బర్మా తుపాకులు

బర్మా క్యాంపు కథలు  7

నీలాద్రి  తాత  దగ్గర బర్మా తుపాకీ వుంది.  అది బర్మా పెట్టెలో  ఉంటుంది, మంచి బర్మా టేకు పనితో చాలా బరువుతో

లోపల ఎన్నో అరలతో  వుండే బర్మా పెట్టె  కదపడం పిల్లల వల్ల  కాదు.

మధ్యాహ్నం చిన  కారు,  పెద  కారు  రోడ్డు మీద వెళుతోన్న వేళ , అమ్మమ్మ విసనకర్రతో విసురుకుంటున్న వేళ ,తాతయ్య  భోజనం చేసి కునుకు తీస్తున్న వేళ …

అయన మంచం  పక్కనే వున్న  బర్మా పెట్టెలో గుళ్ళు లేని బర్మా నాటు తుపాకీ తీసుకుని  దాన్ని తడుముతున్న వేళ

‘  హేయ్ .. యెహేయ్ .. హే ‘  అని ఒక్క పెద్ద  కేక వేసేశాడు  మ మ్మ ల్ని చూసి.

ఇంక ఆ రోజు నుంచి బర్మా పెట్టికి  తాళం పడి పోయింది.

*          *           *

1935 లో పరిపాలన లో సౌలభ్యం కోసం బర్మా  భారత్ నుంచి వేరు పడింది. అంతకు ముందు  బర్మా, శ్రీలంక దేశాలు బ్రిటిష్ ఇండియా లో ఉండేవి, భారత్ దేశం నుంచే పరిపాలన సాగించే వారు. బర్మా ను అభివృద్ధి చేయడానికి తూరుపు, కోస్తా జిల్లాల నుంచి జనం అవసరం పడ్డారు, ఇక్కడ సరైన ఉపాధి అవకాశాలు లేని, శ్రమించే తత్త్వం , దేహ దారుఢ్యం వున్న వేలాది మంది తెలుగు వారిని ని బ్రిటిష్ వారు ఓడల్లో బర్మా తీసుకు పోయారు.  వారు అక్కడి రబ్బరు తోటల్లో , కలప, టేకు పరిశ్రమల్లో, నిర్మాణాల్లో పనిచేశారు. అద్భుతమైన  కళా కౌశలంతో బర్మా టేకు పని, భవన నిర్మాణాలు, పింగాణీ పని చేశారు.

తెల్ల వారి రాజ్య విస్తరణకు అలా తెలుగోళ్లు కష్టించి పనిచేశారు.

మాండ్ లె , మోల్ మేన్, క మా గచ్చి, కింగాన్జీ     కమాయత్  లాంటి   ప్రాంతాల్లో తెలుగు వారు ఎక్కువగా వుండే వారు.

1941 సంవత్సరం  డిసెంబర్ చలి కాలం ఎప్పటి లాగే బర్మా లో వున్న తెలుగు వాళ్ళు పనులు చేసుకుంటున్నారు, రిక్షా కార్మికులుగా వున్నవాళ్లు చేతి రిక్షాలు లాగుతున్నారు, ట్రామ్ బళ్ళు రోడ్డు మీద ప్రశాంతంగా వెళుతున్నాయి, ముస్లింలు జమాత్ చేసుకున్నారు ,కార్మికులు పనులకు వెళుతున్నారు,  కాస్త తెలివి వున్న బొక్కా వెంకన్న లాంటి గోదావరి జిల్లా వాసులు  మార్వాడి సేఠ్ ల దగ్గర కలప వ్యాపారం చూసుకుంటున్నారు.

జపాన్ వాడు వేసిన బాంబులు మాండలే , రంగూన్ల మీద పడ్డాయి.

తెలుగు వారు చెల్లా చెదురైపోయారు, ” యుధ్ధం మొదలైపోయింది , బతికుంటే బలుసాకు తినొచ్చు”  అని పైకే  అనేసి కట్టు బట్టలతో, చేతికందిన సామాన్లతో భారత్ దేశం బాట పట్టారు.

అప్పటి వరకు ఓడల్లో రంగూన్ వెళ్లడం అలవాటు, వెంకన్న లాంటి వారికి అ త్యవ సరంలో  కుటుంబంతో విమానంలో వెళ్లే వెసులుబాటు వుంది, కానీ యుద్ధానికి… వున్నవాడు, లేనివాడు ఒక్కటే అందరికీ ప్రాణభీతి.

జపాన్ వాడు సైన్యంతో దిగిపోయాడు, బ్రిటిష్ వాడి మీద కత్తి కట్టాడు, యుద్ధం ఎన్నాళ్ళు ఉంటుందో తెలియదు అసలు బతికి ఉంటామో లేదో తెలీయదు.

గోదావరి జిల్లా నుంచి వెళ్లిన బొక్కా రాజమ్మ, బొక్కా వెంకన్న, చింతపల్లి  సూరన్న, దొమ్మేటోళ్లు, దొంగోళ్ళు ( ఇంటి పేరు ) కోల్లోళ్లు  అందరూ కలిసి కాలి  నడకన భారత దేశం బయలు దేరిపోయారు, ఈ ప్రయాణం భయంతో కూడినది, కొత్తది, బ్రతుకుతామో చనిపోతామో తెలియనిది.

జనం అస్సాం మీదుగా నడుచు కుంటూ, అడవులు దాటుకుంటూ నడుస్తున్నారు.చిట్టగాంగ్ అడవి చిత్రమైన అడవి , కాలి బాట, కొండలు, నీటి వనరులు, దారిలో చెట్ల ఫలాలు, ఆకుపచ్చని సౌందర్యం, ఇప్పుడు అడవి వారిని తనలో ఇముడ్చుకుని రక్షిస్తోంది,

బర్మాలో ఉంటున్న తెలుగోళ్లు భారత దేశం వైపు నడుస్తా వున్నారు.. వందలు  వేళల్లో భారత దేశం నడిచి పోతున్నారు, జపాన్  యుద్ధ విమానాలు బర్మా మీద దాడి చేస్తున్నాయి, తమ నెత్తి మీద నుంచి ఎగురుకుంటూ వెళ్లిపోతున్నాయి, విమానాలు వెళుతున్నపుడల్లా ఎక్కడ వాళ్ళు అక్కడే కూర్చొని నోటి నుంచి మాట కూడా పెగలకుండా వుండి పోతున్నారు.

ఈ దారిలో  బొక్కా  రాజమ్మ అక్క కొడుకు చింతపల్లి వీరం శెట్టి జపాన్ వాళ్ళ బాంబు దాడిలో చనిపోయారు, జనం మీద పడ్డ బాంబుల్లో మరికొందరు చనిపోయారు. వీరం శెట్టి కొడుకు చింతపల్లి సూరన్నను అక్కున చేర్చుకొని ముందుకు సాగారు. దారంట  వెళుతున్నప్పుడు నడవలేక కొందరు కళ్ళు తెలేసేసారు , అనారోగ్యంతో కొందరు  చనిపోయారు. అలా మయన్మార్ నుంచి అస్సాం మీదుగా, చిట్టగాంగ్ ఆడవుల లోంచి కలకత్తా మీదుగా రెండు నెలలు ప్రయాణం చేసి  ఇండియా చేరుకున్నారు ,

యుద్ధం తగ్గాక , పరిస్థితులు కుదుట పడ్డాక  బొక్కా వెంకన్న తిరిగి బర్మా వెళ్లిపోయి వ్యాపారం, జీవితం రెండూ ప్రారంభించారు.

*              *                *

బర్మాలో సంపాదించిందంతా ఇండియాలో పోగొట్టుకున్నందుకు  బొక్కా వెంకన్న బాధ పడిపోతున్నారు, ఒక పక్క తీపి వ్యాధి శరీరాన్ని నిర్వీర్యం చేసేస్తోంది, యెంత  ఐశ్వర్యం చూసాడు, తాను రంగూన్ నగరం నడిబొడ్డున 40 వీధిలో ఉండేవాడు, ఇక్కడనుంచి తాను తీసుకెళ్లిన చుట్టాలు అంతా ఆ పక్క వీధుల్లోనే ఉండేవారు, అందరినీ తీసుకెళ్లి అక్కడ స్థిరపరిచాడు తాను.

పరుపుల్లో దాచుకున్న బంగారం, స్వంత ఇల్లు, పిల్లలు, పెద్ద వాళ్ళతో దోస్తీ, దర్జా అయినా జీవితం,

“ తెలుగు వాళ్ళ పై బర్మీస్ దొమ్మీలను తట్టుకున్నాను,  జపాన్ యుద్ధాన్ని తట్టుకొని తిరిగి  బర్మా వెళ్లి జీవితాన్ని ప్రారంభించాము ,కానీ పిల్లల పెళ్లిళ్ల కోసం 1959 లో  అయిన వూరు వొచ్చి   ఇలా మిగిలాను” అని భార్య రాజమ్మకు చెబుతూ  కుమిలిపోతున్నాడాయన.

ఇండియా వొచ్చాక వ్యాపారంలో భాగస్వాముల మోసంతో ఆస్తి కరిగి పోయింది, లారీలు పోయాయి,పొలం ముక్కలే మిగిలాయి.

” కల వస్తోంది రాజమ్మా … కష్టానికి విలువ ఇచ్చి , గౌరవం ఇచ్చి, మనకు మన బంధువులకు ఆశ్రయం ఇచ్చిన రంగూన్ ప్రతి రోజూ కలలో వస్తోంది ” అని భార్య రాజమ్మ చేతిలో చనిపోయాడు.

నాయనమ్మ రాజమ్మ ముగ్గురు  మగ  పిల్లలతో  అతి తక్కువ పొలం తో మిగిలిపోయింది.

*       *     *

బర్మా పెట్టెతో , నాటు తుపాకీతో  అస్సాం అడవులు దాటి  గోదావరి జిల్లాలో  స్వంత వూరికి పయనం సాగిస్తున్నారు దొంగ నీలాద్రి,

మంచి జీవితం కోసం బర్మా వొచ్చారు , ఎన్నో విషయాలు తెలుసుకొన్నారు. తనకున్న అక్షర జ్ఞానంతో శ్రీకాకుళం నుంచి వొచ్చిన కూలీలకు   వారి క్షేమ సమాచారాలు  వారి ఇంటికి ఉత్తరాలు కూడా రాసి పెట్టే వారు.  శ్రీకాకుళం కూలీలు విశాఖలో కరువు కాటకాలతో 1923 లోనే బర్మా వొచ్చేసారు, చిన్న చిన్న పనులు చేసుకుంటూ చేతి రిక్షాలు నడుపుతూ జీవిక నడుపుకునే వారు.

అమాయకత్వమైన  వారి భాష, యాస నవ్వు తెప్పించినా  తన పని అయిపోయాక వారికి ఉత్తరాలు రాసి పెట్టే వారు.

” మీ నీలాద్రి తాత బర్మా వెళ్లి అక్కడనుంచి పారిపోయి వొచ్చేసాడు ” అని గంగారత్నం అమ్మమ్మ వేళాకోళం ఆడినా ఏమి అనేవాడు కాదు, ఏదో  ఆలోచనలో పడిపోయే వాడు.

బుర్రకథలు, శ్రీకృష్ణ పాండవీయం లో పద్యాలు రాగ యుక్తంగా తాను పాడిన బర్మా రోజులు గురొచ్చేవి అనుకుంటా.

నడక, బహుజనుని నడక, మెరుగైన జీవితం కోసం నడక, ఈ నడకే  స్వంత వూరికి వెళ్ళాక, పొలం సంపాదించడానికి , వూర్లో మోతుబరిగా ఎదగడానికి ఉపయోగ పడింది, బర్మా జీవితం ఎన్నో పాఠాలు నేర్పింది.

పిల్లలందరిని ఉన్నత స్థానాల్లో ఉంచడానికి పెద్దగా ఆలోచించడానికి ,గోదావరి లంకల గ్రామాల నుంచి ఇవతలకు రావడానికి, దోహద పడింది నీలాద్రి తాతకు.

*      *   *

1963 లో  బర్మా లో సైనిక పాలన వొచ్చింది , అప్పటి వరకు స్వంత ఊరును వొదిలేసి అక్కడే వుండి పోయిన  తెలుగు వారు తిరిగి రాక తప్పలేదు, అలా వొచ్చిన కాందిశీకులు కోసం ప్రభుత్వాలు కాలనీలు కట్టాయి, ఆలా బర్మా క్యాంపులు, బర్మా కాలనీలు తెలుగు నేలలో వున్నాయి.

తెలుగు వారు వొస్తూ వొస్తూ బర్మా నుంచి కాస్త బౌద్ధం, బర్మా సేమ్యాలు, నూడిల్సు , బర్మీస్ భాష పట్టుకు వొచ్చేసారు.  రంగూన్ రౌడీ నాటకం వేసి తమ ప్రతాపాలు చాటారు. సంఘాలు పెట్టారు.

కాస్తో కూస్తో సంపాదించుకుని తిరిగి వొచ్చేసిన గోదావరి జిల్లా వాసులు కొంత మెరుగు, విశాఖ జిల్లా నుంచి వెళ్లి వొచ్చిన కాందిశీకులు ఎక్కువ ఆర్ధికంగా ఇబ్బందులు  పడ్డారు.

*        *         *

ఇది బర్మా వెళ్లి వొచ్చిన దొంగ నీలాద్రి, బొక్కా వెంకన్న అనే ఇద్దరు తాతల కథ, ఇప్పటి  విదేశీ వలసలకు వీటికి దగ్గర సంబంధం కనిపిస్తే కనిపించొచ్చు కానీ ఇద్దరూ తిరిగి మాతృ దేశం వొచ్చి ఇక్కడ గెలుపు కోసం ప్రయత్నం చేసిన బహుజనులే , గెలుపు కోసం వారు విడిచిన పాద ముద్రల ధూళి వెతుకుతూ నేనూ తిరుగుతుంటాను , నా తరువాత తరమూ తిరుగుతుంటుంది, ఎందుకంటె నడక తోనే గెలుపని తాతలు చెప్పారు కదా.

*

హరివెంకట రమణ

కొంతకాలం హైదరాబాద్ , విశాఖ లో చిన్న పత్రి క‌లలో ప‌నిచేసాను, త‌రువాత యానిమేష‌న్ రంగంలో చాలా కాలం ఉన్నాక మున‌సోబు ఫ్లుకువోకా ( జపనీస్ రైతు ) ప్రభా వంతో ఉన్న ఉద్యో గం వ‌దిలేసి స్వతంత్రంగా బ్రతకాలనే నిశ్చ‌యంతో ఫ్యాకల్టీ ,కన్సల్టెంట్ , మార్కెటింగ్ , ఎన్‌జీవో ఇలా ర‌క‌ర‌కాల వృత్తులు చేసేను , చేస్తున్నాను. కొన్ని డాక్యూమెంటరీలు, మరికొన్ని యానిమేషన్ చిత్రాలు తీసాను. చాల తక్కువ కథలు పత్రికలలో వొచ్చాయి , తెలుగు మ‌రియు సోష‌ల్ వర్క లో పీజీలు చేసేను. భార‌త ప్రభుత్వ ప్రతిష్ఠాత్మక యువ‌జ‌న అవార్డు 2014 లో వచ్చింది. ప్రస్తుత నివాసం విశాఖ‌ప‌ట్నం.

5 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)
  • బర్మా తుపాకులు కధ చాలా బాగుంది, బర్మాలో యుద్ధసమయంలో భారతీయులు అక్కడినుంచి నడిచి తిరిగి రావడడంలో ఎదుర్కున్న సమస్యల్ని కళ్లకు కట్టినట్టు రచయిత వర్ణించారు.కధ చివరలో నడకతోనే గెలుపని చెప్పి ముగించడం బాగుంది.

  • బర్మా కాందిశీకులు గురించి చాలా చక్కగా వివరించారు.

    మీ
    శ్రీనివాస్ గోగుల

  • బర్మాతుపాకులు కధ చాలా బాగుంది.కధ ఆసక్తిగా సాగింది.రచయిత అభినందనీయులు.

  • పూలను చదవగలగటం…. అక్షరాలను ఆఘ్రాణించగలగటం ఒక కళ ! రచయిత హరిగారు సునిశిత దృష్టి కలవారిలా కనిపిస్తున్నారు. బర్మా తుపాకులు కధ చెప్పిన తీరు బాగుంది. అనుభవాల ద్వారా జీవితాన్ని తీర్చిదిద్దుకోవాల్సిందే. ఇద్దరు తాతలు నీలాద్రి,వెంకన్న పాత్రల ద్వారా నాటి బహుజనుల ఆలోచన విధానం కళ్ళకు కట్టినట్లు చూపించారు. బర్మా క్యాంప్ కధలు మరిన్ని రాయాలని నాటి జీవన విధానాన్ని మరింతగా ఆవిష్కరించాలని కోరుకొంటున్నాను.

  • Asalu barma camp ela vachindo kallaku kattinatlu ga chepparu….future generations ki e vishayalu chala important hari garu.

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు