పేరు మాత్రమే ‘జల్సా’

బాలీవుడ్ అంటే డాన్సులూ ఫైట్లూ రంగులూ హంగులూ మాత్రమే కాదనీ, బ్రెయిన్స్ కూడాననీ ‘జల్సా’  నిరూపిస్తుంది.

చెత్త సినిమలైన చెల్లిపోవుచునుండు

ఉత్త డాబుతోని మత్తు పెంచు

సినిమలందునుండు మంచి సినిమాలూను

నిత్యసత్యమిదియె నమ్ము మామా!

సినిమాకి ఉన్న పవర్ గురించి ఎవరూ ఎవరికీ విప్పి చెప్పి నొక్కి వక్కాణించనక్కర్లేదు. ఏది తీసి విసిరినా ఎగిరి గంతేసి నోటితో అందుకునే ప్రేక్షకులున్నంత కాలమూ తర్కాలకందని సీన్లని చొక్కాల మీద తుపుక్కున ఉమ్మేసే దర్శకులూ ఉంటారు అనేది కూడా మళ్ళీ ముంజేతి కంకణమే. ‘ఎంత కుదురుగా, ఎంత వాస్తవికంగా తీశారబ్బా’ అని హాశ్చర్యపుటెడ్మిరేషన్లో  మునిగిపోతున్న చూపరులని, నిర్దాక్షిణ్యంగా కాలరట్టుకుని పైకి లాగి దూరానికి విసిరేసే ‘కొన్ని’ సత్యదూరమైన సన్నివేశాలవల్ల, ఆయా చిత్రరాజాలకి భిక్షాపాత్ర మాత్రం దక్కడమూ మనం చూశాం.

ఫరే చేంజ్, ముందుగా, ఈ ‘జల్సా’ (హిందీ – 2022) సినిమాలో ఏం లేవో చెప్తాను.

– పాటలు (ఒకటి తప్ప – అదీ చివర్లో)

– ఫైట్లు (ఒక తల్లి కొట్టే దెబ్బలని ఫైట్ అనుకోకపోతే)

– మందలుగా ఊపుతూ రిమ్మతెగులు డాన్సులు

– సందర్భానుచిత బూతుఖచిత డవిలాగులు

– టైటు బట్టల్లో మునిగిన పాత్రలు

– చెవుల తుప్పొదిలించే శబ్దాలు

– ఇంకా అస్మంటి వగైరాలు…

ఒక సంఘటన జరుగుతుంది. దానికి సమాంతరంగా మరెన్నో జరుగుతాయి. ఏ ఒక్కటీ అప్రస్తుతమనిపించదు. ‘అనవసరం’ అని అంతకంటే అనిపించదు. రెండుకన్నా ఎక్కువ పొరల్లోని జీవితాలని ఎక్కడా బాలెన్స్ తప్పకుండా నిలబెట్టి నిలకడగా చిత్రించగలగడం – మీకూ నాకూ ఏళ్ల కొద్దీ కనిపిస్తున్న రాజుగారి దివ్యాస్త్రాలని చక్కగా ఒలిచి మరీ చూపించగలగడం,  మన రోజువారీ సమరాలు, సర్దుబాట్లు, తప్పులు, కారణాలు, కారణాల వెనకాల కంపల్షన్లు, ఊపిరాడనివ్వని వాస్తవాలు, వాస్తవికతలు, ప్రేమ, క్షమ…

ఒకదానికొకటి సంబంధం లేనట్లు కనిపించే ఇన్ని విషయాలని విడివిడిగా దేనికి దాన్ని ఊహించడం కొంత తేలికవుతుందేమో! కానీ వాటిలో ఒక్కొక్కదాన్నీ మరికొన్నిటితో మెలికలు పెట్టడం సర్కస్ ఫీట్ కేమాత్రం తీసిపోదు. ఆ మెలికలని విప్పుకోవాలని నిర్ణయించుకునేది ముఖ్యపాత్రలు చివరిలో… కానీ వాటిని ఎప్పుడెప్పుడు విప్పుకుందామా అని తహతహలాడేది మాత్రం మనమే!

“ఊలాలా ఊలాలా…’ తో మీకు ఊపు తెప్పించిన విద్యా బాలన్ తర్వాతి చిత్రాల్లో ఎన్నో విభిన్నమైన పాత్రలు పోషించింది. ‘జల్సా’ కూడా ఆమెని మనకి ఒక ముఖ్యపాత్రలో చూపిస్తుంది. కష్టపడి సాధించుకున్న పేరుప్రతిష్టలు, వాటిని కోల్పోకూడదన్న లోకరీతి ఒక పక్కనుంచి, చెదలా అతి వేగంగా తొలిచేస్తున్న అపరాధభావన, తన చుట్టూ చుట్టుకుంటున్న మలుపులు మరో పక్కనుంచి, సర్వస్వమూ ఒడ్డగల తల్లిప్రేమ మూడో వైపునుంచీ నలిపి నల్లేరు చేసిన ‘మాయా మీనన్’ పాత్రని అలవోకగా అభినయించిన ఆమెని మామూలు మాటలతో ఎంత మెచ్చుకున్నా చాలదు.   ఆమెకు దీటుగా, మరో ప్రపంచానికి చెందినప్పటికీ, ఒకే విధమైన పట్టుదలా ప్రేమా ప్రతీకారభావనలూ మూర్తీభవించిన  ‘రుక్సానా’ పాత్రలో ‘శేఫాలీ షా’ కూడా, చూపరులమీద బలమైన ముద్రని వేయగలదు. ఇంకా ఇందులో రోహిణి హట్టంగడి, సూర్య కాశీభట్ల తదితరులు మనకి నటుల్లా కాక, మన మధ్యలో తిరుగుతున్న మనుషుల్లా కనిపిస్తారు.  వాళ్ళ నటనని చూసి అబ్బురపడక తప్పదు. ఆటిస్టిక్ చైల్డ్ గా సూర్య నటన, ‘నటనేనా?’ అనిపిస్తుంది.

ఇవన్నీ ఒకెత్తయితే, ఈ చిత్రాన్ని గుదిగుచ్చిన సాంకేతిక ప్రమాణాలు మరో ఎత్తు. ఎప్పుడు ఏ పాత్రని చూపుతూ కథని ముందుకి నడిపించాలన్నది దర్శకుడి నిర్ణయమే అయినా, అతడి మనసులోని ‘ప్లాన్’ని కెమెరా యే యాంగిల్ లో అయితే పర్ఫెక్ట్ గా పట్టుకోగలదూ అన్న ప్రణాళిక మాత్రం డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీదే. ఈ విషయంలో ఛాయాగ్రాహకుడు సౌరభ్ గోస్వామి ప్రజ్ఞాపాటవాలకి పట్టం కట్టాల్సిందే.

శబ్దానికి ఈ చిత్రంలో చాలా ప్రాముఖ్యత ఉంది. కథని మలుపులు తిప్పే కొన్ని ముఖ్యమైన శబ్దాలని  చిత్రపు టైటిల్ కార్డ్స్ కి నేపథ్యంగా వాడుకోవడమే – ఈ సినిమా ఒక విలక్షణమైన వీక్షణానుభవం కాబోతోందని సూచిస్తుంది. కొన్ని శబ్దాలు వినిపించిన ప్రతిసారీ ఉలిక్కిపడకా, ఒళ్ళు గగుర్పొడవకా తప్పదు.

సినిమా మొత్తంలో, వెతికి పట్టుకుందామన్నా కనీసం ఒక్క పాత్రైనా అనవసరంగా మాట్లాడదు. ఆ పాత్రకి తగని ఒకాబ్యులరీని వాడదు. అబ్బాస్ దలాల్, హుస్సేన్ దలాల్ రాసిన మాటలు మనల్ని అవాక్కు చేస్తాయి.

ఒక చక్కటి కథని తెరకెక్కించే విషయంలో దర్శకుడు ‘సురేశ్ త్రివేణి’ చూపిన ప్రతిభ బంగారమనుకుంటే – దానికి సువాసన అబ్బించిన ఘనత – ఎడిటోరియల్ డిపార్ట్మెంట్ లో పనిచేసిన సుజిత్ కనోజియా, ఎ. ఎస్ సుజిత్ లదే. సినిమా మొదలైన పదిహేను-ఇరవై నిముషాల వరకూ వాళ్ళ కత్తెరలు ఎన్నో ముడులు వేస్తాయి. ‘ఇప్పుడేంటి, ఇప్పుడెలా?’ అన్న ప్రశ్నలని ప్రేక్షకుల చేత వేయిస్తాయి.

ఇక, నేపథ్య సంగీతం ఎక్కడ ఎంత ఎలా మోగాలో సరిగ్గా అంతే మోగి, చూస్తున్నవారి రసానుభూతిని కెలకదు.  తెరమీద కనిపిస్తున్న పాత్రల హావభావాలకి, సన్నివేశపు ఆస్వాదనకీ గౌరవానికి భంగం కలిగించకపోగా, అవి మరింతగా పండేందుకు తోడ్పడుతుంది.  ఆ క్రెడిట్ అంతా సంగీత దర్శకుడు గౌరవ్ చటర్జీది.

మేకప్ చేసింది గోస్వామి శోమా. ఒక ముఖ్యపాత్రకి చేసిన మేకప్, ఆ పాత్రని మనకి మరింత చేరువ చేస్తుంది. కంటతడి పెట్టిస్తుంది.

అన్నట్టు ఇంకో ముఖ్యమైన విషయాన్ని చెప్పాలి. ఇందులో అన్నీ ‘టీమ్’లే పనిచేశాయి. డైరెక్షన్ టీమ్, ఎడిటింగ్  టీమ్, సౌండ్ టీమ్ అలా! ఆ సంగతిని మనకి టైటిల్స్ లోనే చెప్పడంలో దర్శకుడికి తన ‘టీమ్’ల మీద వున్న గౌరవం ప్రకటితమవుతుంది.

కథని నేను ఇక్కడ చెప్పడంకన్నా, మీరు చూస్తేనే బెటర్. ‘అమెజాన్ ప్రైమ్’ లో.

బాలీవుడ్ అంటే డాన్సులూ ఫైట్లూ రంగులూ హంగులూ మాత్రమే కాదనీ, బ్రెయిన్స్ కూడాననీ ‘జల్సా’  నిరూపిస్తుంది.  సినిమా అనే ఒక ప్రభావవంతమైన మీడియా పగ్గాలని టెక్నాలజీ ఆశ్వాలకి పూన్చి, ఒడిసి పట్టుకుని ఒక కొత్త తరం ఎలా పరుగులు తీయిస్తోందో చూపిస్తుంది. బాలీవుడ్ కి టాలెంట్ కొరత ఉండబోదన్న ఆశకి, ఈ చిత్రం ప్రాణం పోస్తుంది.

*

శ్రీనివాస్ బందా

పుట్టిందీ పెరిగిందీ విజయవాడలో. ఆకాశవాణిలో లలితసంగీతగీతాలకి వాయిద్యకారుడిగా పాల్గొంటున్నప్పుడే, సైన్యంలో చేరవలసివచ్చింది. ఆ యూనిఫారాన్ని రెండు దశాబ్దాల పైచిలుకు ధరించి, బయటికి వచ్చి మరో పదకొండేళ్లు కోటూబూటూ ధరిస్తూ కార్పొరేట్‌లో కదం తొక్కాను. రెండేళ్లక్రితం దానికి కూడా గుడ్ బై చెప్పి, గాత్రధారణలు చేస్తూ, కవితలు రాసుకుంటూ, అమితంగా ఆరాధించే సాహిత్యాన్ని అలింగనం చేసుకుంటూ ఢిల్లీలో నివసిస్తున్నాను.

7 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • అవును పద్మావతిగారూ… ఇప్పుడే నా తప్పు నాకు తెలిసింది. Thank you.

 • శ్రీనివాస్ గారూ
  నేనూ రెండుసార్లు చూశాను.
  బాగా వివరించారు మీరు

 • శ్రీనివాస్ గారూ
  నేనూ రెండుసార్లు చూశాను.
  బాగా వివరించారు మీరు. జల్సా అంటే జాతర అనే అర్ధం లో వారు సమాజాన్ని జాతర గా ప్రతీక రించేరనుకున్నాను నేను. ఇక్కడ ఇప్పుడు అందరూ తప్పిపోతున్నారు చాలా వాటి నుంచి అని గ్రహించాలేమో.

  • వీరలక్ష్మిగారూ, జల్సా అనే పేరు ఎందుకు పెట్టారో నాకైతే క్షుణ్ణంగా అర్థం కాలేదండీ. చివర్లో ఒక పాత్ర ఎన్నికల్లో గెలిచినందుకు చేసుకుంటున్న ఊరేగింపు పేరు ‘జల్సా’ అని ఒకరు సూచించారు. మాయా తన కొడుకుకోసం భయంతో ఖంగారుపడుతూ వెళ్తున్నప్పుడు అడ్డొచ్చే ఆ ఊరేగింపులో – ఈ సంఘటనతో సంబంధమున్న పాత్రలన్నీ కనిపిస్తాయి. అదొక రకమైన మెటఫర్ అనుకున్నాను. ఆ పాత్రలకి తన ఆవేదనతో సంబంధముందని మాయాకి తెలిసే అవకాశం లేదు. ఏది ఏమైనా, జల్సా అన్న పేరు ఎందుకు పెట్టారో అని ఇంకా ఆలోచిస్తూనే ఉన్నాను. రివ్యూ మీకు నచ్చినందుకు ధన్యవాదాలు.

 • ఆ సూర్య కాశీభట్ల అనే అబ్బాయి తెలుగు రచయిత కాశీభట్ల వేణుగోపాల్ గారికి మనవడు వరస అవుతాడండి. అమెరికా అబ్బాయి.

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు