బైండ్ల సెంద్రయ్య కథలతో….దళిత సాంస్కృతిక కులాల జీవితాలని కొత్త కోణంలో చూపించారు జిలుకర శ్రీనివాస్. అణచివేత, వివక్షలు ప్రధానంగా కనిపించే దళిత కథలకు భిన్నంగా ఆత్మగౌరవం ప్రధానంగా ఎత్తిచూపుతూ…మ్యాజికల్ రియలిజాన్ని వాడుకుంటూ దళిత కథకు ఒక్క కొత్త రూపం ఇచ్చారు. సాహిత్య విమర్శకుడిగా, దళిత ఉద్యమ కారుడిగా కృషి చేస్తూనే…తాజాగా బెండ్ల సెంద్రయ్య కథలతో కథకుడిగా కూడా గుర్తింపు పొందిన డా. జిలుకర శ్రీనివాస్ తో చందు తులసి చిన్న పలకరింపు.
-జిలుకర శ్రీనివాస్ గారూ..బైండ్ల సెంద్రెయ్య కథలు సమకాలీన తెలుగు కథల్లో ప్రత్యేకమైనవి. ఈ కథల నేపథ్యం ఏమిటి?
జిలుకర: తెలుగు కథా సాహిత్యం విశిష్టమైనది. దాని అంతర్గత వైభిన్యమే దాని వైశిష్ట్యం. తెలుగు కథలు సాంఘిక సంస్కరణ లక్ష్యంతో మొదలయ్యాయి. గురజాడ కులాన్ని తిరస్కరించాడు. శ్రీశ్రీ వర్గాన్ని తిరస్కరించాడు. ఈ రెంటినీ జాషువా, ఇనాక్ తిరస్కరించారు. దళిత కథ మరింత నిర్దిష్టతతో సామాజిక వాస్తవికతను చిత్రించింది. మాదిగవాద కథ కొత్త జీవితాలను పరిచయం చేసింది. ఈ నేపథ్యంలో బైండ్ల సెంద్రెయ్య కథలు రాశాను. కథ ఒక సాంస్కృతిక నిరాణం. సామాజిక వాస్తవికతను వ్యక్తీకరించే సాంస్కృతిక రూపం కథ. సామాజిక వాస్తవికత, లేదా నిర్దిష్ట వాస్తవికత అన్నది సాంస్కృతిక నిర్మాణం యొక్క ప్రాథమిక రూపం. కానీ దాని సారభూత ధ్వని మాత్రం సంస్కృతి. మనది కులాధారిత సమాజం. కులం ఒక విష సంస్కృతి. అయితే కళకు ఒక కులాన్ని, కులానికో కళను వ్యవస్థీకృతం చేసిన అవ్యవస్థ మనది. అవ్యవస్థ ఒక వ్యవస్థగా లెజిటమసీని పొందింది. గానం, గాత్రం, సంగీతం, వచనం, అభినయం, వాయిద్యం, వైద్యం సమ్మిళితమైన కులాలు చాలా వున్నాయి. అన్ని కులాలకు ఈ సంస్కృతిక అవసరాలు వున్నాయి. ఆ సాంస్కృతిక అవసరాన్ని తీర్చిన వాటిని నేను సాంస్కృతిక కులాలు అంటున్నాను. వాటిలో బైండ్ల కులం ఒకటి. సాంస్కృతిక కులాలకు ఆత్మగౌరవం ఎక్కువ. ఆత్మాభిమానం సహజంగానే ఎక్కువ. బైండ్ల సమాజంలో పట్టి, ఆత్మాభిమానంతో బతికే ఎంతోమందికి సెంద్రెయ్య ప్రతినిధి. ఆయన రిప్రజెంటేషనల్ క్యారెక్టర్.
ప్ర: దళిత కథల్లో ఎక్కువగా ఉండేది ఆత్మగౌరవం. ఆ కోణంలో బైండ్ల సెంద్రెయ్య కథలు ఏరకంగా విశిష్టమైనవి?
జ: దళిత సాహిత్యం అంబేద్కర్ చెప్పిన సాంఘిక విప్లవ లక్ష్యం కోసం వచ్చింది. అయితే, వ్యక్తి అనుభవాన్ని,అతని సామాజిక అనుభవాన్ని వ్యక్తీకరించే క్రమంలో బాధితత్వానికి పెద్దపీట వేశారు. దళిత సాహిత్యంలో సింహభాగం ఖండిత మనస్సును చిత్రించడమే కనిపిస్తుంది. దళిత కథ, కవిత, నాటకం అంతా గాయాలను, నొప్పిని, అవమానాలను, అణచివేతను, దేబిరిపింపును రాయడమే సరిపోయింది. ఈ విక్టిమ్ హుడ్ ను గ్లోరిఫై చేసే దళిత ఉద్యమం వల్ల ఆత్మగౌరవాన్ని పొందలేమని, దళిత్ ఐడెంటిటీ అసెర్షన్ వీలుకాదని చిట్టిబాబు పడవల ఇరవైయేండ్ల కిందటే విమర్శించాడు. ఆయన విమర్శ సరైనదే. అందుకే నా కథలు,నా కవితలలో విక్టిమ్ హుడ్, వూండేడ్ సైకాలజీ వుండవు. బైండ్ల సెంద్రెయ్య తిరిగికొట్టాలనే చైతన్యం గల వ్యక్తి. తిడితే కొడితే సహించే వ్యక్తి కాదు. తన గౌరవానికి,తన కండ్ల ముందు ఇతరుల గౌరవానికీ భంగం కలిగితే సహించడు. అందుకే బైండ్ల సెంద్రెయ్య కథలు నిజమైన అంబేద్కరైటు కథలు.
ప్ర: మొదటి కథ బైండ్ల సెంద్రెయ్య బోనాల పండుగతో మొదలై, ఆఖరి కథ “పురావీరగాథ” వరకు ఆరోహణాపథంలో సాగింది. దీని వెనుక ప్రణాళిక ఉందా..?
జ: కథ స్థిరమైనది కాదు. జడమైనది అసలే కాదు. అది చలనశీలమైనది. బైండ్ల సెంద్రెయ్య బోనాల పండుగ కథలో సమిష్టి నిర్ణయ హక్కు కోసం ఒక ఫ్యూడలిస్టుతో కలెబడటం చూస్తాం. ఆ తర్వాత కథలు సెంద్రెయ్య అన్వేషణను, అతనిలో వచ్చిన మార్పును చూపిస్తాయి. మనిషిని, సంఘాన్ని నడిపించేవి వర్తమానం మాత్రమే కాదు. హిస్టారికల్ నారేటివ్స్ మన మస్తిష్కాలను ప్రేరేపిస్తాయి. మూలాలను అన్వేషించే క్రమంలో వేలయేండ్ల చరిత్రను వెతికే క్రమంలో, ఆత్మస్థైర్యాన్నీ, ఆత్మగౌరవాన్నీ ఇచ్చే సందర్భాలను, క్యారెక్టర్లను వెతుక్కుంటాడు. పురావీరగాథ అలాంటి మూలాలను తెలిపే రాజకీయ చారిత్రక నారేటివ్. పాఠకుడు ఈ కథతో పతాక స్థాయికి చేరుకుంటాడు. గొప్ప అనుభూతిని పొందుతాడు.
ప్ర: సమకాలీన కథకుల్లో మీరు కథను చెప్పే తీరు ప్రత్యేకంగా వున్నది. మార్మిక సౌందర్యం మీ కథల నిండా పరుచుకొని వున్నది. కారణం…?
జ: బైండ్ల సెంద్రెయ్య జన్మించిన సమాజం నిండా అంతుపట్టని మిస్టిజం వుంది. మ్యాజికల్ రీయలిజం వుంది. కొన్ని సందర్భాలలో సోషల్, పొలిటికల్ రీయలిజాన్ని చిత్రించడానికి మ్యాజికల్ టెక్నిక్ కచ్చితంగా కావాలి. అలా ఈ కథల్లో మ్యాజికల్ రీయలిజం పద్ధతి కనిపిస్తున్నది. కాస్మిక్ రీయలిజాన్ని మనం మ్యాజిక్ రీయలిజం ద్వారానే చూపించగలం. తెలుగులో ఈ రకమైన శిల్పంతో గొప్ప కథలు వచ్చాయి. వాళ్లందరి స్ఫూర్తితో ఈ టెక్నిక్కును అన్వయించాను.
ప్ర: మీ మీద ఏ కథకుడి ప్రభావం ఎక్కువ? మీకెవరంటే ఇష్టం?
జ: చాలా మంది వున్నారు. గురజాడ, చలం, రావిశాస్త్రీ, దాశరధి రంగాచార్య, చాసో, శ్రీపాద, ఇనాక్, శారద, కెఎన్వై పతంజలి, అల్లం రాజయ్య, నామిని, బండి నారాయణస్వామి, సతీష్ చందర్, వి.చంద్రశేఖర్ రావు, అఫ్సర్, బమ్మిడి, స్కైబాబ, షాజహానా ఇంకా చాలామంది ఇష్టం. కేశవరెడ్డి సాహిత్యం చాలా యిష్టం. ఇంగ్లీషులో సోమర్ సెట్ మామ్ రాసిన ది మూన్ అండ్ సిక్స్ పెన్స్ ప్రతీ ఒక్కరూ చదవాలి. టాల్ స్టాయ్, గోర్కీ, ఇంకా చాలామంది రష్యన్ కథకులు కూడా ఇష్టం. ఇప్పుడు రాస్తున్నవాళ్లలో ఎండపల్లి భారతి కథలు బావున్నాయి.
ప్ర: మీరు బైండ్ల సెంద్రెయ్య కథలన్నిటిలో ప్రొటొగానిస్టు ఒక్కడే. కానీ కథలు అన్నీ స్వతంత్రంగా వున్నట్టు కనిపిస్తాయి. కానీ వాటి మధ్య ఒక అంతస్సూత్రం ఏదో వున్నట్టు అన్పిస్తూ వుంటుంది. కావాలనే ఈ రకంగా రాశారా?
జ: అవును. కావాలనే రాశాను. అయితే నవల మాత్రం కాదు. కచ్చితంగా కథలే ఇవి. అయితే అన్ని కథలలో ప్రొటోగానిస్టు సెంద్రెయ్య ఒక్కడే. కానీ కథలోని స్థలకాలాలతోపాటు ఇతివృత్తం మారుతుంది. ఆ రకంగా సెంద్రెయ్య ఒక రూపాంతరం చెందుతున్న, పరివర్తన చెందుతున్న ప్రాసెస్ ను పాఠకుడు అనుభూతి చెందుతాడు. ఈ పద్ధతిలో రాసిన కథకులు చాలా తక్కువ మంది వుంటారు.
ప్ర: మీరు విమర్శకులా? కథకులా? కవి? రాజకీయ నాయకులా? ఒక్క మాటలో చెప్పండి.
జ: నేను బాధ్యతాయుతమైన విప్లవకారుణ్ణి.
*
Thank you Saranga
excellent interview… congratulations JIlukara Srinivas and Chandu Tulasi
చివరగా వ్రాసిన ఆయన వివరణ బాగుంది. నేడు కులాలను రాజకీయంగా వాడుకొంటున్నారు. వారికి పదవులు ఆశచూపి అవసరాలకు వాడుకొంటున్నారు. నేడు ఎంతమంది నిమ్న కులస్తులకు అధికారంఉంది.? నేత కన్నేర్రచేస్తే ఆపదవిపోతుంది.