పార్వేట

నా పేరు సురేంద్ర శీలం పుట్టింది కర్నూల్ జిల్లాలోని క్రిష్టిపాడు గ్రామంలో. ఇంజనీరింగ్ చదివాను. 2016 లో హైద్రాబాద్ వచ్చి కొంతకాలం సాఫ్ట్వేర్ రంగంలో పనిచేశాను. సినిమా అంటే చాలా ఇష్టం. ప్రస్తుతం అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేస్తున్నాను. లాస్ట్ ఇయర్ నుంచి కథలు రాస్తున్నాను. నేను చూసిన జీవితాలే నా కథలలో పాత్రలు.

కథలన్నీ మన చుట్టూ జరిగే సంఘటనలే. అలా జరుగుతున్న వాటి ఆధారంగా రాసిన సంఘటనలే ఈ కథ. ఇది ఒక ఊరి కథ. చాలా కుటుంబాల కథ, పెళ్ళైన ఒక అమ్మాయి కథ. ఆ ఊరికి దూరంగా ఉన్న ఒక గుడిసె కథ. ఈ కథలోని సంఘటనలు నాకు తెలిసి ప్రతీ ఊరిలో ఇప్పటికి ఎదో ఒక మూల జరుగుతూనే ఉంటాయి.  ఆచారం పేరిట కొన్ని ఊర్లలో ఇప్పటికీ ప్రతి సంవత్సరం జరుపుకునే ఒక ఉత్సవం పార్వేట . అందరూ కలిసి చేసుకుంటేనే నిజమైన పండుగని మరిచి పై చెయ్యి కోసం,అధికారం కోసం అవసరాన్ని, అమాయకత్వాన్ని ఆసరాగ చేసుకొని బతుకుతూ,సమానత్వాన్ని భరించలేని కొందరి మనుషుల కథే ఈ పార్వేట.

మిట్ట మద్యానం ఎండ జెజ్జనక్క తొక్కిచ్చాంది. బడికాడ రేకుల షెడ్ కింద ఆఎండను ఏమాత్రం లెక్కసేయకుండా పులిగీతం ఆటలో మునిగిపోయినారు ఇద్దరు. నాలుగు మేకలు సచ్చిన ఉన్న వాటితో రెండు పులులను కట్టేసి బయటున్న పులులకు దొరక్కుండా ఆడ్తనాడు గోపాల్. ఎంతసేపటకి ఆట అవ్వట్లేదు ఇద్దరికీ ఇద్దరే అన్నట్టు ఉన్నారు. మహేశ్‌రెడ్డి తప్పు లెక్కతో ఇంకో పులిని కట్టేసేలోపే గోపాల్ ఈపు మీద పులి పంజా లాంటి అచ్చర పడింది.

“ మాదిగ నా కొడకా యాడర కూచ్చునేది అంటూ… గోపాల్ మీందికి వచ్చినాడు వెంకటరామిరెడ్డి”

ఏం జరిగిందో తెల్సుకునేలోపే దెబ్బకు ఇద్దరు అదిరిపడి ఆమడ దూరం ఉరికినారు. మహేశ్‌రెడ్డి షెడ్ లోపల, గోపాల్ రోడ్ మీద పన్యారు. ఈపు రుద్దుకుంటూ కళ్ళనిండా నీళ్లతో రామిరెడ్డి దిక్కు సూచ్చు

“కూచ్చుంట్టే ఏం అయితాది న్నా…”

“నా కొడకా నాకే ఎదురు సెప్తావా ఇంగో సారి ఈ అరుగు మిందా కూచ్చున్నావంటే నరుకుతా” అని గుడ్లు ఉరిమేసారికి భయపడి ఇంటి దావా పట్టిన్యాడు గోపాల్.

పనికి పోయి వచ్చిన వాళ్ళ అమ్మ వాకిలి తియ్యంగానే లోపల మూలకు ముడుసుకొని నిద్రపోతనాడు గోపాల్. వాళ్ళమ్మ పిలుచున్నా లేవట్లేదు. రొంచేసేపటికి వాళ్ళ నాయన సుదర్శనం కూడా ఇంటికి వచ్చి అన్నే మంచం కాడ కూచ్చోని ప్రేమతో కొడుకు ఈపు మీద సెయ్యి ఏయ్యగానే ఉలిక్కిపడి లేసి వాళ్ళ నాయనకు దూరం జరిగినాడు గోపాల్.

“ ఏం అయిందిరా అట్టా బయపడ్తన్నావ్?”

“ఏం కాలేదు లే నాయన.”

సర్వలో మిగిలిన అన్నం సూసి కోపంతో “మద్యానం బువ్వ తినకుండా యాడికి పోయినావ్ రా, ఊర్లోకి పోయినావ్ కదా? అని వాళ్ల అమ్మ తిడ్తాంటే పలకకుండా గుండ్రాయి లాగకూచ్చున్నాడు గోపాల్.

తినకుంటా మాన్లే రాత్రికి నే తింటాగాని అంటూ కొయ్యకు తగిలించిన తప్పెట తీసుకున్యాడుసుదర్శనం.

గుడిసె బయట నిలబడి “సుదర్శనం… సుదర్శనం… ఉండవా ఇంట్లో? ఓ సుదర్శనం…” అంటూ చేతిలో ఉన్న పొడుగాటి ఎర్రటికట్టేను భూమిందా కొడుతూ పిలుచ్చున్నాడు తలారి.

పండుకున్యా సుదర్శనం తలారి పిలుపుకు లేసి “ఆ అన్నా వచ్చనా వచ్చనా” అంటూ బయటున్న తలారి ముందర నిలబన్యాడు.

“ఏంజేచ్చానార్ర లోపల ఎంత సేపు పిలిసిసావాలి? సావిటి కాడ పసిడేంట్ గారు, ఓలెడ్డి అయ్యా , పూజారుసామి కూచ్చున్నారు. తొందరగరా నిన్ను పిలుస్కోని రమ్మన్నారు రాపో పోదాం”

“ఇదిగో న్నా” వచ్చనా అని సుదర్శనం లోపలోకి పోతుండగా “రేయి వచ్చేండప్పుడు ఆ తప్పెట కూడా తెచ్చుకో దండోరా ఉంటాది రాత్రికి” అని గుడిసె ఇనపడేలా అరిసి సెప్పాడు తలారి.

దండోరా ఉంటాది అనగానే మంచం దగ్గర ట్రంక్ పెట్టెలో చీరలు సర్దుతున్న సుదర్శనం పెళ్ళాం శాంతమ్మ నవ్వుకుంటూ సేచ్చున్న పని పక్కన పెట్టి సుదర్శనంవైపు సూచ్చు నిలబడింది. సాయంత్రం ఆగుడిసెలో ఉన్న కిరోసిన్ బుడ్డి వెలుగు కన్నా శాంతమ్మ మొహంలో కనపడిన వెలుగే ఎక్కువ. అంగీ ఇప్పేసి, కొయ్యకు ఉన్న తప్పెట రెండు కర్రెలు, టువ్వాల తీసుకొని పక్కన నిలబడ్డ పెళ్ళాం వైపు సూసి బయటకు కదిలినాడు సుదర్శనం. వాళ్ళ మట్టిరోడ్డు దాటి తారోడ్డు మీదకు వచ్చారు ఇద్దరు.

“తొందర్గా నడుసురా సామి సీకటి పడతాంది, ఊరు మొత్తం తిరగాలి మళ్ళా, రొంత ఆలస్యం అయితే ఆ నాకొడుకు ఓలెడ్డి నామింద పడి సచ్చాడు నడుసు” అని తలారి అంటుంటే వెనక నడుస్తున్న సుదర్శనం రెండు అడుగులు ముందుకు వేసి తలారితో పాటు సమానంగా నడ్సడం మొదలుపెట్టినాడు.

తిన్నికి పోయిన పక్షులు గూళ్ళకు పోతున్నాయి. సీకటి పడితే బాలయ్య ఇంటి దగ్గరకు తాగనీకి పోయే మాబాష టువ్వాల్లో ఎందో దాపెట్టుకొని పోతనాడు. దావెంబడి పోతున్న అందరిని పలకరిస్తూ నడుచ్చున్నాడు తలారి. ఎడమ భుజానికి తప్పెట తగిలించుకొని టువ్వాల కర్రలు పట్టుకొని నిదానంగా ఊరిని సుట్టుకుంటున్నా సీకటితో పోటిపడుతున్నట్టు నడుచ్చున్నాడు సుదర్శనం.

“యేన్దిరా సుదర్శనం యేమైంది అట్టా ఉండావు? యేందో పెళ్ళాం సచ్చిపోయినట్టు మొఖం అట్టాపెట్టి తలకాయ దించుకొని వచ్చనావు”.

సమాదానం సెప్పకుండా భుజానికి తలిగిలించిన తప్పెట లాగే శబ్దం ల్యాకుండా నడచ్చనాడు సుదర్శనం. తలారి మాటలకు ఇందాక గుడిసెలో పెళ్ళాంతో మాట్లాడిన మాటలు మతికోచ్చి మళ్ళీ తలారి కన్నా వెనక పడ్డాడు సుదర్శనం.

***

“యేందే ఇప్పుడు తప్పెట తీసుకుంటున్నావు” అంటూ అటక మీద ఉన్న ట్రంక్‌పెట్టె దించడానికి ఇబ్బంది పడుతూ అడిగింది శాంతమ్మ.

“పొద్దున్న పసిడేంట్ ఇంటికాడికి పోయినప్పుడు రాత్రికి ద్యావర గురించి దండోరా ఉంటాదని సేప్పినాడే, అందుకే తప్పెటకు రొంత సెగ సూపీద్దాం అని.”

ద్యావర అని ఇనగానే యానుంచి శక్తిచ్చిందో ఒక్క దెబ్బకు ట్రంక్ పెట్టెను దించెసి ఆత్రంగా వెళ్లి మంచంకూ ఆనుకోని కూచ్చుంది శాంతమ్మ. ఇద్దరు మాటల్లో ఉండగా గుడిసెలో నుంచి ఎప్పుడు బయట పన్యాడో తెలియదు గోపాల్.

“మనం ద్యావర సేసుకొని రెండేళ్ళైంది. ఈ సారైన ద్యావరకు వచ్చాదంటావయ్యా సుమతీ. బిడ్డను సూసి చాల రోజులయిపోయా, యెల్లి అడిగితే పంపిచాడంటావా?” అని సుదర్శనం కళ్ళలోకి సూచ్చు అడిగింది.

తీసుకున్నతప్పెట పక్కన పెట్టి మంచమ్మీద రెండు సేతులు వెనక్కి ఆన్చి “నాకు పిలుసుకొని రావాలనే ఉంది ఆడు పంపిచ్చి సావాడు. వానికి ఇయ్యాలిసింది ఇచ్చే వచ్చాడు. మన వల్ల యాడ అవుతాది సెప్పు, ఎన్ని సార్లు ఇద్దరం పోలా. ఆడ్ని ఈడ మేపాలంటే నా వల్ల కాదు. ఈడ కథ వానికి తెలిసిందే కదా నన్ను ఎం జేయ్యమంటావ్. నాకు ఆయమ్మి ఈడికి రావాలనుంది అని మెకంలో బాధ పెళ్ళాంకు కనపడకుండా పైకి సూచ్చు మాట్టాడ్తాన్నాడు సుదర్శనం.

“ఎప్పుడో పెళ్ళైన కొత్తలో ఈడికి వచ్చినారు. యేళ్ళు గడిసిపోయా.దానికి ఇంకా కడుపులో ఒక కాయ కూడ పడకపోయా ఎట్టా ఉందొ ఏమో ఇప్పుడైనా పిలిపించి ద్యావరలో మారెమ్మకు బట్టలు పెడదాం అయ్యా.”

“మనకు ఈడ తిన్నికే బరువైపోయింది. మళ్ళా బట్టలు అంటే యానుంచి త్యావలా? ఎంత అయితాదో ఏమో” అంటూ తల పట్టుకున్యాడు సుదర్శనం.

“ఎంత అన్న కానిలే, ఏం ఉంది ఉంటే తింటాం లేదంటే పచ్చులు పండుకుందాం అది బాగుంటే సాలు, యాడన్న అప్పున్నా తీసుకొనిరాయే సచ్చేలోపు ఎట్టోకొట్టా కట్టుకుందాం” అని పెళ్ళాం అనేసరికి సుదర్శనం కళ్ళలో నీళ్ళు గిర్రున తిరిగినాయి.

“ఆ అదే దాని గురించే సూచ్చనా. ఎవర్ని ఆడగల అని? దండోరా అయిపోయినాక పోయి ఒలేడ్డిని అడుగుతా, ఏం అంటాడో ఏమో? ఓలేడ్డిని అడగాలంటేనే బయమేచ్చందే” అని పిల్లోడి లాగ పెళ్ళాం వైపు చూసాడు సుదర్శనం.

***

తలారి యెనక్కి తిరిగి “నీ పాసుగుల నువ్వు ఏందీరా సామి ఈరోజు ఆ ఓలెడ్డి సేతులకు పని పెట్టేలాగా ఉన్నావ్ నడుసురా ముందు మళ్ళా దిగులుపడుదువు.”

సావిటి కాడ అందరూ వీళ్ళద్దిరి కోసమే ఎదురుసూచ్చన్నట్టు ఉంది వాతావరణం. ఇద్దర్ని సూడగానే ఓలెడ్డికి యాడ లేని కోపం వచ్చి పడింది. ఓలేడ్డి వైపు సూసిన తలారి ఈరోజు రెడ్డి సేతీలో యేట్లు ఖాయం అనుకోని సుదర్శనం వెనక దాంకున్యాడు. పోయి ఎంతసేపుఅయిందిరా నా కోడకల్లరా మీకోసం ఈడ ఎంతసేపు ఉండాలిరా అని ఇద్దరి మీదకు వెళ్ళాడు ఓలెడ్డి. దెబ్బలు తిన్నికే పుట్టినట్టు సేతులు కట్టుకొని నిలబడి మిందకు వస్తున్న రెడ్డిని సూసి ఎం చెయ్యాలో అర్థం కాకా “రెడ్డి రెడ్డి తప్పు అయింది రెడ్డి ఇంటి కాడ తప్పెట కాల్చాంటి అందుకే టయమ్ పట్టింది రెడ్డి” అని ఒలేడ్డి కాళ్లు పట్టుకోనికి వంగాడు సుదర్శనం.

సుదర్శనం అలా చేసేసారికి ఒలేడ్డి కోపం తగ్గివెనక్కి జరిగి తలారి వైపు చూస్తూ “ నా కొడక ఈ మధ్య నీకూ బాగా బలసిందిరా దించుతా” అంటూ అరుగు మీద కూచ్చున్నాడు. ఒలేడ్డి అలా కూర్చున్నాక పసిడేంట్ ముందుకు వచ్చి

“రేయ్ ఇంగో వారం రోజుల్లో ద్యావర మొదలైతాది. మారెమ్మ కాడ యాట తెగే దాంక రేపటి నుంచి ఊర్లో ఎవ్వరు నీసు ముట్టుకోవ్వద్దు. రేపు పొద్దున్న సోడమ్మదేవళం కానుంచి మారేమ్మకు బట్టలు పెట్టానికి పోతున్నాం అందరు రావాలి అని దండోరా ఎయ్యిపొండి” అనిసెప్పి ఒలేడ్డి వైపు తిరిగాడు పసిడేంట్. టువ్వాల నెత్తికి సుట్టుకొని తప్పెట సర్దుకొని ఊర్లోకిపోయినారు ఇద్దరు. సుదర్శనం తప్పెట కొడ్తాంటే పసిడేంట్ చెప్పింది అందరికి సెప్తున్నాడు తలారి.

“ఊరి జనాలకు సెప్పొచ్చేది ఏంటంటే ఇంగో వారం రోజుల్లో ద్యావర మొదలైతాన్ది, అప్పటి దాంక ఎవ్వరు నీసు తినకూడదు.రేపు పొద్దున్న మారెమ్మ తల్లికి బట్టలు పెట్టడానికి పోతననారు అందరూ సోడమ్మ దేవళం కాడికి రావలహో” అని సెప్పుకుంటూ ఊరు మొత్తం తిరిగొచ్చేసరికి తప్పెట శబ్దం తలారి మాటలు రెండు ఆగిపోయి వెనక్కి తిరిగారు ఇద్దరు.

తలరి హమ్మయ్య అనుకోని “రా రా  తొందరగా పోదాం అరిసి అరిసి పానం పోయింది.పసిడేంట్ ఇంటి కాడికి పోయి లెక్క ఇప్పించుకొని రెండు సుక్కలు యేసిపోదాం.”

“లేదు లేన్నా నాకు ఊర్లో రొంతా పని ఉండాది నువ్వు పో, లెక్క రేపు తీసుకుంటాలే” అని సెప్పి ఒలేడ్డి ఇంటి వైపు మల్లాడు సుదర్శనం.

సీకటి పూర్తిగా ఊరిని సుట్టుకుంది. ఆ సీకటికి తారోడ్డు కూడా సరిగ్గా కనపల్లేదు.తలారి పిలిచిన తొందరలో చెప్పులు కూడయేసుకోకుండా వచ్చాడు సుదర్శనం. వణుకుతున్న సుదర్శనం వొళ్ళు యెన్నెల్లో స్ప్రష్టంగా కనపడతాంది. ఓలేడ్డి ఇంటికి పోవాలనే తొందరల్లో ఆదాలబాదలో ముందర ఉన్నా రాయికి తగిలి కిందపడిపోయాడు దెబ్బకు బోటికిన వేలు చితికిపోయింది. దారంత నెత్తుర కారుతున్న గుంతలను ఏమాత్రం సూడకుండా గుడ్డిగా ముందుకు పోతనాడు.

ఎప్పుడు కనపడని రెడ్డి గారి ఇల్లు ఆ రాత్రి పెద్ద భూతంలా కనపడతాంది సుదర్శనంకీ. లోపలోకి వెళ్లకుండా గేట్ దగ్గరే నిలబన్యాడు. ఆ చీకట్లో గేట్ దగ్గరే అంగీ లేకుండా భుజానికి తప్పట తగిలించుకొని నిలబన్య సుదర్శనాన్ని చూసి రెడ్డి గారి కుక్కలు మొరగడం మొదలు పెట్టాయి. కుక్కల అరుపులకు ఓలేడ్డి భయటకు వచ్చి లైట్ వేసి నిలబన్యాడు. ఓలేడ్డి దగ్గరకు వచ్చి నిలబడ్డ సుదర్శనంతో “ఏంట్రా దండోరా అయిపోంగానే ఆ పసిడెంట్ ఇంటి కాడికి పోకుండా ఈడికి వచ్చినావు యెందీ సంగతి” అని వరండాలో ఓలేడ్డి కోసమే సేసినట్టే ఉండే చెక్క కుర్చీలో రాజులా కూచ్చున్నాడు

“మీతో మట్టాడదాం అని వొచ్చిన , రొంతా పని పడిండాది రెడ్డి.”

సుట్టా ముంటించుకుంటున్నా ఓలేడ్డి గోడకు తగిలించి ఉన్నా పులి లాగా కనపడుతున్నాడు సుదర్శనంకీ. ఓలేడ్డి యెందో సెప్పు అనగానే “ఒక పదివేలు లెక్క కావాలి అయ్యా శానా రోజులు అయింది పిల్లను ఇంటికి పిలిపించుకొని ఈసారి ద్యావరలో మారెమ్మకు బట్టలు పెట్టిద్దాం అన్నది ఇంటిది… మీరు రొంతా దయతలిచ్చే” అని గోడకు ఉన్నా పులి బొమ్మ వైపు ఓలేడ్డి వైపు సూచ్చు అడిగాడు సుదర్శనం.

సుదర్శనం చెప్పిన మాటలు విన్నాడో లేదో ఏం మాట్టాడకుండా సుట్టా తాగుతా చీకటిలోకి సూచ్చనాడు ఓలేడ్డి. ఇంటి కాడ శాంతమ్మ గురించి ఆలోచిస్తూ రెడ్డి మాటల కోసం ఎదురుసూచ్చన్నాడు సుదర్శనం. కీసురాళ్ళు చేసే శబ్దం తప్ప యే శబ్దం లేదు అక్కడ. ఆ నిశ్శబ్దం సుదర్శనం భయాన్ని ఇంకా పెంచింది. లయగా తగులుతున్న గాలికి దెబ్బ తగిలిన బోటికినవేలు దగ్గర నెత్తర గడ్డకట్టింది కానీ కర్తల నుండి కారుతున్న చెమట మాత్రం తగ్గలేదు.

కీసురాళ్ళ శబ్దాని చెదరకొడుతూ “సరే మరీ వడ్డీ ఎంతా ఉంటుందో తెలుసు గదా? అని పైకి లేశాడు ఓలేడ్డి.తెలుసయ్యా అంటూ సుదర్శనం కూడా పైకి లేశాడు. అయితే ఉండు మరి వచ్చా అని లోపలకి వెళ్తున్నా ఓలేడ్డిని చూసి సావిటి కాడ ఉండే ఓలేడ్డేనా లేకపోతే సావిటోలో ఉన్నా చెన్నకేశవ సామా అన్నట్టు సూసి రెండు సేతులు పైకెత్తి ముక్కాడు. కొద్దిసేపటికి ఓలేడ్డి లెక్కతో వచ్చి ఇద్దోరా తీసుకో అని లెక్క సుదర్శనం సేతిలో పెట్టి ఉత్తా ప్రామిసరి నోట్ మీద వేలిముద్రలు యేపించుకున్నాడు.

“ముందు లెక్కనే శానా ఉంది సూసుకో మరి, ఎప్పుడు ఇచ్చావో ఏమో మరీ నా గురించి తెలుసు కదా…” అంటుండగ్గానే ఎట్టాయిన సరే ఇచ్చానయ్యా అని బదులు ఇచ్చాడు సుదర్శనం. అది సూచ్చపో అని లోపలోకి వెళ్లిపోయాడు ఓలేడ్డి. సుదర్శనం బయటకు వెళ్తుండగా మళ్ళీ కుక్కలు మొరగడం మొదలు పెట్టాయి. బోటికినయేలు సలుపుకి కుంటుకుంటూ ఇంటి దావ పట్టినాడు సుదర్శనం.

సుదర్శనం ఇంటికి పోయేసారికి బోకులు కాన్నే కూచ్చుందిశాంతమ్మ. కూనిరాగం పాడుకుంటూ వచ్చనా మొగుడి అడుగుల సప్పుడుతో లెసోచ్చి తప్పెట తీసుకొని ఇంట్లోకి పోయింది.

“పిల్లోడు యాడికి పోయినాడు, బువ్వ తిన్నాడా?”

“ఆ తిన్యాడులే నరేష్ ఇంటి కాడికి పనుకుంటా అని పోయినాడు.”

సలుపుతున్న బొటికినయెలుకూ పసుపు పట్టించి మంచం కాడ కూచ్చుంటున్న మొగుడితో “తిందువురా మళ్ళా ఆడ కూచుంటున్నావ్?” అని బొకులు అన్నీ సుదర్శనం ముందర యెసింది శాంతమ్మ.

“తిందామ్లే నిదానంగా… ఇద్దో లెక్క అని బొడ్డలో ఉన్న పదివేలు” తీసుకొని పెళ్ళాం సేతిలో పెట్టాడు. ఆ క్షణంకూతుర్ని సూసినంత ఆనందపడింది శాంతమ్మ.

“ఎప్పుడు పోతావే మరీ?”

“నేను సిన్నోడు ఎల్లుండి టౌన్‌కి పోయి బట్టలు తీసుకుంటాం ఆనుంచి వాణ్ని ఇంటికి పంపించి నేను పోయి పిల్సుకోని వచ్చా” అంటూ తెల్లే దగ్గరకు జరిగినాడు. ఇద్దరు కడుపు నిండా తిని సుమతీ గురించి మట్టాడుకుంటూ పండుకున్యారు. రెండు రోజులు గుడిసె సర్దుకోనికే సరిపోలేదు శాంతమ్మకు. అబ్బా కొడుకులు ఇద్దరు కలిసి టౌన్‌కు పోతుంటే శాంతమ్మ ఆనందం అలివి కాలేదు. రెండు రోజుల తరువాత వచ్చే ద్యావర శాంతమ్మ గుడిసెలోకి ముందే వచ్చింది. మధ్యానం కల్లా గోపాల్ బట్టలు తీసుకొని ఇంటికి వచ్చినాడు. నాయన అక్కలాంటికి పోయినాడు రాత్రికి వచ్చా అని సెప్పమన్నాడు అని తెచ్చిన బట్టలు వాళ్ళ అమ్మ ముందర యేసి ఇద్దో ఇది ఈసీర మారెమ్మకూ పెట్టనీకి ఇది నీకు అక్కకు ఈ జీన్స్ పాయింట్ అంగీ నాకూ ఎట్లుంది అని ఏసుకొబోతుంటే

కొడుకు వైపు చూసి “ఒయోబ్బో సూసినం లే సంబడం పోయి కాళ్ళు కడకచ్చుకపో బువ్వ తిందాం ముందు” అని బట్టలు లాక్కున్దీ.

“టౌన్లో నేను నాయన తిన్నాంలే నువు తిను పో నేను బయటకి పోతనా” అని రోడ్ మీదకు ఉరికినాడు గోపాల్.

***

ఊర్లో కానుగసెట్టు కాడ సాన మంది గుంపుండేసారికి ఆడికి పోయి తొంగి సూచ్చనాడు గోపాల్ గుంపుమధ్యలో తిరుపాలయ్యకాళ్ళ సందున గొర్రెను పెట్టుకొని నిలబన్యాడు.

రేయ్ తిరుప్యాల్ ఇది పోయి సర్పంచ్ ఇంటికి కాడ కట్టైపో అని ఓలేడ్డి సెప్పేసారికి ఒక్క ఉదుటున దాని ఎత్తి భుజం మీద ఏసుకొని సర్పంచ్ ఇంటికి బయల్దేరినాడు. మామ సావిటికాడ పారేట్ పంద్యానికా ఇది అంటూ తిరుపాలయ్యతో పాటు నడుస్తున్నాడు గోపాల్.

“ఆ అవునురా అల్లుడు మన్నాడు పారేటు గొర్రె ఇదే రా.”

“మామ ఎవరైనా పోవచ్చా దీని యెనక, ఈ సారి నేను ఉరుకుతా మామ”

“ఎవరైనా పోవచ్చురా ఎవరు పట్టుకుంటే వానికే ఇది. దీని తోక కోసి సున్నం పెడ్తే మంటకు ఎట్టా ఉరుకుతాదో ఎవరికి తెల్డు. ఎట్టా అంటే అట్టా పోతాది శాన జాగర్త ఉండాల.” తిరుపాలయ్య సెప్పేది ఇని ఆలోసించుకుంటూ సావిటి కాడికి పోయినాడు గోపాల్.

సుదర్శనం సుమతీతో ఇంటికి వచ్చేసారికి రాత్రి ఎనిమిది అయింది. సుమతీని సూడగానే శాంతమ్మ కళ్ళు నీళ్ళతో తడిసిపోయినాయి. తల్లినిఅమాంతం సుట్టేసుకుంది సుమతీ. సుదర్శనం నిశ్శబ్దాన్ని మోచున్న సీకటిలాగా ఇంట్లోకి పోయినాడు. సుమతీ ఇంటికి వచ్చిందిన్న సంతోషంలో మొగుడి వైపు మాత్రం సూల్లేదు శాంతమ్మ. తల్లి కూతుళ్లు ఇద్దరు పోయికాడ కూచ్చోని మాట్టాడుకుంటున్నారు. సుదర్శనం ఏదో ఆలోసించుకుంటూ మంచంలో పడుకున్యాడు. బువ్వ తిన్నికి గోపాల్ పిలుచున్న పల్కట్లేదు. రెండు మూడు సార్లు పిల్సేసరికి ఆకలిగా లేదని సెప్పాడు. అంతసేపు కూతురితో ఆనందంగా మాట్టాడుతున్న శాంతమ్మ మొగునీవైపు అప్పుడు సూసింది.

“ఏం అయిందే మీ నాయన అట్టా ఉండాడు” అని అడిగింది కూతుర్ని.

“ఏం కాలేదు మా… సాయంత్రం వచ్చేటప్పుడు ఇంటి కాడ తిన్యాడులే అందుకే ఆకలికాలేదు ఏమో” అని తలకాయ దించుకుని తల్లికి కనపడకుండా బాధ పడుతూ గోపాల్‌ను తిన్నికి పిలిచింది సుమతీ.

అడగడం మర్సిపోయినా మీ ఆయన ఏం అన్నాడు, ఎందుకు రాలేదు అని అడిగింది శాంతమ్మ. తింటున్న ముద్ద కంటే బలంగా శాంతమ్మ మాటలు సుమతీ గొంతులో దిగాయి.“ట్రాక్టర్ పనులు ఉన్నాయి పిల్సకపోనీకి వచ్చా అన్నాడు మా” అని తడుముకోకుండా సెప్పింది సుమతీ. సాన రోజులు తరువాత ఆరాత్రి కూతురి మీద సెయ్యి వేసుకొని పండుకుందీ శాంతమ్మ. పొద్దున కూతుర్ని పిలుస్కొని వాళ్ళ గుడిసెలు మొత్తం తిరిగి అందర్నీ రేపు మారెమ్మ కాడికి రమ్మని పిల్సింది శాంతమ్మ.

ద్యావర రోజు రానే వచ్చింది. కోడి కూత కంటే ముందే లేసినారు ఊళ్ళో జనం. మారెమ్మ దేవళం కాడ తప్పెట్లు మొగుతున్నాయి. గుడిసెలు మొత్తం ప్యాడ నీళ్లతో అలకి ఎర్రగా కనప్డతానాయి. అన్ని గుమ్మాలు మాడిఆకులతో మెర్సిపోతునాయి. ఊరుమొత్తం పండగ సేసుకుంటుంది. ఊళ్ళో ద్యావర కనపడని ఇల్లు లేదు. శాంతమ్మ మారెమ్మకు బాణం వండుతుంది. సుమతీ మారెమ్మకు పెట్టాలిసిన బట్టలు సర్దుతుంది.

“తొందరగా కానియే నేను మళ్ళా ఊళ్ళోకి పోవాలి. మాపిడింతల పారేట పందెం ఉంది. మద్యానం దండోరా ఎయ్యాలి తొందరగా కానియ్యండి” అని గోపాల్‌తో కలిసి తప్పెట కాల్చుతున్నాడు సుదర్శనం.

ముందర సుదర్శనం తప్పెట కొడుతూ నడుచ్చంటే సుమతీ పసుపు రాసిన బోనం నెత్తిమీద పెట్టుకొని బయటకు నడిచింది. మారెమ్మకు పెట్టాలిస్సిన చీర పట్టుకొని కూతురితో పాటు నడచ్చంది సుమతీ. తిరుపాలయ్యా పెళ్ళాం,సుభద్ర, ఇంగా రొంతామంది తోడుగా పోతన్నారు. యేసుకున్న జీన్స్ ప్యాంట్ వాళ్ళ అమ్మకు సూపిచ్చి మురిసిపోతనాడు గోపాల్. కూతురు వచ్చింది ఆనందం కన్నా అల్లుడు సెప్పిన మాటల భయమే సుదర్శనం మొఖంలో కనపడతాంది.కూతరు ఇంటికి వచ్చినప్పటి నుంచి సుమతితో ఒక్క మాట మాటడలేదు సుదర్శనం. అల్లుడుఇంట్లో జరిగిన యవ్వారం శాంతమ్మకు ఎలా చెప్పాలో అర్థంకాక రెండు రోజులునుంచి అల్లాడిపోతున్నాడు. అడిగింది ఇచ్చేదాంక కూతురిని తన ఇంటికి పంపించద్దు అన్న అల్లుడి మాటలు తప్పెట చేసే శబ్దం కంటే ఎక్కువగా మొగుతున్నాయ్ సుదర్శనం సెవుల్లో. తన బాధకు తప్పెట బలవుతుంది. తప్పట శబ్దం ఊరు మొత్తం ఇనపడేలా కొడ్తన్నాడు. శాన రోజులకు కూతురు వచ్చిన ఆనందంలో అన్న రెచ్చిపోయి కొడుతున్నాడు అక్క అని సుభద్ర నవ్వుతుంది. మారెమ్మ దేవళం వచ్చేదాంక ఎక్కడ ఆపకుండా ఆశబ్దం తీవ్రత ఎక్కడ తగ్గకుండా కొడ్తనే ఉన్నాడు. తప్పెట బాధ తెల్సిన సుమతీ మౌనంగా బాధపడుతూ వాళ్ళ నాయన వెనక నడచ్చంది.

మారెమ్మ దేవళం కాడ రెడ్డి గార్ల డప్పులు మొగుతున్నాయి. పోతురాజు సలం నెత్తురతో ఎర్రగా రెండో సూర్యునిలా మెరుచ్చంది. పొద్దునుంచి దేవళం కాడ కోళ్ల తలలు తెంపే సాయబు కత్తి నెత్తర ఆరట్లేదు. గుడి సుట్టూ తిరిగే ట్రాక్టర్ల శబ్దం, గుడిలోపల గంటలు శబ్దం, జనాల కేకలు, కోళ్లు, పొట్టేలు అరుపులతో ఒక యుద్ధ వాతావరణంల ఉంది ఆ దేవలమంతా. శాంతమ్మ, సుమతీ గుడి సుట్టూరు తిరిగిబోనం, చీర పూజరికి ఇచ్చి ఆ తల్లిని ముక్కుకుంటున్నారు. దండం పెట్టుకుంటున్న కూతురి వైపు సూచ్చు సుదర్శనం కూడ తను ఆ తల్లికి దండం పెట్టుకున్నాడు. అందరూ ఇంటికి వచ్చి బువ్వ తినేసారికి ఒంటిగంట అయింది. బువ్వ తిని నడుము వాల్చేలోపలే తలారి వచ్చి గుడిసె ముందర నిలబెన్యాడు. తప్పెట టువ్వాలు తీసుకొని మాపిడింతల పారేట పంద్యానికి ఆ యమ్మిని పిల్సుకొనిరా సావిటి కాడికి అని శాంతమ్మతో చెప్పి బయటకి నడ్సినాడు సుదర్శనం.

****

సిన్న, పెద్ద ,ముసలి, ముతక అందరూ సావిటి కాడ్నే ఉన్నారు. సావిటి మొత్తం ఊరి జనమే. సారాయి యేర్లై పారుతుంది. ఊర్లో ఒక్క మనిషి ఉంటే ఒట్టు. డప్పులమోతతో,పగటేసాగాళ్లతో సావిటి ఊగిపోతుంది. మందంతా ద్యావర పందెం కోసం కాసుకొని ఉన్నారు. రెండు సిత్తులు సారాయి తాగి తప్పెట మొయిచ్చన్నాడు సుదర్శనం. కింద మట్టి రోడ్లో తిరుపాలు కాళ్ల సందున గొర్రె ఉంది.వాళ్ళ అమ్మ కాడ ఉండే గోపాల్ తిరుపాలు కాడ ఎప్పుడొచ్చి నిలబన్యాడో, మామ ఇంగా ఎంతసేపు పడ్తాది అని గొర్రె ఈపు మీద రుద్దుతూ అడిగాడు.

“ఓలేడ్డి ,పసిడెంట్ రావాలి రా. జనం సూడు ఎట్టా ఉండారో ఈ సారి సాన మంది వచ్చారు ఉరకనీకి, మీ అమ్మ కాడికి పోయి సూడు పో నువ్వు ”

“యెంది మామ పోయేది ఈ రోజు ఉరకాల్సిందే గొర్రె పట్టుకోవాల్సిందే అని కళ్ళు రొమ్ము విరిచి సెప్పినాడు గోపాల్.”

“రేయ్ సెప్తండేది నీకే పిల్ల శాటలు కాదు మర్యాదగా పో ఈనుంచి ల్యాకుంటే మీ నాయను పిలుచ్చా అంటుంటగానే రేయ్ తిరుపాల్ రెడ్డి గారు వచ్చన్నారు అని కేక ఇనపడింది.

వెంకటరామిరెడ్డి కొడుకు శేఖర్ రెడ్డి, సాకలోళ్ళ సిన్న గుర్రన్న, మాబున్నీ, శివరాం రెడ్డి, తిరూపాలు కొడుకు బలరాం, మహేష్ రెడ్డి, డబ్బగాడు, ఇంగా ఇరవై మంది గొర్రెను పట్టుకోనికి నిలబన్యారు. వాళ్ళ మద్యన జొరబడి గోపాల్ కూడా నిలబన్యాడు. ఓలేడ్డి, సర్పంచు ఇద్దరు వచ్చి గొర్రెకు ముక్కుకొని టెంకాయ కొట్టి పోయినారు. గొర్రె ఎనక ఉరికే వాళ్ళ మధ్యలో నిలబన్య గోపాల్‌ను సూసి బయపడిపోయాడు సుదర్శనం. ఆజనంలో మత్తు మొత్తం దిగిపోయేలా పిలచన్యా గోపలుకు ఇనపల్లేదు. ఆ నుంచి గుంజకరానికి ఉరుకుతా పోతుండగా తిరుపాల్ గొర్రె తోక కోసి సున్నం పట్టించి ఒక్క దెబ్బ ఎయ్యగానే మంటకు గొర్రె అరుపుకు జనాల కేకలు హోరెత్తాయి. దాన్ని పట్టుకునే ఇరవై మంది ఒక్కసారి పాయర, పాయర అని ముందుకు ఉరికినారు. జనాల అరుపులకి బెదిరి అర్సుకుంటూ ఇష్టమొచ్చినట్టు ఉరికి సావిటి కాడ ఉండే కంపసెట్ల మధ్య పడింది గొర్రె. వాళ్ళ యెనక గోపాల్ కోసం దాని ఎంబడి పన్యాడు సుదర్శనం. పట్టుకో పట్టుకో అని సావిటి మొత్తం దద్దరిల్లిపోతుంది. గోపాల్‌తో పాటు ఇరవై మంది దొబ్బుకుంటూ కంపసెట్ల మధ్య జరబన్యారు. ఆడుంది ఆడుంది దాని యక్క పట్టుకోండి అని అరసగానే గోపాల్ సెతికాడికి వచ్చిన గొర్రె అరుసుకుంటు ముందుకు ఉరికింది. కంపసెట్ల మధ్య కాళ్ళు గీరుకొని పోయినాయి. బయటకు వచ్చి నిలబెన్యాడు. సోడమ్మ దేవళం కాడ ఉంది అనగానే బుస అపకుండానే మళ్ళా దాని ఎంబడి పన్యాడు గోపాల్. ఎవరి సెతికి దొరకున్నది. మద్యానం డప్పు కొట్టి అలిసిపోయిన సుదర్శనం ఉరకలేక గొర్రెలాగనే వగరిచ్చు నిలబన్యాడు, వాళ్ళు లేపే దుమ్ములో గోపాల్ యాడ ఉన్నాడో కనపల్లేదు. గొర్రె యేటి కాడ ఉండే సమాధుల మధ్యకు ఉరికింది. రామిరెడ్డి కొడుకు డబ్బగాడు ఇద్దరు దాని ఎనక ఉన్నారు. దొరికింది దొరికింది అని కేకలు ఏసుకుంటు ముందుకు పోతనాడు డబ్బగాడు. ఇరవై మంది కాళ్ళు యాడ ఆగట్లేదు. సమాధులు కాడ తిరూపాలు కొడిక్కి దొరికినట్టే దొరికి సేతీలోనుంచి తప్పించుకొని పాయ, బుస పెట్టుకుంటూ గోపాల్ ఒరేయ్ గోపాల్ అని అరుసుకుంటూ వచ్చనాడు సుదర్శనం. సమాధులు దాటితే ఇది సుద్ద రాళ్లలోకి పోయేది అనుకోని యేటి కాడ అడ్డ దావలో గొర్రె కంటే ముందు ఆడికి పోయి మాటేశాడు గోపాల్. పాన భయంతో గొర్రె సచ్చా బతుకుతా పోతుంది. గుర్రన్న,పకృద్దీన్ ఉరకలేక మద్యలోనే ఆగిపోయారు. మహేష్ రెడ్డి, రామిరెడ్డి కొడుకు ఇద్దరు గొర్రెకు దగ్గర వచ్చనారు. గొర్రె సమాధులు దాటుకుని సుద్ద రాళ్లలోకి పోతాన్దీ. గొర్రె కోసం ఆడముందే కాసుకొని ఉన్నా గోపాళ్ను చూశాడు శేఖర్ రెడ్డి. సుద్దరాళ్లలోకి వచ్చే గొర్రె కనపడుతుంది గోపాల్‌కి. దాని ఎనక ఇద్దరు మనుసులు కనపడతనారు. కింద మట్టి తీసుకొని సేతులకు రుద్దుకున్నాడు. గొర్రె మీద దుంకడానికి పులిలా కాసుకొని ఉన్నాడు గోపాల్. తప్పించుకొని పోడానికి దారే లేదు అనుకున్యాడు. బుసపెడ్తున్నా గొర్రె సేతిలోకి పడిందన్న లోపే శేఖర్ రెడ్డి మోకాలుగోపాల్ రొమ్ముకు బలంగా తాకింది. పెద్దపులి పంజా మేకపిల్ల మిందా పడినట్టు గోపాల్ మిందా పడింది. దెబ్బకు సుద్దరాళ్లలోకి ఆమడ దూరంలో ఎగిరిపన్యాడు గోపాల్. గొర్రె ముందుకెళ్లి ఆగిపోయింది. శేఖర్ రెడ్డి గొర్రె మీద పడ్డాడు. రొంచేపటికి అందరూ గొర్రె చుట్టూరు నిలబన్యారు. మహేష్ రెడ్డి కళ్ళ ముందు జరిగింది చూసి భయంతో వణుకుతు నెత్తురుతో ఎర్రగా మారుతున్న సుద్దరాళ్లవైపు సూచ్చు నిలబన్యాడు. పొద్దన మారెమ్మ దేవళం కాడ కోడి కొట్టుకున్నట్టు కొట్టుకుంటున్నాడు గోపాల్.

గొర్రె కోసం ఇంగో ఇరవై గొర్రెలు ప్రపంచాన్ని మరిసిపోయి కొట్టుకుంటున్నారు. కొడుకు కోసం వచ్చినసుదర్శనంకి సుద్ద రాళ్లతో ప్యానం లేకుండా పడివున్న కొడుకుని చూసి గుండె పగిలేలా అరుసుకుంటు పోయినాడు. తిరుపాలు నెత్తి బాదుకుంటున్నాడు. గొర్రెను పట్టుకోని జనాల గుంపులో గొర్రె కొట్టిన దెబ్బకు ఎగిరిపన్యాడు పాపం అని శేఖర్‌రెడ్డి అనగానే మహేశ్‌రెడ్డి కళ్ళు ఎరుపెక్కి అటు వైపు చూశాయి. ద్యావరకోసం మురిపెంగ యేసుకున్న కొత్త బులుగు జీన్స్ పాయింటు ఎర్రగా అయిపోయింది. సుద్దరాళ్ళ కాడ నెత్తుటి మట్టిని పట్టుకొని గొంతు పగిలిపోయేలా ఎడ్చనాడు తిరుపాలు. ఏం జరిగిందో తెల్సుకోనేలోపే సేతులమీద ఏసుకొస్తున్న కొడుకును చూసి శాంతమ్మ కళ్ళు తిరిగి పడిపోయింది. సుమతీ తమ్ముని వైపు సూచ్చు గుండెలు బాదుకుంటుంది. కొడుకును ఎత్తుకొని ఎడ్సుకుంటూ పిచ్చి సూపులు సూచ్చనాడు సుదర్శనం. గోపాలు నెత్తురు పులుముకొని ఆరోజు సూర్యుడు మరింతా ఎర్రగా మారి వాలిపోతున్నాడు. ఊరు శస్మశానం అయింది. సావిటి మొత్తం నిశ్శబ్దంగా మారిపోయింది. అందరూ రాళ్లలాగే నిలబడి సూచ్చనారు అచ్చం ఆ సావిటి గుళ్ళో ఉండే దేవుడు లాగే.

*

జీవితానికి ఎదురు నిలబడి పోరాటానికి దిగితే..ఈ కథ:శ్రీధర్ వెల్దండి

జీవితమనే  పులిజూదం ఆటలో వేటాడేది ఎప్పుడూ ఆధిపత్య వర్గాలే. బలయ్యేది ఎప్పుడూ దళితులైన సన్న జీవాలే. పేదరికం ఒక వైపు, అప్పులు మరో వైపు అంతరానితనం ఇంకో వైపు, ఆధిపత్య వర్గాల దాడులు వేరొక వైపు ఇట్లా ఎన్నో వేటల మధ్య బతుకు దేవర ముందు గొర్రె పిల్లలాగా గిలగిలా తన్నుకుంటుంది. తెగించి జీవితానికి ఎదురు నిలబడి పోరాటానికి దిగితే ఎక్కడి నుంచో ఓ బలమైన పాదం వచ్చి గుండెల మీద బలంగా తన్ని రక్తం కళ్ళజూస్తుంది. తండ్రి కొడుకుల బతుకు పోరు, తల్లి కూతుళ్ల మమతానురాగాలు ఓ అందమైన శైలీ, శిల్పాల్లో కూర్చి చెబితే ఎలా ఉంటుందో తెలుస్తుంది ఈ కథ చదివితే!

*

 

సురేంద్ర శీలం

1 comment

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)
  • కన్నీళ్లొచ్చాయి కామ్రేడ్ ..
    ఈ కథ చదివి. చాలా చాలా బాగుంది కథ ..
    అభినందనలు

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు