వేణు నక్షత్రం మొదట కథకుడిగా నాకు పరిచయం. ఆయన రాసిన “అరుగు” లో నాకు బాగా నచ్చిన కథ “ఒంటికి రెండు- రెంటికి ఐదు”. బీహార్ నుంచి వచ్చిన కూలీలు హైదరాబాద్ శివారులో నీళ్లు సరఫరా చేసే పెద్ద పైపుల నిర్మాణ కార్మికులుగా ఉండే వారి నివాసం కూడా పనికి రాని ఆ నీళ్లు సరఫరా చేసే పెద్ద పైపులే. కోవిడ్ సమయంలో వారి వ్యధ ఈ కథ లో వివరించాడు వేణు. ఆ కథ చదివినప్పుడు ఈయన చాలా సున్నితమైన వ్యక్తి, సుకుమారమైన మనిషి, మానవ జీవితాన్ని చాలా ఆర్దంగా చూస్తున్నాడు అని అనిపించింది.
నవల గురించి చెప్పాలంటే కథా నాయకుడు ఒకతనున్నాడు. కథానాయిక ఒక అమ్మాయి ఉంది. విలన్ ఒకడున్నాడు. విలన్ రాయలసీమ వాడు. హీరో శ్రీకాంత్ తెలంగాణ పిల్లవాడు. హీరోయిన్ గీత రాయలసీమలో పుట్టి, తెలంగాణలో మెట్టి, అభివృద్ధి అయినటువంటి వనిత. శ్రీకాంత్ – గీత ల ప్రేమకథ శ్రీగీతం. ఇందులో ఒక ప్రేమ మాత్రమే ఉండదు, ఎన్నో జీవితాల కథలు మనకు కనిపిస్తాయి. కథ చదివితే అందరికీ ఆ అమ్మాయి మీద చాలా సానుభూతి కలుగుతుంది. కానీ ప్రేమగా చూడవలసిన వారిలో శ్రీకాంత్ కూడా వున్నాడు. వాడు ఎంతో నియమనిష్ఠలున్నవాడు. ఎంతో జాగ్రత్తగా జీవించాలనుకున్నాడు.
ఒక పక్క చదువుకుంటూనే, ఇంకో ప్రక్క కూలీ నాలీ చేసి తల్లి తండ్రులకు బరువుకాకుండా ఉన్నాడు. జాగ్రత్తగా ట్యూషన్లు చెప్పుకున్నాడు. చాలా మంచి ఆలోచనలు కలవాడు. ఎవరినీ ఇబ్బంది పెట్టడు. తాను ఇబ్బంది పడడు. చదువును సర్వజన విముక్తి కి ఉపయోగించడానికి ఇప్పుడున్న కంప్యూటర్ లు బాగా పని చేస్తాయని నమ్మినవాడు. ఒక నూతనమైనటువంటి యాప్ ని తయారు చేసి అందరికీ విద్య అనే సందర్భాన్ని చూపించాలనుకున్నాడు. రచయిత స్వతహాగా అమెరికాలో సాఫ్ట్వేర్ ఉద్యోగం కాబట్టి, తనకి తెలిసిన కంప్యూటర్ పరిజ్ఞానం మొత్తం అతనితో చెప్పించి కంప్యూటర్ ద్వారా ఎన్నో విషయాలు తెలుసుకోవచ్చని మన కనిపించేటటువంటి శ్రీకాంత్ పాత్ర ద్వారా చెప్పించాడు. ఆ గొప్ప పాత్ర శ్రీకాంత్, తన కున్న కష్టాల్ని దేన్నీ కూడా కష్టమనుకోలేదు. తనకున్న ఇబ్బందులేమీ ఇబ్బందులనుకోలేదు. తనమీద అకారణమైనటువంటి నిందతో హంతకుడనే పేరొస్తే ఏమీ పెద్దగా చలించిపోలేదు.
డబ్బులేనివాడు కావడం వల్ల న్యాయవాదిని కూడా పెట్టుకోలేదు. జైల్లో కూడా కంప్యూటర్ మీద పనిచేసే అవకాశం లభించింది, అది జైలు అధికారులకి అనుకూలమయ్యే పరిస్థితి అయ్యింది. ఇతని చిరకాల వాంఛ అయినా యాప్ చేయడానికి పనికివచ్చింది. ఒక ఖైదీ కి కంప్యూటర్ పని రావడం వెనుక కూడా చాలా బలమైన కారణం ఉంది, ఇది ఒక మంచి సప్సెన్స్ అంశం. ఇట్లా ఆ పాత్రలో యువకుడు, ఉత్తేజవంతుడు, చైతన్యశీలి, బాగా చదువుకునే వాడు, గొప్ప హీరో లక్షణాలు అన్నీ వున్నాయి. అన్నిటితో పాటు విశేషమైన మానవత్వం ఉన్నవాడు.
సాక్ష్యాలు చాలా బలంగా ఉండడం వల్ల గీత కూడా శ్రీకాంత్ ని హంతకుడు అని నమ్మింది. నువ్వింత హంతకుడు అనుకోలేదు, నీ చావు నీవు చావు! నీ బ్రతుకు నువ్వు బ్రతుకు! అని ఉత్తరం రాసి పెట్టిన ఆమె ఆ తర్వాత కొన్ని నిజాలు తెలిసి బాధ పడి శ్రీకాంత్ ని రక్షించడానికి చాలా పనులు చేస్తుంది కానీ అతనికి తెలియదు. ఆమె ఎక్కడుందో , ఏమైపోయిందో అని ఏమీ మాట్లాడడానికి లేకుండా ఉండి పోయిన వాడు శ్రీకాంత్. మీరు చదివితే గీత మీద చాలా ఇష్టం కలుగుతుంది, అలాగే శ్రీకాంత్ ను కూడా చాలా బాగా ప్రేమిస్తారు. నాకు వీరిద్దరి కంటే స్వప్న మీద చాలా ఇష్టముంది. స్వప్న అద్భుతమైనటు వంటి క్యారక్టర్. మంచీ లేదు – చెడూ లేదు, సహాయం చేయడం మాత్రమే చేతనైన మనిషి. గీత తండ్రి చాలా మంచి వాడు, గీత ఎంత మంచిదో అంతకన్నా మంచి వాడు. సమాజంలో అంత కార్కశ్యమేమీ లేదు అందరూ దుర్మార్గులే కాదు , మంచి వాళ్ళు కూడా ఉంటారు.
గీతను గురించి చెప్పేటప్పుడు రచయిత ఎంత ఆర్ద్ర మైన మాటలు చెప్పాడో చూస్తే… ఆ అమ్మాయికి ఇష్టం ఉంటుంది కానీ బయటకు చెప్పుకోలేదు, సాధారణమైన ఆడపిల్లల్లాగా. అందరూ మేకప్ ల పేరుతొ రకరకాల రంగులు పూసుకు తిరుగుతుంటే అవి పూసుకు తిరగడం ఇష్టంలేనటువంటి అమ్మాయి గీత. సహజంగా ఉండడానికే ఇష్టపడుతుంది గీత. ఎందుకు ఈ అలంకరణలు అనే వ్యక్తిత్వం చాలా గొప్ప నైనది. ఆమె ఎప్పుడు ఎక్కడ ఏం మాట్లాడినా చాలా సున్నితంగా , సుకుమారంగా ఉంటుంది. రిజిస్టర్ మ్యారేజీ చేసుకోవాలనుకున్న సందర్భంలో ఒకానొక నాటకీయ పరిస్థితిలో గీత గర్భం దాల్చుతుంది. హంతకుడైన శ్రీకాంత్ వల్ల గర్భం వచ్చిందనే విషయం దాచిపెట్టడం తప్ప వేరే మార్గం లేదు గీతకి. తల్లి తండ్రి ఇబ్బంది పెట్టినా కూడా అబార్షన్ కు ఒప్పుకోదు, గర్భం ఎవరి వల్ల వచ్చిందో చెప్పదు.
ఈ పరిణామం అద్భుతంగా చిత్రించాడు రచయిత. గర్భస్రావం చేసుకోవాలనుకుని డాక్టర్ దగ్గర అపాయింట్మెంట్ తీసుకుని రేపు వస్తానని చెప్పి వచ్చిన మనిషి, రాత్రి ఆలోచించే సమయంలో ఎంత అద్భుతమైన జీవన ప్రాంగణాలను దర్శించింది అంటే … అందరికీ కావాలంటే పిల్లలు కలుగుతారా? కలిగిన పిల్లల్ని పోగొట్టుకోవాలా? అయిష్టమయినదేదీ కాదుకదా ? కోరుకున్నదే కదా! అతడు దుర్మార్గుడు, హంతకుడు అయితే అవచ్చు , అయినా సరే ఈ బిడ్డ నా బిడ్డ , నేను పెంచుకుంటాను అని ధైర్యంగా చెపుతుంది. ఆ అమ్మాయికి ప్రసవం అవడం, హీరో జైలు నుండి విడుదల కావడం సినిమా ఫక్కిలో ఉంటుంది. శ్రీకాంత్ కి అమెరికా నుండి పిలుపు వస్తుంది. గీత తనను మరచిపోయింది అనుకుని అమెరికా పోవడానికి సిద్దమవుతాడు. గీత తన విడుదల కావడానికి ఎంతగా ప్రయత్నిచిందో తెలియదు. ఇక్కడ గీత వేదన, రాసేప్పుడు ఆర్ద్రమైన దృష్టి, శ్రీ కాంత్ మీద ఒక ప్రేమ ఉంది, మానవత్వం మీద ఒక నమ్మకం వుంది, శక్తి సామర్థ్యాల మీద ఒక విశ్వాసం ఉంది. ఒక మనిషి ఒక పని చేయగలుగుతాడు అనే నమ్మకం శ్రీకాంత్ పాత్ర లో ఉంటుంది. అనవసరంగా ఈయనను జైల్లో పెట్టామే అనే పోలీసు అధికారి ప్రయత్నం ఉంటుంది. జైల్లో కంప్యూటర్ పని చేస్తుంటే హర్షించే జైలర్ ని చూపుతాడు. ఎంత వికారమైన సమాజంలో కూడా విశేషమైన మానవత్వం ఉండే సందర్భాలు ఉంటాయి అని రచయిత చెప్పడానికి చేసిన ప్రయత్నం చాలా విశేషమైంది.
నాకు ఇది సినిమా కోసం రాసుకున్న కథ అని తెలియదు, కానీ చాలా ఉత్కంఠమైన సంఘటనలు చదువుతుంటే, ఒక సినిమా చూస్తున్న అనుభూతి కలుగుతుంది. అందుకే నేను ఇది ఒక సినిమాగా తీస్తే బాగుంటుంది అని చెపుదామనుకున్న, కానీ ఇది సినిమా కథే అని తర్వాత రచయిత ముందు మాట చదివితే తెలిసింది.
మనిషి(రచయిత)ని చూస్తే ఎంత సున్నితంగా ఉంటాడో మీరు అర్థం చేసుకుంటారు, అంత సున్నితంగా నవల కూడా ఉంటుంది. సున్నితంగా ఉంటూనే సమాజంలోని నిమ్నఉన్నతాలని చాలా సుకుమారంగా దర్శిస్తాడు. 105 చాప్టర్లు, ఒక్కో చాప్టర్ ఒకొక్క సినిమా సీను లా ఉంటుంది. సినిమాకు కావాల్సిన పద్దతిలో ఈ నవల మొత్తం రాయబడి ఉంది. ఒక్క సీను రెండు నిమిషాలు అనుకుంటే మొత్తం దాదాపు మూడు గంటల సినిమా అవుతుంది. ఇన్ని సీన్లు ఉన్నా నవలని చాలా వేగంగా పరుగెత్తించాడు రచయిత. వర్ణనలతో ఎలాంటి హింస పెట్టకుండా స్పష్టంగా విషయం విశదీకరిస్తూ ఇంకో విషయానికి పరుగెడుతోంది నవల. అనవసరమైన విషయాలు ఏమీలేకుండా కథ సాగుతుంది. రెండవది, అతని భాష చాలా మంచిది. చాలా చక్కగా రాసాడు. భాషా దోషాలు లేవు, సంభాషణ రాయడంలో రచయిత సర్వ శక్తులూ ఉన్నాయి. దీర్ఘ సంభాషణలు లేకుండా అవసరమైన వరకే చాలా అద్భుతంగా ఉంటాయి. సున్నితమైన స్త్రీ హృదయం అభివ్యక్తమయ్యేట్టుగా ఇద్దరు ఆడపిల్లలు మాట్లాడుకోవడం రాసినటువంటి రచయిత వేణు పూర్వ జన్మలో ఆడపిల్ల అయ్యుంటాడని నాకనుమానంగా ఉంది. చాలా అద్భుతమైన భావన వుంది. చాలా చక్కగా రాసాడు, అందువల్ల నేనాయనకు ఇది సినిమాగా తీస్తే బాగుంటుంది అని చెపితే సంతోషిస్తాడు అనుకున్న కానీ ఇది సినిమా ప్రీ ప్రొడక్షన్ అంతా చేసిన విషయం తెలిసి చాలా ఆశ్చర్యమయ్యింది.
వేణుకి సున్నితమైన హృదయం ఉంది. సుకుమారమైన భావాలున్నాయి. మానవత్వం పట్ల విశేషమైన ప్రేమ ఉంది. మనిషిని ప్రేమించడం ఉంది. మనిషిని ఒక మాత్ర శక్తిగా లోకానికి చూపిద్దామన్న ఆసక్తి ఉంది. ఆయన కథల్లోనూ నాకా ధోరణి కనిపించింది. ఈ నవల లోనూ నాకా స్థితి కనిపించింది. ఈ రెండు చోట్లా తాను నా కర్థమైంది సామాన్యుల పట్ల విశేషణమైన ఆదరణ ఉండే వ్యక్తిగా, సమాజం పట్ల తీరని భక్తి-మమకారం ఉన్న మనిషిగా, సమాజం ఇంతకంటే ఉన్నతంగా ఉండాలని ఆశించే ఒక ఆదర్శ ప్రేమికుడైన వ్యక్తిగా నాకనిపించింది.
ప్రతులకు :
అన్వీక్షికి పబ్లిషర్స్
ఫోన్ : +91 97059 72222
*
నా శ్రీగీతం నవల చదివి అద్భుతమైన సమీక్ష రాసి కవులను, రచయితలను ప్రోత్సహించడంలో ముందు వరుసలో ఉంటున్న సాహితీ శిఖరం ఇనాక్ గారికి ధన్యవాదాలు. సాహిత్యానికి సామాజిక బాధ్యతను జోడిస్తూ పాఠకులకు అద్భుతమైన సాహిత్యాన్ని అందిస్తున్న సారంగ పత్రిక యాజమాన్యానికి ధన్యవాదాలు .
శ్రీగీతం నవల చదువుతున్నంతసేపు ఆ పాత్రలు కళ్లముందే తిరుగుతున్నట్లు గా సహజత్వానికి దగ్గరుగా ఉన్నాయి..నిజమైన మహిళా సాధికరత అంటే ఎంతో ఈ నవల ద్వారా తెలిపిన వేణు గారికి అభినందనలు👌👏🎉🌺
శ్రీగీతం ఒక మంచి నవల.శ్రీకాంత్ పాత్రద్వారా యువకులు ఎలా ఉండాలో చెప్పి మోటివేషన్ చేసారు,కష్టకాలంలో గుండెనిబ్బరంతోవుండి ఏవిధంగా ముందుకెళ్ళాలో గీతపాత్రద్వారా తెలిపి అందరిలో ఆత్మస్థైర్యాన్ని నింపారు రచయిత వేణు నక్షత్రం గారు.
నవలలోని ఆత్మని తమ సమమీక్షలో అద్భుతంగా ఆవిష్కరించారు కొలకలూరి ఇనాక్ సర్ గారు. మీరు అందించిన సమీక్షే ఈ నవలకొక మంచి సర్టిఫికెట్.
మంచి నవలనందించినందుకు వేణు నక్షత్రం గారికి ధన్యవాదాలు.🙏
ప్రముఖ రచయిత, ఎన్నారై వేణు నక్షత్రం గారు రాసిన కథలన్నీ సూపర్ హిట్టు. ఇటీవల వచ్చిన శ్రీగీతం నవల కూడా ఎంతో ప్రజాధారణ పొందింది. ఆర్దంగా, హృదయానికి హత్తుకునే రీతిలో, సినిమా చూస్తున్నట్టే అనిపించడం వేణు గారి రచన శైలి. ఆయన రచనల్లో సినిమా కనిపిస్తుంది. నిజా జీవితం కదలాడుతుంది. మానవత్వాన్ని తట్టిలేపే రచనలతో సాహిత్య రాయబారిగా అందరి ప్రశంసలు అందుకుంటున్న వేణు గారికి శుభాకాంక్షలు.
– స్వామి ముద్దం
జర్నలిస్టు
శ్రీ గీతం నవల ద్వారా వేణు నక్షత్రం ఒక కొత్త ఒరవడిని ప్రారంభించాడు. స్త్రీ పురుష సంబంధాలను లక్ష్యంగా, స్త్రీ స్వేచ్ఛను కోరుకునే రచయితగా పడుకున్న తాపత్రయం అంతా నవల లో కనిపిస్తుంది. ఇవాళటి యువతకు ఒక మార్గ నిర్దేశం చేస్తున్నట్టు, ఆత్మవిశ్వాసాన్ని ఇస్తున్నట్టు నవల ఆ సాంతం ప్రోత్సాహభరితంగా ఉంటుంది.అంతేకాకుండా ఒక ఆశావా దృక్పధాన్ని ఈ సమాజానికి ఇస్తుంది.సమకాల పరిస్థితులు ఎన్ని ఎట్లా ఉన్నా ఏ విధంగా బయటపడాలో నవల బాధ్యత కలిగిన ప్రబోధాన్ని అందిస్తుంది.
వేణు నక్షత్రం గారు !
మానవత్వం – ఇంకా కథలో నూతనత్వమని
కొలకలూరి ఇనాక్ గారు మీ శ్రీగీతం నవలకు రాసిన సమీక్షలో
మీ హృదయంలాగే స్పందనలు స్పందనలు. ఇనాక్ గారి సమీక్షను సారంగ పత్రిక ప్రతి లిపిగా అభివర్ణించడం మరో మలుపు.
అభినందనలు
– కందాళై రాఘవాచార్య
చక్కని వ్యాసం. శ్రీగీతం నవల ఆత్మను ఆవిషక్తించారు ఆచార్య కొలకలూరి ఇనాక్ సార్. వేణన్నకు శుభాకాంక్షలు