బర్త్ ఆఫ్ ఆ స్టోరీ!

జ్ఞాపకాల్లో ఇంకా సజీవంగా తిరుగుతున్న అశోకన్న ఛాయ్-సమోసా రుచి, వర్షం, కాఫీడేలో నుంచి కాఫీ గుప్పుమనే వాసన, రోడ్డు మీద తిరుగాడే పిల్లి… ఇవ్వే దీని శక్తులన్నీ.

థ ఉద్భవించిన చోటు నా మనస్సు. నవంబర్ కాలపు అమెరికా చలి. అలాంటి ఓ రాతిరిలో అకస్మాత్తుగా మొదలైంది ఒక ఆలోచనగా. అలా మొదలై ఫిబ్రవరిలో ఒక రూపు తెచ్చుకుంది. నాలుగు నెలల సమయం. న్యూయార్క్ ఎయిర్‌పోర్ట్‌లో నిల్చున్నపుడు చివరి లంకె దొరికి ఆనందపడ్డ క్షణాలు గుర్తొస్తున్నాయి ఇది రాస్తుంటే.

దేని గురించైనా ఇది ‘ఇదే’ అని ఎలా చెప్పేది? అయినా కూడా చెప్పాల్సి వస్తే ఈ కథ చాలా విధాలుగా ఒక ప్రయాణం. ప్రయాణం అంటే వచ్చే అడుగు ఏంటో  తెలియనితనం. కథాపరంగా కూడా ఇది కథకుడి ఆంతరంగిక ప్రయాణమే. ఒక అడుగు వేస్తే మరో అడుగు వేయకతప్పదు అన్నట్టు క్షణక్షణానికి కొత్త దారుల్లో, సహజంగా వెలుగుతూ కదిలే కథ. అదే ‘కెఫె స్టోరీస్’.

యవ్వనంలో నిలవని ప్రేమలని ఒక్కొక్కరు ఒక్కో విధంగా దాటుతారు. ఎన్ని దారులున్నా ద్వేషమనేది ఒక దారి కాకూడదు అనేది ఈ కథ తాలూకు ఆత్మ. మరో మనిషిని ప్రేమించే స్వేచ్చని(Free Will) ఒక హక్కుగా మనం వాడుకున్నంత కాలం ఆ కోల్పోయిన ప్రేమల మీద ద్వేషం  పెంచుకోలేని బాధ్యత, జీవితపు గాయాలని లాలనతో (ద్వేషంతో కాకుండా) నిమురుకునే వెసులుబాటు మనల్ని ఒక మామూలుతనపు బంగారు రంగు వెలుగుతో నింపుతుంది. ఆ గమనింపుతో పుట్టిన కథ ఇది.

కథాచర్చల్లో తరచూ శైలి-శిల్పం అంటారే, వాటి అర్థాలేంటి? మరో ప్రశ్న. గర్భంలో శిశువు ఎందుకు కదులుతుంది? పెరుగుదల, చలనం జీవలక్షణాలు క్షణక్షణానికి తొలిచేయగా గర్భంలో ఉన్న శిశువు కదిలినట్టే ఈ కథే తన జీవానికి అవసరమైన రూపుని, శైలిని, శిల్పాన్ని తెచ్చుకుంది.

నేను ఇదే కథ గురించి ఎందుకు మాట్లాడుతున్నట్టు? కథ అంటే ఒక ఇంటిమేట్ వ్యవహారం అని, లోలోపలి ప్రపంచంలో నీకై నువ్వు వేసుకునే ఒక దారి అనే   స్పృహని మనుస్సుకు పులిమింది కాబట్టి.

పుడుతూనే శిశువు ‘క్రావ్వ్వ్వ్వ్. . .’ అని ఎందుకు ఏడుస్తుంది? మొదటిసారి ఊపిరి తీసిన అనుభవం. ఇక ఆ తరవాత విశ్వమో, అందులోని అణువులో, జన్యువులో, లేకపోతే ఇవన్నీ కలిసి మరి అప్పటి నుంచి   ఆ జీవి ప్రయాణాన్ని స్వతంత్రంగా ముందుకు నడిపిస్తాయి. ఇంత ఆలోచిస్తుంటే అనిపిస్తుంది, కథైనా/కళైనా స్వయంప్రతిపత్తి ఉన్న ప్రపంచంలా మనిగినప్పుడే దానిలో అసలైన జీవం ఆనవాళ్లు మెరుస్తాయని. ఈ కథ ఆ అంశతోనే పుట్టింది.

ఈ కథలో ముఖ్య పాత్రకి పేరుండదు. అందరూ ఐడెంటిఫై చేసుకోవడానికి. ఆ మనిషి తాను కోల్పోయిన మనిషిని ఆరేడేళ్ల సమయం తరువాత కలవబోయే క్షణాల గురించి నడుస్తుంది ఈ కథ. రెండు మూడు బ్లాక్ కాఫీలు తాగి, కలవబోయే అమ్మాయి కోసం ఎదురుచూస్తూ, జ్ఞాపకాల ఈదురుగాలుల్లో టేబుల్‌పై ఉన్న నాప్కిన్ మీద గతం తాలూకు కొన్ని వాక్య శకలాలు రాసుకుంటాడతను. ఆ తరవాత ఏది ఏమైంది అని కథ చూపిస్తుంది. కథ తాలూకు ముఖ్య ఉద్దేశం కూడా చెప్పేశాను కాబట్టి ఈ కథలో నాకు నచ్చిన ఒక సందర్భం గురించి చెప్పి మిమ్మల్ని కథతో వదిలేస్తాను.

కథకుడు కాఫీడే బయటకు వెళ్లి, లోపలికి వచ్చి, మళ్ళీ కాఫీడే బయట నిలబడాల్సిన సందర్భంలో కథకుడిని కూడా ఒక ప్రేక్షక పాత్ర చేస్తూ కథ అన్-ఫోల్డ్ అయ్యే విధానం, అది మిగిల్చే అనుభవం పాఠకుల స్పృహలోకి రావాలని ఓ కోరిక నాకు. ఈ కథలో రచయిత దూరడు లాంటి మాటలు చెప్పను. కథలో ముఖ్యపాత్ర కూడా ఒక ప్రేక్షకుడై  ఇవతల వైపున, మనతో నిల్చుని తన లోపలి ప్రయాణాల అంతిమ క్షణాలని ఒక Catharsis రూపాన ప్రసవించడం చూస్తారు.

రచయితగా కళ్ళుమూసుకుంటే నాలోపలంతా  గుప్పుమని కాఫీ వాసన. అట్లా పురుడు పోసుకుంది ఈ కథ. కథ బాహ్యంగా కెఫె కాఫీ డే-అశోకన్న బండి మధ్యన జరుగుతుంది. కానీ ఇంతకుముందే చెప్పుకున్నట్టు ఇది ఆంతరంగిక ప్రయాణం కూడా! అలా బయటా-లోపలా రెండు ప్రపంచాల్లో ప్రయాణించే కథకి ఒక క్రిస్టల్ క్లియర్ క్లారిటీ అవసరం. అందుకే ఇది ఒక స్క్రీన్‌ప్లేలా తోచే కథ అయ్యింది. మొదటి వాక్యం నుంచి చివరి వరకు పాఠకుడు ఒక సినిమా చుసిన అనుభవంలోకి వస్తాడు. జ్ఞాపకాల్లో ఇంకా సజీవంగా తిరుగుతున్న అశోకన్న ఛాయ్-సమోసా రుచి, వర్షం, కాఫీడేలో నుంచి కాఫీ గుప్పుమనే వాసన, రోడ్డు మీద తిరుగాడే పిల్లి… ఇవ్వే దీని శక్తులన్నీ.

“ఒక చాయ్ బండి దగ్గర రోజూ కూర్చుంటే ఒక తరం తాలూకు చరిత్ర రాయొచ్చు కదా అనుకున్నాడు” అనేది ఈ కథలో నాకు చాలా నచ్చిన వాక్యం.

 

కెఫె స్టోరీస్

 

దే కాఫీ డే. ఏళ్ల తరవాత మళ్ళీ అదే చోటు. ఆ టేబుల్ ఇటు, ఆ మేనేజర్ ఎక్కడో, ఈ మేనేజర్ ఎక్కడివాడో లాంటి మార్పులు మినహా అన్నీ అక్కడే ఉండిపోయిన చోటు. అంతే స్క్వేర్ ఫీట్ దాదాపుగా. వర్షాకాలం కాబట్టి  మెనూలన్నీ కాఫీ స్టీమ్‌తో తడిసిపోయి ఉన్నాయ్. ఇదే వేసవి కాలమైతే? నవ్వొచ్చింది అతడికి.

స్మూతీస్, ఐస్‌క్రీమ్స్ ఇవ్వే ఉండేవి మెనూ నిండా. సండేని వారాంతరపు Sundayలా కాకుండా మెనూలో కనపడే Sundaeలాగా ఎలా పలకాలో వాదించుకు నవ్వుకున్న సందర్భం గుర్తొచ్చింది. ఆ జ్ఞాపకం తన నవ్వును గుర్తు చేసి జ్ఞాపకాలకు కీ ఇచ్చి వదిలిపెట్టింది. కార్డు స్వైప్ చేస్తే బిల్‌తోపాటు పెన్ పట్టుకు వచ్చిన అతడి అమాయకత్వం మీద తను నవ్విన నవ్వు.

అలా ఆలోచలన్నీ గతంలోకి వాలుతుంటే అతని చూపులు మాత్రం కాఫీ డే బయటకి దారులు వెతుకున్నాయి. నిటారుగా నిల్చున్న కాఫీ డే అద్దం మీద ఓ అమ్మాయి. ఆమె మీద మొలిచిన కోల్డ్ కాఫీ మీసం. దాన్నే ఆశగా చూస్తున్న ఓ అబ్బాయ్. వాళ్ళ ఇద్దరి మధ్యన అద్దం నుంచి చూస్తే, అప్పటివరకు అక్కడే కూర్చున్న ఓ జంట పోర్టికో నీడన నిలబడి, కిందకి వెళ్లడం వీలు చేయని వాన వంక చూస్తున్నారు.

చాలా మాములుగా విడిపోతున్నాం కదా అని తను, విడిపోతున్నా కూడా అప్పటిదాకా తోడు వచ్చిన సజీవ జ్ఞాపకాలు ఇచ్చే ఫాల్స్ సెక్యూరిటీని ఇక వదిలేయాలి అని అతను నిర్ణయం తీసుకుని నిల్చున్న చోటు అదే. ఇలాంటి  జ్ఞాపకాలు తనకి ఏ విషయాలు గుర్తుచేస్తాయో అని చాలాసార్లు ఊహించుకున్నాడు.

అతనికి మాత్రం ఖరీదు. కొన్ని నిర్ణయాల ఖరీదు ఎంతంటే…ఐదేసి సంవత్సరాల్లో రెండేసార్లు మన దేశానికి వచ్చి కేవలం అసహనాన్ని, దుఃఖాన్ని మింగి వెళ్లిన బరువంత అని అనిపించింది. చివరిసారి వచ్చినప్పుడు మాట్లాడుకుంది ఇక్కడే. దగ్గరగా, ‘చివరిసారి ఇంత దగ్గరగా కూర్చోగలం’ అన్నంత దగ్గరగా, అదే స్పృహతో. మూడునాలుగు గంటల మాటల మధ్యలో ఒక క్షణం ఆగి,

‘అబ్బాయ్‌లాగ  కలిశా నిన్ను.. ఎంత మారిపోయావు..’ అని అంది తను.

కొన్ని మాటలు కొన్నేళ్ల ప్రయాణాలకు ఫుల్‌స్టాప్‌లా అనిపిస్తాయి కాబోలు. తట్టుకోలేక పక్కచూపులు చూశాడు.

అపుడే వాళ్ళు ఆ మెట్ల మీద నుంచి దిగి వెళ్ళిపోయింది. నడక నేర్చిన మనం అడుగులో అడుగేస్తూ అందనంత దూరంగా విడిదారుల్లో వెళ్లిపోగలం అని గుర్తుండదు ఎందుకో అని నిట్టూర్పులు ఇంకా గుర్తే అతనికి.

** **

దానికి మునుపటి ఇండియా ట్రిప్. ఎయిర్‌పోర్ట్‌లో అమ్మ-నాన్న వచ్చే ముందే తనే వెనక నుంచి వచ్చి గట్టిగా హత్తుకుంది. అమ్మ-నాన్నని, వాళ్ళ ఉక్కిరిబిక్కిరి ప్రేమని, అంత ఆనందాన్ని తట్టుకొని, తేరుకొని, వాళ్ళని ముందు నడవమనే సాకుతో తనని లాక్కుని మరీ హత్తుకున్నాడు. అదుపుతప్పి గోడకు గుద్దుకున్నారు మెత్తగా. అమ్మాయి పొట్టి. హత్తుకోవడానికి వంగితే అతని పెదవులు ఆ అమ్మాయి మెడవంపు పైకి వాలేవి. అక్కడే ఒక ముద్దు పెట్టుకున్నాడు. హైదరాబాద్ గాల్లోని వెచ్చదనం  చుట్టుముట్టినా ఇద్దరి గుండెల్లోకి ఒక చల్లదనం ప్రవేశించింది ఎక్కడినుంచో. అతడి కళ్ళలో వేడి నీళ్ళు తిరిగాయి. కానీ అదే కదా గమ్మత్తు అంటే. మనం హత్తుకుని ఏడిస్తే కౌగిలిలో మనిషికి మన కన్నీళ్లు కనపడవు.

** **

కాఫీ టేబుల్ తన ఉనికిని చాటుతూ ఉలిక్కిపడే శబ్దం చేసింది. తన నుంచి వచ్చిన మెసేజ్‌తో ఫోన్ వైబ్రేటైంది.

‘సారీ! థర్టీ మోర్ మినిట్స్, ట్రాఫిక్!’ అని స్క్రీన్ మీద.

ఫోన్ పక్కన అతను తాగేసిన రెండు కాఫీ కప్పులు. నాలుగు చేతి రాతలు, కాఫీ మరకలతో, అతను వాడి ఉండచుట్టేసిన టిష్యూ పేపర్. వెయిటర్‌ని పిలిచి ‘ఇంకో బ్లాక్ కాఫీ’ అని అడిగాడు.

‘’సర్! దిస్ ఈజ్ యువర్ థర్డ్’’ అని లెక్క చెప్పాడు వెయిటర్.

అది మొదలు. ఆలోచనల నుంచి బయట పడి చూస్తే తల పొడిచేస్తున్నదని అప్పుడే నొప్పి తెలియడం. కాఫీ లౌంజ్ సోఫాలో కూరుకుపోతున్నట్టు గుండెలో ఏదో బరువు. కళ్ళలో ఏదో అలసట.

ఇంకో అరగంట… మరో బ్లాక్ కాఫీ… వాటిని దాటితే ఇన్ని జ్ఞాపకాల దాడులను తట్టుకు ఉండగలనా అనే సమాధానం లేని ప్రశ్న. లేచి బయటకి నడిచాడు.

రోడ్ దాటితే అశోకన్న చాయ్ బండి. ఏ కాలంలో అయినా చెట్టు కింద పొందిగ్గా ముడుచుకున్న చిన్న అడ్డా. అతని యవ్వన జీవితం. ఏళ్ళ తరవాత కనపడ్డా కూడా  ఆశ్చర్యం లేని గొంతుతో ‘అన్నా, పోయాల్నా చాయ్! తాగుతవానే!’ అంటున్న అశోకన్న.

వర్షపు నీటికి అడ్డుగా పైన నీలం రంగు టార్ఫాలిన్ కవర్. కూర్చుంటే ప్యాంటు తడవకుండా ఫుట్‌పాత్ మీద సాక్షి పేపర్. కూర్చుని తల ఎత్తి చూస్తే కాఫీ డే పైన GRE  కోచింగ్ సెంటర్లు. అశోకన్నకి కూడా అర్ధమయ్యే  ఉంటుంది నిన్నటి వరకు ఇక్కడే సగం జీవితం గడిపిన పిల్లలు మరో రోజు నుంచి సంవత్సరాల దాకా కనపడకుండా ఎటు పోతారో అని. ఒక చాయ్ బండి దగ్గర రోజూ కూర్చుంటే ఒక తరం తాలూకు చరిత్ర రాయొచ్చు కదా అనుకున్నాడు. తేరుకుని ‘ఆ! చిన్న సమోస కూడా!’ అని మెల్లిగా అరిచాడు అతను.

‘వంద నోటు ఉన్నదా జర?’

‘ఇగో’

‘ఇగో చాయ్! చిల్లర పటు. సమోస ఈడ పెడుతున్న’ అని పక్కనే కూర్చున్నాడు అశోక్. వర్షం వెలిసిన సాయంత్రం. రద్దీ ఎక్కువగా లేని అడ్డా.

‘అదివోని కనీ! నీ బండి కింద గంపల ఒక పిల్లి ఉండే కదా..?’ అని అతను.

‘బెచైన్’

‘ఆ.. అదే దానికి ఆ పేరు ఎందుకు పెట్టిండ్రు? ఉందా అది? ఏమైంది దానికి?’

‘అదా? అది పిల్లికి ఎక్కువ కుక్కకి తక్కువ ఉండే. అది ఏం జాతో దానికే తెల్వనట్టు. అందుకే బెచైన్.. బెచైన్.. అని పిలుస్తుండే.’

‘ఉందా అది? ఏమైంది దానికి?’ ఈసారి ఇంకాస్త ఆత్రుతతో.

‘పోయింది’

‘చచ్చిపోయిందా?’

‘తెల్వదే! ఇక్కడనే బిడ్డని కన్నది. ఇగ ఉండలే! రెండు  ప్యాకెట్ల పాలు పోసినా ఉండలే. రోజు అట్లట్ల వచ్చి ఇగ బంద్ అయ్యింది.’

‘దాని బిడ్డ మరి?’

‘తల్లి ఉంటె బిడ్డ ఉంటాదే? అది అస్సలే ఉండలే!’

అది వింటూనే అతని మొహం ఎందుకో మెరిసింది. మనస్సులో ఏదో కదిలి రాయాలనిపించింది. అదేంటో సూత్రీకరించుకొని ఆగిపోకూడదు అని కూడా ఉంది. సగం వడికిన చిరునవ్వు, వదిలేసి వెళ్లిన ప్రేమ గుర్తొచ్చాయి. ద్వేషం పెంచుకోలేని అతని స్వభావం కూడా. నిర్మలంగా  ఊపిరి పీల్చుకున్నాడు. ఇన్నేళ్ల వేదన మీద కొంత ఆనందం అలుముకుంటుంటే అతడి మెదడులో క్రియేటివ్ లిటరేచర్ తాలూకు జ్ఞాపకాలు మెదిలాయి. సైంటిఫిక్ లిటరేచర్‌లోని నిష్పాక్షికత, కార్పొరేట్ ఉద్యోగంలోని పొదుపు, ఈ అలవాట్లు దాటి స్వేచ్ఛగా  రాయాలనిపించింది. సగం తాగిన చాయ్ గిలాస పట్టుకొని వర్షంలో గెంతుతూ కాఫీ డేలోకి ఉరికాడు.

అతని ఆదుర్దా గమనించని మేనేజర్, ‘సర్, వీ డు నాట్ అలౌవ్ అవుట్ సైడ్ ఐటమ్స్ హియర్’ చేతిలో సగం తాగిన చాయ్ గిలాస చూపిస్తూ.

‘నార్ డిడ్ ఐ కమ్ టు గివ్ థిస్ టు యు. ఐ నీడ్ సమ్ థింగ్ విచ్ ఐ హావ్ లాస్ట్’

‘యెస్ సర్. వీ కెన్ షూర్ హెల్ప్ యు. వాట్ హావ్ యూ లాస్ట్?’

‘ఎ టిష్యూ పేపర్. ఐ సాట్ ఆన్ ది టేబుల్ రైట్ దేర్’ అతను కూర్చున్న టేబుల్ చూపిస్తూ. మేనేజర్ ముఖంలో అర్థంలేనితనం.

‘సర్! ఇట్ ఈజ్ అవర్ ప్రయారిటీ టు కీప్ అవర్ ప్లేస్ నీట్ అండ్ క్లీన్, విచ్ ఈజ్ అవర్ ఫస్ట్ డ్యూటీ టు సర్వ్ అవర్ కస్టమర్స్ బెటర్ అండ్ హెల్తీ.’ ఓత్ ఆఫ్ డ్యూటీ అప్పజెప్పేస్తున్న మేనేజర్.

పెరిగిన అసహనంతో, ‘ప్లీజ్ గెట్ మీ ది వెయిటర్ హూ టుక్ కేర్ అఫ్ మై టేబుల్’ అని అతను.

‘ఎస్ సర్, ఐ కెన్ షూర్ డూ థట్ ఫర్ యు. కెన్ యు ప్లీజ్ వెయిట్ అవుట్ దేర్?’

బయటకొచ్చి పోర్టికో నీడన పరిచయం లేని వెయిటర్ కోసం వెయిట్ చేస్తూ అతను. కాఫీ డే లోపలి ప్రపంచాన్ని చూస్తూ నిలబడ్డాడు.

‘జుమ్మ్మ్..’ అని ఇబ్బంది పెట్టని ఏసీ శబ్దాల కింద, చల్లటి వాతావరణం, కాఫీ వాసన కప్పేసిన లోపల, ఆడుతూ ఆడుతూ ఒక బుజ్జాడు వాడి లేత కాళ్లతో నడక నేర్చిన ప్రదర్శన ఇస్తున్నాడు కాఫీ ప్రజానీకానికి. వెనక నుంచి బుజ్జాడి తల నిటారుగా ఉంది. అది చూసి అతను నవ్వుకున్నాడు. వాడి తల నుంచి చూపు పైకి లేచి, ముందుకి దూకి, నేల మీద పడి పైకి లేస్తే, అతను కూర్చున్న టేబుల్. కూర్చుని వదిలి వెళ్లినప్పటి నుంచి అలానే ఉంది.

ఆశ్చర్యమైన ఆశతో చూపును తన దగ్గరికి లాగేసుకొని ఎడమ పక్కన ఏదో అలజడి. చూస్తే మేనేజర్ ముందు సమాధానం చెప్పాల్సిన వాడిలా వెయిటర్. తన వైపే వేలు చూపిస్తూ ఆ మేనేజర్ అడిగే ఏవో ప్రశ్నలు వెయిటర్ ముఖంలో అయోమయంలా క్షణాల్లో తర్జుమా అవుతున్నాయి.

ఇంత జరుగుతుంటే డైపర్ పిర్రలు, కాళ్ళకి అడ్డొస్తున్న లాగు, నోట్లో వాళ్ళ అమ్మ కొంగు – ఇన్ని కష్టాలని కేవలం ప్రయత్నాలుగా చూసే అమాయకత్వంతో, పడుతూ పడుతూ లేస్తూ ఆ బుజ్జాడు అతను కూర్చుని వదిలివెళ్లిన టేబుల్ దగ్గరికి చేరాడు.

అలా చేరి ఉండచుట్టుకుపోయిన టిష్యూని, సగ్గం విప్పగా చెల్లాచెదురైన చెక్కర ప్యాకెట్లని చూశాడు. పెద్దవాళ్ళకి తెలియని విషయాలు కొన్ని బుజ్జాయిలకు తెలిసిపోతాయంతే! అది చెక్కర అని, ఉప్పు కాదని,  రంగురంగు బెలూన్లలో ఉండే తెలియని ఆకర్షణలాగా వాళ్ళకే తెలిసే రహస్యాల్లో అదీ ఒకటి. అంత నిశ్చయంతో నోరు తీపి చేసుకుంటున్న వాడిని చూసి వాళ్ళ అమ్మకు కన్ను కుట్టింది. వెయిటర్‌ని పిలిచింది అధికారంతో. కస్టమర్ అరుపే తడవుగా అతను వృత్తి ధర్మం నెరవేర్చుకునేలోపు, అమ్మతనం చిరాకుతో బుజ్జాడిని లాగేసుకునే మధ్యన వాడు కొన్ని చేతిరాతలు చూశాడు. ఆ పేపర్లో నల్లని సిరాతో అతను రాసుకున్నవి. అవి సత్యాలని ఎక్కడా తీర్మానం లేదు కానీ, ఆ మనిషి, అతని సంవత్సరాల కాలాల వేదన, వాటి సారం… ఇదంతా వడపోసి తనని తానే విప్పి చూసుకునేంత నిజాయితీగా, పొదుపుగా రాసిన పదాలు. ఇన్ని వాసనలు అంటని పసిప్రాణమే అయినా ఆ బుజ్జాడెందుకో వాటన్నిటిని స్టార్ డస్ట్‌లా, ఫైర్ వర్క్సును చూసినట్టుగా చూశాడు.

”ప్రయాణం లాంటి ప్రేమ.”

ABORTED.

”This too shall pass.” పేపర్ చినిగే అంత ఒత్తుగా.

”Move on.” అతి మాములుగా.

”What we had was magi..” చిక్కురాతలో ఉండే విసురైన అందంతో.

అర్థంకాకున్నా ఆ రాతలనే తదేకంగా చూస్తున్న పసిప్రాణాన్ని చుసిన అతనికి ఇదంతా ఒక మార్మిక రహస్యం దాచుకున్న నాటకంలా అనిపించింది.

ఒత్తి పెట్టి రాసిన అక్షరాలు, ఒత్తిడి రాతలు, కొన్ని కొట్టివేతలు దాటి బాధని తగ్గించుకోవడం అంటే వ్యక్తపరచడాన్ని దాటి దింపుకోవడం అని అర్థమయ్యి భుజాలు అలసట వీడాయి. చేతిలో అశోకన్న చాయి, నోట్లో సమోస రుచి, జేబులో తిరిగి వచ్చిన చిల్లర__ ఎన్నేళ్ళైనా, ఎన్ని మారినా ఇంకా సాగిపోయే అతని  జీవితంలా. సంద్రం లాంటి ప్రేమ. చుట్టూ సమాధానాల మధ్యన అతను.

సమాధాన పడ్డ అతని మనస్సు వెళ్ళిపోదాం అని  మొదటి అడుగేసి పూర్తిగా కాఫీ డే వైపు వీపును తిప్పే ఒక్క క్షణం ముందు, ఐమూలగా, అతనికి కొన్ని దృశ్యాలు కనపడ్డాయి.

ఆ బుజ్జాడు, నోట్లో నానుతున్న వాళ్ళ అమ్మ చున్నీ, దాంతో వాడు వెనక్కి లాగబడుతుంటే కిందపడ్డా

ఏడుపు లేని వాడి నిండు మొకం. వాడిని చూస్తూనే అతని మనస్సులోని సగం వడికిన చిరునవ్వు తాలూకు ఛాయలన్నీ ఆవిరయ్యి గుండె తేలికైన అనుభూతి విరిసింది.

మెట్లు దిగుతుంటే…

లోలోతుల్లో ఓ అల్లకల్లోలం, అది చేసే అలజడి…

వీటన్నిటిని పక్కనే కూర్చొని నిశ్చలంగా పలకరించినట్టు..

జీవితానికి సూత్రాలు అంటూ ఏవి ఉండవనే సత్యపు బుడగ పైకి తేలి, ఈ విశ్వం ఎవ్వడికీ కుట్రలు పన్ని సహాయం చేయదనే సామాన్య రహస్యం అందిన మెరుపు అతడి కళ్ళలో. దానికి సాక్ష్యంగా అప్పుడే ఒక మెరుపు మెరిసి మాయం అయింది. పైకి చూస్తూ ఒక చిరునవ్వు విసిరాడు. కొన్ని చినుకులు అతని గడ్డం మీద వాలి మెరిశాయి. సాయంత్రపు చీకటి కమ్ముకుంటుంటే అతని ఫోనులో నీలం రంగు వెలుతురు మిణుకుమిణుకుమంటోంది.

“ఐ ఆమ్ హియర్” అని మెసేజ్ తన నుంచి.

*

ధీరజ్ కాశ్యప్ వేముగంటి

1 comment

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు