పాపులేషన్ బాంబ్!

కదిలే కాళ్లు, పని చేసే చేతులు, తినే నోళ్లు పెరుగుతున్నంతగా భూమి పెరగదు.  భూమి మీదనూ, ఆకాశంలోనూ అభివృద్ధి పేరిట ఎన్నో విస్ఫోటనాలకు పాల్పడటం ద్వారా భూగోళానికి, ఈ విశ్వానికి మనిషి ఇప్పటికే చాలా హాని చెసాడు. చేస్తున్నాడు. మనిషి చేస్తున్న అతి పెద్ద విస్ఫోటనాల్లో జనాభ విస్ఫోటనం ఒకటి.  మరీ ముఖ్యంగా భారతదేశం వంటి అభివృద్ధి చెందుతున్న (నిజంగా చెందుతున్నదా?) దేశాలకి ఇది మరింత హానికరం.  “దేశమంటే మట్టి కాదోయ్. దేశమంటే మనుషులోయ్” అన్న కవితా వాక్యం గొప్పదే కావొచ్చు.  కానీ మనుషులెంతమందుంటే ఆ దేశం అంత గొప్పది మాత్రం కాలేదు.  పైగా అంత బలహీనమవుతుంది.

ఒక్క భారతదేశమనే కాదు ప్రపంచవ్యాప్తంగా జనాభ పెరుగుదల జాంబవంతుడి అంగలతో వేగంగా అభివృద్ధి చెందుతున్నది.  ఒక అభివృద్ధి చెందిన యూరోపియన్ సమాజం స్థాయి జీవన నాణ్యతతో మనిషి బతకాలంటే ఈ భూమ్మీద రెండు బిలియన్లకి మించి జనాభ వుండకూడదు.  కానీ ఇప్పుడు సుమారు ఎనిమిది బిలియన్ల జనాభ భూమ్మీద బతికేస్తున్నది. మానవజాతి 18 వ శతబ్దానికి వంద కోట్ల జనాభాగా మారటానికి ఎన్నో మిలియన్ల సంవత్సరాలు పట్టింది.  మొదటి ప్రపంచ యుద్ధానికి ఒక్క 1.79 బిలియన్ (నూట డెబ్భై తొమ్మిది కోట్లు) మాత్రమే నివశించిన భూమ్మీద జనాభ  వందేళ్లలో నాలుగు రెట్లు పెరిగింది.  అంటే సగటున ప్రతీ పది పన్నేండేళ్లకి ఈ జనాభకి వంద కోట్లు జత చేరుతున్నదన్న మాట.  ఇది అసాధారణం కాదూ?

అన్ని దేశాల భూ పరిమాణం ఒక్కటే కాదు.  భూమి అన్ని దేశాలకు సమానంగా పంపిణీ కాలేదు.  మనలో నాలుగో వంతు జనాభ వున్న అమెరికా మన కంటే ఆరు రెట్లు పెద్దది.  అందుకే జనాభ సాంద్రత అధికంగా వున్న దేశాలు (సింగపూర్ వంటి నగర దేశాలు మినహాయిస్తే) సాధారణంగా పేదరికంలోనే వుంటాయి.  “మంది ఎక్కువైతే మజ్జిగ పలుచన అవుతుంద”నే సామెత జనాభ పెరుగుదలకి సరిగ్గా అన్వయించవచ్చు.

జనాభ పెరుగుతున్న కొద్దీ ప్రజల అవసరాలకు అనుగుణంగా సహజ వనరులు కొల్లగొట్టబడతాయి.  ఆహార పదార్ధాల కొరత ఏర్పడుతుంది.  నీటి వినియోగం పెరుగుతుంది.  అడవుల నరికివేతతో వాతావరణ సమతౌల్యం దెబ్బ తినటమే కాక వన్య ప్రాణుల అస్తిత్వం కూడా ప్రశ్నార్ధకమై నేచురల్ సెలెక్షన్ దెబ్బ తినటంతో వ్యవసాయోత్పత్తి నష్టపోతుంది. గృహ నిర్మాణాలు ఎక్కువై వ్యవసాయ భూములు కృశించిపోతుంటాయి.  వాహనాల సంఖ్య పెరిగి ఇంధన వినియోగం ఎన్నో రెట్లు అధికం అవటం వలన కాలుష్యం పెరిగి గ్రీన్ హౌస్ గ్యాసెస్ విడుదల ఎక్కువవుతుంది.  ప్రజల అవసరాలకు తగ్గట్టుగా ఉత్పత్తి పెరగటానికి ఫాక్టరీలు, పరిశ్రమల సంఖ్య పెరిగి కాలుష్యం ఉధృతమవుతుంది.  ఆస్తుల పంపకాలు ఎక్కువై మానవ సంబంధాలు దెబ్బతింటాయి.  గృహ వసతి చిన్నదై ఇరుకిరుకు జీవితాల వల్ల ఏకాంతానికి తావు లేక ఇబ్బందులెదురవుతాయి.  విద్య, వైద్యం యొక్క డిమాండ్ పెరిగి ప్రభుత్వం చేతులెత్తేసే పరిస్తితి వస్తుంది.  నిరుద్యోగం విపరీతంగా పెరుగుతుంది.  ఏవైనా అంటురోగాలు వస్తే వాటి విజృంభణతో క్రిక్కిరిసిన జనాభా కారణంగా  అదుపు చేయటం కష్టం అవుతుంది.  నీటి వాడకం అధికంగా పెరిగి భూగర్భ జలాలు క్షీణించి క్షామం వస్తుంది.  డ్రెయినేజ్ సమస్యలకు, తద్వారా వ్యాధులకు అంతుండదు.   ఈ ఇబ్బందులు ప్రధానంగా భారత్, పాక్, శ్రీలంక వంటి మూడో ప్రపంచ దేశాలకు చెందినవే అయినా కూడా వాటి ప్రభావం ప్రపంచం మొత్తం వుంటుంది.  కొన్ని సంపన్న దేశాలు తక్కువ జనాభతో ఇబ్బందులు పడుతున్న మాట వాస్తవమే.  జనాభ పెంచుకోవటానికి తమ ప్రజలకి అనేక ప్రోత్సాహకాలు కూడా ప్రకటిస్తున్నది నిజమే.  కానీఎ మొత్తం మీద ప్రపంచం గత వంద సంవత్సరాలలో నాలుగు రెట్ల జనాభ పెంచుకున్నది. దాని దుష్పరిణామాలను విశ్వం మొత్తం అనుభవిస్తున్నది ఈ రోజున.

****

అధిక జనాభ దేశ ప్రగతికి గొడ్డలి పెట్టు అని మనదేశంలో ఎవరైనా చెబుతారు.  అందరికీ అధిక జనాభ గురించి దేశం ఏమైపోతుందనే టెన్షన్ కూడా వుండొచ్చు.  కానీ జనాభ పెరుగుదల ఎలా నియంత్రించాలనే విషయంలో మాత్రం మొత్తం దేశం నిర్లక్ష్యం కనబడుతుంది.  ఇద్దరు పిల్లలతో ఆపరేషన్ చేయించుకుంటే చాలనేది గొప్ప చైతన్యమై పోయింది.  మన దేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పుడు అంటే 1947లో జనాభ కేవలం 35 కోట్లు.  1951లోనే కుటుంబ నియంత్రణ కార్యక్రమం మొదలైనప్పటికీ అది కేవలం 1970లోనే ఒక ఊపందుకున్నది. నా చిన్నప్పుడు “ఇద్దరు లేక ముగ్గురు పిల్లలు చాలు” అనేది కుటుంబ నియంత్రణ నినాదం.  సినిమాల్లో అధిక జనాభ గురించి, కుటుంబ నియంత్రణ గురించిన ప్రభోదం వుంటే ప్రగతిశీలమైన సినిమాగా చూసేవారు. (ఒక సినిమాలో నాగభూషణం ఒక హరికథలో “ఇద్దరు లేక ముగ్గురు చాలని వినలేదా?  ఇందరు పిల్లలు కనటం నీకు మరియాదా?” అంటూ పాడి చివరిలో “ఇంతలో ఆకాశవాణి ప్రత్యక్షమై ‘ఎర్ర త్రికోణం ఎర్ర త్రికోణం ఎర్ర త్రికోణం” అంటూ సెలవిచ్చింది” అని ముగిస్తాడు.  బహుశా “కలెక్టర్ జానకి” సినిమా అనుకుంటా)  ఆ కాలంలోనే కాంట్రాసెప్టీవ్స్ పరిచయం అయ్యాయి. పోస్టాఫీసుల్లో “నిరోధ్” కండోంస్ ఉచితంగా సరఫరా చేసేవారు.  ఇదంతా యాభై ఏళ్ల క్రితమే మొదలైనా జనాభ పెరుగుదలని నిలువరించటంలో ఘోరంగా విఫలం అయ్యారు పాలకులు.  కుటుంబ నియంత్రణ అంటే ఒక ప్రచారాంశంగా తప్ప ఒక ఖచ్చిత ఆచరణాత్మక అంశంగా ప్రభుత్వాలు ఏనాడూ చూడలేదు.  దీనికి తగ్గ కారణాలూ వున్నాయనుకోండి.

ఎమర్జెన్సీ కాలంలో జనాభ నియంత్రణ పేరుతో ఆపరేషన్ల సంఖ్యని చూపించటం కోసం అడ్డదిడ్డంగా వ్యవహరించారు.  పెళ్లి కాని స్త్రీ, పురుషులకు కూడా ఫామిలీ ప్లానింగ్ ఆపరేషన్లు చేసిపారేసారు.  ఎమర్జెన్సీ అకృత్యాలకు ఈ ఆపరేషన్లు కూడా ఒక తార్కాణంగా నిలిచిపోయాయి.  అనంతరం 1977లో జరిగిన ఎన్నికల్లో ఇందిరాగాంధి ఓటమికి ఈ అత్యుత్సాహపు ఆపరేషన్లు కూడా ఓ ప్రధాన కారణం.  ప్రజల్లో కొంత వ్యతిరేకత గూడు కట్టుకున్న కారణంగానే ఆ తరువాత ఏ పాలకులూ కూడా ఫామిలీ ప్లానింగ్ ని సీరియస్గా తీసుకోలేదు.  కేవలం ప్రభోదాలకే పరిమితం అయ్యారు. జనాభ నియంత్రణ గురించి ఒక చట్టం చేసే సాహసం చేయలేక పోయారు. అయినప్పటికీ అప్పుడప్పుడు అన్ని పార్టీలకు సంబంధించిన పార్లమెంట్ సభ్యులు అప్పుడప్పుడూ ఏదో ఒక ప్రైవేట్ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెడుతూనే వున్నారు జనాభ నియంత్రణని చట్టబద్ధం చేయటం కోసం.  స్వాతంత్ర్యం వచ్చిన నాటి నుండి ఇప్పటివరకు సుమారు 35 సార్లు ఈ ప్రయత్నం జరిగింది.  కానీ సఫలం కాలేదు.

****

భారతదేశంలో జనాభ పెరుగుదలకి కారణాలు అందరికీ తెలిసినవే.  అవిద్య, అజ్ఞానం, తక్కువ స్థాయిలో స్త్రీ విద్య, తొలి ప్రాయంలోనే పెళ్లిళ్లు, మాతృత్వం గొప్ప విషయంగా భావించటం, వంశాంకురాల కోసం ఎదురుచూసే పిచ్చ సెంటిమెంట్ల వల్ల పెళ్లైన వెంటనే పిల్లల్ని కనేయటం, మగ పిల్లవాడి కోసం అధిక సంతానానికి పోవటం….ఇలా ఒకటనేమిటి?  ఎన్నో కారణాలు.  కానీ వాస్తవం ఏమిటంటే మొత్తం ప్రపంచ జనాభాలో 16 శాతం వున్న భారతదేశం భూగోళంలో కేవలం 2.45 శాతం భూమిని, నాలుగు శాతం జలనిధుల్ని  కలిగివున్నది.  సంవత్సరనికి 1.7 శాతం వృద్ధి రేటుతో 2024 కల్లా (అంటే ఇంకో నాలుగేళ్లల్లో) మనం చైనాని దాటిపోబోతున్నాం.  2030 నాటికి 150 కోట్ల మార్కుని కూడా అందుకోబోతున్నాం.  ఏదో ప్రభుత్వోద్యోగులకు ఇంక్రిమెంట్స్, ఇద్దరు పిల్లలతో ఆపరేషన్ చేయించుకున్న వారికి క్యాష్ ప్రయోజనం కలిగించటం వంటి పైపై చర్యలకు పరిమితం కాకుండా ఈ సందర్భంలో ఏం చేయాలి?  ప్రజల్ని చైతన్యవంతం చేయటంతో పాటుగా జనాభ నియంత్రణ కోసం చట్టాలు చేయాల్సిందే.  ఈ చట్టాల్లో ఎటువంటి రాజకీయ ప్రయోజనాలకు, మతపరమైన సెంటిమెంట్లకు తలొగ్గకుండా ధృఢ సంకల్పంతో కఠిన చట్టాలు చేయాలి.  అందులో పీనల్ ప్రావిజన్స్ కూడా వుంచాలి. ఆ చట్టాల ఆవశ్యకత గురించి ప్రజల్లో విస్తృతంగా ప్రచారం చేయాలి.

 1. బాల్య వివాహాల పట్ల అత్యంత కఠిన వైఖరి తీసుకుంటూ యువతీ యువకులిరువురికీ వివాహ యోగ్యతా వయసు పెంచాలి.
 2. దేశం మొత్తానికి కొన్ని సంవత్సరాల పాటు “బర్త్ హాలిడే” ప్రకటించాలి. అది ఐదేళ్లు వుండాలి. చట్టం చేసిన పది నెలల తరువాత ఒక తేదీ నుండి కొత్తగా పిల్లల్ని కనటం నిషేధించాలి. దీనివల్ల రాబోయే కాలంలో కనీసం పదికోట్ల నూతన జననాల్ని నిరోధించగలుగుతుంది.  (నన్నేదో మిసాంత్రోప్ అనుకోకండి.  ఇప్పటికే పుట్టిన బిడ్డలకు తగు మానవీయ న్యాయం చేయగలగాలి అనేదే నా ఉద్దేశ్యం)  అంతేకాదు లాంగ్ రన్ లో జనాభ పెరుగుదలని గణనీయంగా అరికడుతుంది.  కొంత వ్యతిరేకత వచ్చినా తప్పదు.
 3. చైనా పద్ధతిలో “సింగిల్ చైల్డ్” విధానం పాటించాలి. 1979 నుండి 2016 వరకు 36 సంవత్సరాల పాటు చైనా ఈ విధానాన్ని కఠినంగా అమలు చేయటం వల్ల ఎన్నో ప్రయోజనాలు పొందింది. లేకుంటే ఆ దేశ జనాభ ఇప్పటికి 200 కోట్లు దాటిపోయుండేది. చైనా సాధించిన విజయాలకి జనాభా నియంత్రణ ఎంతగానో దోహదం చేసిందనేది నిజం.  ఈ పద్ధతి వల్ల “కన్సాంగ్వినస్ మేరేజెస్” (రక్త సంబంధీకుల వివహాలు) పూర్తిగా మాయమై బ్లడ్ క్రాసింగ్ జరిగి ఒక కొత్త ఆరోగ్యకరమైన పిల్లల తరం మొదలవుతుంది. అంతేకాక పిన్నులు, బాబాయిలు, మావయ్యలు, అత్తయ్యల, కజిన్స్ వంటి బంధుగణం లేని స్వచ్చమైన అమ్మ, నాన్న, చైల్డ్ తప్ప బంధుత్వాలు లేని మానవసంబంధాలు అంకురిస్తాయి.  వీటి వల్ల కుటుంబ, ఆస్తి వివాదాలు తగ్గుతాయి.  అంతేకాకుండా హౌసింగ్ సమస్య తీరుతుంది.  రియల్ ఎస్టేట్ వ్యాపారానికి కళ్లెం పడుతుంది.  అనుత్పాదక రంగం నుండి ఉత్పాదక రంగం వైపు పెట్టుబడులు మళ్లించవచ్చు.  (చైనా మీద పళ్లు నూరేవాళ్లు చైనా మీద కోపంతో పదేసిమంది పిల్లల్ని కనాలి అని అంటారేమో అని నా భయం)
 4. ఇప్పుడు మెజారిటీ జంటలు ఇద్దరు పిల్లల్నే ప్రిఫర్ చేస్తున్నారు. మన జనాభాలో ముప్ఫై ఐదు శాతం 15 ఏళ్ల లోపు పిల్లలున్నారు. అంటే వీరంతా డిపెండెంట్స్ గా వుండటం వల్ల అనుత్పాదకంగా మిగిలిపోతున్నారు.  వారికి మంచి భవిష్యత్తుని హామీ ఇవ్వాలంటే యువతగా ఎదిగిన వాళ్లకి తగు అవకాశాలు కల్పించాలంటే వున్న వనరుల్ని ఆర్ధిక, ప్రకృతి వనరుల్ని సరిగ్గా సద్వినియోగం చేసుకోవాలి.  అందుకు సాధ్యమైనంత త్వరగా జనాభ నియంత్రణ జరగాలి.  ఇందుకు సింగిల్ చైల్డ్ పాలసీ గురించి విస్తృతంగా ప్రచారం చేయాలి.  జనాల్ని కన్విన్స్ చేయాలి.
 5. ఇద్దరు పిల్లలున్న వారు భవిష్యత్తులో ఎన్నికల్లో పోటీ చేయకుండా నిరోధించాలి. ఇద్దరు పిల్లలున్న వారి కంటే ఒక్కరె బిడ్డ వున్న వారికి అధిక ప్రోత్సాహకాలు లభించాలి. బిడ్డ పుడితే చేసే ఖర్చు కంటే పుట్టకుండా చేసేదానికి అయ్యే ఖర్చు తక్కువవుతుంది.  ప్రస్తుతం అస్సాంలో ఇద్దరి కంటే ఎక్కువ పిల్లలుంటే అనేక సందర్భాల్లో అనర్హులుగా ప్రభుత్వం చట్టం చేసింది.

వీటన్నింటి కంటే ముఖ్యంగా ఈ క్రింది సాంస్కృతిక మార్పుల్ని ప్రజలు ఆహ్వానించేలా ప్రభుత్వాలు, ప్రజాసంఘాలు చేయాలి.

 1. స్త్రీ విద్య అధిక ప్రాధాన్యం ఇవ్వాలి. విద్యావంతులైన స్త్రీలే అధికంగా తమ శరీరాల మీద అధికారాన్ని నిలబెట్టుకోగలరు.
 2. మాతృత్వాన్ని గ్లోరిఫై చేయటాన్ని ఎండగట్టాలి. పిల్లలు లేకపోవటం ఒక ఆప్షన్ గానే వుండాలి. ఒకవేళ పుట్టకపోయినా అదేదో జీవితానికి లోటన్నట్లు, పిల్లలు లేకపోవటం ఒక సామాజిక మచ్చ అయినట్లు చూసే సంస్కృతిని బొంద పెట్టాలి.
 3. దత్తతల్ని ప్రోత్సహించాలి. భారతదేశంలో కోట్ల సంఖ్యలో అనాధ బాలలున్నారు. వాళ్లని దత్తతని స్వీకరించాలి. (నేను నా పిల్లలకి కూడా ఇదే సలహా ఇచ్చాను) తల్లితనమనేది కేవలం పేరెంటింగ్ అని, గర్భాన్ని చీలి బిడ్డని కంటేనే తల్లి ప్రేమకి సార్ధకత అనే మిత్ ని బద్దలు కొట్టాలి.
 4. సెక్స్ గురించి మాట్లాడటం మహా పాపం అన్నట్లు చేసే పద్ధతులకి స్వస్తి పలకాలి. సెక్స్ నిఒక టాబూగా భావించటం వెనుకబాటుతనం అని చెప్పగలగాలి. కాంట్రాసెప్టీవ్స్ యూజ్ ని ప్రోత్సహించాలి.  ఎక్కడైతే సెక్స్ ఒక బ్రహ్మ పదార్ధం కాదో, స్త్రీ పురుషులిరువురి చాయిస్ ప్రకారం అది వుండగలదో అక్కడ సెక్సువల్ వయొలెన్స్ అక్కరెన్స్ తక్కువగా వుంటుంది.  అప్పుడు పెళ్లి, పిల్లలు పెద్ద ఇంపార్టెంట్ అవదు.  భారతదేశంలో పెళ్లి ఒక్కటే సెక్స్ ని పొందటానికి చట్టబద్ధమైన పద్ధతి.  అధికశాతం మంది అందుకే వెంపర్లాడుతుంటారు.  ఎప్పుడో కుటుంబరావులుగా మారిపోయాక సెక్స్ ఒక అల్పమైన భౌతిక విషయం అంటూ నీతులు చెబుతుంటారు.  ఎప్పుడో 70ల్లోనే కండోంస్ ని ప్రభుత్వాలు పంచిపెట్టాయి.  ఎయిడ్స్ మీద పోరాటంలో భాగంగా కండోంస్ గురించి విస్తృత ప్రచారం కల్పించింది కూడా ప్రభుత్వమే.  ఇప్పుడు జరగటం లేదు ఆ పని.  స్త్రీల వానిటీ బాగ్స్ లో శానిటరీ నాప్కిన్స్ వున్నట్లు పురుషుల వాలెట్స్ లో కండోంస్ వుంటే తప్పు పట్టని స్థాయికి ఎదగాలి.  అది పార్ట్నర్ కి భరోస ఇస్తుంది.
 5. లైంగిక వాంఛ స్థాయికి గర్భధారణకి సంబంధం లేదు. భార్యా భర్తల సంబంధంలో రేప్ చేయబడే స్త్రీలు కూడా బిడ్డల్ని కంటారు. స్త్రీకి తన శరీరం మీద తనకే పూర్తి హక్కుందని స్పృహ కలిగేలా ప్రచారం చేయగలగాలి.
 6. మతపరమైన కారణాలతో జనాభాని పెంచుకుపోవటం కూడా జరుగుతున్నది.  ఒక మతాన్ని చూపించి మరొక మత రాజకీయులు జనాభ పెరుగుదలని ప్రోత్సహించటం జరుగుతున్నది.  సింగిల్ చైల్డ్ చట్టం వల్ల మతాతీతంగా జనాభ పెరుగుదల ఆగిపోతుంది.

చెబుతూ పోతే చాలా చెప్పొచ్చు. సెక్స్ ఎడ్యుకేషన్, ఎర్లీ మేరేజెస్ నిరోధం, ఎర్లీ మదర్ హుడ్ ని నివారించటం, కిశోర బాలికల సంరక్షణ, బాలికా విద్యని ఇంకా ఎన్నో రాయితీలు ఇచ్చి ప్రోత్సహించటం వగైరా గురించి ఎంతైనా చెప్పుకోవచ్చు.  నా ప్రధానమైన పాయింట్సల్లా జనాభ అదుపు కోసం చట్టాలు చేయాలి.  రెండు సెక్స్ గురించి అనవసరమైన మిథ్యలు, పనికిమాలిన నైతికతలు నశింపచేయాలి.  కట్టడే విశృంఖలత్వానికి దారితీస్తుందనేది వాస్తవం.

****

అధిక జనాభాని మించిన అణుబాంబు లేదు.

*

 

అరణ్య కృష్ణ

అరణ్య కృష్ణ

Add comment

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు