ప్రపంచం కోసం రాసే ఆమె!

డీచేని కొత్తగా అలంకరించిన బిరుదునామం “ఓడేలువ్వా” (Odeluwa) అంటే “ప్రపంచం కోసం రాసేది” అన్న అర్థమట. అమెరికానా ఓ రకంగా నైజీరియా మూలాలు వున్నా దేశ సరిహద్దుల్ని దాటిన తన మొదటి నవల. ఆధునికకాలంలో అన్ని సంస్కృతుల్ని తనలో కలుపుకున్న ఈనాటి సలాడ్ బౌల్ అమెరికాలో నైజీరియన్ల, ఇతర ఆఫ్రికా దేశాల నుంచి వలసవచ్చిన నల్లజాతి ప్రవాసుల, నల్ల జాతి అమెరికన్ల కథ స్థూలంగా ఈ పుస్తకం. చిత్రంగా ఆ దేశంలోనే కాదు ఇతర చోట్ల కూడా వీరంతా వేరువేరనీ, వారి పుట్టుపూర్వోత్తరాలూ, పెరిగిన పరిస్థితులూ, చదువుసంధ్యలూ, ఆలోచనలూ అన్నీ వేరుగా వుండొచ్చనీ అనుకోరు. ఈ సహానుభూతిలేమిని చక్కగా చిత్రించే ప్రయత్నం చేసింది అడీచే అమెరికానా సాక్షిగా. తన రచనలనీ, ప్రస్థానాన్ని దగ్గరగా చూసేవాళ్ళకి మొదటి పుస్తకం పర్పుల్ హైబిస్కస్ కు గానూ కామన్ వెల్త్ పురస్కారం లభించినప్పుడు చేసిన ప్రసంగం గుర్తుండే వుంటుంది. ఆ ప్రసంగంలో తను కలోనియల్ పాస్ట్ గురించి చెబుతున్నప్పుడు తెల్ల రచయితలు ప్రదర్శించే వైట్ సుప్రిమసీని విమర్శించడానికి గానీ, ఆ రాతల్లో ఆఫ్రికన్ల లాస్ అఫ్ డిగ్నిటీ గురించి మాట్లాడానికిగానీ ఏమాత్రం వెరవదు. ఆ ఖచ్చితత్వం ఇంకాస్త పదునుతేరి కనిపిస్తుంది ఈ రచనలో. తన రాతల  సహజాతమైన సూటిదనం, సున్నితమైన వ్యంగ్యం కొంత ఎక్కువగా కూడా కనపడే నవల ఇది.

పుస్తకం మొదలయ్యేది ఒక హెయిర్ డ్రెస్సింగ్ సెలూన్లో. తన జడలుగా అల్లబడ్డ జుట్టునుంచి రిలాక్సర్లతో సాదాజుట్టుగా అమెరికన్లు అంగీకరించే జుట్టుకు మారి, అందులోని సమస్యలన్నీ ఎదుర్కొని, మళ్ళీ జడలకు వెనక్కు వెళ్లడం కథ ఫ్రంట్ ఎండ్. దీనికి సమాంతరంగా నేపథ్యంలో చెప్పే తన జీవితం అసలైన కథ. ఈ కథ ఇఫెమేలు అన్న నైజీరియన్ అమ్మాయి టీనేజర్ర్గా నైజీరియాలో ఉన్నప్పటినుంచీ, యువతిగా అమెరికాలో చదువుల కోసం అడుగుపెట్టి, రకరకాల సమస్యలని అధిగమించి జీవితంలో విజయం అని అందరూ పరిగణించే స్థాయికి చేరి ఆ దేశంలో స్థిరపడగల అవకాశాన్ని కూడా తెచ్చుకుని, దాన్నివదులుకుని మళ్ళీ నైజీరియన్ జనజీవనంలో కలిసిపోవడంతో ముగుస్తుంది. ఆ జనజీవనంలో కలిసిపోయే తరుణంలో అమెరికాకు, నైజీరియాకు ఉన్న తేడాలను పోల్చుకుంటూ చికాకుపడుతూ; పనినాణ్యత, ప్రొఫెషనలిజం లేమి పట్ల అసహనాన్ని ప్రదర్శిస్తూ; రవంతనో, గుప్పెడంతనో ఆక్సిన్ట్ను గుమ్మరిస్తూ వుండే అమెరికన్ రిటర్న్డ్ నైజీరియన్లని సాటి నైజీరియన్లు ముద్దుగా పిలిచే పేరు అమెరికానా, అదే ఈ పుస్తకం శీర్షిక. నిజానికి ఈ అమెరికా కల ఇఫెమేలుది కాదు, ఓబిన్జేది. వీరిద్దరూ లాగోస్ లో టీనేజర్లుగా కలిసి చదువుకుంటున్నప్పుడు ప్రేమికులు అవుతారు. ఓబెన్జే తల్లి అదే యూనివర్సిటీ లో ప్రొఫెసర్. ఆవిడ కల్పించే చక్కని వాతావరణం, ప్రోత్సాహంతో ఇద్దరూ బాగా చదువుకుంటారు, మేలైన ఆలోచనా దృక్పథం అలవరుచుకుంటారు. కాలం సాగేకొద్దీ వారిమధ్య ప్రేమ కూడా బలపడుతుంది, ఆకర్షణ స్థాయి దాటి.

ఇఫెమేలు పెద్ద లక్ష్యాలు ఉన్న మనిషి కాదు, చదువుకునే వయసు కాబట్టి చదువుతుంది, అంతకుమించి ఆశలు లేవు. అమెరికా వెళ్లడం, అక్కడ స్థిరపడగలగడం ఓబిన్జే చిన్ననాటినుంచీ కంటూ  ఆనాటికానాడు పెరుగుతున్న కల. అమెరికన్ జీవనవిధానం తెలుసుకోవడం  దానికోసం అమెరికన్ రచయితల్ని ఔపోసన పట్టడం, అక్కడి దినవారీ వ్యవహారాల్ని కూడా నిశితంగా పరిశీలించడం  ఓబిన్జే నిత్యకృత్యం. అట్లాంటి ఓబిన్జే సహవాసంతో తను కూడా పై చదువులకి అమెరికా వెళ్లాలని ప్రయత్నం చేస్తుంది, సఫలీకృతమవుతుంది. నిరాశ అల్లా అంతగా ‘అమెరికాకల’ లో జీవిస్తున్న ఓబిన్జేకి అమెరికన్ వీసా నిరాకరించబడుతుంది. అయినప్పటికీ ఇఫెమేలుని ప్రోత్సహిస్తాడు తను మళ్ళీ ప్రయత్నించి తర్వాత వచ్చి చేరుకుంటానని . ఇట్లా ఇఫెమేలు అమెరికావాసం మొదలవుతుంది.

చదువు స్కాలర్షిప్తో బాగానే సాగుతున్నా వర్క్ పర్మిట్ సరిపోని కారణంగా అతి చిన్న ఉద్యోగాలు కూడా దొరకక రోజులు గడవడం కష్టమవుతుంది. ఈ కష్టాల్లోంచి బయటపడడానికి చేసే అనేక ప్రయత్నాల్లో విసుగుచెంది పూర్తిగా తనమీద నమ్మకం కోల్పోయిన తరుణంలో అనాలోచితంగా చేసిన  ఒకే  ఒక్క పొరపాటు పని కారణంగా తనని తనే అసహ్యించుకునే స్థితికి చేరుతుంది. ఇదే కారణం వల్ల  ఓబిన్జేకి తనంతటతాను దూరమవుతుంది, అతను ఎన్ని రకాలుగా కాంటాక్ట్ చేసే ప్రయత్నం చేసినా పట్టించుకోకుండా. ఇది జరిగిన తర్వాత దొరికే చిరు ఉద్యోగం సాయంతో చిన్నగా తను కుదురుకుని, కథ రకరకాల పాత్రల్ని కలుపుకుంటూ ముందుకువెళుతుంది. కొన్నాళ్లలో ఇఫెమేలు కూడా అమెరికావాసిగా స్థిరపడగలుగుతుంది. ఇంతవరకే అయితే అతిమామూలు ప్రేమకథ. ఈ కథని అమెరికానా గా మార్చిన సంఘటనలూ, మనుషులూ, పరిశీలనలూ ఈ పుస్తకాన్ని డయాస్పోరా సాహిత్యంలో ప్రత్యేక పుస్తకంగా నిలబెట్టాయి.

ఈ ప్రత్యేకతకు మూలం ఇఫెమేలు రాసే బ్లాగ్, అందులోని విషయాలూ; వీటిమీదుగా తనకు జీవితం మీదా, రకరకాల దేశాలనుంచి వచ్చిన ఇమ్మిగ్రంట్ల బిగ్ అమెరికన్ డ్రీమ్ గురించీ పెరిగిన అవగాహనా. ఈ బ్లాగ్ లో ఇఫెమేలు ఒక నైజీరియన్ ఇమిగ్రెంట్గా అమెరికాలో తన జీవనం గురించీ, అమెరికన్ నల్లవారి గురించి ఒక నాన్ అమెరికన్ బ్లాక్ గా తన పరిశీలనలూ రాస్తుంటుంది. ఇట్లా రాసేక్రమంలో ఒక్కోసారి వాళ్ళ పట్ల సహానుభూతి చెందగలుగుతుంది, ఒక్కోసారి తన ఆలోచన లోకానికి నచ్చచెప్పగలుగుతుంది, ఒక్కోసారి అంగీకారం కుదరక స్పర్థల్లోకీ దిగాల్సివస్తుంది. ఏదేమైనా కొన్నాళ్ళకి చక్కని గుర్తింపు తెచ్చుకుని వివిధ కార్యక్రమాలకు ఆహ్వానింపబడే స్థాయికి చేరుతుంది, డబ్బు సంపాదించడంతోపాటూ. ఓబిన్జే ఎన్నోసార్లు అమెరికా వీసా ప్రయత్నంలో విఫలమై చివరకు కొన్నాళ్ళు ఇంగ్లాండ్ వెళ్లి అక్కడ స్థిరపడగలిగిన అవకాశం కూడా చివరిక్షణంలో కోల్పోయి చివరికి నైజీరియాలోనే వ్యాపారిగా జీవితం మొదలుపెట్టి అక్కడే అత్యంత విజయవంతమైన స్థాయికి చేరుకొని, అమెరికాకి రెడ్ కార్పెట్ ని సంపాదించుకుంటాడు. కానీ, నైజీరియాలోనే వుండిపోతాడు భార్యాపిల్లలతో.

బ్లాగూ, జీవితమూ అన్నీ విజయవంతంగా నడుతున్నా ఒకానొక రోజున ఇఫెమేలు నైజీరియా వెనక్కివెళ్లే నిర్ణయం తీసుకోవడం, వచ్చి అక్కడ స్థిరపడే ప్రయత్నంలో వచ్చే చిన్న చిన్న ఇబ్బందులతో కథ ముగింపుకి తెస్తుంది అడీచే. ముగింపు మాత్రం తనే చెప్పినట్లు రచయిత కలగజేసుకున్న ముగింపు, కానీ పెద్ద లోపం కాదు.

ఇక్కడివరకూ రాసినా అసలు ఇటువంటి ఒక పుస్తకం చదవడం వల్ల ఉపయోగం ఏమిటీ అనవచ్చు. చిమమాండా అడీచే రాతల్లో నన్ను వ్యక్తిగతంగా ఆకర్షించే లక్షణం, మనదేశానికీ నైజీరియాకీ ఉన్న సామ్యం. రెండూ ఎక్కువ భౌగోళిక విస్తీర్ణం ఎక్కువగానే ఉన్నా దానికి అనేకరెట్లు అధిక జనాభా ఉన్న దేశాలు; రెంటికీ కలోనియల్ గతం వుంది; దానితో అందివచ్చిన చక్కటి ఇంగ్లీష్, ఆ ఇంగ్లీష్ భాష తెలిసివుండటం వల్ల వచ్చే ప్రయోజనాలూ ఉన్నాయి; రెండూ కొన్ని దశాబ్దాలుగా అభివృద్ధి చెందుతున్న దేశాలుగానే గుర్తింపబడుతున్నాయి. రెండు దేశాలకూ ఘనమైన సాంస్కృతిక వారసత్వం వుంది కానీ దానిపట్ల ఇప్పుడు పెద్ద గౌరవం మిగలలేదు, రకరకాల విశ్వాసాలనీ, నమ్మకాలనీ  ప్రశ్నించడం వుంది. కొత్త తరాలు ఈ విషయాలు లోతుగా తెలుసుకునే, అవగాహన చేసుకునే ప్రయత్నం చేస్తున్నాయి. సమాజంలో అసమానతలు ఉన్నాయి. ఇక్కడ కులమత ఆధిపత్యాలు ఉన్నట్టు అక్కడ వర్గాధిపత్యాలు ఉన్నాయి. బ్యూరోక్రసీ, రెడ్ టేపిజం తో మొదలై అందిపుచ్చుకుంటున్న గ్లోబలైజేషన్ దాకా అన్నీ ఒక్కలాంటి  సమస్యలే,అవకాశాలే.

ఈనాడు రెండు దేశాలలోనూ, పాతని కూలగొట్టి కొత్తవి నిర్మాణం చేయడంలో ఆసక్తి ఉన్న దశలో ఉన్నాం. పుస్తకం చివరలో ఒక సందర్భంలో ఓబిన్జే ఇఫెమేలుతో మాట్లాడుతూ “మన దేశంలో పాత కట్టడాలని అలాగే వుంచి వాటిని రిస్టోర్ చేస్తే యూరోప్లో విలువ ఇచ్చినట్టుగా ఇవ్వరు, ఎలక్ట్రిసిటీ వాడకం తగ్గించాలి, పేపర్, ప్లాస్టిక్ మితంగా వాడాలి, పర్యావరణ పరిరక్షణ కోసం వాహనాలు తక్కువగా వాడాలి లాంటి సిద్ధాంతాలు పట్టించుకోరు. ఎందుకంటే మనది ఎదుగుతున్న దేశం ఇవేవీ మనవాళ్ళు కొన్ని తరాలు కూడా అనుభవించలేదు. అభివృద్ధి చెందిన దేశాలలో ఈ సౌకర్యాలను కొన్ని తరాలవాళ్ళు అనుభవించడం, వాటివల్ల రాగల దుష్ప్రభావాలు తెలుసుకోవడం, వాటిని వద్దనుకుని ప్రకృతికి దగ్గరగా జరగడం ఇప్పుడు జరుగుతుంది ఆయా దేశాల్లో. సైద్ధాంతికంగా ఇది మనకూ వర్తించే విషయమే కానీ, ఇప్పుడప్పుడే మన వాళ్ళు అవన్నీ కాదు అనుకోలేరు. అందుకే రిస్టోర్డ్ ఇళ్ళు, ప్రాకృతిక జీవనవిధానం ఇప్పటికిప్పుడు నచ్చే విషయాలు కాదు, పెద్ద కార్లూ, పోష్ అపార్టుమెంట్లూ నచ్చినట్లుగా” అంటాడు (ఈ మాటలు యథాతథ అనువాదం కాదు, సారాంశం మాత్రమే). అతి ముఖ్యమైన సామ్యం ఈ రోజుకీ వున్న బిగ్ అమెరికన్ డ్రీమ్. ఈ కారణాలవల్ల నన్ను కొంత ఎక్కువగా ఆకట్టుకున్నది ఈ పుస్తకం.

రెండువేల ఇరవైలో HBO వాళ్ళు పది ఎపిసోడ్ల సింగల్ సీసన్ సిరీస్ గా ఈ పుస్తకానికి పచ్చ జెండా ఊపారు Lupita Nyong’o ప్రధాన పాత్రధారి ఇఫెమేలుగా. కానీ కోవిడ్ తదుపరి డేట్ల సర్దుబాటు చెయ్యలేక Lupita ప్రాజెక్ట్ నుంచి తప్పుకోవడంతో ప్రస్తుతానికి ఈ ప్రయత్నం ఆగిపోయింది. ఇది దృశ్యరూపంగా కూడా రావలసిన పుస్తకమే. ముందు ముందు వస్తుందేమో చూద్దాం.

అడిచే నవలలన్నీ పరిచయం చెయ్యాలి అన్న ఆలోచనతో రాసిన రాత మాత్రమే కానీ, పరిశోధనాత్మక వ్యాసం కాదని గమనించగలరు. మరో పుస్తకంతో త్వరలో కలుసుకుందాం.

*

సునీతా రత్నాకరం

12 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • ఈమె నవల ‘పర్పిల్ హై బిస్కస్’నే ప్రముఖ తెలుగు కథా రచయిత డాక్టర్ వి. చంద్రశేఖర రావు ‘నల్లమిరియం చెట్టు’ అని మక్కీ మక్కీ దించేశారు. అడిచే రచనలో మంచి ఫ్లో వుంటుంది. ఒక అంతర్లీనమైన వేదన ఉంటుంది.

  • అడిచే రచనకి చాలా చక్కని పరిచయం అందించారు సునీతా! మీ పరిశీలన నిశితంగానూ, అభివ్యక్తి సుందరంగానూ ఉన్నాయి.

    • మీరు చదివి మీ అభిప్రాయం పంచుకున్నందుకు ధన్యవాదాలు నాగలక్ష్మి గారూ 😊🙏

  • సునీత, పుస్తకం శీర్షిక ‘ ప్రపంచం కోసం రాసే ఆమె’ చాలా ఆసక్తి కలిగించింది. తక్షణం చదవలేకపోయాను కాబట్టి సేవ్ చేసి పెట్టుకున్నాను. చాలా మంచి విశ్లేషణ. మరీ నచ్చింది ‘మన దేశానికి నైజీరియా కు ఉన్న సామ్యం’ చాలా నిశితంగా రాశారు. అందరం ఆలోచించాల్సిన విషయాలు. ఈ అభివృద్ధి ఎలాంటి దుష్పరిణామాలను తెస్తుంది, వాటినుంచి ఎలా తప్పించుకోవడం!!! ‘Old is gold’ ప్రకృతె శరణు. కానీ అదికూడా నాశనం చేసేస్తున్నామె! చాలా మంచి నవలను పరిచయం చేశారు.ఇంకా ఎంతో రాయాలనిపిస్తూంది 10th std లొ Advantages and Disadvantages of Science అని ఒక పాఠం ఉండింది. అది గుర్తు కొస్తూంది.. ధన్యవాదాలు సునీత.

  • సునీత, నాకు శీర్షికే ఎంతో ఆసక్తి కలిగించింది. చాలా మంచి పరిచయం. ముఖ్యంగా మనదేశానికి నైజీరీయాకు ఉన్న సామ్యం. అభివృద్ధి పేరుతో జరుగుతున్న దుష్పరిణామాలు, ప్రకృతికి చేరువవటం. అయినా ప్రకృతినీ పాడుచేసేశాముగా. ! Old is gold !!! 10th std లొ ‘Advantages and Disadvantages of science అన్న పాఠం గుర్తుకొచ్చింది. మంచి పరిచయం.ధన్యవాదాలు సునీత.

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు