‘బర్రెంక చెట్టు’ నీడలో తెలంగాణ పోరాట, సంస్కృతులు

దశాబ్దాల నాటి తెలంగాణ జీవన మూలాల్ని, సాంస్కృతిక మూలాల్ని తడిమి చూపే కథ ఇది.

డిపిల్లోల్లు:     సిబ్బిలేనింటికి నా బిడ్డనిస్తినీ తాన తందయ్యలో గోగు పువ్వయ్యలో

మొగపిల్లోల్లు:   అప్పుడెందుకిచ్చినవు అరికాలి చెప్పే               “తాన”

ఆడిపిల్లోల్లు:     కనరాని కంతలకు నా బిడ్డనిస్తినీ                    “తాన”

మొగపిల్లోల్లు:   సిగ్గెగ్గు లేకుంట నా ఇంటికొస్తివీ                      “తాన”

ఆడిపిల్లోల్లు:     పిల్లనిచ్చేటపుడు ఇల్లు సూడాలమ్మా               “తాన”

మొగపిల్లోల్లు:   ఇల్లు సూడకుంటా పిల్లనెట్లిస్తివీ                     “తాన”

ఆడపిల్లోల్లు:     ఎరుక లేకిచ్చిన ఎనుగుల్ల వడ్డ                      “తాన”

నగరాలే కాదు పల్లెటూళ్ళు కూడా చాలా మారిపోయాయి. ఒకనాటి చరిత్ర, వేష భాషలు, ఆట పాటలు, కుల వృత్తులు, జీవన విధానం, ఆప్యాయత, అనురాగాలు, పోరాట పటిమ, ప్రకృతి, పాఠ్య పుస్తకాలు, చదువు సంధ్యలు, అభ్యసన ప్రక్రియ, పనిముట్లు, ఆహారపుటలవాట్లు, మానవీయ సంబంధాలు… ఎన్నో  మారిపోయాయి. పట్టణాలతో పాటు, గ్రామాలు కూడా సహజత్వము, సజీవత్వమూ కోల్పోయి ఎండిన చెట్లలా మిగిలిపోయాయి. ఆరు పదుల వయసు దాటిన వాళ్ళంతా తమ కళ్ళ ముందే అంతా మారుతూ వస్తుంటే తల్లడిల్లి పోతున్నారు.

ఎన్నో అనివార్య కారణాలు, పరిణామాల వల్ల తెలంగాణ ప్రాంతం చాలా వేగంగా మారిపోతోంది. స్వాతంత్ర్యం వచ్చి ఏడున్నర దశాబ్దాలు దాటిన తరువాత ఇప్పుడొకసారి వెనక్కి తిరిగి చూసుకుంటే మనం నడిచి వచ్చిన పిల్ల బాటలు, బండ్ల బాటలు, ముండ్ల బాటలు, పూల బాటలు  మదిలో మెదిలి గుండె ఏ మూలలోనో కొన్ని  గాజువక్కలు, మరికొన్ని నెలవంకలు  గుచ్చుకుంటాయి. ఏ జ్ఞాపకాల ‘బర్రెంక చెట్టు’ కిందో కూర్చొని గతాన్ని తవ్వుకుంటున్నప్పుడు ఎంతో జీవిత పరిమళం హృదయాన్ని అలుముకుంటుంది.

రచయిత్రి ఐదేండ్ల పిల్లగా ఉన్నప్పుడు బైరాన్ పల్లె మీద రజాకార్ల దాడి జరిగింది. కథకురాలి తాత గాడిపెల్లి రామయ్యను పురుసాల్లల్ల తుపాకీతో కాల్చిండ్రు. ఆమె మేనత్త పెయి మీది నగలన్నీ ఒల్చుకున్నరు. నాయినమ్మ తమ్ముడు పిట్టల కిట్టయ్యను కూడా రజాకార్లు కాల్చి చంపిండ్రు. ఊళ్ళన్నీ గజగజ వణికిపోయినై. తరువాత లద్దునూరు మీద దాడి జరిగింది. దొరికినోల్లను దొరికినట్లు చంపేసిండ్రు. “ఇండ్లను దోసుకున్నరు. కాలవెట్టిండ్రు. ఊర్ని పీనుగుల పెంట జేసిన్రు.” ఈ దాడిలో రచయిత్రి బడి కూడా నామ్  నిషాన్ లేకుంట కాలిపోయింది. ఎప్పుడన్నా యాదికొచ్చినప్పుడు కాలిపోయిన బడికి పోయి తాను కూసున్న జాగ సూసుకుంటే ఏడుపోచ్చేది.

నిజానికి రచయిత్రి పెద్ద బడి దొంగ కాని చదువంటే చాలా ఇష్టం. తన తమ్మునితో పొలం కాడికి పోయినపుడు గొడ్లను కాసుకుంటూ ‘బర్రెంక చెట్టు’ కింద ఇసుకలో అక్షరాలు నేర్చుకునేది. వాళ్ళ ఆటపాటలకు, చదువు సంధ్యలకు ‘బర్రెంక చెట్టు’ స్థావరం.  వాళ్ళ నాయిన కూడా ఎన్నో విషయాలు చెప్పేటోడు. వెన్నెల రాత్రుల్లో ఎన్నో ఆటలు ఆడుకునేటోల్లు. కథకురాలు, ఆమె తమ్ముడు ఇద్దరూ వాళ్ళ తల్లిదండ్రులకు ఎన్నో పనుల్లో సాయం చేసేవారు. ఆరు దాశాబ్దాల నాటి తెలంగాణ పల్లె జీవితాన్ని మరోసారి చూడాలంటే మనమందరం ‘బర్రెంక చెట్టు’ కింది పోవాల్సిందే. ఆ చెట్టు నీడలో మనం కూడా ఆడుకోవాల్సిందే.

బర్రెంక చెట్టు కథ చదవండి.

         దశాబ్దాల నాటి తెలంగాణ జీవన మూలాల్ని, సాంస్కృతిక మూలాల్ని తడిమి చూపే కథ ఇది. సాయుధ రైతాంగ పోరాటం నాటి పల్లెల భయపూరిత జీవనాన్ని, రజాకార్ల విధ్వంసాన్ని, అన్నా చెల్లెళ్ళ అనురాగాన్ని, అక్కా తమ్ముళ్ళ స్నేహితాన్ని, ఆపతి సంపతిల కలసిమెలసి ఉండే హిందూ – ముస్లింల నికాలస్ ప్రేమలను, ఒత్తిడి లేని పిల్లల ఆట పాటల చదువులను, ఆనాటి తల్లులు చేసే బాల్యోపచారాలను, “నరములస్తులు చర్మ నఖరోమ మాంసముల్ భూగుణంబులు… మూత్ర శ్లేష్మములు జల గుణంబులు” అని పంచ భూతల గురించి పాడే తత్వ గీతాలను, రాత్రుళ్ళు ఆడే బాగోతాలను, పొద్దును చూసి సమయాన్ని చెప్పే పద్ధతిని, పొలం పనుల్లో కుటుంబమంతా నిమగ్నమయ్యే విధానాన్ని, పాఠశాల ఫీజు వివరాలను, ఆడపిల్లల చదువు ప్రాధాన్యతను  రచయిత్రి పొరలు పొరలుగా ఒక డాక్యుమెంటరీలాగా చాలా క్లోజప్ లో చూపిస్తుంది.

ఒక యాదిలాగా, ఒక నోస్టాల్జియా లాగా సాగిపోయే ఈ కథలో నిత్య వ్యవహారం నుండి జారిపోయిన ఎన్నో తెలంగాణ తెలుగు పదాలు చాల అలవోకగా ప్రయోగించడాన్ని చూసి పాఠకుడు ఆశ్చర్యపడుతాడు. తెలంగాణ తెలుగు పదాల నాద సౌందర్యాన్ని మన మనసు చెవి పెట్టి వింటుంది. ‘ఎసుల’, ‘బెడెం’, ‘కుచ్చాలు’, ‘కొప్పెర’ ‘నాకగాయడం’ లాంటి పదాలు మన నిఘంటువుల అశక్తతను ప్రదర్శిస్తాయి.

కథకురాలు పాటించిన కథా శిల్పం కొత్త కథకులకు ఆదర్శప్రాయం. మౌఖిక శిల్పంలో నడుస్తూ తెలంగాణ జీవితంలోని ఎన్నో మూలమలుపులను రికార్డు చేసిందీ కథ. కథలో చూపించిన జీవితం చుట్టూ ఎన్నో పాత్రలున్నా ఒక్క పాత్ర కూడా తెర మీదికి రాదు. అంతా జ్ఞాపకాల దొంతరగా కదిలిపోతుంది. రజాకార్ల ఊరేగింపుతో మొదలైన కథ తెలంగాణ నెత్తుటి పయనంలాగే రక్తపుటేర్ల మీదుగా నడిచిపోయి రచయిత్రి బాల్యపు జీవితంతో ముగుస్తుంది. చివరలో తను గ్రామంలోనే ఆదర్శ మహిళగా  ఎలా నిలబడిందో చెప్తుంది కథకురాలు. అంటే ఇదొక ఆత్మకథాత్మక కథ. అయినా ఒక చారిత్రిక పుటను రక్తపు మరకల మధ్య, దుఃఖపు తెరల  మధ్య చదువుతున్నట్టే ఉంటుంది.

‘బర్రెంక చెట్టు’ ను చదవడమంటే తెలంగాణ సామాజిక చరిత్ర ఆకులను, పూలను, కొమ్మలను, రెమ్మలను చేతుల్లోకి తీసుకొని ఒక జీవిత  పత్రహరితాన్ని మనసులోకి దింపుకోవడం. మన ముందు తరం జీవితానికి మాంత్రిక లేపనం అద్ది మళ్ళీ మొలకెత్తించడం. ఆనాటి బాల్యాన్ని మూటగట్టుకొని వచ్చి ఇప్పటి బాల్యపు దైన్యాన్ని అంచనా వేయడం. తెలంగాణ సాంస్కృతిక మూలాల్లోకి దిగుడు బావిలోకి దిగినట్లు దిగిపోవడం. సాధారణంగా ‘బర్రెంక చెట్టు’ పుల్లల్ని పంటి బలానికి మంచిదని దంత ధావనానికి వాడుతుంటారు. అలాగే ఈ కథ కూడా తెలంగాణ సాంస్కృతిక వారసత్వానికి ప్రతీక.

‘బర్రెంక చెట్టు’ నీడలో నాటి తెలంగాణా జీవితాన్ని పట్నమేసినట్లు చూపించిన కథకురాలు డా. సరోజన బండ. వృత్తిరీత్యా SCERT, ప్రభుత్వ ఉన్నతస్థాయి విద్యా అధ్యయన సంస్థలో ఆచార్యులుగా పని చేసి రిటైరయ్యారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో వీరి సంపాదకత్వంలో పలు పాఠ్య పుస్తకాలు వెలువడ్డాయి. ‘అనియత విద్య’ పాఠ్య పుస్తక రచయితలలో వీరొకరు. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం వారు రూపొందించిన నవోదయ  పాఠ్య పుస్తకాలు, CBSE తెలుగు పాఠ్య పుస్తకాలకు సంపాదకులుగా, విషయ, భాషానిపుణులుగా   వ్యవహరించారు.  మానవ వనరుల మంత్రిత్వశాఖ వారి ఆధ్వర్యంలో గిరిజన పాఠ్య పుస్తకాలను గోండీ, సవర భాషల్లో రచించారు.

ఉస్మానియా విశ్వవిద్యాలయం దూరవిద్య తెలుగు బోధనా పద్ధతుల రచనలో పాల్గొన్నారు. తెలుగు అకాడమి వారు ప్రచురించిన ‘తెలుగు బోధనా పద్ధతులు’ పుస్తకానికి సంపాదకులు. బాపు, రమణల ఆధ్వర్యంలో నిర్వహించబడిన ‘కొత్త దీపం’ వీడియో పాఠాల రూపకల్పనలో పాల్గొన్నారు. 10వ తరగతి ఉపవాచకం ‘విశ్వమాత థెరీసా’ కు సంపాదకులు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విద్యాశాఖ పక్షాన 1994లో ఇంగ్లాండులోని లీడ్స్ యూనివర్సిటిలో ‘ప్రాథమిక విద్య పాఠ్య ప్రణాళిక నిర్మాణం మరియు పాఠ్య పుస్తక రచన’ లో ప్రత్యేక శిక్షణ పొందారు. ‘సప్తస్వరాలు’, ఒక పూవు పూసింది’, ఎర్ర మందారం’ వీరి కవితా సంపుటాలు. ‘లచ్చుమమ్మ ముచ్చట్లు’ (నా రేడియో ముచ్చట్లు), ‘ప్రకృతికే ఆభరణాలు’ (నా రెడియో నాటికలు), ‘అక్షరమే ఆయుధం’ (నా రేడియో ప్రసంగాలు), గాలిపడిగెలు’, ‘అక్షర రూపాలు’ వీరి ఇతర పుస్తకాలు.  ‘సరోజం’ పేరిట ఆత్మకథను ఇటీవలనే వెలువరించారు. ప్రస్తుతం అమెరికాలోని వర్జీనియాలో నివసిస్తున్నారు.

               *

శ్రీధర్ వెల్దండి

తెలంగాణా కథా సాహిత్య విమర్శకి ఇప్పుడే అందివచ్చిన దివ్వె వెల్దండి శ్రీధర్. కథా విశ్లేషణలో నలగని దారుల్లో సంచరిస్తున్నవాడు.

8 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • తెలంగాణ కథ – 2017 (దావత్) లో ఈ కథ చదివాను. ఇప్పుడు మళ్ళీ చదివితే అదే గొప్ప అనుభూతి. మంచి విశ్లేషణ సార్..

  • అన్నా విశ్లేషణ బాగుంది.
    ఎసుల,బెడెం,కొప్పెర తెలుసు.
    కుచ్చాలు,నాకగాయడం?

  • నిజాం కాలం నాటి పల్లె తనాన్ని, రజాకార్ల ఆగడాలను, పల్లీయ సాంస్కృతికతను సాయుధ పోరాట కోణాన్ని గురించి కథలో తెలిపిన రచయిత గారికి, ఆ రచనను సమీక్షించిన డా. శ్రీధర్ సార్ గారికి అభినందనలు

  • రజాకార్ల తుఫాన్ బీభత్సాన్ని ఎదుర్కొని నిలిచి తెలంగాణ సంస్కృతి సాంప్రదాయ సుమ సౌరభయుత “బర్రెంక చెట్టు” ను డా. వెల్దండి శ్రీధర్ తన విశ్లేషణా దర్పణం లో చూపించిన విధానం అభినందనీయం!

  • Congratulations Sridhar. కథ విశ్లేషణ కు ప్రాణ ప్రదమైన భాషను చక్కగా పట్టుకున్నావు . తెలంగాణ మట్టిపరిమళాలాలు అవి . సీనియర్ రచయిత్రి బండ సరోజన గారి రచనాపాటవాన్ని నీదైన ప్రత్యేక శైలిలో చక్కగా చెప్పావు .జీవిత పత్రహరితాన్ని మనసులోకి దింపుకోకుంటే చిగురించలేమనే సందేశాన్నిచ్చి కథ ను చదివాలి తక్షణమే అనేలా రాసావు . సారంగ పత్రిక సాహిత్యసేవ బాగున్నది . సరోజన మేడమ్ గారికి, నీకు , అఫ్సర్ గారికి అభినందనలు.
    – కొండపల్లి నీహారిణి

  • .. కథా విశ్లేషణలో వెల్దండి గారిది ఒక విశిష్ట శైలి. కథలో రచయిత భావాన్ని సరిగ్గా ఒడిసిపట్టగల నేర్పు ఆయనది. ఒక్కోసారి రచయిత ఆలోచనా పరిధిని మించికూడా విశ్లేషణ సాగుతుంది. చక్కని కథను అందించిన రచయిత్రి డా. సరోజన గారికి, సమీక్షించిన శ్రీధర్ గారికి కృతజ్ఞతాపూర్వక అభినందనలు

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు