పిట్ట ముట్టలే

‘సావు’ ఎట్ల చెయ్యాలో అర్థమైతలేదు. గరీబోనికి ఏ దావత్ చెయ్యకున్నా నడుస్తది కానీ సస్తే సావు చెయ్యకపోతే వాడు బతికి ఏం లాభం?

రాత్రి తొమ్మిదైతుంది. రవి వాకిట్లో కూర్చొని ఏడుస్తున్నడు. దగ్గరి చట్టాలు ఒక్కొక్కరు వొస్తున్నరు. వొచ్చినోళ్లందరు వాకిట్లోనుండే శోకం పెడ్తూ ఏడుస్తున్నరు.

రవి తండ్రి ఆ రోజు సాయంత్రం చనిపోయిండు. ఇల్లంత శోకంతో నిండింది. రవికి ఏం చెయ్యాలో అర్థం కావడం లేదు. వాకిట్లో కూర్చున్న అతని దగ్గరకి కుల పెద్ద యాదయ్య తాత వొచ్చిండు.

“బిడ్డా! ఎవ్వలి దగ్గర కూడా ఒక్క రూపాయి పుడ్తలేరా! ఎవ్వలని అడిగినా లేవంటున్నరు” అని దీనంగా చెప్పిండు. ఆ మాటలు వినంగనే రవికి పట్టరాని దుఃఖమొచ్చింది.

యాదయ్య తాతను పట్టుకొని కొంతసేపు ఏడ్చిండు.

“ఊకో రా! ఎట్లయ్యేదుంటే అట్లైతది. నువ్వేం బాధ పడకు. నేను మళ్లోసారి అడిగి చూస్త” అని చెప్పి యాదయ్య తాత వెళ్ళిపోయిండు.

ఎల్లయ్యకి రవి ఒక్కగానొక్క కొడుకు. ఎల్లయ్యకున్న రెండెకరాల భూమిలో ఎవుసం చేస్కుంట బతుకుతున్నడు. తాతల నుండి వారసత్వంగ వచ్చిన గూనెపెంకల ఇంట్లోనే వాళ్ళు వుంటున్నరు. రవి ఇంటర్ అయిపోగానే డిగ్రీ కోసం పట్నం పోయిండు. అతను ఇంటికి దూరమైనప్పటి నుండి వాళ్ళ బాపు తాగుడుకు బానిసయ్యిండు.

‘ఎవుసం చేసే మనిషి ఇంత తాగితే ఏమైతది? రోజూ తాగుతున్నడా?’ ఎప్పుడో ఒక్కసారి’ అనుకుంట రవి వాళ్ళమ్మ  ఎక్కువగా పట్టిచ్చుకోలే.

ఎల్లయ్య ఇంతకుముందు వారంల రెండుసార్లు తాగెటోడు. ఇప్పుడు రోజూ తాగుతున్నడు. ఎవుసమంత ఎన్కకు పట్టింది. ఏమీ సాగుతలేదు. వొచ్చిన పైసలన్ని ఎర్ర మందుకే ఐతున్నయ్!

ఇది జూసి రవి తల్లి అనసూయ రోజూ ఇంట్లో లొల్లి పెడ్తుంది. అయినా ఎల్లయ్య తీరు మారలేదు. ఎక్కువ మాట్లాడితే కట్టె అందుకొని కొడ్తున్నడు.

అనుసూయ ఏడ్వని దినం లేదు. కొడుకు పట్నంల సదువుకుంటుండు. ఇవన్నీ చెప్పి ఎందుకు వాని మనసు నారాజ్ చెయ్యలే అని సంసారం ఎల్లదీస్కొస్తుంది. ఇంటాయన లేకున్న ఎవుసం జేస్తుంది. ఎల్లయ్య పూర్తిగ తాగుడుకే పట్టిండు.

అతనొక్కడే కాదు, ఊర్ల చానా మంది పరిస్థితి అట్లనే మారింది. ఆ పల్లె చిన్నదే! తాగడానికి మంచినీళ్లు దొరకకున్న గాని, ఎర్రమందు ఏరులై పారుతుంది. అమ్మెటోళ్లు మిద్దెల మీద మిద్దెలు కడ్తున్నరు. తాగినోళ్ళు మాత్రం కొంపకు కొరివి పెట్టుకుంటున్నరు.

ఎర్రమందు దందాకు ఎదురుచెప్పేటోడే లేడు.

అప్పుడప్పుడు కాకి బట్టలోళ్లు కూడా అమ్మేటోళ్ల దగ్గరకు వొస్తరు. వాళ్ళ వాటా వాళ్ళు తీస్కొని సప్పుడుగాక పోతరు. మందు ఒక్కొక్కరి ఇంట్లో రక్తం చిందేలా చేస్తుంది.

పట్నంలున్న రవికి డిగ్రీ ఆఖరి సంవత్సరం పరీక్షల ముందు సెలవులు వొచ్చినయి. హాస్టల్ నుండి ఇంటికి చేరుకున్నడు. బాపు పరిస్థితి చూసి పానమంత ఎట్లనో అయ్యింది.

“ఏమైందమ్మ? బాపు మొత్తం గిట్ల తయారైండు” అని వాళ్ళమ్మను అడిగిండు.

“నువ్వు పట్నం పోయిన పొద్దునుండే మెల్లమెల్లగ ఎర్రమందుకు అలవాటయ్యిండు రా మీ బాపు. ఎంత చెప్పినా ఇంటలేడు. ఏమన్నంటే కొడ్తున్నడు. తాగేతందుకు పైసలియ్యకపోతే ఇంట్లో పెద్ద లొల్లి పెడ్తడు” అని చెప్పింది.

రవికి సెలవులు అయిపోయినయి. మళ్ళీ పట్నం బస్సు ఎక్కిండు. హాస్టల్‌కి చేరుకున్నడు. ఇంకో రెండు రోజుల్లో పరీక్షలు మొదలైతయ్. వాటికోసం చదువుతున్నడు. రాత్రి ఇంటి దగ్గరి నుండి ఫోన్ వొచ్చింది.

“అమ్మా! చెప్పే ఏమైంది? గిప్పుడు ఫోన్ చేసినవ్” అని అడిగిండు.

“మీ బాపుకి పానం బాగలేదురా! నువ్వు పొద్దుగాలనే ఇంటికి రా బిడ్డా” అంది.

“నాకు రేపటి నుండి పరీక్షలే” అన్నడు.

“నువ్వు మొదాలు ఇంటికి రా” అని ఫోన్ పెట్టేసింది.

తెల్లారే పరీక్షలు. రవికి ఆ రాత్రంత నిద్ర లేదు.

పొద్దుగాలనే వాళ్ళ ఊరికి బయల్దేరి సాయంత్రానికి చేరుకున్నడు. ఇంటికి తాళం వేసున్నది.

“అత్తా! మావోళ్లు ఎటు పోయిండ్రు?” పక్కన ఉన్న సత్తమ్మత్తని అడిగిండు.

“మీ నాయినను తీస్కొని మీ అమ్మ టౌన్ దవాఖానకు పోయింది. నువ్వు రాంగనే రమ్మని చెప్పుమన్నది బిడ్డా” అని చెప్పి వెళ్ళిపోయింది. రవి దవాఖానకు వెళ్ళాడు. అమ్మ బాపు పక్కన కూర్చొని ఉన్నది. బాపుకి గ్లూకోజ్ ఎక్కిస్తున్నరు. ఏదో సూది మందు ఇస్తున్నరు. మూతి వొంకర తిరిగిన బాపు నిద్రపోతున్నడు.

ఏడుపు ముఖంతో వాళ్ళమ్మను చూస్తూ ఏమైంది అని సైగ చేసిండు రవి.

“బాపుకి పక్షవాతం వొచ్చింది రా” అని ఏడ్చింది.

“వొద్దయ్యా తాగకు అంటే వినకపోయే! బీపీ ఎక్కువైంది. అందుకే పక్షవాతం వొచ్చిందని డాక్టర్ చెప్పిండురా” అని కండ్లళ్ల నీళ్ళు తీసింది.

డాక్టర్ వొచ్చిండు. “మీరు వారి అబ్బాయా?” అని అడిగిండు.

“అవును సార్”.

“మీ నాన్నకి పెరాలసిస్ అటాకైంది. ట్రీట్‌మెంట్ జరుగుతుంది. ఇంక ఆయన లేచి నడవడం, తన సొంత పనులు చేసుకోవడం కష్టమే! ఓ త్రీ డేస్‌లో డిశ్చార్జి చేస్తాం. ఇంటికి తీసుకెళ్ళొచ్చు” అని చెప్పి వెళ్ళిపోయాడు.

రవి అమ్మతో పాటే హాస్పిటల్‌లో మూడు రోజులు ఉన్నడు. నాలుగో రోజు బాపుని డిశ్చార్జి చేసుకొని ఇంటికి వెళ్లారు. అప్పటి నుండి అసలు కష్టాలు మొదలయ్యాయి.

ఎల్లయ్య పూర్తిగా మంచానికే పరిమితమైండు. నెలకు ఐదు వేలు ముందులకి ఖర్చవుతున్నయి. రవి మళ్ళీ పరీక్షలకు పట్నం పోలె! సంసారం మొత్తం నెత్తిన పడింది. తండ్రి చేసిన ఎవుసమే ఇప్పుడు తాను చెయ్యాలి. అదే ఇప్పుడు ఆధారం.

ఓ రోజు ఉదయం చేను దగ్గరకు పోయి వాళ్ళ సాగుభూమి మొత్తం చూసిండు. ఏ పంట వెయ్యాలో అనుకున్నడు. చివరకు టమాట పంట వేసాడు. చేను బాగా వొచ్చింది. ఈ పంటతో కొంత మెరుగుపడతం అనుకున్నడు.

టమాట పనులు జోరుగా సాగుతున్నాయి. చేనును చూస్తే రవి కొండంత ధైర్యమొస్తుంది. ఇంకో వారం రోజుల్ల పంట చేతికందుతుంది. మార్కెట్లో కూడా రేటు బాగనే ఉన్నది.

ఓ రోజు రాత్రి సన్నగా వర్షం పడ్డది. రవికి భయం మొదలైంది. తెల్లారి నుండి రెండు రోజులు ఒకటే వాన. టమాట మొత్తం మురిగిపోయింది. చేసేదేమీ లేక ఉన్న పంటనే మార్కెట్‌కి వేసాడు. ఆరుగాలం కష్టానికి నష్టమే మిగిలింది.

ఎల్లయ్య ఆరోగ్యం రోజురోజుకు మరింత క్షీణిస్తున్నది. వైద్యం చేయించడానికి డబ్బులు లేవు.

రెండేళ్లుగా తన సంపాదనంత వైద్యానికే ఖర్చుపెట్టాడు రవి. రోజులు గడుస్తున్నా బాపు ఆరోగ్యంలో మార్పు లేదు.

ఓ రోజు ఎల్లయ్య రవిని దగ్గరకు పిలిచి..

“నువ్వు ఇబ్బంది పడకు బిడ్డా! నా చేతులతోని నేనే నా పానం కరాబ్ చేస్కున్న. ఇప్పుడు మిమ్ముల ఇబ్బంది పెట్టుడైతుంది” అని కంటతడి పెట్టిండు.

కొడుకుతో మొగుడు అంటున్న మాటలు విని అనసూయ పొయ్యింటి నుండి కోపంతో వొచ్చింది.

“అబ్బో! ఎప్పుడొచ్చినాది తెలివి? వొద్దు రా ముండా కొడుకా! పానం కరవైతది. తాగుల మన్నువడా! తాగకు అంటే ఇన్నవా నా మాట? ఇప్పుడేమో సంసారోలె ఏడ్పు ఏడుస్తుండు” అనుకుంటూ తనను ఎలా ఇబ్బంది పెట్టాడో చెప్పి కొడుకు ముందు తన అక్కసు వెల్లగక్కింది.

“ఊకో అమ్మ! అయ్యిందేదో అయిపోయింది. లొల్లి పెట్టి బాపు మనసు బాధపెట్టకు” అని చెప్పి రవి బయటకు వెళ్ళిపోయిండు.

ఎల్లయ్య మందులేసుకోవడం మానేశాడు. తినడం మానేశాడు. ఆరోగ్యం ఇంకా క్షీణించింది.

“బాపూ! ఏమైందే? మందులు ఏస్కుంటలేవు? తినుడు బంద్ చేసినవ్! ఏమైందే?” అని రవి అడిగిండు.

“ఏం కాలే బిడ్డా! నేను బతికి ఎవ్వలని ఉద్దరించాలే? పైసా పైసకి ఎంతో తక్లిబ్ పడ్తున్నావ్ బిడ్డా! మందులొద్దు, ఏమొద్దు! నువ్వు పైసల తక్లిబ్ పడకు. ఎట్లైతే గట్లైతది. నువ్వేం నా గురించి రంది పెట్టుకోకు. పనులు మానుకొని మళ్ళీ సదువుకో బిడ్డా! మంచిగ సదువుకొని కొలువు జెయ్యలే. నేను ఉంటే ఉంటా, పోతే పోతా” అని గంభీరమైన గొంతుతో అన్నడు.

‘ఎన్నడు లేనిది ఇయ్యాల బాపు ఎటో మాట్లాడుతుండు. ఏమైంది ఈయనకు?’ అనుకుంటూ పొలం దగ్గరకు వెళ్ళాడు.

సాయంత్రం ఇంటి నుండి ఫోన్ వొచ్చింది. అమ్మ ఏడుపు గొంతుతో “మీ బాపు ఇంగ లేడు బిడ్డా. కాలం చేసిండు” అన్నది.

రవి ఇంటికి వెళ్లి చూస్తే బాపు తల దగ్గర అమ్మ కూర్చొని ఏడుస్తుంది. రవి చేతిల రూపాయి లేదు.

‘సావు’ ఎట్ల చెయ్యాలో అర్థమైతలేదు. గరీబోనికి ఏ దావత్ చెయ్యకున్నా నడుస్తది కానీ సస్తే సావు చెయ్యకపోతే వాడు బతికి ఏం లాభం?

సావుకి కావాల్సిన పైసల గురించి రవి బాధపడుతుంటే యాదయ్య తాతే‌ వాళ్లని వీళ్లని అడిగి చివర్కి ఎట్లనో చేసి పైసల్ తెచ్చిండు. ఖర్చు మొత్తం దగ్గరుండి చూస్కుండు.

రవి ముందు మరో ముప్పు ఉన్నది. సావు అయిపోయింది. మరి దినాలు? దినాలు సరిగ్గ చెయ్యకపోతే నలుగురు నాలుగు రకాలుగా మాట్లాడుతారు. ‘కొడుకు ఉండి కూడా దినాలు సరిగ్గా చెయ్యకపోతే ఎలా’ అని రవి ఆలోచిస్తున్నడు.‌ అమ్మ తన ‘కాళ్ళ కడియాలు’ తీసిచ్చింది. అవి అమ్మి దినాలు చెయ్యిరా అని చెప్పింది. అమ్మ చెప్పినట్టే చేసాడు.

దినాల రోజు చెరువు కట్టపై సచ్చినోళ్ళకు ‘పిట్టకు పెడ్తరు’. పోయినోళ్లు నిమ్మలంగా ఉంటే పిట్ట తొందరగా వొచ్చి ముట్టిపోతుందని ఓ నమ్మకం. ఎల్లయ్యకి చెరువు కట్టపై పిట్టకు పెట్టారు. గంట గడుస్తున్నా ఒక్క పిట్ట ముట్టడం లేదు.

యాదయ్య తాత వొచ్చి “నువ్వు మీ బాపుకు సరిగ్గ మొక్కురా బిడ్డా! సచ్చే ముందు ఏమైనా చెప్తే అది తప్పకుండ చేస్తనని మొక్కు” అని చెప్పిండు.

రవి మళ్ళీ మొక్కి వొచ్చిండు. అయినా ఒక్క పిట్ట కూడా ముట్టలేదు.

ఎంత సేపు చూసినా పిట్ట ముట్టకపోవడంతో ఆహారమంత గంగలో కలిపారు. ఎందుకు పిట్ట ముట్టలేదో అని రవి ఆలోచించిండు. కాలేజీకి పొయ్యి సదువుకోమన్న బాపు మాట గుర్తొచ్చింది. అప్పు చేసైన సరే, ఆ మరునాడే పోయి డిగ్రీ పరీక్ష ఫీజు కడుదమని నిర్ణయించుకున్నడు.

*

ఈ కాలం కథలు రాయాలని వుంది: భాను ప్రసాద్

* హాయ్ భానూ! మీ గురించి చెప్పండి.

హాయ్! మాది సిద్దిపేట జిల్లా వర్గల్ మండలం మీనాజీపేట. నేను పుట్టి పెరిగింది అక్కడే. నేను ఫార్మాసిస్ట్‌ని. ప్రస్తుతం ఊళ్లోనే మెడికల్ షాప్ నిర్వహిస్తూ, ఒక దినపత్రికలో విలేకరిగా పనిచేస్తున్నాను.

* కథలు రాయడం ఎలా మొదలైంది?

నేను కథలు రాసేందుకు ముఖ్య కారకులు బి.ఎస్.రాములు గారు, తుమ్మేటి రఘోత్తమరెడ్డి గారు. వారి ప్రోత్సాహం వల్లే కథల మీద ఆసక్తి కలిగింది. హైదరాబాద్లో ఒకసారి రఘోత్తమరెడ్డిగారిని కలిసినప్పుడు ఆయన తను రాసిన ‘గూఫీ’ అనే పుస్తకం ఇచ్చారు. అది చదివాక నాకూ కథలు రాయాలని అనిపించింది. అదే సమయంలో బి.ఎస్.రాములుగారితో పరిచయమైంది. ఆయన రాసిన కథలు, కథలెలా రాయాలో చెప్పిన ‘కథల బడి’ పుస్తకాలు చదివాను. దాంతో కథారచన మీద ఆసక్తి కలిగింది. అదే సమయంలో వేంపల్లె షరీఫ్ గారు కొత్తగా రాసే వారి కోసం ఒక ఆన్‌లైన్ వర్క్‌షాప్ నిర్వహించారు. అందులో వారం రోజుల పాటు రకరకాల అంశాలు నేర్పారు. అది నాకు చాలా ప్రయోజనకరంగా మారింది.

* మొదట ఏ కథ రాశారు?

మొదట రాసిన కథ ‘ఆరడుగులు’. వెలుగు దినపత్రిక ఆదివారం అనుబంధం ‘దర్వాజ’లో 2021 సెప్టెంబర్‌లో ప్రచురితమైంది. ఇప్పటిదాకా మూడు కథలు రాశాను.

* చిన్నప్పటి నుంచి సాహిత్యంపై ఆసక్తి ఉండేదా?

మా ఇంట్లోకానీ, ఊర్లోకానీ సాహిత్య వాతావరణం లేదు. నాకు అందుబాటులో అటువంటి పుస్తకాలు కూడా లేవు. మాది పల్లెటూరు. అక్కడ లైబ్రరీ లేదు. కాబట్టి చిన్నప్పుడు అటువంటి ఆసక్తి ఏమీ లేదనే చెప్పాలి. ఇటీవల కాలంలోనే మొదలైంది. ఈ మధ్యే కథలు చదువుతున్నాను.

* మీకు నచ్చిన రచయితలు? కథలు?

ముందే చెప్పినట్టు, నేను ఈ మధ్యే చదవడం మొదలుపెట్టాను. బి.ఎస్.రాములు, పెద్దింటి అశోక్ కుమార్ గార్ల కథలు చాలా ఇష్టం. ‘మాయిముంత’ అన్న కథా సంపుటిలో అశోక్ గారు రాసిన ‘గూడు కుదిరిన పక్షి’ కథ చాలా నచ్చింది. అలాగే రాములు గారి ‘పాలు’ కథ కూడా చాలా ఇష్టం. అన్నవరం దేవేందర్ గారి ‘ఊరి దస్తూరి’ పుస్తకంలో ఆయన రాసిన మాండలికం, ఆ పదాలు నన్ను చాలా ఆకట్టుకున్నాయి. అల్లం రాజయ్య గారి కథలు చదవడం మొదలు పెట్టాలని ఉంది.

* కథా రచన మీదే ఆసక్తి కలగడానికి కారణం?

ప్రత్యేకమైన కారణమంటూ లేదు. కథల గురించి ఎక్కువగా తెలుసుకుంటూ ఉండటం వల్ల ఆ ఆసక్తి ఏర్పడింది. నందిని సిధారెడ్డి గారు తెలంగాణ సాహిత్య అకాడమీ ఛైర్మన్‌గా ఉన్న సమయంలో అప్పుడప్పుడూ సిద్దిపేట వచ్చేవారు. ఒకసారి ఆయన్ని కలిసినప్పుడు ‘తెలంగాణలో కథకుల కన్నా కవులు ఎక్కువమంది ఉన్నారెందుకు?’ అని అడిగాను. “తెలంగాణలో బాధలెక్కువ. భావోద్వేగాలు ఎక్కువ. వాటిని కథ రూపంలో చెప్పాలంటే ఎక్కువ సమయం తీసుకుంటుంది. కవిత్వంలో అయితే వెంటనే చెప్పొచ్చు” అన్నారు.

* ఇంకా ఎలాంటి కథలు రాయాలని ఉంది?

తెలంగాణలో గతకాలపు జీవితాల మీద చాలా మంది కథలు రాశారు. ప్రస్తుత జీవన విధానం గురించి కథలు రాయాలని ఉంది.

*

భాను ప్రసాద్

1 comment

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు