పెద్దయ్య పథం 

శ్రీపతి జ్ఞాపకాల పూదోటలో కాసేపు  … రేపు సభ 

రేపు (17-02-2024) శనివారం మధ్యాహ్నం 12.30 గంటలకు శ్రీపతి జ్ఞాపకాల కలబోత జరగనుంది. వేదిక  -హైదరాబాద్ లోని శివమ్ రోడ్ నందు ఉన్న సురభి గ్రాండ్ హోటల్ మూడో అంతస్తు.

నువ్వు  ఏది అనుకుంటున్నావో అది నువ్వు కాకపోవచ్చు!.. నువ్వు కాననిదేదో అది నువ్వు కావచ్చు ..! నా ప్రశ్నలు విన్న తరువాత పెద్దయ్య ( పెద నాన్న) అని నేను  పిలుచుకునే ప్రసిద్ధ రచయిత  శ్రీపతి (పుల్లట చలపతి రావు ) అన్న మాటలివి. శ్రీ శ్రీ గా  శ్రీరంగం శ్రీనివాసరావు  ఉన్నప్పుడు, సి . నా . రె . గా  సి.  నారాయణ రెడ్డి కొనసాగగా  ఇలా మరి కొందరు సాహితీ వేత్తలు తమ  పేరులోనే తమ   అస్తిత్వం ఉంచుకున్నప్పడు పుల్లట చలపతి రావు తన మూలాలు తెలియజెప్పేలా కాకుండా శ్రీపతి గా ఎందుకు.. ? అని పెద్దయ్యను  ప్రశ్నించాను.
 మీ రచనలు ఉద్దానం ఊర్లను తడిమి తడిమి చూపుతాయి. కానీ ఏ కథ లోనూ ఉద్దానం అని రాయలేదు ఎందుకు ?… అని కూడా అడిగాను. రచన పరిధి చిన్నది అయినా దాని విస్తృతి   ప్రాపంచిక  ప్రాసంగికతకు  తగ్గరాదు అని దానికి సమాధానంగా పెద్దయ్య  అన్నప్పుడు నేను స్పందిస్తూ   విప్లవ వ్యామోహంలో పడి  పేరు విషయం తో సహా  మీరు చేసిన  కొన్ని  వల్ల మాలిన పనుల్లో అది కూడా ఒకటి అనుకుంటా అంటే తనకే సాధ్యమైన స్వచ్ఛమైన నవ్వు నవ్వారు పెద్దయ్య.
పెద్దయ్య కు తన ఊరు అంటే అవ్యాజమైన అభిమానం. ఎప్పుడైనా  కలిసినపుడు ఊరులోని  తన సమకాలీనుల గురించి పేర్లతో సహా  అడిగి వాళ్లతో తనకు గల   జ్ఞాపకాలు  నెమరు వేసేవారు. అలాంటి ఒక జ్ఞాపకం ఓసారి  చెప్తూ పట్టరాని సంతోషం వ్యక్త పరిచారు. అప్పట్లో  ఊరికి కొత్తగా బస్సులు ఆరంభం అయిన కాలం. వేకువ జాము బస్సు అది. శ్రీపతి బయలు దేరి బస్టాండ్ కు వెళ్లారట. అప్పటికే  అక్కడ చాలా మంది  జనం వున్నారు. బస్సు వచ్చింది. అంతమంది ప్రయాణికులను చూసి కండెక్టర్ కు పట్టరాని సంతోషం కలిగింది. అయితే బస్సు మాత్రం శ్రీపతి ఒక్కరే ఎక్కారట. అది చూసి బస్సు కండెక్టర్ అదేంటి ఒక్కరే ఎక్కారు?.. మీరంతా రారా..? అని అడిగాడట. దానికి వాళ్లు కార్జోలి పిల్లాడికి పంపడానికి వచ్చాం అన్నారట. దానికి కండెక్టర్ విస్తుపోయాడట తన  పల్లెల అనుభంధాలు అలాంటివి అని శ్రీపతి ఇలాంటివి చెప్పి  మురిసిపోయేవారు
శ్రీపతి తండ్రి రామన్న. తల్లి కనకమ్మ. శ్రీపతి  తాత  సోమయ్య గ్రామ కరణం. అందుకే ఆ కుటుంబీకులను  కార్జోలు అని పిలిచే వాళ్లు. శ్రీపతి చిన్న నాడే తల్లి మరణించింది. ఆమె గురించి శ్రీపతి జీవితాంతం పలవరించారు. తన రచనల్లో ప్రధాన పాత్రకు ఆ లోటు ఉండేది. ఏదో ఒక సందర్భంలో చిన్న నాడే తల్లి మరణించింది అని రాసుకునే వారు.
చిన్న నాడు  శ్రీపతి తన ఈడు  పిల్లలతో పశువులు మేపడానికి పొలాలకు వెళ్లే వారు. అలా పశువులను మేపడానికి వచ్చే వాళ్లలో  అన్ని కులాల వాళ్ళు వుండే వాళ్ళు. వాళ్ళను పరిశీలించడం, వాళ్ల జీవితాలు తెలుసుకోడం ద్వారా  అక్కడే శ్రీపతికి జనం బతుకు  కథలు బోధపడ్డాయి. తన గ్రామం బైరిపురం లో శనివారం, సోమవారం క్రమం తప్పకుండ జరిగే భజన కాలక్షేపం కు వెళ్లడం ఆనవాయితీ. దగ్గర్లో జరిగే వింధ్యగిరి జాతర, బెజ్జి పుట్టుగ యాత్ర చివరి వరకు ఆయనకు తీపి జ్ఞాపకాలు. విరసం వంటి సంస్థ రూప కర్తగా పని చేసినా శ్రీపతి అని పేరు పెట్టు కోవడానికి కారణం ఆ పల్లెలో లోని శ్రీ వైష్ణవ సాంప్రదాయ ప్రభావాలే కావచ్చు.
 శ్రీపతి తొలినాటి కథలు తీగకు కాయ బరువా, హత్యాన్వేషణ,  నాయకురాలు. ఇవి అలభ్యాలు బహుశా.  శ్రీపతి  తొలి నాటి  కథలతో వెలువరించిన  కాటుక కళ్లు కథలు మూడులో ఇవి లేవు.. ఆయనకు అక్కడి కళింగ సముద్రం అంటే తల్లి అంత ఇష్టం. మా ఊరి సముద్రం కథ వర్ణనలో అక్కడి  సంద్రం మీది ఆయన  ప్రేమ చూస్తాం. ఆ కథలో తన చిన్ననాటి జ్ఞాపకాలు కూడా కథనం చేశారు. వందకు పైగా కథలు రాసుంటారు. వాటిల్లో ఇప్పుడు బెనారస్ చిత్రాలు, కాటుక కళ్లు కథలు మూడు, సత్యజిత్ రాయి ఎవరు, ఎల్లోరాలో  వాళ్ళ ముగ్గురు, మంచు పల్లకి -మరి తొమ్మిది కథా సంకలనాల్లోని కథలు లభ్యం. రెండు నవలలు రాస్తున్న అన్నారు. పూర్తి చేశారో లేదో తెలియదు.  చిత్రలేఖనం పట్ల కూడా  ఆయనకు ఎంత మక్కువ. ఆసక్తి.  ఆ కళ పట్ల ఆయన అభిరుచిని బెనారస్ చిత్రాలు, ఎల్లో రాలో   వాళ్లు ముగ్గురు కథల్లో  చూడొచ్చు. ఇప్పటి సహజీవనం వంటి విషయాలపై జయ -రేణుక పాత్రల ద్వారా 1960 లో రాసిన అనంతం లో అణుమాత్రం కథలో చర్చించారు. ఆయన అక్షరాలలోని  శిల్ప సౌందర్యం చూడాలంటే బెనారస్ చిత్రాలు, ఎల్లోరాలో వాళ్ల ముగ్గురు ఆస్వాదించాలి. శ్రీపతి  రచనల్లో  తిరుగుబాటు ఒక సహజ లక్షణం. చేతుల కుర్చీ కథ అయితే  అంతర్జాతీయంగా ఎన్న దగ్గ  శైలితో సాగుతుంది. అలాంటి కథలు శ్రీపతి అమ్ములపొదిలో మరి కొన్ని  ఉండటం తెలుగు సాహిత్యం చేసుకున్న అదృష్టం.
ఆయన్ని నేను పెద్దయ్య అని పిలిచే చనువు వచ్చే సరికి తను  ఆధ్యాత్మిక దారిలో ఉన్నారు. శ్రీరామ్ అనే ఆధ్యాత్మిక వేత్తను ఆరాధించే వారు. సాయి భక్తులు కూడా. శ్రీరామ్ ను ఆలపిస్తూ ఆరాధనా గీతాలు అనే పుస్తకం కూడా రాశారు. తాత్విక జీవన కాలం  అది. ఒక విప్లవ పత్రిక స్థాపించాలని పైసా పైసా కూడబెట్టి భూమి కొన్న మనిషి  ఈ మార్గాన  అన్న సందేహం ఆయన వద్ద ఓ నాడు వ్యక్త పరిస్తే  జీవితంలో  ఆధ్యాత్మికత ను అంగీకరించాలి అన్నారు.  అలాగే ఆధ్యాత్మిక శ్రీపతినీ  అంగీకరించాలి అని చెప్పు కొచ్చారు. కరోనాకు కొంత కాలం  ముందు పెద్దయ్యను , పెద్దమ్మ శారద ను ఒక వేడుక లో కలిశాను. అదే చివరి సారిగా  వారిని కలవడం. ఇప్పుడు పక్కన కూర్చొని నవ్వుతూ పెద్దమ్మ శారద చూస్తుండగా  పెద్దయ్య జీవితాంతం తను  పలవరించిన  కన్నతల్లి కనకమ్మ ఒడిలో సేదతీరుతుంటారు.
*

నారాయణమూర్తి బల్లెడ

1 comment

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • శ్రీపతిగారు 1938లో జన్మించారని ‘మంచుపల్లకి-మరితొమ్మిది’ సంపుటిలోని వివరం. అది నిజమే అయిన పక్షంలో- ‘తీగెకు కాయబరువా’ (1937), ‘హత్యాన్వేషణ’ (1938), ‘తొలిచూలు’ (1947), ‘ఆశయసిద్ధి’ (1950), ‘నాయకురాలు’ (1950) అనే కథలు ఆయన రాసినవై ఉండకపోవడానికే అవకాశం హెచ్చు. బహుశా, అదే పేరుతో ఆకాలంలో మరో రచయిత ఉన్నారేమోనని అనుమానం.

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు