ప్రతీసారీ కులం కోణం లేదంటారెందుకు?

అనగా అనగా ఒక అమ్మాయి..

ఒక ప్రోజెక్ట్‌లో రిసెర్చ్ అసిస్టంట్‌గా ఒక చిన్న ఉద్యోగంలో చేరింది. అక్కడ ఆఫీసులో ప్రోజెక్ట్ హెడ్, తన కన్నా వయసులో పెద్ద అయిన మరో ఇద్దరు అమ్మాయిలు, టెక్నికల్ విషయాలు చూసే మరో అబ్బాయి ఉండేవారు. అక్కడ పెద్దమ్మాయిలిద్దరిదే రాజ్యం. మనమ్మాయి వాళ్లకి వొంగి సలాములు కొట్టాలన్నట్టు చూసేవారు. మన పిల్ల అవేమీ చేసేది కాదు.

పొద్దున్నే వెళ్లడం , పని చూసుకోవడం, సాయంత్రానికి ఇంటికి రావడం. హెడ్ పక్కన ఇంకో గదిలో ఉండేవారు. మన పిల్ల పని చేసుకుంటూ ఉంటే ఆ పెద్దామ్మాయిలిద్దరు గుసగుసగా నవ్వుకోడాలు. మొదట్ళో కాస్త చిరాకు పడినా ఈ పిల్ల పట్టించుకునేది కాదు. రిసెర్చ్ హెడ్ పనేమీ చెప్పేవారు కాదు…అసలేం మాట్లాడేవారే కాదు. మన పిల్లకి ఏం చెయ్యాలో తోచేది కాదు. ప్రోజెక్ట్ వివరాలు కాస్త తెలుసు కాబట్టి తనకున్న జ్ఞానంతో ఏదో ఒకటి చెయ్యడానికి ప్రయత్నిస్తూ ఉండేది.

ఆ ప్రోజెక్ట్‌కి ఇద్దరు అసిస్టంట్స్ కావాలన్నారు. ఒక వారం తరువాత ఒకబ్బాయి జాయిన్ అయ్యాడు. హమ్మాయ్య తోడు దొరికాడులే అనుకుంది. ఆ అబ్బాయెమో మరీ బిడియస్తుడు. మౌనంగా ఉండేవాడు. ఇద్దరి మధ్యా స్నేహం కుదరడానికి రెండు వారాలు పట్టింది. ఆ పెద్దామ్మాయిలిద్దారిదీ అదే ధోరణి. ఆ టెక్ అబ్బాయితో కలిసి ముగ్గురూ గుసగుసలు, నవ్వులు, వేళాకోళాలు, దాష్టీకం చూపించడం అన్నీను. ప్రొఫెసర్ అప్పుడప్పుడూ వచ్చేవారు. మనమ్మాయిని పలకరించేవాడు. ఆ అబ్బాయి మొహం కూడా చూసేవాడు కాడు. 1-2 సార్లు ఉత్తినే కసురుకున్నాడు ఆ పిల్లాడి మీద. ఇలా మూడు నెలలు గడిచింది. హెడ్ వచ్చాడు. ఏం చేసారో చూపించండని అడిగారు.

చెయ్యడానికేముంది గనక! ఆయనేం చెప్పలేదు, ఏ పనీ ఇవ్వలేదు. వీళ్లకు తోచిందేదో చేసారు. అదే చూపించారు. హెడ్ అగ్గిమీద గుగ్గిలం అయిపోయాడు. మనమ్మాయిని ఒక్క మాట కూడా అనలేదు. ఆ అబ్బాయిని మాత్రం చెడామడా తిట్టిపోసాడు. ఉద్యోగంలోంచి పీకేసాడు. వచ్చే నెలనుంచీ ఇంక ఉద్యోగానికి రావొద్దన్నాడు. మనమ్మాయికి ఒకటే ఆశ్చర్యం! ఎందుకలా? తననెందుకు తిట్టలేదు? ఆ అబ్బాయిని మరీ అంత దారుణంగా ఎందుకు తిట్టారు? ఇద్దరూ మౌనంగా బయటిచ్చేసారు. అబ్బాయి తట్టుకోలేక ఏడ్చేసాడు. పాపం అనిపించింది. చాలా అన్యాయంగా ఇద్దరి తిట్లు ఆ అబ్బాయొక్కడే తిన్నాడు. కారణం ఏంటి?

ఒకటి, రెండు రోజుల్లో మెల్లి మెల్లిగా విషయాలన్నీ అర్థం అవ్వడం మొదలయ్యాయి. అక్కడ ఆఫీసులో హెడ్, ఆ పెద్దామ్మాయిలిద్దరూ ఒకటే కులం. ఈ అబ్బాయి వేరే కులం. ఈ రెండు కులాలకీ పడదు. మనమ్మాయి వీళ్ళిద్దరికన్నా అగ్రకులం కాబట్టి తనని ఏమీ అనలేదు. ఒక పెద్ద రిసెర్చ్ ఆర్గనైజేషన్‌లో పనిచేస్తున్న ఆ ప్రొఫెసర్‌కి కుల పిచ్చి. చిన్నపిల్లలు, తన దగ్గర పని నేర్చుకోవడానికొచ్చిన వాళ్లు వేరే కులం అయితే ఇదిగో ఈ అబ్బాయిని అవమానించినట్టు అవమానించడమే. అంతకుముందు ఒక తక్కువ కులం అమ్మాయి జాయిన్ అయితే, మాటలతో హింసించాడని, ఆ పిల్లని ముట్టుకోకుండా మాటల ద్వారానే ఆ పిల్ల శరీరం గురించి లైంగికపరమైన కామెంట్లు చేస్తూ నానారకాలుగా బాధపెట్టాడని, ఆ పిల్ల ఎవరికీ చెప్పుకోలేక, రుజువులు చూపలేక ఉద్యోగం వదిలేసి వెళ్లిపోయిందని తెలిసింది.

ఇవన్నీ తెలిసాక మనమ్మాయికి మెదడు మొద్దుబారిపోయింది. తన స్నేహితుని మీద చాలా జాలి కలిగింది. కానీ జరిగిన అన్యాయాన్ని ఎదిరించేంత శక్తి తనకు అప్పటికి లేదు.

సరే ఆ అబ్బాయి ఇంక ఎలాగూ వెళిపోతాడు కదాని ఇద్దరూ వీడుకోలు పార్టీ చేసుకున్నారు. కలిసి డిన్నర్‌కి వెళ్లారు.  ఏదో మాట్లాడుకుంటూ ఉండగా కులాల ప్రసక్తి వచ్చింది. కులాంతర వివాహాల గురించి వచ్చింది. మా ఇంట్లో కులాంతర వివాహాలకి ఒప్పుకోరంటూ వాళ్ల నాన్న తనతో అన్న మాటలు చెప్పాడు. వాళ్ల నాన్న అన్నారట… ఒరేయ్ మనకన్నా పెద్ద కులం అమ్మయైతే కష్టంరా. వాళ్లు మనింట్లో పూజలు చేస్తారు. వాళ్ల కాలికి మొక్కుతాం. వాళ్ల పిల్లని మనింటికి తెచ్చుకోలేం. వద్దు. మనకన్నా తక్కువ కులం అసలొద్దు. దళితులను పెళ్లి చేసుకోలేమురా…కావాలంటే ఆ పిల్లని నువ్వూ, నేనూ కూడా కలిసి ఉంచుకుందాం. నీకు కావాలంటే కోరిక తీర్చేసుకో. రేప్ చేసినా పర్లేదు. కేసులవీ లేకుండా నేను చూసుకుంటా. కానీ పెళ్లీ గిళ్లీ అనకురా…అని.

23 ఏళ్ల అబ్బాయికి, తన తండ్రి చెప్పిన కులహంకార మాటలివి. ఆ మాటలు విని ఈ పిల్ల అవాక్కైపోయింది. ఈ మాటలని ఉన్నదున్నట్లుగా ఏ తడబాటూ లేకుండా, సిగ్గు పడకుండా ఆ అమ్మాయికి చెప్పగలిగాడంటే ఈ వ్యవస్థ ఆ అబ్బాయికి ఇచ్చిన బలం ఎంతో ఊహించొచ్చు.

ఆఫీసులో కుల వివక్ష, ఆ అబ్బాయి ఇంట్లో కూడా అదే కుల వివక్ష.

అన్నిటికన్నా ముఖ్యమైన విషయం…తక్కువ కులం అయితే తండ్రి, కొడుకు కూడా కలిపి ఉంచుకోవచ్చుట. ఎవరికైనా బుర్ర బద్దలైపోదూ ఈ మాట వింటే! కానీ అవ్వట్లేదే! ఎవరికీ ఏమీ అవ్వట్లేదు. ఎందుకని? విని కొందరికి బాధ కలగొచ్చు. కానీ బుర్రలు బద్దలవ్వట్లేదు.

పై కథలో ఇసుమంత కల్పితం కూడా లేదు. ఇది నిజంగా జరిగిన విషయం.

స్వామి రాసిన ‘శప్తభూమి’ నవలలో ఒక భూస్వామి తండ్రికొడుకులు ఉంటారు. తమ పొలాల్లో పనిచేస్తున్న తక్కువ కులం స్త్రీలని లాక్కొచ్చి అనుభవిస్తుంటారు. అలా పనిచేస్తున్న ఒక పిల్లతో కొడుకు ప్రేమలో పడితే కొడుకు మనసు మళ్లించడానికి తండ్రి ఆ పిల్లని రేప్ చేస్తాడు. మన ఉంచుకోవలసిన పిల్లరా…దాంతో పెళ్లేమిటి! అని మందలిస్తాడు.

మరో చిట్టి కథ కాని కథ….

ఒక అగ్ర కులం అబ్బాయి, దళిత అమ్మాయి ప్రేమించుకున్నారు. ఇద్దరూ ఉన్నత చదువులు చదువుకుంటున్నారు. అగ్రకుల అబ్బాయి కమ్యూనిస్టు, దళిత యూనియన్లతో పాటూ కలిసి తిరుగుతూ అభ్యుదయ భావాలున్న వ్యక్తిగా చలామణీ అవుతున్నాడు. అనుకోకుండా పైన చెప్పిన అమ్మాయితోనే పరిచయం అయ్యింది. మొదటి పరిచయంలోనే మాటల్లో మాటగా “మీరూ మా అమ్మాయే” అన్నాడు. ఇదేమిటి! అభ్యుదయం నరాల్లో ఉప్పొంగుతోందన్నాడు. ఇవేం మాటలు! అని ఆశ్చర్యపోయింది ఆ అమ్మాయి. కొన్ని రోజుల తరువాత ఈ ప్రేమికులిద్దరికీ ఏదో గొడవ వచ్చింది. మన పిల్లతో ఆ గొడవ గురించి చెప్పుకున్నాడు. చెబుతూ చెబుతూ…నేను నా కులం దాటి వచ్చాను. ఆ అమ్మాయిని ప్రేమిస్తున్నాను. పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. కులం దాటి రావడం అంటే ఎంత పెద్ద విషయం ఇది. ఉప్పొంగుతున్న ఏరు దాటి రావడం అంత కష్టం. ఆ పిల్ల ఏమనుకుంటోంది నా గురించి. నాతో గొడవపడుతుందా, ఎంత ధైర్యం! మరొకడైతే దళిత పిల్లని పెళ్లి పేరు చెప్పి లొంగదీసుకుని, ఆ పనయ్యాక వదిలేస్తాడు. లొంగకపోతే రేప్ చేసేస్తాడు. నేను కాబట్టి పెళ్లి చేసుకోబోతున్నాను….అన్నాడు.

మన పిల్లకి తల తిరిగినంత పనయ్యింది ఆ మాటలు విని. నాకే ఎందుకు తగులుతారు ఇలాంటివాళ్లందరూ అని మనసులో తిట్టుకుంది.

ఆ అబ్బాయి ఇంకా ఏదో చెప్పుకుంటూ పోతున్నాడు. ఆ కుళ్లు నీటి ప్రవాహాన్ని మధ్యలో ఆపి…దళిత అమ్మాయైతే ఎందుకు రేప్ చేస్తారు? ఎవరు అలా అనుకుంటున్నారు? అని అడిగింది. ఎవరేమిటి? అందరూ అలాగే అనుకుంటారు. మా హాస్టల్లో అబ్బాయిలంతా ఇలాగే మాట్లాడుకుంటారు. ఒకసారి వెళ్లి, విని చూడు. దళిత అమ్మాయిలతో కావాలంటే ఒకసారి పడుకోవచ్చుగానీ ప్రేమా గీమా జాన్తా నై అంటారు. అందుకే మనం పోరాడాలి..అభ్యుదయం..కులాలు నశించాలి లాంటి మాటలేవో అన్నాడు. చాలా సంతోషం నాయనా అని ఒక నమస్కారం పెట్టి వచ్చేసింది మనమ్మాయి.

తక్కువ కులం స్త్రీలయితే ఉంచుకోవాలి లేదా రేప్ చెయ్యాలి. ఇదీ వరస.

రేప్ అనేది చాలామటుకు అధికారం చూపించుకోవడానికి, అణగదొక్కడానికీను. కామంతో కళ్ళు మూసుకుపోయో, ఆడదాని వస్త్రాలంకరణ చూసో ఉద్రేకంలో చేసినవి చాలా తక్కువ. ఇవాల్టి హథ్‌రస్ కేసయినా, నిన్నటి భూమి కేసయినా… ఇదే విషయాన్ని మళ్లీ మళ్లీ నొక్కి చెబుతున్నాయి.

అత్యాచారం అనేది ప్రధానంగా అణగదొక్కాలనుకునే చర్య. లింగాధిపత్యమో, కులాధిపత్యమో, మతాధిపత్యమో చూపించడానికే ఎక్కువసార్లు జరుగుతాయి. వీటిల్లో అధికం కులాధిపత్యం చూపించుకోవడానికే అని గణాంకాలు చెబుతున్నాయి. రేప్‌ల సంఖ్య లెక్కేస్తే దళిత స్త్రీలపై జరిగినవే ఎక్కువ తేలుతాయి.

లెక్కలు కావాలనుకునేవాళ్లు నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో అందించిన డాటా చూస్తే పరిస్థితి అర్థమవుతుంది. హథ్‌రస్ కేసు వెలుగులోకొచ్చిన తరువాత దాదాపు దేశంలో ప్రధాన పత్రికలన్నీ దళిత స్త్రీల మీద జరుగుతున్న లైంగిక హింస గురించి వ్యాసాలు ప్రచురించాయి. ఏ పేజీ తెప్పినా సత్యం బోధపడుతుంది. గత దశాబ్ద కాలంలో దళిత మహిళలపై 35% కంటే ఎక్కువ అఘాయిత్యాలు పెరిగాయని డాటా చెబుతోంది. రోజుకి 10 మంది దళిత మహిళలు రేప్‌కు గురవుతున్నారని గణాంకాలు చెబుతున్నాయి.

వీటిల్లో పోలీస్ స్టేషన్‌కు వెళ్లినవి 10% అయినా ఉంటాయా? అనుమానమే! ఎవరైనా ధైర్యం చేసి ఫిర్యాదు చేసినా…ఆ పిల్ల కుటుంబాన్ని నాశనం చేస్తారు. హత్యలు చెయ్యడం, దాడులు చెయ్యడం. ఎందుకు బతికున్నామా అనిపించేలా చేస్తారు. చరిత్రలో ఏ పుట తిరగేసినా ఇందుకు అనేక సాక్ష్యాలు కనిపిస్తాయి.

కాస్తో కూస్తో ముందుకు నడుస్తున్నారనుకున్నవాళ్లు కూడా హథ్‌రస్ కేసులో కులం కోణం లేదు అని వాదించడమే ఇందుకు పెద్ద సాక్ష్యం.

దళిత స్త్రీలపై అత్యాచారాలు వెలుగులోకొచ్చిన ప్రతీసారీ వాటిల్లో కులం కోణాన్ని విడిచిపెట్టి, జెండర్ కోణాన్ని మాత్రమే చూడడం మరో సాక్ష్యం.

వ్యవస్థ ఇంత వెన్నుదన్నుగా నిలిచాక దళిత మహిళలపై అఘాయిత్యాలు పెరగడంలో ఆశ్చర్యమేముంది!!

ఇక్కడ మరో విషయం కూడా గమనించాలి. ప్రజాగ్రహానికి గురయి, దేశం మొత్తం కోపంతో ఊగిపోయి నేరస్థుడికి శిక్ష పడాలని కోరుకునే కేసులు ఎక్కువ అగ్రకులాల అమ్మాయిలపై జరిగే అఘాయిత్యాలవే అయుంటాయి. దళిత అమ్మాయిలపై అత్యాచారం జరిగితే దళిత గొంతులే ఎక్కువగా వినిపిస్తాయి. అగ్ర కుల గొంతులు కాస్తో కూస్తో వినిపించినా, మళ్లీ కులం కోణం లేదంటూనో లేదా అన్నిటినీ కులచట్రంలోంచి చూడొద్దంటూనో  కూనిరాగాలు తీస్తుంటాయి. సోషల్ మీడియాలో నిర్భయ, ప్రియాంక రెడ్డి విషయాల్లో వచ్చిన స్పందన భూమి, హథ్‌రస్ కేసుల్లో రాకపోవడానికి కారణమేమిటో ఆలోచిస్తే తెలుస్తుంది.

అంతెందుకు…సోషల్ మీడియాలో నేను జెండర్ విషయాల గురించి రాస్తే వచ్చే స్పందన కులం గురించి రాస్తే రాదు. మామూలుగా నా పోస్టులన్నిటికీ స్పందించే అనేకమంది కులం గురించి రాస్తే మటుకు కిమ్మనరు. ఆశ్చర్యంగా ఉంటుంది!!

వీటన్నిటి వెనుక కారణాలను అర్థం చేసుకోగలిగితే జరుగుతున్న అన్యాయాలకు ఎలా స్పందించాలో, ఎక్కడ మొదలెట్టాలో, ఎలా ముందుకెళ్ళాల్లో, మనందరం ఏం చెయ్యాలో తెలుస్తుంది. ముందు, మార్గం కనిపిస్తుంది. మార్గం కనిపిస్తే ఎలా వెళ్ళాలో తెలుస్తుంది.

రేప్ అనేదాన్ని అధికారం చూపించే, అణగదొక్కే చర్యగా చూస్తూ, అందరు మహిళలపై అఘాయిత్యాలు జరుగుతున్నా దళితులు, ఆదివాసీ స్త్రీలపై ఎక్కువ అత్యాచారాలు జరుగుతున్నాయన్నదాన్ని ఒప్పుకుంటూ ఆ కోణంలో సమస్యకు పరిష్కారాన్ని ఆలోచించగలిగితేనే పరిస్థితిలో మార్పు వచ్చే అవకాశం ఉంది.

పరిష్కారం కన్నా ముందు సమస్య ఏమిటో, ఎక్కడుందో తెలుసుకోవడం ముఖ్యం.

మనమెందుకు తెలుసుకోవడం అంటారా? సమస్య మనలోనే ఉంది కాబట్టి. అఘాయిత్యాలు మనమే చేస్తున్నాం కాబట్టి.

*

ఆలమూరు సౌమ్య

పుట్టిన ఊరు విజయనగరం. ప్రస్తుతం దేశ రాజధానిలో మకాం. కుటుంబంలో సాహిత్యాభిరుచి ఉండడం, తెలుగు పుస్తకాలు అందుబాటులో ఉండడం వలన చిన్నప్పటినుంచీ తెలుగు సాహిత్యం మీద మక్కువ పెరిగింది. రాయలన్న తపనతో బ్లాగు మొదలెట్టాను. NATS 2013 కోసం కొత్త కథల ఆహ్వానం చూసి మనమూ రాస్తే బావుంటుందే అనిపించి తొలి ప్రయత్నం చేసాను. "ఎన్నెన్నో వర్ణాలు" అనే కథ NATS 2013 లో ప్రచురితమయ్యింది. అదే నా మొట్టమొదటి కథ. ఆ కథను "వాకిలి" సాహిత్య పత్రికలో మలిప్రచురణ చేసారు. అప్పటినుండీ కథలు, సమీక్షలు, వ్యాసాలు, అనువాద కవితలు..అడపదడపా రాస్తూ ఉన్నాను.

5 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)
 • 👏👏 భారత సమాజం లోని చీకటి పార్స్వాన్ని ధర్మాగ్రహం తో ఎత్తిచూపారు. ఆ చీకటి ని చీల్చుకొని అరుణోదయం ఎప్పుడవుతుందా అని చూసే నా లాంటి వాళ్ళకు ఇలాంటి రచనలు ఉపశమనం కలిగిస్తాయి.

 • Here two different issues are involved. One is caste discrimination at work place and the other is caste-based sex violence. These crimes are perpetrated by the members in our society. Therefore the root cause for these evils is in us and in our society. If we change,our society changes and then we can stop these evils.But,alas, we don’t change. We don’t want that change. You have presented the two issues beautifully and writers have a big role in changing our society. Keep writing. Good luck.

 • ఇక్కడ రెండు రకాల మనుషులున్నారు:
  1. ఒకరు మీరు పైన రాసిన తండ్రి బాపతు. అసలు నేరాన్ని నేరంగా గుర్తించక పోవటం. రేప్ చెయ్యి అని నిర్మొహమాటంగా, నిర్లజ్జగా, యథాలాపంగా (సినిమాల్లో మన హీరోలన్నట్టు) అనేయటం. వీడికున్న వీలునుబట్టి వీడు ఏదో స్కేల్ లో టైరంట్ అవుతాడు.
  2. రెండో రకం: ఎవడైనా ఒకడు నేరం చేస్తే వాడు మా కులంలో చెడపుట్టాడనో, లేక వీడికి హిందువనొ/ ముస్లిమనొ/ మరోటనో చెప్పుకునే హక్కు లేదు, వీడు నేరస్తుడు తీవ్రవాదిగానే పరిగణింప బడాలి అనే వాళ్ళు. వీరు అపాలజిస్ట్లు అవుతారు. కానీ అసలు కులవ్యవస్థ ఎందుకుంది, మనుషుల పుట్టుకను బట్టి ఎందుకు వారిని వేరు వేరుగా ఎందుకు పరిగణిస్తారు అని అడగరు.

  ఈనాటికీ ప్రపంచంలో కోట్ల మంది వాళ్ళ పుట్టుకను (కులం, మతం, దేశం, లింగం, చర్మపు రంగు, లైంగిక ధోరణి మో) బట్టి కొందరిని తమవారని, చాలా మందిని అవతలి వారని పరిగణిస్తున్నారంటె నాకు చాలా ఆశ్చర్యం కలుగుతుంది.

  కానీ ఇన్ని కోట్ల మంది మీద కుల ప్రభావం ఇంకా ఎందుకుంది? ఎందుకు ఒక మనిషితో కాస్త చనువు కుదరగానె, “మీరేవిటి?” అని అడుగుతారు. Is caste the bedrock of our identity as Indians?

  ఇరవయ్యొకటవ శతాబ్దంలో కులానికి సమాజంలో చోటెలా ఉంది ఇంకా?

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు