ప్రేమకథలు – 2

రాజా మనసంతా పిచ్చిపిచ్చిగా ఉంది.  ఇన్నాళ్ల తర్వాత సంధ్య తన ఇంటికి వస్తోంది. తనంతట తనే వస్తానని చెప్పింది. ఎందుకు కాదనలేకపోతున్నాడు? హాయిగా సాగుతున్న తన సంసారంలో సంధ్యను తను ఎందుకు ఆహ్వానించినట్టు?  ఒకసారి మొబైల్ కేసి చూసాడు. పాస్ వర్డ్ తో తెరిచి సంధ్య నెంబర్ కేసి చూసాడు. నొక్కబోయి ఆగిపోయాడు. సంధ్యను చూసి ఎన్నేళ్లయింది?  ఒక్కసారిగా ఉస్మానియా యూనివర్సిటీ రోజులు గుర్తుకొచ్చాయి. సన్నగా, పొట్టి, పొడుగూ కాని ఎత్తుతో, పొడుగాటి జడతో, జూకాలు అందరికీ చూపించడం కోసం అవసరం లేకపోయినా తల వూపుతూ, గట్టిగా నవ్వుతూ,  ఆర్ట్స్ కాలేజీ వరండాలో పదిమంది అమ్మాయిల మధ్య నడుస్తూంటే, తనేమో యువరాణిలా, ఆ అమ్మాయిలందరూ చెలికత్తెల్లా ఉండే సంధ్య. ముందు రోజు సాయంత్రం సినిమా చూసిందంటే మరుసటి అందరినీ కూర్చోబెట్టి కథంతా, ప్రతి సన్నివేశమూ పూర్తి అభినయంతో చెప్పాల్సిందే. తను లా చదువుతున్నా, ఆ అమ్మాయిని చూడ్డంకోసం, తనతో మాట్లాడ్డం కోసం, తన ఎంబియే స్నేహితులని కలుసుకునే నెపంతో ఆర్ట్స్ కాలేజికి వచ్చేవాడు. వాళ్లతో బాటే ఆ అమ్మాయి బస్ ఎక్కేవరకూ బస్‌స్టాప్ లో నించునే వాడు, తనకు మోటార్ సైకిల్ ఉన్నా.  ‘తన స్నేహితులు నీ ప్రేమను ఎప్పుడు చెప్పుకుంటావురా అని ఏడిపిస్తున్నా, నోరు విప్పేవాడు కాదు. ఏదో సంకోచం; భయం. తను అసలు సంధ్యను ప్రేమిస్తున్నట్టు మొదటిసారి ఎప్పుడు చెప్పాడు? ఆమె పెళ్లై, కూతుర్ని కన్న తర్వాత కదూ..

రాజుకు నవ్వొచ్చింది ఆ రోజు గుర్తుకు వచ్చి. తను ఏదో కోర్టు పని మీద విశాఖపట్నం నుంచి హైదరాబాద్ వచ్చాడు. ఎప్పటిలా సంధ్యను చూడాలనిపించి వాళ్లింటికి వెళ్లాడు. ఆమె అత్తగారు, మామగారు సంతోషంగా ఆహ్వానించారు.

‘మీరు సంధ్య ఫ్రెండ్ కదూ. పెళ్లిలో చూసాం’ అంటూ. తను ఆస్పత్రిలో ఉంది రెండురోజుల కింద డెలివరీ అయిందని చెప్పారు. ఏ ఆస్పత్రో తెలుసుకుని వెళ్లాడు. సంధ్య తనని చూసి సంతోషంగా నవ్వింది. ‘పాపని చూడు’ అంది. ‘అచ్చం నీలాగే ఉంది. నువ్వయినా నన్ను ప్రేమిస్తావా పాపా’ అనేసాడు ఉయ్యాలలోకి తొంగి చూసి.

సంధ్య కళ్లెగరేసింది. ‘ఏమిటీ అంటున్నావు?’ అంది.

“ఏం లేదు. నువ్వు ఎలాగూ నన్ను ప్రేమించలేదు. తనైనా ప్రేమిస్తుందా అని అడిగానంతే”. సంధ్య ఫకాల్న నవ్వింది. తన మాటలు నమ్మిందో లేదో తెలీదు.

ఆ తర్వాత అపుడపుడూ ఫోన్ లో మాట్లాడుకుంటూనే ఉన్నారు. తన పెళ్ళి పత్రిక కావాలనే పెళ్లి అయిపోయాక అందేలా సంధ్యకు పంపాడు. ఫోన్ చేసి తిట్టింది. తెలిస్తే వచ్చేదాన్ని కదా అంది. రెండేళ్ల తర్వాత సంధ్య, భర్త ఆస్ట్రేలియాకు వలస వెళ్ళిపోయారు. కానీ తను నెలకోసారైనా సంధ్యకు ఫోన్ చేస్తూనే ఉన్నాడు. తనతో మాట్లాడిన రోజు ఒక్కసారిగా ఏదో శక్తి వచ్చినట్టనిపిస్తుంది. ఆ ఆనందం మరో నెలవరకూ తనను నడిపిస్తుంది. అది తరిగిపోతుందనుకుంటే వెంటనే తనకు ఫోన్ చేస్తాడు. ఎప్పుడు చేసినా, పావుగంటైనా కనీసం తనతో కబుర్లు చెబుతుంది. ‘పావుగంట ఆక్సిజన్’ అని తమ సంభాషణకు తను పేరుకూడా పెట్టాడు. హాయిగ నవ్వేసి ఫోన్ పెట్టేస్తుంది. ప్రతి ఫిబ్రవరి 14 న ఆమెకు ఫోన్ చెయ్యందే తను కాఫీ కూడ తాగడు. తను ఫోన్ చెయ్యగానే ‘గబగబా చెప్పెయ్. నాకవతల పని వుంది’ అంటుంది. తను ‘ఐ లవ్ యూ’ అనీ తను’థాంక్స్’ అనీ అన్నాకే ఇద్దరూ ఎవరి పనుల్లో వాళ్లు పడిపోవడం.  తనకు ఎపుడైనా మూడ్ వచ్చి రాసిన కవితలన్నీ ఈమెయిల్ చేస్తూంటాడు. ఓపిగ్గా చూసి ఏదో ఒక వ్యాఖ్యానం రాసి తిరిగి పంపిస్తుంది. కానీ తనని చూడ్డం మాత్రం కుదరడం లేదు.

దాదాపు 15 ఏళ్ళయిపోయింది తనని చూసి. ఈసారి నెలరోజుల కోసం ఇండియాకు వస్తున్నాననీ, తనని చూసే వెళ్తాననీ అంది. ఒక్కతే వచ్చిందట. అమ్మాయి, అబ్బాయి చదువుల్లో బిజీగా ఉన్నారంది. తన భర్త ఒక మరో వారం తర్వాత వస్తాడట. తను ముందుగా వచ్చి తన కుటుంబంతో, స్నేహితులతో జల్సా చెయ్యాలని నిర్ణయించుకున్నట్టు చెప్పింది.

“మీ ఇంట్లో రెండు రోజులు ఉండవచ్చా? నన్ను వైజాగ్ బీచికి తీసికెళ్తావా?’ అంది.

‘నువ్వెందుకూ వెళ్లడం? నువ్వు మనింట్లో ఉండు. బీచిని తెచ్చి నీ కాళ్ల దగ్గర ఉంచుతాను’ అన్నాడు తను. గలగలా నవ్వింది. తన నవ్వు వినడం కోసం ఇలాంటి పిచ్చి ప్రేలాపనలు ఎన్నయినా చెయ్యగలడు.

రేపే తను ఇక్కడికి రాబోయేది. ఈ రాత్రికి రాణికి చెప్పక తప్పదు. సాయంత్రం రాణిని వంట చెయ్యవద్దని అన్నాడు. కొడుకు, కూతురు ఎప్పటినుంచో అడుగుతున్న సినిమాకు తీసికెళ్లాడు. నలుగురూ తిరిగి వస్తూండగా, హోటల్లో భోజనం చేద్దామన్నాడు. ‘ఈ నాన్న ఇంత మంచి వాడు ఎప్పుడైపోయాడు’ అన్నట్టు చూసాడు కొడుకు. హోటల్లో ఆర్డరిచ్చాక అదీ ఇదీ మాట్లాడుతూ చెప్పాడు. పిల్లల నెపంతో చెప్పడం కొంచెం సుళువుగా అనిపించింది.

“జీతూ… రేపు ఒక ఆంటీ మనింటికి వస్తోందిరా… గెస్ట్ రూం నువ్వూ, అక్కా కలిసి రెడీ చెయ్యాలి’ అన్నాడు.

రాణి అడిగింది ‘ఎవరావిడ? సంధ్యనా?’

నిర్ఘాంతపోయాడు ‘ నీకెలా తెలుసు?’ అడిగాడు. రాణి వెక్కిరింతగా చూసింది

“మీరు ఇంత హడావిడి ఇంకే అమ్మాయి కోసం చెయ్యరని నాకు తెలుసు”

“ఆవిడ ఉండేది రెండు రోజులు. మంచి స్నేహితురాలు… చాలా కాలానికి వస్తోంది…’ సంజాయిషీ మొదలుపెట్టాడు.

‘అతిథుల్ని అవమానించేంత స్థాయి నాకు లేదులెండి. నేను మామూలు మనిషిని. ఆమెకేమీ లోటు రానివ్వను. సరేనా” అంది రాణి. పిల్లలిద్దరూ ముఖాలు చూసుకుని కనుబొమ్మలు ఎగరేసుకున్నారు.

‘థాంక్యూ’ అన్నాడు రాజు.

సంధ్య గలగలా ఆస్ట్రేలియా జీవితం గురించి చెబుతోంది. పిల్లలు చాలా ఆసక్తిగా వింటున్నారు. రాణి కూడ నవ్వుతూ వింటోంది. మొదటి రోజు చాలా హాయిగా గడిచిపోయింది.  సింహాద్రి అప్పన్న దర్శనం, నగరసంచారం, బీచి – అన్నిటికీ ముగ్గురూ కలిసి వెళ్లారు. రెండో రోజు మధ్యాహ్నం కూరలు తెచ్చుకోవాలని రాణి బయటకు వెళ్లింది. పిల్లలు ఇంకా స్కూలు నుంచి రాలేదు. టీవీ పెట్టుకుని ఏ మాత్రం ఆసక్తి లేని వార్తలు చూస్తోంది సంధ్య. రాజు వచ్చి కూర్చున్నాడు.

“ఒక మాట అడగనా?’ అన్నాడు. సంధ్య తలవూపింది.

“నేను నిన్ను దాదాపు 30 ఏళ్ల నుంచీ ప్రేమిస్తున్నానని నీకు తెలుసు కదా’ మళ్లీ అవునన్నట్టు తలవూపింది సంధ్య

‘నీకు విసుగనిపించలేదా’ నసుగుతూ అడిగాడు. ఊపిరి బిగబట్టి జవాబు కోసం చూస్తున్నట్టుగా ఆగాడు.

“లేదు’ అడ్డంగ తలవూపుతూ అంది సంధ్య.

“ఇన్నేళ్లుగా ఫోన్లు చేస్తున్నాను. అలవాటుగా ఫిబ్రవరి 14 న ఐ లవ్ యూ చెబ్తున్నాను. అయినా…?”

“అది నీ గొప్పతనం’ మధ్యలో అందుకుంది సంధ్య.

రాజు అయోమయంగా చూసాడు.

“అదేంటి? నీకు ఎప్పుడో విసుగొచ్చి నా ఫోన్ కట్ చేసేస్తావని ఎప్పటికప్పుడు అనుకుంటూ వుంటాను’

“ఎందుకు కట్ చెయ్యడం? ఒక్కమాట చెప్పు రాజూ. ఇన్నేళ్లుగా నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు. ఆ విషయం మనిద్దరికీ తెలుసు కూడా. నేను నిన్ను ప్రేమించలేదని కూడ నీకు తెలుసు. నా నుంచి నువ్వు ఏమైనా ఆశించావా? కనీసం ఒక్కసారి షేక్ హాండయినా ఇచ్చుకున్నామా మనిద్దరం ఇన్నేళ్లలో?’

“లేదు.. ..”

“పోనీ ఏ రోజైనా నా అంతట నేను నీకు ఫోన్ చేసానా? ఇదే మొదటి సారి వైజాగ్ వస్తున్నట్టు చెప్పాను. ఇన్నేళ్లలో నువ్వు ఫోన్ చేస్తే నేను మాట్లాడ్డమే తప్ప” అవునన్నట్టు తలవూపాడు రాజు.

“ఆడయినా, మగయినా, ఏమీ ఆశించకుండా ప్రేమించరు. మనం ప్రేమిస్తున్న మనిషి నుంచి కొంతయినా స్పందన ఆశించడం సహజం. నువ్వు నన్ను ఏమీ అడగలేదు. నేను ఫోన్ లో మాట్లాడితే చాలనుకున్నావు. ఎన్నోసార్లు నేను మధ్యలో కట్ చేసి పనుందని వెళ్లిపోతే, మళ్లీ నేనే చెయ్యాలి న్యాయంగా. కానీ ఏ రోజూ నేను చెయ్యలేదు. దానికి కూడా నువ్వు ఏమీ అనుకోవు. మళ్లీ నీకు మాట్లాడాలని అనిపించినపుడు నువ్వే చేస్తావు. నన్ను చూడాలని వుందని కూడ ఒక్కసారి కూడ అనలేదు నువ్వు. ఈసారి నేనే కావాలని వచ్చాను. నీ భార్యకు కూడ నా గురించి చెప్పినట్టే ఉన్నావు. కొంచెం టెన్షన్ కనిపించింది ఆ అమ్మాయిలో”

రాజు నవ్వాడు “నువ్వు ఒకప్పుడు నేను ప్రేమించిన అమ్మాయివని రాణికి తెలుసు. ఇంకా ప్రేమిస్తున్నానని ఆమెకు చెప్పి బాధపెట్టడం దేనికీ? నాకు తనంటే ఇష్టం. అది ఎప్పుడూ చూపించుకుంటూనే ఉంటాను…  పైగా నువ్వు నన్ను ప్రేమించలేదని కూడ తనకు తెలుసు. ఇన్నేళ్ల తర్వాత నిన్ను చూస్తే నేను ఎలా స్పందిస్తానో అని కొంచెం భయపడింది. కానీ మనిద్దరి ప్రవర్తన చూసి సర్దుకుందిలే..”

‘హమ్మయ్య. నేను వచ్చి ఆమెను బాధపెట్టానేమో అని భయపడ్డాను. కానీ వచ్చింది కూడ అందుకే. నా ప్రసక్తి వల్ల మీ ఇంట్లో ఘర్షణలేవైనా జరుగుతున్నాయేమోనని ఎందుకో అనుమానం. ఆమెకు అది పోగొట్టాలన్నదే నా అసలు ఉద్దేశం. అంతే కాదులే. ప్రేమించడమంటే ఏమిటో నువ్వు నాకు నేర్పావని నీకు చెప్దామని….’ నవ్వింది సంధ్య.

రాజు ఆశ్చర్యంగ చూసాడు. ‘అదేంటి? నేనేమంత గొప్ప ప్రేమికుణ్ని. నీకోసం నేను చేసింది ఏమీ లేదు?’

“ ప్రేమంటే ఏదో ఘనకార్యం చెయ్యడమా? త్యాగాలు చెయ్యడమా? ఏమీ కాదు. నీకు పెళ్లయింది. పిల్లలున్నారు. మంచి ఉద్యోగం, సంఘంలో పరపతి, మంచి మిత్రులు అంతా ఉంది. నిజానికి నేను నీకు గుర్తుకు రావలసిన అవసరమే లేదు…కానీ ఇంకా , నా నుంచి ఏమీ ఆశించకుండా, నన్ను ప్రేమిస్తూనే ఉన్నావు.. ప్రేమను నిరూపించుకోనక్కర్లేదు రాజూ…’ కొంతసేపు ఆగి ఆలోచిస్తున్నట్టుగా అంది, “ మా ఆయన నాకేదో చెయ్యలేదనీ, నా మాట పట్టించుకోవడం లేదనీ అనిపించినపుడల్లా నిన్ను తలుచుకుంటాను. నేనేం ఇచ్చానని నువ్వు ఇన్నేళ్లుగా నన్ను ప్రేమిస్తూనే ఉన్నావు? అని అనుకోగానే ఆ అసంతృప్తి పోతుంది…”

రాజు నిర్ఘాంతపోయి చూస్తున్నాడు సంధ్య కేసి

“ఆస్ట్రేలియా అంటే అమెరికా కాదమ్మాయ్. ఎక్కువ బరువులు తీసుకెళ్లడానికి లేదు. నాకు వైజాగ్ స్వీట్లు ఇన్ని ఇచ్చేస్తే ఎలా పట్టుకెళ్తాను?’ అంది సంధ్య, రాణి ఇచ్చిన పాకెట్లు చూస్తు.

“మీరింకా ఇప్పుడే వెళ్లరు కదా.. అయినా ఇవి హైదరాబాద్ లోనే అయిపోతాయి లెండి. మీ పిల్లలు ఇక్కడికి రారుగా. వాళ్లకు పెట్టండి”

అందరూ వీడ్కోలు చెప్పుకునె టైం అయింది. సంధ్యకు కాబ్ వచ్చింది. వెళ్లిపోతూ

“మళ్లీ ఎప్పుడో. మీరే ఆస్ట్రేలియా ప్లాన్ చెయ్యండి. చాలా చాలా అందమైన దేశం. మీకు అన్నీ చూపిస్తాను’ అంది.

“ఏమో. అది మీకు తెలుసు. మీ దోస్తుకు తెలుసు. అయినా ఆయన వాలంటీన్స్ డే రోజు తప్పక ఫోన్ చేస్తారుగా.. అప్పటికి ప్లాన్ వేస్తాం లెండి. తనే చెప్తాడు మీకు’ నవ్వుతూ అంది రాణి.

సంధ్య చేతిలోంచి సూట్ కేస్ జారి పడబోయింది. గట్టిగా పట్టుకుంది. రాజు మొహం కందిపోయింది.

 

–మృణాళిని

 

మృణాళిని

5 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • భలే రాసారు. తప్పకుండా ఉంటూనే ఉంటాయి ఇలాంటి ప్రేమలూ ఇలాంటి మనుషులూ కూడా

  • చాలా మంది జీవితాలలో జరిగే సంఘటనే ఇది. నిజానికి ఇప్పుడు ప్రేమిస్తున్నాడు అని అతను కానీ ఆమె కానీ అనుకోవడం అపరిపక్వము ఏ. ఆప్పట్లో ప్రేమించాను అనే ఆలోచన నే ఆటను ఎంజాయ్ చేస్తున్నాడు. అయితే ఇంకో సూటి ప్రశ్న ఏమిటంటే తన భార్య కి కూడా ఇలాంటి ప్రేమికుడు ఉండి ఇంటికి వస్తే రాణి ఆదరించినంత ఆదరించగలడా .

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు