ప్రరవే నుంచి ఎంతో నేర్చుకున్నాం..

ప్రజాస్వామిక రచయిత్రుల వేదిక ఏర్పడి పదిహేనేళ్ళు. అంతకు ముందు ‘మనలోమనం’ ఏడాది ప్రయత్నంతో కలిపి పదహారేళ్లు.  2024 ఫిబ్రవరి 10&11 తేదీలలో ‘స్త్రీలపై ట్రోలింగ్’ అంశంగా ఖమ్మంలో ఏడవ మహాసభలు జరగనున్నాయి. ఈ సందర్భంగా సమాజ చలనంలో ప్రరవే నిర్వహించిన పాత్రని మదింపు వేసుకోవడానికి మిత్రుల నుంచి కొన్ని అభిప్రాయాలూ సూచనలు తీసుకున్నాము.

తిరునగరి దేవకీ దేవి 

ప్రజాస్వామిక రచయిత్రుల వేదిక

కార్య క్షేత్రాన్ని విస్తరించుకుంటూ

ప్రరవే తన పదిహేనేళ్ల ఉత్సవాన్ని జరుపుకుంటుంది. తెలుగునాట అటు సాహిత్యాన్ని, ఇటు స్త్రీవాద, అభ్యుదయ భావజాలానికి అనుకూలమైన మార్గంలోనడుస్తున్న సంస్థలు అరుదుగా కనబడతాయి. ప్రరవే ఆ కోవలోకి చెందిన సంస్థ. ఏ రెండు వాదాలు కలిసి పనిచేయలేవనే అపోహని ప్రరవే తప్పు అని నిరూపించింది. ఒక పక్క సాహిత్యాన్ని ఒక పాయగా తీసుకు వెళుతూనే, సమస్యాత్మకమైన ప్రాంతాల్లో పర్యటనలు చేసి అక్కడి స్త్రీల సమస్యలని సమాజం ముందు చర్చకి వచ్చేలా చేసింది ప్రరవే. ఇలాంటి పనులు చేయాలంటే కార్యదీక్ష అవసరం. ప్రరవే టీమ్ ఇలాంటి పనులన్ని చాలా ఓపిగ్గా చేసింది.  కార్యశాలలు పెట్టినా పుస్తక ప్రచురణ చేపట్టినా పోలవరం, అమరావతి, ఢిల్లీ రైతు ఉద్యమ ప్రాంతం, ముజఫర్ నగర్ మారణకాండ జరిగిన చోటు లాంటి సమస్యాత్మక ప్రాంతాల్లో పర్యటించి అక్కడి ప్రజల జీవన విధానాన్ని అధ్యయనం చేయడం వంటివి ప్రరవే ప్రత్యేకతల్లో కొన్ని. పిల్లల్లో సాహిత్యాభిలాషని పెంచే విధంగా వాళ్ళకి అవసరమైన సెమినార్లు, రచయితలతో ముఖాముఖి, బడిపిల్లలతో రచయితలు వంటి మంచి పనులు ప్రరవే చేసింది.

ప్రజాస్వామ్య రచయిత్రుల వేదిక ఈ పదిహేనేళ్ళలో ఎన్నో కార్యక్రమాలు చేసింది. కొన్ని ప్రాంతాలకే పరిమితం కాకుండా అన్ని ప్రాంతాలని పరిగణనలోకి తీసుకుని తన కార్యక్షేత్రాన్ని విస్తరించుకుంటూ పోతుంది. ఇప్పుడు ఖమ్మంలో జరిగే ఈ మహసభల్లో ప్రరవే మహిళల మీద జరిగే ట్రోలింగ్ ని ఒక చర్చగా తీసుకోవడం అభినందించాల్సిన విషయం. ప్రరవే ఇలాగే తన  మహాసభల పరంపరని  కొనసాగించాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను.

అనిల్ డ్యాని

కవి, రచయిత

తొలి ఆలోచనలకి కార్యరూపం  

పదిహేనేళ్ల క్రితం ఏ ఆలోచనలతో ఒక సంస్థగా మొదలయిoదో వాటికి కార్యరూపం ఇస్తూ తన కృషిని ప్రరవే కొనసాగిస్తున్నది. సభలు, సదస్సులు, పుస్తక ప్రచురణలు, చర్చా వేదికలు- ఇలా అనేక కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తున్నది. తమ అవగాహనను వర్తమాన సామాజిక పరిస్థితులకు అనుగుణంగా రూపొoదిచుకొనే ధోరణులు కూడా ప్రజాస్వామిక రచయిత్రుల వేదికలో కనపడుతున్నాయి. వర్తమాన సృజనాత్మక రచనల కంటే ఆ రచనల అధ్యయనమూ విశ్లేషణ కంటే సాహితీ విమర్శనా సిద్ధాంతాల గురించి, తాత్విక సిద్ధాంతాల గురించి అకాడమిక్ ధోరణిలో సదస్సులు జరగటం గమనించాను. రచయిత్రులకు ఈ విషయాలపై ఒక క్రమబద్దమైన పునాది  ఏర్పరచటానికి కృషి చేస్తున్నారు. అదే సమయంలో  వర్తమాన దేశ రాజకీయ, సాంఘిక  పరిస్థితుల పట్ల తమ తక్షణ స్పందనను తెలియజేస్తున్నారు. ఈ పదిహేనేళ్లలో నాలుగు సభలలో పాల్గొని, వారు ప్రచురించిన పుస్తకాలు చదివి, స్పందిస్తూ ఇచ్చే తీర్మానాలు, వివిధ  హింసాత్మక రాజకీయ, ఆర్థిక విషయాలు గురించి పరిశీలించి ఇచ్చిన స్టేట్మెంట్లను చూస్తూ వచ్చిన నాకు ప్రరవే గురించి  కలిగిన అవగాహన ఇది. ఇన్ని పనులు చేస్తున్న వేదిక నిర్వాహకులకు  తోడ్పడుతున్న  రచయిత్రులకు, రచయితలకు, సంస్థ మిత్రులకు అభినందనలు.

ఓల్గా

స్త్రీవాద రచయిత

 కలిసి కార్యాచరణకి పూనుకుందాం

భవిష్యత్తును గురించి మనకు ఎన్నో ఆశలుండేవి, కలలు కనేవాళ్ళం. అయితే ఇప్పుడు ఆ భవిషత్తును గురించే భయపడాల్సి వస్తోంది. అందుకు అనేక కారణాలు వున్నాయి. అందులో కొన్ని: సనాతన అధర్మవాదo వేయి పడగల పాము అయి బుసలు కొడుతోంది. మనువాదం ముంపు ముంచుకు వస్తోంది. వెర్రి వాదాలు తలెత్తుతున్నాయి. మత, కుల వ్యవస్థలు మరింతగా బలపడుతున్నాయి. సమాజం ముక్కలు చెక్కలుగా విడిపోతుంది. ఇది సంక్లిష్ట సన్నివేశం, సంక్సోభ సందర్భo. ఈ పరిస్థితులలో జరుగుతున్న ప్రరవే మహాసభలకు ఒక ప్రత్యేకత వుంది. మొత్తం మహిళా లోకాన్ని, శ్రామిక వర్గాన్ని నూన్యతకు గురిచేసే, బలహీన పరిచే పాలకవర్గ మతోన్మాద శక్తులకు వ్యతిరేకంగా చైతన్య పరచాల్సిన అవసరం వుంది. సమరశీల సాహిత్యాన్ని అందించాల్సిన అవసరం వుంది. ఇది మన అందరి సామాజిక బాధ్యత. అభ్యుదయ రచయితల సంఘం ప్రరవేకు ఎప్పుడూ సన్నిహితమే. అందరమూ కలిసి కార్యాచరణకు పూనుకుందాం. ప్రరవే మహాసభలు జయప్రదం కావాలి. శుభాకాంక్షలు.

పెనుగొండ లక్ష్మీనారాయణ

మహిళలకే పరిమితం కాదు!

ప్రజాస్వామిక రచయిత్రుల వేదిక, తెలుగు రాష్ట్రాల మహిళలతో ఏర్పడిన నాటినుండి ఎనలేని సాహిత్య కృషిచేస్తున్నది. తన పేరును సార్థకత చేసుకుంటున్నదనటంలో అతిశయోక్తి లేదు. ఈ సాహితీ సంస్థ మహిళల సమస్యల పట్లనే గాకుండా దేశంలో జరుగుతున్న అనేక అమానవీయ సమస్యలకు తక్షణమే స్పందించి ప్రజాస్వామికంగా ప్రత్యక్ష నిరసన పోరాటాలు చేస్తూనే పరోక్షంగా రకరకాల మహిళా సమస్యలపై తక్షణమే స్పందించి అనేక క్షేత్ర పర్యటనలు చేసి పుస్తకాలుగ ప్రచురించి రెండు తెలుగు రాష్టాల్లో  మహాసభలు, సదస్సులు నిర్వహించి చేస్తున్న ఇతోధిక సామాజిక సాహిత్య కృషికి జేజేలు. ఫిబ్రవరి 9, 10 తేదీల్లో  ఖమ్మం జిల్లా కేంద్రంలో పెద్ద ఎత్తున సభలు నిర్వహించ తలపెట్టిన మహిళా జాతీయ మహాసభలు తప్పకుండా విజయవంతం అవుతాయని వరంగల్ రచయితల సంఘం ఆకాంక్షిస్తున్నది.

నల్లెల్ల రాజయ్య

అధ్యక్షులు, వరంగల్ రచయితల సంఘం

తెలుగు సాహిత్యం స్పృశించని అంశం

ప్రారంభం నుండి అంటే మనలో మనం నాటి నుండి కూడా ప్రరవే తో నాకు అనుబంధం వుంది. విశాఖలో జరిగిన తొలిసభలో అనివార్య కారణాల వల్ల నేను లేక పోయినప్పటికీ బాధ్యత తీసుకుని రెండో సభని కడప యోగి వేమన విశ్వవద్యాలయoలో నిర్వహించడం నాకు కలిగిన మంచి అవకాశం, గొప్ప అనుభవం. సాహిత్యంలో నుండి సమాజం లోకి, సమాజo నుండి సాహిత్యం లోకి పరస్పరం ప్రయాణిస్తూ తొలి నుండీ ప్రరవే నిర్వహిస్తోన్న సామాజిక, తాత్విక కార్యక్రమాలు కొత్త రచయిత్రులకు మార్గ దర్శకం. ఆ క్రమంలో  పదిహేనేళ్ల ప్రరవే ఈసారి ఎoచుకున్న వినూత్నమైన అంశం ‘ట్రోల్’. బహుశా తెలుగు సాహిత్యంలోనే ఇంతవరకు ఎవరూ స్పృశించని అంశం. ఆ కథనాలతో పుస్తకం కూడా తీసుకు రావడం మరింత అభినందనీయం. భవిష్యత్తులో ప్రరవే మరిన్ని ఆలోచనాత్మకమైన, చైతన్యవంతమైన కార్యక్రమాలు నిర్వహించగలదని అభిలషిస్తూ, అభినందిస్తున్నాను.

వి. ప్రతిమ

స్త్రీవాద రచయిత

స్త్రీలు సంఘటితం కాగలరు

పదహారేళ్లుగా కొందరు రచయిత్రులు ఒక వేదిక మీదకి వచ్చి పనిచేయటం  నాకు చాలా నచ్చింది. కేవలం రచనలకే పరిమితం కాకుండా వాటితో పాటు రచయిత్రుల అవగాహనను పెంచటానికి సదస్సులను ఏర్పాటు చేసి సమాజాన్ని జాగృతం చేయడం మరింత సంతోషాన్నిస్తున్నది. స్త్రీలు సంఘటితంగా ఉండరు, ఉండలేరు  అనే అపప్రధను సవాల్ చేసి నిలబడింది ప్రజాస్వామిక రచయిత్రుల వేదిక. రెండేళ్ల  భౌతిక దూరాల కోవిడ్  నిశ్శబ్దంలో  కూడా జూమ్ మీటింగ్ ల ద్వారా స్త్రీవాద సాహిత్యంపై అనేక కోణాలలో చర్చలు నిర్వహించిన  వేదిక ఇది.  సీరియస్ అధ్యయనాల నిబద్ధతతో పాటు స్త్రీల మధ్య స్నేహ సంభాషణకు వాతావరణం  కల్పించటంలో వేదిక సఫలం అయింది. నాకేం జరిగినా ఎవరో ఒకరు ఉన్నారనే ధీమా ఇవ్వడంలో ఈ వేదిక సక్సెస్ అయింది. అన్ని తెలుగు ప్రాంతాల వ్యక్తులు ఇందులో ఉండడం మరొక విశేషం. ప్రపంచంలోని ఏ దేశ స్త్రీలైనా అంతర్జాల వేధింపులను తమకు తామే ఎదుర్కొంటున్నారనే విషయాన్ని గమనించి ట్రోలింగ్ విషయంలో ఒకరికి ఒకరు తోడుగా, ధైర్యంగా ఉండాలని ఆశిస్తూ,  రెండు రోజుల సదస్సును ఏర్పాటు చేయడం ఎంతో సంతృప్తినిచ్చింది. వేదిక పట్ల నాకున్న అపారమైన ప్రేమను మరింత ఎక్కువ చేసింది. ప్రరవే వేదిక కేవలం రచనలకే పరిమితం కాకుండా సభలను ఏర్పాటు చేస్తూ సమాజ చైతన్య దిశగా ముందుకు నడవడం వల్ల దానిపట్ల నాకున్న గౌరవాన్ని మరింత పెరుగుతున్నది. 16 ఏళ్ల అనుభవంలోకి అడుగు పెట్టిన ప్రరవే మరింత బలంగా ముందుకు పోవాలని ఆశిస్తున్నాను. ప్రరవేకు నా అభినందనలు.

శిలా లోలిత

కవి, విమర్శకురాలు

సాహిత్య సామాజిక సిద్ధాంతాల ప్రజాస్వామిక వేదిక

దాదాపుగా 35 వారాలపాటు ప్రతి ఆదివారం 11 గంటలకు సామాజిక సాహిత్యాభిమానులను అంతర్జాలం వైపు  ఆకర్షించిన ఆధునిక ప్రజ్ఞాన ప్రసంగాల విశ్వవేదిక ప్రజాస్వామిక రచయిత్రుల వేదిక. భారతీయ తత్వాన్ని విశ్వ మానవత్వానికి అనుసంధానిస్తూ చారిత్రక సామాజిక చలన సూత్రాల పరిణామ శీల ప్రభావ నేపథ్యాలలో ప్రపంచమంతటా వికసించిన స్త్రీవాద సిద్ధాంతాలపై విసుగు విరామానికి తావు లేకుండా చర్చోపచర్చలు సాగించటం, శ్రోతల వివేచనకు పదును పెట్టగలగటం ప్రరవే సాధించిన విజయం. విశ్వంలో బలమైనజాతి బలహీనులపై ఆధిపత్యం సాధించటం చరిత్ర. అయితే బలంతోనే గాక, వర్ణ (రంగు), వర్గ, కుల, లింగ ప్రాంతీయతత్వాల వివక్షలతో ఎక్కడికక్కడ అణచివేతకు గురికాబడిన విశ్వ మహిళ మౌళిక స్వరూపాన్ని అన్నికోణాల నుండి  ఆకళింపుకు తెచ్చి శ్రోతలలో విశ్వ మానవ చైతన్యాన్ని కలిగించిన వేదిక ప్రరవే.  వినటమేకాక మళ్ళీ మళ్ళీ చదివి తెలుసుకోవాలనే జిజ్ఞాసను రేకెత్తించిన వేదిక. ఆధునిక ప్రజాస్వామ్యానికి అవసరమైన వేదిక. సామాజిక సిద్ధాంతాలను తిరిగి సామాన్య ప్రజల అవగాహనకు వీలుగా చర్చలకు పెట్టి శ్రోతలను భాగస్వామ్యం చేయటం ప్రరవే సాధించిన ఆత్మీయత. బిల్కిస్ బాను  విషయంలో జరిగిన సామాజిక అరాచకం పట్ల, న్యాయసంబంధమైన అపచారం పట్ల ఆందోళన చెందుతూ ప్రజాభిప్రాయాన్ని కూడగట్టటానికి  నిర్వహించిన అంతర్జాల సమావేశం ప్రరవేకు గల ప్రజస్వామిక ఆచరణకు నిదర్శనం. సామాజిక పీడన కొత్తరూపాలలో పెరుగుతున్నప్పుడు ఎప్పటికప్పుడు స్పందించటం, ఆ కోణం నుండి సాహిత్య సమాలోచనకు పూనుకొనటం ప్రరవే ముందున్న  నిరంతర కార్యాచరణ. 16 ఏళ్ళ నిర్వహణ అనుభవంలోకి లోని పరిపక్వత సమగ్రతని సంతరించుకునే జనసత్వాలను అందుకోగలదని ఆశిస్తున్నాను. శుభాకాంక్షలు తెలుపుతున్నాను.

జె.కనకదుర్గ, గుంటూరు.

రిటైర్డ్ ప్రిన్సిపాల్ , సాహిత్య విమర్శకురాలు 

సమాలోచనకి తోడ్పాటు

‘మనలో మనం’ పేరుతో అభ్యుదయ మహిళల సమూహంగా ఏర్పడి, ప్రజాస్వామిక రచయిత్రుల వేదికగా రూపుదిద్దుకొని, భిన్న అస్తిత్వాల స్త్రీవాద రచయిత్రుల సమూహంగా ఎదిగి, విభిన్న సామాజిక, సాంస్కృతిక, సాహిత్య రాజకీయ అంశాలలో, ప్రాంతీయ, జాతీయ అంతర్జాతీయ స్త్రీవాదం తీరు తెన్నులపై నిరంతరం అధ్యయనం చేస్తూ, అనేక సదస్సులు సమావేశాలు చర్చలు, వెబినార్లు నిర్వహిస్తూ అనేక పుస్తకాలు వెలువరిస్తూ ఆధునిక స్త్రీ సమాజంలో ప్రపంచ స్త్రీవాద స్థితిగతులపై అవగాహన ఏర్పరచుకోవడానికి ఒక సమాలోచన చెయ్యడానికి తోడ్పడుతున్న ప్రరవేకి అభినందనలు. గౌరీ లంకేశ్ దారుణ హత్యానంతరం నిరసన ప్రకటించడంలో భాగంగా కేంద్ర సాహిత్య అకాడెమి అవార్డును వాపస్ ఇచ్చిన నిబద్ధత కలిగిన సాహితీవేత్తలు ప్రరవేలో ఉన్నారు. ఇలాంటి నిస్వార్ధ స్త్రీవాద సాహితీవేత్తలు అనేకులు ప్రరవేలో ఉన్నారు. అందరు నాకు ప్రియమైన రచయిత్రులు. వీరు కొత్తతరం సాహిత్యకారులను  ప్రోత్సహించే పటిష్టమైన వంతెనగా మారారు. రేపు జరగబోయే మహాసభలలో ట్రోలింగ్ అంశం మీద పుస్తకం వెలువడుతుంది అని తెలుసుకొని సంతోషించాను. ప్రశ్నించే మహిళల మీద జరుగుతున్న ట్రోలింగ్ అరికట్టాలి అని ఆశిస్తూ ప్రరవేకి అభినందనలు తెలుపుతున్నాను.

డి. సంధ్య విప్లవ్

కవి, కథా రచయిత

ఎన్నో అనుభవాల రాపిడిలోంచి…

దాదాపు రెండువేల సంవత్సరాల అగ్రకుల భూస్వామ్యం, ఆ తరువాత వలస, అర్ధ వలస, సమాజం పితృస్వామ్య వ్యవస్థగా మహిళల శ్రమశక్తిని కొల్లగొట్టి మహిళలను సమాజంలో అట్టడుగులోకి నెట్టి వేయడం మీకందరకూ తెలిసిందే. ఇలాంటి అభివృద్ధి నిరోధకమైన, అమానుషమైన దోపిడి, పీడనకు  వ్యతిరేకంగా మహిళలు పోరాడుతూనే ఉన్నారు. మహిళల గురించిన చరిత్ర వక్రీకరించడమో పూర్తిగా విస్మరించడమో జరిగింది. పురుషులతో సరిసమానంగా మహిళల నూతన ప్రజాస్వామిక విప్లవ పోరాటాల నేపథ్యంలో చైతన్యంతో  మహిళల తాత్విక, రాజకీయార్ధిక,  వర్గపోరాట చరిత్రను నిర్మిస్తున్న  ప్రజాస్వామిక రచయిత్రుల వేదికకు, సభ్యులకు, నాయకత్వానికి అభినందనలు.

గత పదిహేను సంవత్సరాల తెలుగు నేల మీద  జరుగుతున్న  విప్లవోద్యమ  పోరాట నేపథ్యంలో  వర్గ, కుల, లింగ, మత, ప్రాంతీయ వైరుధ్య పోరాటాల మధ్య ఘర్షణ  ఐక్యతతో  పురోగమనంలో  మీరెన్నో అనుభవాలు గడించారు అలాంటి అనుభవాలన్నింటినీ  విమర్శ, ఆత్మ విమర్శ ద్వారా  సమీక్షించుకుంటూ  ఎప్పటికప్పుడు సాహిత్యంగా ప్రచురిస్తున్నారు. కుటుంబం, వ్యక్తిగత జీవితంలో ఆస్తిహక్కు దక్కని వెట్టిచాకిరీ లాంటి శ్రమలో సుదీర్ఘ కాలం  మగ్గిపోతున్న మహిళలకు స్వతసిద్ధంగా వివేచనాత్మక, శాస్త్రీయ సామాజిక చైతన్యం ముఖ్యంగా గతి తార్కిక చైతన్యం ఉండదు. బయటి సామాజిక కార్మికవర్గ పోరాటం నుండి అందవల్సిందే.

రకరకాల  ఉద్విగ్న భావోద్వేగాల మధ్య  పాత సమాజం  కూలుతూ కొత్త సమాజం  రూపొందుతూ పురిటినొప్పులు పడుతున్న సందర్భంలో  మన కాలంలో మన స్థలంలో  మహిళల చైతన్య స్థాయిని పంచి నిర్మాణం కావాల్సిన ఆవశ్యకతను  ప్రరవే ముందుకు తెచ్చింది.  మాలాంటి వాళ్ళం ఎంతో నేర్చుకున్నాం. భారతదేశంలో సుదీర్ఘ కాలపు అగ్రకుల బ్రాహ్మణీయ భూస్వామ్య వాదం, భావవాదం అర్ధవలస అర్ధ భూస్వామిక విధ్వంసకర ఉత్పత్తి విధానంలో కకావికలైన రైతాంగం,  అభివృద్ధి చెందని  కార్మిక వర్గం  ఈ నేపథ్యంలో సామ్రాజ్యవాద సరకుల సర్వీసు రంగం నుండి ఎదిగిన పెటీ భూర్జువా వర్గం మొత్తంగా ధీర్ఘకాలిక  ఉత్పత్తి విధాన సంక్షోభం ఉత్పత్తి శక్తుల ఉత్పత్తి  సంబందాల వైరుధ్యం  కలిపి ఫాసిజంగా మారింది. అన్ని నిర్మాణాలతో పాటు మహిళాసంఘ నిర్మాణాన్ని విచ్ఛిన్నం చేస్తున్న ఈ తరుణంలో మీ వంతు కృషికి  అభినందనలు.

అల్లం రాజయ్య

కథ, నవలా రచయిత

*

ఎడిటర్

2 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • సారంగకి రచయిత మిత్రులకి కృతజ్ఞతలు, అభినందనలు. ఖమ్మంలో కలుద్దాం.

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు