ప్రశ్న కళ్ళల్లోనే ప్రశ్న True Detective

Satanic rituals కానీ, వాటి చుట్టూతా అల్లబడ్డ నమ్మకాలు కానీ ఒక ప్రత్యేకమైన imagery ని పుట్టిస్తాయి. క్రైస్తవ నమ్మకాల్లో సాతాను పరలోకం నుండి గెంటివేయబడ్డ ఒక మాజీ దేవదూత. ఐతే అతని దైవ మహిమ అంతా వెనక్కి తీసుకోబడినా, గెంటివేయబడ్డ తర్వాత కూడా అతను ఒక మానవాతీత శక్తే.

చాలా మంది చిత్రకారులు అతన్ని నల్లటి రెక్కలతో, నెత్తి మీద కొమ్ములతో, మేక తలతో వాళ్లకు సాధ్యమైనంత భయంకరంగా చిత్రీకరించారు. సాతాను పాతాళం లో ఉంటాడనీ, అదొక చీకటి ప్రదేశం అనీ అనేక బైబిల్ కధనాల సారం. అంటే మన కంటికి కనపడని ఒక చీకటి ప్రపంచం తన గర్భంలోంచి పెల్లుబికే మరణపు వాసనని మన పగటి ప్రపంచంపై కక్కుతుందని, నాగరికత కప్పుకోని భౌతిక, మానసిక అంచుల్లో దాని ఊడలు మన కోసం కాచుకున్నాయనీ, ఏకకాలంలో భయానకంగనూ, ఆసక్తికరంగానూ అనిపించే ఓ నేపధ్యం. ఇటువంటి నమ్మకాల నడుమ జరిగే హత్యలు ఉన్న కధలో ఈ dark and creepy imagery ని ఆసక్తికరంగా వాడుకునే అవకాశం బాగా ఉంటుంది.

కాలదోషం పట్టిన ఈ myths కి సంబంధించిన imagery ఇంకా మనల్ని అసౌకర్యానికీ భయానికీ గురి చేయగలగడానికి కారణం అవి మన subconscious లోని మరింత బలమైన భయాలకీ భావాలకీ ప్రాతినిద్యం వహించడమే కాబోలు. అర్ధరాహిత్యాన్ని నిలువెల్లా పులుముకున్న reality లో ఈ మెడీవల్ నమ్మకాల వెర్రితనం ఏమంత out of place అనిపించదు. పైగా ఆ abstract pointlessness కి ఒక ముఖాన్ని ఇచ్చి దాన్ని కధలో ప్రత్యర్దిగా నిలబెడుతుంది.

True Detective (Season 1) చాలా వరకూ Lousiana సరిహద్దుల్లోని dry landscapes లో చోటు చేసుకుంటుంది. ఊరి చివర పాడుబడ్డ, ఎవరూ పెద్దగా సంచరించని ప్రదేశాల్లో దొరికే శవాలు, జరిగే అకృత్యాలు, వాటిపై చిలువలు పలువలుగా అల్లబడ్డ స్థానిక కధనాలు, ఊహింపశక్యం కాని హింస అనంతరం నిర్జీవంగా పడి ఉన్న మృతదేహల ముఖంలో ఆ నొప్పి తాలూకు అవశేషాలు, వాటికి సమీపంగా పని చేసే ఈ ఇద్దరు డిటేక్టివ్ ల జీవితాల్లోకి నిశ్శబ్దంగా వ్యాపించిన చీకటి, దాని అప్రకటిత ఆజమాయిషీ, ఇవన్నీ దృశ్యంగా, కధగా satanic నమ్మకాల్లోని irrationality ని ఒడిసిపడతాయి.

మొదటి ఎపిసోడ్ లోనే ఓ యువతి నగ్న మృతదేహం పై జంతువు కొమ్ములు అతికించబడి ఉన్న దృశ్యం అమాంతం మనల్ని ఈ నరకకూపంలోకి లాక్కెళుతుంది. అక్కడినుండి ఇది కటిక చీకటిలోకి సాగే ఒక నిర్విరామ ప్రయాణం. ఐతే ఇది ఫాంటసీ కాదు. దేవుళ్ళు, దెయ్యాలు లేని ప్రపంచంలోనే కథ జరుగుతుంది. ఈ నమ్మకాల, నిజ జీవిత వాస్తవాల juxstaposition లో మానవ నైజంలోని irrationality నీ, hypocrisy నీ, మన శరీరాల్ని మనసుల్ని పూర్తిగా ఆకళింపు చేసుకోకుండానే వాటితో జీవించాల్సి వచ్చే మన paradoxical existence నీ చక్కగా ఎత్తి చూపుతుంది ఈ సిరీస్.

ఈ వరుస హత్యల్ని ఇన్వెస్టిగేట్ చేయడానికి వస్తారు Rust Cohle (Matthew McConnaughey), Martin Hart (Woody Harrelson). కథ, అది జరిగే ప్రదేశం మనకు Rust కళ్లలోంచే చూపిస్తాడు దర్శకుడు. Pessimism ని మనిషి రూపంలో పోత పోస్తే అదే Rust Cohle అనవచ్చు. కాలం గురించి తన అభిప్రాయాలు వెల్లడిస్తూ ఇలా అంటాడు Cohle.

“In eternity, where there is no time, nothing can grow. Nothing can become. Nothing changes. So death created time to grow the things that it would kill and you are reborn but into the same life that you’ve always born into. I mean, how many times have we had this conversation, detectives? Well, who knows?” నిశ్చలమైన నిమ్మళమైన non-existence ని భరించలేని విశ్వం తాను స్పృహ లోకి రావడానికి జీవాన్ని, స్పృహలో కొనసాగడానికి నిరంతర మరణాన్ని నిర్దేశించి మనల్ని పావులుగా వాడుకునే క్రమంలో, ఈ cosmic decision లో ఏ ప్రాతినిద్యం లేక, దాని పర్యావాసానాన్ని మాత్రమే భుజాలెకెత్తుకునే మన పరిస్థితిని ప్రస్తావిస్తాడు.

Schopenhauer అభిప్రాయపడ్డట్టు అసంతృప్తి తప్ప వేరే ఏదీ నిశ్చయం కాని ఈ జీవితం మనం పుట్టక ముందు మునిగి ఉన్న nothingness కి పట్టిన వ్యాధి అనుకుంటాడు Cohle. ఈ విపరీత నిరాశావాదం విని Martin కు ఒళ్ళు మండుతుంది. Martin సగటు అమెరికన్ మేల్ మాస్క్యూలినిటీ పరిధుల్లో, దాని నియంతృత్వంలోనే కాలం గడిపేస్తుంటాడు. చక్కటి కుటుంబం ఉన్నా వివాహేతర సంబంధాల్లో ఉండే adventure వెంట పడుతూ ఈ ప్రశ్నలకు ఖాళీ లేకుండా భౌతికమైన పనుల్లోనే కాలం వెళ్ళదీస్తుంటాడు. అతని carnal వైఖరికి Cohle తత్త్వం పిచ్చిలా అనిపిస్తుంది.

ఈ హత్యల వెనుక ఎవరున్నారన్న ప్రశ్న, దాని తాలూకు సస్పెన్స్, తీగ లాగితే కదిలే డొంకలు, ఆసక్తికరమైన మలుపులు కావాల్సినన్ని ఉంటాయి. కానీ అవే్మీ ఈ షో ప్రత్యేకతలు కావు. ఒక రకంగా ఈ షో రచయిత Nic Pizzolatto తన అభిప్రాయాల్ని వెల్లడించాడానికే Cohle పాత్రను సృష్టించినట్టు, ఆ సందర్భాల్ని పుట్టించడం కోసమే కథ అల్లినట్టు, ఈ pessimistic, anti-natalistic తత్త్వం షో లోకి ఇంకి, అది చూసే ప్రేక్షకుడికి అంటాలనే ఇటువంటి imagery ఉన్న డిటేక్టివ్ షో ని రాసుకున్నట్టు కూడా అనిపిస్తుంది. జీవించడం అనేది by default ఒక మంచి విషయం అన్నదాన్ని జీవులు axiomatic గా తీసుకోవడం డిజైన్ పరంగా సమంజసం అనిపించవచ్చు కానీ నిక్కచ్చి ప్రశ్నల వేడిలో అది కరిగి నీరైపోతుందా?

ఒక చోట Marty తో “I think human consciousness, is a tragic misstep in evolution. We became too self-aware, nature created an aspect of nature separate from itself, we are creatures that should not exist by natural law. We are things that labor under the illusion of having a self; an accretion of sensory, experience and feeling, programmed with total assurance that we are each somebody, when in fact everybody is nobody. Maybe the honorable thing for our species to do is deny our programming, stop reproducing, walk hand in hand into extinction, one last midnight, brothers and sisters opting out of a raw deal” అంటాడు Cohle. ఇటువంటి suicidal అభిప్రాయలు విపరీతాలుగా తోచడానికి కారణం మన మానసిక స్థిరత్వమా లేక ఎక్కువ సేపు ఈ దీర్ఘ తాత్విక ప్రశ్నల కళ్ళలో కళ్ళు పెట్టి చూడలేని మన పిరికితనమా అన్నది మనమే తేల్చుకోవాలి.

Cohle తో మనం ఒప్పుకున్నా ఒప్పుకోకున్నా అతను మన ఆసక్తిని రేపుతాడు. కష్ట సుఖాల చదరంగంలో ఓ మాదిరి జీవితాన్ని వెళ్ళదీస్తున్నప్పుడు ఇదంతా post modern వైరాగ్యం లా అనిపించవచ్చేమో. కానీ మన సౌకర్యంలో మనం ఉన్న అదే సమయంలో ప్రపంచంలో వేరే ఎన్నో చోట్ల జీవుల మీద కుమ్మరించబడుతున్న చిక్కటి వేదన ని అర్ధం చేసుకునే ప్రయత్నం చేస్తే “జీవితం అంటే కష్టాలు ఉంటాయి మరి” లాంటి సౌకర్యవంతమైన తేలిక అభిప్రాయాలు సరిపోవు. ఉండేకొద్దీ చిక్కబడే చీకటి నలుపుని “వెలుగు నీడల” ద్వయంలోకి తోసేసే వీలు ప్రతీ సారీ ఉండదు. చీకటంటే వెలుగు లేకపోవడమే అన్న లాజికల్ సమాధానలతో అల్లికలోకి రాని అనేక జీవితాలు ఉన్నాయి. అలాంటప్పుడే ఇలాంటి ఒక షో, ఒక పాత్ర మనకు కావాలి. “అవును గాడాంధకారంలో నిలుచున్నప్పుడు చీకటి పాములా మన చర్మం మీద పాకుతుంది, అప్పటి గుండెవేగాన్ని తగ్గించుకోడానికి ఎంత వెతికినా చిటికెడంత వెలుగు కూడా దొరకదు” అని మనతో పాటు మన పక్కనే కూర్చున్నట్టు అతను మాట్లాడాలి. జీవితం గురించిన అత్యంత నిరాశపూరీతమైన విషయాల్ని నిర్మొహమాటంగా తెర మీద ఒక పాత్రో కధో acknowledge చేయడం మనకు అవసరమవుతుంది.

Cohle గా Matthew McConnaughey నటన అతని కెరీర్ లోనే నిలిచిపోతుంది. Woody Harrelson కీ ఇతనికీ చక్కటి కెమిస్ట్రీ కుదిరింది. వారి మనస్తత్వాల వైరుధ్యం హాస్యాన్ని, డ్రామాని కూడా చక్కగా పండిస్తుంది. అమెరికన్ సబర్బ్ లో డిటెక్టివ్ కథ అనగానే మనం కోరుకునే గుబురు చెట్లు, మసక చీకటి సాయంత్రాలు, పొడి పొడి మాటలు, బార్ సీన్లు, షూట్ ఔట్ లు అన్నీ ఉంటాయి. వీటన్నిటికంటే కూడా Cohle నిమిషాలపాటు చెప్పే monologues ఈ సిరీస్ ని ప్రత్యేకంగా నిలబెడతాయి. నేను ఓ రెండేళ్ళాగి ఈ సిరీస్ రెండో సారి చూసేసరికి కథ మర్చిపోయాను. కానీ Marty తో ఆ కార్ లో వెళుతూ Cohle వెల్లడించే pessimistic అభిప్రాయాల్ని, satanism తో ముడిపడ్డ surreal ఇమేజెస్ నీ, Alexandra Daddario టాప్లెస్స్ సీన్ నీ, షో అయిపోయాక కౌచ్ మీద నుంచి కదల్లేని emptiness నీ మర్చిపోలేకపోయాను.
*

స్వరూప్ తోటాడ

3 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • Walking encyclopaedia of emotional intelligence @on screen . Big fan of your surrealism man. తెలుగు సాహిత్యాన్ని కొత్త పట్టాలు ఎక్కిస్తున్నారు . కుడోస్ డ్యూడ్.

  • ప్రశ్న కళ్ల లోనే ప్రశ్న..true detective s చూడాలి తప్ప కుండ అని అనిపించింది,, మీ విశ్లేషణ, బాగుంది 👍👌.

  • విశ్లేషణ చాలా నచ్చింది సర్…
    కొత్త విషయాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు