ఫ్రాడ్ అంటే వొళ్ళు మంట మంటో కి!- మూడో భాగం

మంటో కి నిలకడ లేదు అన్న సత్యం అందరికీ తెల్సిందే.  ఏ మజిలీ పైనా ఆగడం అతనికి ఇష్టం లేదు.  ఏదో కారణం తో ఒక చోట నుంచి మరో చోటకి అసలా ప్రదేశం తో సంబంధం లేనట్లు పరుగులు పెట్టేవాడు.

మృత్సర్ లోని  ఎమ్. ఓ. హై స్కూల్ లో మంటో చదివాడు.  తన ప్రియ మిత్రుడు హసన్ అబ్బాస్ తో కల్సి తెగ అల్లరిచేసి, గొడవలు పడే వాడు.  దీనితో తండ్రి అతన్ని కోప్పడ్డంతో, తండ్రి మీద అస్సహ్యం యేర్పడింది.  స్వతంత్ర సంగ్రామం జరుగుతున్న కాలమది. భగత్ సింగ్ త్యాగం ఈ ఉద్యమానికి యింకా వేడి నిచ్చింది.  ‘ఇంక్విలాబ్ జిందాబాద్’ అన్న నినాదం నలువైపులా ప్రతిధ్వనిస్తూండేది.  తండ్రికి భయపడటం వల్ల ప్రత్యక్షం గా ఉద్యమం లో పాల్గొన లేకపోయినా మనస్సులో ఆ భావాలు, బుర్రలో ఆలోచనలు తీవ్రం కాసాగాయి.

మంటో కి సయ్యిద్ ఖురేషి, హసన్ అబ్బాస్ లాంటి స్నేహితులతో స్నేహం పెరిగింది.  మంటో కి చాట్ తినడంలో, సినిమాలు చూడడంలో ఎంతో ఇంట్రెస్ట్ ఉండేది.  ఆయనకి నచ్చిన సినిమాలని మూడు, నాలుగు సార్లు చూస్తూండేవాడు.   ముగ్గురు స్నేహితులూ కల్సి తిరిగేవారు.  సుఖదుఖాలని పంచుకునేవారు.  ప్రపంచంలోని అన్ని విషయాల మీదా చర్చలు జరుపుతూండేవారు.  జలియన్ వాలా బాగ్ సంఘటన మంటో యేడేళ్లు ఉన్నప్పుడు జరిగింది.  ఆ సంఘటన అతని మీద విపరీతమైన ప్రభావాన్ని చూపించింది.  ఇది ఆయన మొట్టమొదటి కథ ‘తమాషా’ లో వ్యక్తమైంది.

ఒకసారి పబ్లిక్ టెలిఫోన్ నుండి తను చేస్తున్న నెంబరు ఎంతకీ తగలక పోవడంతో కోపంతో ఫ్రాడ్ అంటూ రిసీవర్ని లాగేసి జేబులో వేసుకున్నాడు.  వ్యంగ్యంగానో, తీయగానో, అల్లరిగానో ఫ్రాడ్ అనే మాటని ఆయన జీవితాంతం ఉపయోగిస్తూనే ఉండేవాడు.  ఏది చెప్పదల్చుకున్నా నిర్మొహమాటంగా, దాపరికం లేకుండా చెప్పేవాడు.  మంటో ఎక్కువగా సాహిత్యానికి సంబంధించిన పుస్తకాలు, అపరాధ పరిశోధనకు సంబంధించిన పుస్తకాలూ చదువుతూ ఉండేవాడు.   ఆ తర్వాత చదవడం ఒక పిచ్చిగా మారి పోయింది. మంటో ఎఫ్.ఎ. రెండు సార్లు ఫెయిల్ అయ్యాడు.  అదే సమయం లో హరి సింగ్ అనే డబ్బున్న అరాచక వాదితో పరిచయమైంది.  అతని పరిచయంలో మంటో కి ఎంత చెడ్డ పేరు వచ్చినా,  జీవిత సత్యాలు, అనుభవ జ్ఞానం అక్కడే తెల్సుకోగలిగాడు.   పదహారు, పదిహేడు సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు అమృత్సర్ లో జరిగిన ఉద్యమాలు, సత్యాగ్రహాల ప్రభావం అతని మీద చాలా ఉండేది.  మంటో కి ఎంతో మంది కళాకారులు, పెయింటరులు పరిచయమయ్యారు.  వాళ్ళందరూ అతని కన్నా పెద్దవారే.  ‘జెంటిల్ మెన్ కా బ్రెష్’ కథ ద్వారా ఈ విషయాలన్నీ మనకు తెలుస్తాయి.  అదే సమయంలో అతను వ్రాయడం మొదలుపెట్టాడు.  కళల పట్ల ఆకర్షణ పెరిగింది.  ఇవన్నీ రాబోయే రోజుల్లో అతని రచనలకి భూమిక గా నిల్చాయి.

అమృత్సర్ లో మాస్కో

బాల్యం నుండి యవ్వనం దాకా మంటో జీవితం లో ఎన్నెన్నో ఎత్తుపల్లాలు .  ఎంతో సంఘర్షణ.  విరోధి భావాలు, ఆలోచనల గాలివానలో చిక్కుకున్న మంటో జీవితంలో కి బారీ ఆలీగ్ పరిచయం ఒక సమూహామైన మార్పును తీసుకొని వచ్చింది.  చరిత్ర, ఆర్ధిక శాస్త్రం లో నిష్ణాతుడైన అతని తో పరిచయం కలిగాక మంటో ఆలోచనా విధానం మారింది.  మానసిక పరివర్తన వచ్చింది.  బారీ సాహెబ్ మంటో భావాలను, ఆలోచనలను బాగా అర్ధం చేసుకున్నాడు.   పత్రికలవైపు అతని దృష్టి ని మళ్లించాడు.  గాజీ అబ్దుల్ రెహ్మాన్ సాహెబ్ అమృత్సర్ నుండి ‘మసావత్’ అనే దిన పత్రికను ప్రచురించేవాడు.  బారీ సాహెబ్ ప్రోత్సాహం తో మంటో అందులో పని చేయడం మొదలు పెట్టాడు.  ఇక్కడే అతనికి హాజీ లక లకే తో పరిచయమైంది.  సంపాదకీయం, ఆర్టికల్స్ రాయడం లో కొంత పట్టు సాధించాడు.  జర్నలిజం లో జ్ఞానం పెరిగింది.  జూదం ఆడే అలవాటు పోయింది.  పత్రికలో చలన చిత్రాల వార్తల కాలం చూసేవాడు.   ఇక్కడ నేర్చుకున్న సినిమా జ్ఞానం భవిష్యత్ లో అతని కెంతో ఉపయోగపడింది.  బారీ సాహెబ్ మంచి సాహిత్యాన్ని మంటో కి పరిచయం చేశాడు.  ఆస్కార్ వైల్డ్, విక్టర్ హ్యూగో, గోర్కీ, చెహోవ్, పుష్కిన్, గొగోల్, దాస్కో విస్కీ, బాల్ జాక్, ముపాసా వంటి వారి రచనలు చదవడం మొదలు పెట్టాడు.  వీటిని గురించి బారీ సాహెబ్ తో చర్చించేవాడు.  తర్క వితర్కాలు జరిగేవి.  బారీ సాహెబ్ విక్టర్ హ్యూగో రాసిన ‘లా మిసరబుల్స్’  అనువాదం చేయమన్నాడు.  కానీ, అది చాలా పెద్దది కావడం తో  దాని బదులు ‘లాస్ట్ డేస్ ఆఫ్ ఎ కండెమ్డ్ మాన్’ ని ‘సర్ గుజష్తా ఎ అసీర్’ పేరున పదిహేను రోజుల్లో అనువాదం చేశాడు. దాన్ని లక్నో లోని ఉర్దూ బుక్ స్టాల్ వాళ్ళు ప్రచురించారు.  ఇది మొదటి రచనే అయినా కొత్త ఆలోచనలకి నాంది పలికింది.  ఏదో చెప్పాలీ, రాయాలీ అన్న తపన పెరిగింది.  అనువాదం కథలు రాయడానికి ప్రేరణ యిచ్చింది. అతడి సాహిత్య కృషి ఇక్కడి నుంచే మొదలైందని చెప్పొచ్చు.

మంటో,  అబూ సయ్యిద్ ఖురేషీ, హసన్ అబ్బాస్ ముగ్గురికీ బారీ అలీగ్ తో స్నేహం వల్ల  వాళ్ళ జీవితాల్లో ఎంతో మార్పు వచ్చింది.  నెమ్మది నెమ్మదిగా మంటో దృష్టి సామ్యవాదం వైపు మళ్ళింది.  మంటో గది ‘దారూల్ అహమీర్’ లో  వేడివాడి చర్చలు జరిగేవి.  విప్లవాన్ని గురించి కలలు మొదలయ్యాయి.  కొత్త ప్రణాళికలు తయారయ్యాయి.  బారీ సాహెబ్ ఈ గ్రూప్ ని ‘ఫ్రీ తింకర్స్’ అని ‘మక్తబా-ఎ – ఫిక్ర్’ (స్కూల్ ఆఫ్ థాట్) అని పిల్చేవాడు. బారీ అలీగ్ తో చర్చిస్తున్నప్పుడు,ఆస్కార్ వైల్డ్ నాటకం ‘వీరా’ (అరాచక వాదులైన విప్లవకారుల కథ) ని అనువాదం చేయాలని నిర్ణయించారు. మంటో, హసన్ అబ్బాస్ తో కల్సి ఈ అనువాదం చేశాడు.  ఈ నాటకాన్ని మంటో అమృత్సర్ లో ప్రదర్శించాలనుకున్నాడు.  రాత్రిళ్ళు దీని పోస్టర్లని గోడలకు అతికించేవారు.  ఈ మొత్తం జ్ఞాపకాన్ని అబూ సయ్యిద్ ఖురేషీ యిలా గుర్తుచేసికొన్నాడు: ‘అడ్వర్టైస్మెంట్ పేపర్లు అతికించాకా నేను, అబ్బాస్ ఎక్కడ పోలీసులు  వచ్చి అరెస్ట్ చేస్తారా అని భయపడేవాళ్లం.  రాత్రంతా నిద్ర ఉండేది కాదు.  పోలీసులు ఈ పోస్టర్లని చూసాకా వాళ్ళని పట్టుకొన్నారు.  క్వాజా అబ్దుల్ హమీద్, రిటైర్డ్ డి.ఎస్.పి. మమ్మల్ని రక్షించాడు.  ఈ రోజుల్లోనే స్నేహితులతో కల్సి రష్యా వెళ్లాలని ప్లాన్ వేసుకుంటూ ఉండేవాడు. మేం అమృత్సర్ లోనే ఒక మాస్కో ని తయారుచేశాము.  అక్కడ వాడవాడలలోని అరాచక వాదులని మట్టు పెట్టాలని అనుకునే వాళ్ళం.  బారీ అలీగ్ పిరికివాడు కాకుండా ఉంటే మేం ఆ రోజుల్లోనే ఏదో నేరం చేసి పట్టుబడి ఉండేవాళ్లం.  ఉరి శిక్ష పడి ఉండేది. అమృత్సర్ లో జరిగిన రక్తపాతపు చిట్టాలో  అమరవీరుల పేర్లతో పాటూ మా పేర్లు కూడా ఎక్కుండేవి.  ఆ రోజుల్లో మా ఆవేశానికి  జ్ఞానం లేదు’.

మంటో కి నిలకడ లేదు అన్న సత్యం అందరికీ తెల్సిందే.  ఏ మజిలీ పైనా ఆగడం అతనికి ఇష్టం లేదు.  ఏదో కారణం తో ఒక చోట నుంచి మరో చోటకి అసలా ప్రదేశం తో సంబంధం లేనట్లు పరుగులు పెట్టేవాడు. ‘షగల్’, ‘వారా’, ‘నయా కామూక్’ కథలలో శోషణ కి, దోపిడీకి వ్యతిరేకంగా భావుకుడైన వ్యక్తి అంతరాత్మ ఎంత విలవిల లాడిపోతుందో వ్యక్తం చేశాడు.  ‘మసావత్’ పత్రిక బందైంది.  అందువలన బారీ సాహెబ్ వేరే పత్రికకి వెళ్ళి పోయాడు.  మంటో ఒంటరి వాడైపోయాడు.

ఈ రోజుల్లోనే విప్లవం, లెఫ్టిష్టులు, సమాజం మొదలైన వాటిని పరిశీలించడం జరిగింది.  వీటికాయన అక్షర రూపం యివ్వడానికి ప్రయత్నించాడు.   ‘ఖలక్’ పత్రిక మొదటి అంకం లో బారీ సాహెబ్ ఆర్టికల్ ‘హేగల్  సే కారల్ మార్క్స్ తక్’ ప్రచురితమైంది.  మంటో మొదటి కథ ‘తమాషా’ కూడా దీంట్లో నే ప్రచురితమైంది.  ఎవరైనా హేళన చేస్తారేమో అనే ఉద్దేశ్యం తో మంటో తన పేరును రాయలేదు.  ‘తమాషా’ కథలో బ్రిటిష్ వాళ్ళు చేసే అరాచకాలూ, అన్యాయాలూ, జలియన్ వాలా బాగ్ లో జరిగిన రక్తపాతం గురించి చేసిన చిత్రీకరణ అందరి హృదయాలనూ ద్రవింప చేసింది.  దీన్ని చూసిన పోలీసులు బారీ అలీగ్, మంటో లను వెతక సాగారు.  ఎలాగో అలాగా వాళ్ళు దాన్నుంచి బయట పడ్డారు.  ఈ రోజుల్లోనే రష్యా సాహిత్య ప్రత్యేక సంచిక ‘ఆలం గీర్’ ని మంటో శ్రద్ధగా చూడడం  మొదలు పెట్టాడు.  ‘రూసీ అఫ్సానే’ అన్న పేరుతో రష్యా కథల అనువాదాలని ప్రచురించాడు.  రూసీ సాహిత్యం మీద మంటో ఎన్నో ఆర్టికల్స్ రాశాడు.  వీటి వలన అందరూ మంటోని కామ్రేడ్, తింకర్ అని పిలవడం మొదలు పెట్టారు.  ‘ఆలం గీర్’ ప్రత్యేక సంచిక తర్వాత, ఫ్రెంచ్ సాహిత్య ప్రత్యేక సంచిక ‘హుమాయు’ ని కూడా ప్రచురించాడు. ఈ సంచికకి మంచి పేరు వచ్చింది.

రచయితల, తత్వవేత్తల ఆలోచనా ధోరణులు, సిద్ధాంతాలను అర్ధం చేసుకున్నాడు గానీ, ఆయన ఎప్పుడూ ఏ సిద్ధాంతాలకీ కట్టుబడి ఉండలేదు.  ఒక వేళ ఆయన కట్టుబడి ఉంటే, అదంతా అసహజం గా అనిపించేది.  ఆయన భారతీయ సమాజం లోని లొసుగులని, సంస్కృతిని అర్ధం చేసుకున్నాడు.  అందువలనే మానవీయ మనస్తత్వం అనే సాగరం లో పూర్తిగా మునిగి తన కథల కోసం మంచి ముత్యాలని యేరుకొని తెచ్చుకున్నాడు.

గడ్డు రోజులు

మంటో పంతొమ్మిది సంవత్సరాల వయస్సులో సాహిత్యం లో కొంత పేరు సంపాదించుకొన్నాడు.  ఆలోచనలలో, భావాలలో కొంత పరిణితి వచ్చింది.  ఇంతలో 1932 ఫిబ్రవరి 25 న మంటో తండ్రి చనిపోయాడు.  నిజానికి ఈ రోజులు అతని జీవితం లో చాలా గడ్డు రోజులు.  తండ్రి రిటైర్ అయ్యాక ఇల్లు గడవడం ఎంతో కష్టమయ్యింది.  ఇంతలో ఆయన మృత్యువు.  ఏం చేయాలో తోచని పరిస్థితి.  అసలు ఏం చేయాలో, తల్లికి ఏ విధంగా సాయపడాలో  తెలియలేదు.   పత్రికలలో రాయడం వల్ల కొంత పేరు వచ్చింది.  కానీ, దీని వల్ల సంపాదన ఏమీ లేదు.  ఆయన అన్నయ్య లిద్దరూ నెలకు నలభై రూపాయలు పంపించేవారు.  తల్లికి కుట్టు పని లో నైపుణ్యం ఉంది.  దాంతో ఆవిడ సంపాదన కూడా కొంత జమ అయ్యి, క్రమక్రమం గా ఆర్ధిక పరిస్థితులు కుదుట పడసాగినాయి.

తోటి స్నేహితులు హేళన చేయడం వల్ల మంటోలో చదువు కోవాలనే పట్టుదల పెరిగింది.  సోదరి సహాయం తో తల్లికి నచ్చ చెప్పి, ఆలీఘడ్ యూనివర్సిటీ లో బి.ఏ. లో చేరాడు.  ఇక్కడే సర్దార్ జాఫర్ హైతుల్లా అన్సారీ, అఖ్తర్ రాంపురీ, మజాద్, జాన్ నిసార్ అఖ్తర్ మొదలైన వారితో పరిచయమైంది.  డా.ఆషరఫ్, డా.అబ్దుల్ అతీమ్ మంటో కి ప్రొఫెసర్లు గా ఉండేవారు.  షాహిర్ లతీఫ్ (ఇస్మత్ చుగ్తాయి భర్త) గారితో పరిచయమైంది.  ఇక్కడ ఉంటూ మంటో రాజకీయాలలో సరాసరి పాల్గో పోయినా,  ఇక్కడి వాతావరణం ఆయన విప్లవాత్మకమైన ఆలోచనలకి, సాహిత్యం పట్ల ఉన్న అభిరుచికీ పదును పెట్టింది.  ఆలీఘడ్ లో తొమ్మిది నెలలున్నాడు. ఇక్కడే అతను మార్చ్, 1935 లో ‘ఇంక్విలాబ్’ అనే పేరుతో కథ రాశాడు.  అది ఆలీఘడ్ మాగజైన్ లో ప్రచురితమైంది.  ఇక్కడి సాహిత్యకారులతో స్నేహం పెరిగింది.

ఒకసారి అతనికి గుండెల్లో బాగా నొప్పి వచ్చి, ఆరోగ్యం క్రమక్రమం గా క్షీణించసాగింది.  క్షయ రోగమేమో నన్న అనుమానం తో యూనివర్సిటీ అధికారులు అతనిని యూనివర్సిటీకి రావద్దని చెప్పారు.  తర్వాతి రోజుల్లో అది క్షయ కాదని తెల్సినా మంటో భయంతో అమృత్సర్ వచ్చేశాడు.  అతడి అక్కయ్య వసీరా ఇక్బాల్ కి పెళ్లి అయ్యింది.  ఇప్పుడావిడ నివాసం బొంబాయి లో .  అమృత్సర్ వచ్చాక అతనిలో మనస్తాపం ఎక్కువైంది.  ఏం చేయాలో తెలియని పరిస్థితి.  ఎక్కాడికైనా పారిపోయి ఆత్మహత్య  చేసుకోవాలని అనుకొనేవాడు. ఉద్యోగం వేట లో అలసి పోయాడు.  ఏదో ఉద్యోగం దొరికేది.  కానీ, ఖచ్చితంగా ఇంత జీతం వస్తుందని నమ్మకం లేదు.  ఉద్యోగం వేటలో బారీ సాహెబ్ ఏమన్నా సాయం చేస్తాడేమో నన్న ఆశతో లాహోర్ వెళ్ళాడు.  కానీ, అప్పటికే ఆయన రంగూన్ వెళ్ళి పోయాడు.  ‘పారస్’ అనే పత్రికలో పని దొరికింది.  వజీర్ లూధియాన్వీ ‘ముసవ్విర్’ వారపత్రికకి సంపాదకుడు.  ఆయన మంటోని బొంబాయి రమ్మనమని పిలిచాడు.  మంటో బొంబాయి వెళ్ళి పోయాడు.

డాక్టర్ వసంత

1 comment

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • చాలా మంచి విషయాలను తెలియజేస్తున్నారు. Thank you

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు