పీర్ల పండగ

నికి పొయ్యొచ్చి ఇంట్లో పండుకున్యాడు హుసేను.

“పీర్ల సావిటి కాడికి పోదాం పాండి, గుద్దిలి బేచ్చానారంట” అనుకుంట పోతాన్నారు మనుషులు.

“మా…” అని వాళ్ళమ్మని పిలిచినాడు. పలకలేదు.

“యాటికి పోయిందిబ్బా అమ్మ” అనుకుంట అన్వేసు కి ఫోన్ చేసినాడు.

అన్వేసు, హుసేను నేస్తగాళ్ళు.

“లే అన్వేసూ, గుద్దిలి బేచ్చానారా ఈ రోజు?” అడిగినాడు హుసేను.

“ఔ లే, నాగ్గుడక తెల్దు. ఇప్పుడే చెప్పిరి.”

“యెట్లా మరి పోదామా?”

“లేదురా నాకు పనుంది.”

“సర్లే మళ్ళుంటా” అని చెప్పి ఫోన్ కట్ చేసినాడు .

పోదామా వద్దా అని ఆలోచించుకుంటా కుచ్చున్యాడు. చిన్నప్పుడే బాగుంటాండ్య. పీర్ల పండగంటే ఎంత హుషారుంటాండ్య. తప్పెట్లు కొడ్తానే జెజ్జనక్క అనుకుంట ఎగిరేది.

పీర్ల పండగ ఎప్పుడెప్పుడొస్తాదా అని ఎదురు చూసేది.

ఇప్పుడు పనికి పొయ్యొచ్చేది తిని పండుకున్నేది. నెల నా పొద్దుకు చీటీలు, వడ్డీలు కట్టల్ల. ఇదే సరిపోతాంది.

“ఇట్లాటివన్నీ మర్సిపొయ్యేకే గదరా పండగలొచ్చేది” అంది హుసేను వాళ్ళమ్మ లోపల నుండి.

ఆలోచించుకుంటాన్నా అనుకోని బయటికే మాట్లాడినానా అని తెలుసుకోని “మా… నేను పీర్ల సావిటి కాడికి పోతాన్నా” అని చెప్పి బయల్దేరినాడు హుసేను.

హుసేనుకి పీర్ల పండగంటే బలే ఇష్టము. పీర్ల పండగొక్కటే ఇష్టము. మిగతా అన్ని పండగలకి కొత్త బట్టలు కావల్ల. ఆడంబరాలెక్కువ. ఖర్చులు చానా అయితాయి. డబ్బులు కావల్ల. ఉన్నోళ్ళంతా చూపిచ్చుకుంట తిరుగుతాంటే చూస్తా నిలబడల్ల.

పీర్ల పండగయితే అట్ల కాదు. అదీ గాక ఈ పండగ అందరు కలిసి చేస్కుంటారు. కులాలు, మతాల ప్రస్తావనే రాదు. అందరూ కలుస్తారు.

గుండం దోగే రోజు నుండి పీర్లు ఏటికి పొయ్యే రోజు వరకు పండగున్నట్లే. అందుకే అంతిష్టం పీర్ల పండగంటే.

సావిడి కాడికి పోయినాడు. పిల్లోళ్ళు, పెద్దోళ్ళు, ముసిలోళ్ళు, అంతా వచ్చినారు.

దివిటీ ముట్టిచ్చి కందెన పోసినారు దాని మీద. ధగ ధగ ధగ మెరుస్తా మండుతాంది. దాన్ని చూస్తాంటేనే పీర్ల పండగ వచ్చేసింది అని తెలుస్తాంది. ఒక మనిషి దివిటీ క్రాసుగా పట్టుకోని నిలబడి ఉండాడు. ఆ మనిషి దగ్గరికి ఇంగో నలుగురొచ్చినారు. నడుసుకుంట పోతాన్నారు. వాళ్ళ యెనకాల ఇంగా చానా మంది జమైనారు.

వాళ్ళంతా పోతాన్నేది ఊరి పెద్ద మనిషి ఇంటికాడికి. ఆడికిపోయి ఆయన్ని పిల్చుకోని, సర్పంచ్ ఇంటి కాడికి, మళ్ళ వేరే వాళ్ళిద్దరు. అట్ల పెద్ద మనుషులు నలుగుర్ని పిల్చుకొచ్చినారు.

అందరు సావిట్లో కుచ్చోని కొంచేపు మాట్లాడుకున్యారు. గుండం కాటికొచ్చి చదివింపులు చేసి గుద్దిలి యేసినారు. కొంచేపటికి ఎవురి ఇండ్లకి వాళ్ళు పోయినారు.

ఇంటికొచ్చి పండుకున్యాడు హుసేను. పీర్ల పండగ అనేతలికే ప్రాణం లేచొచ్చినట్టు అనిపిస్తాంది. పొద్దున్నుండి పడినే కష్టమంతా యాడ పోయిందో!

చిన్నప్పుడు పీర్ల పండగొచ్చిందంటే బడి గుర్తుకి రాదు, ఇల్లు గుర్తుకి రాదు హుసేనుకి. పీర్ల కాడే ఉంటాడు. సావిడి కాడే తిరుగుతాడు, ఆడే పండుకుంటాడు. పీర్ల సవారికీ తీసినప్పుడు తప్పెట్లు కొడ్తాంటే అందరూ ఆ తప్పెట్లకి అనుగుణంగా ఎగురుతా ఉంటాడు.

ఇంటింటికీ పొయి బెల్లం తీస్కొచ్చి పానకం చేస్తారు. సబ్జా ఆకులేసి ఆ పానకం సావిడి కాడ పెడ్తారు.

ఇట్లా అన్నీ గుర్తుకొస్తాన్నాయి హుసేనుకి. రోజూ పనికి పొయ్యొచ్చేది, ఇంత తిని పండుకున్నేది. బోరు కొట్టింది. ఇంగ పండగయ్యేదంకా పిల్లోడైపోయినాడు.

మర్నాడు పొద్దన్నే మేస్త్రీకి ఫోన్ చేసి పండగైపోయేదాకా పనికి రానన్యాడు.

సావిడి కాడికి బయల్దేరినాడు. అగ్గి గుండంలో ఏసేకి మొద్దులు తీస్కొచ్చేకి ట్రాక్టర్ పోతాంటే ఎక్కి కుచ్చున్యాడు. సేన్లల్లో యాడ మొద్దులు కనపడితే అవన్నీ ట్రాక్టర్ ఎక్కిచ్చినారు. గుండం నిండేటన్ని దొరికినాయి.

ఒకరోజు కుచ్చోని పీర్లన్నీ కడిగినారు. తలతలా మెరిసిపొయ్యేదాకా కడిగినారు.

గుండం మండించే రోజొచ్చింది. తెచ్చిన్నే మొద్దులన్నీ ఏసి మండిచ్చినారు. మంట, ఏం మంట, రెండు మిద్దెల ఎత్తు మండుతాంది. ఉప్పు ఏస్తాంటే నిప్పు రవ్వలు ఎగుర్తాన్నాయి. పిల్లోళ్ళు మంట దగ్గరికి పోకుండా పెద్దోళ్ళు చూస్తాన్నారు.

పీర్లని సవారీకి తీస్కొచ్చే రోజొచ్చింది. దివిటీలు, తప్పెట్లు వచ్చినాయి. వరిగడ్డి మంటేసి తప్పెట్లకి శాకం చూపిస్తాన్నారు. మేళాలు కూడా వచ్చినాయి.

పీర్లన్నీ వచ్చి వరుసగ నిలబడినాయి. పిల్లోల్లంతా చుట్టుకున్యారు. ఆడోళ్ళు వాకిట్లల్లో నిలబడి చూస్తాన్నారు. కొంతమంది మిద్దెలెక్కి నిలబడినారు. సాయిబు చదివింపులు చేసేది అయిపోయింది. ఒక్కొక్క పీరు గుండంలో దిగి బయటికి వస్తాంటే కళ్ళు పెద్దవి చేస్కోని చూస్తానారంతా.

గుండంలో దిగేది అయిపొయినాక, వీధుల్లోకి బయల్దేరినాయి పీర్లు. చక్కెర, బెల్లం తీస్కొచ్చి చదివింపులు చేపిస్తాన్నారు. పీర్లెత్తుకున్న వాళ్ళ కాళ్ళకి బిందెలతో తెచ్చి నీళ్ళు పోస్తాన్నారు.

తప్పెట కొడ్తాంటే ఎగురుతాన్నారు. “మూడడుగులు కొట్టు”, “అయిదడుగులు కొట్టు”, “నేన్ చెప్పినట్లు కొట్టు” ఎవురో ఒకరు యాదో ఒకటి అడుగుతానే ఉన్నారు.

ఎగిరేటోళ్లు ఎగుర్తానే ఉన్నారు. కొంతమంది పీర్ల పక్కన నడుస్తాన్నారు.

హుసేనుని మాత్రం పట్టుకునేవాడే లేడు. తాగినోళ్ళ కంటే ఎక్కువ ఎగుర్తాన్నాడు. ఎగిరి ఎగిరి అల్సిపోయి బోరింగ్ కాటికి పోయి నీళ్ళు తాగొచ్చి మళ్ళీ ఎగురుతాన్నాడు.

“ఆ పిల్లోడు చూడు ఎట్ల ఎగురుతాన్నాడో”,

“తాగి ఎగిరేది ఎక్కువైపోతాంది ఈ నడమన”,

“ఎగెరిగిరి రాత్రికి నిద్రపోదామనేనా?”,

ఇట్ల ఒక్కొక్కరు ఒక్కోరకంగా అనుకుంటాండారు.

ఇవి యావీ హుసేనుకి తెల్దు. తన ఆనందం తనది.

పీర్లు ఏటికి పొయ్యే రోజొచ్చింది. ఆరోజు ఇంగా ఎక్కువ జనం, ఊరంతా జనం, ఊరు ఊరంతా కలిసి జరుపుకుంటాంది పండగ. పీర్ల పండగ.

ఊరంతా సవారీ అయిపొయినాక, ఏటికి తీస్కపోయినారు. పెన్నమ్మ ఒడిలో కుచ్చోని పీర్లన్నీ విడి విడిగా చేసినారు. బట్టలన్నీ మూట కట్టినారు. పీర్లన్నీ ఒక మూట కట్టినారు.

“అల్విదా…” అని పాడుకుంట వచ్చినారు.

పండగైపోయింది. పండగైపోయి రెండ్రోజులైపోయింది.

ఊరంతా మూగబోయినట్టు అనిపిస్తాంది హుసేనుకి. తన బతుకంతా మళ్ళా మామూలయిపోయింది. పనికి పోయి రావల్ల, తినల్ల, పనుకోవల్ల. ఒకటో తారీఖొస్తే చీటీలు, వడ్డీలు కట్టల్ల.

పనికి పొయ్యొచ్చి ఒక్కడే కుచ్చోని రోడ్లోకి చూస్కుంట ఆలోచిస్తాన్నాడు “మళ్ళ పీర్ల పండగ ఎప్పుడొస్తాదా?” అని.

*

 

షేక్ మొహమ్మద్ గౌస్

నా పేరు మొహమ్మద్ గౌస్. మాది తాడిపత్రి. బీ.టెక్ చేసి ప్రస్తుతం ఇన్ఫోసిస్ లో ఉద్యోగం చేస్తున్నాను. తెలుగంటే చిన్నప్పటి నుండి చాలా ఇష్టం. పుస్తకాలు ఎక్కువగా చదివేవాడిని. చలం, శ్రీశ్రీ రచనలు నన్ను ఎక్కువగా ప్రభావితం చేసాయి. నా చుట్టూ ఉన్న కథలు చెప్పాలనుకుని రాయడం మొదలు పెట్టాను.

7 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

 • కధ చాలా బాగుంది. మా ఊర్లో పీర్ల పండుగ (బరంపురం, ఒరిస్సా) ఎంతో బాగా జరిగేది. ఇప్పుడు ఆ పండగే చెయ్యటం లేదని తెలిసి చాలా బాధపడ్డాను.

 • పీర్ల పండగ జ్ఞాపకాలు
  పీర్లు తగ్గాయి
  పీర్ల పండుగ వాతావరణం పలుచన
  కథనం బావుంది

 • ధన్యవాదాలు.
  చాలా చోట్ల చేయటం తగ్గించేశారు 🙁

 • హత్తుకునేలా ఉంది హుసేన్ గారూ. కథనం పొడుగునా జీవితం తడి తడిగా తగుల్తూనే ఉంది. అభినందనలు

 • కథనం బాగుంది. ఇతివృత్తం తిరిగి పాత రోజుల్లోకి తీసుకెళ్లింది. కుల మతాలకతీతంగా, చిన్నా పెద్దా అందరమూ పాల్గొనేవాళ్లం. ఆ సందడి, పండుగ వాతావరణం అంతా ఓ కలలా అనిపిస్తోంది. రచయిత కు అభినందనలు. సారంగ కి ధన్యవాదాలు.

 • మా తాడిపత్రి ప్రాంతం నుండి బయలు దేరిన యువ కథకుడు షేక్ మొహమ్మద్ గౌస్ కు అభినందనలు . మంచి పదునైన కథలను ఆశిస్తూ….
  కే.సుభాషిణి

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు