పుష్ప ఆంటీ

స్త్రీని నగ్నంగా చూడాలన్న కోరికతో ఒక జనరేషన్ వయసుకొచ్చింది. ఈ రకమైన కోరికను క్రూయాల్టీ అనొచ్చేమో. కలర్ టీవీ, వీసీఆర్ లు చూసిన ఆ తరమే తొలిసారి మొబైల్ కూడా పట్టుకుంది. “బ్లూ ఫిల్మ్” ను నట్టింట్లో, ఆ తరువాత నెట్టింట్లోకి సగర్వంగా ఆహ్వానించింది ఆ జనరేషనే. స్త్రీని నగ్నంగా చూడాలి, ఆమెతో పడుకోవాలన్న ఆలోచనతో ఏమైనా చేయడానికి వెనుకాడని స్వభావాన్ని చాలా విస్తృతంగా సమాజంలో పెంచింది ఈ తరమే.

ఈ కథలో అలాంటి మనుషులు కొంతమంది కనిపిస్తారు. తన గురించి లోకం ఏమనుకుంటుందో తెలిసి కూడా పట్టించుకోకుండా తన జీవికను కొనసాగించే పుష్ప, తండ్రి చనిపోయాక కుటుంబ బాధ్యతను చిన్నతనంలోనే నెత్తిమీదేసుకున్న మతిన్ లు తమకు తెలియకుండా ఓ సమస్యలో చిక్కుకుంటారు. అయితే ప్రమాదం తప్పదని తెలిసి కూడా పుష్ప ఇష్యూను పైసల సంపాదనకు వాడుకోవాలనుకున్న మతిన్ స్వభావం ఆ క్రూయాల్టీకి కొనసాగింపు. నేను చూసిన ఇలాంటి కొంతమంది జీవితాలను చెప్పాలనుకోవడమే ఈ కథ నేపథ్యం.

          

“కొంచెం చట్నీల కారం తక్కువేత్తేంది బావ. నోట్ల మంట పెట్టినట్టే ఉంది. దెబ్బకు సల్ల చెమ్టలొచ్చినయ్” అనుకుంట చెంబెడు నీళ్లు తాగిండు ప్రసాద్. “కారంకారం అనుకుంటనే మొత్తం చట్ని నాకినవ్ గద్రా బామ్మర్ది, ఇంక మూడు ఇడ్లీలట్లనే ఉన్నయి, ఓ పద్మా… ఆ చట్నిలిన్ని నీళ్లువోస్కోని ఇట్తీస్కరా” నాలుగు పెసరట్ల పైసల్తీస్కుంట శ్రీధర్ మొత్తుకున్నడు. నువ్విట్ల చట్నీల నీళ్లు కల్పి పల్సగ చేస్తే అందరిలెక్క నేన్గూడ ఆ పుష్పాంటీ కాడ్కేవోయి టిఫెన్ జేత్తర లంగ బావ.” అని ప్రసాద్ అనంగనే కిసుక్కున నవ్వుకుంట ప్లేట్లింత గట్టి చట్నేసి పొయింది పద్మ. రమాకాంత్ ను గల్లా కాడుండమని జెప్పి ప్రసాద్ కాడికొచ్చిండు శ్రీధర్. గ్రైండర్ ముందున్న స్టూల్ ను గుంజుకుని కూసున్నడు. తన టిఫెన్ సెంటర్ ముందట్నే ఉన్న పుష్ప ఆంటీ బండి దిక్కు సూస్కుంట “అటు సూడ్రా బామ్మర్ది… చిత్త కార్తె కుక్కల్లెక్క కొడుకులెట్ల ఎగబడుతున్నరో దాని బండి మీదికి! టిఫెన్ తిననీకొస్తరో? లేదంటె ఆంటీని జూసి సొల్లు కార్వనీకొస్తున్నరో? అర్థమే కాదురా! రుశిపశి లేకున్నా… ఒక్కొక్కడు రెండు, మూడు ప్లేట్లు తింటర్రా అదేందో…” అనుకుంట ప్రసాద్ దిక్కు చూసిండు.

చిన్న ఇడ్లీ ముక్కను తీస్కోని దాన్కి లప్పెడంత గట్టి చట్నీ అద్దుకుని నోట్లేసుకుని నములుకుంటనే ప్రసాద్ “నియ్యన్నీ… ఇక్మత్ తక్కువ మాటలే బావ, పుష్ప ఆంటీ టిఫెన్ సెంటర్కు ఎవ్వడన్న రుశి కోసం వస్తడా చెప్పు? అగో ఒక్కపారి కింది నుంచి మీది దాకా ఆమెను సూడు… అసొంటి అందగత్తె మన మందమర్రిల ఏడన్న ఉన్నదా? ఆ దేవుడు ఇంగేం పన్వెట్టుకోకుండ పుర్సత్ గ కూసోని చెక్కీ…చెక్కీ…ఆంటీని భూమ్మీదికి ఇడ్సినట్టున్నడ్రా!” అని ఇంకో ఇడ్లీ ముక్క నోట్లేసుకున్నడు.

“నువ్వన్నది గూడ కరెక్టే బామ్మర్థి, మీది నుంచి కింది దాకా పోతవోసిన బిస్కెట్ బంగారం లెక్కుంటద్రా ఆంటీ. రోజు నన్ను జూసి నవ్వుతదిరా. ఏట్లైతే అట్లగాని ఓ పారి అడగనే అడుగుదామనిపిస్తదిరా! ఎందుకో మల్ల ఎనకాముందైత” అని ప్రసాద్ ప్లేట్లున్న ఇడ్లీ ముక్కను శ్రీధర్ నోట్లోసుకున్నడు. “ఓ పద్మా… షాపులున్న కారమంత చట్నిల్నే గుమ్మరిచ్చినవా ఏందీ? గిట్లయితే గిరాకీలొస్తయా? అని గిలాసెడు నీళ్లు గుట్టగుట్ట తాగిండు శ్రీధర్.

“ఎనకాముందు అవుడెందుకు బావ. గిసొంటి మ్యాటర్లు నీకేమన్న కొత్తనా? నీ అసొంటోళ్లు ఆంటీకి ఏమన్న కొత్తనా చెప్పు.” అని ప్రసాద్ అనేసరికి శ్రీధర్ ముఖం ఎన్టీపీసీ లైట్ల లెక్క జిగేల్ మన్నది. గిలాసను పక్కనపెట్టి ప్రసాద్ దగ్గరకు జరిగి “పుష్ప అసొంటిదేనారా?” అని అడిగిండు.

“దే ఊకో బావ తెల్వనట్టే మాట్లాడుతవు. ఆమెది ఓ క్యాసెటే ఉండే…”

“ఊకోరా బామ్మర్ది. పుష్ప అంటీ క్యాసెట్ ఉందన్న ముచ్చట ఆడీడు అనుకునుడేగని ఆ క్యాసెట్ సూసిన మొగోడు ఈ కోల్ బెల్ట్ లనే లేడ్రా” అనుకుంట మిగిలిన ఇడ్లీ ముక్కను చట్నిల ముంచి ప్రసాద్ నోట్ల పెట్టిండు శ్రీధర్. దాన్ని తిన్నంక ప్లేట్ ను కింద వడేసి చెయ్యి కడుక్కున్నడు ప్రసాద్. ప్యాంట్ ఎడమ జేబులకెల్లి దస్తీ తీస్కోని మూతి తుడ్సుకుంట ప్రసాద్ “దెంగెయ్ బే… నీకు తెల్వకుంటే తెల్వదని చెప్పు. అంతేగని క్యాసెట్ లేదనకు. ఆంటీ క్యాసెట్ బరాబర్ ఉన్నది. మా పర్శిగాడు తెల్సుగదా నీకు… బెల్లంపల్లి ఐడి పార్టీల జేస్తడు. వాడు గూడ ఎనుకులాడుతున్నడు దానికోసం. వాడేమన్న పిచ్చోడా? లేందే ఎతుకుతడా చెప్పు?” అని కౌంటర్ కాడికి నడ్సుకుంటొచ్చి గమాలలున్న పూరి తీస్కోని నమిలిండు. స్టూల్ మీది నుంచి లేశి క్యాన్ లున్న నీళ్లు బిందెల పోసిండు శ్రీధర్. అటెంక ప్రసాద్ దగ్గరికొచ్చి “గా క్యాసేట్ ఏడన్నుంటే ఇప్పియ్యరాద్రా బామ్మర్థి” అని గదవ పట్టుకున్నడు. పూరి నములుకుంటనే ప్రసాద్ “అయినా గా క్యాసెట్ నీకెందుక్రా బావ. పాత షకలేమన్న మళ్ల మొదలు పెడ్తున్నవా ఏంది?”

“నీ అక్కతోడ్రా బామ్మర్ది దాని క్యాసెట్ సూడాలన్న సోకేం లేద్రా నాకు. గా కర్రె ప్రభాకర్ గాడు తెల్సుగదా నీకు…మన సిఐ గాడి గన్ మెన్. రోజు షాపుకొచ్చి చెయ్ జాపుతుంటడ్రా! గుంజకు చీర సుట్టి ఏడన్న నిలబెడ్తే… దాని సుట్టు గూడ తిరిగే గలీజ్ సాలెగాడాడు. ఆనికి పుష్పాంటంటే పిచ్చి! ఆమెను సూడంగనే ఆనికి సొల్లు కార్తది. వానిగ్గిట్ట ఆ క్యాసెటిత్తె…ఇగ జన్మలాడు నా షాప్ జోలికి రాడ్రా.” అని అంగి చేతుల్ని మీదికి మల్సుకున్నడు.“ఐతే ఓ పన్జెయ్ బావ…మతిన్ గాన్నడుగు. వాడు సూడని క్యాసెట్లున్నయారా బావ. పుష్పాంటీ క్యాసెట్ గూడ అని దగ్గర బరాబర్ ఉండే ఉంటది. ఆ దేవుడచ్చడిగినా ఆడియ్యడుగని నువ్వడిగితే మాత్రం పక్కా ఇస్తడు. ఒకవేళ ఆడియ్యకుంటే చెప్పు ఇంకో ప్లాన్ చెప్త” అని జేబుల నుంచి చినిగిన పది రూపాల నోటు తీసి శ్రీధర్ కిచ్చిండు. ఆ  నోటును జూసిన శ్రీధర్ “ఏం రో బామ్మర్ది నాకే పైసలిచ్చేంత మొగోనివైనవారా? చల్ నడు సాలే!” అన్నడు. శ్రీధర్ అట్లనంగనే జెప్పన ఆ నోటును జేబుల పెట్టుకున్నడు ప్రసాద్. “సరే గని బావ ఇప్పుడు అసలు ముచ్చట చెప్తిను, వచ్చే సండే బొక్కలగుట్ట కాడ ఫైనాన్స్ ల పనిచేసే పోరగాల్లందరం కల్సి దావత్ జేసుకుంటానం. ఓ యాభై పూరీలు, యాభై చపాతీలు నువ్వే పంపాలె. పైసల ముచ్చట తరువాత మాట్లాడుకుందాం” అని సురేష్ ఎలక్ట్రానిక్స్ ముందుపెట్టిన రేంజర్ సైకిలేస్కోని బస్టాండ్ దిక్కు పోయిండు ప్రసాద్. “కుక్కకు బొక్కేసినట్టు, వీడు నాకు పుష్పాంటీ క్యాసెట్ ఆశ జూయించి గట్టిగనే కుచ్చిండు కదా! రమాకాంత్” అనుకుంట పుష్ప ఆంటీ బండి దిక్కు శ్రీధర్ చూసిండు.

క్రీమ్ కలర్ చీర, తెల్లటి ట్రాన్స్ పరంట్ జాకెట్ ఏసుకుని గల్లా పెట్టే దగ్గర పుష్ప ఆంటీ కూసోనున్నది. ఆమె జాకిట్ల దాసిన రూపాల నోట్లు క్లియర్ గ కనిపిస్తున్నయి. ఆమె పక్కపొంటే తాకేటట్టు నిల్సోని, దోశ తినుకుంట లోకల్ కేబుల్ టీవీ  కెమెరామెన్ రంజిత్ ఏదో మాట్లాడుతున్నడు.

“నిన్న పొద్దుమీకి సాయిబాబ గుడి కాడ కనిపిచ్చినవ్. ఎట్వొయొస్తున్నవు ఆంటీ?” ఆత్రంగడిగిండు రంజిత్. “మా నడిపన్న చిన్న బిడ్డ పెద్ద మనిషయిందంటె కుడ్కలు పెట్టనీకి పోయిన” అని జాకెట్ల నుంచి పైసల్ని తీసి గిరిగిరి నడిపే పున్నంకిచ్చింది పుష్ప. ఆ మాట ఇనంగనే రంజిత్ కొద్దిసేపు ఆలోచనల పడ్డడు. తొందరగనే తేరుకుని “రెండు నెలల కిందనే కదా మీ నడిపన్న బిడ్డ లగ్గమైంది. గిప్పుడు పెద్దమనిషి అవుడేంది?” అని కుర్చీల గట్టగట్ట గిన్నెల సాంబార్ మొత్తం తాగిండు. “ఆళ్ల తమ్ముడికి బాయిపనొచ్చిందని మా వొదిన జప్పన లగ్గంకోట్ ఏపిచ్చింది. ఆయింత మేనమామలు పోరన్నేడ ఆళ్లల్ల కల్పుకుంటరో ఏమోనని మా వొదిన భయపడ్డది. అందుకే పోరి పెద్దమనిషి అయ్యేదాక గూడ సూడలేదు” అనుకుంట ఎనకున్న తడకల షెడ్ల సొచ్చింది. సాంబార్ తాగుడాపి ఆమె ఎన్కనే లోపలికి వోయిన రంజిత్ “అరెరే.. పిల్ల ఇంక టెన్త్ కూడా పాస్ గాలేదు. ముందు ముందు ఏమన్న ప్లాబ్లంస్ వస్తే ఎట్లాంటీ”

“నేనేంజెయ్యాలే పిలగా, మా అన్నావొదినలు నా మాటింటరా చెప్పు? నేనే వాళ్ల దయాదాక్షిణ్యం మీద బతుకుతానా!”

గ్రైండర్ స్విచ్ బంద్ జేసిన పుష్ప అండ్లున్న చట్నీ తీసి బకెట్ల ఏస్తున్నది. ఆమె దగ్గరికొచ్చిన రంజిత్ అందుకున్నడు. “ఒకరి దయ మీద బతికే ఖర్మ నీకెందుకాంటీ. ఈళ్లందర్ని ఒక్కసారి సూడు. నీకాడ టిఫిన్ తిననికే వచ్చిల్లనుకుంటానవా ఏందీ? ఈ ఇడ్లీలు, దోశలు తింటే తీరే ఆకలిగాదు వీళ్లది. నిన్ను కళ్లనిండ చూస్తెనే వీళ్లాకలి తీరుతది. ఈ విషయం నీగ్గూడ తెల్సుగని ఎందుకో తెల్వనట్టే జేత్తున్నవు.”

శ్రీధర్ మాటల్ని నజర్ అందాజ్ జేస్కుంటనే చట్నీని బకెట్ల పోసింది. అప్పుడే కొంచెం చట్నీ రంజిత్ ప్యాంట్ జిప్ మీద పడ్డది.

తడిచేతులతోనే సుతారంగ ప్యాంట్ జిప్ మీద పడ్డ చట్నీని తుడుసుకుంట పుష్ప “ఇంతకీ నీ ఆకలి ఎట్ల తీర్తదో చెప్పలేదు పిలగ” అనడిగి ఆడ్నుంచి పోయింది. రంజిత్ కు సల్ల చెమ్టలొచ్చినయి. ఇదంత జూస్తున్న శ్రీధర్ “మతిన్ గాన్ని బుదరకిచ్చి దీని క్యాసెట్ ఎట్లన్న దొరకవట్టాలే” అనుకున్నడు.

వారం రోజుల  తర్వాత…

“మీ ఇంట్లనే ఆంప్లిఫైర్ బాక్సుంది. ఊరికి పోయేదుంటె మేయిన్ బంద్ జెయకని చెప్పినంక గూడ ఈ సాకలోల్లత్తమ్మ ఇట్లనే జేస్తది. ఇప్పుడు జూడు గుద్దల్దమ్మయితాంది. ఆ టీడీపీ లీడర్ రాపల్లి శంకర్ గాడు పొద్దుపొద్దున్నే డిష్ కాడ్కొచ్చి లొల్లి లొల్లి జేసి పోయిండు. టీవీ సూడకుంటె జనాలకు దొడ్డిగ్గూడ రాదా ఏందీ?” కట్టర్ తోని డిష్ వైర్ కట్ చేసి, పిన్నులెక్కించి స్పిల్టర్ బాక్స్ ల పెట్టిండు మతిన్. వైర్ ఇగ్గుకొమ్మని మధుకు చెప్పిండు. వైర్ ను గుంజుకుంట మధు “ఔనన్నా… కథట్లనే ఉంది. మొన్న ఆదివారం రాత్రి ఆ సీరంశెట్టి శీనుగానోల్లయ్య డిష్ మీది కొచ్చి గాయి గత్తరజేసిండు. రాత్రి మన వార్తలొచ్చేటైంకు ఆల్ల వాడకట్టల ఎవలింట్ల గూడ టీవీ రాలేదట. పొద్దటి బదిలీల బాయికాడ గేట్ మీటింగ్ అయిందట. ఇంత నైంటి ఏసినట్టున్నడు. ఇగసూస్కో అల్చల్ ల గుడాలే.”

“అరే…రామశంకరా…ఏందిరా వారీ మీ ముచ్చట్లు! మీతోని తాపతాపకు నాకు పంచాయితేనారా? వశపడ్తలేద్రా. పన్జేయున్రా అంటె ఆడిపోరగాల్ల లెక్క ముచ్చట్లు పెడ్తరేంద్రా? గీ ముత్తంత పనికి ఇంతసేపారా మతిన్ గా?”

కుమ్మరోల్ల సరక్క ఇంటి ముందు డీ మీటర్ సూస్కుంట గయ్యిమన్నడు రమేష్. డిష్ ల పన్జేసే శ్రీధర్, మతిన్, మధు కంటే రమేషే సీనియర్.

“అయిపొయిందన్న. ఇప్పుడు సూస్కో. ఈ లైన్ ల ఈటీవీల, జెమినీ టీవీ సిగ్నల్ సొత్తాందట. సక్కగ సెట్ జెయ్యి. మల్లోపారి ఇల్లెక్కమంటే నాతోని గాదు.” అనుకుంట మతిన్ నిచ్చెన దిగిండు. మధు మాత్రం ఇల్లు మీదనే ఉన్నడు. రమేష్ దిగుమంటె దిగుదమని సూస్తున్నడు. కొద్దిసేపు డీ మీటర్ తోని కిందా మీద పడి “సరే రారా” అని రమేషన్నంక నిచ్చెన దిగిండు. మిగిలిన వైరంత సుట్టుకుని మతిన్ జబ్బకేసుకున్నడు. “మామిడిగట్టు నుంచి మా శ్రీనివాస్ రెడ్డి బావ కల్దెత్తాండు. జల్ది రాల్లన్నా” అన్నడు మధు. “అగో గీ మాపటీలి మీ దుకాణం ఏందిరా?” అన్నడు రమేష్. “ఏమో అన్న మా బావ సంగతి నీకు తెల్సుగదా! అసలే మెంటలోడు. ఎప్పుడేం జేస్తడో తెల్వది. మీరైతే జప్పన రాల్లి” అనుకుంట డిష్ దిక్కు నడ్శిండు మధు. “ఈ తాగుబోతు బాడ్కావ్ లకు యాల్లా లేదు పాల్ల లేదు. అరే మతిన్గా ఇంకోసారి డిష్ ల తాగుడు ప్రోగ్రాం పెడ్తే నీ ఈబ్బలుగుతది బిడ్డా ఏమనుకున్నవో! మల్లన్నకు జెప్త” అన్నడు రమేష్.“మల్లన్నకు తాగిపియ్యనీకే ఆ శ్రీనివాస్ రెడ్డి కల్దెత్తాండు”అని కుమ్మరోల్ల సరక్క ఇంటి గద్దె మీది నుంచి లేశిండు మతిన్. “దే ఊకో…నిజమా రా!” అనుకుంట రమేష్ ఎనకొచ్చిండు. మతిన్ తల్కాయూపిండు. ఇద్దరు కల్సి ఇడ్లి పరమేశ్ ఇంట్ల సొచ్చిన్రు. వీళ్లను సూడంగనే బాయి కాడ బట్టలుతుకున్న పరమేశ్ భార్య పద్మ “రెండు రోజుల్సంది టీవే వస్తలేదు. ఈ నెల నేనైతే బిల్లియ్య, ఏమన్న చేస్కోన్రి.”అని కోపానికొచ్చింది.“అగో రెండు రోజులేడాయే అత్త. నిన్న మాపటీలే గద సాకలోల్లత్తమ్మ ఆళ్ల ఆడిబిడ్డోళ్ల ఊరికిపోయింది.”అని ఇంట్లున్న టీవీ ఆన్ జేసిండు మతిన్. పిక్చర్ ట్యూబ్ ఛార్జింగ్ ఒడ్సినట్టుంది బొమ్మ సగమే వచ్చింది. అది గూడ  సక్కగ కనిపిస్తలేదు.

“ముందుగాలీ డొక్కు టీవీ రిపేర్ చేపియ్యత్త. ఇంకెన్ని రోజులిట్లనే సూస్తవు. మెకానిక్ కుమారన్నకు చెప్పాల్నా?”అని బిందెల నీళ్లు ముంచుకుని తాగిండు మతిన్. నాగ్గూడ కొన్నీరా అని రమేష్ సైగ చేసేసరికి లోటతోని ముంచి రమేష్ కిచ్చిండు. పరమేశ్ భార్య పద్మ దిక్కు సూస్కుంట “సప్పుడుజాక మా అసొంటి టీవీ కొంటవా? జగదాంబల తక్కువకిప్పిస్త.”

“నీకేందల్లుడు. మీ అవ్వ చిట్టీలేసి పైసల్ జమచేస్తుంటే…డిష్ ల నువ్వు మస్తు సంపాదిస్తున్నవు. మీ మామ కాడ ఏముంది లొట్టపీసు.”చట్నీ మరకలు పడ్డ పరమేశ్ నల్లంగిని జాడిచ్చింది పద్మ. ఆ మాటిన్నంక మతిన్, రమేష్ ఇద్దరు నవ్వుకున్నరు. రమేష్ తోనిమతిన్ “సూశినవా అన్న డిష్ ల సంపాదించి మనం కట్టలు కడ్తానమనుకుంటాంది అత్త.” అని రమేష్ చేతులున్న లోట తీస్కవోయి బిందె మీద పెట్టిండు మతిన్. “ఇడ్లీలమ్మితే మీకెన్ని పైసలొస్తయో… నెలకు మాక్కూడా గన్నే పైసలిస్తడు మా ఓనర్.” అనుకుంట ఇంట్ల నుంచి రమేష్  బయటికొచ్చిండు. “గడియ రికాం…గవ్వ సంపాదన లేని పని మాది” అనుకుంట మతిన్ గూడ ఎన్కపొంటొచ్చిండు.

……….

“కల్లంత ఎట్లనో ఉందేంది బావ? శంకరయ్య తాత దగ్గర తేలేదా ఏంది?” గిలాసడు కల్లు తాగినంకన్నడు మధు.“నీకు కల్లు తాగిపిచ్చుడే ఎక్కువనుకుంటె ఇంక వంకలు వెడ్తానవారా బోష్డికే” తెల్ల క్యాన్ ల నుంచి కల్లొంపుకుంట అమ్మనక్కను అందుకున్నడు శ్రీనివాస్ రెడ్డి. అప్పుడే రమేష్, మతిన్ డిష్ ల కొచ్చిల్లు.“ఉబ్బాగలేదానోయ్ మీకు. వచ్చేదాకన్న ఆగలేదు” అనుకుంట డీ మీటర్ పట్టుకునే చాప మీద కూసున్నడు రమేష్. జబ్బకున్న వైర్ ను మూలకిసిరేసొచ్చి గోడకు ఒరిగి మతిన్ కూసున్నడు. ఇద్దరి ముందు గిలాసలు వెట్టి మధు కల్లువోసిండు. మల్లన్నేడని మతిన్ అడిగితే ఆపరేటర్లతోని మీటింగ్ ఇంక ఒడ్వలేదు. కాంగనే వస్తడని మధు చెప్పిండు. సగం క్యాన్ ఒడ్సినంక మతిన్ ను సూస్కుంట శ్రీనివాస్ రెడ్డి “ఓ పిల్లగ…మీ బావకే స్పెషల్ గ సూపిస్తవా? మేమేం పాపం జేసినం. మాకు సూపియ్యవా?” అని గుడాల్ నోట్లోసుకున్నడు. “ బావెవడు? స్పెషల్ గ ఏం సూపించిన? నువ్ మాట్లాడేందో నాకర్థమైతలేదు” అనుకుంట ప్లాస్టిక్ సీసలున్న కల్లు నోట్ల బోసుకున్నడు మతిన్. “అగజూడే రమేషన్న, సొక్కపూస మాటలెట్ల మాట్లాడుతున్నడో…పిల్లి కల్లుమూస్కోని పాలు తాక్కుంట ఎవ్వల్ సూత్తలేరనుకుంటదట అట్లనే ఉంది మీవోని కథ.”

“దే ఊకోరివయ్య, మీ నప్పతట్ల పంచాయితీ. అస్సలు ముచ్చటేందో సక్కగ చెప్పుల్లి” అని రమేష్ కోపానికొచ్చిండు. దాంతోని శ్రీనివాస్ రెడ్డి “ఏం లేదు రమేషన్న, పుష్ప ఆంటీ క్యాసెట్ ఈనె దగ్గరుందట. టిఫెన్ సెంటర్ శ్రీధర్ గాని పెళ్లాం ఊరిక్వోతె, మొన్న రాత్రి ఆళ్లింట్లనే మీవోడు దుకాణం పెట్టిండట. కల్లు పట్టుకొచ్చేటప్పుడు స్టఫ్ కోసం నరేష్ గాడి స్వీట్ షాప్ కు పోతే ఆ మొద్దు ప్రసాద్ గాడు, మోజెస్ గాడు మాట్లాడుకుంటాంటే ఇన్న.” శ్రీనివాస్ రెడ్డీ ముచ్చట చెప్తుంటే కల్లు తాగుడాపి మతిన్ ఆశ్చర్యంగ సూస్తున్నడు. రమేషేమో కోపంతోని మతిన్ను తన్నిండు. “బాడ్కావ్…పుష్పాంటీ క్యాసెట్ కోసం ఎప్పటి సంది ఎన్కులాడ్తాన్నో నీకు తెల్వదారా? నన్ను గూడ రమ్మంటే వచ్చేటోన్ని గదరా! గిదేనారా సీనియర్ కిచ్చే మర్యాద” అని ఇంకో గిలాస కల్లు వట్టిండు రమేష్. అంగి మీద పడ్డ కల్లును దస్తితో తుడ్సుకుంట మతిన్ “నాతోడన్న గా క్యాసెట్ ముచ్చటేందో తెల్వదు. మొన్న సోడాల రమేష్ బిడ్డ శ్యారీ ఫంక్షన్ వీడియో తీయనీకి పోయినప్పుడు కల్సిన కల్సుడే శ్రీధర్ గాన్ని. ఫంక్షన్ లేట్ అయ్యేసరికి ఆ రాత్రి ఇంటికేమచ్చుడని మా బావగాని క్వార్టర్ కు పోయిన. అప్పటికే ఆడు డిచ్చయిండు. ఆ రాత్రి పండి తెల్లారి మళ్లా డిష్ కే వచ్చిన కదా! ఆ మొద్దు ప్రసాద్ గాడు ఏం చెప్పిండో…ఈ శ్రీనివాస్ రెడ్డి ఏమిన్నడో…నాకేం సమజయితలేదు. అయినా కొత్త ఎస్.ఐ అచ్చిండని వారం కిందనే మొత్తం క్యాసెట్లు ఈన్నించి తీపిచ్చి వెంకటేశ్ గానింట్ల పెట్టిప్పిచ్చినవ్. అసొంటి క్యాసెట్ ఏమన్నుంటే నీకు చెప్పకపోయేటోన్నా.”

అప్పుడే ఎవరో షటర్ డోర్ కొట్టిన్రు. మధు సూడనీకి వోయిండు. దబదబ లోపలికొచ్చిండు. మతిన్ ను సూస్కుంట “వడ్ల రవొచ్చిండంట, కట్ల సంపత్ గాడు నిన్ను బయటకు రమ్మంటాండు.”

వడ్ల రవి పేరినంగనే అందరికి తాగింది దిగింది.

వడ్ల రవి ఓ రౌడీషీటర్. కిరాక్ గాడు. సామాన్యంగ వాడెవని దగ్గరకు రాడు. అసొంటోడు డైరెక్ట్ గ డిష్ కాడికొచ్చేసరికి అందరికి ఉచ్చ వడ్డది. రమేష్, శ్రీనివాస్ రెడ్డి, మధు లోపల్నే ఉండి, మతిన్ ను బయటకు పంపిన్రు. డిష్ పక్కన నూకల శంకర్ ఇంటి ముందు డీజిల్ ఆటోల వడ్ల రవి కూసోనున్నడు. ఆటో కాడ్కి పొయిన మతిన్, వడ్ల రవికి నమస్తే పెట్టిండు. డ్రైవర్ సీట్ల కూసుంట “రమ్మన్నవంట ఏమన్న పనా అన్న…”

“ఏం లేదు తమ్మి, పుష్ప ఆంటీ క్యాసెట్ నీ దగ్గర ఉన్నదట గదా. జర సూద్దామనొచ్చిన. లోపలెవరన్న ఉన్నరా?” అని ఆటోల కూసోనే డిష్ దిక్కు జూసిండు. “అమ్మతోడన్న ఆంటీ క్యాసెట్ ముచ్చట్నే నాకు తెల్వదు. ఎవడో సాలె గాడు ఉత్తగనే పుకార్ లేపిండన్న” అని నెత్తి మీద చెయ్యి పెట్టుకుని మతిన్ ప్రమాణం జేసిండు. “మాక్యెలౌడే…ఎట్ల కనిపిస్తాన్రా? హౌలే గాన్ననుకుంటానావా? డిష్ ల కూసోని నువ్వు జేసే బాగోతాలన్నీ ఎర్కేరా నాకు…కింద సొర్రగొట్టి మెడ దాక చీర్త బాడ్కావ్ ఏమనుకుంటున్నవో” అని ప్యాంట్ జేబుల్నుంచి బటన్ చాకు తీసి వడ్ల రవి పటపటమని పండ్లు కొరికిండు. రెండు మర్డర్ కేసులున్నయ్ రవి మీద! బటన్ చాక్ను జూడంగనే మతిన్ కు కాల్చేతులల్ల వణుకు మొదలైంది. నోట్లున్న గుట్కను ఊంచినంక వడ్ల రవి “నేనిప్పుడు గూడెం గుట్టకు పోతానా. ఎల్లుండి లక్షెటిపేటల పేషి చూస్కోనొస్త. నేనొచ్చేసరికి క్యాసెట్ రెడీ గుండాలె. లేకుంటెనా… తెల్సు కదా బిడ్డా నా సంగతి. కిర్మిలేశిందంటే కిరాక్ గాన్ని. చల్ బోష్డికే దిగు” అని మెడల్వట్టి మతిన్ ను కిందికి నూకిండు. కట్ల సంపత్ ఆటో స్టార్ట్ చేసి ఆన్నించి తీస్కపోయిండు. డిష్ ఎనక సంది నుంచి రమేష్, శ్రీనివాస్ రెడ్డి, మధు బయటికొచ్చిల్లు.

“ఏమంటాండ్రా ఆడు” రమేష్ అడిగిండు.

“ఆనిగ్గూడ పుష్ప ఆంటీ క్యాసెట్ కావాల్నంట” శ్రీనివాస్ రెడ్డిని సూసి మెడలిర్సుకున్నడు మతిన్.

“ఆడసలే మంచోడు గాదు. ఆ క్యాసెట్ గిన ఉంటె ఇయ్యరాదయ్య లొల్లొడ్శిపోతది” అని శ్రీనివాస్ రెడ్డి మెంతాల్ సిగ్రెట్ ముట్టిచ్చిండు. “అరే…చెప్తుంటే అర్థమయితలేదావయ్య మీకు? అసలా క్యాసెటే నా దగ్గర లేదు. లేందాన్ని ఏడ్నుంచి తీస్కరావాలె” అనుకుంట మతిన్ డిష్ లోపలికి పోయిండు. ఎనకపొంటే ఆ ముగ్గురొచ్చిన్రు. “ఐదైతాంది. నేనింటికి పోతాన. నువ్వు గూడ షటరేసి ఇంత తిని రాపో. రాత్రి కరెంట్ ట్రిప్పయితాంది. ఎవలన్నొకలు డిష్ లుండాలె” అని జెప్పి రమేష్ ఎల్లిపోయిండు. క్యాన్ల మిగిలిన మడ్డిని ముగ్గురు నపరింత తాగి ఎటోల్లటుపోయిల్లు.

………..

తిననీకి ఇంటికి వోయిన మతిన్ రాత్రి తొమ్మిదింటికి డిష్ కొచ్చిండు. వార్తల్లేకపోయేసరికి తొమ్మిదిన్నరకు కొత్తగ రిలీజైన “చాలా బాగుంది” సినిమా పైరసీ ప్రింట్ సీడీ ఏసిండు. ఇంతల్నే ఎనక రూం తలుపును ఎవరో కొట్టిన్రు…గీ టైంల ఎవరొచ్చిల్లని ఆలోచించుకుంట మతిన్

“ఎవరూ…” అన్నడు.

“నేన్రా గణేషన్నను. తలుపు తీ రా” నాలుక మర్లబడుతుంటే బల్మీటికి మాట బయటికొచ్చింది.

“నువ్వేందన్న ముందటికెల్లి రావొచ్చుగదా?”

“ఎట్నుంచి వస్తేందిరా? నువ్వైతే తలుపు తీసినవ్ కదా?” అనుకుంట గణేష్ లోపల్కొచ్చిండు. ఫుల్ డిచ్ లున్నడు. చేతిల రెండు ఖజురహో బీర్లున్నయ్. ఇద్దరు కల్సి ముందటి రూంల కూసోని బీర్లు ఓపెన్ జేసిన్రు. ఓ బుక్క తాగినంక గణేష్ “అరే ఈ డిష్ ల నిన్ను పనికి పెట్టిచ్చినోన్ని నేను. పోరడంతెట్లనో ఉన్నడని మల్లన్నంటే నేనే బతిమిలాడి ఇండ్ల పనికి పెట్టిచ్చిన” గణేష్ నోట్లకు ఇంకో బుక్క బీరు. “ఇప్పుడా ముచ్చటెందుకున్న. ఇండ్ల వెట్టించింది నువ్వే. ఎన్నడన్న కాదన్ననా?” మతిన్ బీర్లేపిండు. “మరట్లయితే పుష్పాంటీ క్యాసెట్ నాక్సూపియ్యకుండ గా మీ బావ శ్రీధర్ గానికి ఎందుక్సూపిచ్చినవు?” ఎంటనే గణేష్ అందుకున్నడు. ఆ మాటినంగనే మతిన్ బిర్తాగుడు ఆపి “ఛీ…నీ అవ్వ. నువ్వుగూడ  గదే ముచ్చట తీసినవా?” అన్నడు. “అరేయ్ ఆ శ్రీధర్ గాడు నువ్వు బచ్పన్  దోస్తులు కావొచ్చు. కాని నా ముందటాడు బచ్చగాడు. నమస్తే అన్నా… అనుకుంట మా ఇంటికొచ్చేది. ఇప్పడు గూడ నన్ను సూస్తే ఆనికి ఉచ్చ వడ్తదనుకో. అసొంటోంనికి నువ్వు పుష్పాంటీ క్యాసెట్ సూయిచ్చినవు. ఇగాడు ఆగుతడా చెప్పు? నా ఇజ్జత్ మొత్తం ఏడుకాండ్ల మోరిల కలిపినవ్రా థూ…” అని బీరెత్తిండు. మొత్తం ఓడగొట్టినంకనే దించిండు.

బీరు సీసా కింద పెట్టి తలకాయపట్టుకున్నడు మతిన్. “నీ అవ్వ ఏందన్న నాకీ కుక్క గొల్లిర్కం. ఎవ్వడు జూడు ఇదే ముచ్చట. వడ్ల రవిగాడైతే ఈడికే వొచ్చి కచ్చా డాగ్ ఏసి పోయిండు. ఆ మొద్దు ప్రసాద్ గాడు జేయబట్టి ఊరంత టామ్ టామయింది. ఈ దసరకు ఆన్ని పొడ్సి పారెస్తె కేసుగూడ ఉండది పో” అని గణేష్ కెల్లి సూసిండు. గుర్రుకొడుతున్నడు.

…………

“చాలా బాగుంది” సిన్మా క్లైమాక్స్ కొచ్చింది. ఎవరో షట్టర్ కొట్టిన్రు. మళ్లేం పంచాయిత్రా అనుకుంట మతిన్ షట్టర్ దెర్శిండు. ఎదురంగ గన్ మెన్ ప్రభాకర్…ఎనకపొంటి కమాండర్ జీబుల నలుగురు కానిస్టేబులున్నరు. మతిన్ గల్లవట్టి బయటకు గుంజి జీబులెక్కించిండు ప్రభాకర్. రామన్ కాలనీ బోర్డ్ కాడ్కొచ్చేదాక నపరొక దెబ్బ ఏస్తనే ఉన్నరు. మతిన్ కు మ్యాటర్ అర్థమైంది. కుయ్యిమనకుండ కూసున్నడు. కొద్దిసేపైనంక ప్రభాకర్ “అరె పోడ. రేపీటైంకు ఆ క్యాసెట్ నా చేతిలుండాలే. లేదనుకో బిడ్డా…బీఎఫ్ క్యాసెట్లు కిరాయికిస్తానవని బట్టలిప్పి కొట్టుకుంట పోలీస్ స్టేషన్కు తీస్కపోత” అని మతిన్ ను జీబుల్నుంచి దొబ్బేసిండు. జీబు మార్కెట్ దిక్కువోయింది. మతిన్ డిష్ దిక్కు నడిశిండు. ఓ దిక్కు వడ్ల రవిగాని టెన్షనే అనుకుంటే ఇప్పుడు పోలీసోళ్లు మిండగాళ్ల లెక్క మోపైన్రనుకున్నడు.

“ఏదో ఒకటి జేసి ఈ గండం నుంచి బైటపడాలే. పొద్దున్నే జాకీర్ భాయ్ కు చెప్పాలే. ఈళ్లందర్కి కరెక్ట్ మొగుడు అన్ననే” అని అనుకున్నడు మతిన్. డిష్ ఎనక రూంలకు పొయి పన్నడు.

……………

“మల్లన్నకెందుకన్న? జాకీర్ భాయ్ కు చెప్తె సరిపోదా? పోలీసోళ్లు, ఆ వడ్ల రవిగాడు జాకీర్ భాయ్ కే భయపడ్తరు” బిస్తర్ల పండుకుని గణేష్ తోని మతిన్ మాట్లాడుతున్నడు. “అరే హౌలెగా. ఈ డిష్ ఓనర్ మల్లన్నేరా! మర్శిపోయినవా ఏందీ? రేపీ లొల్లేమన్న పెద్దగైతే ముందట పడేది మల్లన్ననే యాదుంచుకో…అందుకే ముందు మల్లన్నకు చెప్పు. అటెంక జాకీర్ భాయ్ కు చెప్తువు లే”

మందు దిగినంక గణేష్ ఇక్మత్ గ మాట్లాడిండు. ఈ ముచ్చటేందో మంచిగనే ఉందనిపిచ్చి బిస్తర్లకెల్లి లేశి ల్యాండ్ ఫోన్ ల నెంబర్ డయల్ జేసిండు.

“వదిన నేను మతిన్ ను. అన్న లేడా?”

“ఇగో…ఇస్తానుండు…”

“అన్న నమస్తే…”

“ఏమైంది మతిన్ ఇంత పొద్దటి పూట ఫోన్జేసినవ్? డిష్ ల కరంటేమన్న పోయిందా?”

“లేదన్న కరంటుంది. చిన్న ఇష్యూ అయింది. నీకు చెప్పాలని ఫోన్జేసిన” అని జరిగిందంత చెప్పిండు. అరగంటైనంక మల్లన్న డిష్ కాడ్కొచ్చిండు. కుర్చీల కూసున్నడు. ముందట స్టూల్మీద మతిన్ కూసున్నడు. బల్ల జరుపుకుని గణేష్  కూసున్నడు.

“వడ్ల రవి గాని బావ మా సడ్డకుని పాలోడే. నేను మాట్లాడిపిత్తలే. వాడ్నీ జోలికి రాకుండ చూస్త. ఇంగా ప్రభాకర్ గాని సంగతి జాకీర్ భాయ్ కు చెబ్దాం. రాత్రి గట్టిగనే కొట్టిల్లా” అని మతిన్ ముఖం పట్టుకుని జూసిండు.

“నాలుగైదు దెబ్బలు గట్టిగనేసిన్రన్నా సాలేగాల్లు. ఏడ దొర్కరా ఏంది? అప్పుడు జూస్కుంట.” కుర్శిల్లుంచి లేశి మల్లన్న బయటికొచ్చిండు. ఎనకపొంటే మతినొచ్చిండు. గణేష్ లోపల్నే ఆగిండు. సుజుకి సమురాయ్ సైడ్ స్టాండ్ తీసి కిక్ కొట్టి మతిన్ ను సూస్కుంట మల్లన్న “ఓ మాట చెప్తిను తమ్మీ…ఆ క్యాసెట్ నాకియ్యి. నీ జోలికి ఎవ్వల్రాకుంట సూస్త. పుష్ఫ ఆంటీ క్యాసెట్ అంటే మీ పిల్లగాళ్ల ఆట కాదు. నీకు అస్సల్ ముచ్చట తెల్వదు. పెద్ద పెద్దోళ్లున్నరు అండ్ల. ఖతర్నాక్ యవ్వారమది. మీ నాయన సచ్చిపోయిండు. ఇంటికి నువ్వే పెద్దోనివి. అవ్వను, తమ్మున్ని, చెల్లెను సూస్కోవాలే. నా మాటిను. క్యాసెట్ తీస్కచ్చియ్యి” అని చెప్పి బండేసుకుని పోయిండు. మల్లన్న సుజుకి పోతుంటె ముందు నుంచి బజాజ్ కబ్ మీద రంజిత్…బండి మీద్నుంచే మల్లన్నకు నమస్తే పెట్టిండు.

డిష్ కాడ్కొచ్చి మతిన్ తోని…“దా బండెక్కు” అన్నడు. ఏం మాట్లాడకుండ చెప్పులేసుకుని మతిన్ బండెక్కిండు. రంజిత్ జబ్బకున్న కెమెరా తీస్కొని పట్టుకున్నడు. కబ్ కదిలింది. సీఈఆర్ క్లబ్ వచ్చేదాక రంజిత్ కొత్తగ తీస్కున్న నోకియా బండ ఫోన్ల ఎవల్తోనో మాట్లాడిండు. కమ్యూనిటీ హాల్ దాట్తాంటే రంజిత్ “ఏమో కథల్వడుతున్నవట ఏంది సంగతి?” అన్నడు. మతిన్ కు మండింది. “ఇగో రంజిత్, ఎక్కువతక్కువ మాట్లాడ్తే ఇన్నే బండి దిగివోత” అన్నడు. “మాట్లాడగని సక్కగ కూసో” అన్నడు రంజిత్. బండి పాలచెట్టు ఏరియాకొచ్చింది. అక్కడ ఏఐటీయూసి వాళ్లదేదో ప్రోగ్రాం అయితుంటే మతిన్ వీడియో తీసిండు. రాత్రికి వార్తలల్ల ఎయ్యనీకి. అది అయిపొయినంక మతిన్ ను డిష్ కాడ దించిండు. నరేశ్ మిక్సింగ్ యూనిటోళ్లు క్యాసెట్ పంపిస్తరు. తీసిన ప్రోగ్రాంను అండ్ల రికార్డ్ చేసియ్యమని చెప్పినంక రంజిత్ “ఎన్ని రోజులు దాస్తవో నేన్గూడ జూస్త” అని నవ్వుకుంట విద్యావిహార్ స్కూల్ ముందు నుంచి బస్టాండ్ దిక్కు పోయిండు. డిష్ ల సొచ్చిన మతిన్ కు కుర్సిల కూసోనున్న…టిఫిన్ సెంటర్ శ్రీధర్ కనిపిచ్చిండు. శ్రీధర్ని సూడంగనే…ఎడమ కాలు చెప్పుదీసి మతిన్ ఇసిరేసిండు. శ్రీధర్ చేతులడ్డం బెట్టిండు. అయినా చెప్పొచ్చి డొక్కల తాకింది. కొట్టనీకి ఇంకో చెప్పు దీస్తుంటే మతిన్ ను గట్టిగ పట్టుకున్న శ్రీధర్ “అరే బామ్మర్ధి. ఏమైంద్రా? నేనేం జేసిన్రా? ఎందుకు కొడ్తానవ్?” అన్నడు.

“చేసిందంత జేసి ఏం తెల్వనట్టు డ్రామాలాడుతానవారా? మనమిద్దరం పుష్ప ఆంటీ క్యాసెట్ జూసినమని మొద్దు ప్రసాద్ గాన్కి చెప్పినవట. వాడేమో ఊరంత డప్పు గొట్టిండు. మనెప్పుడు జూసినం రా? నిన్నటి సంది మొసమర్రనిస్తలేర్రా నాకు” మతిన్ ఈ మాటనేసరికి శ్రీధర్

“సాయి రాం మీదొట్టురా. నేనైతే గా ముచ్చట్నే చెప్పలేదు. నీ దగ్గరా క్యాసెటుందని ఇంతకుముందే తెల్సేసరికి అడుగుదామనొచ్చిన” అని మతిన్ ను ఇడ్సిపెట్టిండు. జబ్బకున్న కెమెరా తీసి ర్యాక్ ల పెట్టుకుంట మతిన్ “ఊకో బావ, నువ్వుగూడ నమ్ముతానవారా? నా దగ్గరేడుందిరా క్యాసెట్. ఉంటె నీకు తెల్వకుండ దాత్తనారా? ఆ మొద్దు ప్రసాద్ గాడు లేపిండ్రా ఈ పుకార్ని. అయినా ఓ ఆడిమన్షి గురించి అసొంటి మాటలు ఎట్ల అనబుద్దయితదిరా. పాపం పుష్ప ఆంటీ మంచిద్రా! ఎవడో బేకార్ గాడు ఉత్తగనే ఆంటీ క్యాసెటుందని గత్తరలేపిండు. అప్పటిసంది అందరు ఆంటీని అంతెట్లనో జూస్తున్నరట. ఓ సారి నాకు చెప్పుకుని బాధపడ్డద్రా.” కుర్సీల కూలబడ్డడు.

“అంటిప్పుడు… పుష్ప ఆంటీ క్యాసెట్ లేదు. నువ్వు సూడలేదంటవ్. అంతేనారా బామ్మర్థి?” శ్రీధర్ కారాడ్డమాడిండు. “ఏమో బావ ఆ క్యాసెట్ ముచ్చట దేవునికే తెల్వాలే. ఒకవేళ ఆంటీ క్యాసెట్ ఏడన్న దొర్కినా…నేనైతే సూడరా? నీ మీదొట్టు.” అని లేశి శ్రీధర్ నెత్తి మీద చెయ్యివెట్టిండు. మతిన్ చెయ్యి తీస్కుంట “దెంగేయ్ బే. దొంగొట్లు ఎయ్యనీకి నేనే దొర్కిన్నారా! క్యాసెట్ నీ దగ్గరుందేమో రాత్రికి తాక్కుంట సూద్దామనుకున్న. లేదన్నంక ఇక్కడింకేం పని” అని లేశి శ్రీధర్ ఎల్లిపోయిండు.

కొద్దిసేపటికి నరేశ్ మిక్సింగ్ యూనిట్ పిలగాడొచ్చి మతిన్ కు ఓ క్యాసెటిచ్చిండు. “ఇండ్లో పాత పెళ్లి ప్రోగ్రాముంది. దాన్మీదనే రికార్డ్ చెయ్యన్నా. చిన్న పనుంది సూస్కోనొస్త” అని పోయిండు. ఆ పిలగాడు తెచ్చిన క్యాసెట్ ను వీసీఆర్ లేసిండు మతిన్. మొత్తం రివర్స్ చేసిండు. పెళ్లి క్యాసెట్ ఎవల్దో సూద్దామని ప్లే చేసిండు. పెళ్లి కూతురు మంచిగుండే సరికి ఫార్వర్డ్ జేసుకుంట చూసిండు. అరగంటైనంక వేరే ఏదో వచ్చింది. దాన్ని సూడంగనే మతిన్ ఫీజులు ఎగిరిపొయినయి. క్యాసెట్ ల పుష్ప ఆంటీ… ఆమె మీద పండుకుని ఎవరో అంకుల్… ఆన్ని ఎక్కన్నో సూసినట్టున్నదని స్టిల్ బటనొత్తిండు… దగ్గర్కివోయి జూసిండు. మతిన్ ముఖంల నవ్వు.

…………………..

మాపటీలి మూడింటికి నరేశ్ మిక్సింగ్ యూనిట్ ఓనర్ కనకయ్య మొసపోసుకుంట డిష్కొచ్చిండు. ఎంటీవీల హిందీ పాటలు సూస్కుంటున్న మతిన్, కనకయ్యను సూడంగనే నమస్తే పెట్టిండు.

“అన్న ఇప్పుడే వస్తనని మీవోడు రానే రాలేదు. ఇంకొంచెం సేపు జూసి నీకే ఫోన్ జేద్దామనుకున్న. ఇంతల్నే నువ్వొచ్చినవ్” అని క్యాసెట్ తీసి చేతుల పెట్టిండు. దాన్ని సూస్కుంట కనకయ్య “దీంట్లనే మొత్తం రికార్డ్ జేసినవా తమ్మీ…” అని కోపాన్ని, బాధను కనిపియ్యకుండ అడిగిండు.

“అవునన్న. మొత్తం చెయ్యిమన్నవట కదా? అందుకే రివర్స్ చేసి ఫస్ట్ కాన్నించి రికార్డ్ పెట్టిన. రెండు గంటలుందన్న ప్రోగ్రాం. ఏమైందన్నా… అట్ల జూస్తున్నవు?”

“ఏం లేదు తమ్మీ. ఇండ్ల ఓ పెండ్లి ప్రోగ్రాముండే. పైసలియ్యలేదని ఇన్ని రోజులు మిక్సింగ్ జెయ్యలేదు. పొద్దున్నే వాళ్లు పైసల్ తెచ్చిచ్చిన్రు. క్యాసెట్ కోసం ఎన్కులాడితె ఈడికి పంపించినట్టు తెల్సింది. అందుకే దబదబ నేనే వొచ్చిన. కాని లాభం లేకపాయె.” అని మతిన్ ను జూసుకుంట కనకయ్య

“నీకు బొంకూరి సమ్మయ్య తెల్సుగదా తమ్మీ. ఆయన పెద్ద బిడ్డ పెండ్లి క్యాసెటే ఇది. జర్ర నువ్వన్న జూసి నాకో ఫోన్ కొడ్తే అయిపోయేది” ఏదో తెల్సుకుందామని అడిగిండు కనకయ్య. “అరే… అట్లనా అన్న. ఎంత పనాయే! మీవోడేమో రివర్స్ చేసి ఫస్ట్ కాన్నుంచి రికార్డ్ వెట్టమన్నడు. నేనట్లనే జేసిన” అన్నడు మతిన్. కాని కనకయ్యకు నమ్మబుద్ది కాలేదు. మతిన్ ను అనుమానంగ సూస్కుంటనే ఆడ్నించి ఎల్లిపోయిండు. కొద్దిసేపైనంక ఇంటికి పోదామని షట్టరేస్తుంటే లోపల ల్యాండ్ ఫోన్ రింగైంది. షట్టర్ లేపి ఫోన్ కాడ్కొచ్చేసరికి రింగ్ బందైంది. మళ్లా షట్టర్ మూస్తుంటే రింగైంది. లోపలికొచ్చి మతిన్ ఫోన్ ఎత్తిండు.

“హలో…ఎవరు?”

“నేను గోవర్ధన్”

“అన్నన్న…నమస్తే నేను మతిన్నన్న. నువ్వేందన్న గిప్పుడు ఫోన్జేసినవ్. జాకీర్ భాయ్ ఇంక రాలేదు. సాయంత్రం వార్తల టైంకొస్తడు. ఏమన్న చెప్పాల్నా?” మతిన్ మాట్లాడుకుంట పోతనే ఉన్నడు. కొద్దిసేపయినంక అటుదిక్కు నుంచి “నీ కోసమే ఫోన్జేసిన తమ్మి, అంత మంచిదేనా? మీ నాయిన పట్టు పైసలేమో ఇంకా రాలేదంట. వెల్ఫేర్ ఆఫీసర్ తోని నేనేమన్న మాట్లాడాల్నా?”

“అవునన్న హైదరాబాద్ సిఎంపీఎఫ్ ఆఫీస్ ల మస్తు సతాయిస్తున్నరన్న. నువ్వోమాట చెప్తే పైసలొస్తయన్న.”

“అదెంత పని తమ్మి. నీకెన్నోసార్ల చెప్పిన. ఏమన్న అవసరం ఉంటే చెప్పు తమ్మీ అని. నువ్వేమో నాతోని సక్కగ కల్వనే కల్వవు. ఎప్పుడుజూడు జాకీర్ భాయ్ తోక వట్టుకునే తిర్గుతవు. ఆయనతోని తిర్గుతే ఏమస్తది. ఆయన తినడు. ఎవన్ని తిననియ్యడు…”

“అదేం లేదన్న…”

“సరేగని ఓ సంగతడుగుత చెప్పు. నీ దగ్గర పుష్ప కాసిట్ ఉందట నిజమేనా?”

“అన్న గీ పాల్తూ ముచ్చట నీ దాకొచ్చిందా? ఎవడో సాలెగాడు క్యాసెట్ నా దగ్గరుందని పుకార్ లేపిండు. అవ్వ తోడన్న నాకా క్యాసెట్ సంగతే ఎర్కలేదు”

“సరే లే తమ్మీ, నీ గురించి నాకు తెల్వదా? నీ దగ్గరుంటే నాకు జెప్పకుండ దాస్తవా ఏందీ? కాని తమ్మి ఎవ్వడు సూడు ఊర్ల నీ పేరే చెప్తాల్లు. జర్ర పైలంగుండు. అసలే దానెనకాల గలీజ్ గాళ్లున్నరట. పాణం మీదికి తెచ్చుకోకు” నోట్ల బెల్లం బెట్టుకుని కచ్చా డాగ్ ఏసిండు గోవర్దన్.

“అన్న” మతిన్ నీళ్లు నమిలిండు.

“సరే తమ్మి అసొంటిదేమన్నుంటే చెప్పు. మా బక్కోన్ని డిష్ కాడ్కి పంపిస్త” అని గోవర్ధన్ ఫోన్ పెట్టేసిండు. ఏదో కొత్త విషయం తెల్సినట్టు మతిన్ సంబరపడ్డడు. ఇంటికి వోయిండు. సాయంత్రం ఆరింటికి మళ్లొచ్చిండు. వార్తలు రాయనీకొచ్చిన జాకీర్ భాయ్ కు జర్గిందంత చెప్పిండు. డిష్ ల నుంచే సిఐకి ఫోన్జేసి ప్రభాకర్ కు జాకీర్ భాయ్ వార్నింగిప్పిచ్చిండు. కాంప్రమైజ్ కోసం వడ్ల రవిని ఇంటికి పిల్శి మల్లన్న దావతిచ్చిండు. క్యాసెట్ గండం నుంచి మతిన్ బైటవడ్డడు.

………….

రాత్రి పన్నెండింటికి డిష్ ల మతిన్ ఒక్కడే ఉన్నడు. అప్పుడే…ఎన్క దర్వాజల నుంచి ఎవరో లోపలి కొచ్చిల్లు. కుర్చీల కూసోని టీవీ జూస్తున్న మతిన్ ముందుకు పోయి “అరే బామ్మర్ది, ఏమైంద్రా? అర్జెంట్ గ రమ్మన్నవ్? బీర్లు గూడ పట్కరమన్నవు ఏంది ముచ్చట?” అని ఇంకో కుర్చీల శ్రీధర్ కూసున్నడు. ఏం మాట్లాడకుండ కుర్చీల్నుంచి లేశిన మతిన్…వీసీపీల క్యాసెటేసిండు. శ్రీధర్ చేతులున్న కవర్ల నుంచి ఓ బీరు తీస్కొని కుర్చీల కూసున్నడు. పండ్లతోనే బీరు మూత తీస్కుంట

“బావ… ఈ క్యాసెట్లున్నోళ్లను ఎక్కన్నో చూసినట్టుంద్రా…జర నువ్వేమన్న గుర్తువడ్తవేమోనని పిల్శిన!” అని రిమోట్తోని క్యాసెట్ ప్లే జేసిండు. కొత్త అకాయ్ టీవీల రంగుల్మారినయి. శ్రీధర్ కు చెమటల్పట్టినయి. నోరు తెర్శి “పుష్ప ఆంటీ… అరేయ్… మన పుష్ప ఆంటీరా ఇది…ఆడు…సురేందర్ గాడ్రా! మన ఎమ్మెల్యే సురేందర్ గాడ్రా ఈడు” అని మతిన్ చేతులున్న బీరు తీస్కోని గప్పగప్ప తాగిండు.

“అరే బావ… ఎవడోగని సురేందర్ గాన్కి తెల్వకుండ ఈ బాగోతాన్ని రికార్డ్ జేసిన్రా…ఆ కనకయ్య గాని హ్యాండ్ ఉందనుకుంట్రా ఇండ్ల. అందుకే మాపటీలి ఆడు డిష్కొచ్చిండు. అయితే నాకో విషయం అర్థం గాలేద్రా. ఆడెల్లిపోయిన పదినిమిషాలకే…సురేందర్ గాని తమ్ముడు గోవర్ధన్ గాడు ఫోన్జేసి క్యాసెట్ విషయం అడిగిండ్రా…” అని ఇంకో బీరు మూత తీసి మతిన్ నోట్లపెట్టుకున్నడు.

“అంటే సురేందర్ గాన్ని బ్లాక్ మేయిల్ జేయ్యనీకే ఇదంత జేసిల్లంటవారా?” అని శ్రీధర్ టీవీ దిక్కు సూసిండు.

“కావొచ్చు. కాకపోవచ్చు. అయినా మనకెందుకదంత. ఈ క్యాసెట్ బంగారు బాతు లాంటిది రా. కొంచెం డేర్ జేస్తే…ఈ క్యాసెట్తోని మన దరిద్రమంత పోతది రా” అని లేశి వీసీపీలున్న క్యాసెట్ ను మతిన్ ఎజెక్ట్ జేసిండు.

“దరిద్రం పోతదో లేదో గని…మన బద్దల్ బాషింగాలవుడు మాత్రం గ్యారంటీ” అన్నడు  శ్రీధర్.

“ఉత్తగనే భయపడ్తవేందిరా” అనుకుంట ల్యాండ్ ఫోన్ నుంచి ఏదో నెంబర్ డయల్జేసిండు మతిన్.

*

 

ఎమోషనల్ బరువు మోపకుండా సరదాగా …చంద్ర కన్నెగంటి

ఒక వీడియో కేసెట్ చుట్టూ తిరిగే ఈ కథ కథల్లో సాధారణంగా కనిపించనన్ని పాత్రలతో  చక చకా నడుస్తుంది. పాత్రల మంచి చెడ్డల బేరీజులూ, పాఠకులకు పాఠాలూ, కనువిప్పు కలిగించడమూ వంటి బరువులు మోయకుండా, పాఠకులపై ఎమోషనల్ బరువు మోపకుండా సరదాగా సాగే కథలు అరుదుగా వస్తున్నాయి. అలా ఉంటూనే ఆ జీవితాలకు మెరుగులు దిద్దకుండానే, మన ఆశలు పులమకుండానే చూపుతూంది ఈ కథ.
సరదాగా కనిపిస్తున్నా కథలో హాస్యంతో పాటు నేరమూ ఉంది. వాళ్ల ఆలోచనలూ, పరిధులూ అవీ. అది అలా ఉంది, ఉంటుంది. ఆ పైన పాఠకుడి ఆలోచన కొనసాగుతుందా?
మూస పాత్రలని తెలుస్తూనే ఉన్నప్పటికీ కథ నడిచే వడిలో పెద్దగా పట్టించుకోము. అయితే ఇది కథగా కంటే ఒక షార్ట్ ఫిల్మ్ గా రాణిస్తుందనిపిస్తుంది.
*

యాకుబ్ అలీ

నా పేరు సయ్యద్ యాకుబ్ అలీ. మాది మంచిర్యాల జిల్లా మందమర్రి ( కోల్ బెల్ట్ ఏరియా ). హెచ్.ఎం.టీవీ లో సబ్ ఎడిటర్ గా జర్నలిజంలోకి వచ్చాను. ఆ తరువాత టీ న్యూస్, వీసీక్స్ లో పనిచేశాను. 2014 నుంచి మిషన్ భగీరథలో పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ గా పనిచేస్తున్నాను. మీడియాలో పనిచేస్తున్నప్పటి నుంచి కథలు రాయడం అలవాటు. చిన్న చిన్న కథలు రాసి ఫ్రెండ్స్ గ్రూప్ లలో షేర్ చేసేవాడిని. 2009 సెప్టెంబర్ లో నేను రాసిన “చిచ్చా” నమస్తే తెలంగాణ సండే బుక్ లో పబ్లిష్ అయింది. ఇటీవలే విడుదలైన జార్జ్ రెడ్డి సినిమాకు కథా సహకారం కూడా అందించాను.

4 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • ఇది షార్ట్ ఫిల్మ్ స్క్రిప్ట్ లా.వుంది కానీ కథలా లేదు. పాత్రల సహజత్వం కోసం బూతు పదాలు వాడా రే మో గాని, సారంగ లో ప్రచురించ దగ్గ కథలా అనిపించలేదు.పైగా ఇది వి.సి.ఆర్..
    సి.డి ల కాలం కూడా కాదు.ఆ స్థాయి. దా టి పొయింది. ఇది కథ గా ఎలా పురుడు పొసుకున్డొ అర్ధం కావడం లేదు.ఇలాంటి కథనాలను ప్రోత్సహించడం కూడా సరికాదని చెప్పుతున్నాన్డుకు మన్నించాలి.

  • వాయొరిజమ్ – లేని కాలం లేదు. కాలంతోబాటు అదీ కొత్త పుంతల్లో బయటపడుతూనే ఉంది. ఇంటర్నెట్ అరచేతిలోకొచ్చాక వాయొరిజమ్‌కి కమర్షియల్ రెక్కలొచ్చాయి. ఆగకుండా కథని చదివించిందే అది. చంద్ర కన్నెగంటి గారన్నట్లు ఈ పరిస్థితి మారదు. తెలంగాణా మాండలికంలో చదవడం కొంచెం ఇబ్బందనిపిస్తుండగా, మరి సర్కారు మాండలికంలో వచ్చే రచనలు చదవడానికి తెలంగాణా పాఠకులకీ ఇదే రకమైన ఇబ్బందులుంటాయని జ్ఞానోదయాన్ని కలిగించిందీ కథ. బూతులు ఇందులో లేకున్నా కథ నడకకి ఇబ్బందేమీ ఉండదు.

  • ఇదో తరహా కథనం… బహూశా అందరికీ జీర్ణం కాకపోవచ్చు… కొన్ని చోట్ల బూతు పదాలున్నాయనిపించినా ఆ పాత్రల స్థాయిలో సబబుగానే వున్నాయి. చంద్ర కన్నెగంటి గారన్నట్టు it would have been a successful short film rather than a story…

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు