనే సమాజ దృష్టికి తీసుకుపోవడానికి కథారచనే నాకు సౌలభ్యమైనది. అందుకే ఆ ప్రక్రియ నాకు చాలా ఇష్టమైనది.

నన్ను ఇష్టంగా చదివించి, నాలో ఆలోచనలు రేకెత్తించి, కథా వస్తు స్వీకార విషయంలో నన్ను ప్రేరేపించే రచయితలందరూ స్థాయీ వయోభేదాలకతీతంగా నా మీద ఏదో కొంత మేరకు ప్రభావం చూపుతుంటారన్నది నేను దాచుకోలేని సత్యం. కథలో, నవలలో నిర్దిష్టమైన, సహజమైన ఆయా ప్రాంత మాండలికాలను పాత్రలచేత చక్కగా పలికించే ప్రతి రచయితా భాషా విషయంలో నన్ను ప్రభావితం చేసినవారే.

నా ప్రభావం నా తర్వాతి రచయితలపై ఉందోలేదో నేను పెద్దగా గమనించలేదు. కెరె జగదీశ్, సడ్లపల్లి చిదంబర రెడ్డి, ఈ. రాఘవేంద్ర, హిదయతుల్లా, బావికాటి రాఘవేంద్ర వంటి కొందరు రచయితలు బాహటంగా చెప్పుకోవడం వల్ల వాళ్ళను నా ప్రభావితులుగా భావించానే గానీ నిజంగా సాహిత్య సృజనలో వాళ్ళ మీద నా ప్రభావం ఉందోలేదో చెప్పలేను.

ప్ర. దాదాపు 70వ దశకం నుంచీ ఈ రోజుకూ ఉత్సాహంగా రాస్తున్నారు. రచయితగా మీ ఆలోచనా ధోరణిలోనూ, మీ రచనా శైలిలోనూ అప్పటికి, ఇప్పటికి మీలో మీరు గుర్తించిన మార్పుల గురించి చెబుతారా?

శాం: 70వ దశకంలో నా సాహిత్య సృజన ప్రారంభదశకు, ఇప్పటికీ నాలో ఎన్నో మార్పులు వచ్చాయి. ఓరియంటల్ కళాశాల విద్యార్థినయిన కారణంగా నా సాహిత్య ప్రస్థానం అష్టావధానాలతో ప్రారంభమయింది. ఆ మైకంలో 1978 వరకు ఇంచుమించు ఆ మార్గంలోనే నడుస్తూ సమాంతరంగా ఆధునిక కథారచనను కూడా మొదలుపెట్టి, 1972 లో ‘రక్తపుముడ్డ పిలిచింది’ కథల సంపుటిని, 1976 లో ‘రస్తా’ అనే మరొక కథా సంపుటిని వెలువరించాను. ఈ రెండు ప్రక్రియల మధ్యలో సినారె ప్రభావంతో మాత్రాబద్ధ గేయ రచన మీదికి కూడా మనసు మళ్ళింది. ఆ దశలోనే ‘నడిరేయి నగరం’ అనే గేయసంపుటిని వెలువరించాను. 1978 లో అష్టావధానాలకు స్వస్తిపలికి ఆధునిక సాహిత్యాధ్యయనం కారణంగా ఆలోచనల్లో దృక్పథంలో మార్పులొచ్చాయి. సాంప్రదాయ సాహిత్య సృజన మీద పూర్తిగా విముఖత ఏర్పడి, స్థిరపడింది. ఈ మార్పులన్నీ పరిణామ శీలకమైన సమాజాన్ని హేతుబద్ధంగా అధ్యయనం చేయడం మూలంగానే జరిగాయని గుర్తించాను.

ప్ర. రాయలసీమ రైతు గురించి విస్తృతంగా రాసిన వారిలో మీరూ ఒకరు. దళారీలు, కార్పొరేట్ల నుంచి రైతులకు ఎదురయ్యే కష్టనష్టాల గురించి అద్భుతంగా రాశారు. తెలుగు కథా సాహిత్యానికి రాయలసీమ తనదంటూ చేసిన కాంట్రిబ్యూషన్ ఏమిటి? తెలుగు సాహిత్యంలో రాయలసీమ కథ నిర్దిష్ట దశకు చేరుకుందని భావిస్తున్నారా? రాయలసీమ సాహిత్యం రాయలసీమ జీవితంలో పట్టించుకోని పార్శ్వం ఏదైనా ఉందా?

శాం: తెలుగు సాహిత్యానికి రాయలసీమ కాంట్రిబ్యూషన్ ఏమిటన్న మీ ప్రశ్న కొన్ని శతాబ్దాల తెలుగు సాహిత్యాన్ని ప్రస్తావించుకోవడానికి వీలు కల్పిస్తున్నది. పురాణ సాహిత్యం తరువాత వచ్చిన తెలుగు సాహిత్యం ముప్పాతిక భాగం రాయలసీమ అందించిన కాంట్రిబ్యూషనే. విజయనగర సామ్రాజ్య కాలంలో వచ్చిన ప్రబంధ కావ్యాలలో ఒకటి రెండు మినహాయిస్తే తక్కినవన్నీ రాయలసీమ నుంచి వచ్చినవే. క్షేత్రయ్య, అన్నమయ్య మొదలైన సంకీర్తనాచార్యుల పదసాహిత్యమంతా ఇక్కడి నుంచే. తంజావూరు రాజుల కాలంలో వచ్చిన కావ్యాలు దాదాపు అన్నీ ఇక్కడివే. తెలుగు సాహిత్యంలో సుప్రసిద్ధ రచయిత్రులు తరిగొండ వెంగమాంబ, మొల్ల, ముద్దుపళని మొదలైన వాళ్ళు, వేమన వంటి శతక కారులు, పోతులూరి వీరబ్రహ్మం వంటి భక్తికవులు, శుకసప్తతి కర్త కదిరీపతి, సముఖము వెంకటక్రిష్ణప్పనాయుడు వంటి ఎందరో సాంప్రదాయ సాహిత్య సృజనకారులు రాయలసీమవాసులుగా తెలుగు సాహిత్యాన్ని సంపన్నం చేశారు.

ఇక ఆధునిక సాహిత్యానికొస్తే, ఆధునిక సాహిత్య పితామహుడు కట్టమంచి రామలింగారెడ్డి గారి ‘ముసలమ్మ మరణం’ తొలి తెలుగు ఆధునిక కావ్యంగా ప్రసిద్ధి పొందింది.  వారి ‘కవిత్వతత్వ విచారం’ ఆధునిక సాహిత్య విమర్శకు మూలం. ఆ విధంగా ఆధునిక కావ్య రంగానికి, ఆధునిక సాహిత్య విమర్శ రంగానికీ బాటలు వేసింది రాయలసీమ సాహిత్యకారులే. ఇంక నాటక రంగాన్ని ప్రస్తావించుకుంటే తెలుగులో సుప్రసిద్ధ నాటకాలన్నీ (ధర్మవరం రామకృష్ణమాచార్యులు, కోలాచలం శ్రీనివాసాచార్యుల నాటకాలు) రాయలసీమ కాంట్రిబ్యూషనే. రాయలసీమలో కె.సభాతో మొదలైన రాయలసీమ ఆధునిక (ఇంకా అంతకుముందు 1918 నుంచే మొదలైన ఆధునిక కథ) కథ దినదిన ప్రవర్ధమానమవుతూ తెలుగు కథా సాహిత్యాన్ని సుసంపన్నం చేసింది. నవలా ప్రక్రియకు వస్తే ఇటీవల రాయలసీమ నుంచి వచ్చిన బలమైన నవలలు (ఆర్.ఎస్.సుదర్శనం, కేతు విశ్వనాథరెడ్డి, తులసి రామకృష్ణ, చిలుకూరి దేవపుత్ర, స్వామి, శాంతినారాయణ, డాక్టర్ కేశవరెడ్డి, నామిని, మధురాంతకం, కాశీభట్ల, సన్నపురెడ్డి, వి.ఆర్.రాసాని, సుంకోజీ, పాణి, కనుంపల్లి రాజారాం మొదలైన రచయితల నవలలు) తెలుగు నవలా సాహిత్యాన్ని బలోపేతం చేశాయి. తెలుగు సాహిత్యంలో ఇప్పుడు కథా నవలా ప్రక్రియలకు రాయలసీమ ప్రముఖ కేంద్ర బిందువని చెప్పవచ్చు.

ఆధునిక తెలుగు సాహిత్యంలో గొప్ప విమర్శకులందరూ (కట్టమంచి, రాళ్ళపల్లి, ఆర్.ఎస్.సుదర్శనం, రారా, కె.వి.రమణారెడ్డి, వల్లంపాటి, సర్దేశాయి, రాచపాళెం మొదలైనవారు) విమర్శ సాహిత్యాన్ని సుసంపన్నం చేశారు. కాలం కథలతో పులికంటి, నామిని, రాసాని, శాంతినారాయణ, సడ్లపల్లి వంటి రచయితలు రాయలసీమ మాండలిక పరిమళాలతో తెలుగు సాహిత్యాన్ని మనోహరపరిచారు. ‘హంపి నుంచి హరప్పా దాకా’ అనే తిరుమల రామచంద్ర గారి స్వీయచరిత్ర చాలు రాయలసీమ కాంట్రిబ్యూషన్ ఎంతటిదో తెలుసుకోవడానికి.

రాయలసీమ కథ నిర్దిష్ట దశకు చేరుకుందా అని అడుగుతున్నారు, తెలుగు సాహిత్యానికి కావలసినంత పరిపుష్టిని తెచ్చినా మారుతున్న సామాజిక స్థితిగతుల కారణంగా ఏ భాషా సాహిత్య ప్రక్రియ గానీ నిర్దిష్ట లేదా సంపూర్ణ దశకు చేరుకోలేదు.

ఇప్పటి సామాజిక జీవన స్థితిగతుల దశ వరకూ చూసినా రాయలసీమ కథ పట్టించుకోని పార్శ్వాలు చాలానే ఉన్నాయి. ఇక్కడి గ్రామీణ జీవితంలోని మానవీయ కోణాలను, ఆరోపింపబడిన ఫ్యాక్షన్ జీవితంలోని వాస్తవ విషయాలను, అసంఘతితే కార్మికుల కష్టాలను, కన్నీళ్లను, అశాస్త్రీయమైన ప్రభుత్వ పథకాల వల్ల ఆగిపోతున్న పురోగతులను – ఇటువంటి up-to-date సమాజ జీవిత కోణాలను రాయలసీమ సాహిత్యం పట్టించుకోవాల్సుంది.

ప్ర. రాయలసీమ మాండలికాన్ని రచనల్లో ప్రతిభావంతంగా పలికించారు. కథలు, నవలల్లోనే కాకుండా, ‘నాగలకట్ట సుద్దులు’ ఫీచర్ రాశారు. ప్రత్యేకించి పల్లెల్లో రాజకీయాల గురించి ఇందులో రాశారు. పల్లె ప్రజలు దేశ రాజకీయాలను శాసించగలిగిన స్థితిలో ఉన్నారని మీరు అనుకుంటున్నారా? సామాజిక విముక్తి కోసం ఏ భావజాలం లేదా ఉద్యమం శాశ్వతమైన పరిష్కారం సూచిస్తుందని భావిస్తున్నారు?

శాం: ఎలక్ట్రానిక్ మీడియా, సామాజిక మాధ్యమాలు ఈరోజు రాష్ట్ర దేశ ప్రపంచ రాజకీయాది సమస్త విషయాలను మనిషి కళ్ళముందుంచుతున్నాయి. ఆ మాధ్యమాలను గురించి ఇప్పుడు తెలియని వారు ఎవరూ లేరు. ప్రపంచమే ఇప్పుడొక కుగ్రామమైంది. ప్రతి గ్రామీణుడు కూడా రాజకీయాది విషయాలను మాట్లాడుతున్నాడు. వారి వారి అవగాహన మేరకు చర్చిస్తున్నారు. మంచి చెడ్డలను విశ్లేషిస్తున్నారు. రచ్చబండల దగ్గర వాదోపవాదాలు చేసి తర్కిస్తున్నారు. అటువంటి ప్రజలు రాజకీయాలను శాసిస్తున్న సంగతి రెండు దశాబ్దాల కాలంలో జరిగిన ఎన్నికలే రుజువు చేస్తున్నాయి.

సామాజిక విముక్తి అంటే భారతీయ సమాజంలోని అసమానతల నుంచి విముక్తే కదా! హిందూ మత దురాలోచనల కారణంగా వర్ణాలు, కులాలు, ఉపకులాలుగా దారుణంగా విడగొట్టబడిన భారతీయ సమాజంలో కుల నిర్మూలన జరగనంతవరకు అసమానత్వం సమిసిపోదు. కుల నిర్మూలన జరగాలంటే అంబేద్కర్ ఆలోచనా విధానం ఆచరణలోకి రావాలి. అదే సమయంలో మార్క్సిస్టు భావజాలంతోనే ఆర్థిక అసమానతల నుంచి సమాజం విముక్తం అవుతుందని నా భావన. అంబేద్కర్ ఆలోచనా విధానం, మార్క్సిస్టు భావజాలం కలసి నడవడం ద్వారానే అన్ని రకాల అసమానతలకు చరమగీతం పలకొచ్చు.

ప్ర. తెలుగు సాహిత్యంలో ప్రతిష్టాత్మక పురస్కారాలలో విమలాశాంతి పురస్కారం కూడా ఒకటి. ఇంత సుదీర్ఘకాలం ఈ పురస్కారాన్ని ఇస్తూ రావడంలో మీరు ఎదుర్కొన్న ఇబ్బందులు, కష్టనష్టాల గురించి చెప్పండి. అలాగే ఎప్పుడైనా ఈ పురస్కారం వివాదం అయిన సందర్భం ఉందా?

శాం: మా ‘విమలాశాంతి సాహిత్య పురస్కార’ ప్రదాన ప్రక్రియ చాలా సంవత్సరాల నుంచీ నిరంతరాయంగా కొనసాగుతున్నదన్న విషయం ఆధునిక తెలుగు సాహిత్య లోకానికంతటికీ తెలుసు. పురస్కారానికి దక్కిన గౌరవ స్థాయికి భంగం కలగకుండా ఈ ప్రక్రియను నిర్వహించడం కత్తి మీద సాము వంటిదే. అయినా తెలుగు సాహిత్య సృజనకారులు ఎవరు ఏ సంవత్సరమూ ఇబ్బంది కలిగించకుండా తమ సాహిత్య సంస్కారాన్ని ఉదాత్తంగా చాటుకున్నారు. అందుకు తెలుగు కవులను, కథకులను అభినందిస్తూ వాళ్ళందరికీ శిరసు వొంచి నమస్కరిస్తున్నాను. ఈ పురస్కార ప్రదాన ప్రక్రియలో పాలుపంచుకున్న కవి, కథక మిత్రుల నుంచీ ఏ ఇబ్బందులూ తలెత్తకపోయినా నా అంతట నేనే చాలా సార్లు ఇబ్బంది పడ్డాను. పురస్కారం కోసం వచ్చిన కవిత/కథా సంపుటాలు కొన్ని నన్ను ఎంతగానో కదిలించి ఇష్టమైన సంపుటాలుగా నా హృదయంలో మెదిలాయి. అయినా నేను నాకిష్టమైన ఆ కవితా/కథా సంపుటాలకు మా పురస్కారాలను అందించలేకపోయాను. నాలుగైదు సార్లు ఇటువంటి ఇబ్బందితో కొంత ఫీలయ్యాను. అయితే ఈ పురస్కార ప్రదాన ప్రక్రియ ఎప్పుడూ వివాదాస్పదం కానందుకు నేను ఎంతో గర్వపడుతూ, సంతోషిస్తుంటాను.

ప్ర. మీ భవిష్యత్తు సాహిత్య ప్రణాళిక ఏమిటి? మీ నుంచి కొత్తగా నవల రాబోతోందని తెలిసింది, దాని నేపథ్యం రాయలసీమ అస్తిత్వ ఉద్యమానికి సంబంధించిందని వినికిడి. ఆ వివరాలు చెబుతారా?

శాం: నా భవిష్యత్తు సాహిత్య ప్రణాళికలు చాలానే ఉన్నాయి. అందులో ప్రధానమైనది నా ఆత్మకథనాత్మక నవల లేదా స్వీయ చరిత్రను రాయడం. నా స్వీయచరిత్ర ఏమంత ప్రబోధాత్మకమని రాయాలి అని ప్రశ్నించినప్పుడు గుడిపాటి వెంకటేశ్వర్లు గారు ఒక మాట అన్నారు. గొప్పవాళ్ళ, మహాత్ముల జీవిత చరిత్రలే కాదు, ప్రతి మనిషి జీవిత చరిత్రా ఏవో కొన్ని ప్రత్యేకమైన సంఘటనలతో, జీవితానుభావాలతో, అద్భుతాలతో సమ్మిళితమై ఉంటుంది. ఆ జీవిత విశేషాలు వాళ్లలోనే దాగి, వాళ్లతోనే కనుమరుగైపోకూడదు, అవన్నీ అక్షర రూపంలో ఆవిష్కృతమైనప్పుడే వైవిధ్యభరిత మానవ జీవితం అర్థమవుతుంది అని గుడిపాటి గారు అన్న మాటలతో నా స్వీయ జీవితచరిత్రను ఆత్మకథనాత్మక నవలగా రాయాలని ప్రణాళిక వేసుకున్నాను. ఆ లోగా నేను నాలుగైదు నవలలు, ఇంకో 50 కథలు రాయాలనుకున్నాను. ప్రస్తుతం మీకు తెలిసినట్లు ఒకటి కాదు, రెండు నవలలు త్వరలో అందించబోతున్నాను. మీరన్నట్లు ఒకటి రాయలసీమ అస్తిత్వవాద నవల. దానిని సుప్రసిద్ధ నవలా రచయిత స్వామి ప్రాంతీయ వివక్ష నవల అంటున్నారు. మరొకటి స్త్రీ ఆత్మగౌరవ నవల.

ప్ర. ఇటీవలి సాహిత్య ధోరణుల గుంచి మీ కామెంట్? అలాగే వర్ధమాన రచయితలకు మీరిచ్చే సూచనలు, సలహాలు…?

శాం: ఇటీవల సామాజిక మాధ్యమాల ద్వారా కుప్పలుతెప్పలుగా రచయితలు రాస్తున్నారు. అందులో వచ్చే రచనలన్నీ కవితలు గానీ, గల్పికలు గానీ, కథలు గానీ, పద్యాలు గానీ ఆశించినంతగా సాహిత్యపు విలువలతో ఉండటం లేదు. అట్లని అందులో వచ్చే ప్రతి రచన తిరస్కరింపదగినదేమీ కాదు. గొప్ప కవితలూ, మంచి కథలూ వెలువడుతున్నాయి. వివిధ దిన వార పక్ష మాస పత్రికలలో అవకాశం రాదనీ, చోటుండదని ఏ రచయిత ఈరోజు దిగులుపడాల్సిన పని లేకుండా, సామాజిక మాధ్యమాలు అందరికీ విసుగూ, విరామమూ లేకుండా, కొన్ని పత్రికా మాధ్యమాల మాదిరి దర్పమూ, తూష్ణీంభావమూ ప్రకటించకుండా ప్రతి రచనావిష్కరణకూ అవకాశం కల్పిస్తున్నాయి. అయితే ఈ సామాజిక మాధ్యమాలలో సాహిత్యం పేరుతో ఏదైనా రాయొచ్చునని, రాసినదంతా సాహిత్యమేనని మురిసిపోయేవాళ్లూ. వాళ్ల మురిపాలను, రాతలను ప్రోత్సహించేవాళ్లూ, పొగడ్తలు గుమ్మరించేవాళ్లూ, పొగడ్తలను పొగిడేవాళ్లూ – ఇటువంటి పెడధోరణులు ఎక్కువ వెగటు పుట్టిస్తున్నాయి. ఈ పెడధోరణులు ఇలాగే కొనసాగితే, ఈ సామాజిక మాధ్యమాలే చివరికి సాహిత్య సంరక్షణకూ, పోషణకూ దిక్కైతే ఆముదం చెట్లే మహా వృక్షాలుగా చెలామణయ్యే కాలం రావచ్చు.

ఈ సందర్భంలో వర్ధమాన రచయితలకు నేనిచ్చే సలహా ఒక్కటే. సామాజిక మాధ్యమాలలో నాలుగైదు కవితలో, కథలో రాసి, వాటిని మెచ్చుకునే రాతలను చూసి పొంగిపోకండి. నాలుగైదు రచనలు పత్రికలలో అచ్చవగానే, రెండు మూడు సత్కారాలో పురస్కారాలో అందుకోగానే కాలర్ ఎగరేయకండి. ఆ సత్కార పురస్కారాలు మీ బాధ్యతను మరింత పెంచాయని గుర్తుంచుకోండి. ఎదిగేకొద్దీ వొదిగుండటం సాహిత్య సంస్కారమని గ్రహించండి. తాడిదన్నే వాడుంటే, వాని తలదన్నే వాళ్ళుంటారని గమనించండి. సాహిత్యాన్నీ, సమాజాన్నీ శాస్త్రీయంగా హేతుబద్ధంగా అధ్యయనం చేయండి. మనకు జీవితాన్నిచ్చిన సమాజం పట్ల రచయితలుగా మన బాధ్యత ఏమిటో నిర్ణయించుకోండి.

*

ఎం.ప్రగతి

2 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • రాయలసీమ సాహిత్యం గురించి చాలా చక్కనైన వివరణ అందించారు శాంతి నారాయణ గారి కథలు కూడా రాయలసీమ జీవితాన్ని కళ్ళ ముందు నిలబెడతాయి

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు