పూమేను

నేను ఏడేడ వున్నానో
ఏరుకొని……
అద్దం ఇసిరేసి
నా మొకంలోకి చూసుకున్నా

ఊడిన ఉసిల్ల రెక్కలు
తెగిన బంతి ఆకులు
దూపగొన్న జాము…
ఇడుపున
అంగల్లు తిరిగొచ్చిన చాపలగంప
నడిఇంట్లో తహిసిల్ సార వొలికి
ఉప్పుగల్లు కరిగిపోయింది
ఎలుగు ఎలిసిపోయింది
ఉడిగిన తోట మూలుగుతుంది
ఊరబిష్క ఉసురుమంది
పైన పందాడు
కింది పూసతాడు
ఆసగజూస్తున్నవి మధ్యలో మా కండ్లే
ఇంకా కాల్లకిందికి రాని పిల్లబాట

కలవరింతల్ని
తోడెస్తున్న వసనాప నాత్రి
నడి నెత్తిమీన సుక్కల పట్వ పగిలితే
దిగ్గున లేసి కూసున్నా వడ్డున….

నీటి మధ్యలో ఓ దీపం ఎలుగుతుంది
దీపలోకి జూసిన
నాకు ఎప్పటికి అర్ధం కానిది
ఎన్నటికి చెప్పలేనిది
తెల్ల తెల్లారు గట్ల
రూపుగట్టని పచ్చి ఒకటి
నా అంతరాన్ని పొడిచి పోతుంది
కాలం కొసన కల ఇగిరేసింది

నడిజర్ల మునిగి
నడుముకు చిక్కం కట్టి
నాట్యమాడుతూ
వంకెమ్మటి వంకెమ్మటి
చంద్రవంక కిందికి
వెన్నెల బంతికొచ్చిన
యద నిండా అలుగెల్లిన పున్నమి

కొంగలు గుంపులు గుంపులుగా
లేచిన అలికిడి
బుగ్గదొమ్మ బుగ్గమీన
తెల్లారబోయె పొద్దు
ముద్దాడింది
నిశబ్దం మెల్లగా ప్రవహిస్తుంది
ఈక తోకలు లేకున్నా
ఈదే నన్ను జూసి
మలుగు మేను మల్లిజూస్తుంది

కట్ట ఎక్కుతుంటే
కండ్లు అంజనం దిగి
కనికట్టు తెగింది

ఎగిరిపోతున్న పిట్ట రెక్కలు
తెరుచుకున్న ప్రకృతి తలుపులు
మందలో మరక
బొత్తలో బురక
వాగులో కాలు
కాగులో చెయ్యి
అందని ఉట్టి
అందిన లొట్టి
అమ్మ రొమ్ముని దించి
ఊరు రొమ్ము పట్టించి
ఎన్ని లోకలు తిప్పింది మట్టి

దురే ఎదురు బొంగు లేక
చెరువార
నా చెవిలో దూరి
నా మూల దాతువుని
బొమ్మలు బొమ్మలుగా
పాడుతుంది గాలి
పెయ్యి పిల్లనగొయ్యి.

*

Avatar

మునాసు వెంకట్

4 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు