పోతేపోనీ …

వెళ్లినవారు కాదని వెళ్లిపోయారన్న బాధే లేదు
ఏ దిగులు మేఘం కమ్ముకొని
మనసంతా ముసురుకమ్మిందీ లేదు –
ఆత్మగౌరవపు ఆకాశమేదో విరిగిపడి పాతాళంలోకి కుంగిపోయిందీ లేదు
ఎందుకంటే
వాళ్లు వొదులుకున్నది నన్ను కాదు
వాళ్లని వాళ్లు వొదులుకొని చీకటి దారుల్ని
వెతుక్కున్నరు
సమూహపు మందలో కలగలిసి ఏ అస్తిత్వం లేకుండా పోయిండ్లు –
తిరిగిచూసే అలవాటే లేకపోవడం వల్ల ముందుకే నడుస్తున్నాను కానీ
దిగాలు పడి మోకరిల్లడానికి
ఏ ఆనవాళ్లను దాచలేదు –
వచ్చినవాళ్లు అలా వచ్చి
గుండె మీదే తిష్ట వేస్తారనుకోలేదు –
ఉదయాల్ని తీసుకొచ్చినట్టు వెలుగుల్ని నింపినట్టు
కొనవూపీర్లల్లోంచి కాపాడి
సంజీవ లేపన మర్ధనలు చేసి యౌవ్వనుణ్ణి చేసినట్టు
వాళ్ల సహజీవనంలోనే
కీర్తి యశోమంతులమైనట్టు భ్రమపడ్డారే ..
ఒక్క కుదుపుతో
వాళ్ల దుర్మార్గపుటాలోచనల బొక్కలిరిగిపోయి చతికిల పడ్డారే ..
స్వీయపాతకాల ఊబి
వెంటాడుతూనే వుంటది  –
పోతే పోయిండ్లు
మనుష్యుల్ని చదివే విద్యనేదో నేర్పే పోయిండ్లు
పోయిందేమీ లేదు
ఏదో ధూల్ తీరింది గానీ
లేత చివురులతో
మళ్లీ  చిగురిస్తోంది జీవితం !
*

అన్వర్

3 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • బాగుంది అన్నా..
    మనుషుల్ని చదివే విద్య నేర్పి వెళ్లిపోయారని సర్దిచెప్పుకుని, లేత చిగురులతో జీవితాన్ని చిగురింప చెయ్యటం అనే భావన నచ్చింది. ఆశవాహ దృక్పధం 👌🏻👌🏻❤️

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు