పిల్లలకి ఫాంటసీ విత్ రియాలిటీ కావాలి

విజయవాడ ఆల్ ఇండియా రేడియో విశ్రాంత డైరెక్టర్ , ఎన్నో బాలల కార్యక్రమాలు నిర్వహించి వారికై ఎన్నో కథలు , పుస్తకాలు రచించిన ముంజులూరి కృష్ణ కుమారి గారితో ముఖాముఖీ.  సాహిత్య అకాడమీ ఇటీవల ప్రచురించిన బాలల కథల  పుస్తకం లో కూడా ఆమె కథ చోటు చేసుకుంది. వేదగిరి రాంబాబు బాల సాహిత్య పురస్కారం గ్రహీత మాటలలో

ప్ర : శుభ సాయంకాలం

కృ: చల్లని సాయంకాలం.(నవ్వు)

ప్ర : ముందుగా వెలగా వెంకటప్పయ్య గారి నేతృత్వం లో సాహిత్య అకాడమీ ప్రచురించిన బాలల కథల పుస్తకం లో మీ కథ రావడం చాలా ఆనందంగా ఉంది . అలాగే ఈ సంవత్సరం వేదగిరి రాంబాబు బాల సాహిత్య పురస్కారం అందుకున్నందుకు  మా అభినందనలు . ఈ అవకాశం తీసుకుని కొన్ని ప్రశ్నలు :

మీకు బాల సాహిత్యం రాయాలి అనే ఆలోచన ఎందుకు వచ్చింది ?

కృ: బాలా సాహిత్యం రాయాలి అనే ఆలోచన ముందుగా ఏమి లేదు . ఒక ఐడియా ఒకటి ఫ్లాష్ అయ్యింది . ఎక్కువగా కథలు చదువుతూ ,చూస్తూ ఉన్న సందర్భములో ఒక ఐడియా వచ్చింది . ఒక యంగ్ సైంటిస్టు ,అస్తమానం  జలుబు చేసే  సైంటిస్టు తనే ఒక మందు కనిపెడితే ఎలా ఉంటుంది అనే ఆలోచనతో మొదట రాంబాబు జలుబు మందు అని ఒక పుస్తకం  రాశాను . అదే నా మొదటి పుస్తకం. అది ఒక పోటీకి పంపాను కాని దానికి ప్రైజ్ రాలేదు. ఆ తరువాత నా ఉద్యోగం లో పిల్లల  కార్యక్రమాలు చేయవలసిన బాధ్యత అప్పగించబడింది . ఇది నాకు పిల్లలని దగ్గరగా చూసి ,వారి ఆలోచనలను గమనించే అవకాశం వచ్చింది . ఇది నేను తరువాత రాసిన పుస్తకాలకి చాలా ఉపయోగ పడింది. నేను విశాఖపట్నం లో అని చేస్తునప్పుడు నేషనల్ ప్రోగ్రామ్ కి  వారు పిల్లలకు కార్యక్రమాలు నిర్వర్తించడానికి నాలుగు కేంద్రాలు ఎన్నుకున్నారు . అందులో విశాఖపట్నం ఒకటి . అలాగా నేను ఆలోచించి కార్యక్రమాలు రూపొందించాను . అదే చిలక పలుకులు . ఈ కార్యక్రమములో ఆరు సంవత్సరాల వయస్సు పిల్లలతో ‘మాట ,ఆట ,పాట, కథ’ కలిపి , పిల్లలచేత , నేను anchor గా పెద్ద వారి పాటలు – రజనీ గారివి , ఇంకా ఇతర కవులవి పాటలతో ,కబుర్లతో కార్యక్రమం ఒక ఏడాది పాటు ప్రసారం చేశాము . దీని కోసమని అరకు, పాడేరు వంటి ప్రాంతాలకు వెళ్ళి అక్కడ పిల్లలతో చేశాను . దీనికి మంచి ప్రతి స్పందన వచ్చింది . నాలుగు రాష్ట్రాలలో చేసినా కార్యక్రమాల కంటే ఇది ఎక్కువ బాగుందని అధికారులు కూడా మెచ్చుకున్నారు. ఇందులో చేస్తున్నపుడు   వచ్చిన ఆలోచన తో తరువాత  కధ  అడవి తల్లి. ముఖ్యంగా పర్యావరణం రక్షణ పై ఎక్కువ కథలు వచ్చాయి. తరువాత రాసింది చిన్న పిట్టలు, పెద్ద మనసు. ఈ కథ నేషనల్ లెవెల్ లో ప్రైజ్ వచ్చింది . తరువాత డాక్టర్ కాకి ,ఏనుగు సాహసం , ఈ అడవి మాది అనే కథలు రాసాను. అన్నీ ముఖ్యంగా పర్యావరణం రక్షణ పైనే దృష్టి  పెట్టిన కథలు  .

ప్ర :పిల్లల కోసం రాయడం కష్టమా? వారికి అందేలా చేయడం కష్టమా ? మీ అభిప్రాయం .

కృ : పిల్లల కోసం రాయడం తేలికే కాని వారికి అందే, ఆసక్తి కలిగించే పుస్తకం చదివించడం కష్టం .

ప్ర : భాష పరంగా ఏమైనా ఇబ్బందులు మీకు ఎదురయ్యాయా? ఈ రోజుల్లో ఎక్కువ మంది పిల్లలు తెలుగు భాష అంత వచ్చిన వారు ఉండరు .

కృ : ఇది వరకు పిల్లలు  పాట ఇస్తే రాసుకుని పాడే వారు . ఎనభైలో ఉన్న పిల్లలతో పోలిస్తే మళ్లా నేను తొంభై తొమ్మిది లో పిల్లలు  దేవ నాగరి లిపిలో తెలుగు పాట రాసుకుని పాట పాడే పరిస్థితి వచ్చింది . అంటే ఇంగ్లీష్ మీడియం అంత ఎక్కువుగా ప్రచారం అయ్యింది .మున్సిపల్ స్కూల్స్ లో మాత్రం ఇంకా కొంచం తెలుగులో రాసుకోవడం ,చదవడం జరుగుతోంది . ఇటువంటి పరిస్థితిలో పిల్లలు  చేత చదివించాలి అనే ఆలోచన ఒకటి అంటే కష్టం. అందుకే వారే participate చేసే  నాటకాలు ,రూపకాలు, వారు  చెప్పే పొడుపు కథలు -అల్లా ప్లాన్ చేస్తూ ప్రోగ్రామ్ రూపొందించాల్సి వచ్చింది.

ప్ర: పిల్లల చేత ఇష్టంగా చదివించాలి అంటే ఏమి చేయాలి ?

కృ : నేను 2016 లో రిటైర్ అయ్యాక గ్రంథాలయ సర్వస్వం వారు కోసం నిర్వహించే కార్యక్రమాలలో ఒక టాపిక్ ఇచ్చి వ్యాసం రాయమని కాకుండా – ఒక పుస్తకం ఇచ్చి, అది చదివి దాని గురించి చెప్పమని అడిగాను . దానితో పిల్లవాడు తప్పకుండా పుస్తకం చదువుతాడు . అలాగే ఒక పదిమంది పిల్లలకి కథల పుస్తకాలు ఇచ్చి ఆ కథ సారాంశం వాళ్ళు చెప్పాలి . దీని వల్ల పిల్లలు ఎక్కువ పుస్తకాలు చదవడానికి అవకాశం వచ్చింది. మున్సిపల్ స్కూలు పిల్లలు ఇంకా తెలుగు బాగా చదువుతున్నారు . వారికి  పుస్తకాలు access లేకపోవడం సమస్య. కొంత మంది పిల్లలకి ఎక్సెస్ ఉన్నా వేరే వేరే అభిరుచులు -ఆటలు, పాటలు తో సమయం గడపడం ఒక కారణం .టి. వి , స్మార్ట్ ఫోన్ వచ్చాక పుస్తకాలు చదవడం తగ్గిందనే చెప్పాలి .

ప్ర : ఎన్ని కథలు  రాద్దామని అనుకుంటున్నారు ? గోల్ ఏదైనా పెట్టుకున్నారా ?

కృ : (నవ్వుతూ)నేనేమీ గోల్ పెట్టుకోలేదు . ‘రాంబాబు జలుబు మందు’ గురించి ఒక విషయం చెప్పాలి . ఒక సారి వేసవి లో ఎవరో పిల్లలకి వర్క్ షాప్ పెట్టారు . కథలు చెప్పడం . నేను ఆ సందర్భం లో ఈ కథ చెప్పాను . అక్కడ ఒక పిల్లవాడు ఈ పుస్తకం చదివాడు . వాడు ‘అది ముగింపు కల కింద కాకుండా ఉంటే బాగుండేది’ అన్నాడు . నేను ఎనభైలో రాసినప్పుడు పిల్లలు అంత స్మార్ట్ గా పోలీసులు ,విలన్ ని చంపడం అనేది పిల్లలకి అంత వీలుగా ఉండదని నేను ముగింపు అదంతా ఒక కలగా ముగించాను . ఈ ముప్పయి సంవత్సరాలలో పిల్లలు ఎంత అడ్వాన్స్‌డ్ గా ఆలోచిస్తున్నారా అనేది అర్థం అయ్యింది . అది ఒక ఫీడ్ బ్యాక్ . దీని తరువాత వీళ్లలో వచ్చిన మార్పులను బట్టి మనం కూడా కథ చెప్పే విషయం మార్చాలి అని తెలుసుకున్నాను . ఆ తరువాత తానా ఆరి కోసం రాసిన ‘బంటి -బన్నీ’ లో వారి ఆలోచన క్రమాన్ని రిఫ్లెక్ట్ చేయడానికి ప్రయత్నించాను . అది రాసిన తరువాత ఒక మున్సిపల్ స్కూల్ పిల్లలకి టీచ్ ఫర్ ఛేంజ్ వారితో పాటు వెళ్ళి పాఠం  చెప్పాను. వారికి ఆ కథ చెప్పాను . పుస్తకం కాని, వినడం కాని వారి వారి నేపధ్యం బట్టి కూడా వారి స్పందన వేరుగా ఉంటుందని మనం గ్రహించాలి . అందులో ఒక పిల్ల  అంది ,’నేను కుక్కపిల్లని తీసుకుని వెళ్ళాను , అదేమో అంటుల్లోకి వెళ్ళింది , మా అమ్మ నా వీపు బద్దలు కొట్టింది ‘. అంటే పేరెంట్స్ రియాక్షన్ ఒకేలా ఉంటుంది కాని పిల్లల ఫీడ్ బ్యాక్ వేరుగా ఉంటుంది . వారి సాంఘిక పరిస్థితులను బట్టి  పిల్లలలో ఆలోచనలు వేరుగా ఉంటాయి . కాని పిల్లలు అందరూ ఒక రకమైన అడ్వంచర్స్ చూడాలనే చూస్తారు.

ప్ర : పిల్లలకి ఫాంటసీ నచ్చుతోందా? రియాలిటీ నచ్చుతోందా?

కృ : ఫాంటసీ విత్ రియాలిటీ కావాలి పిల్లలకి . ఉట్టి ఫాంటసీ కన్నా కొంత రియాలిటీ ఉంటే ఎక్కువ ఆనందిస్తారు. ఆ పిల్లవాడికి కథ కల గా ఉండడం నచ్చలేదు . అంటే వాడికి రియాలిటీ కావాలి. కాని  కొంత అడ్వంచర్స్ కావాలి . నేను ఒకసారి పిల్లలకు కథలు చెప్పేటప్పుడు ఒక సారి పిల్లలకి ఒక కథ లైన్ ఇచ్చి వారినే కథ చెప్పమంటాను . ‘మీరు స్కూల్ అయిపోయి బస్ స్టాప్ లో ఉండగా మిమ్మల్ని ఎవరో కిడ్నాప్ చేశారు . మీరు ఎలా తప్పించుకున్నారో ఒక కథ లా చెప్పండి’ అని థీమ్ చెప్పాను . ఒక పిల్ల వాడు చెప్పిన కథ ,’వాళ్ళు కారులో ఎక్కించుకుని తీసుకు పోతూ ఉంటే వాది టిఫిన్ బాక్స్ కి చీమలు పట్టిందిట, ఆ చీమలని వాళ్ళ మీదకు వదిలాడట ,వాళ్ళు కారు ఆపారుట , ఆపగానే వాడు కారు తలుపు తీసుకుని పారిపోయాడుట – ఆ చీమ వెళ్ళి కుట్టడం, వాడు దాన్ని  వదలడం -కొంత రియాలిటీ ,కొంత ఫాంటసీ . నేను వాళ్ళకు రాయడం కంటే వారి దగ్గర నుంచే ఎక్కువ నేర్చుకున్నాను . అందుకునే నాకు ఆ ఇంటర్ యాక్టివ్ వర్క్ షాప్స్ అంటేనే ఇష్టం . పిల్లలకి ఒక థీమ్ ఇచ్చి వారిని రాయమంటే వారికి వచ్చే విచిత్రమైన ఆలోచనలు బాగుంటాయి .

ప్ర: అలా అని పిల్లలకి రాజుల రాణుల  కథలు నచ్చుతాయి. కాని ఇరవై ఏళ్ళ  క్రితం పిల్లలకి రాజుల రాణుల ల కథలు నచ్చినట్లు ఇప్పటి తరంకు నచ్చుతోందా?

కృ : చెప్పలేము . చిన్న చిన్న పిల్లల లో కూడా రేషనల్ ఆలోచన పెరిగింది . ఒక పిల్ల కాకి కడవలో నీటి కోసం రాళ్లు వేసి నీరు తాగింది అని చెప్తే-‘ఛీ అలా తాగితే డయేరియా వస్తుంది కాకికి  ‘ అని  అంది.   ఇలాంటివెన్నో వాళ్ళు మనకు పాఠం  చెబుతారు . మనం చాలా జాగ్రత్తగా ఉండాలి .

ప్ర: అబ్బో అంత దూరం ఆలోచించింది !

కృ: మరీ ! ఇంట్లో వాళ్ళ  Hygiene అలా ఉందన్న మాట . పోస్ట్ కరోనా ఎవరూ ఒక వర్క్ షాప్ చేయ లేదు. అదే చేస్తే పిల్లలు ఎన్ని రకాలుగా చెప్తారో!(నవ్వు)

ప్ర : అవును కరెక్టే -ముక్కుకి మాస్క్ వేసుకోవాలి , చేతులు కడుక్కోవాలి అని -చాలా కథలు చెప్తారు.

కృ: అవును

ప్ర: ఇప్పుడు మనం కథలు చెప్తున్నాము ,వాళ్ళు వింటున్నారు -దీని ప్రభావం వాళ్ళ జీవితంలో ఉంటుందంటారా?

కృ: ఖచ్చితంగా ఉంటుంది . పాఠం వేరు , కథ వేరు . ఇది వారికి ఒక ఔట్లెట్ . వేరే ఒక రిలాక్సేషన్ వస్తుంది . అది కాక ఇమాజినేషన్ –మూడోది ,ఇప్పుడు అత్యవసరం అయ్యేది భాష . అందు కోసమని మనం తప్పని సరిగ్గా చదివించాలి . అంతకంటే ముందు మనం చెప్పాలి . వారికి ఇప్పుడు చదివే అవకాశం తక్కువ కనుక . చాలా మందికి వింటూ ఉంటే కూడా భాషపై పట్టు పెరుగుతుంది . పిల్లలు రాయడం రాక పోయినా మాట్లాడతారు . అలాంటి పిల్లలకి మనం చెప్తే అది బాగా పనికి వస్తుంది .

ప్ర : తల్లి తండ్రుల ప్రభావం పిల్లలపై చాలా ఉంటుంది ఈ పఠనాసక్తి పెరగడానికి ?

కృ: చాలా ఉంటుంది . తల్లి తండ్రుల ప్రభావమే ఎక్కువ . ఇది వరకుల్లా జాయింట్ ఫామిలిస్ లేవు కదా !ఇది వరకు అయినా తాతలు అమ్మమ్మలు చెప్పేశారా అంటే చెప్పలేము కాని -ఒక ఆట విడుపు ఉండేది . ఇప్పుడు అది లేకుండా పోయింది . అందుకోసం లైబ్రరీ నే ఆట విడుపు కల్పించాలి ఇప్పుడు .

ప్ర: అవును . స్కూల్ కూడా కల్పించవచ్చు , కాని ముఖ్యంగా లైబ్రరీ పెట్టాలి . ఇప్పుడూ స్కూల్లో టెక్స్ట్ బుక్ కానిది చదివితే టైమ్ వేస్ట్ అనే భావన కూడా వచ్చింది .

కృ : అదీ కాక ఇప్పుడు పర్యావరణ గురించి విషయాలు పాఠాలలో చదివితే అది పెద్దగా నచ్చదు. అది ఎంత సేపు ఒక ఫార్ములా ల ఉంటుంది తప్ప అది నచ్చదు. అదే మనం అలా కాకుండా ఒక కథలో జొనిపించి చెప్పడం ద్వారా ఒక మంచి ఐడియా వస్తుంది.

ప్ర: వాళ్ళ మనసులో నుంచి వచ్చినట్లుగా వస్తుంది .

కృ : నిన్నో మొన్నో పేపర్ లో చదివాను ఒక టెన్త్ క్లాస్ పిల్ల ఒక కూరలు అమ్ముకునే అతని కోసమని వారి మాష్టర్ తో డిస్కస్ చేసి ఒక సోలార్ ప్లేట్ పైన పెట్టి కూరగాయలు పాడై పోకుండా ఉండేందుకు ఒక కూలింగ్ ఛాంబర్ తయారు చేసి అది ఒక ప్రాజెక్ట్ లా పెట్టిందిట ఇన్‌స్పైర్ వారి పోటీలలో . దానికి ఆ అమ్మాయికి ఒక ప్రైజ్ వచ్చింది . లో కోస్ట్ లో ఒక ఎనిమిది వేలలో తయారు చేసిందిట . అంటే అలాంటి ఆలోచన ఆ అమ్మాయికి వెనక ఇంట్లో చెప్పే సలహాలు కూడా పని చేస్తాయి.

ప్ర : మీ ఉద్దేశం లో బాల సాహిత్యం కి భవిష్యత్తు ఎలా ఉంటుంది అనుకుంటున్నారు ? ఇప్పుడు రాసే వాళ్ళు చాలా మందే ఉన్నారు .

కృ: ఇప్పుడు కొత్తగా ఏమిటంటే పిల్ల చేత రాయించి, అవి పుస్తకాలుగా వేయించే ఒక ప్రక్రియ వచ్చింది.

ప్ర : అసలు బాల సాహిత్యం అంటే బాలలు రాసే సాహిత్యం కదా , పెద్దలు రాసేది బాల సాహిత్యం అవుతుందా అనే ప్రశ్న కూడా  వస్తోంది.

కృ : అదే కాక కొంత మంద మరో థియరీ లేవదీశారు -మన బాల్యం గురించి చెప్పేది అంతా బాలా సాహిత్యమేనని. నేను ఆ  థియరీని ఒప్పుకోను . అది బాలా సాహిత్యం కాదు . ప్రతివారికి ఒక బాల్యం ఉంటుంది . కాని బాల సాహిత్యం అంటే అది బాలలను enrich చెయ్యాలి , వారికి కొత్త దారులు చూపాలి ,వాళ్ళను కొత్తగా ఆలోచించేలా చెయ్యాలి వాళ్ళకి ఇప్పుడున్న చీకాకులలోంచి ఒక విశ్రాంతి  కల్పించాలి- ఇన్ని చేస్తేనే అది బాల సాహిత్యం అవుతుంది . కొత్తగా మార్గదర్శకత్వం కూడా చేయాలి . ఇన్ని చేస్తేనే అది బాల సాహిత్యం అవుతుంది .

ప్ర : పిల్లలకి కథలు పేరుతో టీచ్ చేయడం సరి అయిన పద్ధతేనా ? మనక కథ చెప్పాక చివరిలో ఈ కథలో నీతి ఏమిటి అని అడుగుతారు.

కృ : ఈ నీతి ఉండాలి అనే దానితోనే మన బాల సాహిత్యం ఇన్ని సంవత్సరాలు నడుస్తూ వస్తోంది . ఇద్దరు అన్నదమ్ములు ఉంటారు ,అందులో ఒకడు మంచివాడు ,ఒకడు చెడ్డవాడు – ఇది పంచతంత్రం నాటి నుంచి వస్తోంది . ఇప్పటి పిల్లలు  అది ఇష్ట పడటం లేదు . సస్పెన్స్ కావాలి -మొదలై రామాపురం లో రామయ్య అంటే వాళ్ళకి ఆసక్తి ఉండదు . రచయితలు పిల్లలతో డైరెక్ట్ గా ఇంటర్ ఆక్ట్ అవకపోవడం వల్ల అదే చేస్తున్నారు . అదే మనం పిల్లలను  కూర్చొబెట్టి కథ చెప్పాలని ప్రయత్నిస్తే-మనం రామాపురం రామయ్య అనగానే వాడు తల తిప్పేసుకుంటాడు . అదే మనం-ఉన్నట్టుండి పెద్ద చప్పుడు అయ్యింది ,ఢాం అని శబ్దం వచ్చింది అంటే వాడు మన వైపు చెవులు పెడతాడు . ఆ ఓపెనింగ్ మార్చాలి అనేది ఎప్పుడు అవగాహన వస్తుంది అంటే మనం మన టార్గెట్ ఆడియెన్స్ దగ్గర మనం కూర్చొని మాట్లాడినప్పుడే వస్తుంది .

అలాగే బాల రాసింది అంతా బాల సాహిత్యం అనలేము . కొన్ని ప్రాంతాలలో కొన్ని సంకలనాలు చూస్తే పిల్లల రాసే కథలలో తండ్రి తాగి వచ్చి   తల్లిని కొట్టడం లాంటివి రాశారు . బాల సాహిత్యం ఉద్దేశం వాళ్ళ దుఃఖాన్ని ఇనుమిడింప చేయడం ఉద్దేశం కాదు కదా . వాడి లో ఒక కొత్త ఆలోచన పెట్టాలి . వాడిలో కొత్త ఆలోచన ఆనందించే ఆలోచన నింపేలా చేస్తేనే వాడు కథ కోసం వస్తాడు .

ప్ర :  పిల్లలు కథ రాసేటప్పుడు కథ రాయడం అడుగున నీతి రాయడం –ఇలా రాయడం గమనించాను

కృ :అది వారి curriculum లోనే అలా ఒక మోరల్ స్టోరీ అని ఒకటి మొదలు పెట్టారు . నిజానికి దీనివల్ల నీతి కథల పుస్తకాలకు డిమాండ్ పెరిగింది . ఒకరు ఒక పోటీ నిర్వహిస్తూ దేశ భక్తి అనే టాపిక్ పై కథ రాయమన్నారు. అది వ్యాసానికి పనికి వచ్చే విషయం . కథ కి పనికి రాదు

ప్ర : బాల సాహిత్యం భవిష్యత్తు గురించి ఏమంటారు ?

కృ : సాహిత్య అకాడెమీ వారు బాల సాహిత్య పురస్కారము ఇచ్చి ఈ ప్రక్రియని బాగా encourage చేస్తున్నారు . ఇలాగే ఉంటే పిల్లలు తెలుగు పుస్తకం పిల్లలు చదివే అవకాశం లేదు . కాని ఇదే సమయం లో పెద్దవాళ్లే పిల్లలకు కథలు  చెప్పడం, వాళ్ళ చేత చెప్పించడం – ఇవి అవసరం. ఈ pandemic వల్ల ప్రత్యక్షంగా పిల్లలకి కథ చెప్పడం కుదరటం లేదు . అప్పటికి పిల్లలకి జూమ్ లో కథలు చెప్పడం వంటి ప్రయత్నాలు చేస్తున్నారు . అలా అది కుదరదు . ప్రత్యక్షంగా మనం పిల్లలకు ఆసక్తి కలిగించే లక్షణం ఈ సాధనాలు ద్వారా సాధించడం కష్టమే.  కార్టూన్లు ,గ్రాఫిక్స్ వచ్చాక పిల్లలలో వయోలిన్స్ పెరిగింది . ముఖ్యంగా చిన్న పిల్లలకి అన్నం తినేటప్పుడు , మనకు పని ఉన్నప్పుడూ వాడి ఎదురుగా స్మార్ట్ ఫోన్ నొక్కేసి వెళ్తోంది . దీనిలో  వాడిలో ఎండార్ఫిన్స్ విడుదల అయ్యేవే నడుస్తున్నాయి .అది కొంచం dangerous ట్రెండ్ . గమనించుకోవాలి.

ప్ర: అవును టామ్ అండ్ జెర్రీ కూడా

కృ : వీడియో గేమ్స్ లోనూ , కార్టూన్ సినిమాలలో వైలెన్స్ లేకుండా చూడాలి అని చాలా రీసెర్చ్ చేస్తున్నారు . పిల్లలు  అవి ఎలా తీసుకోవాలి అనేది వారి ఆలోచన వాళ్ళు చేస్తున్నారు

వై లెన్స్ నుంచి దూరం చేయక పోవడం వల్లనే ఇప్పుడు పెద్ద సమస్య అయ్యింది . ఇదే కాక -మన పిల్లలలో నుంచి క్లాస్ ఫీలింగ్‌ లాంటివి లేకునా మళ్లించాల్సిన అవసరం కూడా ఇప్పుడు వుంది. టీచర్ కి కూడా ఇది ఇబ్బంది పెడుతోంది . ఒక ఎల్ కె జి పిల్లవాడు తన టీచర్ తో ‘నేను ఎవరో తెలుసా అని అడిగాడుట టీచర్ కోప్పడితే . ‘నేను ఎం . ఎల్ ఏ గారి మనవడిని అని . అలా ఉంటున్నారు పిల్లలు . అలాంటి వారిని జాగ్రత్తగా లాక్కురావాల్సిన బాధ్యత ఇప్పుడు టీచర్ల పైన ఉంటోంది . సాహిత్యం తోను , మొక్కలు పెంచడం లాంటి ప్రకృతి తో దగ్గరగా ఉండే పనులు చేయిస్తూ ఉంటే వారిలోని ఆ వైలెన్స్ ప్రభావం తగ్గుతుందేమోనని నేను భావిస్తాను. ఒక గింజ నాటడం, దానికి నీరు పోసి అది పెరుగుతూ ఉంటే ఆనందించడంవల్ల వాడిలోన క్రియేటివిటీ పెరుగుతుందని నా ఆశ .

ప్ర : మీరు చేసిన అనువాదాలు గురించి కొంచం చెప్పండి . మీరు చాలా అనువాదాలు చేశారు కదా

కృ : నేను ముందు నేషనల్ బుక్ ట్రస్ట్  వారి సూన కొండ  రహస్యం అని ఒక చిన్న నవల అనువాదం చేశాను  ఎక్కువ ప్రాచుర్యం పొందని వారు , చిన్న వయస్సులోనే దేశ భక్తి తో చని పోయిన వారి గురించి ఒక పుస్తకం అనువాదం చేశాను . అది కాక సుధా మూర్తి గారి అదృశ్యమయిన  అద్భుత ఆలయం అని ఒక నవల , ప్రతీకార వలయం అని భారతం లో నుంచి కథలు , త్రి మూర్తులు కథలు, రామకృష్ణ కథలు ,జ్ఞానానికి ఆధారం అని ప్రముఖ స్త్రీల కథలు , ఈ కరోనా సమయం లో అవ్వా తాతల కథల సంచి అని ఒకటి ,గోపి కుక్కపిల్ల కబుర్లు అని -ఇవి చేశాను . అవి కాక కాలం రాసిన  ఇన్ఫోసిస్ ఫౌండేషన్ గురించి, మూడు వేళ అల్లికలు అని అవి అనువాదం చేశాను.

ప్ర: స్వంత కథలు ఎన్ని ఉన్నాయో అనువాదాలు అన్నే ఉన్నాయి  . ఏది తేలిక ?అనువాదమా ? స్వంత రచనా? ఏది తృప్తి  ఇస్తుంది ?

కృ : సంతోషం ఎప్పుడు మనం సొంతంగా రాసుకుంటూనే ఉంటుంది . అది స్వంత పిల్ల అయితే అనువాదం కూడా జాగ్రత్తగా చూడాలి. అది పెంచుకునే పిల్ల . దానికే ఎక్కువ శ్రద్ధ వహించాలి ఎక్కడ దాని మనసు మారకుండా చూసుకోవాలి .

 ప్ర: తరువాత ప్రాజెక్ట్ ఏమిటి?

కృ: ప్రస్తుతం ఏమి లేదు . ఇప్పుడు పోటీకి రాయడమేమిటని అంటారు కాని, మామూలుగా రాసుకుంటూ పోతూ ఉండడం వేరు . నా లాంటి వారికి ఉండే మరో సమస్య ఏమిటంటే -కంప్యూటర్ లో పంపడమంటే-నేను ఫోన్ లో టైపు చేసి పంపలేను . విడిగా ఎవరు మాన్యుస్క్రిప్ట్స్ ఒప్పుకుంటారో వారికి పంపుతాను . సాధారణంగా పోటీ అప్పుడు రెండూ ఒప్పుకుంటారు. టెక్నికల్ సమస్య.

ప్ర: చాలా విషయాలు చెప్పారు ధన్యవాదాలు

*

ప్రసూన బాలాంత్రపు

3 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • చక్కని ప్రశ్నలు,అనుభవ పూర్వకంగా ఇచ్థిన లోతైన సమాధానాలు, ఆద్యంతం చదివించింది.ఇరువురికీ నమస్సులు.

  • “ఇప్పుడు పిల్లలకు సస్పెన్స్ కావాలి. రామయ్య, సోమయ్య అంటూ మొదలుపెట్టగానే వారు ముఖాలు తిప్పుకుంటారు. పెద్ద చెప్పుడైంది. డాం అంటూ శబ్దం. ఇలా కథలు మొదలువ్వాలి. ”

    ఎంత చక్కగా చెప్పారు. పిల్లలను దగ్గరగా పరిశీలిస్తేనే ఇలాంటి విషయాలు తెలుస్తాయి. చక్కని ఇంటర్వ్యూ. బాలసాహితీవేత్తలు తప్పక చదవాల్సిన ఇంటర్వ్యూ.

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు