ప్రేమకథలు – 3

తనకు ఏమీ కాని నేను తనతో సరిగ్గా మాట్లాడకపోతేనే ఆత్మహత్య చేసుకోడానికి తయారైపోయే అబ్బాయి నిజంగా నాకు తనమీద ప్రేమ ఉందని నమ్మితే, నాతో ఏ చిన్న గొడవ వచ్చినా ఎన్నిసార్లు నన్ను మానసికంగా హింస పెడతాడో ఊహించగలవా?

నిద్రపట్టడం లేదు. దిండుమీద తలపెట్టగానే పసిపిల్లలా నిద్రపోయే నాకు రెండు రోజుల్నించి నిద్ర కరువైంది. సౌమ్య తన మిత్రుడి ఆత్మహత్యా ప్రయత్నం గురించి చెప్పినప్పటినుంచీ మనసంతా కలతగా ఉంది. సుధీర్ కి చెప్పుకుందామంటే ఆఫీసు ప్రాజెక్ట్ పని మీద ఆరు నెలలకోసం అమెరికా వెళ్లాడు. ఎప్పుడుపడితే అప్పుడు మాట్లడ్డానికి కుదరడం లేదు.

“అమ్మా…. మనోజ్ నాకు మంచి ఫ్రెండే అనుకున్నాను. కానీ నన్ను ప్రేమిస్తున్నానని ఇటీవల మొదలుపెట్టాడు. నేను అప్పటికీ సీరియస్ గా తీసుకోలేదు. నిన్న ఏకంగా నిద్రమాత్రలు మింగేసాడు…’ సౌమ్య బాధపడుతున్నట్టు చెబుతున్నా ఆ గొంతులో కించిత్ ఉత్సాహం, గర్వం ధ్వనించాయి నాకు. తన కోసం, తన ప్రేమ కోసం ఒకబ్బాయి ఆత్మహత్యకు సిద్ధపడ్డాడంటే ఎంత గొప్ప! బహుశా ఆమె స్నేహితులందరూ ఈర్ష్యపడతారేమో కూడా. అజయ్ దేవగన్ లా ఉంటాడు మనోజ్ అని చెబుతూంటుంది. ఆఫీసులో అమ్మాయిలందరికీ అతనంటే కొంత వ్యామోహం ఉన్నట్టు కూడ అంటూంటుంది. అలాంటి వాడు తనని ప్రేమించడం, తన కోసం చావుకు సిద్ధపడడం… ఓహ్. గొప్ప థ్రిల్లింగ్ గా ఉంది సౌమ్యకు. నిన్నటి నుంచీ అదే కథ చెప్పిందే చెబుతోంది.

‘ఇంతకూ ఇప్పుడెలా ఉన్నాడు?’ అడిగాను.

“దివ్యంగా ఉన్నాడు. చచ్చేన్ని మాత్రలు మింగితేగా? నాకు తన ప్రేమ ఎంత గొప్పదో చెప్పడానికి చేసాడంతే..’ నవ్వుతూ అంది. నాకు తన నవ్వు అర్థం కాలేదు.

నిజంగా అంత గొప్పగా ఉంటుందా లేక ఉండాలా ఒకబ్బాయి మనకోసం చచ్చిపోతాడంటే?

“ఇంతకూ నువ్వు ఏమన్నావని అంత దూరం వెళ్లాడు?’

“మామూలుగా అందరం గుంపుగా పిక్నిక్ లకూ, హోటళ్లకూ వెళ్తాం కదా. ఈసారి తను, నేనూ ఇద్దరమే నాగార్జున సాగర్ వెళ్దామన్నాడు. ‘మీ అమ్మానాన్నలకు చెప్పొద్దులే.. ఎప్పటిలా అందరం కలిసివెళ్తున్నామనే చెప్పు’ అన్నాడు. నేనొప్పుకోలేదు.. మాటా, మాటా పెరిగింది. నాకు తన మీద ప్రేమ లేదన్నాడు. నేనింతవరకూ తనను ప్రేమిస్తున్నానని కూడ అనుకోలేదన్నాను. ఇక ఏడవడమొక్కటే తక్కువ. ‘ఇంత మంది అందమైన అమ్మాయిలున్నా నేను నిన్నెంత ప్రత్యేకంగా చూస్తానో ఇంకా అర్థం కాలేదా’ అంటూ నిష్టూరాలాడి,’ నీకు నా ప్రేమ మీద నమ్మకం కలిగిస్తా’నంటూ వెళ్లిపోయాడు. అదీ జరిగింది’ సౌమ్య చెబుతున్నంత సేపూ నాకు ఇదంతా నాకు తెలిసిందే అనిపిస్తోంది. దే జావూ……సౌమ్యతో చెబుతున్నానో, నాకు నేనే చెప్పుకుంటున్నానో…

__

నేను ఉస్మానియాలో ఎం.ఏ చదువుతున్నరోజులు. నాకు పుస్తకాల పిచ్చి కనక క్లాసులు లేకపోతే జనరల్ లైబ్రరీలో గంటలకొద్దీ కూర్చోవడం అలవాటు. అలా కూర్చున్నపుడల్లా రెండు టేబిళ్ల అవతల ఒక కళ్లజోడు కుర్రవాడు కనిపించేవాడు. అతను చదువుతున్నట్టు నటిస్తూ నన్నే చూస్తున్నాడని తెలుసుకోడానికి ఎక్కువ కాలం పట్టలేదు. చాలా చికాగ్గా ఉండేది. నా టేబిల్ మార్చాను. లాభం కనిపించలా. చివరకు నేను చదివేది ఎక్కువ తెలుగు పుస్తకాలే కనక అండర్ గ్రౌండ్ లో తెలుగు పుస్తకాల బీర్వాల దగ్గర ఉండే టేబిళ్ల దగ్గరే కూర్చోవడం మొదలుపెట్టాను. పైన వెలుతురు, నా సీటు నాకెంత ఇష్టం ఉన్నా, ఇతణ్ణి తప్పించుకోడానికి ఆ డంజన్ లో కూర్చోడానికి కూడా సిద్ధపడ్డాను. కానీ రెండు రోజులయ్యేసరికి, తన ఎకనమిక్స్ పుస్తకంతో సహా అక్కడ కూడ ప్రత్యక్షం.

అతను ఎకనమిక్స్ చదువుతున్నాడని తెలుసు పుస్తకాల వల్ల. కానీ ఎం.ఏ నా, రీసెర్చా? ఎవర్నడగాలి ఇతని గురించి? చివరికి ఎం.ఏ ఎకనమిక్స్ చదివే ఒకమ్మాయిని అడిగాను. అతన్ని ఆర్ట్స్ కాలేజీ మెట్ల మీద చూపించాను. ‘అతనా? రవీంద్ర. మా క్లాసు కాదు. పిహెచ్. డి స్కాలర్’ అంది. ఆ అమ్మాయి పక్కనే ఉన్న తన క్లాస్ మేట్ ఆనంద్ నాకేసి కుతూహలంగా చూసాడు.

‘ఎందుకండీ అతని గురించి అడుగుతున్నారు?’ అని. ‘ఏం లేదు.కొంచెం చికాకు కలిగిస్తున్నాడు లైబ్రరీలో. మీకు అతనితో పరిచయం ఉంటే చెప్తారా నాకు ఇబ్బందిగా ఉంటోందని”. ‘తప్పకుండా’ అన్నాడు ఆనంద్. తర్వాత ఆనంద్ కూ, నాకూ అతని గురించి చాలా సార్లు మాట్లాడుకునే అవసరం వచ్చింది. రవీంద్ర ప్రవర్తన మాత్రం మారలేదు. ఎంతమంది చుట్టూ ఉన్నా, నన్ను కన్నార్పకుండా చూస్తూ నించోవడం, అందరి దృష్టీ నామీదే ఉండడం, చాలా మంది నవ్వుకోవడం నాకు యూనిర్సిటీకి రావాలంటేనే చికాకనిపించేలా చేసాయి. చివరికి ఆనంద్

“వాడో పిచ్చివాడు. వదిలెయ్యండి. అసలు ఎవరూ అతన్ని సీరియస్ గా తీసుకోరు. మీరు పట్టించుకోకండి’ అన్నాడు. నేనెలాగూ అతన్ని పట్టించుకోదలుచుకోలేదు.

కొన్ని రోజుల తర్వాత ఆనంద్ వచ్చి

“సుజాతగారూ… వాడు నిజంగానే పిచ్చివాడైపోతున్నాడు మీ కోసం. హాస్టల్లో మరొక విషయం మాట్లాడడట. ఎంత అందమైంది కదూ ఆ అమ్మాయి. ఎంత చక్కగా నవ్వుతుందో.. ఎంత సీరియస్ స్టూడెంట్ తెలుసా? నేను ఎంత డిస్టర్బ్ చేద్దామని చూసినా, చదువుకుంటూ, రాసుకుంటూనే ఉంటుంది. ‘ తన్మయత్వమట నీ పేరు చెబితేనే..”

నాకేం తన్మయత్వం రాలేదు. చికాగు పెరుగుతోంది. ఈ రవీంద్ర గోల పుణ్యమాని ఆనంద్, నేనూ ఏకవచనంతో పిలుచుకునేంత మంచి స్నేహితులమైపోయాం.

“అయితే ఏంటంటావు?’

“ఏమో. ఆలోచించు పోనీ… మళ్లీ అంత ప్రేమించే మగవాడు దొరుకుతాడో లేడో’ సరదాగా అన్నాడో, నిజంగానే అన్నాడో తెలీదు కానీ నాకు ఒళ్లు మండి, నా చేతిలో ఉన్న పుస్తకం అతని మీదకు విసిరేసాను.

__

ఆ రోజు క్లాసులు లేవని యూనివర్సిటీ ఎగ్గొట్టి, అప్పుడే విడుదలైన ‘సత్తేపె సత్తా’ మార్నింగ్ షో కి వెళ్దామని ప్లాన్ చేసుకున్నాం నేనూ నా స్నేహితులూ.

అమ్మను టిఫిన్ పెట్టమని వేధిస్తూండగా, నాన్న కేకేసాడు.

‘సుజాతా…. ఆ మీడియం పేస్ బౌలర్ వచ్చాడు నీకోసం’. నాన్నకు నా స్నేహితులెవ్వరి పేర్లూ గుర్తుండవు. ఇంటికి వచ్చే ఒక్కొక్కరికీ ఒక్కొక్క పేరు పెట్టుకుంటారు. ఆనంద్ అపుడెపుడో తను ఫాస్ట్ బౌలర్ కావడానికి ప్రయత్నిస్తూ మీడియం పేస్ దగ్గర ఆగిపోయానని చెప్పాడు. నవ్వుకుంటూ బయటకు వచ్చాను. గ్రిల్ తలుపు తోసుకుని లోపలికి వస్తున్న ఆనంద్ ముఖం చూసి కంగారుపడ్డాను.

“ఏమైంది ఆనంద్?’

“రవీంద్ర’ అన్నాడు. అనేసి, నాన్న కేసి అర్ధవంతంగ చూసాడు. నిజానికి నాన్న మా ఇద్దరి మాటలూ విననేలేదు. ఆయన తల హిందూ పేపర్ లో కూరుకుపోయివుంది. బయటకు రమ్మని సైగ చేసాడు ఆనంద్. వచ్చాను. మెల్లిగా అన్నాడు

“రవీంద్ర నిన్న రాత్రి ఏదో మింగాడు. సీరియస్ గా ఉన్నాడు. రూమ్మేట్ వెంటనే ఆంధ్రమహిళాసభ హాస్పిటల్ కి తీసుకొచ్చాడట. కానీ పరిస్థితి బాగాలేదు’ నేను వింటున్నాను.

“నువ్వు హాస్పిటల్ కి రాగలవా?’ నసుగుతూ అడిగాడు.

“ఎందుకూ? ఇప్పుడు డాక్టర్లు రానివ్వరు కూడా కదా?’

‘అది కాదు. నీకెలా చెప్పాలో తెలీడం లేదు…సరే. చెప్పక తప్పదు… రవీంద్ర ఆక్సిజన్ పెట్టించుకోడానికీ, మందులు తీసుకోడానికీ, ఇంజక్షన్‌కీ కూడ ఒప్పుకోవడం లేదు. ట్యూబులు పీకేసుకుంటున్నాడు. డాక్టర్లు ఎందుకని అడిగితే, ‘సుజాతను రమ్మనండి. తను వస్తే నేను అన్నీ చేయించుకుంటా’నంటున్నాడు. పొద్దున్నే ఊరి నుంచి వాళ్లమ్మా, నాన్నా కూడ వచ్చారు. ‘ఎవరో సుజాతట నాయనా. ఆమెను పిలిపించండి బాబూ… నా కొడుకు నాకు దక్కుతాడు. ఆమె ఎవరైనా ఫర్వాలేదు..’ అని ఒకటే ఏడుపు వాళ్లమ్మ’. డాక్టర్లు కూడ ‘ఇదేదో మానసిక సమస్యలా ఉంది. ఆమె మీకు తెలిస్తే పిలిపించండి’ అంటున్నారు. మాకు నువ్వు తెలీదని ఎలా అంటాం? అందరూ కలిసి నన్ను పంపించారు నిన్ను తీసుకురమ్మని. స్టూడెంట్సే కాదు. మన లెక్చరర్లు కూడ ఉన్నారక్కడే. ”

నేను మౌనంగా ఉండిపోయాను. కాస్సేపయ్యాక అడిగాను

‘ఒక్క మాట చెప్పు ఆనంద్. నేను వస్తాననుకో.. అతను మందులు తీసుకుని కోలుకుంటాడు.’

“అని ఆశిస్తున్నాం అంతే. గ్యారంటీ లేదు’ అన్నాఢు ఆనంద్

“అదే ..అనుకో.. అంటున్నా. బాగైపోయాక ఏమనుకుంటాడు? ఏం చేస్తాడో ఊహించగలవా?’

ఆనంద్ నాకేసి ప్రశ్నార్థకంగా చూసాడు.

“నేను వచ్చి చూసినందువల్లే తను మందులు తీసుకున్నానని అందరికీ చెప్తాడు. అలా వచ్చానంటే నాకు తనమీద కొద్దో గొప్పో ప్రేమ ఉందని అంటాడు. లేకపోతే అంతమంది ఎదట, అందులోనూ వాళ్ల తల్లిదండ్రుల ఎదట నేను ఎందుకు వస్తానని అడుగుతాడు. వాటన్నిటికీ నేను ఏం సమాధానం చెప్పాలో ఆలోచించు. నాకు ఏ మాత్రం ఇష్టం కూడ లేని మనిషి రోజూ తనంటే నాకిష్టమనీ, మా ఇద్దరి మధ్యా సాన్నిహిత్యం ఉందనీ ప్రచారం చేసుకుంటాడు..’

“నువ్వు మరీ ఎక్కువ ఆలోచిస్తున్నావేమో… ఇప్పుడున్నది చావుబతుకుల సమస్య. కొంచెం మానవతతో ఆలోచించు…’ అన్నాడు ఆనంద్.

“నిజమే. మానవతతోనే ఆలోచించడానికి ప్రయత్నిస్తున్నాను. కానీ ఆ దృష్టితో మాత్రమే నేను వచ్చానని అతను నమ్ముతాడా? అతనిలాంటి మనస్తత్వం ఉన్న వ్యక్తి అంత లాజికల్ గా ఆలోచిస్తాడా? నన్ను ఇకపై ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చెయ్యడని నమ్మమంటావా? పైగా మొత్తం యూనివర్సిటీకి విషయమంతా తెలిసాక, అతనే కాదు. ఇంకా ఎంతమంది అతనిలానే అనుకుంటారో ఆలోచించావా?’

ఆనంద్ నాకేసి సాలోచనగా చూసాడు.

“ఇంతకూ వస్తావా? రావా?’ నెమ్మదిగ అడిగాడు.

ఆగాను. సౌమ్య నాకేసి ఊపిరి బిగపట్టి చూస్తోంది.

“వెళ్లావా?’ అంది.

“ఊహూ… వెళ్లలేదు” సౌమ్య గొంతుకు ఏదో అడ్డుపడ్డట్టు సరిచేసుకుని అడిగింది

“ఎలా ఉన్నాడు ఆ అబ్బాయి, రవీంద్ర?’

“చనిపోయాడు’ అన్నాను.

సౌమ్య నాకేసి చూసిన చూపు బహుశా ఏ కూతురూ తల్లి కేసి చూసివుండదు.

నేను మళ్లీ అన్నాను “ఆనంద్ నేను రానని చెప్పడానికి ఆస్పత్రికి వెళ్లేసరికే అతను చనిపోయాడు’

‘అది వేరే విషయం. నువ్వంత అమానుషంగా ఎలా ఉన్నావని?’ కోపంగా అంది సౌమ్య.

“నిజమే. అమానుషంగానే ఉన్నాను. అప్పుడు నా కళ్లెదుట ఉన్నదల్లా ఒకటే… తనకు ఏమీ కాని నేను తనతో సరిగ్గా మాట్లాడకపోతేనే ఆత్మహత్య చేసుకోడానికి తయారైపోయే అబ్బాయి నిజంగా నాకు తనమీద ప్రేమ ఉందని నమ్మితే, నాతో ఏ చిన్న గొడవ వచ్చినా ఎన్నిసార్లు నన్ను మానసికంగా హింస పెడతాడో ఊహించగలవా? ఆ ఒక్క పనీ నేను మానవతాదృష్టితో చేసివుంటే.. జీవితాంతం అతన్ని వదిలించుకోగలిగేదాన్నా?….

సౌమ్య ముఖంలో కోపం తగ్గింది. ఆలోచిస్తున్నట్టుగా చూసింది. టేబిల్ మీద ఉన్న తన సెల్ మోగింది. మనోజ్ పేరు ఫ్లాష్ అవుతోంది… నేను తన కేసి చూసాను. సౌమ్య కూడ ఫోన్ కేసి చూసింది. ఎత్తలేదు.

___

మృణాళిని

మృణాళిని

5 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • మృణాళినిగారు! చప్పట్లండి మీ కథలో సుజాతకి. ఇంత మంచి కథ రాసిన మీకు బోల్డన్ని చప్పట్లు!

  • మేడం .కథ చాలా బావుంది . నిజానికి వందకు కనీసం 70 ప్రేమలు ఇలాంటి బ్లాక్మయిలింగులు మానవతా దృక్పధాల తోనే మొదలు అవుతాయి . తరువాత ప్రేమించాల్సి వస్తుంది .దాన్ని ప్రేమ అని కూడా అనలేం . అదొక స్థితి అంతే . ఈ లోగా జీవితం నాశనం అవుతుంది . అద్భుతం మేడం

  • ““నిజమే. అమానుషంగానే ఉన్నాను. అప్పుడు నా కళ్లెదుట ఉన్నదల్లా ఒకటే… తనకు ఏమీ కాని నేను తనతో సరిగ్గా మాట్లాడకపోతేనే ఆత్మహత్య చేసుకోడానికి తయారైపోయే అబ్బాయి నిజంగా నాకు తనమీద ప్రేమ ఉందని నమ్మితే, నాతో ఏ చిన్న గొడవ వచ్చినా ఎన్నిసార్లు నన్ను మానసికంగా హింస పెడతాడో ఊహించగలవా? ఆ ఒక్క పనీ నేను మానవతాదృష్టితో చేసివుంటే.. జీవితాంతం అతన్ని వదిలించుకోగలిగేదాన్నా?….” బాగా చెప్పారు మృణాళిని గారూ

  • విలువైన మాటలు చెప్పారు. చాలా మటుకు ఇంతేగా ప్రేమ విషయాల్లో.

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు